Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
26th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

జరిగిన కథ: వరేణ్య తన బాస్ కూతురని తెలిసి ఆశ్చర్యానికి గురవుతాడు త్రివిక్రం. వినోద్, త్రివిక్రం లు ఇద్దరూ సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వస్తారు. వినోద్ క్రెడిట్ కార్డు తీసుకుని రూము లోంచి బయటకు వస్తుండగా.. వనకన్యలా వరేణ్య లైట్ గ్రీన్ కలర్ చీరలో కనిపిస్తుంది.  

 

కారు మెత్తగా దూసుకుపోతూనే వుంది.

''నా మనసుని అడుగు ఏముందో చెప్తుతుంది.''

''నా మనసులో ఏమీలేదు.''

''ఎందుకు దబాయిస్తావ్‌! మనసులో దాచుకుంటే అది ప్రేమకాదు.''

''నేను ప్రేమించటంలేదు.''

''బుకాయించి తప్పించుకోలేవు. పట్టాభిని వాడి మనుషుల్ని తన్ని కాపాడావు నామీద ప్రేమతో కాదా?''

''అది డ్యూటీ! మగాడిగా నా బాధ్యత.''

''బాధ్యత తెలిసిన మగాడంటేనే ఆడది ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది.''

''తప్పు తప్పు'' చాలా మంది ఆడాళ్ళు బాధ్యత తెలిసిన భర్త కంటే, బాధ్యత లేని పుట్టింటి వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తారట, భర్త పిల్లలే అన్ని త్యాగాలు చేయాలట. ఇలాంటి ఆడాళ్ళు మొగుడు పిల్లలు నానా చావు చస్తున్నా చూస్తూ ఊరుకుంటారు కాని ధర్మ బద్ధంగానే పుట్టింట్లో తనకు రావల్సిన వాటాలో పైసాతో పైసా తీసుకురారట. త్యాగం అయినా, ప్రేమ అయినా ఇరువైపులనుంచి ఉండాలి, తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పమన్నారుగా ''సరిలే''.

''ఈ టాపిక్‌ వదిలేద్దాం. ప్రేమ, పెళ్ళి వీటికి నేను దూరం. చెప్పానుగదా.''

చటుక్కుని కారుని పార్క్‌సైడ్‌కి తీసి ఇంజన్‌ ఆపేసింది వరేణ్య. తలని స్టీరింగ్‌మీద ఆన్చుకుని అలాగే వుండిపోయింది.

త్రివిక్రమ్‌కి మొదట అర్ధంకాలేదు. కాసేపటికి అర్ధమైంది ఆమె ఏడుస్తోంది.

మనసు గాలానికి చిక్కిన చేపలా విలవిలాడింది. అక్కున చేర్చుకుని ఓదార్చి ఐలవ్‌యూ చెప్పలేడు. అలాగని చూస్తూ వుండలేడు.

''ప్లీజ్‌ వరేణ్య, ఇప్పుడేమైందని? లే, కారుపోనీ'' అన్నాడు మృదువుగా.

ఆమె పలకలేదు.

స్టీరింగ్‌ పైనుంచి తలెత్తలేదు.

''ప్లీజ్‌.......'' అంటూ భుజంమీద చేయివేసి లేపబోయాడు, ఆమె అతడి చేతిని విదిలించింది.

''వద్దు వినోద్‌, ఏడవనీ.....కాస్సేపు నన్నిలా ఏడవనీ'' అంది రుద్దకంఠంతో.

''ఎందుకు ఏడుస్తావ్‌? ఇలా చూడు'' అంటూ మళ్ళీ భుజంమీద చేయి వేసాడు. రెండోసారి కూడా చేయి విదిలించివేసింది.

''ఎందుకిలా జరుగుతోంది? నాకే ఎందుకు జరుగుతోంది? లోకంలో ఎన్నో ప్రేమ జంటలున్నాయి. కోరుకున్న మగాడితో సరదాగా, సంతోషంగా వుండే రాత నాకు లేదా? దగ్గరయ్యేకొద్దీ నన్నెందుకు దూరంగాతోసేస్తావ్‌? నువ్వు కాదనేకొద్ది నీ మీది ప్రేమ రెట్టింపవుతోందిగాని తగ్గటంలేదు ఏం చేయను. ఎంచేస్తే నువ్వు నన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంటావ్‌?'' ఏడుస్తూనే అడిగింది.

''ఖచ్చితంగా చెప్పమంటావా?'' అడిగాడు.

''చెప్పు'' అంది చివ్వున తలెత్తి.

ఆమె బుగ్గలవెంట మంచిమత్యాల్లా దొర్లుతున్నాయి కన్నీటి చుక్కలు, త్రివిక్రమ్‌ మనసు రాయిచేసుకున్నాడు. తను వెళ్ళిపోడానికి  నాలుగురోజులే వుంది. అవతల ఒరిజినల్‌ వినోద్‌ వచ్చి లైన్‌లో వున్నాడు.

ఈ సమస్యను ఇంకా పొడిగించటం మంచిదికాదు.

''నువ్వంటే నాకిష్టంలేదు''

''నేన్నమ్మను, నమ్మటానికి సిద్దంగా లేను'' అంటూ కళ్ళు తుడుచుకుంది.

''నోప్రాబ్లం.''

''నేనెవరో తెలిసికూడా తెలియనట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావ్‌?''

''నువ్వు మాత్రం? ఓనర్‌ కూతురువని నాతోనిజం చెప్పావా?''

''ఓహో. అంటే చెప్పలేదనే ఇష్టంలేదంటున్నావా? నువ్వాడుతున్న నాటకాన్ని కంటిన్యూచేసాను. అంతకుమించి నేనేమీ చేయలేదు. నన్ను ప్రేమించను అనటానికి అది కారణం కానేకాదు. మరేదో మనసులో వుంచుకుని ఇలా మాట్లాడతున్నావ్‌. చాలాసార్లు నీ పరధ్యానం గమనించాను. నీ మనసులో ఏదో బాధ వుంది. నాతో ఎందుకు చెప్పవు? ఐ లవ్‌ యు వినోద్‌. ప్లీజ్‌! నేను నీదాన్ని'' అంటూ ఇక ఆపులేక అది పబ్లిక్‌ ప్లేస్‌ అనికూడా చూడకుండా అతడి గుండెల్లో ముఖం దాచుకుని నడుంచుట్టూ చేతులు బిగించేసింది.

ఇక త్రివిక్రమ్‌ మానసికస్థితి ఏ స్థాయిలో వుంటుందో వూహించుకోవచ్చు. నిజంగా ఆమెమీద ప్రేమ లేకపోతే అది వేరే విషయం. కాని వచ్చిన రెండోరోజునుంచే ఆమె పాదరసంలా తన హృదయం నిండుగా వ్యాపించిపోయింది. అది ఆమె వెనుకవున్న కోట్లఆస్థి చూసిగాని, ఆమె అందంచూసిగాని ఏర్పడిన ప్రేమగాదు. ఆమె ఆరాధనకు తన మనసు స్పందించిన తీరు అది. కాని ఏం లాభం? బలవంతంగా ఆమెను వదులుకోవలసిన పరిస్థితి తనది.

ఆమెపైనా, ఆమె ఆస్థిపైనా ఎన్నో ఆశలతో వైజాగ్‌ వచ్చాడు వినోద్‌. అవతల ఆమె తండ్రి సుధాకర్‌నాయుడు వరేణ్యను అతడికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నారు. ఆమెకు భర్తకాగల అర్హతలు అతడిలో చాలా వున్నాయి. తన రికార్డు తిప్పితే ఏముంది? ఇంటర్‌ చదువు, బ్యాంకు రాబడి, వినోద్‌ని చీటింగ్‌ చేసిన తీరు ఇవే కన్పిస్తాయి. కాబట్టి తనమీద తనకే గిల్టీగా వుంది. ఇక ఆమె ప్రేమను ఎలా అంగీకరించగలడు, అయినా తాత్కాలికంగానయినా ఆమెతో రాజీపడాలి, లేదంటే కారు ఒక్క ఇంచుకూడా ఇక్కడినుంచి కదలదు.

''ఓ.కె........ ఆదివారం, వచ్చే ఆదవారం వరకు ఓపికపట్టు, హేపీగా క్రికెట్‌మేచ్‌ చూసాక నీమీద నాకున్న లవ్‌ని డిక్లేర్‌ చేస్తాను'' అన్నాడు.

''నన్ను మేచ్‌కి తీసుకెళ్ళాలి. మనిద్దరం పక్కపక్కన కూర్చుని మేచ్‌ చూడాలి'' అతడ్ని వదిలి సరిగ్గా కూర్చుంటూ అడిగింది.

''ష్యూర్‌! మనిద్దకం వెళుతున్నాం, ఆ తర్వాత నేను మధుర వెళ్ళి పోతాను''

''మధుర కూడా యిద్దరం వెళుతున్నాం.''

''అక్కడికి మాత్రం ఎవరినీ రానివ్వరు.''

''అయితే చూస్తూండు. నిన్ను మధుర వెళ్ళనివ్వను'' అంటూ కారు స్టార్ట్‌చేసింది వరేణ్య.

''హమ్మయ్య, గండం గడిచింది'' అనుకుంటూ తేలికగా వూపిరి తీసుకుని సీట్‌కి జేరబడ్డాడు త్రివిక్రమ్‌.

కాసేపట్లోనే కారు సన్‌ ఆటోమొబైల్స్‌ ఆఫీసుముందు ఆగింది.

''ఆపెయ్‌........ అర్జంటుగా కారు ఆపుచెయ్‌.''

వెనకసీట్లో కూర్చున్న సుధాకర్‌ నాయుడు పెద్దగా అరిచాడు. ఆ అరుపు విని ఝడుసుకుని, కంగారుపడి, హడావుడిగా కారుని రోడ్‌ సైడ్‌కి తీసి బలంగా బ్రేక్‌లు తొక్కాడు డ్రయివరు. కీచుమని వికృత శభ్దాలు సృష్టిస్తూ ఆగింది కారు. ఆయన డోర్‌ గ్లాస్‌ దించి. ''వినోద్‌........హలో వినోద్‌'' అంటూ పిలిచాడు.

అక్కడికి సమీపంలోనే ఒక సోడా బంక్‌లో సిగరెడ్‌ పాకెట్‌, మేచ్‌బాక్స్‌ తీసుకుంటున్నాడు వినోద్‌. ఆ పిలుపు తనను వుద్దేశించి అనిగాని, సుధాకర్‌ నాయుడుగారు విశాఖపట్నంలోకి ఇంత సడెన్‌గా వూడిపడతారనిగాని వూహించలేదు వినోద్‌.

అయితే నాయుడుగారు చాలా హుషారుగా వున్నారు. వినోద్‌ స్థానంలోని త్రివిక్రమ్‌ ప్రతిపాదించిన పంచసూత్ర పథకంతోబాటు సూచనలు, సలహాలు అన్నీ........... ఇంప్లిమెంట్‌ చేయటం జరిగింది. ఒక్క విశాఖ బ్రాంచిలోనే కాదు, హైదరాబాద్‌ మెయిన్‌ బ్రాంచ్‌తో బాటు రాష్ట్రంలోని తమ సన్‌ ఆటోమొబైల్స్‌ ఇతర బ్రాంచిల్లో కూడా అమలుపరచటం జరిగింది. అవి అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. సన్‌ ఆటో మొబైల్‌ స్పేర్‌పార్ట్స్‌కి సంబంధించిన పబ్లిసిటీ జనాన్ని ఆకర్షిస్తోంది. ఆటోరంగంలో ఇదే చర్చ సేల్స్‌ వూపు అందుకుంటున్నాయి.

ఆరంభమే శుభసూచకంగా కంపెనీగుర్రాలు ముందుకు పరుగెత్తటంగమనించగానే నాయుడుగారికి ఒకటే ఆనందం...

''నేనప్పుడే అనుకున్నాను, ఈ కుర్రాడు జెమ్‌, ఇతడిలో చదువేకాదు, క్రియేటివిటీ వుంది, వ్యాపారం పెంచగల సత్తావుంది, కంగారు జంతువని తీసిపడేసావ్‌, కాని తను బంగారం అని నిరూపించాడు చూడు'' అంటూ భార్య భాగ్యవతి ముందు గొప్పగా కూడా పొగిడాడు.

అయితే ఫోన్‌లో ఓసారి మాట్లాడి అభినందించాలంటే వినోద్‌ అందుబాటులో వుండటంలేదు. ఎంతగా ప్రయత్నించినా మిస్సవుతున్నాడు. అందుకే ఓసారి బ్రాంచ్‌ని విజిట్‌ చేసినట్టూ వుంటుంది. వినోద్‌ను అభినందించనట్టూ వుంటుంది, ఆపైన వినోద్‌, వరేణ్యల మధ్య రిలేషన్‌ ఎంతవరకు వచ్చింది? అమ్మాయికి అబ్బాయి నచ్చాడా? లేదా? స్వయంగా తెలుసుకోవచ్చనే ఆలోచనతోను, అందరినీ సర్‌ప్రైజ్‌్‌లో ముంచాలనీ సడెన్‌గా మార్నింగ్‌ ఫ్లయిట్‌కి వైజాగ్‌ వచ్చేసాడాయన.

టాక్సీ మాట్లాడుకుని బయలుదేరి వస్తున్నాడు. టాక్సీ సిటీలో జగదాంబ సెంటర్‌ను దాటుతుండగా సడెన్‌గా రోడ్‌సైట్‌లో ఒక సోడాబంక్‌ దగ్గర వున్న వినోద్‌ ఆయన కంటపడ్డాడు. అంతే

టాక్సీ ఆపించేసాడు.

''హలో వినోద్‌'' అంటూ మళ్ళీ పిలిచాడాయన.

ఎవరా అనుకుంటూ తిరిగి చూసాడు వినోద్‌.

అక్కడ టాక్సీ దిగుతూ కన్పించిన పెద్దమనిషిని చూడగానే తల మీద పిడుగుపడినట్టు ఉలికిపడ్డాడు. ఎంత కంగారు అంటే, అటునుంచి అటేపారిపోతే ఎలా వుంటుందాని దారులు వెదుక్కోబోయాడు, కాని అదిఅంత సులువు కాదని అర్థమైపోయింది. సాధారణ వ్యక్తిలా టాక్సీ దిగి తనవద్దకొచ్చేస్తున్నాడాయన.

ఉన్న టెంక్షన్లు చాలవన్నట్టు ఇదో కొత్త టెంక్షను.

క్రికెట్‌ మేచ్‌ చూస్తేగాని త్రివిక్రమ్‌ సీటు ఖాళీచేయడు. ఈ లోపలే గుట్టు బయటపడితే త్రివిక్రమ్‌తోబాటు తనూ బ్యాడ్‌ అయిపోతాడు. ఏం చేయాలి? అందుకే

వినోద్‌కి కాలూ చెయ్యి ఆడక నేలకు పాతిన గుంజలా అలాగే నిలబిపోయాడు.

''ఏమిటయ్యా వినోద్‌! పిలుస్తుంటే అలా దయ్యంపట్టినట్టు చూస్తావేమిటి?'' వస్తూనే పలకరించాడు సుధాకర్‌నాయుడు.

''అబ్బే..........దయ్యంకాదు సార్‌..........షా.....షా.........షాక్‌......జస్ట్‌ షాక్‌'' అన్నాడు తడబడుతూ వినోద్‌.

''షాకా..............నన్ను చూస్తే ఎందుకయ్యా అంత షాక్‌?''

''ఇక్కడ మిమ్మల్ని చూడగానే.........నేను వైజాగ్‌లో వున్నావో, హైదరాబాద్‌లో వున్నావో అర్ధంకాలేదు సార్‌,

కన్‌ఫ్యూజ్‌..........మీరు.............. మీరెప్పుడు వచ్చారు సార్‌?''

''ఇదే రావటం, ఏర్‌పోర్ట్‌నుంచి వస్తూ నిన్ను చూసి ఆగాను............... అవునూ...........ఇక్కడేం చేస్తున్నావ్‌?''

''వెయిట్‌ చేస్తున్నా సార్‌.''

''వెయిట్‌ చేస్తున్నావా..........నా కోసమా?''

''అవున్సార్‌..............అబ్బబ్బె.........నో సార్‌................. ఫ్రెండు, ఫ్రెండుకోసం.''

''భలే వాడివోయ్‌, ఇంత జీనియస్‌వయి వుండి, నీకీ తడబాటు, కంగారు ఏమిటో అర్ధంకాదు. నిన్నెలా అభినందించాలో తెలీటం లేదు...........''

''అదేం వద్దు సర్‌..........''

''అది నీ వినయం, కాని మేం అభింనందించటం ధర్మం. టాలెంట్‌ ఎక్కడ వున్నా నేను అభినందిస్తాను. నీ పంచసూత్ర ఇంప్లిమెంట్‌ చేసాక కంపెనీ గుర్రాలు జోరందుకున్నాయి. నీకు తెలుసా?''

''తెలుసు సార్‌............. సంతోషం సార్‌.''

''సంతోషం నాకయ్యా, నీవంటివాడు నా పక్కనున్నందుకు అయాం వెరీ హ్యాపీ, రావెళుతూ మాట్లాడుకుందాం. అవునూ, కారెక్కడ?''

ఏం చెప్పాలో తెలీదు వినోద్‌కి.

''వరేణ్య..............మేడం వరేణ్య తీసుకెళ్ళారు'' అనేసాడు.

''ఇంకా మేడం ఏమిటయ్యా బాబూ! అల్లుడ్ని చేసుకోవాలనుకుంటుంటేను. అవునూ. వరేణ్య ఏమంటోంది! తన సైడు కూడా ఓకేనా?'' కూపీ లాగుతున్నట్టుగా అడుగుతున్నాడాయన.

''నా సైడు డబుల్‌ ఓకెసార్‌.''

''నీ సైడు ఎలాగూ ఓకె నాకు తెలుసు, అమ్మాయి సంగతి చెప్పు.''

''ఇంచుమించు ఓకెసార్‌, కంపెనీ పనులతో బిజీగదా, ఇంకొంచెం టైం పడుతుంది.''

''అంటే........ తన మనసులో ఏముందో అమ్మాయి ఇంకా చెప్పలేదన్నమాట, ఒకె నేను కనుక్కుంటాలే. ఎక్కడ నీఫ్రెండు ఇంకా రాలేదు. టాక్సీలో వచ్చారా ఏమిటి?''

''కారు......... కారుంది సార్‌.............అతను వచ్చేస్తాడు. మీరు బయలుదేరండి, ఆఫీసులో కలుస్తాను.''

''ఓ.కె. త్వరగా వచ్చేయ్‌.''

కారువరకు వచ్చి ఆయన్ని సాగనంపాక అప్పుడు గుండెలమీద చేతులు వేసుకుని తేలిగ్గా నిట్టూర్చాడు వినోద్‌.

''హమ్మయ్య, గండం ఇక్కడ గడిచింది కాని అక్కడ పట్టుకుంటుంది. త్రివిక్రమ్‌ని జాగ్రత్తపడమని చెప్పాలి. లేదంటే అంతా యుద్దంగా మారిపోతుంది.

అనుకుంటూ దగ్గరలోని యస్‌.టి.డి బూత్‌లోకి పరుగెత్తి సన్‌ ఆటోమొబైల్స్‌ ఆఫీస్‌కి ఫోన్‌ కొట్టాడు.

త్రివిక్రమ్‌, వరేణ్యలు ఆఫీసు లిఫ్ట్‌లో అడుగుపెట్టారు.

అప్పటికే  లిఫ్ట్‌లో వుంది మేనేజరు కూతురు గుండుమల్లి మమత, త్రివిక్రమ్‌ని చూడగానే ఆ అమ్మాయి ముఖంలో పూచాయి బొండుమల్లెలు.

అది గమనించి ముఖం మాడ్చుకుంటూ, ఇద్దరిమధ్యకు వచ్చి నిలబడింది వరేణ్య.

అయినా వదల్లేదామె.

ముందుకు వంగి ముసిముసిగా నవ్వుతూ

''హాయ్‌ మన్మథా!'' అంటూ పలకరించింది.

ఆ పిలుపువిని, ఆ చేయి చూసి తేలు కుట్టినట్టు ఉలికిపడ్డాడు త్రివిక్రమ్‌.

అసలే తన టైం బాగాలేదు

వరేణ్యకు తనకు మధ్యన కోల్డ్‌వార్‌ నడుస్తోంది.

ఇప్పుడు అమ్మాయి వరస చూస్తే ఏదో కడపబాంబు తెచ్చి తమమధ్యన పగలగొట్టేలా వుంది. సింపుల్‌గా తప్పించుకునే మార్గం ఏమిటాని ఆలోచించి'' హలో మమతా బహెన్‌.........'' అన్నాడు బల్బులా మాడిపోయింది మమత ముఖం, ఆముదం తాగినట్టు ముఖంపెట్టి

''బహెనా......... ఛీఛీ............. చెలిమిచేసి చెలీ అని ఆశగా పిలుస్తావనుకున్నాను. ఇలా చెల్లాయిని చేయటం న్యాయమా మనోహరా?'' అనడిగింది వగలుపోతూ.

''అంత సీన్‌ లేదుకాని మమతాజీ, ఇలా ఓసారి మనోజ్‌ని ఒకసారి మన్మథా అని నాకు రకరకాల పేర్లు పెట్టే కార్యక్రమం ఆపెయ్‌. వినేవాళ్ళు నా అసలు పేరు మర్చిపోయే ప్రమాదం వుంది..............'' అంటూ సూచించాడు.

ఆమె భారంగా నిట్టూర్చింది.

''హుం అయితే నో వేకెన్సీ బోర్డు నీ మనసులో వేలాడుతోందన్న మాట నీ మనసు ఎవరికో ఇచ్చేసినట్టేగా? పోన్లే, నాకా అదృష్టం లేదనుకుంటాను ఇంతకీ ఆ లక్కీగర్ల్‌ ఎవరు?''

''ఎవరో ఓ రాక్షసి ఇక వదులుతావా?''

లిఫ్టుపైకి చేరుకోడంతో

అంతటితో ఆగిపోయిందా సంబాషణ.

తన ఛాంబర్‌లోకి వచ్చేసాడు త్రివిక్రమ్‌.

అతడి వెనకే లోనకొచ్చేసి తలుపు వేసేసింది వరేణ్య.

ఆమె కోపం చూసి కందగారుపడ్డాడు త్రివిక్రమ్‌.

''ఏయ్‌. ఏమైంది? ఎందుకంత కోపం?'' అనడిగాడు.

''ఏమీ కాలేదనుకుంటున్నావా? అసలేమనుకుంటున్నావ్‌ నువ్వు?'' అంటూ అతడ్ని బలంగా తోసేసింది.

ఆ విసురుకు సోఫాలో పడిపోయాడు.

''అయ్యబాబోయ్‌, నేనేమి అనుకోడంలేదు కొంచెం కోపం తగ్గించుకోకూడదూ? చూళ్ళేకపోతున్నాను'' రిక్వస్ట్‌ చేసాడు.

''నువ్వు చూడగలవ్‌. చెప్పు, నేనెలా వున్నాను?'' ఎదురుగా నిలబడుతూ దబాయించింది.

వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడతను. ఈ టైంలో ఏమన్న ఆమె మరింతగా వుడికిపోతుందని తెలుసు.

''అందమయిన అమ్మాయిలా వున్నావ్‌. దిగివచ్చిన రంభలా వున్నావ్‌ షోకేసులో బొమ్మలా వున్నావ్‌ చాలా ఇంకా చెప్పాలా?'' అన్నాడు

''రాక్షసిలా వున్నానా?''

''ఎవరా మాటంది? వాళ్ళ కళ్ళకి ఖచ్చితంగా చత్వారం వచ్చుండాలి.''

''నీకు చత్వాకం వుందా? నా అందం నీకు అందంగా కన్పించటం లేదా? రాక్షసినని ఎందుకన్నావ్‌?''

''ఇదేం అన్యాయం నేనెప్పుడన్నాను?''

''అబద్దం వేరేనా...........నిన్ను...........'' అంటూ కోపం పట్టలేక చేతికి దొరికిన ఫైలు అతడిమీదికి విసిరికొట్టింది.

లాఘవంగా ఫైలుపట్టుకొని పక్కన పెట్టాడు.

''ఇదిగో................కొట్టాలనుకుంటే ఎప్పుడన్నా చెప్పికొట్టు. అంతేగాని యిలా దొరికిన వాటిని విసిరికొడితే ఏమిటర్థం'' లేచి నిలబడుతూ బ్రతిమాలుకున్నాడు.

ఆ లక్కీగర్ల్‌ ఎవరని మమత అడిగిందా, లేదా?''

''అడిగింది''

''నా పేరెందుకు చెప్పలేదు నువ్వు........? పైగా ఎవరో ఓ రాక్షసి అన్నావా లేదా?''

''ఓ అదా.......... అన్నాను, కాని నిన్ను కాదు.''

''ఇంకెవర్నీ?''

''అబ్బా............. మమతనుంచి తప్పించుకోడానికి మాటవరసకన్నాను. దానికే యిలా ఫీలయితే ఎలా?''

''రేపు నానుంచి తప్పించుకోడానికి ఇలాగే మాటవరసకి ఏదో చెప్పి పారిపోతావా...........చెప్పు వినోద్‌.............. అదేమాట ఎవరన్నా నన్నడిగితే నా లవరు నా ప్రాణం. సర్వస్వం నువ్వే అని చెప్పేస్తాను. కాని నువ్వెందుకు చెప్పలేకపోతున్నావ్‌. చెప్పు? ఎందుకు?'' అంటూ ఇక ఆపుకోలేక అతడి ఛాతీని చేతులతో చుట్టేసి గుండెల్లో ముఖం దాచుకుంది.

తనకు తెలీయకుండా అతడి చేతులు ఆమె నడుంని చుట్టేసాయి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్