Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Hepatitis B | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

బాడీ లాంగ్వేజ్ - భమిడిపాటి ఫణిబాబు

body language

క్రిందటి వారం వ్రాసిన “ఇగో సమస్య” కి , ఈ వ్యాసం తరువాయి భాగం. ప్రతీవాడికీ ఏదో విషయంలో “ ఇగో “ అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఆ “ఇగో” ని కొలవడం ఎలా, అన్నదే ఈ బాడీ లాంగ్వేజ్.ఎంత “ఇగో” ఉందో, ఈ బాడీలాంగ్వేజ్ లో తెలుస్తుందన్నమాట !  ఇదివరకటి రోజుల్లో ఈ Body language... అంటే తెలిసేది కాదు...ఈ Body ఏమిటీ, దీనికీ ఓ language ఏమిటీ అనుకునేవాడిని. కాలక్రమేణా, కొద్దిగా అనుభవం అనండి, లేక ఇంకోటేదో  అనండి, మొత్తానికి ఈ పదానికి అర్ధం తెలుస్తోంది. ఇంక తెలిసిందిగా ఓ కొత్త పదం, ఎడా పెడా ఉపయోగించడం మొదలెట్టేశాను. దానితో, అందరిలోనూ ఓ గుర్తింపోటొచ్చేస్తోంది, ఓహో ఆహా అనుకోడం మొదలెట్టేశారు. ఓ నలుగురు కలిశారనుకోండి, ఏదో  టాపిక్కు మొదలెట్టడం, చూసి చూసి ఈ మాటని ఉపయోగించేయడం, దానితో అవతలవాడూ అనుకుంటాడు, మనం ఏదో "బుధ్ధిజీవుల"  కోవలోకి వస్తామని! బుధ్ధిజీవులా, పాడా, అరవై ఏళ్ళు దాటి డెభయ్యో పడిలో పడేవాడికి, Body ఏ ఉండదూ లక్షణంగా, మళ్ళీ దానికి ఓ laanguaజా,  అకస్మాత్తుగా acquire చేసేదేమీ ఉండదు. అదో సరదా !! ఇంక ఉండేదా ఎన్నాళ్ళూ, ఉన్నంత కాలమైనా హాయిగా గడపాలనుకుంటే, ఇలాటివి తప్పదు.

అయినా సరే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. బయట రోడ్డు మీదకెళ్ళండి, SUV  ల మీద వెళ్ళేవాడికి, మిగిలిన వాహనాలంటే చిన్నచూపు! అక్కడకి రోడ్డంతా తనదే అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఓ పార్కింగు తీసికోండి, ట్రాఫిక్కు సిగ్నల్స్ దగ్గరనండి, లేన్లు మార్చడం దగ్గరనండి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవతలవారిని dominate  చేయడమే, వీరి ultimate aim. తనకంటూ ఓ ప్రత్యేకత చూపించుకోవాలి. అది వాడి తప్పు కాదు. ఆ SUV  వల్ల వచ్చిన ఒళ్ళు కొవ్వు., దీన్నే  Body language.. అంటారనుకుంటాను. రోడ్లమీద ఈ మధ్యన ఎక్కడ చూసినా వోల్వోలూ, మెర్సిడీజ్ లూనూ, వీళ్ళకి మామూలు "పల్లె వెలుగు" ఎర్ర బస్సులంటే చిన్న చూపు. అవికూడా బస్సులేనా అన్నట్టు ప్రవర్తిస్తూంటారు!

అంతదాకా ఎందుకూ, ఈ మధ్యన వస్తూన్న  అవేవో పవర్ డ్రివెన్, గేర్ లెస్స్ బళ్ళవాళ్ళకి, మిగిలిన సాదా సీదా మారుతి 800 అంటే చిన్న చూపు! బైక్కుల మీద వెళ్ళేవాళ్ళకి, స్కూటర్లమీదా, స్కూటీలమీదా వెళ్ళేవాళ్ళంటే చిన్న చూపు.  పోనీ ఈ బైక్కుల వాళ్ళకైనా అంతా బావుంటుందా అంటే అదీ లేదూ, మళ్ళీ దాంట్లో అవేవో సీసీ (cc)లూ, సింగినాదాలూనూ! పైగా ఎంత చప్పుడు చేస్తే అంత గొప్పట!  నూతుల్లో బైక్కులు నడిపేవాళ్ళలాగ పేద్ద చప్పుళ్ళు చేసికుంటూ పోతారు. నూటికి యాభై మంది, spoiled brats లోకే వస్తారు.  రోడ్డు మీద వెళ్ళె వాహనాలూ, నడిపే విధానాన్ని బట్టీ, వాళ్ళBody language తెలిసిపోతుంది. మరీ  పెళ్ళాం పిల్లలూ ఉండి, బాధ్యతలు తెలిసినవాళ్ళు ఇలా వెర్రి వేషాలు  వేయరులెండి.  రోడ్ల మీద అష్టవంకర్లూ తిరుగుతూ, ఒక్కొక్కప్పుడు చేతులు వదిలేస్తూ, అవసరం ఉన్నా లేకపోయినా horn మోగిస్తూ, మిగిలిన వాహనాలవాళ్ళని  హడలు కొట్టేస్తూ వెళ్తున్నాడూ అంటే, వాడి బాబు ఓ రాజకీయ నాయకుడైనా అవొచ్చు, సినిమాల్లో నటించేవాడైనా అవొచ్చు, అదీ కాదనుకుంటే ఓ history sheeter  అయినా అవొచ్చు!

పైన చెప్పినవన్నీ వాహనాల మీద వెళ్ళేవారి గురించి. చివరకి సైకిలేనా నడపడం రాని నాలాటి వాడికి వీటన్నిటి గురించీ ఎలా తెలిసిందా అనుకోకండి. దాన్నే Body language. మహాత్మ్యం అంటారు !! ఆ విషయమూ చెప్తాను, కొంచం ఓపిక పట్టండి మరీ... వాహనాలు నడపడమే రావాలా ఏమిటీ, పోజులు పెట్టడానికి? ఏదో పేపర్లు చదవడం, నెట్ లో పనీ పాటా లేకుండా, బ్రౌజు చేస్తూ, ఏదో ఒకదానిగురించి చదవడం, ఇంక ఛాన్సొస్తే చాలు, దాన్ని గురించి నలుగురూ చేరిన చోట ఉపయోగించేయడం. ఈ మధ్యన మా ఫ్రెండెవరో ఒకాయన షష్ఠిపూర్తి కి వెళ్ళాల్సొచ్చింది లెండి. అక్కడ ఏదో నలుగురం చేరి కబుర్లు చెప్పుకుంటూంటే, అందరూ " బయటకు వెళ్ళొచ్చినవాళ్ళే, ఎక్కడో షికాగో లో అలా ఉందీ, మా పిల్లలు ముగ్గురూ సియాటిల్ లొనే ఉంటున్నారూ, సింగపూర్ లో ఏమిటోనండీ... అన్నీ అవే కబుర్లే. మరి నా సంగతో, ఏదో అంబాజీపేటా, అమలాపురం దాటి, ఏదో ఉద్యోగ ధర్మమా అని ఈ పూణె వచ్చానుకానీ, వాళ్ళు చెప్తున్నవన్నీ చూశానా పెట్టానా? పైగా అలాటి అవకాశం కూడా ఎక్కడా లేదు.అలాగని, నేనెందుకు నన్ను తక్కువ చేసికోవాలీ? ఆ మాటా ఈ మాటా చెప్తూ, మనకి తెలిసున్న టాపిక్కు లోకి తెచ్చుకోవాలి! అక్కడక్కడ మనకున్న మిడిమిడి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి! నాలుగైదు  sophisticated  మాటలు, అర్ధం తెలిసినా, తెలియకపోయినా ఉపయోగించేయడమే! ఖాళీ డబ్బాలే చప్పుడు ఎక్కువ చేస్తాయిట.( నాలాటి వాళ్ళు).

  చాలామంది వేషధారణ బట్టి అవతలివారిని అంచనా వేస్తారు. ఇదివరకటి రోజుల్లో ఇప్పుడున్నన్ని వేషాలుండేవా ఏమిటీ? అయినా సరే, అవతలివారి వేషధారణద్వారా, వారి intellecctual level తెలిసేది. వారి Body language కూడా అలాగే ఉండేది.అలాగని ఏదో "గర్వం" తోనూ, " అహంకారం" తోనూ ప్రవర్తించేవారు కాదు. కానీ ఈ రోజుల్లో అలా కాదే, మన వేషధారణ బట్టే, అవతలివారి అభిప్రాయమూనూ! ఏం చేస్తాం, కాలంతోనే ముందుకు వెళ్ళాలిగా,మనం ఎంత వద్దనుకున్నా, కొన్నిటితో compromise అయి, ప్రస్థుత వాతావరణానికి adapt అవాల్సొస్తోంది. వేషధారణనండి, బయటకి కనిపించే హంగులనండి, వీటి కారణాలతోనే మన Body language లోకూడా తేడా కనిపిస్తోంది.ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, ఆ diffident attitude లోంచి మారుతున్నాము. దానితో మన confidence levels కూడా మారుతున్నాయి. కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తూఉంటుంది

ఇలా "తెచ్చిపెట్టుకున్నవి" అంత అవసరమా అని. కానీ if it helps change our body language, why not... అనుకుంటే పోతుందిగా...

మరిన్ని శీర్షికలు
two novels by same author