Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

హీరోయిన్ల‌ను ఐటెమ్‌గాళ్స్‌గా మార్చేస్తున్నారు!- దాస‌రి నారాయణ‌రావు

changing heroines as item girls- dasari

దాస‌రి నారాయ‌ణ‌రావు.. ఆయ‌న ప్ర‌తి అడుగు, ప్ర‌తీ మాటా, ప్ర‌తి మ‌లుపూ సంచల‌న‌మే!  ఇన్ని ద‌శాబ్దాల కెరీర్‌లో ఎప్పుడూ స్టార్ల వెంట ప‌డ‌లేదు. స్టార్ల‌ను సృష్టించారు. ద‌ర్శ‌కుడంటే స్టార్ మేక‌ర్ అని నిరూపించారాయ‌న‌. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తార‌త‌మ్యం లేదాయ‌న‌కు. అస‌లు అలాంటి గిరి ఎప్పుడూ గీసుకోలేదు. ఆ మాట‌కొస్తే.. చిన్న‌సినిమానే ఎక్కువ‌గా ప్రేమించారు. స్టార్ల‌తో సినిమాలు తీస్తూ.. తీస్తూ.. మ‌ధ్య మ‌ధ్య‌లో 'నీడ‌',  'చిల్ల‌ర కొట్టు చిట్టెమ్మ‌'లాంటి అద్భుతాల‌ను ఆవిష్క‌రించేవారు. 'సినిమా అంటే ఇలా తీయాలి.., ఇలా ఉండాలి.. ' అని ప‌రిశ్ర‌మ‌కు చూపించారు. కెప్టెన్ కుర్చీకి ఎన‌లేని గౌర‌వం తీసుకొచ్చారు.  తెలుగు ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కుగా మారారు. 150 సినిమాలు తీసినా.. ఇప్ప‌టికీ సినిమాపై అదే ప్రేమ‌.. అంతే మ‌మ‌కారం. ఆ ఇష్టంతోనే మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టి 'ఎర్ర‌బస్సు' రూపొందించారు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిందీ సినిమా. ఈ సంద‌ర్భంగా `ఎర్ర‌బ‌స్సు` క‌బుర్లు ఇలా పంచుకొన్నారు.

* ఎర్ర‌బ‌స్సు ఎలాంటి క‌థ‌..?
- తాతామ‌న‌వ‌ళ్ల నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో పెరిగిన ఓ తాత‌.. అమెరికా వెళ్లి సెటిలైపోదామ‌నుకొనే ఓ మ‌న‌వ‌డు మ‌ధ్య జ‌రిగే క‌థ‌.

* తాత‌మ‌న‌వ‌డి క‌థ అంటే.. మీ తొలి సినిమా తాతా మ‌న‌వ‌డు గుర్తొస్తుంది..
- (న‌వ్వుతూ) అది ఆ త‌రానికి న‌చ్చిన క‌థ‌.. ఇది ఈ త‌రాన్ని ఆలోచింప‌జేసే క‌థ‌...

* ఈత‌రానికి స్పీడెక్కువ‌గా ఉండాలి. మీరేమో సెంటిమెంట్ ట‌చ్ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నారు..
- ఫ్యామిలీ సినిమా అంటే ఎందుకు భ‌య‌ప‌డిపోతున్నారో నాకు అర్థం కావ‌డం లేదు. సినిమా అంటే ఇదే ఫార్మెట్‌లో ఉండాలి అని చెప్పిందెవ‌రు? మ‌నం అల‌వాటు చేసేస్తున్నామంతే.  కొన్ని ఫైట్లు, ఓ ఐటెమ్ సాంగ్ అంటూ అదే గిరిలో ఎంత‌కాలం సినిమాలు చేయాలి...?  ఇది వ‌ర‌కు జ‌య మాలిని, జ్యోతిల‌క్ష్మి... వీళ్లంతా ఐటెమ్ గీతాలు చేయ‌డానికి ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్ల చేతే అలాంటి పాట‌లు చేయిస్తున్నాం. క‌థానాయిక‌ల్ని ఐటెమ్ గాళ్స్ గా మార్చేస్తున్నాం. సినిమా ఇలా తీస్తేనే ఆడుతుంది, ఇలాంటి సినిమాల‌కే వ‌సూళ్లొస్తాయ‌న్న ఓ గుడ్డి న‌మ్మ‌కంతో బ‌తికేస్తున్నారు. నో... ఇది క‌రెక్ట్ కాదు. ప్రేక్ష‌కుల‌కు మ‌నవైన క‌థ‌ల్ని ప‌రిచ‌యం చేయాలి. ఎర్ర‌బ‌స్సు అలాంటి సినిమానే.


* మంజ‌పైలో ఎలాంటి మార్పులు చేశారు?
- క‌థ‌లో లైన్ మాత్ర‌మే తీసుకొన్నాం. క‌థ‌నం పూర్తిగా నా శైలిలో ఉంటుంది.

* మీరు రీమేక్‌ల‌కు వ్య‌తిరేకం క‌దా..?
- నేను డ‌బ్బింగుల‌కు వ్య‌తిరేకం రీమేక్‌ల‌కు కాదు. నావెన్నో సినిమాలు రీమేక్ రూపంలో మిగిలిన భాష‌ల్లోకి వెళ్లాయి. ఓ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని క‌థ అల్లుకోవ‌డంలో త‌ప్పు లేదు. 

* సెంటిమెంట్ బాగా ద‌ట్టించారు.. మ‌రి వినోదం మాటేంటి?
- కేవ‌లం న‌వ్వించాల‌న్న ఉద్దేశంతో ఎలాంటి సీన్స్ రాసుకోలేదు. క‌థ‌లో ఆ వినోదం ఉంది. సున్నిత‌మైన స‌న్నివేశాలు, తాత చేసే చేష్ట‌లు వీటి నుంచి వినోదం పుడుతుంది. బ్ర‌హ్మానందం, ఎమ్మెస్ నారాయ‌ణ‌లున్నారు. వారి త‌ర‌హా వినోదం ఈ సినిమాలో ఉంది.

* బ్ర‌హ్మానందం చేత కాకి డాన్స్ చేయించార్ట‌...
- (న‌వ్వుతూ) అవును. ఆ స‌న్నివేశం చాలా త‌మాషాగా సాగుతుంది.  కాకి ఈ సినిమాలో ఓ పాత్ర‌ధారి. అయితే జంతువుల‌ను సినిమా కోసం వాడుకోవ‌డం నిషిద్ధం. దాంతో.. కాకితో స‌న్నివేశాల్ని గ్రాఫిక్స్‌లో రూపొందించాం.

* అటు మోహ‌న్‌బాబుతో, ఇటు విష్ణుతోనూ ప‌నిచేశారు. ఇద్ద‌రిలోనూ మీరు గ‌మ‌రించిన అంశాలేంటి?
- క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో ఇద్ద‌రికి ఇద్ద‌రే. ఏనాడూ విష్ణు క్ర‌మ‌శిక్ష‌ణ మీర‌లేదు. ఈత‌రం క‌థానాయ‌కుల‌లో విష్ణు గొప్ప పెర్‌ఫార్మెర్‌. కానీ త‌న‌ని ఇలాంటి పాత్ర‌లో ఎవ్వ‌రూ చూడ‌లేదు. విష్ణు అంటే యాక్ష‌న్‌, కామెడీ అనుకొంటున్నారు. కానీ త‌న‌లో శోభ‌న్‌బాబు లాంటి న‌టుడు ఉన్నాడు. ఎర్ర‌బ‌స్సు సినిమాతో ఆ విష‌యం రుజువ‌వ‌తుంది.

* ఇద్ద‌రిలోనూ డైలాగులు ఎవ‌రు బాగా చెప్పారు..
- క‌చ్చితంగా మోహ‌న్‌బాబే. అందులో మ‌రో అనుమానం లేదు.

* ఈ వ‌య‌సులో కూడా పెరుగుతున్న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అర్థం చేసుకొంటూ సినిమాలు తీస్తున్నారు. ర‌హ‌స్యం ఏమిటి?
- సినిమాలు ఎక్కువ‌గా చూస్తుంటా. భాష‌తో సంబంధం లేదు. కొత్త సినిమా వ‌చ్చిందంటే త‌ప్ప‌కుండా చూస్తా. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అనే బేధం నాకు లేదు. ఓ సినిమా ఎందుకు హిట్ట‌య్యింది? ఎందుకు స‌రిగా ఆడ‌లేదు?  అనే విష‌యాలు తెలుసుకోవ‌డానికైనా సినిమా చూస్తా. ఫ‌లానా సీన్ ఎలా తీసుంటాడు? అనే దిశ‌గా ఆలోచిస్తా. ద‌ర్శ‌కుడికి అది చాలా ముఖ్యం...

* స్వ‌ల్ప విరామం త‌ర‌వాత చేసిన సినిమా క‌దా, ద‌ర్శ‌కుడిగా ఎలాంటి సంతృప్తినిచ్చింది?
- చాలా సంతృప్తిగా ఉన్నా. నిర్మాత‌గానూ.. హ్యాపీనే. అన్ని ఏరియాల్లోంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ సినిమాపై న‌మ్మ‌కంతో నేనే సొంతంగా విడుద‌ల చేసుకొంటున్నా..

* ఈ సినిమాని హిందీలో చేస్తారంటున్నారు..
- ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి..

* త‌రువాతి సినిమా..
-  ప్ర‌స్తుతానికి ఎర్ర‌బ‌స్సుపైనే నా దృష్టంతా. కొత్త సినిమా వివ‌రాలు ఎర్ర‌బ‌స్సు విడుద‌ల త‌ర‌వాత చెప్తా.

-కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Pilla Nuvvu Leni Jeevitham