Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్.

ajent ekaambar

అతనలా చూడగానే చటుక్కున బైక్ ఎక్కి కూర్చుంది నూకరత్నం.
" కేష్ బ్యాగ్ మెడకు తగిలించుకుని ఒళ్ళొ పెట్టుకోండి " అంటూ తన బ్యాగ్ ముందర పెట్టుకుని బైక్ ముందుకు ఉరికించాడు ఏకాంబర్.

 ఆ నెల తిరక్కుండానే ఏకాంబర్ సర్వీస్ సెంటర్ బాగా పాపులర్ అయింది. నూకరత్నంతో పాటు మరో ముగ్గురమ్మాయిల్ని ఉద్యోగులుగా జాయిన్ చేసుకున్నాడు ఏకాంబర్.


ఏకాంబర్ ఉన్నా లేకపోయినా నూకరత్నమే పాలసీ కస్టమర్లందరికీ వారికి కావలసిన సహకారం అందించగలుగుతోంది. పాలసీలు కూడా రాయించడం, ప్రీమియం వసూలు చేయడం నేర్చుకుని మిగతా అమ్మాయిలతో స్నేహంగా ఉంటూ నడిపిస్తోంది.


ఏకాంబర్ కావాలనే రెండు రోజులకొకసారి సర్వీస్ సెంటర్ కి వెళ్తున్నాడు. తాను లేని రెండు రోజుల్లో ఎంతమంది కష్టమర్లు వసున్నది, వాళ్ళ సమస్యలు వారికి కావలసిన సహాయం అంతా ' రికార్డు ' బుక్ లో రాయించి ఉంచడం అంతా పరిశీలిస్తూనే ఉన్నాడు.


నూక రత్నంలో తనకు తాను ఏ పనైనా నిర్వహించగలననే ఆత్మవిశ్వాసం కనిపించడం గమనించాడు. ఇక ఉపేక్షించకూడదనుకున్నాడు. తను నూక రత్నానికి మాట ఇచ్చినట్టూ, తనని తన కాళ్ళ మీద నిలబడేలా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు.


నూకరత్నం మీద నమ్మకం కలగగానే మొబైల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వారియొక్క కస్టమ్ర్ల నుండి నెలవారీ బిల్లులు వసూలు చేయడానికి నూకరత్నం పేరు మీద ' ఫ్రాంచైజీ ' తీసుకున్నాడు.


ఆ కంపెనీ వారు పోస్టులో ఆర్డర్ పంపించాక అది చూస్తూనే నూకరత్నం ఆశ్చర్యపోయింది.


" అమ్మో! ఈ కంపెనీ కష్టమర్ల తాలూకా బిల్లులు నేను వసూలు చేయాలా..!? ఎలా?! కష్టం కదా ? " ఆందోళనగా అంది.


" ఎందుకు కష్టం? నువ్విక్కడ ఉంటావు. నీ దగ్గర ఓ అయిదుగురు కుఋఋఆళ్ళని జాయిన్ చేసుకుంటావు. నేనున్నా కదా ! నీకెందుకు కంగారు? " నూకరత్నానికి భరోసా ఇస్తూ అన్నాడు ఏకాంబర్.


" నువ్వంత తేలిగ్గా తీసుకుంటావ్.! నాకైతే భయంగా ఉంది..చాలా " అంది నూకరత్నం. ఈ నెలరోజుల్లోనూ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఒకరికోసం ఒకరు ఎదురు చూడ్డం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం...నవ్వుకోవడం అలవాటైపోయి ఒకర్నొకరు ఏకవచనంలో నువ్వంటే నువ్వు అనే స్థాయికి ఎదిగింది వారి మధ్య స్నేహం. ఆ మారు చూసేవాళ్ళు గమనించగలుగుతున్నారు. కానీ వాళ్ళిద్దరూ మూడో వ్యక్తిని పట్టించుకునే స్థితిలో లేరు.


ఆఫీస్ లో అటెండర్ ఆయాతోపాటు మరో ముగ్గురమ్మాయిలు పని చేస్తున్నారన్న విషయం మర్చిపోయి ఇద్దరూ ' మొబలి ఫ్రాంచైజీ ' కోసం తర్జన భర్జనలు పడుతున్నారు.


