Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
suddala ashok teja interview

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

భైరవద్వీపం కధానాయకుడు యువరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ. ఆ టైములో ఎ న్టీ ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అయినా చిన్నా, పెద్దా అందరితో కలిసిపోయే విధానం చూస్తే ఆయన్ని అభిమానించనివాడు మనిషి కాడు అనిపించేది నాకు. సినీ పరిశ్రమలో వ్యక్తులంటే వారి స్థాయితో సంభంధం లేకుండా బాలకృష్ణకి విపరీతమైన ప్రేమ, అభిమానం - అది ఈ రోజుకీ ఆయనలో చూస్తున్నాను. భైరవద్వీపం షూటింగ్ కెమ్మన్గుండి  అనే ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నాకు జ్వరం వస్తే పాలు, టాబ్లెట్లు ఇచ్చి నన్ను ఆయన రూంకి షిఫ్ట్ చేసిన మంచి వ్యక్తి. నేను డైరెక్టర్ అవుతానని చెప్పిన మొదటి పెద్ద హీరో.

పనిని ప్రేమించడం, కాల్షీట్ టైం ని క్రమశిక్షణతో గౌరవించడం, సహనంగా దర్శకుడికి సహకరించడం ఈ మూడు మంచి విషయాలు ఆయన్ని ఈరోజుకీ అగ్ర హీరోగా నిలబెట్టాయని నా అభిప్రాయం. ఆయనతో కలిసి నేను చూసిన సినిమాలు, ఆయన నాతొ చర్చించిన ప్రొఫెషనల్ విషయాలు ఎప్పటికీ నాకు గుర్తుండుపోయే పాఠాలు. కధా నాయిక రోజా - సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయినా కూడా తన స్వంత వ్యక్తిత్వాన్ని, స్టార్ హోదాని ఏ మాత్రం కలవనీకుండా వేరు వేరుగా చూడగలిగిన ప్రొఫెషనలిజం ఆమెది. భైరవద్వీపం సమయంలోనే ఆమెకి తన భర్త సెల్వమణి గారితో ప్రేమ, అలాగే సోదరులు నిర్మాతలుగా స్వంత సినిమా 'సమరం' నిర్మించడం, ఆర్ధికంగా భారీగా నష్టపోవటం, ఇన్ని జరుగుతున్నా ఇవన్నీ ఆమెతో రోజూ వర్క్ లో ఉన్న మేము కూడా బయట విన్నామే కానీ, ఆవిడలో అంగుళం అంత మార్పు కూడా సెట్లోనూ, మేకప్ రూములోనూ మేమెప్పుడూ చూడలేదు.

ఒకటే చిరునవ్వు - ఒకటే ఉత్సాహం

ఇవాల్టి హీరోయిన్లు లవర్ వస్తే కారవాన్ లో ఉండీ కూడా సెట్లోకి రాక షూటింగ్ లు కాన్సిల్ చేసిన సందర్భాలు బోలెడు.

రోజా గారితో, శ్రీ సింగీతం గారి డైరెక్షన్ లో భైరవద్వీపంతో పాటు శ్రీ కృష్ణార్జున విజయం అనే పౌరాణిక చిత్రానికి కూడా అసోసియేట్ గా వర్క్ చేసాను. అదే చందమామ విజయ కంబైన్స్ సంస్థలో  - ఆ మూడేళ్ళ కాలంలో రోజా మూడో వ్యక్తి గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడటం నేను చూడలేదు ..... వినలేదు.

సినిమా పరిశ్రమలో నడవడికకి నిలువెత్తు ఉదాహరణలు బాలకృష్ణ, రోజాలు - నా తొలి రెండు చిత్రాలు వీరితో కలిసి పనిచేసినందుకు ఎప్పుడూ చాలా ఆనందిస్తుంటాను నేను. కలుషితం లేని వాతావరణం లో నా సినీ ప్రస్థానం ప్రారంభమవ్వటం, సినిమా తప్ప వేరే వ్యాపకం, ఆలోచన లేని వ్యక్తులతో సహవాసం నాకు పరిశ్రమ లో బలమైన పునాది. అది నా అదృష్టం ... పూర్వ జన్మ సుకృతం.

మరిన్ని సినిమా కబుర్లు
raja music muchchatlu