Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
27th episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

  జరిగిన కథ :  త్రివిక్రం ను  వదల్లేకపోతుంది వరేణ్య. పోలీసు బ్రదర్స్ కంటబడతాడు త్రివిక్రం, వాళ్ళ దృష్టి మరల్చడానికి వినోద్ వన్, టూ, త్రీ అంటూ కన్ ఫ్యూజ్ చేస్తాడు.

అరె.........మన పోలీస్‌ బ్రదర్సూ'' హలో........'' అంటూ అప్పుడే వాళ్ళిద్దర్నీ చూసినట్టు పలకరించాడు వినోద్‌.

''మా వాడు మీ మీద మండిపపడుతున్నాడు. వాడి బుర్ర తినేస్తున్నారట. ఏమైంది సార్‌?'' అనడిగాడు.

''అది అర్ధంగాకే ఛస్తున్నాం వినోద్‌భాయ్‌. త్రివిక్రమ్‌ అని ఓ ఫోర్‌ ట్వంటీగాడి కోసం మేం వెదుకుతున్నామని చెప్పానా?'' ఎదురు ప్రశ్నించాడు భద్రం.

''అవునవును. మందుకొడుతూ చెప్పుకున్నాం కదూ......... ఏమైంది? దొరికాడా?'' ఆసక్తిగా అడిగాడు వినోద్‌.

''వాడు దొరక్క.............. నన్ను పట్టుకున్నారు'' విసుగ్గా అరిచాడు త్రివిక్రమ్‌.

''నా పేరు త్రివిక్రమ్‌ కాదురా బాబూ. వినోద్‌ నంబర్‌వన్‌ నా పేరు. వినోద్‌ నంబర్‌ టు, త్రీ, ఫోర్‌ అని ఇంకా ముగ్గురు వినోద్‌తమ్ముళ్లూ, డజనుమంది వినోద్‌ పేరున్న ఫ్రెండ్సు వున్నారంటే నమ్మటంలేదు. పైగా హోంమినిస్టర్‌ బామ్మర్దినీ, హెల్త్‌మినిస్టర్‌ మా బాబాయి, అలాంటి నన్ను చూపి నువ్వే జైలుపక్షివి. పారిపోయిన త్రివిక్రమ్‌వి మాతో పదమంటూ ఒకటే నస. పొమ్మన్రా, వీళ్ళిద్దర్నీ అర్జంటుగా ఇక్కడినుంచి పొమ్మను. లేకపోతే నా హాంకాంగ్‌ తమ్ముడు వినోద్‌ నంబర్‌ ఫోర్‌కి ఫోన్‌చేయాల్సి వుంటుంది.'' అంటూ ఆవేశంగా హెచ్చరించాడు త్రివిక్రమ్‌.

''మేం వచ్చింది ఇప్పుడు. ఇంకా టిఫిన్‌ కూడా చేయలేదు. కావాలంటే మీరే వెళ్ళిపొండి'' అనరిచాడు జుట్టు పీక్కుంటూ వీరభద్రం.

అంతే

త్రివిక్రమ్‌, వినోద్‌లు హోటల్లోంచి బయటికొచ్చేసారు. కొంత దూరంలోని సోడా బంక్‌ వద్దకెళ్ళి చెరో సిగరెట్‌ కొని ముట్టించుకున్నారు. అప్పటిగ్గాని తగ్గలేదు ఇద్దరికీ టెంక్షను.

''థాంక్‌గాడ్‌, ఎవరన్నా పెళ్ళికి కష్టపడతారు. బ్రతకటానికి కష్టపడతారు. ఈ భూప్రంచంలో క్రికెట్‌ మ్యాచ్‌ చూడ్డం కోసం కష్టపడే జీవిని నిన్నే చూస్తున్నాను. సమయానికి నేనూ వచ్చానుగాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళిద్దరు చేతిలో నువ్వు బుక్కయిపోయేవాడివి.'' అన్నాడు వినోద్‌.

''డోంట్‌వర్రీ, ఇంకెంత? రెండ్రోజులు ఓపికపడితే ఎవరి స్థానం లోకి వాళ్ళం వెళ్ళిపోతాం. ప్రాబ్లం సాల్వ్‌'' అంటూ పేలవంగా నవ్వాడు త్రివిక్రమ్‌.

''నాకు నువ్వు బదులుచెప్పాలి. అసలు నన్నేమనుకుంటోందా అమ్మాయి? నా ముఖం గుడ్లగూబలా వుందా? వరేణ్యచేత నువ్వే అలా చెప్పిస్తున్నావని డౌటుగా వుంది.''

