Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మంచి బహుమతి

good gift

ఆరవతరగతి గది... పాఠం చెప్తోన్న సైన్స్ టీచర్ పల్లవి అటెండర్ నోటీస్ బుక్ పట్టుకుని రావడంతో పాఠం ఆపి ఆ నోటీస్ అందుకుని చదివింది....నవంబరు 14న చాచానెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం లాగే ఈసారి కూడా స్కూల్లో జరిపే ఆటల పోటీల్లోను, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనదలచిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆ నోటీస్ సారాంశం...

పల్లవి చెప్పిన విషయం విని తమ పేర్లు నమోదు చేసుకున్నారు కొందరు పిల్లలు....నోటీస్ తీసుకుని అటెండర్ వెళ్ళిపోగానే తిరిగి పాఠం మొదలుపెట్టబోయిన పల్లవి ఏదో గుర్తొచ్చి, " అవునూ..శ్రీజా నీ పుట్టిన రోజు కూడా నవంబర్ 14న నే కదూ.." అంది..." అవును టీచర్.." అంది శ్రీజ.. ఇంతలో శ్రీజ పక్కనే కూర్చున్న జాహ్నవి లేచి, " టీచర్..! శ్రీజ వాళ్ళ డాడీ పేద్ద డాక్టర్ కదా..శ్రీజ ప్రతీ బర్త్ డే కీ ఖరీదైన స్వీట్లూ...చాక్లెట్లూ గిఫ్టులూ పంచుతారు... " అని అడక్కుండానే చెప్పింది...వెంటనే దినేష్ లేచి, టీచర్..నా బర్త్ డే కూడా నవంబరు 14ననే..."అని చెప్తూండగా కొంతమంది పిల్లలు కిసుక్కున నవ్వటం గమనించింది పల్లవి.

రేవంత్ లేచి, "టీచర్! దినేష్ పుట్టిన రోజునాడు కనీసం చాక్లెట్స్ కూడా ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళ డాడీ రిక్షా పుల్లర్....మనస్కూల్లో చాలామంది ఆ రిక్షాలోనే వస్తారు..."అన్నాడు.చిన్నబోయిన దినేష్ ని చూడగానే జాలి కలిగింది పల్లవికి. పల్లవికి. రేవంత్ అలా మాట్లాడకూడదు...అని దినేష్ దగ్గరకు వెళ్ళి,  చూడు దినేష్, కేవలం పేదరికం వలన మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోనక్కర లేదు....ఎప్పుడూ ఇలాగే చక్కగా చదువుకుని క్లాస్ ఫస్ట్ వస్తూ..మంచి ఉద్యోగం చేసి మీ అమ్మా,నాన్నలను సంతోషపెట్టాలి..ఓకే.." అంది పల్లవి.... చదువులోనే కాకుండా ఆటల్లో కూడా ముందే ఉండే దినేష్ అంటే అభిమానం పల్లవికి." అయినా, పుట్టినరోజంటే ఖరీదయిన బహుమతులూ మాత్రమే కాదు...ఆరోజు పదిమందికి గుర్తుండే మంచిపని కూడా చేయొచ్చు..." అని చెప్పింది పల్లవి...

ఇంటికొచ్చినప్పట్నుంచీ ముభావంగా ఉన్న దినేష్ ని ఏమైందని అడిగింది అతడి తల్లి లక్ష్మి."అమ్మా! ఈసారి నా బర్త్ డే కి మా క్లాస్ మేట్స్ కి మంచి చాక్లెట్లూ..గిఫ్టులూ ఇద్దామే" దీనంగా ముఖం పెట్టి అన్నాడు దినేష్..అప్పుడే అక్కడకు వచ్చి ఆ మాట విన్న దినేష్ తండ్రి నారాయణ "ఒరేయ్! మంచి కాన్వెంట్లో ఎక్కువ ఫీజులు కడుతూ నిన్ను చదివించడమే నాకు తలకు మించి భారమౌతూ ఉంది...కానీ నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి కావాలన్న ఆశతో చదివిస్తున్నాను. పుట్టిన్రోజులు..బహుమతులు అంటే నావల్ల కాదు..నువ్వే అర్థం చేసుకోవాలి...." అంటూ అక్కణ్ణుంచి కోపంగా వెళ్ళిపోయాడు...కొడుకు చిన్నకోరిక తీర్చలేని తమ పేదరికం తల్చుకుని బాధపడింది లక్ష్మి.హొం వర్క్ చేసుకుంటూ కూర్చున్న దినేష్ మనసు నిండా ఒకటే ఆలోచనలు....ఎలాగైనా ఈసారి తన పుట్టిన్రోజుకి అందరికీ గుర్తుండే మంచి బహుమతులు ఇవ్వాలి....ఎలా..

నవంబరు 14 రానేవచ్చింది... ఖరీదైన మెరిసే కొత్త డ్రెస్ లో క్లాస్ లోకి అడుగుపెట్టింది శ్రీజ...మంచి చాక్లెట్లూ..ఖరీదైన గిఫ్టులూ పంచింది...లాల్చీ పైజామాలో గుండెలమీద గులాబీ పువ్వుతో అచ్చు చాచానెహ్రూ లాగే వచ్చాడు దినేష్....మామూలు చాక్లెట్లు పంచాడు...ఆ తరవాత వాళ్ళ నాన్న రిక్షాలో తెచ్చిన యాభై పూల మొక్కలను తోటి విద్యార్థులందరికీ బహూకరించాడు....ఆశ్చర్యంగా చూస్తున్న పల్లవి టీచర్ తో ఏదో మాట్లాడింది, దినేష్ తల్లి లక్ష్మి....

బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల బహుమతుల ప్రదానోత్సవం స్టేజీ...ముందుగా ఉపన్యాసం మొదలు పెట్టిన ప్రిన్సిపల్ సర్ మైకు తీసుకుని ముందుగా అందరికీ అభినందనలు చెప్పి, ఆ తర్వాత ఇలా అన్నారు....పిల్లలూ..ఈరోజు పుట్టినరోజు సందర్భంగా దినేష్ మీకందరికీ ఇచ్చిన బహుమతి విలువ ఎంతో తెలుసా...అనంతం...ఎందుకంటే, కాలుష్యం బారిన పడి... పచ్చదనం కరువైన కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న మనకు చెట్ల ఆవశ్యకతను గుర్తు చేసే చక్కటి బహుమతి...మీరందుకున్న మొక్కలను చక్కగా పెంచి, పెద్దచేసినట్లయితే అతడిచ్చిన బహుమతి సార్ధకమౌతుంది..అంతేకాదు...కాలుష్యం బారినుండి మనను మనం కాపాడుకోవాలనే స్పూర్తి మరికొందరిలో కలిగించినట్లవుతుంది...ఈబహుమతి పంచడానికి తన తండ్రి పేదైకం వల్ల కావాల్సిన డబ్బు తనవద్ద లేని కారణంగా తానే నర్సరీలో కొన్నిరోజులు మొక్కలకు నీళ్ళుపోసి, శుభ్రం చేసి, వాటికయ్యే ఖర్చు చెల్లించుకుంటానని చెప్పాడు..కానీ, చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం కాబట్టి ఆ నర్సరీ అతను ఒప్పుకోలేదు.. దినేష్ వాళ్ళమ్మ గారు ఆ బాధ్యత తీసుకుని వారి తాహతుకు మించినదైనా వారి అబ్బాయి చేత మొక్కలు పంచే లాగా ప్రోత్సహించారు.." అని వివరించారు...

అందరూ చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు..." మంచి ఆలోచనతో మనందరికీ స్పూర్తి కలిగించిన దినేష్ ఈ ఏడాది బెస్ట్ స్టూడెంట్ అవార్డుకి కూడా ఎంపికయ్యాడు...."అని ప్రిన్సిపల్ సర్ ప్రకటించడంతో మరోసారి చప్పట్లు మారుమోగాయి...

మరిన్ని కథలు
we are for you