Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jelocy

ఈ సంచికలో >> కథలు >> సుబ్బయ్య సున్ని ఉండలు

subbaiah sunniundalu

వేణుపురంలోని సుబ్బయ్య మిఠాయి దుకాణం రుచికరమైన తినుభండారాలకు ప్రసిద్ది చెందింది. ముఖ్యంగా సుబ్బయ్య స్వయంగా తయారు చేసే సున్ని ఉండలంటే లొట్టలు వేయని వారు లేరు. అయితే, ఒక పర్యాయం సుబ్బయ్య సున్ని ఉండలు తిన్న వారందరికీ జీర్ణ సమస్యలు వెల్లువెత్తాయి. వాంతులూ, విరోచనాలతో కొందరు ఆసుపత్రి పాలయ్యారు కూడా. ఇబ్బంది పడిన వారిలో కొందరు గ్రామాధికారి విశ్వవర్మకు ఫిర్యాదు చేశారు.

విశ్వవర్మ సుబ్బయ్యను పిలిచి, "నీ వద్ద సున్ని ఉండలు కొని తినడం ద్వారానే వారందరికీ అనారోగ్యం కలిగినట్లు వైద్యులు కూడా దృవీకరించారు. నీవు దోషిగా నిర్ధారించబడితే నష్టపరిహారాన్ని, చెల్లించవలసి ఉంటుంది. దీనిపై నీ సంజాయిషీ ఏమిటి?" అని ప్రశ్నించాడు.
" అయ్యా...నేను సున్నిఉండలు  తయారు చేసి అమ్మనే గానీ, అందులోని పదార్థాలు నావి కావు. గంగాధరుడనే రైతు వద్ద మినుములు కొన్నాను. వాటిలో నాసిరకమైనవి కలిసి ఉండొచ్చు. అలాగే, నెయ్యి అమ్మిన తిప్పయ్య, అందులో కల్తీ చేయడానికి అవకాశం ఉంది. బెల్లం విక్రయించిన సుందరుడు దానిని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేశాడేమో తెలియదు. !

ఇంతమందికి ప్రమేయం ఉన్న ఈ వ్యవహారంలో నన్నొక్కడినే తప్పు పట్టడం సమంజసం కాదని నా భావన. నా అభిప్రాయాన్ని కూడా పరిశీలించండి." వినయంగా చెప్పాడు సుబ్బయ్య.

విశ్వవర్మ కాసేపు ఆలోచించాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే సుబ్బయ్య ఆ ముగ్గురి ప్రస్తావన తీసుకు వచ్చాడని గ్రహించాడు.
" సుబ్బయ్యా, నీవు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం. సున్నుండల తయారీలో వారి భాగస్వామ్యం ఉందని నేను ఒప్పుకుంటాను. అయితే, వారి వద్ద సరుకులను కొనేటప్పుడు వాటి నాణ్యతను పరిశీలించడం నీ విధి. నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఈ గడ్డు పరిస్థితి ఏర్పడేది కాదు. పైగా కల్తీ చేసిందెవరో వెంటనే తెలిసేది. ఎలా చూసినా ఈ మొత్తం వ్యవహారంలో నీ అజాగ్రత్తే కారణంగా తేలుతోంది. దీనికి పరిహారంగా వెయ్యి వరహాలను బాధితులకు చెల్లించు." విశ్వవర్మ ఆజ్ఞాపించాడు.

తన పథకం బెడిసి కొట్టడంతో సుబ్బయ్య కిక్కురుమనకుండా పరిహారాన్ని చెల్లించి బయటపడ్డాడు. ఇక అప్పట్నుంచీ తాను రుచి చూసి నాణ్యతను నిర్ధారించుకున్న తర్వాతే మిఠాయిలను అంగడిలో అమ్మకానికి పెట్టడం ప్రారంభించాడు.

మరిన్ని కథలు
planning