Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
saahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

రోగం అంటూ రాకుండా ఉండాలే కానీ... - భమిడిపాటి ఫణిబాబు

deseases never attack

నిషన్నాక రోగాలూ రొచ్చులూ రాకుండా ఉంటాయా ఏమిటీ? కానీ ఈ రోజుల్లో రోగం అంటూ రాకుండా ఉండాలే కానీ, వచ్చిందా అంటే ఆ పాట్లు పగవాడికి కూడా రాకూడదు బాబూ అనిపిస్తుంది. వచ్చిన రోగం కంటే, బతికి బట్టకడితే వైద్యానికి పెట్టిన ఖర్చు చూసుకుని గుండె గుభేల్ మనడం తథ్యం. రోగాలూ, వైద్యాలూ ఎప్పుడూ ఉండేవే. కానీ వైద్యం చేసే వైద్యుల మనస్థత్వాలలోనే అసలు మార్పులు వచ్చేశాయి. అలాగని అందరు డాక్టర్లూ commercial  గా ఉంటారని కాదనుకోండి, కానీ ఎక్కువమంది వ్యాపారాత్మకంగానే తయారయ్యారు.ఇదివరకటి రోజులా ఏమిటీ, వైద్యుడు గా అవాలంటే లక్షలూ, కోట్లూ ఖర్చుపెట్టాలి.పెట్టిన ఖర్చు రాబట్టాలి, దేశంలో రోగులూ, రోగాలూ ఉన్నంతకాలం,డబ్బులకేముందిలెండి, అదే వస్తుంది.

ఇదివరకటి రోజుల్లో కుటుంబానికి ఒక వైద్యుడుండేవారు. ఏమొచ్చినా ఆయనే దిక్కు. వెళ్ళిన ప్రతీసారీ ఫీజులు వసూలు చేసేవారు కాదు, ఏడాదికోసారి సత్యనారాయణ వ్రతం చేసికున్నప్పుడు,  వచ్చే “ చదివింపులు”తో ఏడాది పొడుగునా చేసిన వైద్యానికీ సరిపోయేది. అలా కానుకలరూపాన ఇవ్వడానికి ఇచ్చేవారూ బాధపడేవారు కాదు, తీసికోడానికి ఆ డాక్టరు గారికీ మొహమ్మాటంగా ఉండేది కాదు. రెండింటికీ చెల్లన్నమాట.

అయినా ఏ మాటకా మాటే చెప్పుకోవాలి- రోగాలు కూడా మరీ అంత “ఖరీదు” గా ఉండేవి కావు. కాలక్రమేణా medical science అభివృధ్ధి చెంది, ఈ రోజుల్లో నెత్తిమీదుండే వెంట్రుక నుండి, కాలి గోరు దాకా, శరీరంలోని సర్వాంగాలకీ తలో వైద్యుడూ, ఆయనతోపాటు ఓ వైద్యమూ కదా ! ప్రతీ దానికీ ఓ speciality. ఇంకో విషయం, శస్త్రచికిత్స తప్పించి, ఇదివరకటిరోజుల్లో మొత్తం అన్ని “రోగాలూ” ఒకే డాక్టరుగారు చూసేవారు. పైగా నాడి చూసి మరీనూ. అలాటి వైద్యుల దగ్గరే వైద్యం చేయించుకున్న ఆనాటి పెద్దలు మన ఇళ్ళల్లో ఇప్పటికీ గుండ్రాయిలా ఉన్నారు. వీళ్ళే కాకుండా, ఆర్.ఎం.పీ లని ఇప్పటికీ గ్రామాల్లో చూస్తూంటాం. చిన్నా చితకా రోగాల విషయం వీరే చూసేస్తారు. మరీ పెద్ద రోగం అయితే మాత్రం, పెద్ద డాక్టరు దగ్గరకు వెళ్ళే బాధ్యత కూడా తీసికుంటారు. ఆయుర్వేదం, హోమోపతీ అయితే, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వెళ్తూంటారు. మరదంతా ఆ వైద్యుల ఘనతంటారా, లేక ఆరోజుల్లో వాళ్ళ జీవన విధానమూ, క్రమ శిక్షణా అంటారా? రెండూ కూడానూ. అన్నిటికంటే ముఖ్యం వారి క్రమశిక్షణే కారణమయుంటుంది. ఆరోజుల్లో ఇంట్లో పెద్దవారి మాట వినాలనే బుధ్ధి వారికి ఉండేది. మరి ఈరోజుల్లో, ఎవరైనా ఏదైనా చెప్పాలనిపించినా మొదటి స్పందన “why?”, ఆసలెందుకు అవతలివారి మాట వినాలి?

మెడికల్ సైన్సుతోపాటు మిగిలిన టెక్నాలజీ కూడా అంచెలంచెలుగా అభివృధ్ధి చెందడంతో పాటు, ఇప్పుడు ప్రతీవాడూ ఓ డాక్టరే. ఇంట్లో ఎవరోఒకరికి కొద్దిగా ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలు, వాళ్ళు డాక్టరుదగ్గరకి వెళ్ళే లోపులోనే అంతర్జాలం లో వచ్చిన ఆ ఆరోగ్య సమస్య గురించి ఒకసారి వివరంగా తెలిసేసికుంటారు, ఏవేవో ఊహించేసికుని వాళ్ళు కంగారు పడడం, మిగిలినవారిని కంగారు పెట్టేయడం తరచూ చూస్తూంటాము. అక్కడితో పోనీ ఊరుకుంటారా అంటే, డాక్టరుదగ్గరకు వెళ్ళీవెళ్ళగానే, అంతర్జాలం ద్వారా acquire చేసికున్న సమాచారం ఆధారంగా, ఏవేవో అడగడమూ, ఆ డాక్టర్లచేత చివాట్లు తినడం చూస్తూనే ఉంటాము. చేయాల్సిందేదో ఆ డాక్టర్లు చూసుకుంటారుగా, అబ్బే అలా ఎలా కుదురుతుందీ, అక్కడికేదో డాక్టర్లకంటే మనకే ఎక్కువ తెలుసునని చూపించుకోవద్దూ?

ఇదివరకటి రోజుల్లో పెద్దపెద్ద రోగాలొస్తే “ పెద్దాసుపత్రి” కే వెళ్ళేవారు. పెద్దాసుపత్రంటే ప్రభుత్వానిదన్నమాట. కానీ, మన ప్రభుత్వాల నిర్వాకం ధర్మమా అని, వాటిల్లో వైద్యసదుపాయాలుకూడా తగ్గిపోతున్నాయి. దానితో కార్పొరేట్ సంస్థలు, ఎక్కడపడితే అక్కడ ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తెరిచేశారు. ఈరోజుల్లో అలాటి బహుళార్ధక ఆసుపత్రులు లేని గ్రామం కానీ పట్టణంకానీ కనిపించదు. వ్యాపార సంస్థలే కాదు, ఊళ్ళో ఉండే ఓ పదిమంది డాక్టర్లు కలిసి కూడా  పెట్టుబడి పెట్టి, ఓ మల్టీ పర్పస్ హాస్పిటల్ ప్రారంభించేయడం. అన్నీ ఒకే గూడు క్రింద చేయడం బాగానే ఉంది ఒకలా చూస్తే, కానీ వాటిలో ఉండే కష్టాల సంగతేమిటి?  ఏదైనా అస్వస్థత కలిగినప్పుడు ముందుగా ఓ వైద్యుడి దగ్గరకు వెళ్ళి, ఆయన సలహా మేరకు, ఏవేవో ఎక్సురేలూ వగైరాలతో మొదలెడతారు. చిత్రం ఏమిటంటే ఇలా తీయించుకున్న ఆ ఎక్సురేలు ఇంకో డాక్టరు దగ్గరకు వెళ్ళగానే, పనికిరాకుండా పోతాయి.ఒక్కరోజు ముందే తీయించుకున్నవైనా సరే, ఒకడాక్టరు తీసింది ఇంకొకరికి కుదరదు. పైగా అడిగితే , “ కుదరదండీ.. ఆ ఫొటో ఫలానా యాంగిల్ లో తీసిందీ.. మాకేమో ఫలానా యాంగిల్ లో తీస్తేనే దోషం ఎక్కడో తెలుస్తుందీ..” అంటారు. ఈ యాంగిల్సూ, ఎక్స్ రే లతో తో మన పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది.

వేలిమీద గోరుచుట్టు వచ్చిందని, ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళామా, అదృష్టం బాగోక, గుండె ఆపరేషనుతో బయటకి వచ్చే రోజులు ఇవి! దొరికాడురా “బక్రా” అనుకుని, నానారకాల పరీక్షలూ చేసేయడం, హడావిడి చేసేసి  “గుండెలో ఫలానాది సరీగ్గా పనిచేయడం లేదూ” తో మొదలెట్టి,  ఆరోగి ఆయుద్దాయానికి ఓ లిమిట్ పెట్టి,  చివరగా “ ఆపరేషన్ చేస్తే ఫరవాలేదూ, అయినా మీ ఇష్టం..” అనేసి వదిలేస్తారు. అయినా మనకి ఓ సెంటిమెంటోటి కదా, సరైన వైద్యానికి మొహం చాటేసికున్నారూ అని  చుట్టాలేమైనా అనుకుంటారేమో అనో భయం, అతావేతా మొత్తానికి, ఆ సర్జరీ ఏదో చేయించడానికి ఒప్పుకుంటారు.వెళ్ళిన వారికంటే , తీసికెళ్ళినవారి అదృష్టాన్ని బట్టి ఉంటుంది భవిష్యత్తు!

ఈరోజుల్లో ప్రతీదానికీ ఇన్స్యూరెన్స్ ఒకటీ.భార్య పురిటికోసం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళీవెళ్ళగానే మొదటగా చూసేది, ఈ పేషెంటుకి మెడికల్ కవరు ఉందా లేదా అని.  ఏదో ఫలానా రోజుకి చేరమంటారు, అక్కడుండే రూమ్ము రెంట్లని బట్టి, ఏదో  ఓ రూమ్ము బుక్కు చేసికుంటాము. తీరా చేరే సమయానికి , మీరు బుక్కు చేసికున్న రూమ్ముల్లో ఖాళీల్లేవూ, పైస్థాయి రూమ్ములే ఉన్నాయీ అంటారు. అంతదాకా వచ్చిన తరువాత చేసేదేమీ లేక, ఆ హాస్పిటల్ వాళ్ళిచ్చిన సూపర్ డీలక్స్ రూమ్ములోనే ఉండడం. తీరాచూస్తే రెండు రూమ్ములకీ పెద్ద తేడా ఉండదు, ఒకదాంట్లో సోఫాలూ, ఓ ఫ్రిజ్జీ అదనంగా ఉంటాయి.

ఈ “కష్టాలు” భరించలేక, అసలు పెద్దపెద్ద ఆసుపత్రులకు వెళ్ళడానికే భయ పడుతున్న రోజులు ఇవి . దేనికోసమో వెళ్ళడం, ఇంకో దాంట్లో తేలడం. అలాగని డాక్టర్ల దగ్గరకే వెళ్ళడం మానేయగలమా? పైగా పత్రికల్లోనూ , టీవీల్లోనూ కార్యక్రమాలొకటీ... ఫలానా symptoms అంటూ ఉన్నాయీ అంటే ఫలానా.. ఫలానా ..టెస్టులు చేయించుకోవడం అనివార్యం అంటూ ఊదరగొట్టేస్తూంటారు.పైగా ఈరోజుల్లో అందరూ so called health conscious  అని చెప్పుకోవడం ఓ status symbol ఒకటీ.

నిజమే, సరైన టైములో పరీక్షలు చేయించుకోవడం సమర్ధనీయమే, ప్రాణం మీదకొచ్చిన తరువాత పరుగులెత్తడం కంటే మంచిదే. కానీ ఈ “వార్షిక పరీక్షల “ ధర్మాన వచ్చే కొత్త రోగాల సంగతేమిటీ?

ఈ గొడవలన్నీ పడి, మనం కష్టపడి, ఇంట్లోవారిని కష్టపెట్టడం కంటే, హాయిగా వెళ్ళిపోవడం ఎంత బాగుంటుందో కదా? అయినా అలా వెళ్ళిపోవడానికి మనం పెట్టి పుట్టొద్దూ?

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu