Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
patients

ఈ సంచికలో >> శీర్షికలు >>

విలువల వలువలు వలిచేస్తున్నారు - వి. రాజా

losing values

నానాటికీ విలువలు దిగజారిపోతున్నాయని వాపోవడం చాలా ఫ్యాషన్..అలవాటు అయిపోయింది. అలా అని వారు చెబుతున్నది అవాస్తవం అనడానికి లేదు. నిజంగానే విలువలు పతనమవుతున్నాయి. సాంకేతికత పెరగొచ్చు..అద్భుతాలు అరచేతిలోకే వచ్చేయచ్చు కానీ, విలువలు దిగజారడం అన్నది వాస్తవం. అయితే ఇక్కడ చిత్రమేమిటంటే, ప్రతి ఒక్కరూ తమ రంగం తప్ప ఎదుటి రంగం విలువలే దిగజారిపోతున్నాయని వాపోవడం.
అసలు, మనషి ఆలోచనలు ఎప్పుడైతే మారిపోవడం ప్రారంభించాయో అప్పటి నుంచే విలువలు క్షీణించడం ప్రారంభించాయి. తన ఆలోచనా విధానమే తనది కానీ, ఎదుటివాళ్ల ఆలోచనలకు గౌరవం ఇవ్వడం అన్నది ఎప్పడయితే తగ్గిపోయిందో, వినదగు నెవ్వరు చెప్పిన అన్న మాటను ఎప్పడైతే వినడం మానేసారో అప్పటి నుంచే విలువలు క్షీణించడం ప్రారంభించాయి.
విలువలు వంట పట్టడం అన్నది ఉగ్గుపాలతో ప్రారంభం కావాలి. కానీ అక్కడే బండి గాడి తప్పేస్తోంది. సుద్దులు చెప్పాల్సిన వారి బుద్దులే మారిపోతుంటే, పిల్లలు పెడతోవ పడుతున్నారు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జర్నలిజం అందునా సినిమా సమీక్షల్లో విలువలు పడిపోతున్నాయని, వస్తు విశ్లేషణ కాకుండా, వ్యక్తి విశ్లేషణ జరుగుతోందని తెగ బాధ పడ్డారు. దీన్ని వీలయినంత వివాదం చేయడానికి ప్రయత్నించారు. తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని వాపోయారు. అక్కడితో ఆగకుండా, ఆయన కూడా సామూహిక దూషణకు దిగారు. సినిమా సమీక్షలు రాసేవారికి అర్హతలు అక్కరలేదని, వాళ్లు కుక్కలనీ, కనీసం టీ అందించే ఉద్యోగాలకు కూడా పనికిరారని...ఇలా చాలా రకాలుగా.
నాకు ఆశ్చర్యం వేస్తుంది..ఎదుటివాడు విలువలు వదిలేసాడని చెప్పడానికి ఆయన తన విలువలు వదిలేసుకోవడం. పైగా సినిమా వాళ్లు విలువల గురించి మాట్లాడడం. ఇక్కడ సినిమా వాళ్లంటే వాళ్ల వ్యక్తిగత వ్యవహారం అని కాదు. సినిమాలు తీసే జనం అని నా ఉద్దేశం. ఈకాలంలో సినిమాలలో దిగజారినంతగా విలువలు మరే రంగంలోనూ దిగజారలేదన్నది వాస్తవం. నేను రామ్ గోపాల్ వర్మతో అన్నాను....'మీరు సినిమాలలోవాడే భాషను సమీక్షలలో జర్నలిస్టులు వాడితే సహించగలరా' అని. ' అంటే ' అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఉదాహరణకు...'నీ అబ్బ..నీ యెంకమ్మ.. జీ పగులుద్ది...ఇలాంటి పదాలన్నీ సినిమాల్లో చిత్తానికి వచ్చినట్లు వాడేస్తున్నారు. ఇప్పుడు సమీక్షల్లో...ఇలాంటి సినిమా మళ్లీ తీస్తే జీ పగులుద్ది....నీ యెంకమ్మ ఏం సినిమారా ఇది..నీ అబ్బ..నీకు సినిమా తీయడం వచ్చా...' ఇలా రాస్తే, సినిమా జనం సహించగలరా? మరి ఇది రీళ్లు రీళ్లుగా వాళ్లు వాడుతున్న భాషే కదా..ఇళ్లలో చిన్న పిల్లలకు టీవీల పుణ్యమా అని అలవాటు పడుతున్న పదాలే కదా?
అలా అని నేను సమీక్షల్లో విలువలు దిగజారడాన్ని సమర్థించడం లేదు. అసలు జర్నలిజంలోనే విలువలు మారిపోయాయి. ప్రింట్ నుంచి విజువల్ కు విజువల్ నుంచి వెబ్ కు మీడియా ప్రస్థానం సాగుతున్నప్పటి నుంచి ఇది తప్పని సరి అయింది. సినిమా సమీక్షల సంగతి పక్కన వుంచి అసలు వార్త, ను వాఖ్యను కలిపేసి రాయడం అన్నది కామన్ అయిపోయింది. విలువలకు కట్టుబడ్డామని చెప్పుకునే సోకాల్డ్ పెద్ద పత్రికలే తమ వ్యక్తిగత కక్షల కోసం వార్తలను, వాఖ్యలను కలిపేసి, తమ చిత్తానికి వండి వార్చడం అన్నది అలవాటైపోయింది. అదే శైలి ఇప్పుడు సమీక్షల్లో కూడా ప్రవేశించింది. సమీక్షను, అభిప్రాయాన్ని కలిపి రాయడం. నిజానికి రివ్యూ వేరు కామెంట్ వేరు. కానీ రివ్యూ రివ్యూగా రాస్తే చప్పగా వుంటుంది. అదే కామెంట్ జోడిస్తే మసాలా అద్దినట్లువుతుంది. పాఠకులు భలే రాసాడ్రా అంటారు. దాంతో జర్నలిస్టులు అదే తోవ పట్టారు. పోనీ పాఠకులను ఆకట్టుకోవడం కోసం ఇలా చేస్తున్నారు అనుకుందాం. అక్కడ కూడా పోటీ మొదలైంది..ఎవరు బాగా రాసారు అనే కన్నా, ఎవరు మసాలా బాగా అద్దారు అన్నది ప్రధానమైపోయింది.దాంతో మసాలా ఎక్కువై విషయం వికటిస్తోంది.
విలువలు అనేవి సామూహిక వ్యవహారం కాదు. ఎవరికి వారు గీసుకోవాల్సిన హద్దు..ఎవరికి వారు నేర్చుకోవాల్సిన, తమ తరువాత తరానికి నేర్పాల్సిన వైనం. ఆ భావన అందరిలోకి వస్తే, అనుకోకుండానే సామూహికంగా మార్పు ఇవాళ కాకున్నా రేపయినా సాధ్యమవుతుంది. లేదంటే, ఇంకా దిగజారుతాయి..అప్పుడు వివాదాలు వుండవు..గొంగళిలో తింటున్నాం..అని వెంట్రుకలు ఏరుకుంటూ పోవడం తప్ప.
వి.రాజా

మరిన్ని శీర్షికలు
Pyasa Book Review