Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
teacher's day celebrated in memory of dr sarvepalli radhakrishnan birthday

ఈ సంచికలో >> శీర్షికలు >>

'బాపు' గారితో... - బన్ను

'Bapu' Garitho...

'గో తెలుగు.కామ్' ప్రారంభిద్దామనే ఆలోచన పుట్టగానే... ప్రారంభ సంచిక కవర్ పేజీ ఎలా వుండాలి? అనే ప్రశ్న పుట్టింది. అది ప్రత్యేకంగా వుండాలి... తెలుగుదనం వుట్టిపడాలి అంటే... 'బాపు'గారు తప్ప ఎవరివల్లా సాధ్యం కాదనే అనిపించింది. నాకు 'బాపు'గారు తెలీయదు. మా గురువుగారైన 'జయదేవ్' గారు, బాపుగారు సన్నిహితులని తెలుసు. జయదేవ్ గారికి ఫోన్ చేసి నా భావన వినిపించి 'బాపు' గారి ఫోన్ నెంబర్ తీసుకున్నాను.

నెంబర్ సెల్ ఫోన్ లో నొక్కాను. 'కాల్' బటన్ నొక్కాలంటే చేతులు వణుకుతున్నాయి. ధైర్యం చేసి నొక్కేశాను. 'హలో' అన్నారు. "సార్ నేను బన్ను అండి... కార్టూనిస్టుని... ఒక వెబ్ మాగజైన్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను... మీరు ముఖచిత్రం వేస్తే..." నేను నసుగుతుండగానే 'బన్ను... కార్టూనిస్ట్... నాకు సరిగ్గా స్పురించటం లేదు. సాధారణంగా నాకు కార్టూనిస్టులంతా గుర్తుంటారు... అన్నారు. నేను ఇంగ్లీషులో 'BANNU' అని సంతకం పెట్టి స్టార్ వేస్తాను సార్... అన్నాను. "ఆ (... చూశాను. స్వాతిలో బాగా వచ్చేవి" అన్నారు. నన్ను ఆయన గుర్తు పట్టారనగానే వెయ్యేనుగుల బలం వచ్చింది. "మీరు హైదరాబాద్ లో ఎక్కడుంటారు? మీకు 'బ్నిం' తెలుసా? ఇంకా ఏం చేస్తుంటారు అంటూ సరదాగా మాట్లాడుతుంటే ఏదో తెలియని అనుభూతి... ఎవరో చెప్పారు నాకు... బాపు గారు చాలా 'మితభాషి' అని! నాతో 30 నిమిషాలు పైగా మాట్లాడితే నేను ఉప్పొంగిపోయాను.

నేను డైరక్టర్ 'వంశీ' గారు కలిసి ఎప్పుడు మాట్లాడుకున్నా 'బాపు' గారి టాపిక్ రాకుండా వుండదు. ఆయన ప్రతీ సినిమాకీ, కథలకీ, సీరియల్స్ కి 'బాపూ' గారే బొమ్మలేశారు. అంతేకాదు -

ఆయన ఎన్నో నవలలకి, సీరియల్స్ కి, కథలకి, పుస్తకాలకీ ముఖ చిత్రాలు, బొమ్మలు గీశారు కానీ... ఒక 'వెబ్ మాగజైన్' కి గీసిన ఘనత 'గో తెలుగు.కామ్' కే దక్కుతుంది. అద్భుతమైన ముఖచిత్రం గీసి పంపారాయన. దానితో ఒక ఉత్తరం వుంది. అందులో... "బన్ను గారికి, మీకు ఈ బొమ్మ నచ్చితే ప్రచురించగలరు..." అని! ఆ మహానుభావుడి సంస్కారం చూడండి. "నచ్చితే..." అని ఎవరు అడుగుతున్నారు? 'బాపు' గారు! 'మై గాడ్! ఆయన గీశాకా తిరుగుంటుందా?' ఆయన లేరని తెలియగానే 'మౌనం' నన్ను ఆక్రమించింది. నివాళులతో...

- బన్ను

మరిన్ని శీర్షికలు
pracheena prapancha charitra  book review