Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
20th Episode

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్-ఐ ఏ ఎస్ పాస్ - 21వ భాగం

జరిగిన కథ : కిట్టును కలవడానికి గిరిధర్ వస్తాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పార్టీ చేసుకుంటారు.  ప్రిలింస్ పరీక్ష దగ్గరపడుతుండడంతో ఉద్యోగానికి మధ్య మధ్యలో సెలవులు పెడుతూ.. కోచింగ్ కు వెళ్తూ చదువుతుంటాడు కిట్టు.

కిట్టుగాడు ఈలోగా పెళ్లి చేసేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కిట్టు. ప్రాబ్లంస్ని పట్టించుకోకూడదని గట్టిగా అనుకున్నాడు. ప్రాబ్లంస్ అనేవి లేకుండా మనిషనేవాడే లేడు. చెట్టు, మ్రాను అయితే ఏ ప్రాబ్లంస్ ఉండవు. మనిషికే కదా సమస్యలు వచ్చేది, ప్రాబ్లంస్ లో ఇదో ప్రాబ్లం అనుకుని ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలో చేసేయాలి. చీఫ్ మినిస్టర్ సంతోషంగా వున్నాడా? ప్రైం మినిష్టర్ సంతోషంగా వున్నాడా? అంబానీలు సంతోషంగా వున్నారా? విజయ్ మాల్యా ధనవంతుడని, విలాస పురుషుడనీ అంటారు. విజయ్ మాల్యాకి ప్రాబ్లంస్ లేవా? ప్రాబ్లంస్ లేవా? ప్రాబ్లంస్ లేనివాడు లేనేలేడు. ఈ సివిల్స్ పరీక్ష పాసయ్యాక, లేదా పూర్తిగా దొబ్బింది. ఇక చాల్లే అనుకున్నాక పెళ్లి చేసుకోవచ్చు కదా! కొంతమంది గ్రూప్ వన్ రాయాలి, పాసవ్వాలి. ఆ తర్వాత పెల్లి... అని వాయిదాలు వేస్తారు... కొంతమందికి ఎం.బి.బి.ఏహ్. తర్వాత పీజీ, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ... అంటూ వాయిదాలు వేస్తారు... సరే అక్కడికి వాయిదా వేస్తే... ఆ తర్వాత ఇంకో గోల... మళ్లీ వాయిదా... గోల లేనిదే మనిషి జీవితం లేదు... మనిషిని సంపూర్ణంగా తయారు చెయ్యలేదు దేవుడు.

ఆడదాని చేతికి పెన్ను, పేపర్ ఇచ్చి నీకు కావలసిన మొగుడు ఎలా వుండాలి? ఆ విషయం రాయి! అంటే... అబ్బాయి పొడగరి అయి వుండాలి, చూడ్డానికి చక్కగా వుండాలి, ఇంజనీరో, డాక్టరో అయి వుండాలి, మంచి జీతం కలిగి వుండాలి. తెల్లగా వుండాలి, ఛామనచాయ అయినా ఓకే, ఎటువంటి చెడు అలవాట్లు వుండకూడదు... మందు, సిగరెట్, పాన్, గుట్ఖా అలవాట్లు వుండకూడదు. తను నవ్వుతూ, నన్ను నవ్విస్తూ వుండాలి. వేరే అమ్మాయి వైపు కన్నెత్తి చూడగూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఇంతకు మించి పెద్ద పెద్ద కోరికలు నాకేమీ లేవు. ఈ లక్షణాలుంటే చాలు... అని రాస్తుంది.

ఇన్ని లక్షణాలున్నవాడు దొరుకుతాడా? ఈ లక్షణాలున్నవాళ్లు ఎంతమంది వుంటారు?

ఇలాగే,

వయసులో ఉన్న ఒక అమ్మాయికి" ఉత్తుత్తి రోసన్ "(హృతిక్ రోషన్ లాగా ఉన్నవాడి సంబంధం తెఛ్ఛారంట .ఇదేమిటీ వీడి మొఖం షేపు చుంచు మొహం లాగా ఉందీ? నాకొద్దు బాబొయ్  అన్నదట.సరే  అని అమీర్ ఖాన్...... వున్నవాడి సంబంధం తెచ్చారంట... వీడు పొట్టోడు, పంగకాళ్లోడు (బౌ లెగ్ డ్) నాకొద్దు అందంట... 'సల్మాన్ ఖాన్ ' లాంటి వాడిని తెచ్చారంట... వీడు 'బండోడు ' నాకొద్దు అందంట... 'షారుఖ్ ఖాన్ 'లాంటి వాడిని తెచ్చారంట... వీడేంటి, తిటకబారిపోయినట్టున్నాడు.... చెక్కమొహం వీడూనూ... పైగా నత్తి కూడానూ... నాకొద్దు... అందంట... 'అమితాబ్' లాంటి వాడిని తెచ్చారంట. వీడేంటీ, ఊచకాళ్లు, గెడబొంగులాగా ఇంత పొడుగున్నాడు? మా ఇంట్లో ద్వారా బంధాలికి కొట్టుకుని తల పగిలి చస్తాడు... అందట...

చివరకు 'బాబూమోహన్ 'లాంటివాడిని తెచ్చి ఆ అమ్మాయివాళ్ల నాన్న ఇలా అన్నాడట...

"చూడమ్మా... నా శాయశక్తులా ప్రయత్నించాను. ఇప్పుడొచ్చిన అబ్బాయిని కామెంట్ చేసే ముందు నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో... ఒకవేళ నువ్వు సరేనన్నా, నిన్ను చూసి ఆ అబ్బాయి నాకొద్దు పో... అంటాడేమోనని భయంగా వుంది. అబ్బాయి రూపం చూడకు, నాకు తెలిసినంతవరకు ఈ అబ్బాయి గుణవంతుడు, నెమ్మదస్తుడు, మంచి జీతంగల ఉద్యోగి... మనసులో సౌందర్యం గలవాడు. దేవుడి దయవల్ల ఆ అబ్బాయి ఓకే అంటే నీ పెళ్లి జరుగుతుంది. లేదా ఇంతే సంగతులు. గోవిందా..." అన్నాడట!

ఈ విధంగా జీవితం నుండి ఎంతో కావాలి, ఏదో కావాలి, ఇంకా ఇంకా కావాలి, అనుముంటూ ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్లు కోకొల్లలు. ముదిరిపోయిన బెండకాయలుగా మిగిలిపోయిన బ్రహ్మచారులూ వున్నారు.

అందరికీ తెలిసిన మహాపతివ్రత ఒకామె వుంది. ఆమె దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంది. దేవుడు ప్రత్యక్ష్యమై కావాల్సింది కోరుకోమన్నాడు. నాకో మంచి భర్తను ప్రసాదించు స్వామీ అన్నదామె. చెప్పమ్మా, ఎలా వుండాలి? అన్నాడు దేవుడు.

స్వామీ, నాకు కావలసిన భర్త, తర్క, వితర్కాలు తెలిసిన జ్ఞానియై వుండాలి. అన్ని విద్యల గురించీ తెలిసి వుండాలి, చక్కని శరీర సౌష్ఠవం కలిగి వుండాలి. బలవంతుడై వుండాలి. కొండల్ని పిండికొట్టే శక్తిమంతుడై వుండాలి. విలువిద్యలో అతనిని మించినవాడు ప్రపంచంలోనే వుండకూడదు. బాణాలతో వర్షాన్ని కురిపించగలగాలి. బాణాలతో అగ్ని ప్రళయాన్ని సృష్టించగలగాలి. ఇదిగాక, గుర్రాలు, పశువులు, పక్షులు... వీటన్నింటి గురించీ తెలిసిన మేధావియై వుండాలి. ఇంతకు మించి నాకేమీ వద్దు స్వామీ' అన్నదామె.

దేవుడికి కడుపులో గుడగుడలు పట్టుకున్నాయి.

"అమ్మా... ఇప్పుడే వస్తాను" అని గబగబా బాత్రూంకి పోయి వచ్చి, నీరసంగా కాసేపు చెట్టుకింద కూర్చొని ఆలోచించి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.

"తల్లీ..."

"స్వామీ"

"నీ కోరిక ఈ జన్మలో తీర్చలేను. ఎందుకంటే, ఇప్పుడు నువ్విచ్చిన 'స్పెసిఫికేషన్స్ ' (ప్రమాణాలు, కొలతలు) ఇంతవరకూ నేనెప్పుడూ కనీ వినీ ఎరుగను. ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను. ఎంత దేవుణ్ణైనా ఇప్పటికిప్పుడు హాం ! ఫట్ ! అని నేను గాల్లోంచి అన్ని లక్షణాలున్న వాడిని సృష్టించలేను. నీవు ఇచ్చిన ప్రమాణాలు, కొలతలను బట్టి నేను పని మొదలుపెట్టినా... పని పూర్తి చేసేటప్పటికి నీవు ముసలిదానివైపోతావు...  చచ్చిపోతావు..."

"మరెలా స్వామీ...!"

"నీకు మాట ఇచ్చి చచ్చాను కదమ్మా! తప్పించుకు చావలేను. అందుకని ఒక పని చేస్తాను. వచ్చే జన్మలో నిన్ను మళ్లీ పుట్టించి, అప్పుడు నీ కోరిక నెరవేరుస్తాను. సరేనా..."

"చాలా సంతోషం స్వమీ... వెళ్లిరానా స్వామీ?"

"వెళ్లమ్మా, కానీ వెళ్లే ముందు ఒక్కమాట విను..."

"చెప్పండి స్వామీ"

"ఇన్ని లక్షణాలున్న మగవాడిని నేను ఇంతవరకూ సృష్టించలేదు. సృష్టించలేను కూడా... అందుకని, ఈ లక్షణాలతో 5 గురు పురుషులను సృష్టించి వాణ్నను నీకు భర్తలుగా చేస్తాను. వాళ్ల పేర్లు కూడా నీకు 'కంఫ్యూజన్ ' (గందరగోళం) లేకుండా ముందే చెప్పేస్తున్నాను. రాసుకో. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అర్థమైందా తల్లీ?"

"అర్థమైంది స్వామీ. వెళ్లిరానా?"

"వెళ్లమ్మా... మళ్లీ రాకు. నా ప్రాణం మీదకు వస్తుంది" అన్నాడు దేవుడు.

ఇక మగవాళ్ల విషయానికొస్తే... ముందుగా అమ్మాయి తెల్లగా, చాలా అందంగా వుండాలి. ఆమెనువ్వరూ కన్నెత్తి చూడకూడదు. ఆమె కన్నెత్తి వేరే వాళ్లను చూడకూడదు. ఇంటిపనీ, వంటపనీ బాగా వచ్చి వుండాలి. బ్రష్, పేస్ట్ నుండి కాలి సాక్సుల దాకా అందించాలి. మంచి కట్నం తేవాలి. బాగా చదువుకున్నదై వుండాలి. ఉద్యోగం చేసి, డబ్బంతా తెచ్చి భర్త చేతుల్లో పోయాలి. పిల్లల్ని కని, వాళ్ల ఆలనా పాలనా చక్కగా చూసుకోవాలి. మొగుడు చెప్పినట్టు వినాలి. ఇంతకు మించి వేరే కోరిక ఏమీ లేదు. ఇలాంటి వాళ్ల గురించే ఒకాయన ఇంగ్లీష్ లో చెప్పాడు...

'మేన్ ఫాల్స్ ఇన్ లవ్ విథ్ ఏన్ ఏంజల్ బట్ ఫైనల్లీ మ్యారీస్ ఎ ఉమన్ '

మగవాడు ఒక దేవత కావాలని కోరుకుంటాడు. చివరకు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాడు. అంటే నాకు కాబోయే భార్య అలా వుండాలీ, ఇలా వుండాలీ అని ఊకదంపుడుగా ఊహించుకుంటాడు. ఎన్నయినా ఊహించుకోనీ... పెళ్లి చేసుకునేది ఒక మానవ మాత్రురాలినే... మగవాడెలా పరిపూర్ణం కాదో, ఆడది కూడా అలాగే పరిపూర్ణం కాదు.

ఆమెకూ కోపతాపాలుంటాయి... ఒక లక్షణముంటే ఇంకో లక్షణముండకపోవచ్చు... చిరాకు పరాకులుంటాయి. అందరం మనుషులమే కదా ! గొడవెక్కడ వస్తుందంటే దేవుళ్లూ, దేవతలూ కావాలని కోరుకుంటేనే...

ఒకడంటాడు... నా భార్య నిజంగా దయ్యమే...! దయ్యానికి వుండాల్సిన లక్షణాలన్నీ కరెక్ట్ గా  వున్నాయి ఆమెకి. దేవుణ్ణి అడిగాడు... "దేవుడా, దేవుడా... ఈ దయ్యాన్ని ఎందుకు నాకు కట్టబెట్టావు?" అని... దానికి దేవుడంటాడు, "నేను దయ్యాన్ని తయారు చేసిన మాట వాస్తవమే కానీ... ఆ దయ్యాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావా? నాకు తెలియదే... అయాం సారీ ! వీలయితే విడాకులు, వీలు కాకపోతే తన్నులు తింటూ వంట చేసుకుంటూ హాయిగా బతికెయ్ ! ఇదిగో నా డైరీలో రాసుకుంటున్నాను నీ విషయం. నీకు జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని, వచ్చే జన్మలో నీకు మేలు జరిగేలా చూస్తాను... సరేనా?"

ఇదేమాట బాధితులైన ఆడవాళ్లకూ, వాళ్లకు తగినట్టుగా చెబుతాడు.

కిట్టు వాళ్ల అమ్మానాన్నలకు చెప్పాడు విషయం... నాకు పెళ్లి చేసేయండి... అని...

రెండు, మూడు సంబంధాలు చూశారు.

కొన్నిచోట్ల అమ్మాయి తరపువాళ్లు మనకొద్దులే ఈ సంబంధం... అనుకున్నారు. ఇంకోసారి కిట్టు అమ్మానాన్నలే వద్దనుకున్నారు.

ఆఖరుగా ఇంకొకమ్మాయి కిట్టు కంటే 8 సంవత్సరాలు చిన్నది.

నేనసలే 'సివిల్స్ ' ప్రిపేర్ అవుతున్నాను.  సైన్స్ ప్రకారం రెండు, మూడేళ్ల కంటే తేడా వుండకూడదు అంతే అన్నాడు కిట్టు.

వెటనే అందుకున్నారు కిట్టు నాన్నగారు... ఎవడ్రా నీకు సైన్స్ చెప్పింది...? తీసి పక్కన పడేయ్ నీ బోడి సైన్స్... పాతకాలం వాళ్లందరూ తమకంటే చిన్నవాళ్లను బుద్ధి, జ్ఞానం లేకుండా చేసుకున్నారనుకున్నావా? ఆడవాళ్లకి సంసార బాధ్యతలు పెరిగే కొలదీ సంసార సుఖం మీద వ్యామోహం వుండదు. ఎంతసేపూ నా పిల్లలు, నా సంసారం, అయ్యో ఇల్లు ఏమైపోతుందో అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి... చిన్న వయసుదాన్ని చేసుకుంటే ఎక్కువకాలం సంసార సుఖం వుంటుంది. వయసు పెరిగినా సంసార సుఖానికి దూరం కానివాళ్లు కూడా వుంటారు. నేను చెప్పేది సర్వసాధారణంగా జరిగే విషయం మాత్రమే. అసాధారణ విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకో విషయం ఏమిటంటే నీవు వయసులో పెద్దవాడివి కాబట్టి... ఎప్పుడన్నా మాటా మాటా తేడా వస్తే సరేలే మా ఆయన నాకన్నా పెద్దవాడు కదా... నాకంటే అనుభవజ్ఞుడు కదా... అనుకుని నీ మాటకి సరే అంటుంది. సాధారణంగా... మళ్లీ చెబుతున్నాను.... సర్వసాధారణంగా ఎంత విశాల మనస్కుడైనా, ఎంత గొప్పవాడైనా సరే... మగవాడు భార్య తన మాట వినాలని కోరుకుంటాడు. సరే వీడి మాటే అమ్మాయి విన్నదనుకో... ఏదన్నా నష్టం జరిగిందనుకో... తప్పు తెలుసుకుంటాడు... ఆ తర్వాత భార్య మాట వింటాడు మగవాడు. ఇంకా మూర్ఖంగా రెచ్చిపోయిన మగవాడు జీవితంలో దెబ్బ తింటాడు.

ఇంకో విషయం ఏమిటంటే... మగవాడు సహాయం కోసం భార్యపై ఆధారపడతాడు. బిద్ధిలేనివాడు 'ఏమే, మంచినీళ్లు పట్టుకురావే' అంటాడు... బుద్ధి వున్నవాడు 'ఏమ్మా నా బంగారూ... మంచినీళ్లు పట్టుకురావే' అంటాడు. ఎంత పనిలో వున్నా... భర్తకి సహాయం చేసి, ఆనందం పొందుతుంది భార్య. అదేపని నీకంటే ముందే ముసలిదైపోయిన భార్యకి చెపితే... 'నావల్ల కాదు... నువ్వే తెచ్చుకో... నాక్కూడా తెచ్చిపెట్టు ' అంటుంది. ఏయ్... ఓయ్... ఆడది మగవాడికి పనిమనిషి కాదు. వంటింటి కుందేలు కాదు.... అనీ వెర్రికేకలు వేయకు. తన పాపకి స్నానం చేయించి, బట్టలు తొడిగి, ముస్తాబు చేసి, అన్నం తినిపించి, ఆ పాపతో ఆటలాడుతుంది తల్లి. ఆ పనిలో ఎంతో ఆనందం పొందుతుంది. ఆ చిన్న పిల్లలకి తల్లి ఏమన్నా పనిమనిషా... అని అడిగే వాడంత వెధవ ఇంకొకడుండడు... అలాగే భర్తకి సహాయం చేసి, ఆనందం పొందుతుంది భార్య...

అంతెందుకు?

మొన్నటికి మొన్న మీ అమ్మకి వంట్లో బాగోకపోతే వంట నేనే చేశాను... ఇదేదో గొప్ప విషయమని కాదు. కాళ్లూ, చేతులూ గుంజుతున్నాయని బాధపడితే 'జండూబాం రాసి ' మర్దన చేశాను రోజంతా... ఇదేదో ఒకసారి చేసేసి ఎంతో పెద్ద విషయమని చెప్పడం లేదు...

ఇంకొక విషయం కూడా చెబుతాను విను. మన భారతదేశంలోని లెక్కల ప్రకారం భార్య భర్తకంటే కొద్దిగా ఎత్తు తక్కువ వుండాలి. చూడముచ్చటైన జంట అంటారు. మళ్లీ వెర్రి కేకలు వేయకు. అసలు విషయం విను, ఆడవాళ్లు సున్నిత మనస్కులు... నలుగురిలో కలసినప్పుడు ఎవరైనా ఆడది పుసుక్కున... నీ భర్త 'పొట్టోడు ' అన్నదనుకో... ఆ బాణం భార్యకు మామూలుగా గుచ్చుకోదు... సరిగ్గా గుండె మధ్యలో నుండి దిగి, దూసుకుంటూ వెనకనుండి బయటకు వచ్చేస్తుంది. నేను చెప్పేది సాధారణంగా జరిగే సంగతి... అసాధారనంగా ఎన్నో జరగవచ్చు... అది నాకనవసరం. ఇక జీవితాంతం ఆ భార్యాభర్తలకు బనశ్శాంతి వుండదు. ఇదే మాట ఒక అమెరికా భార్యతో అంటే 'సో వాట్ ది ఫక్...' అంటుంది.

ఇక అందం విషయానికొస్తే నువ్వు అనాకారిగా వుండి అప్సరసను చేసుకోవద్దు. ఎందుకంటే, సమాజం 'కాకి ముక్కుకి దొండపండు ' అంటుంది. ఛీ... ఈ సమాజాన్ని ఎవడు లెక్క చేస్తాడు అనుకోకు... నీకు తెలిసీ, తెలియకుండానే నువ్వు ఈ సమాజంలో భాగం... నువ్వు కాదన్నంత మాత్రాన సమాజం నిన్ను వదలదు. నువ్వూ సమాజాన్ని వదలవు. ఆ తర్వాత నువ్వు అందగా వుండి, అనాకారిని చేసుకోవచ్చు. కానీ, ఏదో దాని బతుకు ఉద్ధరించేసినట్టు పోజు కొట్టకు, దాన్ని హింసించకు... దాంట్లో వుమ్న్న మంచి మనసుకు చూడు... అది చాలా అందంగా వుంటుంది.

ఇక చదువంటావా, ఈరోజుల్లో అందరూ చదువుకుంటున్నారు... డిగ్రీలను భార్యాభర్గలు బేరీజు వేసుకోకూడదు. గుడిసెల్లో వుంటూ... తాగి... భార్యని కొడుతూ, భార్య కూడా తిరగబడుతూ, ఇద్దరూ ఒకళ్లనొకళ్లు కొట్టుకుంటూ, ఊరంతా వినబడేలా, కనబడేలా రచ్చ చేస్తుంటారు కొందరు భార్యాభర్తలు. తర్వాత మళ్లీ కలసిపోతారు. వాళ్లకున్న జ్ఞానం కూడా లేకుండా వీళ్లకంటే వందరెట్లు ఉధృతంగానూ, ఉన్నత చదువులు చదివి, అసహ్యంగా రోడ్డు మీదపడి కొట్టుకునే ఉన్నత పదవుల్లో వున్న భార్యాభర్తలున్నారు. చదువెందుకు... 'సంకనాకను...?'

ఇక... డబ్బు...

ఒక కాపురం సజావుగా సాగడానికి కావాల్సింది డబ్బు కానేకాదు... చదువుకున్న మూర్ఖులు, ఉన్నత పదవుల్లో వున్నవాళ్లు, కట్నం కోసం భార్యను వేధించి, దాన్ని కిరసనాయిల్ లో ముంచి చంపేసినవాళ్లున్నారు. రోజూ పేపర్లలో చూస్తూనే వున్నాం. అమెరికా పోయినా కొంతమంది బుద్ధి అలాగే వుంటుంది. ఇదికూడా... ఆశ్చర్యకరమైన విషయం... కావలసింది మనిషిని మనిషి అర్థం చేసుకోవడం... దేవుడిచ్చిన శరీర సౌఖ్యాలను సమాజం నిర్దేశించిన రీతిలో పొందుతూ... సద్వారా పిల్లలను కని, వాళ్లని మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలి. 'ఏమన్నా అర్థమవుతోందిరా నీకు?' ప్రశ్నించారు కిట్టువాళ్ల నాన్నగారు... 'అర్థమైంది నాన్నగారూ' అన్నాడు కిట్టు...
'నడూ, ఆ పిల్లని చూద్దాం...'

వెళ్లడం, అమ్మాయిని చూడడం, ఇద్దరూ అంగీకారం తెలపడం, పెళ్లి జరగడం చకచకా జరిగిపోయాయి. కొద్ది రోజుల తర్వాత... హైద్రాబాద్ లో కొత్తకాపురం పెట్టాడు కిట్టు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
19th episode