Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
21st Episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ - పంతొమ్మిదవ భాగం

జరిగిన కథ : వరేణ్య, త్రివిక్రం ఒకే కారులో వెళ్ళడం చూసి, తన స్వప్నాలన్నీ కళ్ళముందే కూలిపోతున్నట్టు, చేతికందిన బంగారాన్ని ఎవరో అనామకుడు  తన్నుకు పోతున్నట్టుగా వినోద్ బాధపడుతాడు. ఇద్దరు పోలీసులు త్రివిక్రం ను వెదుక్కుంటూ హైద్రాబాద్ నుండి వైజాగ్ కు వస్తారు. ఇంతలో త్రివిక్రం పారిపోయివచ్చిన జైలులో చెకింగ్ కు వస్తాడు సూపర్నెంట్ రామకృష్ణమాచారీ. దాంతో జైలర్ త్రివిక్రం స్థానం లో వేరొకతన్ని నిలబెడతాడు.

''ఇంకా ఏం కావాలయ్యా, వాడసలే చలి జ్వరంతో ఎండుచేపలా మునగదీసుకుని పడుకున్నాడు. కప్పుకోడానిక్కూడా ఏమీ యివ్వరా, వెంటనే వాడికి ఒక దుప్పటి కప్పండి'' అంటూ సలహా యిచ్చి, గబగబా ముందుకెళ్ళిపోయాడాయన.

అప్పుడుగాని జైలర్‌ మనసు కుదుట పడలేదు.

మరో అరగంట తర్వాత ఎంత హడావిడిగా వచ్చాడో అంతే హడావిడిగా వెళ్ళిపోయాడు జైళ్ళ సూపర్నెంట్‌ రామకృష్ణమాచారి.

అప్పుడు తేలికపడ్డ మనసుతో భోజనానికి  ఇంటికి బయలుదేరాడు జైలర్‌ ఆంజనేయులు.

మధ్యాహ్నం పన్నెండుగంటలలోపే కాకినాడనుంచి బయలుదేరిపోవాలని వరేణ్య అనుకుంది కానీ అక్కడే భోజనం టైం అయిపోయింది.

తమ కంపెనీ లోకల్‌ డీలర్లను కలిసి వాళ్ళతో మాట్లాడి, పనులు ముగించుకునేసరికి ఒంటిగంట టైం.

ఒక మంచి హోటల్‌ చూసి ఇద్దరూ భోంచేసారు.

''నువ్వు డ్రయివ్‌ చెయ్యి..........'' అడిగింది కారు వద్దకు రాగానే వరేణ్య.

''నా డ్రయివింగ్‌ బాగుండదుగానీ నువ్వే చెయ్యి'' అన్నాడు త్రివిక్రమ్‌.

''ఆటో ఇంజనీర్‌వి, నీ డ్రయివింగ్‌ బాగుండదంటే నమ్మటానికి నేను సిద్దంగాలేనుగానీ స్టీరింగ్‌ తీసుకో.''

''అదేమరి, సమస్య డ్రయివింగ్‌ గురించికాదు. ఈ ప్రాంతం నాకు కొత్త. రూట్స్‌ తెలీదు.''

''తెలీకపోతే రూటు నేను చెప్తాను మాస్టారూ! నేనుండగా భయం దేనికి? కారు స్టార్ట్‌ చేయండి'' అంటూ స్టీరింగ్‌ అతనికి వదిలేసి పక్కన కూర్చుంది.

ఇక తప్పదని అర్ధమైపోయింది త్రివిక్రమ్‌కి, స్టీరింగ్‌ తీసుకుని డోర్‌ మూసాడు.

''నెక్ట్స్‌.............. రాజమండ్రి. అంతేగా?'' ఇంజన్‌ స్టార్టుచేస్తూ అడిగాడు.

''కాదు, మన సెకండ్‌పాయింట్‌ అమలాపురం, లాస్ట్‌ పాయింట్‌ రాజమండ్రి.''

''ఉదయం అమలాపురం గురించి నువ్వు చెప్పలేదు.''

''ఇప్పుడు చెప్తున్నాగా........పోనీ! కోనసీమ అందాలు చూస్తూ కారు నడపటమంటే ఆదో థ్రిల్‌.''

''బాగుంది. నీ వరసచూస్తే గోదావరి అందాలు కూడా చూపించేట్టున్నావే'' అంటూ కారు స్టార్ట్‌ చేసాడు.

ఒక్కజర్క్‌ ఇచ్చి కళ్ళెం వదిలిన గుర్రంలా దుమ్ము తెరలులేపుతూ ఒక్కసారిగా దూకి పరుగు ఆరంభించింది కారు.

ఆ విసురుకు ఎగిరి త్రివిక్రమ్‌మీదపడి పక్కకుజారి, కీచుమని అరుస్తూ లేచి సర్దుక్కూర్చుంది వరేణ్య.

''మైగాడ్‌! నువ్వు నడుపుతోంది కారు. విమానంకాదు, ఏమిటా స్పీడు'' అరిచింది.

''నాకు జట్కాబండిలా కారుతోలటం చేతకాదు మేడం''.

''వెక్కిరింపా....నా డ్రయివింగ్‌ జట్కాబండిలా వుందా?''

''పోనీ ఎడ్లబండి అనుకో, నో ప్రాబ్లం.''

''నన్నూ.....మైగాడ్‌! నువ్వు గొప్పగాడ్రైవ్‌ చేస్తావ్‌. ఒప్పుకుంటున్నాను. ప్లీజ్‌ స్పీడు తగ్గించు.'' స్పీడోమీటర్‌ నీడిల్‌ వందమీదికి ఎగబాకటం చూసి కంగారుపడుతూ అరిచింది.

''సారీ బేబీ..........స్పీడు తగ్గించటం అసలు కుదరదు. ఇలా వెళితేనే మనం రాజమండ్రి కూడా చూసుకుని రాత్రికి వైజాగ్‌ చేరుకోగలం. స్టీరింగ్‌ నా చేతికిచ్చాక భయపడకూడదు'' అన్నాడు నవ్వుతూ.

అప్పటిగ్గాని ఆమెకు అర్ధంకాలేదు కారు నపడటంలో కూడా అతను జీనియస్‌ అని. విమానం గాలితో పోటీపడుతూ దూసుకుపోతోంది కారు.

ఆమె అటు ఇటు చూడ్డం పూర్తిగా మానేసింది. రిలాక్స్‌సీట్‌కి జేరబడి అతడ్నేచూస్తోంది. కారు స్టీరియోలోంచి ఏదో పాట మధురంగా వినబడుతోంది.''

''రాజశేఖరా నీపై మోజు తీరలేదురా'' అంటూ అలనాటి పాట. అప్పటికే కారు కాకినాడ వదిలి చాలాసేపయింది. రామచంద్రపురం రూట్‌లో పరుగులుతీస్తోంది.

ఆమె మరీ అంతగా తననేచూడ్డం రెండు మూడుసార్లు గమనించి తకమకపడ్డాడు త్రివిక్రమ్‌.

''ఏయ్‌............నువ్వు మరీ అలా చూడకు, నాకు ఇబ్బందిగా వుంది.'' అంటూ హెచ్చరించాడు.

''నాకు బాగుంది'' అంది కొంటెగా నవుతూ.

''నాకు చిరాగ్గా వుంది.''

''అది నీ ప్రాబ్లం నన్నేం చేయమంటావు''

''మీ ఇంట్లో అంతా ఇంతేనా? తిక్క.........తిక్కగా..........''

''మావాళ్ళ సంగతి ఎందుకులే! నా  సంగతి ఇంతే!''

''అవునవును! ఆ విషయం ఈ పాత సినిమాపాటలు వింటే అర్ధమవుతోంది. లేటెస్ట్‌కేసెట్‌ ఒక్కటిలేదు''

''తరాలు మారినా చెదరని పాటలివి. వాటి గురించి అనవసరంగా కామెంట్‌చేయకు. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? గత జన్మలో నీమీద నాకుమోజు తీరలేదు. అందుకే నీకోసం మళ్ళీ పుట్టాను. రాజశేఖరా........నీపై మోజు తీరలేదురా.....''

''ఇదిగో నువ్వలా తిక్కతిక్కగా మాట్లాడకు. నాకు ఈ జన్మగురించే తెలిసిచావటంలేదు, నువ్వు గత జన్మ గురించి చెప్తే అస్సలు అర్దం కాదు. నాకు తెలిసిందొకటే! క్రికెట్‌ మేచ్‌, చూడగానే హేపీగా నీకు టాటా, గుడ్‌బై చెప్పేసి మధుర వెళ్ళిపోతాను ఆ తర్వాత నువెవ్వరో, నేనెవరో!''

 ''అంటే.........జాబ్‌కి కూడా రిజైన్‌చేసి వెళ్ళిపోతావా?''

''జాబ్‌ వుంటుంది, నేనుండను.''

''ఓర్నాయనో! నిన్నర్ధంచేసుకోవటం కష్టమే! ప్రేమ, పెళ్ళి గురించి నువ్వెప్పుడూ ఆలోచించవా.''

''జీవితం గురించి ఆలోచిస్తాను.''

''అవి రెండూ లేకపోతే జీవితం ఏముంది? దండగ.''

''జీవించటమే జీవితం. ఎలా జీవించాలనేది వారి వారి ఇష్టం. పెళ్ళి చేసుకోనంత మాత్రాన మన మాజీ ప్రధాని వాజ్‌పాయిగారిది జీవితంకాదా? ముఖ్యమంత్రి జయలలితది జీవితంకాదా? పెళ్ళిచేసుకోకుండానే ఎందరో గొప్పవాళ్ళయ్యారు.''

''ఇది ఖచ్చితంగా వితండవాదం...! కావాలనే ఇలా మాట్లాడుతున్నావు'' అంటూ మూతి ముడుచుకుంది వరేణ్య.

కారు రామచంద్రపురాన్ని క్రాస్‌చేసాక అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి. తను చెప్పకుండానే కారు అమలాపురం రూట్‌లో పరుగుతీస్తోంది.

''నువ్వు అబద్దం చెప్పావు. నీకీ ప్రాంతం బాగానే తెలుసు'' అంది నిష్టూరంగా.

''మా పూర్వీకులు కోనసీమ ప్రాంతంవాళ్ళే. ఇప్పటికి మారిలేటీవ్స్‌ చాలామంది ఇక్కడున్నారు. కాదంటే రాకపోకలు తగ్గిపోడంచేత ఇప్పుడు నేవెళ్ళినా చెప్తేగానీ నేనెవరో వాళ్ళు గుర్తుపట్టలేరు. గతంలో చాలాసార్లు ఇటు వచ్చాను. అందుకే తెలుసు'' అన్నాడు.

కారు అమలాపురం చేరుకుంది.

అక్కడ వరేణ్య తన బిజినెస్‌ పనులు ముగించుకునేసరికి టైం నాలుగు కావచ్చింది. ఆమె కారు వద్దకొచ్చేసరికి త్రివిక్రమ్‌ ఆకాశంవంక చూస్తూ

''దేవుడా దేవుడా'' అంటూ ఎవరికో మొక్కుకుంటూ కన్పించాడు.

''ఏమైంది?'' అశ్చర్యపోతూ అడిగింది.

''వాతావరణం మారిపోతోంది. ఆకాశంలో నల్లటిమబ్బులు ప్రత్యక్షమయ్యాయి'' బాధగా చెప్పాడు.

''అయితే ఏమిటి?''

''వర్షం పడుతుందని భయంగా వుంది. అందుకే వానపడకూడదని దేవుడికి మొక్కుకుంటున్నాను.''

''ఎందుకు? వానంటే అంత భయమా?''

''భయం వాన గురించి కాదు, క్రికెట్‌మేచ్‌ గురించి. వర్షంపడితే  స్టేడియంలో పిచ్‌ తడిసిపోతుంది. మేచ్‌ కేన్సలౌతుంది. ఇంత కష్టపడి వైజాగ్‌వస్తే ఆఖరుకు మేచ్‌ చూడకుండానే మధురకు వెళ్ళాలేమోనని భయంగా వుంది'' అంటూ తన భయానికి కారణం వివరించాడు త్రివిక్రమ్‌ అంతా విని పక్కున నవ్వింది వరేణ్య.

''ఏయ్‌ వినోద్‌! ఏమిటిది చిన్నపిల్లాడిలా క్రికెట్‌ పిచ్చి నీకు? మేచ్‌ కాన్సిలయితే మరో డేటు కేటాయిస్తారు. భయం దేనికి?'' అంది.

''అంతవరకు మధురవాళ్ళు నన్నిక్కడ వుండన్వివరుగదా. నేను వెళ్ళిపోవాలి.''

''మధుర.........మధుర........మధుర... ఎక్కడుంది మధురా? ఫోన్‌ చెయ్యి నేను మాట్లాడుతాను.''

''ఇది ఫోన్‌లోతేలే సమస్యకాదుగాని బయల్దేరుదామా?'' కారు డోర్‌తెరుస్తూ అడిగాడు.

''లైట్‌గా టిఫిన్‌ తీసుకొని బయల్దేరటం మంచిది.......'' కార్లో కూర్చుంటూ సూచించింది.

''ఇక్కడ వద్దులే, దారిలో రావులపాలెంలో టిఫిన్‌ చేద్దాం. నేషనల్‌ హైవే గదా, పంజాబీ దాబా హౌస్‌లో చక్కటి ఫుడ్‌ దొరుకుతుంది.'' కారు స్టార్ట్‌చేస్తూ చెప్పాడు. తిరిగి రాజమండ్రికి ప్రయాణం ఆరంభించింది కారు.

అయితే అమలాపురం వదిలిన పావుగంటకే చిటపట చినుకులతో ఆరంభించింది వాన. అసలు ఉదయంనుంచే సూర్యుడు కనబడలేదు. మబ్బులు కమ్ముకొంటూ వాతావరణం మారిపోతూ వచ్చింది. బంగాళాఖాతంలో మూడురోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనద్రోణి బలం పుంజుకుని వాయుగుండంగా మారింది. దాని ప్రభావం మూలంగా ఈ ఆకాల వర్షం.

ఆ వర్షాన్ని చూసి భారంగా నిట్టూర్చాడు త్రివిక్రమ్‌.

''అనుకున్నాను. ఈమధ్య నా అదృష్టం గుర్రంఎక్కి వెనక్కిదౌడుతీస్తోంది. వర్షంపడక ఛస్తుందా'' అంటూ విసుకున్నాడు.

ఆమె నవ్వింది.

బుగ్గలు సొట్టలుపడేలా ఆమె అలా నవ్వుతుంటే మరింత అందంగా వుంటుంది. కాని ఆ నవ్వు త్రివిక్రమ్‌ని మరింత ఉడికించింది.

''ఆ నవ్వుకి అర్ధం ఏమిటి? నా టైం బాగలేదనా?'' అడిగాడు.

''నీ టైంకేం? పూలపల్లకిలో ప్రయాణిస్తోంది. అందుకేగా వానలో తడవకుండా కారులో ప్రయాణం, పక్కన చక్కని చుక్క. ఇంకేంకావాలి? నేను నవ్వింది టైం గురించికాదు, నీ గురించి. ప్రతిదానికి అలా అలుగుతావేమిటి? అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. ముఖ్యంగా ప్రకృతితో మనం రాజీపడక తప్పదు. చూస్తే ఇదేదో తుఫాను సూచనలా వుంది'' అంటూ రేడియో ఆన్‌చేసిందామె.

సరిగ్గా అప్పుడే రేడియోలోంచి వినబడుతోంది తుఫాను హెచ్చరిక, ఆ హెచ్చరికను బట్టి ప్రస్తుతం కాకినాడకు రెండువందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవున్న తుఫాను పశ్చిమ వాయువ్యంగా వేగంగా కదులుతోంది. అది రాత్రికి విశాఖ ఒరిస్సా సరిహద్దు మధ్య ప్రాంతంలో తీరం దాటవచ్చని తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం హై అలర్ట్‌ అనౌన్స్‌ చేసింది కాకినాడ, విశాఖ రేవుల్లో ఒకటో నంబరు తుఫాను ప్రమాదసూచిక ఎగురవేసారు. బారీవర్షాలు తీరప్రాంతాన్ని అతలాకుతలం చేయొచ్చు. లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.

 ఆ ప్రకటన వినగానే రాత్రికి తాము వైజాగ్‌ చేరుకోలేమన్న సంగతి స్పష్టమైంది. ఇప్పటికే చలిగాలులు బలంగా వీస్తున్నాయి. వర్షం పెరుగుతుందేగాని, తరిగే సూచనలు కన్పించటంలేదు.

రావులపాలెం చేరుకునేరికి కుండపోతగా పడుతోంది వాన. గాలి విసుర్లు చెట్లను జవజవలాడిస్తున్నాయి. పట్టపగలే చీకట్లు ముసురుకున్నాయి ఆకాశం అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో హుంకరిస్తూ భయపెడుతోంది.

ఆ సమయంలో రావులపాలెంలో ఆగటం మంచిదికాదనిపించింది. టిఫిన్‌చేసే అవకాశం కూడా లేదు. కారు దిగితే నిలువుగా తడిసిపోతారు.

'ఏం చేద్దాం. డైరెక్ట్‌గా రాజమండ్రి వెళ్ళిపోదామా?'' అడిగాడు.

''ఊఁ'' అంది అతడికి మరింత దగ్గరగా జరుగుతూ.

''ఏమీ అనుకోకు, నాకు ఉరుములు, మెరుపులు అంటే భయం'' అంది అతడి భుజంమీద తలాన్సుకుని కళ్ళు మూసుకుంటూ.

హత్తుకుపోయాక అనుకునేదేముంది? ఆమెను దూరంగా జరిగి కూర్చోమనేంత  కఠినాత్ముడూకాదు అలాగని పువ్వులా ఆమె తన భుజానికి హత్తుకుపోతుంటే, పులకించే మూడ్‌లోనూ అతనులేడు. ఆమెను కాదనలేడు, చేరదీయలేడు. మానసిక సంఘర్షణలో నలిగిపోతూనే కారుని జాగ్రత్తగా పోనిస్తున్నాడు. ఎదురుగా వచ్చే వాహనం కనబడనంత దట్టమైన వర్షం. ఆపైన కారును తిరగబెట్టేస్తుందా అన్పించేంతగా బలమైన ఈదురుగాలులమధ్య జాగ్రత్తగా, కారు నడుపుతూ ఇద్దరూ రాజమండ్రి చేరుకునేసరికి రాత్రి ఏడు కావస్తోంది టైం.

అప్పటికే నగరవీధులు జంలమయంగా వున్నాయి. రోడ్లమీద ట్రాఫిక్‌ పల్చబడింది. చలిగాలులు వణికిస్తున్నాయి.

''ఏంచేద్దాం? రాత్రికి మనం ఏదో హోటల్లో స్టేచేయక తప్పదనుకుంటాను. ఈ వర్షంలో నువ్వు ఇక్కడి డీలర్లను కలుసుకోవటం కూడా కష్టమే అవుతుంది.'' గుర్తుచేసాడు త్రివిక్రమ్‌.

''బిజినెస్‌ పనులు పక్కన పడేద్దాం. ఇక్కడ మన కంపెనీ గెస్ట్‌హౌస్‌ వుంది. రాత్రికి అక్కడ స్టేచేద్దాం'' అంది.

''అయితే అక్కడికేపోదాం, సిటీలో నువ్వు చెప్పటం, నేను కారు తిప్పటం ఎందుగ్గాని స్టీరింగ్‌ నువ్వు తీసుకో, ఆ గెస్ట్‌హౌస్‌ సంగతి నాకు తెలీదు.''

''అయితే ఇటు జరుగు.''

కారు పక్కకుతీసి ఆపాడు.

అతను ఇటు జరగ్గానే, తను లేచి స్టీరింగ్‌వైపు కదిలింది. కాని తూలి అతడి ఒడిలో కూర్చుండిపోయింది. నరాలు జివ్వుమని ఒళ్ళు గాలిలో తేలిపోతున్నట్టనిపించి, ఒక్కక్షణం పాటు వివశుడయ్యాడు త్రివిక్రమ్‌. పువ్వులా పడుచుపిల్ల ఒడిలో వాలితే పులకించని పురుషుడిదీ ఓ మగ పుట్టుకేనా? అందుకే

''మైగాడ్‌'' అనరిచాడు.

''ఏమైం...............ది?'' తిరిగి పైకిలేచి స్టీరింగ్‌ వెనక్కి జరుగుతూ అడిగింది.

''ఇంకా ఏంకావాలి వ్రతభంగం జరిగిపోయింది'' అన్నాడు ఎంతో నొచ్చుకొంటున్నట్టు. ఆమె అల్లరిగా నవ్వింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్