Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka!

ఈ సంచికలో >> సినిమా >>

'ఔచిత్యం పాటించక పోవడమే కవికి ఔచిత్యం' - సుద్దాల అశోక్ తేజ

suddala ashok teja interview

తండ్రి ప్రజాకవి... కొడుకు సినీ గీత రచయిత ... ఇద్దరూ ప్రజల జీవితాలలోకి వెళ్ళినవారే.
ఒకరు జాతికి అంకితమైతే... ఇంకొకరు జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్నారు.
ఒకరు ప్రజల కోసం విప్లవ మార్గం నాదంటే.. ఇంకొకరు ప్రజల కోసం అన్ని మార్గాలూ నావేనన్నారు
మార్గాలు వేరైనా ఆ ఇద్దరు 'సార్' లూ - పాట బాటసారులే
వారే సుద్దాల హనుమంతు , సుద్దాల అశోక్ తేజ

సుద్దాల అశోక్ తేజ అనగానే ... ఉత్తేజ్ మేనమామ ... తద్వారా తనికెళ్ళ భరణి ఈయన పాటలు విని ఉత్తేజితుడవ్వడం .. ఆయన వల్ల 'నమస్తే అన్న' లో పాట రాసే అవకాశం రావడం.. ఆ తర్వాత పాటలు రాసే అవకాశం కోసం చదువురాని నిర్మాతలతో 'టెన్త్ క్లాసైనా పాసయ్యావా ?' లాంటి అవమానాలు పడడం.. రేకుల షెడ్డులో కాపురం ... సైకిల్ మీద ప్రయాణం... లాంటి పళ్ళ బిగువన బిగించిన కష్టాలూ ..., 'ఠాగూర్' సినిమాలో 'అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచిన ఓ రుద్రుడా - అగ్నిశిఖలను గుండెలోన అణచిన ఓ సూర్యుడా' అని రాసిన తర్వాత వినిపిస్తోంటే "చూడు అశోక్ ... నా చేతి మీద రోమాలు ఎలా నిక్కబొడుచుకుంటున్నాయో " అంటూ చిరంజీవి తన మోచేతిని చూపించడం ... లాంటి మధురానుభూతులూ  .... అదే పాటకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి - జాతీయ అవార్డును అందుకున్న 3వ తెలుగు సినీ కవిగా గౌరవాలు, సత్కారాలు, సన్మానాలు ... ఇవన్నీ ఎన్నెన్నో ఇంటర్ వ్యూల ద్వారా అందరికీ తెలిసిన విషయాలే.

ఇవి కాక మరికొన్నిటిని ప్రస్తావిస్తూ అశోక్ తేజ మనసులోని మాటలను తెలిపే ప్రయత్నమే ఈ ఇంటర్ వ్యూ :

"మొదట ఇది చెప్పండి. మీ మీద పడిన ముద్ర  ని మీరే ఎలా బ్రేక్ చేసుకున్నారు?"
" నేను వచ్చిన కొత్తలో ప్రజా ఉద్యమ చిత్రాలకు, సమస్యాత్మక చిత్రాలకు మిగిలిన కమర్షియల్ చిత్రాల్లాగనే మంచి ఆదరణ వుండేది. అలా దాసరి నారాయణ రావు గారి దగ్గర ఒసేయ్ రాములమ్మా, కంటే కూతుర్నే కను; కృష్ణ గారి సినిమా ఎన్ కౌంటర్; మోహన్ బాబు గారి అడవిలో అన్న, శ్రీరాములయ్య నా మీద ఒక ముద్ర వేసిన మాట నిజమే. అదే సమయంలో రాఘవేంద్ర రావు గారి 'రాజకుమారుడు' లో 'రామ సక్కనోడమ్మ సందమామ' పాట, కృష్ణవంశీ  గారి 'నిన్నే పెళ్ళాడుతా' లో అట్లతద్ది పాట (నా మొగుడు రాంప్యారీ) ప్రేక్షకులకు, పరిశ్రమకు నన్ను మరో కోణంలో పరిచయం చేశాయి .  పరిచయం అయినప్పటి  నుంచి ఇప్పటి వరకు తాము తీసే ప్రతి సినిమాలోను నా చేత పాట రాయించిన వాళ్ళలో దాసరి నారాయణ రావు గారి తర్వాత మోహన్ బాబు గారే.  మోహన్ బాబు గారు ఆయన సినిమాలకు మాత్రమే కాదు వాళ్ళబ్బాయిల సినిమాలక్కూడా నా చేత రాయించారు ... ఆ సీరీస్ లోనే -  'లాలి పాడుతున్నదీ గాలీ' , "ఏం సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ లాంటి పాటలు చాలా రాయించేరు"

