Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Second Part

ఈ సంచికలో >> సీరియల్స్

నల్ల సుశీల - వంశీ

nalla susheela - vamshee

భూషణం పెట్రోమాక్స్ లైటు పట్టుకుని నడుస్తున్నాడు అడవిలో. వెనకాలే వెళుతోంది నల్ల సుశీల.
చీకటి చిక్కగా అలుముకుపోయి వుంది.
సుళ్ళు తిరుగుతూ వీస్తోంది కొండగాలి.
చుక్కలతో నిండిపోయి వుంది ఆకాశం.
నడుస్తున్న సుశీల కాళ్ళ మధ్యలోంచి నాగుపాము ఒకటి జరజరా పాక్కుంటూ వెళ్ళేసరికి టక్కున ఆగిపోయింది. ముందెళుతున్న భూషణం వెనక్కి తిరిగి, "ఆగిపోయావేం, రా!" అన్నాడు.
"పద!" నడవడం మొదలెట్టింది.
"ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ దొరగారు మన కోసం చూస్తూ వుంటాడు. ఆయనగారికి కోపం చాలా ఎక్కువట," గొణుక్కున్నాడు భూషణం.
నలభై రెండో నంబరు టన్నెల్ దగ్గర ఎర్రదీపం ఆరగానే పచ్చదీపం వెలిగింది. గూడ్సు శిమిలిగూడా స్టేషన్ వదిలేసినట్టుంది.
కొంతదూరం నడిచారు. రైలుపట్టాలు దాటుతున్నప్పుడు కుడికాలి బొటనవేలుకి కలకర్రాయి గట్టిగా తగిలేసరికి, "అమ్మా!" అని ముందుకి వంగింది. సరిగ్గా అప్పుడే ఆమె మెళ్ళో ఉన్న పెద్ద పెద్ద మంగళ సూత్రాలు కిందికి వేలాడి ఊగాయి.
ఆగిన భూషణం, "మళ్ళీ ఏమైంది?" అన్నాడు.
"గొప్పు తగిలింది!"
వెనక్కొచ్చి పెట్రోమాక్సు లైటు కింద పెట్టేసరికి దాని కాంతిలో కనిపించింది చిట్లి కారుతున్న రక్తం.
"అయ్యయ్యో! చాలా పెద్ద దెబ్బ...! తొందరగా పద! ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళాక ఏదన్నా మందు అడుగుదాం," అన్నాడు.
కుంటుతూ అతని కూడా నడుస్తున్న సుశీల ఇప్పుడు బాగా పాడైపోయింది కానీ చాలా అందగత్తె. ఒకప్పుడు సన్నగా, పొడుగ్గా నీలం రంగులో వుండేది. చూపుడు వేలంత సన్నటి ముక్కు. దాని చివర మెరిసే ఎర్రరంగు ముక్కుపుడక. కాళ్ళకి మువ్వల పట్టాలు పెట్టుకునేది. నడుస్తుంటే లయనిబట్టి గాలికొండాపురంలో ఎవరన్నా సరే, 'ఆ వెళ్ళే మనిషి నల్ల సుశీల కదూ?' అనేవారు.
వాళ్ళమ్మ చినముత్యానికి సుశీలంటే ప్రాణం. తన కాలికిలా దెబ్బతగిలిందని తెలిస్తే ఈ భూషణంగాడి ప్రాణాలు తీసేస్తది. చిన్నప్పట్నుంచీ ముద్దుగా పెంచుకుంది. అరికాళ్ళ కింద పావుకోళ్ళలాగ సుశీలని అంటి పెట్టుకుని ఉంది. నల్ల సుశీలకి సపోటా పళ్ళంటే మహా ఇష్టం. వాటిని ఒలిచి పాలల్లో వేసి పెడుతుంది. విమానపసందు మామిడి పళ్ళు ఇష్టంగా తింటుందని సంతలోకెళ్ళి మేలైన పళ్ళని తనే ఏరి తెస్తుంది. జీడిపప్పులో పంచదార కలిపి పెడుతుంది. పొద్దుటే గేదె పొదుగుల దగ్గర తనే కూర్చుని పితికిన పాలు పరగడుపునే ఇస్తుంది. సుశీల కట్టని పట్టుబట్టగానీ, వాడని మేలురకం అత్తరుగానీ లేవు.
 

శీతాకాలం... శోభనం గది పువ్వులతో అలంకరించి వుంది. కట్ట అగరొత్తులూ ఒకేసారి వెలిగించెయ్యడంతో ఎటు చూసినా పొగ. ఎవరో పరుపు మీద పిటాపురం సెంటుబుడ్డి ఒలకబోసేసారు. దాని సువాసనతో గదంతా నిండిపోయింది.
పందిరిపట్టి మంచం అంచు మీద కూర్చున్న సుశీలకి ఆయన లొపలికొచ్చాక ఎలా మసులుకోవాలో వాళ్ళమ్మ చెప్పినవన్నీ గుర్తుకు వస్తున్నాయి.
కాస్సేపయింది...
తలుపు తెరుచుకుని లోపలికి వచ్చిన వల్లూరి మోహనరావు కాళ్ళకి నమస్కారం చేసి లేచింది.
ఆమె అందాన్నే చూస్తూ నిలబడ్డ మోహనరావు, "నువ్వు అమృతం తాగావు." అన్నాడు.
"అవును! మీరు పాలు తాగండి." అందించింది గ్లాసు.
"ఇందాకే విస్కీ తాగాను మరి!" అన్నాడు.
తల్లి చెప్పినట్టు అతనికి సర్వవిధాలా సహకరించింది.
ఆరోజు తర్వాతి నించీ ప్రతి రాత్రీ ఇంటి ముందాగే అతని బుల్లెట్ బండి శబ్దం కోసం ఎదురుచూసేది. కొన్నాళ్ళు తనతో గడిపిన అతను ఈ మధ్య ఇటుపక్కకి రావడం మానేసాడు. సుశీల మాత్రం అతని బండి శబ్దం కోసం ఎదురుచూస్తూనే వుంది.
నల్ల సుశీలకి ఒక కొత్త కోరిక పుట్టిందప్పుడు.
తనకో బిడ్డ పుట్టాలి.
వాడు తెల్లగా, బొద్దుగా, ముద్దోచ్చేలాగుండాలి. కాంతులు నిండిన కళ్ళతో కళకళలాడిపోతూ వుండాలి.
అందమైన పేరు పెట్టాలి వాడికి.
అన్నప్రాసన రోజు చుట్టూ ఉన్న వస్తువుల్లో కౌజారూనే ముట్టుకోవాలి వాడు.
కొన్నాళ్ళు గడిచింది.
వల్లూరి మోహనరావు బుల్లెట్ బండి మసీదు సెంటర్ కి అవతల వీధిలో వుండే రుక్మిణి చెల్లిలి ఇంటి ముందు ఆగడం మొదలెట్టిందిప్పుడు. అది తెలిసిన సుశీల ఒక రాత్రి లాంతరుతో బయల్దేరబోతుంటే ఆపేసిన చినముత్యం, "ఎక్కడికీ?" అంది.
"ఆయన దగ్గరకి. అడగడానికి..."
"ఏమని అడుగుతావ్?"
"మన ఇంటికి రాకుండా ఈ ఇంట్లో ఏం చేస్తున్నారని?"
"దుర్గమ్మ గుడి వీధిలో రాజ్యం చెల్లెలు నాని తెల్సు కదా!"
"తెలిస్తే?"
"ముందు నాని దగ్గరుండే మనిషి నీ దగ్గరికి రావడం మొదలెట్టాడు. అప్పుడు ఆ నాని మనింటికి వచ్చి అడగలేదుగదా... ఏ గొడవా పడ్లేదు కదా?"
"అంటే ఇప్పుడేమంటావమ్మా?"
"ఏం లేదు. పెళ్ళి చేసుకున్నవాడికీ, కన్నెరికం చేసుకున్నవాడికీ తేడా చెపుతున్నాను."
"అప్పడు నాకు పెళ్ళి ఎందుకు చెయ్యలేదు?"
"నువ్వు పెళ్ళి చేసుకున్నా దానికంటే ఇదే నయం. డబ్బు, దస్కం రెండూ వస్తాయి. లోపలికి పద!"
తల్లి చినముత్యం ఆలోచనల్ని జీర్ణం చేసుకోడానికి కొన్నాళ్ళు పట్టింది తనకి. ఆ తరువాత పేర్నీడి ప్రభాకరం రావడం మొదలెట్టాడు.
నిజమైన మనిషి ప్రభాకరం. మనసంటే ఏందో అతనికి తెల్సు. మనిషిని ప్రేమించడం తెల్సు.
పరిచయమైన మూడోరోజే అన్నవరం వెళదాం అన్నాడు. 'మేం భార్యాభర్తలం,' అని గుళ్ళో అర్చన చేయించాడు.సాయంత్రం ఇద్దరూ కొండ దిగి గోపాలపట్నం వేపు నడుస్తున్నారు.
దేవుడి ప్రసాదం తినేసి విస్తరాకు దూరంగా విసిరేస్తూ, "నన్నెవరన్నా ఇంటర్వ్యూ చేస్తే ఒకటి చెప్పాలనుంది!" అన్నాడు ప్రభాకరం.

"మిమ్మల్నెవరూ చెయ్యరు. నాకు చెప్పెయ్యండి!" అంది సుశీల.
"సరే... ఈ ప్రపంచంలో నీ కిష్టమైన స్వీటేది? అని అడుగు."
అడిగింది.
"ఈ ప్రపంచంలో నాకిష్టమైన స్వీటు అన్నవరం సత్యన్నారాయణ మూర్తి ప్రసాదం!"
"నిజమే సుమా!" అని అతని నడుం చుట్టూ ఎడమచెయ్యి వేసి ముందుకు నడిచింది.
అదంతా  మైదానం. ఉన్నట్టుండి ఆగిపోయిన ప్రభాకరం, "నన్ను ముద్దు పెట్టుకో," అన్నాడు.
:ఎవరన్నా చూస్తే?" అంది.
వెంటనే, "రక్షించండి! హెల్ప్! హెల్ప్! అని అరవడం మొదలుపెట్టాడు. ఎవరూ రాలేదు. ఇక అరుపులాపి, " ఎవరూ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకోవచ్చు!" అన్నాడు.
నవ్వేసిన సుశీల, "మొన్న చూసిన సినిమాలో సీనిది!" అని తన గులాబీరంగు పైట తీసి గుండెల మీద ముద్దు పెట్టించుకుని, అతని పెదాల మీద తనూ ముద్దు పెట్టింది.
అలా అల్లిబిల్లిగా అతనితో అల్లుకుపోయింది సుశీల. రోజులు హాయి హాయిగా గడుస్తున్నాయి. మధురంగా ఉంది జీవితం. మొలకగా ఉన్నప్పుడే గిల్లి వేయబడ్డ ఆశ మళ్ళీ మొలకెత్తడం మొదలెట్టింది.
తనకో బిడ్డ పుట్టాలి. వాడు ముద్దుగా, బొద్దుగా తన చంకలోంచి నలుగురూ లాగేసుకునేంత అందంగా వుండాలి.
కొన్నాళ్ళు గడిచాక ప్రభాకరం కూడా రావడం మానేసాడు.
ఏమయిందా అని వాకబు చేస్తే తెలిసింది, బావమరుదులు అతన్ని చంపేసి వాళ్ళ పొలాల మధ్య వుండే చింతాలమ్మ గుడిలో పారేసారట.
మూడునెలల పాటు గదిలోంచి బయటకి రాలేదు నల్ల సుశీల.
తర్వాత,
ఏమిటీ జీవితం? అన్న ప్రశ్న.
మళ్ళీ ఎదురుగా తల్లి చినముత్యం.
ఆ తర్వాత తన జీవితంలో చాలామంది...
కాలం తన ఆయుష్షుని మింగేసింది. రాత్రి జడలో నలిగిన మల్లెపువ్వులా వాడిపోయింది అందం. చాలామంది కన్నెపిల్లలు తయారయ్యారు. కొత్తనీరు వచ్చేసింది. ఎంత అలంకరించుకున్నా వృధా! ఇలాంటి పరిస్థితులొచ్చాకా చాలామంది చిన్నచిన్న టౌన్లలో వుండే లాడ్జీలకి, ఆ తర్వాత హైవేల మీదకీ మారిపోతుంటారు.
ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా ఎవరో చెప్పారు గాలికొండపురం వెళ్ళిపొమ్మని.
అక్కడెవరున్నారంటే, 'అదో చిన్న టూరిస్టు ప్లేసు. మీలాంటి వాళ్ళెవరూ వుండరక్కడ. అక్కడికొచ్చి నాలుగు రోజులుండే టూరిస్టులకి మీ సుశీలే మహారాణి!' అని బోధించాడు.
మెళ్ళో మంగళసూత్రం వేస్తుంటే, "ఇదెందుకు?" అంది సుశీల.
"పెళ్ళయింది. భర్త పొరుగూరు వెళ్ళాడు అని చెప్పాలి. పెళ్ళయిన ఆడదానితో సంభోగం అంటే అదో ఆనందం వాళ్ళకి. అయినా ఇప్పుడు ఒళ్ళు వదిలిపోయింది. కాబట్టి నీకిదే సరైన వేషం!"
అనుభవజ్ఞురాలైన తల్లి, వృత్తిలో లౌక్యాన్ని జీర్ణం చేసుకునేలా ప్రయత్నించింది సుశీల.
ఆ తర్వాత వాళ్ళు దండకారణ్యం మధ్యలో వున్న గాలికొండాపురానికి మకాం మార్చారు.

*

ఎండ తీవ్రంగా కాస్తున్నా మధ్యాహ్నం రెండు గంటలకే చలిగాలి తిరిగింది. గుహల దగ్గర తిరిగే సాధువు గోస్తనీ నదిలో స్నానం చేస్తున్నాడు. రాత్రి డ్యూటీ కెల్లొచ్చిన స్టేషన్ సూపరింటెండెంట్ గారు తన పెంపుడు కుక్కని వూళ్ళో తిప్పుతున్నాడు.
గెస్ట్ హౌసుల్లో దిగిన యాత్రికులు కెమెరాలతో లోయల్లో తిరుగుతున్నారు. స్టేషన్లో కాంటీన్ నడిపే ఒరియావాడు మేకపాల కోసం ఊల్లోకొచ్చాడు. గాలికొండ కింద మిలటరీ హోటలు మీసాలరాజు నాటుకోళ్ళు కొనడానికి గిరిజనుల పాకల వేపు వెళుతున్నాడు. 

రాత్రి పొగ చూరిపోయిన పెట్రోమాక్స్ లైటుని చిట్టుతో తోముతూ చినముత్యంతో మాట్లాడుతున్నాడు భూషణం. "రాత్రి గెస్ట్ హౌస్ లో దిగినతను ఇక్కడ పండే రంగురాళ్ళు కొనడానికి వస్తూంటాడట. లప్పా! బరంపురం లాల్చీ వేసుకుని బలంగా వుంటాడు... తాగితే మాత్రం రాక్షసుడి అవతారం ఎత్తుతాడట. నేనొచ్చినప్పుడల్లా నీకు కబురు చేస్తుంటాను. అస్తమాను ఇవ్వడం కుదరదు. ఇదిగో!  అనేసి ఒకేసారి పదివేల కట్ట సుశీలకిచ్చేసాడు."
వాడలా  మాట్లాడుతూ ఉండగా లోపల వాంతి చేసుకుంటున్న సుశీల కనిపించింది.
నల్ల సుశీల నెల తప్పింది.
అది విన్న చినముత్యం ఇక ఈ వృత్తి మనకొద్దని నిర్ణయించేసుకుని కూతుర్ని పువ్వుల్లో పువ్వులా చూసుకోడం మొదలెట్టింది.
పోయిన శక్తీ, కాంతీ తిరిగొచ్చాయి సుశీలలో. ఇంతకుముందెప్పుడో పారేసుకున్న చలాకీతనం మళ్ళీ ప్రవేశించింది. తల్లి వద్దంటున్నా ఎగిరి గంతులేసింది. రాకపోయినా సారమతిరాగం పాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పనిలేని భూషణం ఇంటికొస్తుంటే ఆట పట్టించేస్తోంది.
ఇలా కాలం గడుస్తుండగానే తొమ్మిది నెలలూ నిండిపోయాయి నల్ల సుశీలకి.

ఆ రోజు...
పసుపురంగు పిట్ట ఒకటి టిల్లచెట్ల గుబుర్లలోకి దూరి చిగుళ్ళని మాత్రమే రుచిగా తింటోంది. నేల మీద పడున్న పచ్చి తాటాకు మీదకి చేరిన రెండు ఎర్రతొండలు దెబ్బలాడుకుంటున్నాయి. కొండ దిగువున మేస్తున్న గేదె వీపు మీద వాలిన కాకి నిశ్శబ్దంగానే కూర్చుంది. గాలికి వూగుతున్న సొలప చెట్టు ఆకు మీదకి జేరిన రామచిలక కిందికి జారిపోకుండా కాళ్ళతో పట్టుకుంది. గంతులేస్తూ పరిగెత్తుతున్న చిన్న గొర్రెపిల్లని ఎలాగయినా పట్టుకోవాలని వెనకాలే పరిగెడుతున్నాడు కొండ ముసలాడు.
రోజూ చూస్తున్నదే అదంతా. అయినా ఆరోజెందుకో చాలా అందంగా కనిపించింది.
అలా చూస్తున్న సుశీల మెడ వెనకేదో లాగినట్టయి తల పైకెత్తేసరికి నల్లటి మబ్బులతో మూసుకుంటున్న ఆకాశం కనిపిస్తుంది.
కాస్సేపటికి వీస్తున్న గాలిలో బాగా మార్పొచ్చింది.
ఇంకాస్సేపటికి నిలబడ్డ తను అమాంతంగా ఎగిరిపోయేంత ఉదృతంగా వీయడం మొదలెట్టింది గాలి.
లోయల్లో పెరిగే పనసచెట్లూ, కుంకుడు చెట్లూ వేళ్ళతో పాటు కూలిపోతాయేమో అన్నంత వికృతంగా వూగిపోతున్నాయి. కొండల మీద పండే కమలాఫలాలు, మామిడిపళ్ళు టపటపా నేల రాలిపోతున్నాయి. గిరిజనుల రెల్లుపాకల కొప్పులు ఎగిరిపోతున్నాయి. వాతావరణం చూస్తుంటే రాత్రి కింకేమవుతుందా అన్నంత భయానకంగా వుంది.
ఆరోజు, మర్నాడు కూడా అలాగే వుంది వాతావరణం.
పొద్దుట్నుంచీ కాస్త పులపరంగా వున్నట్టు అనిపించింది సుశీలకి. మధ్యాహ్నానికి జ్వరమొచ్చి, సాయంత్రమయ్యే సరికి కాలిపోవడం మొదలెట్టింది ఒళ్ళు. ముట్టుకు చూసిన చినముత్యం రైల్వే డాక్టరు కోసం పరుగెట్టింది. కానీ అతను మోటారుట్రాలీ మీద చిమిడిపల్లి వెళ్ళాడు.
గాలి దూమారానికి ఎగిరొచ్చిన ఆకులు కిటికీ ఊసల్లోంచి దూసుకొచ్చి సుశీల పరుపు మీద పడ్డాయి.
జ్వరంతో ఒక పక్క బాధపడుతూనే, చిన్నపిల్లలా వాటిని ఏరుకుని ఆడుకుంటూ, ఇక పుట్టబోయే తన బాబుకి స్వాగతం చెబుతోంది.
రాత్రయింది.
తుపానట!
వాతావరణం చాలా భీభత్సంగా మారింది.
వీస్తున్న గాలికి వర్షం తోడయ్యింది. కరెంటు కూడా పోయింది. గాలికొండపురం గ్రామం అంతా ఖాళీ చేసేసి వలస వెళ్ళిపోయినట్టయింది.
అంతలో...
మూసి ఉన్న ఇంటి తలుపు దబదబా బాదుతున్నారెవరో!
వెళ్ళి తీసింది చినముత్యం.
కాకిలా తడిసిపోయి బాటరీ లైటు పట్టుకుని నిలబడ్డ భూషణం, వాడికి కాస్త దూరంగా బరంపురం లాల్చీలో బలంగా వున్న మనిషి నోట్లోంచి తాగిన వాసన వేస్తోంది.
వాళ్ళిద్దర్నీ గమనించిన చినముత్యం భూషణం కేసి చూసి, "నీకిదేం దొబ్బిడాయిరా సచ్చినోడ! ఏంటిది?"
"మొన్న గెస్ట్ హౌస్ కెళితే పదివేలిచ్చారే... ఆ దొరగారు."
"మా సుశీలకి నెలలు నిండినియ్యని చెప్పలేదా?"
"చెప్పడమేంటి ఏడ్చి మొత్తుకున్నాను. లప్పా! (ఎత్తయిన కడుపుతో) నెలలు నిండిన ఆడాళ్ళతో శృంగారం గొప్పగా వుంటుందని ఆయనే లాక్కొచ్చేసారు!"
"ఛీ! నోర్ముయ్ వెధవా! జ్వరంతో దాని ఒళ్ళు కాలిపోతుంటే..."
ఆ మాట విన్న ఆ మనిషి విసురుగా దగ్గరకొచ్చి, "ఏంటీ, నెలలు నిండటంతో పాటు జ్వరం కూడా వచ్చిందా?" అన్నాడు.
"అవును దొరగారూ! దాని ఒళ్ళు పెనంలాగా కాలిపోతుంది!"
ఆనందంతో పెద్దగా అరిచిన ఆ మనిషి, "నెలలు నిండిన సుశీల ఒళ్ళు కాలిపోతున్న జ్వరంతో వుందా?...
నేను కలకత్తాలో వున్నప్పుడు మా ఫ్రెండ్ హిరెన్ బోస్ చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో వున్న స్త్రీలతో కలిసే అవకాశం వస్తే వదులుకోకు అని... ఇదిగో చూడూ! ఇంతకుముందు పదివేల గురించి మర్చిపో! ఇదిగో ఇంకో పదివేలు!" అని అందించి మరుక్షణం సుశీల గదిలోకి దూసుకెళ్ళిపోయి దబ్బున తలుపేసుకున్నాడు!

*

తెల్లవారుతోంది. ఇంకా తగ్గని ఆ తుపానులోనే బయల్దేరిన శృంగార పురుషుడు తడిసిపోతూ తను దిగిన గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయాడు.
సుశీలకి నొప్పులు మొదలయ్యాయి. వాటిని భరించలేక మెలికలు తిరిగిపోతోంది. అంత తుపానులోనూ రైలెక్కించి శృంగవరపు కోట తీసుకెళ్ళింది చినముత్యం.
రాత్రికి ఆపరేషను చేసి బిడ్డను బయటకు తీసారు.
స్పృహ వచ్చిన నల్ల సుశీల పక్కలో వున్న బిడ్డని చూసుకుంది.
వాడు... తను కోరుకున్నట్లు మగపిల్లవాడే!
తాబేలు పొట్ట, పుల్లలాంటి చేతులు, కాళ్ళు, పెద్ద తలతో చలనం లేకుండా ఉన్నాడు.
 


 

మరిన్ని సీరియల్స్