" మనం అందరం ఉన్నాం కద మేడం ! మనకి అండగా ఏకాంబర్ సార్ కూడా ఉంటారు. మీకు భయమెందుకు? " నూకరత్నం ప్రక్కనే కూర్చుని కంప్యూటర్ లో కస్టమర్ల వాయిదాల వివరాలు ప్రింట్ తీస్తున్న ఆమాయి మధ్యలో కల్పించుకుంటూ అంది. ఆ అమ్మాయి సడెన్ గా మధ్యలో దూరి మాట్లాడేసరికి ఏకాంబర్ ఒక్కసారే అదిరిపడ్డాడు. వీళ్ళందరూ ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఇద్దరూ అంత చనువుగా మాట్లాడుకోవడం తప్పనిపించింది.


" ఓకే నూకరత్నం ! రేపు న్యూస్ పేపర్లో ' యువతీ యువకులు కావలెను ' అని ఒక ప్రకటన ఇవ్వండి వచ్చే ఆదివారం మన ఆఫీసులో వాళ్ళకి ఇంటర్వ్యూలు పెడదాం. అందులో మనకి అవసరమైన వాళ్ళని ఎంపిక చేసుకోవచ్చు. "


అంటూ మరి మాట్లాడకుండా ఆఫీసులోనే నైరుతి మూలన ఉన్న తన క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చున్నాడు ఏకాంబర్.


ఇంతలో ఆఫీసు మూసే సమయానికి ఏకాంబర్ మిత్రులు రామకృష్ణ, ఆచారి, అనిల్ ముగ్గురూ కలిసి వచ్చారు. వాళ్ళని చూస్తూనే ఆనందంగా కేబిన్ లో నుంచి బయటకి వచ్చి ఆహ్వానించాడు ఏకాంబర్.


" ఏంట్రా ! త్రిమూర్తులు ఒక్కసారే ఊడిపడ్డారు? " ఆనందంగా అన్నాడు.


" నువ్వు దొరికితే కదరా! ఆదివారాలు దొరికే వాడివి. ఇప్పుడు అదీ లేదు. కొత్త ఆఫీసు..కొత్త మోజులు..ఏం చేస్తాం? తమ దర్శనానికి మేమే వచ్చాం " రామకృష్ణ అన్నాడు.


" శంకు గాడు రాలేదా? " శంకర్రావు కనిపించకపోయేసరికి ఆశ్చర్యంగా అన్నాడు ఏకాంబర్.


ఊర్లో ఉండేవాడివి నువ్వే దొరకడం లేదు. ఊర్లు పట్టుకు తిరిగే మెడికల్ రిప్రజెంటేటివ్ వాడెక్కడ దొరుకుతాడ్రా ! " ఆచారి చురక వేస్తూ అన్నాడు.


" ఊరక రారు మహాత్ములు ! విషయం చెప్పండ్రా! " ఆఫీసు అసిస్టెంట్ గా చేస్తున్న అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భార్యను పిలిచి అందరికీ టీలు తీసుకురమ్మన్నాడు ఏకాంబర్.


అప్పటికి అమ్మాయిలందరూ నూకరత్నంతో మాట్లాడుతూ కేరియర్లు పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాచ్ మెన్ భార్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చింది.


" సార్ ! వాళ్ళందరూ వెళ్ళిపోతారట. మీ నలుగురికే " టీ ' లు తెమ్మంటారా? " అని అడిగింది.


" తాళాలు నువ్వేకదా వేస్తావు. అయితే వాళ్ళని వెళ్ళిపొమ్మను " అంటూ మిత్రులతో మాటల్లోకి దిగాడు ఏకాంబర్.,


" ఏం లేదురా ! మనం అయిదుగురు రాజనాలతో కలుపుకుని ఆరుగురం ఆదివారం ఉదయం అరకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. శంకు ఈరోజు రాత్రికే కేంప్ నుండి వచ్చేస్తానని ఫోన్ చేసాడు " చెప్పాడు రామకృష్ణ.