''ఆ అవసరం నాకు లేదు భాయ్‌ నీ ముఖం ఆమెను ఆకర్షించకపోతే అది నా తప్పుకాదు.''

''ఇదేమన్నా అయస్కాంతమా ఆకర్షించటానికి? ఇంతకీ ఏమైంది నాయుడుగారు నిన్ను చూసారా?''

''లేదు. చాలా థాంక్స్‌ వినోద్‌! ముందే ఫోన్‌చేసావ్‌గాబట్టి గండం గడిచింది.''

''ఇప్పుడేం చేద్దాం?''

''టైంపాస్‌కి మార్నింగ్‌ షో బెటర్‌ కదూ?''

''బెస్ట్‌ అయిడియా.పద''

ఇద్దరూ ఆటో ఎక్కి వెళ్ళిపోయారు.

అదివారం వచ్చేలోపల

త్రివిక్రమ్‌కి క్షణం ఒక యుగంగా గడిచింది. హైదరాబాద్‌లో వుంటే ఫోన్‌లో వినోద్‌ టచ్‌ కావటంలేదని ఆయన అక్కడినుంచి ఇక్కడికి వచ్చాడు. కాని ఇక్కడికి వచ్చినా పరిస్థతిలో మార్పులేదు.

ఆ రోజు ఏర్‌పోర్ట్‌నుంచి వస్తుండగా దారిలో వినోద్‌ని చూసి టాక్సీదిగి మాట్లాడాడు. అంతే, ఆ తర్వాత తిరిగి ఈ మూడురోజుల్లో కలవలేదు, తను ఇలా వచ్చేలోగా అతను అలా వెళ్ళిపోయాడంటున్నారు. వినోద్‌, వరేణ్యలను ఒకేసారి చూసి మాట్లాడాలనుకున్నాడు అది అసాధ్యమైపోయింది. దాంతో నాయుడుగారికి తమ వెనుక ఏదో జరుగుతోందని చిన్న డౌట్‌కాని అది ఏమిటనేది అర్ధంకావటంలేదు.

 త్రివిక్రమ్‌ని తండ్రి ముందుకు తీసుకెళ్ళాలని వరేణ్య చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. సరేనంటూనే చివరిక్షణంలో మిస్సవుతుంటాడు. కారణం ఆమెకు అంతుబట్టదు. ఈలోపం......... అంటే శనివారం సాయంకాలం నాయుడుగారు ఒక సెంటర్‌లో వరేణ్య, త్రివిక్రమ్‌లను చూసేసారు.

వరేణ్య కారు నడుపుతోంది. అతను పక్కన కూర్చున్నాడు. మొదట అతన్ని వినోద్‌గా వూహించుకున్నాడు. కాని అతను కాదని వెంటనే గ్రహించాడు. ఆమె సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ గాబట్టి తను ఆఫీస్‌స్టాఫ్‌ కుర్రాడు ఎవరితోనో పనిమీద వెళుతుందనుకున్నాడు గాని అంతకుమించి ఎక్కువ వూహించలేకపోయాడాయన.

సరి ఇక ఆదివారం రానేవచ్చిది.

విశాఖ నగరమంతా క్రికెట్‌ ఫీవర్‌తో వూగిపోతోంది.

జిల్లానుంచే కాదు

ఇతర ప్రాంతాలనుంచి కూడా క్రికెట్‌ క్రీడాభిమానులు విపరీతంగా తరలివచ్చారు. దాంతో జనసందోహంతో నగరం కిటకిటలాడుతోంది. ఇక మేచ్‌ జరుగుతున్న స్టేడియంవద్ద అయితే ఇక చెప్పనక్కర్లేదు, జన  ప్రవాహం ............. సుమారు ముప్పైవేలకు పైగా జనంతో గేలరీలు కిటకిటలాడుతున్నాయి.

ఇచ్చిన మాటప్రకారం వరేణ్యను వెంటబెట్టుకుని మేచ్‌ చూడ్డానికొచ్చాడు త్రివిక్రమ్‌. కాని నిన్నటివరకు మేచ్‌మీద అతడికున్న ఉత్సాహం ఇప్పుడులేదు.

ఇంతవరకు ప్రేమ అంటే ఏమిటో తెలీని తనకు ప్రేమను రుచిచూపించింది వరేణ్య. ఈ పదిరోజులూ, మేచ్‌ చూడగానే తనువెళ్ళిపోవాలి. పాపం! తనమూలంగా అక్కడ జైలర్‌సాబ్‌ ఎంత టెంక్షన్‌లో వుంటారో వూహించుకోగలడు. తను వెళ్ళిపోవాలి. ఆ తర్వాత తనెవరో.........ఆమె ఎవరో......... ఆమె దృష్టిలో తనో మోసగాడిలా మిగిలిపోతాడు. తర్వాత....... వినోద్‌ను పెళ్ళిచేసుకుంటుంది, పిల్లలు, సంసారం.......... తనను మర్చిపోతుంది. ఏమైనా ఆమె సుఖసంతోషాలే తను కోరుకుంటాడు.

అందుకే

ఆమెను విడిచి తను వెళ్ళిపోవాల్సిన టైం దగ్గపడిందన్న ఆలోచనకే అతడి మనసంతా చేదుగా అయిపోయి, ఆటమీది హుషారు సన్నగిల్లింది. అయినా పక్కన వరేణ్య వుందిగాబట్టి మనసులోని బాధను బలవంతంగా అణచుకుని, ఆమెతోబాటు క్రికెట్‌ మేచ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు.

సాయంకాలం మూడుగంటల ప్రాంతం.

ఇక్కడ త్రివిక్రమ్‌, వరేణ్యతో స్టేడియంలో కూర్చుని క్రికెట్‌ చూస్తున్న అదే టైంలో అక్కడ హైదరాబాద్‌లో మేచ్‌ చూస్తున్నాడు జైలర్‌ ఆంజనేయులు. అదే విధంగా ఇక్కడ ఇంటిదగ్గర జయమ్మ వండిపెట్టిన వేడివేడి పకోడాతింటూ సుధాకర్‌నాయుడు కూడా టి.వి.లో మేచ్‌ చూస్తున్నాడు.

మరోపక్కన భద్రం, వీరభద్రంలు యిద్దరూ త్రివిక్రమ్‌ని గాలిస్తూ గాలరీలో తిరుగుతున్నారు.

ఈ పరిస్థితిలో

అక్కడ గ్రౌండ్‌లో ఇండియా బేటింగ్‌ జరుగుతోంది, మహేంద్రసింగ్‌ దోనీ సిక్సర్‌ కొట్టాడు. ఆ బంతి ఆకాశంలోంచి దూసుకొచ్చి సరిగ్గా త్రివిక్రమ్‌, వరేణ్యలు కూర్చున్నచోట పడింది బాల్‌ వెంబడే వీడియో కెమెరాలు కూడా వేగంగా అటు ఫోకస్‌ అయ్యాయి.

ఆ షాట్‌ని అనేక యాంగిల్స్‌లో రిపీట్‌చేసి టి.వి.లో రిప్లే చేయటంలో గేలరీలో కూర్చున్న త్రివిక్రమ్‌నిచూసి అక్కడ జైలర్‌ ఆంజనేయులు ఉలిక్కిపడ్డాడు. ఇక్కడ ఇంటిదగ్గర సుధాకర్‌ నాయుడు తన కూతురు వరేణ్య పక్కన వినోద్‌కి బదులు మరో యువకుడ్నిచూసి ఖంగుతిన్నాడు.

అక్కడి జైలర్‌ ఆంజనేయులు వెంటనే కానిస్టేబుల్‌ భద్రం సెల్‌కి ఫోన్‌ చేసాడు.

''యూ ఫూల్స్‌. ఏం చేస్తున్నారక్కడ? త్రివిక్రమ్‌ ఎవరో అమ్మాయితో గాలరీలో వున్నాడు. టి.వి.లో స్పష్టంగా చూసాను. అటు వెళ్ళండి, ఉన్నపళంగా లాక్కురండి'' అనరిచాడు.

''ఎక్కడ సార్‌! మేం స్టేడియం అంతా గాలిస్తున్నాం'' అనరిచాడు భద్రం.

''ఏడవలేకపోయారు. అక్కడ సన్‌ ఆటోమొబైల్స్‌ వాళ్ళ హోర్డింగ్‌వుంది చూడు. దాని తిన్నగా పైన నాలుగో వరసలో వున్నాడు. గో ఫాస్ట్‌.''

''ఇప్పుడే వెళుతున్నాం సార్‌.''

లైన్‌ కట్‌చేసి వీరభద్రంతో కలిసి ఆంజనేయులు చెప్పిన ప్రాంతంవైపు వేగంగా కదిలాడు భద్రం.

''ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా?'' త్రివిక్రమ్‌ చేయి అందుకుంటూ అడిగింది వరేణ్య.

''అదేం లేదు'' పొడిగా చెప్పాడు.

''కాని నీలో ఉత్సాహాంలేదు, నీ అభిమాన క్రికెటర్లని ప్రత్యక్షంగా చూడాలని అంతగా సరదాపడ్డావ్‌. అదంతా ఏమైంది?''

''మనం అభిమానించేవాళ్ళని వదిలిపోతుంటే బాధగానే ఉంటుంది.''

''ఎవరిని?''

'అదే......... ఆట ముగుస్తుంది. క్రికెటర్లని వదిలిపోతాంగదా.''

''లేదు........ నీ మనసులో ఏదో వుంచుకొని మాట్లాడుతున్నావు.''

''అదేం లేదు.''

అతడి చేయి తన చేతిలోకి తీసుకుంది వరేణ్య.

అంతలో గేలరీకి అడ్డంబడి తనువున్న దిశగా వస్తున్న భద్రం, వీరభద్రంలు అతని కంటపడ్డారు. నిజంగానే ఆట ముగిసింది తనవరకు, కానిస్టేబుళ్ళ ఇద్దరూ తనవద్దకు వచ్చేసరికి ఆగటం ఇష్టంలేదు అతడికి.

''ఇప్పుడే వస్తాను'' అంటూ మృదువుగా ఆమె చేయి విడిపించుకున్నాడు.''

''ఎక్కడికి?'' అడిగింది.

చిటికెనవేలు చూపించి అక్కడ్నుంచి అవతలకు వెళ్ళిపోయాడు.

అంతే................. అయిదు..............పది............. ఇరవై నిముషాలయింది. వెళ్ళిన త్రివిక్రమ్‌ రాలేదు. వరేణ్యకు డౌటు వచ్చేసింది.

ఆమె లేచి అటు ఇటు చూస్తుండగా ఎనిమిదేళ్ళ పాప ఆమె దగ్గర కొచ్చింది. అక్కా! నీ పేరు వరేణ్యా?'' అనడిగింది.

''అవును.......''

''ఆ అంకుల్‌ ఎవరో........... ఈ చీటి నీకిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు.''

'ఎంత సేపయింది.''

''చాలా సేపయింది.''

''ఇంతసేపు ఏం చేస్తున్నావ్‌?''

పాప మాట్లాడలేదు.

చీటియిచ్చి వెళ్ళిపోయింది.

కంగారుగా చీటివిప్పి చూసింది.

అందులో చాలా హడావిడిగా గీసినట్టున్నాయి అక్షరాలు.

వరేణ్య!

క్షమించు ...........మనసంతా నువ్వే, వున్నా, మనసు రాయి చేసుకుని వెళ్ళిపోతున్నాను. మధుర వెళ్ళిపోతున్నాను. తిరిగిరాను. నీ ప్రేమను పొందటానికి అదృష్టం వుండాలి. ఆ ఆదృష్టం నాకు దక్కటం సంతోషమేగాని, ఆ అర్హత నాకు లేకపోవటం దుదృష్టం. ఎందుకంటే, అనేకవిధాలుగా నేను నీకు తగను, నిజం చెప్పాలంటే నేను వినోద్‌ను కాను. విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకొని, ఆ పేరుతో నీలైఫ్‌లో ఈ కొద్దిరోజులు ఎంట్రీ యిచ్చాను. నువ్వు ఎవరిని చూసి గుడ్లగూబ ముఖం అని అసహ్యించుకొన్నావో అతడే ఒరిజినల్‌ కేండిడేట్‌ వినోద్‌. నేను కేవలం డూప్లికేట్‌ మాత్రమే. సో.............గుడ్‌బై నేస్తం. మరుజన్మంటూ వుంటే నీ ప్రేమను పొందటానికి అర్హత సంపాదించే ప్రయత్నం చేస్తాను. గుడ్‌బై నేను నేనుగా వెళ్ళిపోతున్న డూప్లికేట్‌ వినోద్‌.

కనీసం తన అసలు పేరు కూడా చెప్పకుండా, నాలుగు ముక్కలు రాసిపంపిన ఆ చీటి చూసి వరేణ్య హతాశురాలయిందంటే ఆశ్చర్యంలేదు. అతడు వినోద్‌ కానందుకు ఆమెకు బాధలేదు. అతను తనను వదిలివెళ్ళిపోతున్నాడంటేనే మనసు తట్టుకోలేకపోతుంది. దుఃఖం పొంగుకొస్తోంది.

క్షణం కూడా అక్కడ వుండలేకపోయింది.

త్రివిక్రమ్‌ని అన్వేషిస్తూ గేలరీనుంచి స్టేడియం బయటకువచ్చేసింది. కారు తీసుకొని వీధుల్లో పడింది. బస్టాండ్‌కెళ్ళి వెదికింది. రైల్వేస్టేషన్‌లో వెదికింది. అతను కనబడక పిచ్చిపట్టినట్టు కార్లో కూర్చుని చాలాసేపు ఏడ్చింది.

దగాపడిన మనసుతో దిగాలుపడి, పెల్లుబికే దుఃఖంతో ఆమె ఇంటికి చేరుకునేసరికి అక్కడ మరో సీన్‌ జరుగుతోంది.

పెంకుటింటి ఆవరణలో సుధాకర్‌నాయుడు, మేనేజరు మధుసూదనరావు కూర్చున్నారు. ఎదురుగా వినోద్‌ నిలబడున్నాడు. పక్కన కుర్చీవున్నా కూర్చునే సాహసం చేయటంలేదతడు. సుధాకర్‌నాయుడుగారి ముఖం చిటపటలాడుతోంది. అప్పటికే వినోద్‌ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడాయన.

''నీకు తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నావు..........? నాకు ఫోన్‌చేసి  ఎందుకు చెప్పలేదు?'' గద్దిస్తున్నాడు నాయుడు.

''క్రికెట్‌ మ్యాచ్‌ చూసి వెళ్ళిపోతానని అతను ప్రామిస్‌ చేసాడు సర్‌. పోయినవనుకున్న నా వస్తువులు నాకిచ్చేసాడు. జరిగింది మీకు చెప్పాను. తర్వాత మీ ఇష్టం.''

''అతను ఎక్కడ్నుంచి వచ్చాడు?''

''తెలీదు.''

''అతని పేరు? అసలు పేరు......''

''అది కూడా చెప్పలేదు సర్‌.''

''షిట్‌'' అంటూ నుదురు రుద్దుకున్నాడు నాయుడు.

వినోద్‌ తెలివి తక్కువవాడేమీకాదు.

త్రివిక్రమ్‌ పూర్తి వివరాలుచెప్తే అనవసరంగా రభస అవుతుందని అతని వివరాలు చెప్పకుండా దాచేసాడు.

సరిగ్గా ఈ చర్చ జరుగుతుండగా  వరేణ్య లోనకొచ్చింది. వినోద్‌ను చూడగానే ఆమె ముఖం వివర్ణమైంది. గబగబా అతని ముందుకెళ్ళింది.

''అతను వెళ్ళిపోయాడు. నీ ఫ్రెండేగా.......ఎక్కడుంటాడో నీకు తెలుసా?'' రుద్ద కంఠంతో అడిగింది.

'తెలీదు............అదే చెప్తున్నాను. అతని వివరాలు నాకు తెలీదు. జరిగిందేమిటంటే...?''

''వద్దు. ఏమీ చెప్పకు'' అంటూ దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ లోనకు వెళ్ళిపోయింది.

''సారీ సర్‌..... ఇలా ఎందుకు జరిగిందో అర్ధంగావటంలేదు. చెప్పినట్టే ఆ కుర్రాడు వెళ్ళిపోయినట్టున్నాడు.'' ''అందుకే అమ్మాయి ఒంటరిగా ఏడూస్తూ తిరిగి వచ్చింది........ అయినా మిస్టర్‌ వినోద్‌. కనీసం విషయం తెలీగానే నువ్వు నాతో అయినా ఏంజరిగిందోచెప్పి వుండొచ్చుగదా..........? జంటిల్‌మెన్‌గా మనమధ్య తిరిగినవాడు అందర్నీ పూల్స్‌చేసి, ఇంతమోసం చేసాడంటే నమ్మలేకపోతున్నాను. సరి, వాడు తిరిగివస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరెళ్ళండి'' అంటూ వాళ్ళిద్దర్నీ పంపించేసి లోనకొచ్చాడు సుధాకర్‌నాయుడు.

అతను వచ్చేసరికి

బెడ్‌రూంలో బెడ్‌మీద బోర్లాపడి

తల దిండులో ముఖం దాచుకుని, తనలోతనే కుమిలిపోతోంది వరేణ్య. బామ్మ జయమ్మ పక్కన కూర్చుని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది గాని, వరేణ్య పట్టించుకోవటంలేదు

కొడుకు లోనకు రావటం చూడగానే ఆమె కంగారుపడుతూ ''ఏమిట్రా..............నాకేం అర్ధంకావటంలేదు, ఏమిటిదంతా?'' అనడిగింది.

''నాకేం అర్ధంకాలేదు. నీకేం చెప్పను? అంతా ఈ ఫూల్‌ వినోద్‌ వల్లఏర్పడిన సంకటం...'' అంటూ నుదురు రుద్దుకుంటూ

సోఫాలోకూర్చున్నాడు.

''ఇది ఆ కుర్రాడ్ని గాఢంగా ప్రేమించింది. అందుకే తట్టుకోలేకపోతోంది'' లేచి ఇవతలకు వస్తూ చెప్పిందావిడ.

''అమ్మా..............నువ్వు కూడా ఏమిటి? అదంటే చిన్నపిల్ల, తెలీదు. వాడి మాయలోపడిపోయింది. వాడి గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలిసినా ఆ రాస్కెల్‌ అంతు చూసేవాడ్ని.

అక్కడకు అనుమానిస్తూనేవున్నాను. ప్చ్‌. పరిస్థితి చేయిదాటింది. అమ్మా వరేణ్య'' అంటూ కూతుర్ని పిలిచాడు.

ఆమె ఉలకలేదు పలకలేదు.

''చెప్పేది నీకే తల్లీ, ఏమిట్రా యిది. వాడు మోసగాడు, తెలిసిపోయిందిగదా. వాడ్ని అసహ్యించుకోవాలి'' నచ్చచెప్పబోయాడు.

ఆ మాట వింటూనే

తోకతొక్కిన త్రాచులా కస్సునలేచి కూర్చుని రోషంగా చూసింది తండ్రివంక.

''ఎలా డాడీ........అతనెలా మోసగాడు! ఏం మోసం చేసాడు..........?'' కన్నీళ్ళు కూడా తుడుచుకోకుండా తండ్రిని ఎదిరించింది.

తన కూతురు తన మాటను ఎదిరించి మాట్లాడుతోంది.

''ఓ మైగాడ్‌! చూసావా మమ్మీ నీ మనవరాలు నిర్వాకం? నన్నే ఎదిరిస్తోంది. ఇంత జరిగినా కూడా పారిపోయిన ఆ కుర్రాడ్ని వెనకేసుకొస్తోంది. ఏం మోసం చేసాడని అడుగుతుంది'' అంటూ కూతుర్ని ఏమీ అనలేక తల్లికి మొరపెట్టుకున్నాడాయన.    జయమ్మ సీరియస్‌గా చూసింది.

''అది అడగటంలో కూడా న్యాయం వుంది. బదులుచెప్పు.......''అంది.

''ఓ........... ఇక్కడ కూడా బలమైన ప్రతిపక్షం వుందన్నమాట. ఓ.కె. వినోద్‌కి బదులు ఆ స్తానంలోకి తను రావటం, అందర్నీ ఏమార్చటం ఇదంతా మోసం కాదా?'' అనడిగాడు.

''హాఁ.................ఏది డాడీ మోసం? స్వార్థంతో చేసింది మోసం. ఇందులో అతడు స్వార్ధంతో చేసింది ఏమీలేదు. పదిహేను రోజులు అతడు మన కంపెనీకి అందించిన సేవలకు ఒక్కపైసా కూడా జీతం తీసుకోకుండా వెళ్ళిపోయాడు.

అది మోసమా...........?

వినోద్‌నుంచి ఏం తీసుకున్నాడో అవన్నీ యిచ్చిపోయాడు. అది మోసమా? తుఫాను రాత్రి గెస్ట్‌హౌస్‌లో యిద్దరం ఒకేచోట వున్నా, నన్ను నన్నుగానే వుంచాడు దాన్ని మోసం అనాలా? సంస్కారం అనాలా?

కోట్ల ఆదాయానికి కంపెనీకి మార్గం చూపించి, వట్టిచేతులతోనే వెళ్ళిపోయాడు. అదికూడా మోసమేనా?'' అంటూ ఆవేశంగా మాట్లాడింది వరేణ్య

కాని ఆమె వాదనను సింపుల్‌గా కొట్టిపారేసాడాయన.

''నాటకం............. అంతా వట్టినాటకం. నీ వెనుక వున్న ఆస్థిని చూసి నిన్ను వల్లో వేసుకోవడానికి వేసిన ఎత్తుగడ'' అన్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
28th episode