Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Vinayaka Chavithi

మేఘన - కోరం కిషోర్‌(ఐఆర్‌ఏఎస్‌)

ఉదయం ఐదు గంటల సమయం...

మంచి నిద్రలో ఉన్నాడు హరి...

ఇంతలో...

ఎవ్వరో... చటుక్కన హరి గుండెల మీదకెక్కి కూర్చున్నారు...

చాలా బరువుగా ఉన్నాడా మనిషి...

ఆ మనిషి తన బలమైన రెండు చేతులతో హరి గొంగు నులమడం మొదలుపెట్టాడు...

ఊపిరాడడం లేదు హరికి...

తన గొంతు నులుముతున్న ఆ కబంధ హస్తాలను తొలగించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు...  ఉక్కులాంటి బలమైన ఆ చేతులను విడగొట్టాలని శాయశక్తులా ట్రై చేస్తున్నాడు.

అరవాలనుకుంటున్నాడు... కానీ.. గొంతులోని అరుపు బయటకు రావడం లేదు ... అరిచానను కుంటున్నాడు... కానీ కంఠంలోనే నిక్షిప్తమైన విషయం తెలుస్తూనే ఉంది.


ఉండేకొద్దీ ఊపిరి బలహీనమైపోతోంది. ఆ చేతుల పట్టు ఉండేకొద్దీ ఉడుంపట్టులా ఇంకా.. ఇంకా బిగుసుకుంటున్నది. పోరాడుతున్నాడు హరి... పోరాటం... ఆరాటం... ఎంతసేపు ఆ పోరాటం జరిగిందో తెలియదు... ఆఖరు ప్రయత్నంగా... తన బలమంతా వినియోగించి, పెద్దగా అరుస్తూ, ఒక్కసారిగా తనపైనున్న మనిషిని అమాంతంగా తోసేసాడు.

గుండెల మీద బరువు తొలగిపోయింది.

శ్వాస అతివేగంగా తీసుకుంటున్నాడు.

గుండె గొంతులో కొట్టుకుంటున్న శబ్ధం అతి స్పష్టంగా వినిపిస్తున్నది.

గుండెలు డవిసిపోయి, గొంతు పూర్తిగా తడారిపోయి, నాలుక పిడచకట్టుకుపోయింది.

మైండ్‌బ్లాక్‌అయిపోయింది.

చటుక్కున లేచి కూర్చుని, లైటు వేసాడు ఆలస్యం చేయకుండా...

ఒక్కసారిగా గదంతా వెలుతురు పరచుకుంది..

ఎవరూ..? ఎవరా మనిషి? ఎందుకు నన్ను చంపాలనుకున్నాడు?

ప్రశ్నలు మస్తిష్కాన్ని తొలచివేస్తుండగా, గదంతా తేరిపార చూసాడు.

అక్కడెవరూ లేరు...

అదేమిటి? ఇంతలోనే అంత బరువైన, అంత బలమైన మనిషి ఎలా పోయాడు? ఎక్కడకు మాయమైపోయాడు? ఇది సాధ్యమా? ఆ బరువు... ఆ గొంతు నులమడం, ఆ బలమైన ఉక్కువంటి కబంధ హస్తాలు... అంతా కలా? భ్రమా? కాదు...   

కానేకాదు...మరేమిటి?దయ్యమా..? భూతమా..? చంపాలనుకున్నది. మరెందుకు వదిలేసింది..? ఎలా మాయమైపోయింది..?దయ్యాలు, భూతాలు మనిషిని చంపదలచుకుంటే.. వాటిని మనిషి ఆపగలడా..? వాటి బలం ముందు, శక్తి ముందు మానవుల శక్తి ఏ పాటిది..?
ఇంకా చెమటలు ధరగా కారుతూనే ఉన్నాయి.. ఎన్నిసార్లు వేళ్లతో విదిలించినా నుదిటి మీద నుండి చమటలు కారుతూనే ఉన్నాయి. నిశ్శబ్దంగా పనిచేస్తున్న స్ల్పిట్‌ఏసీ శబ్ధం భయంకరంగా వినిపిస్తున్నది... పడుతున్న చెమటల్ని ఏసీ చల్లదనం ఏమాత్రం పారద్రోలలేక పోతున్నది.

పడుకునే ముందు మంచం దగ్గరే పెట్టుకున్న వాటర్‌బాటిల్‌మూత తీసి, గబగబా సగం బాటిల్‌పైనే గడగగా తాగేసాడు. కొన్ని నీళ్లు ఛళ్లు ఛళ్లున ముఖంపై కొట్టుకున్నాడు.

కప్పుకున్న దుప్పటి సగంపైగా చమటతోనే తడిసి ఉంది. మంచం దిగి గదంతా కలియదిరిగాడు... ఏమీలేదు... ఏమైంది? ఏమైందసలు?
కొద్దిగా స్థిమితపడి, మంచం మధ్యలో కూర్చున్నాడు... అంతలోనే...

ఆ అచేతనావస్థలోనే... ఆ నిద్రావస్థలోనే... హరి ముఖంపై  చిరు దరహాసం మొలిచింది... ఆలోచనలు రేసుగుర్రాల్లా పరుగుతీస్తుండగా... ఆ చిరునవ్వు ఇంకొంచం పెద్దదయింది.

హౌ స్టుపిడ్‌ఐయాం? వాటే థరో విలేజర్‌ఐయామ్‌? చిన్నతనమంతా గ్రామంలోనే గడిచింది, ఆ భయాలు, ఆ నమ్మకాలు, ఆ ఛాయలు, వాసనలు, ఎంత గాఢంగా నాలో నాటుకుపోయాయి? డాక్టర్నయినా గానీ ఇంకా నన్ను వదలకుండా ఎంతగట్టిగా అంటిపెట్టుకున్నాయి?
‘‘ఈ గుండెల మీద మనిషి కూర్చోవడం, గొంతు నులమడం, ఊపిరాడకపోవడం... ఇదంతా.. సరిగ్గా, సరియైన పొజిషన్‌లో పడుకోకపోవడం వలన, నిద్రలో, శ్వాసక్రియ సరిగ్గా జరగకపోవడం వలన, ఊపిరి సరిగ్గా అందకపోవడం వలన, సాధారణంగా, అందరికీ జరిగే అనుభవమే...’’
అంతే... అంతకంటే ఏమీ లేదు.

వరసగా, ఒకదాని వెంబడే ఇంకొకటిగా రకరకాల ఆలోచనలు హరిని కమ్ముకోవడం మొదలుపెట్టాయి. ఏడేళ్ళ వయసులో... రఘుగాడు మాటలు మదిలో మెదిలాయి.

‘‘ఒరే... కొరివి దయ్యాలు తెలుసురా, నీకు? అవి మనుషులకు కీడు చేయ్యవు, కానీ వాటికి మనుషులను ఏడిపించడమంటే చాలా సరదా, మనిషిని నానా అవస్తలకు గురిచేసి, ఆ మనిషి పడే తిప్పలు చూసి, భలే సంతోషపడతాయి, నవ్వుకుంటాయి.’’

‘‘ఒకతను ఇంటి బయట నులక మంచం వేసుకుని పడుకుంటే, ఆ మంచాన్ని మనిషితో పాటు, ఓ హోం, ఓ హోం అనుకుంటూ గాల్లో ఎత్తుకుపోయి, ఊరి చివర పొలాల్లో వదిలాయంట... పొద్దున్నే పొలంలో నిద్రలేచి, ఆ మనిషి పడిన కంగారూ, వేసిన కేకలు, పంచ ఊడిపోయేలా వేసిన గంతులూ చూసి, కడుపుబ్బ నవ్వుకున్నాయంట.’’

‘‘ఈ దయ్యాలను మనిషి కంట్రోల్‌చేయవచ్చు. వాటిని గమనించనట్టు, నిద్రపోతున్నట్లు నటిస్తూ, తెలివిగా, ఒక దయ్యం తల వెంట్రుక నొకదాన్ని లాగి గుప్పెట్లో పెట్టుకుంటే... నా... సామిరంగా... మనం చెప్పే పనులన్నీ చచ్చినట్లు చేసిపెడతాయి. ఎక్కువ కాలం మనం వాటిని కంట్రోల్‌

చెయ్యలేము. మనకి కావలసిన పనులన్నీ చేయించుకోగానే, ఉఫ్‌మని, గుప్పెట్లో వెంట్రుకని ఊదేస్తే, వెంటనే పారిపోతాయి.’’
ఇక మామూలు దయ్యాల విషయానికిస్తే...

‘‘ఊరి పొలమేరల దగ్గర దయ్యం వెంటబడుతుంది, దాన్ని మనం చూసినా, చూడనట్టుగా నటిస్తూ... మామూలుగా నడుస్తుండాలి... కాసేపటికి, అది గమనించేలోగా దానికి అందనంత దూరం పరుగెట్టి, తిరిగి దయ్యం దగ్గరకొచ్చేలోపు గుండ్రంగా మూత్రం పోసేసి ఆ మధ్యలో మనం నిలబడిపోవాలి. అంతే... ఇక దయ్యం లోపలికి రాలేదు... కానీ ప్రయత్నం చేస్తుంటుంది, మీద పడిపోవాలని.. ఈ లోగా కుడిచేత్తో, ఒకే ఒక పట్టుతో నడుముకున్న మొలతాడుని పుటుకున్న తెంపేసి, దాన్ని చేతిలో బిగించి పట్టుకుని, కొరడాలా రaుళిపిస్తూ దయ్యాన్ని కొట్టాలి. ఛళ్ళు...

ఛళ్ళుమని దయ్యానికి ఆ దెబ్బలు తగిలి, ఆ దెబ్బలు తట్టుకోలేక, బాధ భరించలేక, దయ్యం పారిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ‘నల్ల కుక్క’ రూపంలో గానీ ‘నల్ల పిల్లి’ రూపంలో గానీ వెళ్ళిపోతుంది.’’

(ఇంకా వుంది!)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
30th episode