Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
32 episode

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ:
మంచి నిద్ర లో వున్న హరికి ఎవరో తన గుండెల మీద కూర్చున్నట్టు, తన గొంతు నులిమినట్టు అనిపిస్తుంటుంది. తరువాత నిద్రలోంచి అమాంతం లేచి ఎవరబ్బా అని ఆలోచించి దయ్యాలుకావు, భూతాలు కావు అని తనకు తానే సర్ది చెప్పుకుంటాడు. చిన్నప్పుడు తన స్నేహితులు చెప్పిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటాడు. 

.............................తరువాత..

రఘు ఆలోచనల్లోంచి బయటపడి, నెమ్మదిగా చేయిసాచి తడుముకున్నాడు హరి...

మొలతాడు...

ఉంది. ఎప్పుడు కట్టిందో... తాతయ్య మొదటిసారి కట్టిన గుర్తుంది... మళ్లీ ఆలోచనల్లోకి జారిపోయాడు హరి.

ఎరుపు, పసుపు, నలుపు రంగుల్లో దొరికే మొల్తాడుల్లో నలుపు రంగు మంచిదనేది నాయనమ్మ.

గ్రామస్తులు కూడా నలుపురంగు దిష్టి తీస్తుందని నలుపు రంగునే వాడేవారు. రఘు గాడయితే మొల్తాడును ముప్పేట (మూడు పేటలుగా) అల్లేవాడు. తాతయ్య మాత్రం ముప్పేట మొల్తాడును ఇష్టపడేవాడు కాదు. ఎంత శుభ్రం చేసినా ఎంతో కొంత మురికి మిగిలిపోతుందనేవాడు.ఈ మొల్తాడు నిక్కరు జారిపోకుండా కాపాడుతుంది. ఈ నిక్కర్లెందుకు ఎప్పుడూ జారిపోతూ ఉంటాయి? అసలెవరు కనిపెట్టారీ మొల్తాడు? ఎందుకు కనిపెట్టారు?

‘‘చేత వెన్న ముద్ద.. చెంగల్వ పూదండ, పట్టుదట్టి, బంగారు మొలతాడు’’ అని చిన్ని కృష్ణుణ్ణి వర్ణిస్తున్న పద్యం ఎంత బాగుటుందీ...

ఠంగ్‌.... ఠంగ్‌... ఠంగ్‌...

నిశ్శబ్ద నిశీధిలో సమ్మెట దెబ్బల్లాగా గోడ గడియారం కొట్టిన గంటల శబ్దానికి ఒక్కసారిగా ఇహలోకంలోకి వచ్చిపడ్డాడు హరి...

ఓ మై గాడ్‌...!

తయారవ్వాలి, హాస్పటల్‌కు వెళ్లాలి, పేషంట్లు... ఆపరేషన్లు... వార్డులు... రౌండ్లు... ఇతర డాక్టర్లతో డిస్కషన్లూ... అదో ప్రపంచం... ఒక్కసారి అడుగుపెడితే మళ్లీ ఎప్పుడు బయటపడతామో తెలియదు.

గబగబా లేచి, వంట గదిలోకి వెళ్లి కాఫీ కలుపుకుందామని... హాల్‌ వైపు అడుగులేసాడు.

అందరి జీవితాల్లోనూ ఇదో రోటీన్‌...

హాలు దాటి, మెయిన్‌ డోర్‌ తీసి, డోర్‌ బయట వేళ్లాడ గట్టిన సంచిలో పాలపాకెట్లు, పేపర్‌... అందుకుంటూ హాల్లోకి అడుగుపెడుతుండగానే ఏదో ‘అనీజీ’ ఫీలింగ్‌ హరిని కమ్ముకున్నది. మెడ వెనుక రోమాలు నిక్కబొడుచుకున్నట్లు అనిపించింది. అడుగు ముందుకు వేయాలన్పించలేదు. హాల్లో లైటు వెలగడం లేదు. బెడ్‌రూంలోని లైటు వెలుతురు హాల్లోకి ప్రవేశించలేకపోతున్నది, కానీ కొంతవరకు చిరుచీకటితో పోరాడగలుతున్నది.

ఆ చిరు చీకట్లో...

హాలు మధ్యలో... స్టూల్‌... ఆ స్టూల్‌ మీద ఏదో ఆకారం కూర్చుని ఉన్నట్లుగా... కళ్ళు చికిలించి... చూడగా... స్త్రీమూర్తి ఆకారం లాగా, లీలగా కనబడుతున్నది. మళ్లీ భ్రమా..? ఈ రఘుగాడి దెయ్యాల వాగుడు ప్రభావమా..? నాకేమన్నా మతి చలించిందా..? నాలో ఫిజియోలాజికల్‌ ఛేంజెస్‌

(రసాయనాల మార్పులు) సడన్‌గా చోటు చేసుకన్నాయా నాకు తెలీకుండానే..?

ఆలోచనలు కట్టిపెట్టి, గబుకున్న హాల్‌లోని లైటు స్విచ్‌ నొక్కాడు.

ఒక్కసారిగా హాలంతా దేదీప్యమానమయింది. అంతా స్పష్టంగా కనబడుతున్నది.

నిజమే...

‘‘హాలు మధ్యలో... స్టూలు మీద... ఒక ముసలామె కూర్చుని ఉంది. ముగ్గుబుట్ట లాంటి తెల్లని తల వెంట్రుకలు, అక్కడక్కడా చిరిగి, మాసికలు వేసిన చీర, ముడతలుపడిన ముఖం, చేతులు, పెరిగి ఉన్న గోళ్లు కలిగి, దీనంగా హరి వైపే చూస్తున్నది.’’

హఠాత్తుగా, వేళకాని వేళ, ఒక ముసలమ్మ నట్టింట్లో సాక్షాత్కరించింది.

కలా..? కలకాదు.... వాస్తవం...

నిలువునా కొయ్యబారిపోయాడు హరి...

రాత్రి పడుకునే ముందు మెయిన్‌ డోర్‌ బోల్డ్‌ పెట్టానే...! ఏమో..? పెట్టాననుకుని మర్చిపోయానేమో..? బోల్ట్‌ పెట్టడం మర్చిపోతే మాత్రం, సరాసరి ఫ్లాట్‌లోకి వచ్చెయ్యడమేనా..?

ఎందుకు దీనంగా నా వైపు చూస్తున్నది?

కొద్దిగా తేరుకుని, కోపంగా ఏదో అనబోతున్న హరి వైపు సూటిగా, దీనంగా చూస్తూ...

‘‘బాబూ... నీ హాలు, కిచెన్‌, బాత్‌రూమ్‌ అన్నీ శుభ్రం చేసేసాను. అంట్లు అన్నీ తోమేసాను... నీ స్నానానికి వేడినీళ్లు తయారుగా ఉంచాను. ఇంకా నువ్వేపని చెప్పినా చేస్తాను. నాకు సహాయం చేయ్యి నాయానా.’’అంటూ.. హరిని దీనాతి దీనంగా అర్థించడం మొదలుపెట్టింది.

‘‘తలుపు తీసి ఉంటే... ఎవరింట్లోకి బడితే వాళ్ల ఇంట్లోకి చొరబడిపోతావా? ఇల్లు కడిగేస్తావా? ఇంట్లు తోమేస్తావా? నిన్నెవరు చెయ్యమన్నారా పనులు..? పని మనిషి పెట్టుకోవాలంటే నేనెప్పుడో పెట్టుకుని ఉండేవాడిని.. నా పనులు నేను చేసుకోగలను. నీ సహాయం

నాకవసరం లేదు. పొద్దున్నే నా మూడ్‌ అంతా చెడగొట్టావ్‌... వెళ్ళు.. వెళ్ళిపో.’’ అంటూ పెద్ద గొంతుకతో అరిచాడు.

ముసలమ్మ కొంచం కూడా తొణకలేదు.. బెణకలేదు.. అంగుళం కూడా బెసగలేదు. కదిలే ఉద్దేశ్యం లేనట్టుగా రాయిలాగా అలాగే కూర్చుని ఉంది.

అర్థించడం మాత్రం మానలేదు.

హరి కోపం అవథులు దాటింది..

‘‘ఇంత పొద్దున్నే నా ప్రాణాలు తీయడానికి ఎక్కణ్ణుంచి వచ్చావ్‌..? పో... బయటకు పో...’’ అంటూనే ఆమె రెక్క పట్టుకుని బలవంతంగా లాక్కుంటూ, తలుపు తోసుకుని, ఆమెని బయటకు నెట్టేసి, వెంటనే తలుపు మూసి, గడియపెట్టేసుకున్నాడు.

పొద్దున్న పొద్దున్నే అనుకోని సంఘటన...

స్ట్రెస్‌.... బత్తిడి... తగ్గించుకోవాలి...

హాలు మధ్యలో నిలబడి...

తలను పూర్తిగా కిందికి దింపి, ఎడమ భుజం మీదుగా బాగా వెనక్కి తీసుకెళ్లి కుడి భుజం మీదుగా ఐదుసార్లు తిప్పాడు. అదే విధంగా మళ్లీ అపోజిట్‌ డైరెక్షన్‌లో నింపాదిగా, నిదానంగా, ఊపిరి బిగబట్టకుండా, మామూలుగానే శ్వాస తీసుకుంటూ ఇంకొక ఐదుసార్లు తిప్పాడు. తరవాత

నెమ్మదిగా, అతి నెమ్మదిగా తలను ఎంత వెనక్కు వెళ్తుందో అంతగా వెనక్కు, అదే విధంగా ముందుకు పూర్తిగా వంచి, మళ్లీ నార్మల్‌ పొజిషన్‌కు తెచ్చాడు. తలకు రక్త ప్రసరణ పెరిగి ‘క్లమ్సీనెస్‌’ పోయినట్లనిపించింది.

ఇక, శరీరం మొత్తానికి ఆక్సిజన్‌ పెంచాలి... రెండు కాళ్లూ ‘‘స్టాండ్‌ ఎట్‌ ఈజ్‌’’ పొజిషన్‌లో కొంచం దూరంగా పెట్టి, రెండు చేతులూ నడుంకి ఇరువైపులా పెట్టుకుని, ఊపిరి మొత్తంగా ముక్కుతో లోపలికి పీల్చి, ఆపగలిగినంత సేపు ఆపి, నోటితో శబ్దం చేస్తూ... మెల్లగా... అతి మెల్లగా... మొత్తం పీల్చిన ఊపిరంతా పూర్తిగా వెళ్లిపోయేంత వరకు నోరు తెరిచి వదిలాడు.

అలా ఇంకొక ఐదుసార్లు చేసాడు...

రిలాక్స్‌... రిలాక్స్‌... రిలాక్స్‌... అనుకుంటూ వంట గదిలోకి అడుగుపెట్టాడు.

అంతా శుభ్రంగా ఉంది... అంట్లు అన్నీ శుభ్రంగా తోమి, బోర్లించబడి ఉన్నాయి. పాలు మరిగించి చక్కగా మూత పెట్టబడి ఉన్నాయి.

ఆశ్చర్యానికి గురయ్యాడు హరి...అసలెప్పుడొచ్చిందీ ముసలామె..? ఇన్ని పన్లు ఎప్పుడు చేసిందీ, కనీసం చప్పుడన్నా కాలేదే? మెలకువ రాలేదే..? ఏదో విచిత్రంలాగుందే?

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
Naa Preyasini Pattiste Koti