Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విరాట్, చందు ఇంట్లో లేని టైం లో వాళ్ళింట్లోకి ప్రవేశిస్తారు సహస్ర, దీక్షలు....ఆ ఇంట్లోని ప్రతి వస్తువూ చూసి అతడి అభిరుచికి ముగ్దురాలౌతుంది సహస్ర. ఒక గదిలో తన ఫోటోలకు అందమైన ఫ్రేము కట్టి గోడకు అమర్చడం చూసి తనను అతడెంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటుంది. అతడి అమ్మానాన్నలెవరో తెలిసేసరికి ఆశ్చర్యపోతారు స్నేహితురాళ్ళిద్దరూ.......

.................ఆ తర్వాత.......

దీక్ష కిటికీ ఫ్రేంని జాగ్రత్తగా ఎప్పటిలా ఉంచి స్క్రూలు బిగించి కిటికి రెక్కలు మూసేసింది.  ఈ సారి పక్క కాంపౌండ్ కుక్క కంట పడకుండా రెండో పక్కనుంచి తిరిగి ముందు భాగానికొచ్చారు. ఎవరూ చూడ్డం లేదని గమనించాక గోడ దూకి రోడ్ మీదకు వెళ్ళిపోయారు.

ఆ రోజు...

విరాట్ చందూలు ఇంటి కొచ్చేసరికి రాత్రి ఏడు గంటలు దాటింది సమయం. చందూ బైక్ దిగి గేటు తాళం తీసి విరాట్ లోనకెళ్ళగానే తిరిగి గేటు మూసి లాక్ చేసాడు.

ఇంటి తాళం తీసి లోనకెళ్ళాడు చందూ.  చకచకా ఇంట్లో లైట్లు వెలిగాయి ఇంతలో`

లోపట్నుంచి చందూ కెవ్వున అరవటం విని ఉలికిపడ్డాడు విరాట్. ఏం జరిగిందోనని కంగారుపడుతూ లోనకు పరుగెత్తాడు.అతను వెళ్ళేసరికి చందూ హాలు మద్యలో నిలబడి దయ్యం పట్టిన వాడిలా పిచ్చి చూపులు చూస్తున్నాడు.

‘‘ఏరా...? నువ్వే అందర్నీ భయపెడతావ్, నీకు భయమేంటి...?  ఏమైంది నీకు...?’’  అంటూ భుజం మీద చెయ్యేసాడు. అంతే మరోసారి కీచుమనరచి దయ్యాలు...  భూతాలు... అంటూ బయటకు పారిపోయాడు చందూ,  వెంటనే అతడ్ని వెనక్కి లాగి వీపు మీద చరిచాడు విరాట్.

‘‘పిచ్చి వేషాలేస్తే చంపేస్తాను.  మర్యాదగా ఏమైందో చెప్పి తగలడు’’ అనరిచాడు కోపంగా . భయం భయంగా చూసాడు చందూ.‘‘ఏరా............. మనింట్లో దయ్యాలు భూతాలు అలాంటివేమన్నా ఉన్నాయా?’’  అనడిగాడు వణుకుతున్న గొంతుతో.‘‘లేకేంరా. ఉన్నాయి. నువ్వోదయ్యం, నేను భూతం. పెద్ద పిశాచాన్ని నేనిక్కడుండగా ఇక్కడికేమొస్తుంది? ఇంతకీ ఏమైందో చెప్పు.’’‘‘అలా ఓ సారి మన డైనింగ్  టేబుల్ వంకచూడు,  తెలుస్తుంది.’’

‘‘చూసాను టేబులు కుర్చీలున్నాయి.  ఇంకేముంది?  కుర్చీల్లో కూచుని భూతాలు విందు చేసుకుంటున్నట్టేమన్నా కన్పిస్తుందా?’’‘‘ఇంకెక్కడి విందు రా నాయనో...  అవి విందారగించి ఎప్పుడో వెళ్ళిపోయాయి.  సరిగా చూడరా అది డైనింగ్  టేబుల్లా ఉందా?  కార్పోరేషన్  వాళ్ళ డంపింగ్  గ్రౌండ్ లా ఉంది. ఉదయం మనం వెళ్ళేప్పుడిలాగే ఉందా? అద్దంలా ఎంత నీట్ గా ఉంచాను.  ఇప్పుడు చూడరా ఎలా ఉందో....?’’

చందూ అరుస్తుంటే...

అప్పుడు గమనించాడు విరాట్.

అతడికీ మతి పోయినంతపనైంది.

‘‘వేసిన తాళాలు వేసినట్టున్నాయి. ఇంట్లోకి ఎవరు వచ్చుంటారు దయ్యాలు గాక...?  వార్నాయనో...  నా చికెన్ కర్రీ మాయమై డిష్ మిగిలింది.  రైస్ బౌల్ ఖాళీ , సాంబారు ఖతం, పెరుగు ఫినిష్...  ఫ్రిజ్ లో ఏదీ వదల్లేదురా దేవుడా...  దోసెపిండి కూడా ఖాళీ చేసే సాయిరా...’’‘‘చందూ,  కాస్సేపు నీ చిందులు ఆపుతావా? వెదవది తినే వాటి గురించి ఆలోచిస్తావేరా?  అర్థం కాలేదా ఇది దయ్యాల పనికాదు,  ఇంట్లో దొంగలు పడ్డారు.  డౌట్ లేదు, ముందు ఏం పోయాయో గదుల్లో చూడాలి’’  అంటూ వేగంగా తన గదిలోకి పరుగెత్తాడు విరాట్.  దొంగలనగానే చందూలో చైతన్యం వచ్చింది.  కంగారుగా తన గదిలో దూరాడు.

పావు గంట తర్వాత...

వెళ్ళినంత వేగంగానూ తిరిగి...  బయటి కొచ్చేసారిద్దరూ...

‘‘నీ గదిలో ఏం పోయాయి...?’’ అడిగాడు చందూ.

‘‘ఏం పోలేదు ఎక్కడివక్కడ భద్రంగా ఉన్నాయి.  బీరువా తెరవలేదు.  టేబుల్  సొరుగులో ఉంచిన నా గోల్డ్ కాయిన్,  నా బ్రాస్లెట్ అలాగే ఉన్నాయి, నీ గదిలో ఏం పోయాయి?’’

‘‘ఏం పోలేదు. అంతా మిస్టరిగా ఉంది. దొంగలెవరో గాని కేవలం భోజనం కోసమే దొంగతనానికొచ్చినట్టుంది. అంటే... ఇది దయ్యాల పనే. ఒకటి కాదు,  రెండు దయ్యాలు. రెండు కంచాల్లో వున్నవన్నీ వడ్డించుకొని పీకల దాకా తిని పోయాయి’’

‘‘దయ్యాలు సెంటు పూసుకొంటాయా?’’

‘‘సెంటా...........’’  అంటూ మరోసారి కెవ్వున అరిచాడు చందూ.

‘‘అవున్రా,  గమనించనే లేదు,  జాస్మిన్ సెంటు వాసనొస్తుంది కదూ,  గదుల్లో కూడ ఈ వాసనొస్తోంది...  అంటే వచ్చింది ఆడ దయ్యాలంటావా.’’

‘‘ఆడ దయ్యాలు కాదు ఆడ దొంగలు,  ఇద్దరమ్మాయిలు మన ఇంట్లో పడి పీకల దాకా మెక్కి వెళ్ళిపోయారు.  అసలు వాళ్ళు ఎలా వచ్చారో చెక్  చేయాలి పదా’’  అంటూ కదిలాడు విరాట్.

ఒక రౌండ్  ఇల్లు మొత్తం గదులు కిటికీలు తలుపులు చెక్ చేసారు.  ఏమీ అర్ధం కాలేదు.  రెండో రౌండ్  చెకింగ్ లో గెస్ట్ రూం కిటికీ గ్లాస్ డోర్ తెరిచి ఉండటం కంటపడింది. అనుమానంతో ఐరన్ గ్రిల్  ఫ్రేం ని పరిశీలిస్తే విషయం తెలిసింది.

‘‘డౌటే లేదు, ఈ కిటికీ గుండా లోనకొచ్చి వెళ్ళేప్పుడు ఎప్పటిలా ఫ్రేంని బిగించి వెళ్ళారు.  వాళ్ళు ఇంకో సారి వచ్చినా రావొచ్చు. రేపటి నుంచి ఏ కిటికీ కూడ వదలకుండా అన్నీ మూసేయాలి’’  అన్నాడు విరాట్.

తిరిగి హాల్లోకొచ్చారిద్దరూ.

‘‘విరాట్ నాకో డౌటురా.  ఒక వేళ మన గురించి వివరాలు తెలుసుకోవాలని సహస్ర దీక్షలు ఇలా వచ్చుండొచ్చా..?’’ తన సందేహం బయటపెట్టాడు చందూ.‘‘నీ డౌట్ నాకూ వచ్చింది, కాని మనం గోస్వామి కాలనీ లో వుంటున్నట్టు వాళ్ళకెలా తెలుస్తుంది...?  పోస్టర్లలో ఇచ్చిన సెల్ నెంబర్  కోయంబత్తూరులో తీసుకుంది. ఆ నంబర్ తో అడ్రసు తెలుసుకోలేరు.  కాబట్టి వచ్చింది వాళ్ళు కాదు.  కాలనీ అమ్మాయిలెవరో కావాలని ఈ తుంటరి పని చేసుంటారు.  రేపట్నుంచి మన జాగ్రత్తలో మనం ఉందాం.  తలపోటుగా ఉంది. అవన్నీ సద్దుకునే ముందు కాస్త టీ అయినాయివ్వరా?’’

‘‘వచ్చిన శంకిణీ స్త్రీలు ఎవరో గాని విందారగించాక పాల ప్యాకెట్లో పాలుకూడ కాచుకొని హార్లిక్స్  కలిపి తాగి మరీ వెళ్ళారు.  లాభం లేదుగాని పద. మనం ఫుడ్ కి బయటికి పోవాల్సిందే ఈ పూటకి.  వచ్చాక ఇల్లంతా సర్దుకుందాం.’’  అన్నాడు తెగ బాధపడిపోతూ చందూ.‘‘వచ్చిన వాళ్ళొచ్చినట్టే తిరిగి ఇంటికి తాళం పెట్టి బయటకు బయలుదేరారిద్దరూ.

ఆ రోజు జలుబు రొంపతో బాటు తల భారంగా ఉందని దీక్ష షాపింగ్  మాల్ కి పోకుండా సెలవు పెట్టి ఇంట్లోనే ఉండపోియింది.  సహస్ర యథా ప్రకారం డ్యూటీకి వెళ్ళిపోయింది.

ఇంచుమించుగా ఇవే కారణాలతో అటు మొదటి వీధి మూడో ఇంట్లోని చందూ కూడ ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. విరాట్  ఒక్కడే ఆఫీసుకెళ్ళాడు. అలా అటు మూడోవీధి చివరింటి దీక్ష ఇటు మొదటి వీధి మూడోఇంటి చందూలు ఆ రోజు ఇళ్ళకు పరిమితమైపోయారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు కన్పించిన సూర్యుడు క్రమంగా అదృష్యమైపోయాడు.  తూర్పు దిక్కు నుంచి సముద్రం మీదుగా చెన్నై నగరం మీదకు మూసుకొచ్చిన నల్లటి మబ్బులు దినకరుడ్ని తమలో దాచేసుకున్నాయి. ఈదురు గాలులు ఆగి ఆగి వీస్తూ వర్షా గమనాన్ని సూచిస్తున్నాయి.  వాతావరణం చలి చలిగా ఆహ్లాదకరంగా మారింది.

సుమారు పది గంటల తర్వాత ఒక పావు గంట వాన జల్లుపడి ఆగింది. ఆ సమయంలో చేతి సంచితో బాటు గొడుగు తీసుకొని కూరగాయల మార్కెట్ కి బయలుదేరింది దీక్ష. అర్ధ గంట ఆలస్యంగా అటు నుంచి తనూ మార్కెట్ కి బయలుదేరాడు చందూ.  సరిగ్గా మార్కెట్  గేటు నుండి ఏబై గజాల దూరం ఉంటుంది రోడ్డు.  కాయగూరల సంచీతో మార్కెట్ గేటుదాటి దీక్ష రోడ్  వైపు వస్తూండగా చందూ రోడ్డు నుంచి మార్కెట్ సందు లోకి వస్తూ కన్పించాడు.

ముందుగా దీక్ష అతడ్ని చూసి అదిరిపడింది. అప్పటికే పదిహేనడుగుల ముందుకొచ్చేసింది. వెనక్కి తిరిగి మార్కెట్లోకి పారిపోయి తప్పించుకునే సమయం లేదు. ఆమె అతడ్ని చూసిన పదో సెకనులోనే చందూ కూడ ఆమెను చూసి గుర్తుపట్టేసాడు.  తన కళ్ళని నమ్మలేక కళ్ళు నులుముకొని మరీ చూసాడు.

సందేహం లేదు...

ఆమె దీక్ష !

తను ఇక్కడుందేమిటి...?

ఇదే మార్కెట్ నుంచి కాయగూరలు తీసుకుంటోందంటే డౌటే లేదు.  ఈ పరిసరాల్లోనే ఎక్కడో తను ఉంటోంది.  తోక దొరికితే కుందేలు దొరికినట్టే. ఈ దీక్షను పట్టుకుంటే సహస్ర చిరునామా దొరికిపోతుంది.

ఈ లోపల...

దీక్షకు దిక్కు తోచక కళవరపడిపోతూండగా క్షణకాలం కాలు,  చెయ్యి ఆడలేదు.  తనను చూసేసాడు.  ఏదోటి చేసి తప్పించుకోకపోతే కొంప మునుగుతుంది. వెంటపడి సహస్ర గురించి అడుగుతాడు, ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి?

దీక్ష ఉన్నట్టుండి మెల్లకన్ను పెట్టి ఎడం చెయ్యి మోకాలి మీద వేసుకొని అవిటి దానిలా ఎత్తెత్తి అడుగులేస్తూ నడక ఆరంభించింది.  అది చూసి...

‘‘ఓసినీ...  ఇలాంటి విద్యలు కూడ ఉన్నాయా నీ దగ్గర?  నన్ను చూసి నటిస్తున్నావంటే మేం ఈ ప్రాంతంలోనే ఉన్నట్టు తెలుసన్న మాట.  విరాట్ రైల్వే స్టేషన్లో అతికించిన పోస్టర్లను చూసారన్నమాట. చూసే తప్పించుకు తిరుగుతున్నారన్నమాట.  రా... రా...  నీ పని చేప్తా’’ అనుకుంటూ తనూ ఆమెను చూసీ చూడనట్టే దాటి ముందుకెళ్ళి పోయాడు చందూ.దీక్షకి చందూ తనని గుర్తుపట్టలేదని ఒకటే సంతోషం. రోడ్డెక్కితే చాలు జంపయిపోవచ్చు. నాలుగడుగులు ముందుకొచ్చేసింది. ఇంతలో వెనక నుంచి...

‘‘ఇదిగో అమ్మాయి దీక్షా...  కాలికేమైందే అలా కుంటుతున్నావ్...?’’  అంటూ తెలిసినావిడ ఎవరో పిలవటంతో సహజమైన నడకతో గిరుక్కున తిరిగి చూసింది.  మరో షాక్...

ఎదురుగా చందూ నిలబడున్నాడు.  అక్కడెవరూ తెలిసిన ఆడవాళ్ళు ఎవరూ లేరు,  మరి తనను పిలిచిన లేడీ ఎవరు...?  దీక్ష కంగారుగా చూస్తుండగా అంతలో... ‘‘ఏమిటి...? మరీ షాకయి పోవద్దు  పిలిచింది నేనే!’’ అంటూ తిరిగి అదే లేడీ గొంతుతో మాట్లాడిరది ఎవరోకాదు, ఎదురుగా ఉన్న చందూ.

‘ఓర్నాయనో,  వీడిగొంతు అమ్మాయి గొంతులా మారిపోయిందేమిటి?’  అనుకునే లోపు చందూ మామూలు గొంతుతో...‘‘నువ్వు దీక్షవని నాకు తెలిసిపోయింది. నీ ఓవర్ యాక్షన్ కాస్త అపితే కాస్సేపు మాట్లాడుకోవచ్చు’’ అన్నాడు.

చందూ తనను చీట్ చేసాడని అర్ధం కాగానే దీక్షకు పిచ్చి కోపం ముంచు కొచ్చింది,  ‘‘గొంతు మార్చి మోసం చేస్తావా...?  ఆగు నీ పని చెప్తా’’ అనుకుంటూ స్ట్రైయిట్ గా నిలబడి ఉరిమి చూసింది. ‘‘ఎవరు..? ఎవరు  నువ్వు..? నాతో పనేమిటి వెళ్ళు వెళ్ళు’’ అంటూ విస విసా రోడ్ వైపు అడుగులేసింది. కాని వదలకుండా ఆమె దారికి అడ్డం వచ్చేసాడు చందూ.

‘‘నీ పేరు దీక్ష, అవునా..?’’ అనడిగాడు.

‘‘లేదు నా పేరు రక్ష’’ అంది.

‘‘శిక్ష ఏమీ కాదు...? బుకాయించక... దీక్షననగానే నువ్వు వెనక్కి తిరిగి చూసావ్..?’’

‘‘నేను నిన్ను చూళ్ళేదు. అయినా గొంతు మార్చి అమ్మాయిలా పిలవడానికి సిగ్గు లేదూ?’’

‘‘నువ్వు అవిటి దానిలా నడిచి నన్ను ఏ మార్చాలని చూసావ్.  నీకు సిగ్గుందా..?’’

‘‘హలో...  ఎవరయ్యా నువ్వు?  నా వెంటపడుతున్నావ్,  నీకేం కావాలి..?’’ కాస్త గొంతు పెంచింది దీక్ష.

అప్పుడే చుట్టు పక్కల వాళ్ళ దృష్టి తమ మీద పడింది.  అల్లరి చేసి తప్పించుకోవాలని ప్లానా?  చెప్తా అనుకుంటూ ‘‘ చూడు దీక్ష సహస్ర ఎక్కడుందో చెప్పు.  వెళ్ళిపోతాను’’ అన్నాడు.

‘‘సహస్ర ఎవరూ...?’’ అంది అమాయకంగా పోజిచ్చి.

‘‘సహస్ర తెలీదా..? నువ్వు పెద్ద మాయలేడివని అర్దమైపోయింది..?  వదిలితే చేతికి దొరకవు.  మర్యాదగా సహస్ర ఎక్కడుందో చెప్తావా లేదా..?’’

‘‘చెప్పను ఏం చేస్తావ్..?  మీది మీది కొస్తున్నావ్...? ఏంటి ఉద్దేశం...?  ఈవ్ టీజింగ్ అంటే పోలీసులే రానక్కర్లేదు.  పబ్లిక్ నిన్ను పచ్చడి చేస్తారు. మీ ఉసిలం పట్టి అనుకున్నావా..?’’  అనేసి గబుక్కున నాలిక్కరుచుకుంది.  టంగ్ అనవసరంగా స్లిప్పయింది. ఏం టెన్షన్ పెడతాడో అని గాభరా పడి తప్పించుకు పోబోయింది దీక్ష.

ఉసిలంపట్టి అనగానే ఉలిక్కిపడ్డాడు చందూ...

తనది ఉసిలంపట్టి గ్రామమని ఈవిడకెలా తెలుసు...?!!

వామ్మో...  తమ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్  పట్టేసినట్టుంది. అన్నీతెలిసే నాటకాలాడుతోంది.  కోపంతో మళ్ళీ ఆమె దారికి అడ్డం వచ్చేసాడు.

‘‘ఏయ్ శంకిణీ.... ఆగు’’ అన్నాడు చందూ.

‘‘నేను శంకిణీనా...’’

‘‘శంకిణీ లంకిణీ,  శాకిణీ, ఢాకిణీ అన్నీనువ్వే. మాది ఉసిలంపట్టి అని నీకెలా తెలుసు..?’’

‘‘మరీ ఆవేశపడకు.  ఉసిలంపట్టి కుర్రాళ్ళు తిక్కవేషాలేసి నా వంటలు అద్భుతంగా చేస్తారని విన్నాను. అందుకే అలా అన్నాను.’’

‘‘వంటలు.... ఓసినీ... నాకిప్పుడర్దమైపోయింది. మా యింట్లో పడ్డ ఆడ దొంగలు మీరే కదూ...?’’

‘‘దొంగలేమిటి? కాసేపాగితే డైరీలు చదివేసానని కూడ అంటావ్. తప్పుకోరా... నేను వెళ్ళాలి’’.

‘‘నన్నుఏరా అంటావా...’’

‘‘నువ్వు నన్ను ఒసే అన్నావ్ గా నేనంటే తప్పా?  పొద్దుటే ఎవరి ముఖం చూసానో,  జిడ్డులా తగులుకున్నావేంట్రా బాబూ.  ఇలా కాదుగాని ఆగు నీ పనిచెప్తా...’’ అంటూ చుట్టూ చూసింది దీక్ష.

అప్పటికే మార్కెట్ కొచ్చిన కొందరు స్త్రీ పురుషులు వచ్చినపని మర్చిపోయి దూరంగా ఉండి చోద్యం చూస్తున్నారు. ఇటు పూల కొట్టు పరిమళం, తమలపాకుల కొట్టు తంగపుష్పం,  కొబ్బరికాయల కొట్టు దశావతారం అంతా ఓ పక్కవ్యాపారం సాగిస్తూనే ఓ కన్ను ఇటేసి గమనిస్తున్నారు.

‘‘ఇదిగో పరిమళం పిన్ని,  తంగపుష్పం అత్తా,  దశావతారం మావయ్యా...  రండి రండి కాపాడండి’’ ఉన్నట్టుండి అరిచింది దీక్ష.అదిరిపడ్డాడు చందూ.

అయ్యా బాబోయ్  వరసలు కలిపి మరీ అందర్నీ పిలిచేస్తోంది. ఖచ్చితంగా ఇది నన్ను తన్నించే ఉద్దేశంలోనే ఉంది.  ఎస్కేపవ్వటం మంచిదేమో... కంగారు అణచుకుంటూ ఆలోచిస్తున్నాడు చందూ. కాని పారిపోడానికి మనసంగీకరించటం లేదు. ఇంతలో చుట్టూ జనం చేరిపోయారు.


చెంగు తిప్పి  బొడ్లో  దోపి  చందూనూ ఎగాదిగా చూసింది పరిమళం.  ఆమె తీరు చూస్తే ఎలాంటి మగాడ్నయినా ఒక్క గుద్దుతో మట్టి కరిపించేలా ఉంది.

‘‘ఏంది దీక్షమ్మా,  ఇందాకట్నుంచి చూస్తున్నాను.  ఏంటి మీ యవ్వారం?  ఈ పిల్లగాడు నిన్నల్లరి చేస్తున్నాడా సెప్పు, జడ్జిగారి పిల్లదాన్ని నలుగురు తుంటరోళ్ళు ఏడిపిస్తుంటే పట్టి కొట్టి అదో..  ఆ సెట్టు కింద గుండు కొట్టి పంపించినాం. చెప్పు దీక్షమ్మ ఏం జరిగింది?’’ ఇంత లావున నోరు తెరిచి పరిమళం అరుస్తుంటే చందూకి అరచేతులు చెమటలు పట్టేశాయి. ఇంతలో దశావతారం కల్పించుకొంటూ ఓసి  ‘‘ఆగండెహె... ఈ బాబు చాలా మంచోడు, అలాంటోడు కాదు. అసలేం జరిగిందో విచారించండి. ఇద్దరూ మన మార్కెట్ కివచ్చిపోయేవాళ్ళేగా. ఏనాడన్నా గొడవకెళ్ళినారా ఏంటి..? అంటూ చందూకి సపోర్టు రావటంతో కాస్త ఊపిరి తీసుకున్నాడు చందూ.

వెంటనే తంగపుష్పం అందుకుంటూ. ‘‘ఈ మగాళ్ళకి ఎప్పుడేం పాడుబుద్ది పుడతాదో...  నువ్వు చెప్పు దీక్షమ్మ, నిన్నుఏడిపిస్తున్నాడా...? భయపడక. చెప్పు. నాలుగు తగిలిస్తే మళ్ళీ నీ జోలికి రాడు’’ అనరిచింది.

చందూకి గుండెల్లో రాయిపడినట్టయింది. దీక్ష సైగ చేస్తే చాలు ఆడాళ్ళంతా తనకి దేహశుద్ది చేసేలా ఉన్నారు. పారిపోడానికి దారి ఎటుందాని అతడి కళ్ళు వెదక సాగాయి. కాని దీక్ష ఎలాంటి సైగ చేయకుండానే సిగ్గుపడిపోతూ... ‘‘ఛఛ అలాంటిదేం కాదత్తా’’ అంది.

‘‘మరింకేంటి తల్లీ ఏంటి మీ గోల.?’’ విసుగ్గా అరిచింది పరిమళం.‘‘మరి.... మరి...  ఇతనెవరో కాదు పిన్నీ నా బావ!’’ అంది దీక్ష.

అంతే!

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana