Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్ - 20వ భాగం

జరిగిన కథ : టిప్ టాప్ గా  తయారయ్యి వెళ్తున్న ఏకాంబరాన్ని, తండ్రి పీతాంబరం వ్యంగ్యంగా, కోపంగా తిడుతాడు. దాంతో ఏకాంబర్ తండ్రిని చూసి అదిరిపడుతాడు.

ఇన్స్యూరెన్స్ గురించి చేప్పేసరికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించి పారిపోతున్నారు.

ఏంచేయాలో అర్థం కావడం లేదు రాజనాలకి.

ఉద్యోగంలో చేరాక తిరగ్గా తిరగ్గా బాల్య స్నేహితుడు ఏకాంబర్ తగిలాడు.

'ఏజెంటూకు కావలసిన కనీస విద్యార్హత వున్నవాడు, ఉద్యోగం సద్యోగం లేకుండా వున్నవాడు దొరికాడని ఎంతో సంబరపడ్డాడు.

కానీ, ఏకాంబరాన్ని పట్టుకోవడమే కష్టమౌతోంది. కనీసం, మనిషి దొరికితే వాడి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవచ్చు.

వద్దన్నా, కాదన్నా తన ప్రయత్నాన్ని వదలకూడదు.
ఆలోచిస్తూనే అక్కడనుండి బయలుదేరాడు రాజనాల...

ఆరోజు సాయంత్రం మూడు గంటలకే మళ్లా సిమ్హాచలం చేరుకున్నాడు రాజనాల రాజేంద్ర. ఏకాంబర్ కోసం ఉదయం పదిగంటల వరకూ తిరిగి తిరిగి విసిగిపోయి వైజాగ్ వెళ్లిపోయాడు. ఇంటిదగ్గర భొజనం చేసి మళ్లీ సిమ్హాచలానికి చేరుకున్నాడు.

'బైక్ మీద వైజాగ్ వెళ్లడానికి అర్థగంట సమయం పడుతుంది. ఇన్స్యూరెన్స్ లో చేరాక రోజూ పదహారు గంటలు వూరిమీదే తిరుగుతున్నాను. అదీ బైక్ మీదే. తప్పదు. తన ఉద్యోగమే తిరుగుడు ఉద్యోగం ' మనసులోనే అనుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలాగా మళ్లీ సిమ్హాచలానికి చేరుకున్నాడు.

కేంటీన్ దగ్గరకొచ్చాడు. ఏకాంబర్ మిత్రులందరూ కూర్చునే టేబుల్ దగ్గర చూశాడు. ఖాళీగానే వుంది. హోటల్ లో కూడా కస్టమర్లు అంతంత మాత్రంగానే వున్నారు. హోటల్ లో కూర్చుని టిఫిన్ ఆర్డరిచ్చి తింటూ కూర్చున్నాడు. ముందు రామకృష్ణ వచ్చి చేరాడు. ఆ తర్వాత ఆచారి, ఆ తర్వాత శంకరరావు, చివరగా ఆరు గంటలకు అనిల్ వచ్చాడు. అప్పటికే నాలుగుసార్లు టీలు త్ర్గారు. మిత్రులందరూ ఒక్కొక్కరుగా వస్తూంటే అందరికీ ఒకరి తర్వాత ఒకరికి టిఫిన్ ఆర్డరిచ్చాడు రాజనాల.

అయిదుగురూ ఏకాంబర్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.

ఏకాంబర్ కు కూడా మిత్రుల్ని కలవాలనిపించింది. అప్పటికే మిత్రుల్ని కలసి మూడు వారాలు దాటిపోతొంది. మధ్యలో కలసినా మొహం చూపించి పారిపోతున్నాడు. ఏ క్షణాన రాజనాల వస్తాడోనని భయం. ఎందుకో ఏకాంబరానికి అర్థం కావడం లేదు. 'వస్తే రానీ... వాడేం చేస్తాడనీ' ఒక్కోసారి తనకు తనే సర్ది చెప్పుకుంటాడు. తీరా మిత్రులతో మాట్లాడుతూ మాట్లాడుతూ 'రాజనాల ' వస్తే దొరికిపోతాన్రా' అంటూ పారిపోతుంటాడు.

సాయంత్రం ఆరవుతోంది. హోటల్ లో మిత్రులుంటారని తెలుసు. చూద్దామని బయలుదేరాడు. అంతవరకూ గాంధీనగర్ లో పెళ్లి దగ్గరే మిత్రులతో కూర్చున్నాడు. మధ్యానం ఇంటికి కూడా వెళ్లలేదు. పెళ్లి దగ్గరే భోజనం చేశాడు.

కేంటీన్ దగ్గరకు రాగానే ఏకాంబర్ గుండెలు దడదడలాడాయి. తప్పు చేసినవాడిలా భయం భయంగా కేంటీన్ దగ్గరకు చేరుకున్నాడు.
కేంటీన్ ముందు రాజనాల బైక్ నిలబెట్టి వుండడం చూస్తూనే అదిరిపడ్డాడు ఏకాంబర్.

'రాజనాల వచ్చినట్టున్నాడు. ఇప్పుడెలా?' ఆలోచిస్తూనే స్టేట్ బ్యాంక్ మెట్ల దగ్గరకు వెళ్లి అక్కడున్న కిటికీ గుండా తొంగి తొంగి లోపలకు చూశాడు.

మిత్రులందరితో కూర్చుని అసుక్కొడుతున్నాడు రాజనాల.

నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కిటికీ ప్రక్కన లోపలికి ఓరకంట చూస్తూ నిలబడ్డాడు ఏకాంబర్.

లోపల మిత్రులు మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

"ఈ మధ్య ఏకాంబర్ గాడు ఎందుకో దొరకడంలేదు. కనీసం ప్రతిరోజూ ఎంత రాత్రన్నా కనిపించి ఇంటికి వెళ్లేవాడు. నువ్వు కలిశావ్! వాడు కలవడం మానేశాడు" అనిల్ అన్నాడు.

"ఏముంది?! రాజనాల వాడ్ని 'ఏజెంటు 'గా పని చెయ్యమని ఎక్కడ బుక్ చేసేస్తాడోనని భయంతో తప్పించుకు తిరుగుతున్నాడేమో!?" రామకృష్ణ అన్నాడు.

"కరెక్టుగా చెప్పావురా! అదే అయుంటుంది" అన్నాడు ఆచారి.

"దానికి తప్పించుకు తిరగడమెందుకురా! నేను చెయ్యను అనేస్తే పోలా?!" శంకర్రావు అన్నాడు.

"అరే! వాడికసలే మొహమాటం ఎక్కువ. ఎదరపడి మాట్లాడితే మౌనంగా తల వంచేస్తాడు. అందుకే తప్పించుకు తిరుగుతున్నాడు" అన్నాడు ఆచారి.

"ఇలాంటి మొహమాటం మనుషులు నీకు ఎలా పని చేస్తార్రా! వదిలెయ్యి. వేరొకడ్ని వెదుక్కోవచ్చు కదా!" అనిల్ అన్నాడు.

"లేదురా! వీడు పట్టుకుంటే వదిలే రకం కాదు. మొహమాటం అంటావా? సముద్రంలోకి తోసేస్తే ఒడ్డుకు చేరడానికి కాళ్లూ, చేతులూ ఎలా ఊపుతామో... వీడూ అంతే! ఈత నేరపాడానికి ప్రక్కనే నేనుంటా కదా! నలుగుర్ని కలిస్తే మొహమాటం పటాపంచలైపోతుంది" అన్నాడు రాజనాల.

"వాళ్లింట్లోనే 'ఏకాంబర్ ' గాడి మీద నమ్మకం వదిలేశారు. నువ్వేంట్రా వాడిలో ఏదో 'మహత్తు ' వున్నట్లు వెనకేసుకొస్తున్నావు. నువ్వు ఒకవేళ ఏజుంటుగా వాడ్ని జాయిన్ చేసినా ఒకటంటే ఒక్కటి పలసీ రాయించగలిగితే నా చెవులు కోసుకుంటాను" అన్నాడు అనిల్.
వాళ్ల మాటలు వింటూంటే ఏకాంబరానికి మతిపోయింది. మిత్రులందరికీ తనమీద వున్న నమ్మకం ఎలాంటిదో తెలిసేసరికి మనసు క్షణం బాధతో మూలిగింది.

ఎన్నాళ్లనుంచో కలసిమెలసి తిరిగిన 'మిత్రులు ' తననో చవట వాజమ్మలా చూస్తున్నారు. ఎన్నాళ్ల క్రితమో విడిపోయి ఈ మధ్యే కలసిన 'రాజనాల 'కి తనమీద వున్న నమ్మకానికి ఆనందంతొ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ఏకాంబర్ ఒక్కక్షణం నిరుత్తరుడై నిలబడిపోయాడు. మిత్రులందరి దృష్టిలో తను చేతగాని చవట. పనిపాటు చేయని సోంబేరిగాడు. అంతేనా! తన విలువ ఇంతేనా!

మిత్రులందరితో గడపడం... వాళ్ల అవసరమే తన ఆనందమని కాలం విలువ మర్చిపోయి వాల్లకోసం తిరిగిన తను తిరుగుబోతయ్యాడు ' మనసులో పదే పదే తర్జనభర్జన పడ్డాడు ఏకాంబర్.

కిటికీ ప్రక్కన దొంగలా దాక్కున్న ఏకాంబర్ గుండెల్నిండా తాలి పీల్చుకుని నిటారుగా నడచుకుంటూ కేంటీన్ లోకి ప్రవేశించాడు.

వాళ్లందరి కోసమన్నా తను 'ఏజెంటు 'గా మారాలి. రాజనాల నమ్మకాన్ని నిజం చెయ్యాలి. మిత్రులందరి ఆలోచనల్లో తనేమిటో నిరూపించాలి! స్థిరంగా అనుకున్నాడు ఏకాంబర్.

దర్జాగా, ధైర్యంగా అడుగులో అడుగు వేసుకుంటూ హుందాగా పూర్తి ఆత్మవిశ్వాసంతో కేంటీన్ లో అడుగుపెట్టాడు ఏకాంబర్.

దూరం నుండే ఏకాంబరాన్ని చూసిన మిత్రుల్లో ముందుగా "అదిగోరా రాజనాలా, మీ హీరో వస్తున్నాడు" వ్యంగ్యంగా అన్నాడు అచారి.
రాజనాల ఆశ్చర్యంగా, ఆనందంగా తల త్రిప్పి ఏకాంబరాన్ని చూస్తూనే షాకయిపోయాడు.

ఎప్పుడూ లేనిది... ఎన్నడూ లేనిది ఠీవిగా, ధైర్యంగా, ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతున్న మొహంలో చిన్న చిర్నవ్వు మెరిపిస్తూ వాళ్లకేసి నడచి వస్తోన్న ఏకాంబరాన్ని చూసి మిత్రులంతా కళ్లింత చేసుకుని చూస్తూండిపోయారు.

రాజనాల మొహం ఆనందంతొ వెలుగులు విరజిమ్మింది.

మిత్రుల ఈసడింపులు తట్టుకోలేక 'ఏజెంట్ 'గా జాయిన్ అవడానికి అంగీకరించిన ఏకాంబర్ హుషారుగానే సంతకాలు చేసి ఫోటోలు, తన సర్టిఫికెట్లను ఇచ్చాడు. రాజనాలకి కూడా 'ఏకాంబర్ ' ఆమోదం ప్రమోదాన్ని కలిగించింది.

ఆరోజు -

ఏకాంబరాన్ని బైక్ మీద వెంటబెట్టుకుని విశాకపట్నంలో వున్న ఇన్సూరెన్సు ఆఫీసుకు తీసుకువెళ్లాడు రాజనాల.

బ్రాంచి మేనేజర్ కి పరిచయం చేసి ఏజెంటు ఫారాలూ, అవీ ఇచ్చేసి ఇద్దరూ బయటకు వస్తున్నప్పుడు మేనేజర్ అన్నాడు...

"రాజనాలగారూ! అదేదో తొందరగా 'ఎగ్జాం' కూడా రాయించేస్తే పోలా?"

రాజనాలతో మేనేజర్ ని కలసి బయటకు వస్తోన్న ఏకాంబర్ 'ఎగ్జాం' పదం విని ఒక్కసారే షాకయ్యాడు. మళ్లీ తేరుకుని మనకి సంబంధించినది కాదులే! అనుకుంటూ ముందుకు నడిచాడు.

"అలాగే సార్" అంటూ మేనేజర్ గారికి సైగ చేసి చెప్పి ఏకాంబర్ తో కలసి బయటకు వచ్చాడు రాజనాల.

"అయితే, నాతో ఇంక పనిలేదు కదా! వెళ్లిపోనా?" రోడ్డుమీదకు వచ్చాక అడిగాడు ఏకాంబర్.

"ఎలా వెళతావ్! నేను తీసుకువచ్చా కదా! నేనే నిన్ను ఇంటి దగ్గర దించుతాను. సరేనా?" అన్నాడు రాజనాల.

"నీకు శ్రమ ఎందుకు! నేనే వెళ్తాగా!" అన్నాడు ఏకాంబర్.

"శ్రమ ఎలా అవుతుంది. ఇకనుండి మన ఇద్దరం కలిసే కదా తిరగాలి" ఏకాంబర్ భుజం మీద చెయ్యి వేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి లాక్కుపోయాడు రాజనాల.

బైక్ తీసి స్టార్ట్ చేసాడు రాజనాల.

"ఎక్కరా ఏకాంబర్!" అంటూ బైక్ ముందుకు ఉరికించడానికి సిద్ధంగా ఎక్కి కూర్చున్నాడు రాజనాల. "ఎక్కడికి?" కుతూహలంగా అడిగాడు ఏకాంబర్.

"ఇప్పుడు నీకేం పనిలేదుగా?!" అడిగాడు రాజనాల.

"నాకా? పనా?! గొప్పగా అడిగావ్! పద!" రాజనాల భుజం మీద చెయ్యేసి అన్నాడు ఏకాంబర్.

బైక్ తో ఇద్దరూ బీచ్ రోడ్ లో పడ్డారు.

అప్పటికే పన్నెండు అయిపోతోంది. బైక్ తో నేరుగా తాజ్ రెసిడెన్సీ హోటల్ కి వెళ్ళాడు రాజనాల. పార్కింగ్ లో బైక్ పార్క్ చేసాడు.

"తాజ్ కొచ్చామా?! ఇక్కడ పనేమైనా వుందా?" కు తూహలంగా అడిగాడు ఏకాంబర్.

"పనేముంది? టైమైంది కదా! భోజనం చేద్దాం" ఓరగా ఏకాంబర్ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాజనాల.

"ఇందులోనా?!... సరే! పద! నీ ఆనందం ఎందుకు కాదనాలి?!" గుంభనగా అన్నాడు ఏకాంబర్.ఎప్పుడూ మిత్రులందరూ కలిసి బీచ్ కి వచ్చినా రోడ్డు మీద నిలబడే ' తాజ్రెసిడెన్సీ ' హోటల్ కేసి కళ్ళప్పగించి చూస్తుండిపోయేవారు. కనీసం చూడ్డానికి కూడా లోపలికి వెళ్ళాలంటే భయపడేవారు. అంత జీతగాడు అనిల్ కూడా ధైర్యం చేయలేదెప్పుడూ. డబ్బుంటే సరి కాదు. అనుభవించడానికి కూడా అదృష్టం కావాలి.... మనసులోనే పరిపరి విధాల ఆలోచిస్తూ రాజనాల రాజేంద్ర వెనుకే బెరుగ్గా నడిచాడు ఏకాంబర్. ఏకాంబర్ కోసం ఎదురు చూడకుండా నేరుగ బార్ లోకి దారి తీసాడు రాజనాల. మంత్రముగ్దుడిలా రాజనాల వెనుకే నడిచి వెళ్ళాడు ఏకాంబర్.

ఖాళీగా వున్న ఓ మూలకు వెళ్ళి కూర్చుంటూ ఏకాంబర్ ని ఆహ్వానించాడు రాజనాల. లోపలికి వెళ్ళి రాజనాలకెదురుగా కూర్చుంటూ చుట్టూ పరికించి చూసి ఉలిక్కిపడ్డాడు ఏకాంబర్.

'అరె ఇది బార్ లా వుందే?" ఆష్చర్యంగా అన్నాడు ఏకాంబర్.

"బార్ లా వుండడమేమిటీ? బారే కదా!" నవ్వుతూ అన్నాడు రాజనాల.

"ఇప్పుడా?!... మిట్ట మధ్యాహ్నం?" ప్రశ్నార్ధకంగా అన్నాడు ఏకాంబర్.

'వాళ్ళందర్నీ చూడు. పాపం.! వళ్ళు రాత్రనుకున్నారేమో?!" ఏకాంబర్ తొడ మీద ఒక చరుచు చరిచి నవ్వి అన్నాడు రాజనాల.

'ఇక్కడ మందు కొట్టి నన్నెలా డ్రాప్ చేస్తవ్?" సూటిగా అడిగాడు ఏకాంబర్.

'మనం ఇక్కడ తప్పతాగి పడిపోవడానికి రాలేదు. జస్ట్! చరో బీరు త్రాగి భోజనం చేసి వెళ్ళిపోదాం" అన్నాడు రాజనాల.

'నాకు అభ్యంతరం లేదు. బైక్ డ్రైవ్  చేసేది నువ్వే! మధ్యలో ఎక్కడన్నా పోలీసులు పట్టుకుంటే నీకే కష్టం" నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"ఓర్నాయనో! ఇంతమందికి లేని భయం నీకెందుకురా బాబూ!"

"భయం కదు, పోలీసులు పట్టుకుంటే సిగ్గుపడాలి. నువ్వైనా, నేనైనా తప్పు తప్పేకదా!" స్తిరంగా అన్నాడు ఏకాంబర్.

"అయితే ఏం చేద్దాం! నకిప్పుడు నీతో చీర్స్ కొట్టలన్నంత ఆనందంగా వుంది. ఈ అవకాశాన్ని వదులుకోలేను" మరింత స్తిరంగా అన్నాడు రాజనాల.

'ఓకే, ఓ పని చేయ్య. నన్ను బస్సు ఎక్కించెయ్. నువ్వు ఈ రోజుకి సెలవు ఇచ్చేసి ఇంటికి పోయి పడుకోవాలి. అలా అయితే నాకూ ఒకే!" నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"డన్!... ఏం చెప్పమంటావ్.!" ఆనందంగా అన్నాడు రాజనాల. ఈ లోగా సూటూ బూటూ వేసుకున్న బేరర్ వచ్చి వాళ్ళముందు నిలబడ్డాడు. ఇంగ్లీష్ లో అడిగేసరికి ఏకాంబర్ అవాక్కయి కూర్చుండిపోయాడు.

రాజనాల రాజేంద్ర ఆర్డర్ ఇచ్చాడు.

'రాజనాల! వీళ్ళు ఏం చదువుకుని వుంటార్రా? ఇంగ్లీష్ అంత ఈజీగా దంచేస్తున్నారు" నెమ్మదిగా రాజనాల చెవి దగ్గర అన్నాడు ఏకాంబర్.

"నిజం చెప్పాలంటే నీకన్నా, నాకన్నా ఏడాకులు ఎక్కువే చదివి ఉంటారు. వీళ్ళంతా హోంసైన్స్ లోనూ, మార్కెటింగ్ లోనూ డిగ్రీలు, పిజీలు చేసిన వాళ్ళు" చెప్పాడు రాజనాల.

"పాపం! అంత చదువుకుని ఇక్కడ...?!" వాళ్ళ మీద సానుభూతి చూపిస్తూ అన్నాడు ఏకాంబర్.

"దేనికి పాపం! వీళ్ళ జీతం ఎంతో తెలుసా? వీళ్ళ నెలసరి ఆదాయం తెలిస్తే నీకు కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఇక్కడకొచ్చే కస్టమర్స్ ఇచ్చే టిప్సే వీళ్ళకి రోజూ ఓ ఉద్యోగి నెల జీతాన్ని మించి వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయిస్లాగా అన్ని రూల్స్ వర్తిస్తాయి. ఈ ఉద్యోగం సంపాదించాలంటే సాదాసీదాగా చదువుకున్న కుర్రాళ్ళ వళ్ళ కాదు. బ్రిలియంట్ లయి ఉండాలి. నీకు వాళ్ళు తక్కువలా కనిపిస్తున్నార్రా!" చెప్పాడు రాజనాల.
రాజనాల చెప్పిందంతా వింటూనే ఆశ్చర్యం తో కళ్ళు తేలేసాడు ఏకాంబర్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
21st Episode