Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

రెండవ భాగం

Second Part

"అదే - మున్నలూరు గ్రామం నడిబొడ్డున ఒక రామాలయం ఉంది. అది అన్నపూర్ణేశ్వరి పూర్వీకులు కట్టించిన గుడి. అద్భుతమైన ఆలయం అనుకో. ఆలయ నిర్వహణ బాధ్యత ఇప్పటికీ ఆవిడదే. శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిపిస్తుంది. సీతారాముల కళ్యాన మహోత్సవం చూసి తీరాల్సిందే. పైగా అన్నదాన కార్యక్రమంలో చిన్న లోటు కూడా రాకుండా జరిపిస్తుంది. గత సంవత్సరం కళ్యాణ మహోత్సవానికి నేనే పౌరోహిత్యం వహించాను. సంతృప్తికరమైన సంభావనలు ముట్టాయి.

ఇంతకీ అసలు విషయం ఏమంటే,  వారం క్రితంకి నేను పనిమీద వెళ్ళినప్పుడు అన్నపూర్ణేశ్వరిగారి ఇంటికి వెళ్ళాను. మాటల సంధర్భంలో నీ గురించి చెప్పాను. నీ పేరు ఎవరో చెప్పగా విందట, ఏలూరు రామశాస్త్రులు నీ మేనమావా నాయనా అంటూ ఆశ్చర్యపోయారు. నువ్వు పౌరోహిత్యంలో దిట్టవేననీ, అలాగే జాతకచక్రాలు చూసే  జ్యోతిష్య పండితుడవనీ కూడా ఆమె విన్నదట. ఇంకేముందీ... సీతారాముల కళ్యాణ  మహోత్సవానికి ఎలాగూ ముగ్గురు పురోహితుల్ని పిలుస్తున్నాం గదా, ఈసారి నీతోబాటు రామశాస్త్రులు గారిని తీసుకురావలసిందేనంటూ పట్టుబట్టారామె. అందుకే నిన్ను ప్రత్యేకించి పిలిపించాను."అంటూ వివరించాడు శంకుశాస్త్రి.

కొంచెం అసంతృప్తిగా చూసారు రామశాస్త్రులుగారు.

"అంతా బాగానే వుందిగానీ శంకుశాస్త్రీ ! ఇంతకీ అన్నపూర్ణేశ్వరి గారి ఫ్యామిలి విషయాలు పూర్తిగా చెప్పలేదు నువ్వు" అనడిగారు.

"అక్కడికే వస్తున్నాను మావయ్యా. అన్నపూర్ణేశ్వరికి ముగ్గురు సంతానం అని చెప్పుకున్నం కదా...! పెద్దకొడుకు పేరు రామలింగేశ్వరరావు. ఆయన భార్య పేరు మహాలక్ష్మి. అన్యోన్య దాంపత్యం. కొడుకు గానీ, కోడలు గానీ ఈ రోజుకీ అన్నపూర్ణేశ్వరి మాట జవదాటరు. అగ్రికల్చర్ బి.ఎ.గోల్డ్ మెడలిస్ట్ ఆయన. ప్రస్తుతం తమ వ్యవసాయ అభివృద్ధిలో తల్లికి కుడిభుజం ఆ కొడుకు.

"అలాగా... మరి రెండో కొడుకు సంగతేమిటి.."?

"రెండో కొడుకు గోపాల్ అని చెప్పాను కదా. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ. ప్రస్తుతం అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో స్థిరపడిన గొప్ప డాక్టర్. "అమ్మా ! నేను డాక్టర్ చదవాలనుకుంటున్నాను" అని అడిగినందుకు కొడుకును డాక్టర్ని చేసిందా తల్లి.  అతను అమెరికాలో స్థిరపడి తల్లికిచ్చిన మాట నిలబెట్టుకుని వూరికి దేశానికి పేరు తెచ్చాడు. డాక్టర్ గోపాల్ గారి భార్య పేరు సత్యవతి. సుగుణవతి. డిగ్రీ వరకు చదివినా ఏ వ్యాపకం లేకుండా భర్తకు తగ్గ భార్యగా, ఇంటి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. అమెరికాలో ఉంటున్నా కూడా భార్యాభర్తలిద్దరికీ అన్నపూర్ణేశ్వరి అంటే ఎంతో భయం, మర్యాద. దూరంగా వున్నామన్న బాధ తెలియకుండా వారంలో మూడుసార్లయినా ఇంటర్నెట్ వీడియో ఫోన్ లో కొడుకు, కోడలుతో ఒకర్నొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు.

కంచికచర్ల మండలంలో ఎవరన్నా అమెరికా  వెళ్తున్నారంటే చాలు, వాళ్ళ చేత బలవంతంగానైనా ఒప్పించి మరీ అరిసెలు, బూరెలు, కరప్పూసని, పచ్చళ్ళని, ఇలా రకరకాల సంప్రదాయ వంటకాలను అమెరికాలోని కొడుకు కుటుంబం కోసం పంపిస్తుందావిడ. అటువంటి డాక్టర్ దంపతులకు అబ్బాయి, అమ్మాయి సంతానం. అన్న రామలింగేశ్వరరావు దంపతులకు లేటుగా పిల్లలు పుడితే...ఈ గోపాల్ కు ఎర్లీ గానే పిల్లలు పుట్టారు. కొడుకు పేరు అనంత్ సాయి. వయసు ఇరవై మూడు. డెట్రాయిట్ లోనే  మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. కూతురు పేరు సాయి శివాని. వయసు ఇరవయి ఒక్కటి. అమ్మాయి కూడా అన్నతోపాటు మేనేజ్మెంత్ చదువుతుంది. ఇక చెప్పుకోవలసింది భ్రమరాంబ గురించి. ఈవిడ అన్నపూర్ణేశ్వరి గారి ఆఖరి సంతానం. ఆవిడ భర్త పేరు రఘునాథ్. వీరిదీ అదే వూరు. పైగా అన్నపూర్ణేశ్వరి గారి పక్కిల్లే. కూతురు ఎప్పుడూ తన కళ్ళముందే తిరుగుతూ ఉండాలని దగ్గర సంబంధం చేసిందావిడ. రఘునాథ్ కూడా శ్రీరామచంద్రుడిలా   సుగుణాల రాముడు. భ్రమరాంబ, రఘునాథ్ లది కూడా అన్యోన్య దాంపత్యం. భార్యాభర్తలు వుండేది పక్క ఇంట్లోనే అయినా అన్నపూర్ణేశ్వరి గారి ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

ఈ దంపతులకు కూడా ఇద్దరే సంతానం. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు నవీన్ వయసు ఇరవై నాలుగు. కుర్రాడు బుద్దిమంతుడు. ఎం.ఏ. చదువుతున్నాడు. కూతురు పేరు మహేశ్వరి. అంతా మహీ అని పిలుస్తారు. చాలా హుషారైన అమ్మాయి. బి.కాం. చదువుతోంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ నందిగామ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నారు. అలా పెద్ద కొడుకు, కోడలు వాళ్ళ పిల్లలు అంతా ఒకే ఉమ్మడి కుటుంబంలా కలసి మెలసి ఉంటూ, సుఖంగా ఉంటున్నారు. రెండో కొడుకు డాక్టర్ గోపాల్ కుటుంబం విదేశం లో  ఉన్నందుకు అన్నపూర్ణేశ్వరికి కాస్త బాధగా ఉన్నా, తరచూ వీడియో కాంఫరెన్స్ లో కొడుకు కుటుంబంతో మాట్లాడుతూనే వుంది కాబట్టి ఈ దిగులు కూడా లేదావిడకు.

ఇదీ మామయ్యా ఆ కుంటుంబ విశేషాలు. ఒంటి చేత్తో సంసారాన్ని లాక్కొచ్చి, బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసిందంటే ఆవిడ కృషిని అభినందించాలి. తల్లి తమకోసం పడిన కష్టం, తపన ఏమిటో బిడ్డలకు తెలుసు కాబట్టే, ఆమె మనసు నొప్పించే ఏ పనీ వాళ్ళు చేయరు.

"రేపు ఉదయం మనం రేవు దాటి మున్నలూరు వెళుతున్నాం. రంగ రంగ వైభవంగా జరిగే సీతారాం కళ్యాణ మహోత్సవంలో మనకు సంభావనలకు లోటుండదు. నీ జ్యోతిష్య పాండిత్యంతో అన్నపూర్ణేశ్వరి గారిని మెప్పించగలిగితే కానుకలకు కొదువే ఉండదు." అంటూ మేనమామకు సవివరంగా తెలియజెప్పాడు శంకు శాస్త్రి.

ఆ వివరాలు విన్న తర్వాత... తానూ మున్నలూరు గ్రామాన్ని వీక్షించాలన్న కోరిక రామశాస్త్రులు గారిలో బాగా పెరిగింది.

మేనమామ, మేనల్లుళ్ళయిన రామశాస్త్రులు, శంకుశాస్ర్తి ఇద్దరూ ఉదయం ఆరు గంటలకి ఇంట్లో కాఫీ తాగి మున్నలూరుకు ప్రయాణమయ్యారు. అమరేశ్వరాలయాన్ని ఆనుకొని వున్న కృష్ణానదీ రేవులోకి వచ్చేసరికి లాంచి ఒకటి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అప్పటికే లాంచిలో చాలామంది ప్రయాణీకులున్నారు. ఇద్దరూ లాంచీ ఎక్కి కూర్చున్నారు.

ఎగువన ఎక్కడో వర్షాలు పడుతున్నాయని వార్తా పత్రికల్లో రాసారు. అందుకే కాబోలు నదిలో  నీటి మట్టం పెరిగింది. ఉల్లాసం కలిగిస్తున్న ఆ ఉదయపు వాతావరణంలో డగ డగమంటూ ఇంజన్ శబ్దంతో లాంచీ బయలుదేరింది. నీటిని చీల్చుకుంటూ ఆవలి తీరంవైపు ప్రయాణం ఆరంభించింది.

"మామయ్యా,...మన ప్రాంతాల్లో ఉప్పుటేరు మీద తప్పితే మరెక్కడా లాంచీలు కనపడవు. కదూ..?" దారిలో అడిగాడు శంకుశాస్త్రి.

"ఎందుక్కనబడవురా? రాజమండ్రి వెళితే గోదావరి మీద భేషుగ్గా కనబడతాయి. నీకు తెలీదు గానీ శంకు శాస్త్రి మా చిన్నతనంలో జల మార్గం ఎంత సఖ్యంగా ఉండేదో తెలుసా? ఇంచుమించుగా పెద్ద కాలువలన్నిటా లాంచీలు, రహదారి పడవలు, సరుకు నావలు తిరిగేవి. తక్కువ ఖర్చుతో ప్రయాణాలకు, సరకు రవాణాకు అనుకూలంగా వుండేది. కాకినాడ నుండి చెన్నయ్ నగరం వరకు బంకింగ్ హాం కెనాల్ వెంట రవాణా జరిగేదంతే నమ్ముతావా...? పాలకులు, నీటిపారుదల శాఖ, మన ప్రభుత్వాలు జలమార్గాల్ని పూర్తిగా అశ్రద్ధ చేసారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. పూర్తిగా బస్సులు, రైళ్ళ మీద ఆధార పడడంతో ప్రయాణాలు తలకు మించిన భారంగా పరిణమించాయి." అంటూ భారంగా నిట్టూర్చాడు రామశాస్త్రులు.

"అయితే మామయ్యా! మనజలమార్గాల్ని అభివృద్ధి పరచే అవకాశాలే లేవంటావా?" ఆసక్తిగా అడిగాడు శంకుశాస్త్రి. "అప్పుడెప్పుడో ఏర్పడ్డ తుపానుకు పూడుకుపోయిన బకింగ్ హాం కెనాల్ ను పూడిక తీసి అభివృద్ధి చేయాలంటే రెండొందల కోట్లు ఖర్చవుతుందట. ఆ లెక్కన రాష్ట్రంలోని ప్రధాన జలమార్గాల్లోని కాలువల్ని బాగుచేసి రవాణాకు అనుకూలంగా మార్చాలంటే కొన్నివేల కోట్లు ఖర్చవుతుంది. వేసిన రోడ్డు సంవత్సరం తిరక్కముందే  శిధిలమైనా పట్టించుకునే నాధుడు లేడు. అవినీతి, లంచగొండితనంతో కంపు కొడుతున్న నేటి వ్యవస్థలో షోయింగ్ కున్న ప్రాధాన్యత నాణ్యతకు ఇవ్వడంలేదు. రోడ్ల పరిస్థితే ఇలాగుంటే ఇక కాలువల గురించి పట్టించుకునేదెవరు? ఇరిగేషనంటే వ్యవసాయానికి నీరందించడం వరకేగానీ, జల మార్గాల కోసం కాదనే అభిప్రాయంతో పూర్తిగా కాలువల్ని విస్మరించారు. ఫలితంగా ఈరోజు ఏళ్ళతరబడి పూడిక తీయక ఎన్నో కాలువలు లోతు తగ్గిపోయాయి.  ఫలితంగ కొద్దిపాటి వర్షానిక్కూడా గట్టు గండ్లు పడి నీరు వూళ్ళమీదకు వస్తోంది. బహుశ మన రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జలరవాణా మార్గాల్ని మనతరం వాళ్ళు చూడలేదనుకుంటా" అన్నాడు బాధగా రామాశాస్త్రులు.

ముందుగా రేవుకు దగ్గరలోనే వున్న సంగమేశ్వరుడ్ని దర్శనం చేసుకుని తర్వాత ఇద్దరూ మున్నలూరు వీధుల్లో ప్రవేశించారు.

ఊరంతా చక్కగా పండగ వాతావరణం నెలకొని ఉంది. ప్రతి ఇల్లూ  శోభాయమానంగా అలంకరించారు. ఇళ్ళముందు రంగవల్లికలు కనువిందు చేస్తున్నాయి. ఇళ్ళల్లో బంధుమిత్రుల సందడి కనిపిస్తోంది.ఊరి మధ్యలోని రామాలయం వద్దనుండి మైకులో లవకుశ సినిమాలోని పాటలు వినిపిస్తున్నాయి. వీధుల్లో నూతన వస్త్రాలతో పిల్లల ఉత్సాహపూరితమైన పరుగులు, ముచ్చటేస్తొంది. మేనల్లుడు చెబుతున్న కబుర్లు విశేషాలు వింటూ అతడితోబాటే రామాలయం వీధిలోకి ప్రవేశించాడు రామశాస్త్రులు. కన్నుల పండువుగా దర్శనమిస్తోంది రామాలయం.

చక్కటి శిల్ప సంపదతో కూడిన ఎత్తయిన ఆలయం. ఆలయాన్ని చుట్టివున్న ఖాళీ స్థలం వెంట తాటాకు చలువ పందిళ్ళు వెలిసాయి. తొమ్మిదిన్నర గంటలకి సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఆ వేడుకలో అనేకమంది స్త్రీ, పురుషులు పందిళ్ళ కింద పనులు చేస్తూ సిద్ధంగా ఉన్నారు. వివాహ వేదికను పూలతో అద్భుతంగా అలంకరించారు.

ఒక పక్క బెల్లం తరిగి, యాలకులు, మిరియాల పొడి కలిపి పానకం చేయడంలో కొందరు తీరిక లేకుండా వుంటే, మరోచెంత వంటవాళ్ళు, గ్రామ మహిళలు అన్నదాన కార్యక్రమానికి వంటకాలు తయారించడంలో బిజీగా ఉన్నారు. వూరు మొత్తానికి ఇవాళ రామాలయం వద్ద భోజనాలు. వచ్చిన వారు, వీరని లేకుండా భోజన సమయనికి ఎవరు వచ్చినా భోజనం వడ్డించాల్సిందే.. ఇదంతా ఒక ఎత్తయితే...

ఇక వివాహ వేడుకలకి కళ్యాణ వేదికచెంత పసుపు, తమలపాకులు, అక్షింతలతో సహా ఏదీ లోటు రాకుండా ముందుగానే అనీ సిద్ధం చేస్తూ వివాహ మండపం దగ్గర కొందరి హడావుడి కనిపిస్తోంది. మరోవంక ఆలయంలో దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య తక్కువేమీ కాదు. ఇక ఈ వేడుకల మధ్య ముసిముసి నవ్వులతో , పట్టు దుస్తుల్లో చెంగుచెంగున తిరిగే అమ్మాయిలు, వాళ్ళని ఆటపట్టిస్తూ కొంటె చేష్టలు చేస్తున్న వరసయిన సరదా కుర్రాళ్ళ సరసాలకూ తక్కువ లేదు. అలా కళకళ లాడుతున్న కళ్యాణ మంటపం వద్దకు శంకుశాస్త్రి, రామశాస్త్రులు చేరుకునేసరికి సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలు సమయం.

"ఏరా శంకుశాస్త్రీ! నువ్వు చెప్పిన ఆ అన్నపూర్ణేశ్వరి గారి గారి జాడ లేదేమిటి? ఇంట్లో ఉన్నారంటావ? ఇల్లెంత దూరం? ఓసారి ఇంటికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకొని వద్దామా?" అంటూ అడిగాడు రాంశాస్త్రులు.

ఇంతలోనే......

"ఇదిగో శంకం ! నీకసలు బుద్ధుందటయ్యా" అంటూ కంచు గంటలా ఎవరో స్త్రీమూర్తి కంఠం వినబడి మావా అల్లుళ్ళు ఖంగు తిన్నారు.

"మావయ్యా! ఆవిడ ఇక్కడే వున్నారు. ఇటే వస్తున్నారు." అంటూ రామశాస్త్రుల్ని హెచ్చరించి ఆ గొంతు వింపించిన వైపు చూసాడు శంకుశాస్త్రి.

అప్పటికే ఇద్దర్నీ సమీపించేసింది అన్నపూర్ణేశ్వరీదేవి.

డెబ్బై దాటిన వయసులో కూడా జబ్బపుష్టితో ఆరోగ్యంగా అలనాటి సినిమా గయ్యళి సూర్యకాంతం ను తలపించేలా వున్నా, చూడగానే నమస్కరించాలనిపించే  ఒక ప్రత్యేక ఆకర్షణతో వెలిగిపోతున్న అన్నపూర్ణేశ్వరిని చూస్తూ తనకు తెలియకుండానే  "అమ్మా! నమస్కారం" అన్నాడు రామశాస్త్రులు.

"నువ్వాగవయ్యా! ఏమయా శంకం! అడుగుతోంది నిన్నే, ఇప్పుడా రావడం? వస్తూనే శంకుశాస్త్రిని నిలదీసిందావిడ.

"అమ్మా!నా పేరు శంఖం కాదు, శంకుశాస్త్రి" గుర్తుచేశాడు.

"అయితే ఏమిటి? నేను శంఖం అనే పిలుస్తాను. పలకవా? నీకు చెప్పిందేమిటి? నువ్వు చేసిందేమిటి నీసాటి బ్రాహ్మడేగా? దూరంగా వున్న కంచికచర్ల నుంచి చీకటితోనె వచ్చి చేరుకుని ఇక్కడి ఏర్పాట్లు చూస్తున్నాడు. ఏరు దాటి ఇవతలికి వూడిపడ్డానికి నీకు తెల్లారి ఎనిమిది అయింది. ఇదేన పద్ధతి? ఇక్కడి పనులన్నీ ఎవరు చూస్తారనుకున్నావ్? ఆమె వాగ్ధాటికి భయపడుతూ "అమ్మా క్షమించాలి. ఇంటికి బంధువులొస్తే కాస్త ఆలస్యం సహజమే కదా! మీకు చెప్పటమ్ మరిచాను. ఇదో! వీరు మా మావయ్య రామశాస్త్రులుగారు. ఏలూరు నుంచి పిలిపించాను. మీరు చెప్పారని. ఇవాళ్ ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుంటారు. అంటూ మేనమామని ముందుకు తోసి పరిచయం చేసాడు శంకు శాస్త్రి

అతని పాచిక పారింది."భలే వాడివయ్యా శంఖం! ఆమాట చెప్పవే! నమస్తే రామశాస్త్రులు గారూ!" అంటూ ముఖం నిండా నవ్వులు పులుముకుంటూ నమస్కరించిందావిడ.

"అయ్యయ్యో! అమ్మా! మీరు పెద్ద వారు. మాకు మీ ఆశీస్సులు కావాలి. నమస్కారాలు కాదు. మీగురించి మావాడు అంతా చెప్పాడు. మీ దర్శనం కోసమే పనులన్నీ వదులుకొని వచ్చాను."అన్నాడు.

"అయ్యో! ఇక్కడ మాత్రం పనులు లేవా ఏమిటి శాస్త్రులు గారూ మీరు జాతకాలు కూడా చెప్తారని ఇంతకుముందే మీగురించి విన్నాను.మీరు మా శంకుశాస్త్రికి మేనమామ కావడం శాస్త్రి అదృష్టం. ఈ సంవత్సరం ఇక్కడి కార్యక్రమమంతా మీ చేతుల మీదుగా జరిపించండి. ఏలోటూ రాకూడదు. ఈ హడావుడి పూర్తయ్యాక మీరు మా ఇంటికి రావాలి. మా పిల్లల జాతకాలు చూడాలి.

"ఎంతమాట తల్లీ! తప్పకుండా వస్తాను. మీరిక నిశ్చింతగా వుండండి. మేము అంతా చూసుకుంటాంగా" అంటూ భరోసా ఇచ్చాడు రామశాస్త్రులు.

అన్నపూర్ణేశ్వరి శంకుశాస్త్రి వంక చూసింది. అతను కంగారు పడ్డాడు.

"ఇంకా ఇక్కడే వున్నావేమిటి శంఖం! మావయ్యను కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళి అక్కడి ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో చూడు. అయ్యా శాస్త్రులు గారూ ! శంఖం మా అబ్బాయి లాంటి వాడు. అందుకే చనువుకొద్దీ కోప్పడుతుంటాను. మీరేమీ అనుకోకండి" అందామె.

"అనుకోవడం కాదమ్మా! వీడికి బద్ధకం వదిలేల నాలుగు తిట్టండి సంతోషిస్తాను..లేజీ ఫెలో!" అంటూ నవ్వేసారు రామశాస్త్రులు.

"మావయ్యా! అంటూ అతన్ని మండపంలోకి లాక్కుపోయాడు  శంకుశాస్త్రి.

వాళ్ళటు వెళ్ళగానే తను గుడివెనక తట్టున ఏర్పాటు చేసిన వంటశాల వైపు గునగునా అడుగులేసింది అన్నపూర్ణేశ్వరి.

ఇక్కడ అక్కడ అని లేకుండా.. ఉదయం నుంచి బొంగరంలా ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోటుపాట్లను సమీక్షిస్తూ బిజీగా ఉందావిడ. ఆలయ కమిటీకి చెందిన సభ్యులు కొందరు ఆమెకు సాయంగా వున్నారు. ఆమె చెప్పింది చెప్పినట్టుగా చేయడం వాళ్ల డ్యూటీ.

శ్రీరామ నవమి వేడుకలు ఊళ్లో ఘనంగా జరిపిస్తారని వూళ్లోనే కాదు కంచకచర్ల మండలంలోనే అందరికీ తెలిసిన విషయం. నవమి తొమ్మిది రోజులూ రాత్రిళ్లు హరికథలు, బుర్ర కథలు, పౌరాణిక నాటకాలు, వీధి భాగవతం ఇలా రోజుకొకటి చొప్పున మన జానపద కళా రూపాల ప్రదర్శన ఉంటుంది. ఇవాళ కూడా ఆఖరి రోజు కాబట్టి రాత్రిని తెనాలి వారిచే గయోపాఖ్యానం నాటక ప్రదర్శన ఉంటుంది.

ఇంత ఘనంగా జరుగుతాయి కాబట్టే... సంక్రాంతికి రాకపోయినా శ్రీరామనవమికి మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న చుట్టాలు, పక్కాలు అంతా గ్రామానికి వస్తారు. వంటశాలవైపు పోతున్న అన్నపూర్ణేశ్వరికి కొంచెం దూరంలో మనవరాలు మహేశ్వరి కనిపించింది. కూతురు భ్రమరాంబ గారాలపట్టి మహెశ్వరి. బి.కాం. చదువుతున్నా పట్టులంగా, ఓణీలే ధరిస్తుంది. సింపుల్ గా పంజాబీ డ్రస్సులు వేసుకుందామన్నా భయమే అమ్మమ్మ తిడుతుందని. లంగా, ఓణేలో ముద్దమందారంలా ముద్దొస్తున్న మనవరాలిని, ఆమె పొడవాటి వాలు జడని చూసి మురిసిపోయింది అన్నపూర్ణేశ్వరి.

మహేశ్వరితోపాటు కొందరు అమ్మాయిలున్నారు. వాళ్లల్లో చాలామంది గ్రామానికి చెందిన ఇతర ప్రాంత నగరాల్లో నివసిస్తున్న వారి సంతానం. ఒకమ్మాయి జీన్స్, టీషర్ట్ లో ఉంటే మరో అమ్మాయి స్కర్తు, స్లీవ్లెస్ జాకుట్. మరోపిల్ల పంజాబీ డ్రస్సు, ఇంకోపిల్ల జుత్తు కత్తిరించుకొని వంటికి అంటుకుపోయె టైట్ డ్రస్ లో ఉంది.

సాంప్రదాయంగా ఉండే ఫ్యాషన్లంటేనే అన్నపూర్ణెశ్వరికి నచ్చుతుంది. లేటెస్ట్ ఫ్యాషన్ అనీ, ట్రెండ్ అనీ, స్టయిల్ అనీ చెప్పి ధరించే పిచ్చి పిచ్చి డ్రస్సులంటే ఆవిడకు వళ్లు మంట.

''ఏయ్! మహీ! ఇలారావే'' అంటూ మనవాల్ని పిలిచింది.

''అమ్మమ్మా! '' అంటూ లేడిపిల్లలా పరుగెత్తుకు వచ్చింది మహేశ్వరి.

''ఏంచేస్తున్నావిక్కడ?'' అడిగింది.

( ...తరువాయి భాగం వచ్చేవారం)

మరిన్ని సీరియల్స్
nalla susheela - vamshee