" ఆదివారమా?! చంపార్రా! ఇప్పుడే ఆదివారం చిన్న మీటింగ్ అననౌన్స్ మెంట్ చేసాన్రా! మార్కెటింగ్ టీం కావాల్సి వచ్చి పేపర్లో యాడ్ వేస్తున్నాం. ఆదివారం అందర్నీ ఇక్కడికే రమ్మని రాసాము. ఎలారా మరి? " మిత్రుల కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు ఏకాంబర్.
ఏకాంబర్ అలా అనేసరికి ముగ్గురూ ఒకర్నొకరు మొహామొహాలు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు.


" ప్లీజ్..వచ్చే వారానికి ప్లాన్ చెయ్యండిరా! మనం ఆరుగురమే కాదు మీ ఫేమిలీస్ ని కూడ రమ్మనండి! కుటుంబాల్తో వెళ్తే సరదాగా ఉంటుంది. నేనూ మా అమ్మా నాన్నా, చెల్లాయిని కూడా రమ్మంటాను. మా ఆఫీసులో పని చేస్తున్న ఆమ్మాయిల్ని కూడా పిలుద్దాం. " మౌనంగా కూర్చున్న  మిత్రుల్ని చైతన్య పరుస్తూ అన్నాడు ఏకాంబర్.


" తినడానికి తిండి లేదుగానీ మీసాలకి సంపెంగ నూనె కావాలన్నాడట నీలాంటివాడే! మనం ఒకరికొకరు కలవడమే కష్టంగా ఉంది ఊరందర్నీ ఉసిగొల్పుతున్నాడు. అంతమందితో అయ్యే పనేనా? " చిరాగ్గా అన్నాడు ఆచారి.


" ఎందుకు కాదు? నాకొదిలెయ్యండి. వచ్చే ఆదివారం అందరం తప్పకుండా అరకు వెళ్తున్నాం.ఎలా అన్నది నేను చెప్తాను. సరేనా " బల్ల గుద్ది మరీ చెప్పినట్టు చెప్పాడు ఏకాంబర్.


" నీ ఇష్టం రా ! మేము ఎంతివ్వాలో ఇచ్చేస్తాం ! మిగతా ఏర్పాట్లన్నీ నువ్వే చూడు. రేపు ఆదివారం ప్రోగ్రాం లేనట్లే. ఆ వచ్చే ఆదివారం కన్ ఫర్మే కదా! " అంటూ కుర్చీలోనుంచి లేవబోతూ అన్నాడు అనిల్. కూర్చోమని సైగ చేసాడు ఏకాంబర్.


" ఆ వచ్చే ఆదివారం అరకు నువ్వే అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు ఈ విషయంలో ఎలాంటి ఢోకా లేదు " ఆచారి , రామకృష్ణ నొక్కి నొక్కి అన్నారు .


" కన్ ఫర్మేరా బాబూ ! మీ ఫేమిలీస్ తో బయలుదేరండి.అరకులో మా మిత్రుడు ఉన్నాడు. రూం లు, అక్కడి భోజనం వగైరా ఏర్పాట్లన్నీ ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. అందరం కల్సి ఇరవై మంది వరకూ ఉంటాం కదా ! మినీ వ్యాన్ ఒకటి మాట్లాడతాను. పాతీక మంది వరకూ కూర్చునేది. దారిలో బొర్రా గుహలు కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. " చెప్పాడు ఏకాంబర్.


" బావుందిరా ! మంచి ఐడియా ! టృఆఈన్ అయితే అక్కడా ఇబ్బంది పడాలి. ఇక్కడనుండి మనం వ్యాన్ లో వెళితే ఆకడ అన్ని ప్రాంతాలూ తిరిగి చూడడం తేలికౌతుంది. ఓకే అదే కంఫర్మ్ చెయ్యి. " గట్టిగా ఏకాంబర్ ఆలోచనని బలపరుస్తూ ముగ్గురు మిత్రులొ ఒకేసారి అన్నారు.
ఇంతలో కప్పులతో టీ తీసుకువచ్చి వాళ్ళ ముందు ఉంచింది ఆఫీసు అసిస్టెంటు అయిన వాచ్ మెన్ భార్య.


" రేపు ఆదివారం మాకు ఖాళీ కదా ! మేమందరం ఇక్కడికే వచ్చేస్తాం. నీ మీటింగ్ అయ్యాక టైం ఉంటే మూవీకి పోదాం. " టీ సిప్ చేస్తూ అన్నాడు రామకృష్ణ.


" సరే అలాగే చేద్దాం. మీరు ఉదయం పదో గంటకి ఇక్కడికి వచ్చేయండ్రా! కనీసం పాతిక ముప్పై మందన్నా నిరుద్యోగులు వస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళల్లో చురుకైన వాళ్ళని ఎంపిక చెయ్యాలి. మీరూ ఉంటే నాకు పని కొంత సులువుగా ఉంటుంది. " అన్నాడు ఏకాంబర్ " టీ " రెండు గుక్కల్లో త్రాగేసి కప్పు కింద పెడుతూ.


" సార్ ! టీ చల్లగా ఉందంటారా? " కేబిన్ బయట కప్పులు తీయడానికి సిద్ధంగా ఓ మూలన నక్కి నిలబడ్డ వాచ్ మెన్ భార్య గభాలున కేబిన్ తలుపు తోసుకుని లోపలికి వచ్చి అంటూ ఓ ప్రక్కన నిలబడింది.


" వాడంతేనమ్మా! సలసలా మరుగుతున్న ' టీ ' కూడా ఒక్క గుక్కలో త్రాగెయ్యగలడు. ' టీ ' బానే ఉంది " అన్నాడు ఆచారి. ఆమె  వినయంగా వంగి కేబిన్ వెలుపలకు వెళ్ళి నిలబడింది.


" రేపు ఆదివారం మీరిక్కడకు వస్తున్నారు. వచ్చే ఆదివారం అందరం విత్ ఫామిలీస్ అరకు వెళ్తున్నాం. దట్సాల్." స్థిరంగా అన్నాడు ఏకాంబర్.


" నువ్వు నొశాచరుడివి. ' పాలసీ ' దొరుకుతుందంటే పగలు రాత్రి తేడా తెలీదు కదరా నీకు? ఇప్పుడు కూడా నువ్వు ఎవరైనా కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నావేమోనని మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. " అన్నాడు ఆచారి.


" పోండ్రా ! మీ కుళ్ళు జోకులూ మీరూనూ! అమ్మా మేము వెళ్తున్నాం! తలుపులు జాగ్రత్తగా వెయ్యి " అంటూ కేబిన్ బయట నిలబడ్డ వాచ్ మెన్ భార్యతో చెప్పి మిత్రులతో మాట్లాడుతూ బయటకు వచ్చాడు ఏకాంబర్.


అపార్ట్ మెంట్ లిఫ్ట్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చిన మిత్రులకు ఒక వ్యక్తి చిన్న బ్రీఫ్ కేస్ చేత్తో  పట్టుకుని గాభరాగా వస్తూ ఎదురయ్యాడు.
టిప్ టాప్ గా తయారయి టక్ చేసుకుని ఉన్నాడు. అతను యువకుడు కాదు. మధ్య వయస్కుడు. బహుశా అపార్ట్ మెంట్లో ఎవరింటికో వచ్చుంటాడులే అనుకుంటూ ఏకాంబర్ ముందుకు నడిచాడు.  వాచ్ మెన్ ఆ వ్యక్తిని అడ్డగనిచి ప్రశ్నిస్తున్నాడు.


' పైన కస్టమర్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళాలని ' అతను వాచ్ మెన్ తో చెప్తూంటే విన్న ఏకాంబర్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అతను వాచ్ మెన్ తో ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.


" ఎవరు కావాలి సార్ ? " వెనక్కి వచ్చి వినయంగా అడిగాడు ఏకాంబర్. మిత్రులు ముగ్గురూ గేటు దగ్గర కబుర్లాడుకుంటూ నిలబడ్డారు.
' కస్టమర్ సెంటర్ ' వాళ్ళని కలవాలి " హుందాగా అన్నాడతడు. 

" చెప్పండి సార్ ! నేనే ! " అన్నాడు ఏకాంబర్. వాచ్ మెన్ తన మానాన తన పనిలో నిమగ్నమైపోయాడు.
ఇంతలో పైనుండి ఆఫీసు తాళాలు వేసుకుని లిఫ్ట్ దిగింది వాచ్ మెన్ భార్య. ఆమె నేరుగా అపార్ట్ మెంట్ లో ఓ మూలన ఉన్న తమ గది దగ్గరికు వెళ్ళిపోయింది.


" మీరు...? " సంశయంగా అన్నాడతను.


" ఏజెంట్ ఏకాంబర్ నేనే సార్ ! మీకేం కావాలి ? " అడిగాడు ఏకాంబర్.


" బిగ్ పాలసీ ఒకటి చెయ్యలనుకుంటున్నాను. " ఏకాంబర్ కేసి ఎగాదిగా చూస్తూ అన్నాడు అతడు.


" చెప్పండి సార్ ! ఎంత పాలసీ తీసుకుందామంకుంటున్నారు? "


మీరు ఎంత పాలసీ వరకు ఇవ్వగలరు ? " అతను తిరిగి ప్రశ్నించాడు.


" మీరు ఎంత ప్రీమియం కట్టగలరో చెప్తే....?! " సంశయంగా అన్నాడు ఏకాంబర్.


 " నేనా..." పకపకా నవ్వుతూ నిలబడిపోయాడు అతను.


" నిజమే సార్ ! మీరు ఎంత ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో చెప్తే దానిబట్టి ఫేస్ వాల్యూ లెక్క కట్ట వచ్చు. లేదా ఎంత మొత్తానికి పాలసీ కావాలో దాన్నిబట్టి ఎంత మొత్తానికి పాలసీ కావాలో  దాన్నిబట్టి మీరు ప్రీమియం ఎంత కట్టాలో " రెడీ రెక్ నార్ " చూసి చెప్తాను.." విడమర్చి చెప్తూ అన్నాడు ఏకాంబర్.


" కోటి....కోటి రూపాయలు పాలసీ కట్టగలను! మీరు దానికి తగ్గ పాలసీ ప్రీమియం ఎంతో రాసివ్వగలరా?? " ఏకాంబర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు అతడు.


అంతవరకు గేటు దగ్గర నిలబడి ఏకాంబర్ కోసం ఎదురు చూస్తున్న మిత్రులు ముగ్గురూ ఎంతకీ ఏకాంబర్ సంభాషణ ముగించి రాకపోయేసరికీ వాళ్ళూ అక్కడకు చేరుకున్నారు.


అదే సమయం లో అతను ' కోటి ' రూపాయల పాలసీ కడతాననేసరికి ఏకాంబర్ కళ్ళు బైర్లు కమ్మాయి. మిత్రులు ముగ్గురూ కళ్ళు తిరిగి పడిపోబోయి ఒకర్నొకరు గట్టిగా పట్టుకుని అతనికేసి ఆశ్చర్యంగా చూస్తూండిపోయారు.


' కొంపదీసి ఇతను ఏ టాటా బిర్లా వారసుడో కాదు కదా ' మనసులోనే అనుకుని అతనికేసి వింతగా చూసారు.


" ఇంత పెద్ద పాలసీలయితే మా ఆఫీసర్లతో మాట్లాడి మీకు చెప్తాం. " తేరుకుంటూ అన్నాడు ఏకాంబర్.


" అందుకే మీ దగ్గర ...మీరు చేయించగల పాలసీ అడుగుతున్నాను..ఓ యాభై లక్షలకు పాలసీ రాసుకోండి.." వచ్చే నెలలో మరో యాభై లక్షల పాలసీ మా ఆవిడ పేర రాద్దురు గాని అవుతుందా?! " అతను సూటిగా ఏకాంబర్ కేసి చూస్తూ అడిగాడు. ఏకాంబర్ నోట మాట రావడం లేదు. తను అయిదేళ్ళలో ఎంతోమంది కస్టమర్లని కలిసాడు. ఎన్నో పాలసీలు చేయించాడు. తను చేయించిన అత్యధిక ప్రీమియం చెల్లిస్తున్న పాలసీ ఒకటే. అదీ జగదాంబ థియేటర్ ఓనర్ గారితో కట్టించాడు. ' పాతిక లక్షల ' రూపాయలకి పాలసీ రాసాడతను. అంతే..!


ఏకాంబర్ కి మతి పోతోంది.కళ్ళు బర్లు కమ్మేస్తున్నాయి. బుర్ర మొద్దుబారిపోతోంది. ఒక్కసారి నిటారుగా నిలబడి గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని చుట్టూరా చూసాడు. అంతా మసగ్గా కనిపిస్తోంది....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugaadu