Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
okkasaari T.V  lo chooste chaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకటవరప్రసాద్

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి)

తనుఁ బాసి శశి దవ్వు చనిన నెవ్వగఁ బోలెఁ, దొలిదిక్కు జవరాలు వెలుకఁ బాఱెఁ
బ్రథమాద్రిసభయందుఁ బఱిచిన కెంబట్టు, జముకాణ మనఁగ రాగము జనించె
ధవుఁ గూర్మి కొసరుచున్నవి వోలె ముఖరాళి , వనరుహాస్యములఁ బద్మినులు తెఱచె
భానూష్మభీతి మున్పడిన చుక్కలభంగి, దొరలె వేకువగాలిఁ దరుల మంచు 

కాలగుణయుక్తి మింటి చక్కటికి నెగయ
వాసవునిపట్టి పొడవుగా వైచి యాడు
గచ్చు చమరిన దారు చక్రంపు బిళ్ళ
వోలె నొయ్యనఁ బ్రాచి లేఁ బ్రొద్దు పొడిచె. 

క్రమక్రమముగా రాత్రి గడుస్తున్నది. తనను విడిచిపెట్టి తన ప్రియుడు ఐన చంద్రుడు దూరముగా  వెళ్ళిపోతున్నాడు అనే దిగులుతో అన్నట్లు గా తూర్పుదిక్కు తెల్లబారుతున్నది. తూర్పుకొండపై జరుగబోయే సభలో పరచిన పెద్ద, ఎర్రని,  పట్టు‘జంపఖానా’ అన్నట్లు ఉదయ సంధ్యా రాగం  తూర్పున  అలుముకుంటున్నది. తామర తీగలు అనే ప్రియురాళ్ళు  తమ నాథుడైన సూర్యుడిని గారంగా కొసరుతున్నట్లు ధ్వనులు చేస్తున్న తుమ్మెదల రొదలతో పద్మములు మెల్లగా  తెరుచుకుంటున్నాయి, విచ్చుకుంటున్నాయి. సూర్యుడు రాబోతున్నాడు అనే భయము తో, ఆతని వేడిమికి భయపడి  ముందుగానే రాలిపడిన చుక్కలేమో అన్నట్లు ఉదయకాలపు గాలికి చెట్లమీది మంచు బిందువులు  రాలిపడుతున్నాయి. వాసవుడు అంటే ఇంద్రుడు. తూర్పు దిక్కుకు అధిపతి ఐన ఇంద్రుని కుమారుడైన జయంతుడు బాల్య లక్షణముతో  ఆడుకోడానికి కాలము అనే దారానికి కట్టి ఎత్తుగా ఎగరేసిన రంగు రంగుల కొయ్య చక్రపు బిళ్ళ అన్నట్లు ఇంతలోనే తూర్పుదిక్కున సూర్యుడు ఉదయించాడు, పొద్దు పొడిచింది. 

ఈ గతి నత్తఱిఁ దెలతెల
వేఁగిన గంధర్వపతికి వేగుట విని తా
రాగమున కేఁగి కాంచిరి
రాగమ్మునఁ గొలిచి మను పురాతన ఖచరుల్‌.

ఈవిధముగా ఆ సమయములో తెలతెలవారగా, గంధర్వపతికి శాపవిమోచనము కలిగింది అని తెలుసుకున్నవారు, ప్రేమగా అతడిని కొలుచుకుంటూ బ్రతికే (రాగమ్మునఁ గొలిచి మను) పురాతన సేవకులైన ఖేచరులు, గంధర్వులు ఆ వెండికొండకు, మంధరపర్వతానికి వెళ్లి (తారాగమున కేఁగి) తమ ప్రభువైన ఇందీవరాక్షుడిని చూశారు. 

కాంచినఁ బొంగి వా రొసఁగు కానుక లర్థిఁ బరిగ్రహించి మ
న్నించి పురప్రయాణ రతి నిక్క నరేంద్రుఁడు మున్నుగాఁ దటి
చ్చంచలవాహమై మణుల చాయల దిక్కు లలంకరించి హొ
న్నంచు రథంబు చాఁగు! బళి! యంచు నకీబులు మ్రోయ నెక్కినన్‌.

తనవారిని, అనుచరులను, మిత్రులను చూసి , తన శాప విమోచన వార్తను వినగానే తనను చూడడానికి  వచ్చినందుకు సంతోషించాడు ఇందీవరాక్షుడు. వారు తనకై తెచ్చిన కానుకలను (అర్థిఁ) ప్రేమగా స్వీకరించాడు. ‘రిక్త హస్తేన నోపేయా ద్రాజానం దైవతం గురుం’ అని పెద్దల పలుకు. అంటే వట్టి చేతులతో రాజువద్దకు, దేవునివద్దకు, గురువువద్దకు వెళ్ళకూడదు అని. పెద్దలవద్దకు పెరుమాళ్ళ వద్దకు ఉత్తిచేతులతో వెళ్ళకూడదు అంటుంటారు గ్రామీణులు! అంటే ఎంతో కొంత, ఏదో ఒకటి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉండీ కూడా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని. ఆర్థికముగా అవకాశం లేని వారి విషయములో అచంచలమైన విశ్వాసాన్ని కలిగిఉండడం ప్రభువుకు ఇచ్చుకునే కానుక,  పరిపూర్ణమైన భక్తిని కలిగి ఉండడమే దైవం కొరకు తెచ్చే కానుక, భక్తి, గౌరవము, వినయము కలిగి ఉండడమే  గురువుకు ఇచ్చే కానుకలు! ఆ గంధర్వులు నీతికుశలురు కనుక తమ ప్రభువు వద్దకు ఉట్టి చేతులతో ఎలాగూ వెళ్లరు కనుక వారు కానుకలు తీసుకుని వెళ్ళారు అని ప్రత్యేకముగా చెప్పకుండా ఇందీవరాక్షుడు వారు తెచ్చిన కానుకలను ప్రేమగా స్వీకరించాడు అని చెప్పాడు పెద్దన.ఇక ఎప్పుడెప్పుడు తన నగరానికి ప్రయాణమై వెళ్దామా అనే కోరిక, ఆత్రుత అధికమౌతున్నది ఇందీవరాక్షుడికి. స్వరోచిని ముందుగా రథాన్ని ఎక్కించాడు. మెరుపువేగముతో ప్రయాణించగల గుర్రములనుపూన్చిన రథాన్ని(తటిచ్చంచల వాహమై) మణులతో అలంకరించిన రథాన్ని, బంగారపు అంచులతో మెరిసిపోతున్న రథాన్ని,(హొన్నంచు)  ‘చాంగు’ ‘భళీ’ అని బెత్తములను ధరించిన భటులు(నకీబులు) ప్రశంసా వాక్యాలను పలుకుతుండగా, ముందుగా స్వరోచిని రథము నెక్కించి ఆ తర్వాత తను రథమును అధిరోహించాడు. తనను శాప విముక్తుడిని చేసినందుకు కృతజ్ఞతగా, తన అతిథిగా వస్తున్నాడు కనుక మర్యాదగా, తన అల్లుడు కాబోతున్నాడు కనుక గౌరవంగా స్వరోచిని ముందుగా ఎక్కించి ఆ  తర్వాత తను ఎక్కాడు రథమును! 

నందనయు నుచితరత్న
స్యందనమునఁ జనియె నర్థి జనకునిబడి న
య్యిందీవరాక్షుఁ డీ గతి
మందరమున కెగయ గగన మార్గమునందున్‌.

ఆతని కుమార్తె ఐన మనోరమ కూడా తనకు తగిన రథాన్ని, రత్నములతో అలంకరించబడిన రథాన్ని అధిరోహించి తన తండ్రి వెంట, తండ్రి వెనుక ప్రయాణమైంది. ఈ విధముగా ఇందీవరాక్షుడు ఆకాశమార్గములో మందరగిరికి వెళ్ళడం కోసం గగనమునకు ఎగిరి ప్రయాణమయ్యాడు. తన కుమార్తెను స్వీకరించుమని స్వరోచిని కోరాడు, ఆతనూ సమ్మతించాడు. వివాహ నిశ్చయము అంటే నేటి మన పరిభాషలో ‘ఎంగేజ్మెంట్’ జరిగింది. కానీ వివాహము జరగలేదు ఇంకా, కనుక వారిద్దరూ ఒకే రథములో ప్రక్క ప్రక్కన కూర్చుని ప్రయాణం చేయడం బాగోదు కనుక మనోరమ ప్రత్యేకమైన రథములో విడిగా ప్రయాణించింది, మనమంటే యేవో ఒకటీ అరా తప్పిస్తే పెళ్ళిలో, పెళ్లి తర్వాత జరగాల్సినవి అన్నీ ఎంగేజ్మెంట్ లోనే జరుపుకుంటున్నాము, జరిపిస్తున్నాము కానీ  తండ్రీ కూతుళ్ళకు కొద్దిగా మొగమాటం ఎక్కువ కావొచ్చు, కాబోయే అల్లుడికి ‘ఓర్పు’ ఎక్కువ కావొచ్చు, బహుశా, వివాహము జరగకముందే భుజాలు రాసుకుని కూర్చుని ప్రయాణం చేయలేదు!   

మండిగాలిడి దంత శుండాగ్ర హతిఁ జించి, జలధరాంభముఁ గరుల్‌ చల్లులాడ
నహిమాంశు హయ హేష లాలించి చెవి వంచి, కెరలి వాజులు బయల్‌ గొరిజఁ ద్రవ్వ
ధ్వజ వాతహతి నాఱ వైద్యుతాగ్నులఁ జూఁడి, పగలు దివ్వెలవారు పంజు లెత్తఁ
బెటులు చప్పుడు లాత్మ భీరు స్వయంగ్రాహ, పరిరంభ సుఖము ఖేచరుల కొసఁగఁ

జామరప్రభ గగన గంగా మరాళ
చకచక భ్రమ మొదవింపశంకరాద్రి
కాననముమోచి మందరాగంబుదాఁకఁ
బౌఁజువెట్టిరి తన్మూల బలము దొరలు.

వాహనములలోనున్న ఏనుగులు ఒక కాలును కొద్దిగా, మరొక కాలును పూర్తిగా నేలమీదకు వంచి (మండిగాలిడి) తమ దంతముల తొండముల కొసలతోఆకాశ మార్గములోనున్న మేఘములను ‘చించి’ వాటిలోనున్న నీరు కారిపోగా తొందములతో పీల్చి పిచికారీ చేసుకుంటూ ఆడుకున్నాయి. రథములకున్న  గుఱ్ఱములు ఇతర గుఱ్ఱములు ఆకాశములో సూర్యుడి రథమునకున్న గుఱ్ఱములు చేస్తున్న సకిలింపులను విని, పోటీగా, పోరాటానికా అన్నట్టు గిట్టలు దువ్వాయి. మామూలు రాజులే పగటి దివిటీలు వెలిగించుకుని భటులు, సేవకులు అనుసరిస్తుండగా ప్రయాణం చేసేవారు, యిక గంధర్వులకు రాజు, ఆయన కుమార్తె, స్వరోచి అనే మహారాజు ప్రయాణం చేస్తున్నారు కనుక, పరిచారకులు పగటి దివిటీలు పట్టారు. రథములకు, ఇతర వాహనములకు ఉన్న జెండాల గాలికి ఆ పగటి దివిటీలు ఆరిపోయాయి. వాళ్ళూ సామాన్యులు కారు కనుక మేఘములలోనున్న విద్యుత్తుతో మరలా దివిటీలను వెలిగించుకుని పరుగులెత్తారు రథాల వెంట. ఫెటిల్లు ఫెటిల్లుమని యంత్రములో, ఆకాశ వీథి కనుక మేఘముల ఉరుములో, ధ్వనులు చేస్తుండగా, ఆ ధ్వనులకు ఉలికిపాటుతో, భయపడిన ప్రియురాళ్ళు తమ తమ ప్రియులను తామే స్వయంగా కౌగిలించుకున్నారు. ఇష్టమైన కాంత కష్టపెట్టకుండా, తనంత తానే ఇష్టపడి ఇచ్చిన కౌగిలిసుఖాన్ని ఆ ఖేచరులు అనుభవించారు.  పరిచారకులు ధరించిన వింజామరల తెల్లని కాంతులు ఆకాశగంగా ప్రవాహములో మునకలేస్తున్న తెల్లని హంసలేమో అనే భ్రమ కలుగుతుండగా కైలాస పర్వతముతో మొదలై మంధర పర్వతముదాకా పరిచారకుల, అనుచరుల సేన ఊరేగింపు జరిగింది, ఇందీవరాక్షుడి రథాన్ని, మనోరమ రథాన్ని అనుసరించి. కాళిదాసు కూడా మేఘసందేశ కావ్యములో ‘మేఘుడు’ ఆకాశవీథిలో ఎగిరినప్పుడు కైలాస పర్వతమును సమీపించినప్పుడు అక్కడి యువతులు తమ చేతులకున్న కంకణములతో మేఘమును పగులగొట్టి నీటిని పుట్టించడానికి ‘మేఘుడిని’  ‘యంత్రధారా గృహము’ గా వాడుకుంటారు అన్నాడు. పెద్దనకు స్వయానా శిష్యుడు ఐన రామరాజ భూషణుడు (భట్టుమూర్తి)వసుచరిత్రలో ‘దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహమున్ కంతుద్వేషికి గూర్చి’ అని, బాల గణపతి తన దంతములతో ఆ వెండికొండను కుమ్ముతున్నప్పుడు ( కొండలను ఢీ కొట్టి క్రీడించడం ఏనుగుల, విశేషించి పిల్ల ఏనుగుల లక్షణం) భయపడిన పార్వతీదేవి చప్పున తన భర్త ఐన పరమశివుడిని కౌగిలించుకుని, తనంత తానుగా ఇష్టసఖి ఇచ్చిన కౌగిలింత పులకింతను పరమశివుడికి ప్రసాదించింది అని గణపతిని ‘ప్రశంసించాడు, బహుశా ఈ పద్య ప్రేరణతోనే కావొచ్చు!     |

జర శతాంగ హయ భట
రంజితమై పై రజఃపరంపర లలమన్‌
మంజుల కాంతిఁ గసీసపు
మాంజిష్ఠముఁ బోలె గగన మండప మమరెన్‌.

ఏనుగుల, రథముల, గుఱ్ఱముల, భటులతో కూడుకున్న ఆ ఊరేగింపులో, ఆ ఏనుగుల, గుఱ్ఱముల, భటుల పాద ధూళి పైకెగసి, ఎక్కువ పసుపురంగు, దానికి తోడుగా ఎరుపురంగును జతచేసి, ఆ ఏనుగుల, రథముల, భటుల బొమ్మలను చిత్రించిన నీలిరంగు గుడారంలాగా నీలాకాశం ప్రకాశించింది. కలంకారీ వస్త్రాలకు పసుపు ఎరుపు రంగులనుపయోగించి ఏనుగుల, గుఱ్ఱాల, రథాల బొమ్మలను చిత్రించడం సహజంగా జరిగేదే, కనుక యిలా సమంజసమైన, రసమయమైన వర్ణన చేశాడు పెద్దన.   

సొరిది నీ రీతి దివిఁ దోడు
సూపినట్టిదొరలు గొలువంగ ఖచరేంద్రుఁ డరిగి యరిగి
మింట గ్రహరాజు తనసగమింట వెలుఁగు
మంథగిరిఁ గాంచి పలికె నమ్మనుజపతికి.

ఇలా వరుసగా తన పరిచారకులు, అనుచరులు తోడుగా అనుసరించగా ఆ ఖేచర రాజు వెళ్లి, వెళ్లి సూర్యుడు తన సగము వరకూ ప్రకాశించేటంత ఎత్తున్న మంథరగిరిని చూశాడు. సూర్యమండలము క్రింద ఎంత ఎత్తు ఉన్నదో, ఆ సూర్యమండలము పైన కూడా అంత ఎత్తు ఉన్నది ఆ పర్వతం అని చెప్తున్నాడు పెద్దన.  అంటే సూర్యమండలం కూడా ఆ పర్వతానికి సగభాగము వరకే వచ్చింది. స్వరోచితో ఆ మంథరగిరి వైభవాన్ని పొగడుతూ యిలా అన్నాడు ఇందీవరాక్షుడు.  

  (కొనసాగింపు వచ్చే సంచికలో)

 వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu