Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugaadu

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

ఎక్కడికి?'' అడిగాడు.

''ఫస్ట్‌ కాకినాడ, అట్నుంచి రాజమండ్రి. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం మార్కెట్‌ అబ్జర్వేషన్‌ కోసం.''

''అది నా డ్యూటీ కాదు, నేను రాను.''

''వస్తున్నావ్‌ దట్సాల్‌.''

''కమాండా.... ? నువ్వు నన్ను బాస్‌లా కమాండ్‌ చేయటం ఏమిటి?''

''సారీ! ఇది కమాండ్‌కాదు, రిక్వెస్ట్ట్‌ మాత్రమే.''

తను ఎవరో అతడికి తెలీదనే విషయం వరేణ్యకు రూఢీ అయిపోయింది. తెలిసేలోపల కొంత సమాచారం రాబట్టాలని ఆమె ఆశిస్తోంది.

అతడితోపాటు కారెక్కడానికి కారణం అదే.

కాసేపు మౌనం తర్వాత అడిగిందామె.

''వినోద్‌! నా గురించి తెలుసుకోవాలని లేదా?'' అని.

''లేదు. నువ్వు సాధారణ కుటుంబానికి చెందిన యువతివికాదు. ఏదో హాబీగా ఈ కంపెనీలో జాబ్‌చేస్తున్నావ్‌. ఇంతకుమించి ఏం తెలియాలి'' అన్నాడు.

''వూహించి చెప్పింది వేరు, తెలుసుకొని చెప్పింది వేరు. నీది వూహ మాత్రమే''

''అయితే నిజం ఏమిటో చెప్పు. తాగుబోతు తండ్రి, రోగిష్టి తల్లి, చదువుకుంటున్న తమ్ముడు, వీళ్ళందరి కోసం, కుటుంబం కోసం కష్టపడి జాబ్‌ చేస్తున్నానంటావు. సినిమా కష్టాలు.... ఇంతకు మించి ఏముంటుంది?''

అంతవరకూ వింటున్న డ్రయివరు ఇక ఆపుకోలేక కొంచెం వినబడేలాగే నవ్వేశాడు.

చురుగ్గా చూసింది వరేణ్య.

''ఏయ్‌ తాతారావ్‌! ఏమిట్రా ఆ నవ్వు? డ్రయివింగ్‌ మానేసి మా మాటలు వింటూ కూర్చుంటే చంపేస్తాను. నీ పనిచూడు. వెకిలి నవ్వు నువ్వూనూ'' అంటూ కసురుకుంది.

''క్షమించండమ్మా'' అన్నాడు నవ్వాపుకొంటూ.

నిజానికి ఆ సమయంలో గనుక త్రివిక్రమ్‌ వాడి నవ్వుకు అర్ధాలు వెతుక్కుని వుంటే కొంత వూహించగలిగేవాడు. కానీ పైకి మాట్లాడుతున్నాడు గాని మనసులో ఇక్కడ్నుంచి తప్పించుకెళ్ళిపోడం ఎలాగా అనే ఆలోచనల్లో వున్నాడు. అందుకే డ్రయివర్‌ నవ్వుకి అర్ధం గ్రహించలేక పోయాడు. ఆ అమ్మాయి బాస్‌ తర్వాత బాస్‌ అని, విశాఖ బ్రాంచిలో అందరికీ తెలుసు ఒక్క త్రివిక్రమ్‌కి తప్ప. పొరబాటో, గ్రహపాటోగాని ఆమెను త్రివిక్రమ్‌కి పరిచయం చేసినప్పుడు కూడా మేనేజరు మధుసూదనరావు ఆమెను బాస్‌ కూతురుగా గాక మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌గానే పరిచయం చేసాడు.

ఇకపోతే తన వెనుక

అంటే ఒరిజనల్‌ వినోద్‌ విశాఖ బ్రాంచ్‌కి రావటం వెనక ఉద్దేశాలు ఏమిటనేవి కూడా త్రివిక్రమ్‌కి అస్సలు తెలీదు. అంచేత ఆమెను అక్కడో ఉద్యోగినిగా తప్ప మరో విధంగా ఆలోచించలేకపోయాడతను.

''ఓ.కె.... వినోద్‌! నా గురించి వద్దులే. నీ గురించి చెప్పు'' అడిగిందామె.

''నా గురించి ఏం చెప్పను?'' అడిగాడు.

''మీ ఫ్యామిలీ గురించి."

''మా ఫ్యామిలీ.... యస్‌.... అది ఒక అందమైన తులసివనం. అక్కడ నేనొక కలుపుమొక్కని''

''వాట్‌?''

''నువ్వు మాటి మాటికి అలా కళ్ళు పెద్దవిచేసి ఆశ్చర్యంగా చూడకు. నేను అబద్దం చెప్పటంలేదు. వాళ్ళందరి అభిప్రాయాలతో నా అభిప్రాయాలు కలవనప్పుడు అక్కడ నేనో కలుపుమొక్కనేగదా....!''

''సో..... అభిప్రాయబేధం అన్నమాట, తర్వాత?''

''మమ్మీ, డాడీ, బ్రదరు, సిస్టరు, లవ్‌లీ హోమ్‌.... కాదంటే నా మనసులో ఒకటేబాద, చెల్లాయి పెళ్ళి చూడలేకపోయాను.''

''ఎందుకంటే... దేనికయినా రాసిపెట్టి వుండాలి మేడం. నాకా అధృష్టంలేదు. ఆ టైంలో నేను మధురలో వున్నాను.''

''మళ్ళీ మధుర... ఇంతగా చెప్తున్నావంటే ఆ మధురలో ఏదో గొప్ప విశేషం వుండే వుంటుంది. నన్ను తీసుకెళ్ళవా?''

''సారీ.... అక్కడికి నేను మాత్రమే వెళతాను. ఎవర్నీ తీసుక్ళెను'' అవునూ! మీ ఇల్లు ఇంకా ఎంతదూరం?''

''వచ్చేసాం. డ్రయివర్‌ కారుని డ్రీమ్‌లాండ్‌ హోటల్‌ ముందు ఆపు. నాకు ఆకలిగా వుంది వినోద్‌, ఏమన్నా తిందాం.''

''నన్ను వదిలితే వెళ్ళిపోతాగా.''

''తిన్న తర్వాత వెళ్ళిపో....''

ఇక ఆమె వదలదని అర్ధమైపోయింది.

ఆమెతో వాదానికి దిగే ఓపిక తనకులేదు.

కారు పార్కింగ్‌లో ఆగింది.

ఇద్దరూ ఫ్యామిలీ రూంలో కూర్చున్నారు.

తనే ఆర్డర్‌ చేసింది వరేణ్య

''ఏమిటా మౌనం! ఎదన్నా మాట్లాడొచ్చుగా'' అడిగింది.

''ఏం మాట్లాడను? ఆ! రేపు మేచ్‌లో సచిన్‌ సెంచరీ చేస్తాడని నా నమ్మకం. సచిన్‌ కొట్టే షాట్స్‌ని స్టేడియంలో ప్రత్యక్షంగా చూడా.... లి.... ఏమిటి ముఖం అలా మాడ్చుకున్నావు?''

''మాట్లాడానికి క్రికెట్‌ తప్ప ఇంకేం లేదా?''

''ఏముంటుంది.''

''నువ్వు ఎవరినన్నా ప్రేమించావా?''

ఈసారి షాకవటం త్రివిక్రమ్‌ వంతు అయింది.

అంత సూటిగా ఆమె అడుగుతుందని అతడనుకోలేదు.

''అర్దం కాలేదా? ఏ అమ్మాయినయినా నువ్వు ప్రేమించావా....? అంటున్నాను'' అచ్చం తెలుగులో స్పష్టంగా అడిగింది.

''ఫ్యామిలీ విషయం అయిపోయింది. ఇప్పుడు పర్సనల్‌ విషయం. నాకు తెలీక అడుగుతాను............ నా గురించి ఈ ఎంక్వయిరీ అంతా దేనికో తెలుసుకోవచ్చా?''

''నా ప్రశ్నకు ఇది సమాధానం కాదు.''

''ఒ.కె. నీ మనసులో ఏముందోగానీ నా వరకు ఎవర్నీ ప్రేమించలేదు. ప్రేమించే తీరికాలేదు. సరేనా? మగాడికి ప్రేమకన్నా ముఖ్యమైన పనులు చాలా వున్నాయి. వాటి తర్వాతే ఏదైనా.''

''ఏమిటా పనులు''

''నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? ప్రశ్నలు ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావనిపిస్తోంది. నన్ను విసిగించే కార్యక్రమం పెట్టుకోకు బి ఎ గుడ్‌ ఫ్రెండ్‌?''

''అంతకుమించి మరోలా వుండకూడదా?''

''నువ్వున్నా.... నేనిక్కడ వుండనుగదా'' అంటూ నవ్వేసాడు.

ఆర్డర్‌ చేసిన అయిటమ్స్‌ టేబుల్‌మీదికి రావటంతో సంభాషణ అక్కడితో ఆగిపోయింది. ఆమె తనకి చేరువకావాలని చూస్తోందని త్రివిక్రమ్‌కి కొంచెం కొంచెంగా అర్ధమవుతోంది. అది తనకు ఇష్టంలేదు. ఏదో టైం బాగోక వచ్చి ఇక్కడ చిక్కుబడిపోయాడుగాని లేకపోతే మేచ్‌ కిటికెట్‌ కొనుక్కుని బార్‌లో మందుకొట్టి సిటీలో సినిమాలు, షికార్లతో హేపీగా తిరగాల్సినవాడు. అంతా ఖర్మ.

ఈ అమ్మాయి తనే ఒరిజనల్‌ వినోద్‌ అనుకుని తనకి అతుక్కుపోయే ఉద్దేశంలోవుంది. ఫారెన్‌లో చదివి పెద్ద ఉద్యోగంలో వుండి చేతినిండా డబ్బున్న మగాడంటే చాలు అమ్మాయిలు వదలరు. ఇంటర్‌ తప్పిన తనెక్కడ బిటెట్‌ చదివి ఎం.బి.ఎ., చేసిన ఈవిడ ఎక్కడ? తను ఎంత తొందరగా ఇక్కడినుంచి పారిపోతే అంత మంచిది.

''ఏమిటి ఆలోచన?'' వరేణ్య పలకరింపుతో ఆలోచనలనుంచి బయటపడ్డాడు త్రివిక్రమ్‌ ఏదో ఒకటి చెప్పాలి గాబట్టి

''ఆఫీసు గురించే'' అన్నాడు.

''నా గురించి అనుకున్నాలే'' అంది కొంటెగా.

''నీ గురించి అస్సలు ఆలోచించను, ఆ మాటకొస్తే అమ్మాయిల గురించే ఆలోచించను. ఎందుకంటే నాకు భయం... నువ్వలా చూసినా.... నాకు ఎదురువచ్చినా కూడా నా గుండె దడదడా కొట్టుకుంటుంది. ఒకటే భయం.''

''సో.... పిరికివాడివన్నమాట.''

''నువ్వు ఎలా అనుకున్నా బాధలేదు.''

''ఈ హోటల్‌ బాగాలేదా?''

''బాగుంది''

''టిఫిన్‌ బాగాలేదా?''

''బాగుంది.''

''మరి నేను .... నేను అందంగా లేనా?''

''నీకేం....సూపర్‌............ నీలో అందం, తెలివితేటలు ఎప్పుడూ పోటీ పడుతూంటాయి.''

''మరి నా గురించి ఎందుకు ఆలోచించవు?''

''ఎందుకు ఆలోచించాలి.''

తింటున్న టిఫిను గొంతుకి అడ్డం పడినట్లయింది.  ఆమెకు ఎందుకు అంటే ఎలా చెప్పాలి? ఈ జడపదార్ధానికి ఎలా చేప్తే అర్ధమవుతుంది. నిజంగా అర్ధంకాని వాళ్ళకు చెప్పొచ్చు. అర్ధంకానట్లు నటించేవాళ్ళకు ఏం చెప్పి ప్రయోజనంలేదు. నిజంగానే ఆమెకు కోపం వచ్చింది.  సగంలో టిఫిన్‌ తినటం ఆపేసి చెయ్యి కడుక్కుంది. ఆమె అలిగిన సంగతి త్రివిక్రమ్‌ గ్రహించాడు. తనూ లేచిపోయాడు. బిల్లు తనే పేచేసాడు.

ఇద్దరూ బయటకొచ్చారు. కాని ఆమె కారెక్కలేదు.

డ్రయివర్‌ని పిలిచింది.

''తాతారావ్‌! సార్‌ని గెస్ట్‌హౌస్‌లో దించు, నేను ఆటోలో వెళ్ళి పోతున్నాను'' అంటూ త్రివిక్రమ్‌వంక తలతిప్పి కూడా చూడకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోయిందామె.

చిన్నగా నవ్వుకుంటూ కారెక్కాడు విక్రమ్‌.

ఇప్పుడు తనకు హేపీ! ఆమెకు కోపం వచ్చింది. ఇక తనవైపు కన్నెత్తిచూడదు. తనకు కావలసింది అదే. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని ఓపక్క తను భయపడి చస్తున్నాడు. మధ్యలో ఈ అమ్మాయి ఎంక్వయిరీలు వేరే ఈ రాత్రికి తప్పించుకు వెళ్ళిపోయే అవకాశం వుందేమో చూడాలి. లేదంటే ఈ లోపల అసలు వినోద్‌ వచ్చినా వచ్చేస్తాడు. వాడు వచ్చాడంటే తను బుక్కయిపోతాడు.

వద్దనుకుంటున్నా కళ్ళముందు ప్రత్యక్షమవుతున్న వరేణ్య సుందర రూపాన్ని బలవంతంగా పక్కకునెట్టే ప్రయత్నంచేస్తూ సీట్‌కి జేరబడి కళ్ళు మూసుకున్నాడు త్రివిక్రమ్‌.

కారు గెస్ట్‌హౌస్‌ దిశగా పరుగుతీస్తోంది.

****    ****    ****


కొద్దిగా విస్కీ పుచ్చుకొని భోంచేసి తమ బెడ్‌రూంలోకి వచ్చేసాడు సుధాకర్‌నాయుడు. అప్పటికే రాత్రి పదిగంటలు కావస్తోంది టైం. సొగసైన ఖరీదైన డబుల్‌ బెడ్‌షీట్‌మీద యిలా నడుంవాల్చాడో లేదో అలా నిద్రమత్తులోకి జారుకున్నాడాయన.

అంతలోనే భార్య వచ్చి తట్టిలేపటంతో మెలుకూవచ్చేసింది. కొంచెం విసుగ్గా చూసాడు ఆమెవంక.

''భాగ్యం............. నువ్వు నా భాగ్యరేఖవని నాకు తెలుసు, కాని యిలా బంగారంలాంటి నిద్ర పాడుచేస్తే అది సౌభాగ్యం అన్పించుకోదు తెలుసా?'' అన్నాడు.

''నాకు తెలీదులే, నాకు తెలిసిందల్లా మీరు ఈ పూట వైజాగ్‌ ఫోన్‌చేసి అమ్మాయి వరేణ్యతో మాట్లాడతానన్నారు. ఆ పని చూడకుండా నిద్రపోతే ఏమంటారో తెలుసా?'' అంటూ దబాయించిందావిడ.

అప్పుడుగాని ఆయనకు గుర్తురాలేదు అసలు విషయం.

వినోద్‌ని ఫ్లైట్‌కి వెళ్ళమని సలహా యిచ్చి పంపించాడు. ఆ కుర్రాడు ఈసారయినా జాగ్రత్తగా వైజాగ్‌ చేరుకున్నాడో, ఇంకా ఇక్కడే వున్నాడో తెలీదు. అమ్మాయితో మాట్లాడితేగాని అక్కడి విషయాలు తెలీదు. కాని ఇవన్నీ మర్చిపోయి తను నిద్రపోయాడు.

''ఏమిటి? ఫోన్‌ చేస్తున్నారా లేదా?'' ఆవిడ రెండోసారి ప్రశ్నించగానే ఆయనకి నిద్రమత్తు వదిలిపోయి లేచి కూర్చున్నాడు.

''సమయానికి గుర్తుచేసావ్‌ భాగ్యం. ఇందుకే అన్నారు మరి, కరణేషుమంత్రి అని. ఆ ఫోన్‌ ఇలా పట్రా''.

ఆవిడ ముసిముసిగా నవ్వింది.

''సర్లెండి, పెళ్ళాం పోస్ట్‌ ఒక్కటీ పర్మనెంట్‌గా వుంచితే చాలు, మంత్రులూ, సామంతుల పోస్ట్‌లు నాకేమి అక్కర్లేదు'' అంటూ టేబుల్‌ మీది సెల్‌ఫోన్‌ తీసి అందించింది.

''అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీకు ట్రాన్స్‌ఫర్‌ వస్తుందని భయమా?'' ఆశ్చర్యాన్ని అభినయిస్తూ ప్రశ్నించాడు.

''ఏమో! ట్రాన్స్‌ఫరో వాలంటరీ రిటైర్‌మెంటో........ రాకూడదని నమ్మకం ఏమిటి? మగవాళ్ళని నమ్మకూడదంటారుగా.''

''అన్న వాళ్ళ ముప్పైపళ్లు రాలగొట్టి అరచేతిలో పెట్టాలి ఈ వయసులో కూడా అనుమానిస్తున్నావా నన్ను?''

''ఏ వయసులోనూ నమ్మకూడదు మగాళ్ళని అని మా పిన్ని అంటుండేది వయసులో మీ లీలలు నాకు తెలీనివా?''

''అబ్బ! నువ్వు మంచిటైం చూసి వెటకారంచేస్తున్నావోయ్‌. చూడండి మిస్టర్‌ పెళ్లాంగారూ! అవన్నీ గతకాలం వయసు వైభవాలు, ఇప్పుడంతా వైఫ్‌ ఈజ్‌ ది లైఫ్‌, అయినా ఇందుకేగా ఏ అలవాట్లు లేని జెమ్‌లాంటి కుర్రాడ్ని నా కూతురుకి సెలక్ట్‌ చేసాను.''

''ఏదీ....... ఆ కుర్రాడు వినోద్‌...... జెమ్‌..... సర్లేండి, ముందు వైజాగ్‌ చేరుకున్నాడో లేదో చూడండి. ఆ కుర్రాడు పుస్తకాలు చదివిచదివి జీవితానికి పనికిరానట్టున్నాడు, వట్టికంగారు''.

''అదేమరి, మనిషన్న తర్వాత హండ్రడ్‌ పర్సంట్‌ పర్‌ఫెక్ట్‌గా ఎవరూ వుండరు. ఆ కుర్రాడికేం, సిగరెట్టు, మందు ఇతరత్రా ఏ ఒక్క బేడ్‌హేబిట్‌ లేదు. విదేశాలు తిరిగొచ్చాక కుర్రాళ్ళలో ఇంత చక్కని కుర్రాడు మనకి దొరకటం అరుదు. మన వరేణ్యకి ఇతడు ఖచ్చితంగా నచ్చుతాడు'' అంటూ ఫోన్‌ చేయబోయాడు, వెంటనే

''ఆగండాగండి'' అంటూ ఫోన్‌ లాక్కుని పక్కన పెట్టిందావిడ. పైగా

''ఏమిటి మీకు అంత నమ్మకం? నేను చెప్తున్నాను ఈ కుర్రాడు అమ్మాయికి నచ్చడు'' అంది ఖచ్చితంగా.

''బాగుంది. కుర్రాడు నచ్చాల్సింది అమ్మాయికా, అత్తగారికా?''

''చెత్త జోకులేయకండి, నచ్చాల్సింది అమ్మాయికే, దాని గురించి నాకు బాగా  తెలుసు గాబట్టే నచ్చడు అంటున్నాను. కావాలంటే బెట్‌''

''బెట్‌..............'' అంటూ అదేదో గొప్ప జోక్‌లా పక్కున నవ్వేసాడాయన.

ముఖం చిన్నబుచ్చుకుని కోపంగా చూసిందామె

''ఎందుకా నవ్వు?'' అనడిగింది.

''ఎందుకా......... కూతురు పుట్టిన తర్వాత కొడుకును ఇస్తానని బెట్‌ కట్టావ్‌ నాకు కొడుకును కనివ్వలేదు. బెట్‌కట్టిన అయిదు వేలూ యివ్వలేదు. నవ్వక ఏం చేయమంటావ్‌?''. అంటూ గుర్తుచేసాడు.

''అదేమరి నాకు కోపం వస్తుంది. కొడుకునిస్తానన్నాను. కనీసం కొడుక్కు బదులు కూతురునయినా కనుంటే నేను ఓడిపోయినట్టు లెక్క. ఒక్క కూతురుతోనే సరిపెట్టేసింది మీరు. నా తప్పేం లేదు. అందుకే ఆ బెట్‌ విషయంలో నేనుఓడిపోలేదు. అంటూ తనను సమర్దించుకుందావిడ.

''ఓ.కె. ఇప్పుడు నిజంగా ఓడిపోతావ్‌! బెట్‌ ఎంతో చెప్పు. వినోద్‌ని వరేణ్య ఇష్టపడుతుందని నేనంటాను.''

''ఆ కుర్రాడు మన అమ్మాయికి నచ్చడు, అయిదు వేలు బెట్‌.''

''ఓ.కె. నేను ఓడిపోతే నీకు అయిదు వేలు కేష్‌డన్‌.... ఇచ్చేస్తాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకు క్యాష్‌ అక్కర్లేదు''.

''ఏం కావాలి?''

''ఈ రాత్రికి మన ఫస్ట్‌నైట్‌ గుర్తురావాలి.''

''ఛీ........... పొండి. వయసయ్యేకొద్ది మీరు కుర్రాడయిపోతున్నారు'' అంటూ ఆయన గుండెల్లో ముఖం దాచుకుంది.

సుధాకర్‌ నాయుడు కూతురు వరేణ్యకి ఫోన్‌ చేసాడు.

వెంటనే లైన్‌లోకొచ్చిందామె.

అక్కడ వైజాగ్‌లో తండ్రి నుంచి ఫోన్‌ వచ్చేసరికి అప్పటికింకా నిద్రపోలేదు వరణ్య. తన బెడ్‌రూంలో డబుల్‌కాట్‌మీద నిద్రకు దూరమై ఆలోచిస్తోంది.

ఆమె ఆలోచలన్నీ త్రివిక్రమ్‌ చుట్టూ తిరుగుతున్నాయి.

ఒక్కరోజు.........!

ఒకేఒక్కరోజు............. ఇంకా చెప్పాలంటే కేవలం ఏడుగంటల పరిచయంలోనే ఇతను తనని చాలా డిస్టర్బ్‌ చేసాడు. ఎవరీ వినోద్‌?

నిజానికి అతిన్ని చూసిన మొదటి క్షణంలోనే డాడీ తనకు ఫోన్‌లో చెప్పిన విషయాలన్నీ మర్చిపోయింది. అదేమిటో....... ఇంతవరకూ ఏ యువకుడ్ని చూసినా స్పందించని తన మనసు వినోద్‌ని చూడగానే ఇంతగా స్పందించటం చాలా ఆశ్చర్యం. అతని మాటలు, చేతలు, రూపం, అన్ని, హండ్రడ్‌పర్సంట్‌ అతను తనకు నచ్చాడు. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ అంటారు. అది ఇదే కావచ్చు. లేకపోతే నిద్రకూడా మర్చిపోయి తనింతగా అతడి గురించి ఆలోచించటం ఏమిటి?

యస్‌........ తను అతని ప్రేమలోపడిపోయింది. కానీ అతను మాత్రం తనకేమీ పట్టనట్లు దూరంగానే వుండిపోతున్నాడు. అదే అర్ధం గావటంలేదు.

డాడీ ఉద్దేశం వినోద్‌కి తెలిసివుండదా?

లేక తనంటే ఇష్టంలేక అలా ప్రవర్తిస్తున్నాడా?

సాయంత్రం హోటల్‌ దగ్గర నిజంగానే తనకు కోపం వచ్చింది. నీలో అందం. తెలివితేటలు పోటీపడుతున్నాయి. అంటూ ఓ పక్క పొగుడుతూనే మరోపక్క నాగురించి ఎందుకు ఆలోచించవు? అంటే ఎందుకు ఆలోచించాలి? అంటూ ఎదురుప్రశ్నిస్తున్నాడు. అతన్నెలా అర్ధంచేసుకోవాలి? వయసులోని అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు నచ్చి నప్పుడు ఆలోచించకుండా ఎలా వుంటారు. ఆలోచనలు అల్లుకున్నప్పుడే గదా ఒకరికోసం ఒకరు తపించేది. ఐ లవ్‌ యు అని, కొసరి కొసరి చెప్పుకుని మురిసిపోయేది. మరి ఈ మొద్దావతారమేమిటి తన మనసు తెలుసుకునే ప్రయత్నం చేయడు?

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్