"ఈ పాట మంచు మనోజ్ కి లైఫ్ టైమ్ సాంగయిపోయినట్టుంది ...?"
"ఆ మాట మోహన్ బాబు గారే అనడంతో నాకు చాలా సంతోషం కలిగింది. ఆ పాట రాయడానికి ముందు రాఘవేంద్ర రావు గారు పిలిచి 'మనోజ్ కి ఓ హిట్ సాంగ్ పడాలి. అది నీ పల్లె వాళ్ళు వాడుకునే పదాల్తో వుండాలి' అన్నారు.. 'సరే'నని ఆలోచిస్తూ పడుకున్నాను. తెల్లవారు జామున 'పాట రాసేరా అంకుల్ ?' అని మనోజ్ అడుగుతున్నట్టు అనిపించింది. అతని రూపం, సొట్ట బుగ్గలు గుర్తొచ్చాయి. వెంటనే రాసేశాను. ' ఏం సక్కగున్నవ్ రో నా సొట్ట బుగ్గలోడ' అని కూడా రాయొచ్చు. అది పల్లె వాళ్ళ భాషలా వుండదు. సెంపలోడ అనడంతో  ఆ అందం వచ్చింది."

"రాఘవేంద్రరావు గారు కూడా మీతో మంచి మంచి కమర్షియల్ హిట్స్ రాయించినట్టున్నారు?"
"అవునండీ ... 'రాజకుమారుడు' తర్వాత 'ఒకటో నంబరు కుర్రాడు' లో 'నెమలీ కన్నోడ - నమిలే సూపోడ - కమిలీ పోకుండా తాకాలిరో ' పాట చాలా పెద్ద హిట్టు. అలాగే ఏయన్నార్, సుమంత్  నటించిన 'పెళ్ళిసంబంధం' లో 'ఆచ్చీ బుచ్చీ ఆటలకు రావే లచ్చీ' అనే మంచి పాట రాయించారు. ఇవి గాక భక్తిరస చిత్రాల్లో కూడా రాయించారు. 'శ్రీ రామదాసు' లో 'ఏటయ్యిందే గోదారమ్మ' పాట, 'షిరిడి సాయి' లో 'ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు' పాట - ఇవన్నీ నాకున్న ముద్ర నుంచి తప్పించి అన్ని పాటలూ రాయగలడన్న ముద్రని ఇచ్చినవే"

"మీరా పాట గుర్తు చేస్తే మిమ్మల్ని ఎప్పట్నుంచో అడుగుదామనుకుంటున్న ప్రశ్నొకటి గుర్తొచ్చింది. ఆ సినిమాలో షిరిడీ  సాయి చేత  'భవిష్యత్తులో గాంధీ పుడతాడు - అతని ద్వారా స్వాతంత్ర్యం వస్తుంది'  అని చెప్పించారు. బావుంది. ప్రస్థుతం నాసా రిపోర్ట్ ల ప్రకారం ఖగోళంలో ఎన్నో సూర్య గ్రహాలు, ఎన్నోచంద్ర గ్రహాలు వున్నాయని బైటపడింది. గాంధీ గురించి, స్వాతంత్ర్యం గురించి చెప్పే భవిష్య  జ్టానం కలిగిన సాయి కి 'ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ' అనే పల్లవిని రాయడం ఎంతవరకు  సబబు?"
"ఇది నిజంగా చాలా మంచి ప్రశ్న ... గొప్ప ప్రశ్న .. మనకున్న విజ్టానం వేరు.   కానీ, మనం చెప్పాలనుకున్నది  ప్రజల్లోకి వెళ్ళాలంటే మొదట వాళ్ళు మనని ఓన్ చేసుకోవాలి . అలా ఓన్ చేసుకోవాలంటే వాళ్ళకు తెలిసిన దార్లోనే మనం వెళ్ళాల్సివుంటుంది.
వియత్నాం కమ్యూనిస్ట్  నాయకుడు హోచ్చిమన్ దేవుణ్ణి నమ్మడు. కానీ ప్రజల్ని ఒక ఉద్యమానికి రప్పించే ప్రయత్నంలో అతను చర్చ్ కి వెళ్ళాడు. మసీదుకి వెళ్ళాడు. అలా వెళ్ళడం వల్ల అతన్ని ప్రజలు నమ్మారు.

నక్సల్ బరీ వెంకటాపు సత్యం మాష్టారు గిరిజనుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. వారు తినే  తిండి తిన్నాడు. వాళ్ళ చుట్టలు కాల్చాడు. వారి భాష నేర్చుకున్నాడు. దాంతో వాళ్ళూ ఆయన్ని ఓన్ చేసుకున్నారు. అతను ఉద్యమకారుడైనప్పుడు అతని వెంట నడిచారు.
మా నాన్న సుద్దాల హనుమంతు టైమ్ లో గ్రాంధిక భాష చలామణీ లో వుండేది. గొల్లవాళ్ళు చెప్పే ఒగ్గు కథల నుంచి, బుర్ర కథల మూల రూపమైన శారదాకారుల భాష నుంచి ప్రజల భాషని గ్రహించి ప్రజల భాషలో చెప్పాడు.

ప్రజల్ని మన వైపు తిప్పుకునే ప్రయత్నంలో నమ్మకం పని చేసినంత బలంగా తర్కం పనిచేయదు. 'వేలాది సూర్యగోళాలున్నా కనిపించే సూర్యుడొక్కడే'  అని కూడా రాయొచ్చు. కానీ అది ప్రజల గుండెల్లోకి 'ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవదేవుడు'  అని వెళ్ళినంత బలంగా వెళ్ళదు.

వీటన్నిటినీ చదివాను, చూశాను కనుక రాస్తున్నప్పుడు కూడా ఇలా రాస్తేనే జనానికి పడుతుంది అని రాశాను. అదీ గాక ' ప్రియమ్ భూయాత్' అన్నారు పెద్దలు. అంటే ప్రియంగా వుండేట్టు చెప్పాలి అని అర్ధం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి - పోయెట్రీ  కెనాట్ బి పోస్ట్ మార్టమ్డ్... ఇదెందుకు చెబుతున్నానంటే మనం 'పుట్టేదొకటే - చచ్చేదొకటే' అని అంటాం. ఇది అందరికీ అర్ధమయ్యే విషయం . నిజానికి చనిపోయిన తర్వాత కూడా కొన్ని జీవకణాలు బ్రతికేవుంటాయి. ఆ శవాన్ని గనుక ఓ పెట్టెలో పెట్టి వుంచితే వెంట్రుకలూ పెరుగుతాయి, గోళ్ళూ పెరుగుతాయి. ఇది తర్కానికి నిలబడే విజ్ఞానం. కానీ నమ్మకం వేరుగా వుంటుంది . అది 'పుట్టేదొకటే - చచ్చేదొకటే' అనే ప్రాచుర్యంలో వున్న మాటనే నమ్ముతుంది. 'భద్రాచలం' సినిమాలో  'ఒకటే జననం - ఒకటే మరణం ' అనే పాట పల్లవి రాస్తున్నప్పుడు కూడా తర్కమా - నమ్మకమా అనే అలోచించాను. ఎందుకంటే ఒకటే మరణం కాదు కాబట్టి. జీవ కణాలు పూర్తిగా మరణిస్తేనే అది పూర్తి మరణం. కానీ నమ్మకానికే ఓటు వేశాను. అది చాలా బలమైనది. ఎంత వరకైనా నడిపిస్తుంది. అందుకే అన్నాను పోయెట్రీ కెనాట్ బి పోస్ట్ మార్టమ్డ్ అని".

"అది కరక్టేననుకోండి.... ఔచిత్యం సంగతేమిటి? అది పాటించాల్సిన అవసరం లేదంటారా? కేవలం నమ్మకాలకి విలువనిచ్చేస్తే చాలంటారా?"
"ఒక్కొక్క సారి ఔచిత్యం పాటించక పోవడమే కవికి ఔచిత్యం. ఎందుకంటే 'ప్రయోగ శరణం వ్యాకరణం' కనుక. 'గ్యాంగ్  రేప్' అనే సినిమాలోని ఓ పాటలో 'నరకుక్కలు' అనే మాట వాడేను. "నర కుక్కలు' అని అసలు వాడొచ్చా ... అది దుష్ట సమాసం కదా ? అనుభూతి చెందేవారి హృదయంలోకి చొచ్చుకుపోవడమే ఇక్కడ ముఖ్యోద్దేశం. 'నర కుక్కలు' అనే మాట వాడడం వల్ల కసి, బాధ యొక్క సాంద్రత తెలుస్తుంది. అంతెందుకు ... నారాయణ రెడ్డి గారు 'భలే మంచి రోజు పసందైన రోజు' అని రాశారు. 'మంచి' ని, 'రోజు' ని కలపొచ్చా ? 'రోజు' అనే పదం హిందీ లోని 'రోజ్' లోచి వచ్చింది కాదా ? ఇక్కడ అనుభూతి ప్రధానం అయింది కదా ?"

"అంతే మరి .. 'రక్త కన్నీరు' , అగ్నిపూలు' పదాలు వాడుక ద్వారా పాప్యులర్ అయిపోయినవేగా? ఓసారి ఆత్రేయ గారి తో బూతు గురించి ఇంటర్ వ్యూ చేస్తుంటే 'అగ్నిపూలు కంటే బూతు పదం ఎక్కడైనా వుందిరా అసలు? (ఆయన నాతో చనువుగా 'ఏరా'' అంటూనే మాట్లాడేవారు) ఫో .. పోయి యద్దనపూడి సులోచనారాణిని ఇంటర్వ్యూ చెయ్... తనేమందో చెప్పాకే నీతో మాట్లాడతా... వెళ్ళు' అని కసిరారు"

"అదే ఆత్రేయ గారు 'వెంకటేశ్వర మహత్మ్యం' లోని 'ఎవరో తానెవరో' పాటలో "కబురు' అనే పదం వాడేసిన తర్వాత తెగ బాధ పడిపోయారు - అది 'ఖబర్' అనే ఉర్దూ పదం నుంచి వచ్చింది కదాని. అప్పుడు మహానుభావుడు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు 'నువ్వు తప్పేం చెయ్యలేదులే...  వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్ళాడాడుగా, కాబట్టి ఆ కాలంలో ఆ పదాలు వున్నట్టే'  అని ఓదార్చిన తర్వాత గాని మనశ్శాంతి కలగలేదుట ఆత్రేయ గారికి.  అలాంటి అనుభవమే నాకు 'పాండురంగడు' సినిమాలో 'మాతృదేవోభవా అన్న సూక్తి మరిచాను'  అనే పాటలో ఎదురయ్యింది. ఇదీ రాఘవేంద్రరావు గారి చిత్రమే. 'అమ్మకు బ్రహ్మకు  మధ్యన నాన్నేగా నిచ్చెన' లాంటి మంచి వాక్యాన్ని రాసిన నేనే 'కడుపు తీపినే హేళన చేసిన జులాయి ని' అని  రాశాను . మరి 'జులాయ్' మన పదం కాదుగా |? అప్పుడు ఆత్రేయ గారి ఆ అనుభవమే గుర్తుకు తెచ్చుకుని నన్ను నేను ఓదార్చుకున్నాను"

"చాలా మందికి తెలిసినా ఇంకెంతో మందికి తెలియాల్సిన విషయం కనుక ఓసారి మళ్ళీ గుర్తుచేసుకుందాం. 'లైలా మజ్ఞు ' లో లైలా (భానుమతి) 'కొర నోములు నోచినానేమో' అని పాడుతుంది. ఇది విని ఒకాయన - ఆ పాటను రాసిన సీనియర్ సముద్రాల గారిని 'లైలా నోములు కూడా నోచుకుంటుందా గురువు గారూ !?" అని అడిగాట్ట. దానికాయన 'లైలా తెలుగు మాట్లాడగా లేనిది నోములు నోచుకుంటే వచ్చిన నష్టం ఏంటి?" జవాబిచ్చారట."

"నేను చెప్పేదీ అదే ... అక్కడ అది ఔచిత్య భంగం కాదు. తక్కువ పూజలు చేసుకుంటే బాధలు అనుభవించాల్సి వస్తుంది అని ప్రజల్లో గల నమ్మకానికి తగ్గట్టు నోము అని వాడేరు అని అనుకోవచ్చు. చాలా సార్లు  తెలిసే వాడడం జరుగుతుంది. అది చెప్పడానికే ఇన్ని ఉదాహరణలు."

"ఇలా మాట్లాడుకుంటూ పోతే వన్ ఇయర్ కి సరిపడా  టీవీ ఎపిసోడ్లు చేసెయ్యెచ్చేమో మనం ..."
"కచ్చితంగా"

"సరే మరి ... మాకు ఉపయోగ పడే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.... శ్రోతలకి , ప్రేక్షకులకీ మంచి మంచి పాటలిచ్చారు. మీకు ఇంతటి సంస్కారవంతమైన జన్మని ఇచ్చిన మీ తలిదండ్రులకు మీరేం  ఇచ్చారు?"
"మా తలిదండ్రుల పేరిట 'సుద్దాల హనుమంతు - జానకమ్మ జానపద కళాపీఠం' ని 2010 లో స్టార్ట్ చేశాను. 2010 లో బి.నరసింగరావు గారికి, 2011 లో గద్దర్ గారికి, 2012 లో తీజన్ బాయ్ కి అవార్డులిచ్చాం. తీజన్ బాయ్ ఎవరో తెలుసా ? పాండవుల కథని గిరిజనుల భాషలో ప్రచారం చేసిన లంబాడీ వనిత. చత్తీస్ గడ్ ప్రాంతానికి చెందినావిడ. ఈమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ కూడా ఇచ్చి గౌరవించింది.
 'అమ్మ ఒడి పండగ' అని ప్రతి సంవత్సరం  జనవరి నుంచి డిసెంబర్ లోపల సంతానవతులైన తల్లులకు, పుట్టిన పిల్లలకు బట్టలు పెట్టి ఊరందరి చేతా సన్మానం చేయించి వచ్చిన వారందరికీ భోజనాలు పెడుతున్నాం. ఈ అమ్మ ఒడి పండగ ఇప్పటిదాకా - సుద్దాల, పల్లె పహాడ్, బ్రాహ్మణపల్లి లో చేశాం. ఈ రెండు కార్యక్రమాలూ ప్రతి ఏటా జరుగుతాయి. ఇందుకు నా సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెడుతూంటాను. ఇందువల్ల పల్లెల్లో ఒకరంటే ఒకరికి అనురక్తి కలుగుతుంది. మానవ సంబంధాలు మెరుగుపడతాయి. మనిషి జన్మ ఎత్తినందుకు , అంతటి మహానీయుల కడుపున పుట్టినందుకు ఇది కనీస ధర్మం అనుకుంటున్నాను"

రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam