Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : పాల డిపో దగ్గర చందూని చూసిన సహస్ర, దీక్షలు  వాళ్ళ రూం ఆ వీధిలోనే ఉండి ఉంటుందని పసిగట్టి అతడిని ఫాలో అవుతారు. తర్వాత తీరిగ్గా గోడదూకి వాళ్ళింట్లోకి ప్రవేశిస్తారు................అక్కడ......

...............................................

‘‘చెప్తాగాని ఇది పట్టుకో’’ అంటూ స్క్రూ డ్రైవర్  తీసుకొని ప్లాస్టిక్  సంచిని సహస్ర చేతికిచ్చింది.  కిటికి గ్లాస్  రెక్కల్ని తెరిచింది.  లోన ఐరన్ ఫ్రేంని బిగించిన స్క్రూలను స్క్రూ డ్రైవర్  సాయంతో తీసే ప్రయత్నం ఆరంభించింది. కాస్త కష్టంగా ఉన్నా క్రమంగా ఒక్కో స్క్రూ ఊడి చేతిలోకి వస్తోంది.

‘‘ఏయ్  దీక్షా, ఇప్పుడెవరన్న మనల్ని చూస్తే నిజంగానే దొంగలమనుకుంటారు. దొంగలేగా ఇలాంటి పనులు చేసేది..?’’ అంది సహస్ర.

‘‘అంటే.......... నేను దొంగననుకుంటున్నావా?’’

‘‘ఛఛ ........ అలాగని కాదుగాని అస్సలు అనుభవం లేకపోతే ఇలాంటి పనులు కష్టం కదా...?’’

‘‘సర్లే........  దీనికి  కావలసింది అనుభవం కాదు ఆలోచన,  అఫ్ కోర్స్  చిన్నప్పుడు మా అల్లరిలో దొంగతనం కూడ ఓ భాగం అనుకో.’’

‘అలాచెప్పు మరి...’’

‘‘నీకు తెలుసా మన మథురైలో మా వీధి అమ్మాయిలందరికీ నేనే రింగ్  లీడర్ని.  అప్పుడు చూడాలి మా అల్లరి,  ఇంటికి తాళం పెట్టి వెళ్ళాలంటే జనం భయపడచచ్చేవారు, ఏ పెరట్లోను పళ్ళు కాయలు వదిలేవాళ్ళం  కాదు. అప్పుడప్పుడు పెరటి గుమ్మం తలుపు ఎలాగో తెరిచేసి కిచెన్ లో జొరపడి దొరికివన్ని తినేసి ఫ్రిజ్ లో కూల్ డ్రిరకులు ఖాళీ చేసేసి నానా భీభత్సం చేసి వెళ్ళిపోయేవాళ్ళం.  పొరబాటున ఎవరన్నా మా డాడీకి రిపోర్ట్ చేసారో అంతే సంగతులు,  వీలుచూసి చీకట్లో దొరకపుచ్చుకొని చితగ్గొట్టేవాళ్ళం... హైస్కూలు చదువయ్యే వరకు ఇదే వరుస కాలేజీలో జాయినయ్యాక కదా మనం కలిసింది.’’

అది గెస్ట్  రూంలా ఉంది.

అక్కడ ఒక డబుల్  కాట్ బెడ్,  సీలింగ్ ఫ్యాన్ ఒక టేబుల్  కుర్చీ తప్ప ఆ గదిలో చెప్పుకోతగ్గ ఫర్నీచరేమీ లేదు.  రూం డోర్  లాక్ చేయలేదు, తలుపు తెరుచుకుని హాల్లో అడుగుపెట్టారు.

గోస్వామికాలనీలో విల్లాలు  ప్లాన్లన్నీ ఒకటే గాబట్టి హాలు మిగిలిన గదులు అమరిక వాళ్ళకి కొత్త కాదు.  త్రి బెడ్రూమ్స్  విల్లాలు అవి. అన్నీ అటాచ్డ్ బాత్రూమ్స్ తో విశాలంగా ఉంటాయి. హాలు కూడ పెద్దది.

సెంటర్ ముఖద్వారం, దాని తిన్నగా బ్యాక్ డోర్ ఉన్నాయి. తూర్పు ఫేసు భవనం అది. కాబట్టి వెనక డోర్ కి రైట్లో వాయువ్యం వైపు బెడ్రూంని గెస్ట్ రూమ్ గా వదిలేసారు. ఆ రూమ్ కి దక్షిణం గోడనానుకొని హాలు నుంచి వెనక డోర్ కి నాలుగడుగుల నడవా ఉంది.

ఆ నడవానానుకొని దక్షిణం పక్కన ఉత్తరం ఫేస్ తో పక్కపక్కన రెండు బెడ్ రూంలున్నాయి.  రెండో బెడ్రూం నానుకొని ఆగ్నేయంలో కిచెన్,  కిచెన్ డోర్ కి ఇవతలగా హాలు వైపు ఓపెన్ గా పెద్ద డైనింగ్ టేబుల్  నాలుగు కుర్చీలు ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద సెంటర్లో డిష్ దాన్ని చుట్టూ అరడజను వూరగాయ పచ్చడి సీసాలు చక్కగా మూతలు పెట్టుకున్నాయి.

హాల్లో ఎటుచూసినా ఖరీదైన ఫర్నీచర్  ఉంది.  హాలు మధ్యలో మూడు సోఫా సెట్లు మూడు పక్కలా అమర్చి మద్యలో పెద్ద టీ పాయ్  ఉంచారు. ఆ పోఫాలకి ఎదురుగా మొదట బెడ్రూమ్  గోడ వద్ద పెద్ద టేబులుంది.  దాని మీద బిగ్ సైజు ఎల్సిడీ టి వి,  డి వి డి ప్లేయర్  మ్యూజిక్  సిస్టమ్,  పక్కన అనేక సీడి లతో ర్యాక్ ఉంది.

ఇక ముఖద్వారం పైన గణపతి లక్ష్మీ సరస్వతుల పెద్ద ఫోటో,  అటు ఈశాన్యం మూలన ఒక టేబుల్,  దాని పైన వెంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవార్లు,  శివపార్వతులు, శ్రీవళ్ళిదేవసేనసమేతశ్రీకుమారస్వామి ఫోటోలు పూలమాలలతో కనువిందు చేస్తున్నాయి.  అక్కడ నిత్యం పూజాదికాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఓ సారి కిచెన్ తోసహా అంతా చూసొచ్చాక...

‘‘ఏం చేద్దాం?’’ అంది సహస్ర

‘‘మనక్కావలసిన ఇన్ఫర్మేషన్  బయటదొరకదు,  బెడ్రూమ్ లు చెక్ చేద్దాం’’  అంది దీక్ష.

‘‘తాళం వేసుకెళ్ళారేమో’’  అని సందేహిస్తూ ఎదురుగా బెడ్ రూమ్  డోర్  హెండిల్ మీద చేయి వేసింది సహస్ర.  క్లిక్ మని చప్పుడు చేస్తూ తెరుచుకుంది అది. డోర్ లాక్ చేసిలేదు.  ఇద్దరూ లోనకెళ్ళారు. అది చందూ బెడ్ రూమ్. గదంతా చాలా నీట్ గా అందంగా అమర్చి వుంది,  టేబుల్ మీద కేబినెట్ ఫోటోఫ్రేమ్ ఒకటి ఉంది. అందులో చందూ తన తల్లిదండ్రులు ఇద్దరు చెల్లెళ్ళతో బాటు దిగిన ఫోటో వుంది.

పక్కన ఆల్బంలో పెద్దచెల్లెలు పెళ్ళి సందర్భంలో తీసిన ఫోటోలు చాలా వున్నాయి. ఆ ఫోటోల్లో ఎక్కడా విరాట్  లేడు. కాని చందూ విరాట్ లు కలిసి తీయించుకున్న ఫోటోలు కొన్ని విడిగా వున్నాయి.  చందూకి డైరీ వ్రాసుకునే అలవాటుంది.  టేబుల్  సొరుగులోని డైరీని తీసి పేజీలు కొన్ని తిరిగేయగానే అర్ధమైపోయింది.  ఆ విల్లా విరాట్ ది. తన ఫ్రెండు చందూని పిలిచి తన ఆఫీసులోనే ఉద్యోగం వేయించి దగ్గరుంచుకున్నాడు.  విరాట్  తన వంటకాల్ని ఎంత మెచ్చుకుంటాడో చందూ తన డైరీలో అనేక చోట్ల ప్రస్తావించాడు   విరాట్  స్వస్థలం కోయంబత్తూరు కాగా,  ఆ పక్కన ఉసిలంపట్టి గ్రామంలో చందూ ఓ రైతు కుటుంబానికి చెందినవాడనీ అతని జీతం నెలకు ముప్పైవేలని, పెద్ద చెల్లెలు పెళ్ళి తనే జరిపించాడనీ అర్థమయింది.

ఆ గదిలో కొంత సమయం గడిపి తర్వాత ఎక్కడివక్కడ యధాప్రకారం నీట్ గా సర్దేసారు.  తర్వాత పక్కనున్న విరాట్ గదిలో ప్రవేశించారు. లోన అడుగుపెడుతూనే యిద్దరికీ షాక్!  కొద్దిసేపు బొమ్మల్లా అలాగే నిలబడిపోయారు.

విశాలమైన ఆ గదిలో డోర్ కి ఎదురుగానే గోడకు చేర్చి డబుల్ కాట్  బెడ్  వుంది.  అక్కడ గోడకు వాల్  పోస్టర్  సైజులో రెండు పెద్దపెద్ద ఫోటోలు అంటించి ఉన్నాయి. ఆ పోస్టర్లలో వున్నది ఎవరో కాదు సహస్ర.  ఆ పోస్టర్లకు పైన గోడకు వేలాడుతున్న పెద్ద సైజు ఫోటోలోని దంపతులిద్దర్ని చూసి మరోసారి దీక్ష షాక్ అయింది. ఆ విషయం గమనించని సహస్ర  ‘‘ఓ మై గాడ్...  నా ఫోటోలు,  అవీ పోస్టర్  సైజులో,  వీటిని చూస్తుంటే నన్నునేను చూసుకున్నట్టుంది!   నా ఫోటోలు ఇక్కడికెలా వచ్చాయి..?’’ అంది ఉద్వేగంగా.

‘‘కంగారుపడకు, విరాట్ ఫోటోలు మన దగ్గరున్నట్టే నీ ఫోటోలు వీళ్ళ దగ్గరుంటే ఆశ్చర్యం ఎందుకు?  సరిగ్గా చూడు.  ఫోటోలో నువ్వేసుకున్న డ్రస్సు ఆ రోజు విరాట్ రైల్లో నిన్ను పలకరించినప్పటి డ్రస్సే...?’’ అంది దీక్ష.

‘‘యస్, అదే డ్రస్,  అప్పుడే తీసుండాలి’’

‘‘నా ఆశ్చర్యం అందుక్కాదు’’

‘‘ఇంకెందుకు?’’

‘‘ఆ ఫోటోలకు పైన వేలాడుతున్న ఫోటోలో దంపతుల్ని చూడు.’’

‘‘చూసాను.  ఏమిటి విశేషం?’’

‘‘వాళ్ళెవరో నిజంగా నీకు తెలీదా..?’’

‘‘తెలీదు చూడ్డానికి గుబురు మీసాలతో చాలా గంభీరంగా హుందాగా ఉన్నాడాయన,  ఆవిడ సాంప్రదాయంగా వుంది.  ఎవరా దంపతులు?’’‘‘ఆయన కోయంబత్తూరు కింగ్.   మల్టీ మిలియనీర్,  ఆయన పేరు వెంకటరత్నం నాయుడుగారు,  ఆయన భార్య మంగతాయారు.  కోయంబత్తూరులో ఒక నూలు మిల్లు, ఒక బట్టల మిల్లుకే అధిపతి.  అయిదు వందల మంది మిల్లులో పనిచేస్తుంటారు. అవిగాక ఇతర వ్యాపారాలు చాలా ఉన్నాయి.

వెంకరత్నం నాయుడుగారు మా నాన్న గారు క్లాస్ మేట్స్ . మంచి ఫ్రెండ్స్.  మా నాన్న గారు బతికున్న రోజుల్లో మధురై వస్తే మా యింటికి రాకుండా వెళ్ళేవారు కాదు. మమ్మీ డాడీ ఆక్సిడెంట్లో పోయినప్పుడు వచ్చి చూసి ఓదార్చి వెళ్ళారు. తర్వాత కలవటం కుదరలేదనుకో. ఇంతకీ...

వెంకటరత్నం దంపుతుల ఫోటో విరాట్  గదిలో ఎందుకుందో అర్ధంగావటంలేదు’’ అంది ఆలోచిస్తు దీక్ష,  ‘‘వెదికి చూద్దాం అదే అర్ధమవుతుంది.  ఆగు...  ఆ పోస్టర్ల కింద విరాట్ స్కెచ్ పెన్నుతో ఏదో రాసాడు’’ అంటూ సహస్ర డబుల్ కాట్ ఎక్కేసి దగ్గరకెళ్ళి చూసింది. ఆశ్చర్యంగా ఆమె కళ్ళు మరింత విశాలమయ్యాయి. ఒక ఫోటో కింద యిలా వ్రాసుంది.

‘‘మెరుపులా కనిపించి,  నాలో వలపు అలజడి రేపి,  తృటిలో మాయమయ్యావ్.  నీకోసమే  ఈ గుండె కొట్టుకుంటోంది.  తిరిగి నీ దర్శనం ఎప్పుడు?’’

రెండో ఫోటో క్రింద.

సహస్రా ఐ లవ్యూ అని వ్రాసుంది.

పసుపు రంగు మెరుపు ఇంకు స్కెచ్  పెన్ తో ముత్యాల్లా వ్రాయబడిన అక్షరాలను చూసి దిగ్భ్రాంతి లోనయి కాస్సేపు మోకాళ్ళ పై బెడ్ మీదే కూచుని ఆలోచనల్లో కూరుకుపోయింది సహస్ర.

ఇది కలా నిజమా?

తమ మధ్య గత పరిచయం లేదు,  ముందు వెనకా ఎన్నడూ చూసిన గుర్తులేదు,  కేవలం రైల్లో పావుగంట ప్రయాణంలో చూడ్డమే. తను ఆ కాస్త సమయం లోనే ఇంతగా అతడ్నిఇంప్రెస్ చేసిందా..? అతడికి చూడగానే తన మీద ఏర్పడిరది ఆకర్షణా... లవ్వా...?

ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి.

వయసులోని ప్రతి కన్నెపిల్లా కోరుకునే ఒక రాకుమారుని లక్షణాలు విరాట్ లో వున్నాయి. కాబట్టి తనూ ఆ రోజు అతడ్ని ఓరకంట వీక్షించింది.  ఒకవేళ  అతడి లాగే తనలోనూ లవ్ ఫీలింగ్స్  కలిగాయేమోగాని తనకయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లవ్ గురించిన ఆలోచనేలేదు,  ఇంతకీ ఎవరీ విరాట్? తిరిగి తిరిగి మళ్ళీ మొదటికొచ్చి ఆగాయి సహస్ర ఆలోచనలు.

ఇంతలో...

దీక్ష నవ్వటంతో...

సహస్ర ఆలోచనలు చెదిరిపోయాయి.

తిరిగి చూస్తే టేబుల్  ముందు తీరిగ్గా కుర్చీలో కూర్చునుంది దీక్ష.  ఉన్నట్టుండి ఏమైంది దీనికి?

‘‘ఎందుకే నవ్వుతావ్’’  కసురుకుంది.

‘‘నవ్వక ఏం చేయనూ .?  నువ్వు పడిపోయావ్’’

‘‘అదేనమ్మా ఎక్కడ కూచున్నావ్?  నువ్వంటే పడిచస్తున్న వాడి బెడ్  ఎక్కిమరీ కూచున్నావ్? నీ ఫోటోలు చూసి మురిసిపోతున్నావ్. నీ గురించి తను రాసుకున్న అక్షరసుమాల్నిచూసి ఆనందిస్తున్నావ్. దీనికి అర్ధం ఏమిటి?  ది గ్రేట్  జర్నలిస్టు సహస్ర లవ్ లో పడిపోయిందనేగా...?  ఎలాగూ అతని బెడ్ ఎక్కేసావ్ . అలాగే పడుకుని దొర్లు విరాట్  జన్మ ధన్యమైపోతుంది.  నువ్వు తన బెడ్ మీద పడుకున్నావని తెలిస్తే విరాట్ ని చూడాలి. అది తలుచుకుంటేనే నవ్వొచ్చింది!’’ అంది నవ్వాపుకొంటూ దీక్ష.

ఆ మాటలకి రోషంగా చూసింది సహస్ర.

‘‘అనవసరంగా నవ్వులు పారేసుకోకు,  నేనేమీ పడిపోలేదు’’  అంటూ మోకాళ్ళ మీద బెడ్  దిగటానికి ఇటు రాబోయింది.  అంతే... తల దిళ్ళ మీదకు అడ్డంగా వాలిపోయింది. ఈ సారి సహస్రకీ నవ్వాగలేదు.

ఇద్దరూ నవ్వుకున్నారు.

బెడ్ దిగింది సహస్ర. ‘‘ఇంతకీ వివరాలేమన్నతెలిసాయా?’’ అనడిగింది.

‘‘ఆహా చక్కగా తెలిసాయి.  ఇటుచూడు’’  అంటూ టేబిల్  సొరగులోంచి ఒక ఫోటో తీసి చూపించింది.

‘‘ఫామిలీ గ్రూప్  ఫోటో . వెంకట్రత్నం నాయుడు గారు ఆయన భార్య మంగతాయారు, ఇటు తండ్రి పక్కన నిలబడిన ఆయన పెద్దకొడుకు విక్రాంత్,  ఆయన భార్యపిల్లలు,  ఇటు కుడి పక్క తల్లి పక్కన నిలబడింది ఎవరు చూడు...’’  వివరించింది దీక్ష.

నిజంగానే సహస్ర కళ్ళు ఆశ్చర్య సంభ్రమాలతో విశాలమయ్యాయి. తల్లి పక్కన నిలబడింది ఎవరో కాదు విరాట్.‘‘ఏమిటే...  విరాట్ వెంకరత్నంనాయుడు గారి...’’ అర్థోక్తిలో ఆగిపోయింది.

‘‘ఇంకా డౌటా... ఆయన చిన్న కొడుకు’’ అంటూ ఫోటోని యధా ప్రకారం డ్రాయరు సొరుగులో సర్దేసింది దీక్ష.

అల్మారా లోని సూట్ కేస్ లో విరాట్  పాస్ పోర్టు దొరికింది. డిగ్రీలకు సంబంధించిన జిరాక్స్  కాపీలు దొరికాయి. ‘‘నీలాగే  చాలాకాలం ఫారెన్ లో చదువుకొనొచ్చాడు...’’

‘‘అదంతా సరేగాని ఇంతకీ అంత గొప్ప కుటుంబానికి చెందినవాడై ఉండి ఇక్కడ అనామకునిలా ఉండి వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తూ రైల్లో ఆఫీసుకు వెళ్ళిరావటం ఏమిటి?’’

‘‘నీ ప్రశ్నలకు సమాధానాలు చందూ డైరీలో ఉన్నాయి.  విరాట్ ది  బైకు.  ఇద్దరూ ఆ బైక్ మీదే ఆఫీసుకు వెళ్ళొస్తారు. బైక్ సర్వీస్ కిచ్చినప్పుడు వారం రోజులు ట్రైన్ లో ఆఫీసు కెళ్ళారు.  ఆ సమయంలోనే రైల్లో కలిసాం,  ఇక అసలు విషయం విరాట్ ఇల్లు వదిలి రెండేళ్ళవుతోంది.  వెంకటరత్నం నాయుడు గారు పట్టుదల మనిషి.  మాటకు కట్టుబడే మనస్తత్వం. ఆయనకు విక్రాంత్, విరాట్లకు ముందుపుట్టిన కనకమహాలక్ష్మి అనే కూతురుంది.  విరాట్ కి అక్క. ఆమెకు సాగరిక అనే కూతురుంది. అంటే వెంకటరత్నంనాయుడు గారి మనవరాలు.  విరాట్ కు ఈడు జోడు.  సాగరికను తన కోడల్ని చేసుకుంటానని కూతురుకి మాటిచ్చాడాయన. అక్క కూడ తన తమ్మున్ని అల్లుడ్ని చేసుకోవాలని పట్టుదలగా వుంది. కాని మేనరికం చేసుకోవడం విరాట్ కి ఇష్టంలేదు. అక్కడే ఉంటే నాయుడుగారు సాగరికతో బలవంతంగా తన పెళ్ళిని జరిపించేస్తాడని భయపడిన విరాట్ చెన్నై పారిపోయి వచ్చి అజ్ఞాతవాసం గడుపుతున్నాడు.’’

‘‘సో... విరాట్దీనాకేసే. ఇంతకీ విరాట్ ఇక్కడున్నసంగతి కొయంబత్తూరులో ఎవరికీ తెలీదన్న మాట.’’

‘‘అతను అప్పుడప్పుడూ ఇంటికి ఫోన్ చేసి తను ఢల్లీిలోను, బొంబాయిలోనో ఉంటునట్టు అబద్దంచెప్పి తన వాళ్ళ యోగక్షేమాలు అడిగి లుసుకుంటున్నాడు.  చందూ కూడ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు.  ఒక్కటి మాత్రం నిజం.  విరాట్  నిన్నులవ్ చేయటం.’’‘‘అంటే నేను విరాట్ ని లవ్ చేయాలా?’’

‘‘చేస్తే తప్పేమిటంటాను.’’

‘‘నెవ్వర్.’’

‘‘ఓహో,  విరాట్ కన్నా గొప్పవాడొస్తాడనా?’’

‘‘దీక్షా ప్లీజ్.  నా కసలు పెళ్ళిచేసుకునే ఉద్దేశమే లేదు.  ఒకవేళ చేసుకోవాలనిపిస్తే అప్పుడు చూద్దాం, ఆర్గ్యుమెంట్స్ ఆపి ముందు ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం పద.  భోజనం వేళయింది . ఆకలి....’’

‘‘కడుపు ఆకలికి భోం చేస్తాం.  వయసు ఆకలికి మగ తోడు కోరదా? పెళ్ళే వద్దంట. ముఖం చూడు ఇలాగే ముసలిదానివై పోతావా?’’‘‘ఆహా నాకు చెప్తున్నావ్  సరే నీ సంగతేమిటి?  నువ్వు పెళ్ళి చేసుకోవా?’’

‘‘నచ్చినవాడు దొరకనీ నేనూ చేసుకుంటాను.’’

‘‘కదా...  ఆ టైమొస్తే అన్ని జరుగుతాయి. టైమైంది ఎక్కడివక్కడ సర్ధు వెళ్ళిపోదాం.’’

ఇక ఆలస్యం చేయలేదు దీక్ష.

యధాప్రకారం ఎక్కడవక్కడ సర్దేసింది.  వచ్చిన పని అయిపోయింది గాబట్టి ఇద్దరూ బయటకొచ్చి డోర్ మూసారు.

కిచెన్  వైపు దారి తీసింది దీక్ష.‘‘మళ్ళీ అటెక్కడికే మనం వెళ్ళాల్సిందిటు’’ గుర్తుచేసింది సహస్ర.‘‘నాకు తెలుసు. ఆకలంటున్నావ్ గారా...’’ అంది దీక్ష.‘‘ఇక్కడా... ఏందో కొంపముంచేలాఉన్నావ్...’’

‘‘ఏం మునిగిపోవులే.  ప్రస్తుతం మనం ఈ ఇంటి అతిధులం, వచ్చిన వాళ్లం భోం చేయకుండా వెళ్తే గృహస్తులు పాపం బాధపడతారు. ఆ పైన చందూ...  ఆయన వంటకాల్నివిరాట్ మెచ్చుకొంటున్నాడంటే ఖచ్చితంగా బాగుండాలి. కిచెన్ లో ఏమున్నాయో మొత్తం కాళీ చేసి వెళ్ళిపోదాం. నువ్విలా డైనింగ్ టేబుల్ ముందుకూచో. నే వెళ్ళితెస్తాను.’’

కిచెన్ లో ఫ్రిజ్ ఓపెన్ చేసారు.

ఉదయం లంచ్ బాక్కుల్లో పట్టుకెళ్ళగా ఇంకా ఒక మనిషికి సరిపడా రైస్ ఉంది. చికెన్ కర్రీ ఉంది. ఉదయం వండి కొద్దిగా బాక్సుల్లో వేసుకెళ్ళుంటారు,  కర్రీ అద్భుతంగా ఉంది.  పక్కన అయిదారు దోసెలకు సరిపడా దోసెపిండి రెడీగా ఉంది. ఇంకా సాంబారు, గుత్తి వంకాయ కూర, గడ్డ పెరుగు అబ్బో వాటిని చూడగానే అమ్మాయిల్దిరికీ ఆకలి రెట్టింపయింది. అన్నీ ఫ్రిజ్ లోంచి బయటికి తీసేసి స్టౌ మీద వేడి చేసుకున్నారు, పెనం మీద చెరో మూడు దోసెలు వేసుకుని పిండి కాళీ చేసారు. అన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉంచుకొని ముందుగా దోసెలు తర్వాత రైసు తిన్నారు. చికెన్ కర్రీ ఖాళీ అయిపోయింది. సాంబారు ఫినిష్. పెరుగు సగం కాళీ. సుష్టుగా భోంచేసి లేచారు.

‘‘ఏ మాటకామాట చెప్పుకోవాలి దీక్ష, చందూ వంట అదుర్స్’’ అంటూ మెచ్చుకుంది సహస్ర.

‘‘అద్భుతంగా ఉంది. వంక చెప్పలేం. ఇక లే వెళ్ళిపోదాం’’ అంది దీక్ష.

‘‘ఏంటి...  ఇవన్నీ యిలా వదిలేసా...?’’

‘‘వదలక..? అంట్లు తోమి సర్ది వెళ్దామా? ఎవరుతిన్నారో అర్దంగాక వాళ్ళని కాస్సేపు జుత్తుపీక్కోనీ,  మన పని అయిపోయింది. కమాన్.’’ఇద్దరూ వచ్చిన దారినే ఇంట్లోంచి బయటకొచ్చారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్