Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
matalato kapuram

ఈ సంచికలో >> కథలు >> మృత్యుకుహరం

Happy Sankranthi
mrutyukuharam

"పెంటపాలెం"

కండక్టర్ అరుపుతో లేచి బ్యాగ్ తీసుకుని బస్ దిగాను.

రోడ్డు పక్కన చెట్లతో, పుట్లతో నిండి ఏటవాలుగా క్రిందకి వుండే ఒక కిలోమీటరు ప్రదేశాన్ని దాటి వెళితే మా పెంటపాలెం వస్తుంది.

బస్టాప్ లో దిగితే చాలాదూరం..అదే ఇక్కడ దిగితే మా ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు.

నేను హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నన్ను మానాన్నగారు పొలం పనులు చూసుకుంటూ కష్టపడి చదివించారు. ఒక్కడ్నే కొడుకుని. నేనూ నా జీవితాన్ని నిర్లక్ష్యంతో నాశనం చేసుకోకుండా చక్కగా చదువుకుని పైకొచ్చాను. సెలవుదొరికినప్పుడల్లా అమ్మానాన్నల దగ్గరకి వచ్చేస్తాను. వాళ్ళ ఆప్యాయత..స్వఛ్ఛమైన పల్లె వాతావరణం మనస్పూర్తిగా చవిసూసి మళ్ళీ యాంత్రికంగా బ్రతకడానికి సిటీ కెళతాను.

గబ గబ నడుచుకుంటూ వెళుతున్న నాకు కొద్దిదూరంలో జామచెట్టెక్కి చిటారు కొమ్మనున్న పండు అందుకోవడానికి తాపత్రయ పడుతున్న పిల్లాడొకడు కనిపించాడు. పండుమీదున్న యావతో కొమ్మమీంచి పడిపోతాడన్న విషయం పట్టించుకోవడంలేదు. పోనీ నేను ‘జాగ్రత్త’ని అరచి చెబుదామంటే.. ’ఎవరో పెద్దవాళ్ళు తనని కొట్టడానికి వస్తున్నారనుకుని’ బెదిరి హడావుడిగా చెట్టుమీంచి దూకే ప్రయత్నం చేస్తాడు. అదీ ప్రమాదమే!. అందుకే వాడికి కనిపించకుండా మరో పక్కగా వాడి వైపు పరిగెత్తాను. నేనక్కడికి చేరుకునే సరికి జరగకూడని ప్రమాదం జరిగిపోయింది. వాడు చెట్టుపైనుండి జారి పడిపోయాడు.

తగలకూడనిచోట దెబ్బ తగలడంతో వాడిప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. నా కళ్ళలో ధారాపోతంగా కన్నీళ్ళు. వాడు యాదమ్మ మనవడు. చిన్నప్పుడే వాడి అమ్మానాన్నలు పంటకి ఎరువులు కొనుక్కురావాలని బస్సులో వెళుతూ ప్రమాదంలో మరణిస్తే, యాదమ్మే కంటికి రెప్పలా కాపాడుకొస్తోంది. వాడు చచ్చిపోయాడని తెలిస్తే ఆ ముసలి ప్రాణం తట్టుకోలేదు. అందుకే వాడి శరీరాన్ని అక్కడ బాగా చెట్లతో అల్లుకుపోయిన ప్రదేశం మధ్య వున్న బండరాయిమీద పెట్టాను. అది ఎవరికీ కనిపించదు. తర్వాత యాదమ్మకి ఆ విషయం నిదానంగా ‘ఎలా చెబితే మంచిదో ఆలోచించి, అలా చెబుదామని’ నిర్ణయించుకున్నాను.

వాడి శరీరాన్ని బండమీద జాగ్రత్తగా పడుకోపెడుతుంటే నాకో ఆలోచన వచ్చింది. అదేమిటంటే! నాకు ఊజాబోర్డు..ఇ ఎస్ పి ప్రయోగాలు..చేయడం సరదా..అలాగే పరకాయప్రవేశం గురించి ఆసక్తితో..క్షుణ్ణంగా చదివి వున్నాను. దానిని సాధించాలంటే అప్పుడే ఆత్మ వదిలిన శరీరం కావాలి. ఇన్నాళ్ళూ అది దొరకలేదు. అందువల్ల సాధన చేయలేకపోయాను. ఇప్పుడు దొరికింది. అంతేకాదు ఈ పిల్లాడి శరీరంతో యాదమ్మ ఇంటికెళ్ళి కాసేపు మురిపించి..ముచ్చట్లాడి..ఆవిడకేదో బాగా కోపమొచ్చే పనిచేసి ‘నేను ఊరినుండి పారిపోతున్నానని’ వెళ్ళిపోతే..కొన్నిరోజులు వెతుకుతారు..ఆతర్వాత మరచిపోతారు. కానీ యాదమ్మ ప్రాణానికి ప్రమాదమేమీ వుండదు. ఈ ఆలోచన నచ్చింది.అప్పటిదాకా బాధగా వున్న మనసులో ఒకింత ఆనందం.

ఆ శరీరానికి కాస్త దూరంలో కూర్చుని మంత్రాలు చదవడం ప్రారంభించాను.

నా శరీరం బాగా బరువెక్కి, తేలికగా వున్న ఆత్మ శరీరం నుండీ విడివడుతున్న అనుభూతి. అలా ఆత్మగా ఆ ఏడేళ్ళ పిల్లాడి శరీరంలోకి ప్రవేశించాను. నాకు ఆశ్చర్యంగా వుంది. ఇరవైరెండేళ్ళ నేను ఇప్పుడు ఏడేళ్ళ శరీరంలో. తేలికగా వున్న శరీరంతో లేచాను..చిన్న పిల్లాడి మనస్థత్వంతో కాసేపు అటూ ఇటూ ఎగిరాను. దూరంగా వున్న నా శరీరాన్ని చూసుకున్నాను. ఎవరికీ దక్కని అదృష్టం. నా పార్థీవశరీరాన్ని నేనే చూసుకోవడం. నా శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరచుకున్నాను. లేకపోతే నేను మళ్ళీ నా కాయంలోకి పునఃప్రవేశం చేయలేను.

అలా పిల్లాడి మనసుతో ఎగురుతూ..గెంతుతూ..తుళ్ళుతూ..వెంకన్న పొలంలోకి అడుగెట్టాను..ఆకాశంవంక..పక్షుల వంకా..ఎత్తైన చెట్ల వంకా చూస్తూ ఉరకలెత్తుతున్న నేను..ఉన్నట్టుండి కాళ్ళూ..చేతులూ..శరీరం..రాసుకుపోతూ..అగాథంలోకి జర్రున జారిపోతున్నాను. నాకేం జరుగుతూందో అర్ధం కావడంలేదు. మెదడు స్తబ్ధమైపోయింది. కొంతదూరం తర్వాత అలాగే నిలుచున్న భంగిమలో నేలపొరల్లో ఇరుక్కుపోయాను. అర్ధమైంది. నేను బోరుబావిలో పడిపోయాను. గుండె ఆగినంత పనైంది. ఎప్పుడూ టీ వీల్లో చూడడం తప్ప ఊహించను కూడా ఊహించలేదు. భయంకరమైన పాతాళ అనుభవం.

కాళ్ళూ చేతులు కదపలేను. దురదొస్తే గోక్కోలేను. కన్నీళ్ళొస్తున్నాయి. పిచ్చిగా అరుస్తున్నాను. ప్రయోజనమేంటి? నన్నెవరన్నా రక్షిస్తారా? అసలు నేను పడిపోవడం ఎవరన్నా చూశారో లేదో. చీకటి..చిమ్మ చీకటి..బయట అంత వెలుగుంటే ఇక్కడ ఇలా! అన్నట్టు నేను పరకాయ ప్రవేశం చేసి కదా ఈ శరీరంలోకి వచ్చింది. ‘హమ్మయ్య నా శరీరంలోకి నేను మళ్ళీ వెళ్ళిపోవచ్చు’ అనుకుని మంత్రం చదువుదామంటే..గుర్తురాదే!మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను..ఊహూఁ..భయంతో నాలుక పిడచ కట్టుకుపోయింది. గుండె ఆగిపోతున్న భావన. కొద్దిసేపు మంత్రాలని గుర్తు చేసుకునే ప్రయత్నం చేసి మానేశాను. ముందు మనసుని స్థిమిత పరచాలి. అప్పుడే ఏదన్నా సాధ్యం.

నాకు తెలిసి నేను దీంట్లో పడి చాలా సేపయింది.

కుర్చీలో కూర్చుంటే పదిసార్లు మెసులుతుంటాం..అలాంటిది ఒకే భంగిమలో ఇలా... శరీరం తిమ్మిరెక్కిపోయింది. ఏవో కాళ్ల మీదా చేతులమీదా కుడుతున్నాయి. వాటిని పక్కకి తప్పించలేను..జీవత్వంలో..నిర్జీవత్వం! దాహమేస్తోంది..ఆకలేస్తోంది. జారుతున్నప్పుడు రాసుకుపోయిన శరీరభాగాలు మండుతున్నాయి. బహుశా రక్తం కూడా కారుతోందేమో..తలకాయ మాత్రం కొద్దిగా కదల్చ గలుగుతున్నా! మామూలుగా మన శరీరభాగాలు కదుల్తూ ఉంటే మనకి తెలియదు కాని..అంగాల కదలిక ఎంత అద్భుతమో! పోనీ కాసేపు నిద్రపోయి మర్చిపోదామనుకున్నా నిద్రరాదే! అమ్మా నాన్న ఏంచేస్తున్నారో?..నేను వస్తున్నానని పాపం వాళ్ళకి తెలియదు కదా! నేను అక్కడ హాయిగా వున్నాననుకుని వుంటారు. వాళ్ళకి కొద్ది దూరంలో నా మనసు..మరో కొద్దిదూరంలో నా శరీరం వుందని పాపం తెలియదు. కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తున్నాయి.

మళ్లీ మంత్రాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను..ఊహూ!గుర్తురాలేదు.

నేనిలా దీనిలో పడి ఎంతసేపయ్యిందో.

పోనీ ఈ నరకం తప్పించుకుందామని ఆత్మహత్య చేసుకుందామనుకున్నా, ఏమీ చేసుకోలేని పరిస్థితి. క్షణాలు భా..రం..గా గడుస్తున్నాయి.

అంతలో పైన చిన్నగా ఏవో చప్పుళ్ళు మొదలయ్యాయి. హమ్మయ్య! నన్ను రక్షించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నమాట! ఒక సూర్యకిరణమంత ఆశ మనసుని ఆహ్లాదపరచింది. మళ్ళీ అంతలోనే ’దానికి వాళ్ళెంత సమయం తీసుకుంటారో? నేను పడిన గోతికి సమాంతరంగా గొయ్యి తవ్వాలి. దానికి కావలసిన పనిముట్ల సరంజామా సిద్ధంగా వుండాలి. తవ్వుతున్న సమయంలో వాళ్ళకి ఎటువంటి రాళ్ళు రప్పల అడ్డంకి రాకూడదు. వస్తే మళ్ళీ తర్జన భర్జనలు. ఆలోపల తిండీ తిప్పలు లేక సొమ్మసిల్లిపోయే తన ప్రాణం.. పోనే పోతుంది. అప్పటిదాకా కలిగిన ఆశ కాస్త అడుగంటిపోయింది.

ఎవరో ఆక్సీజన్ పైపనుకుంటా లోనికి వదిలారు..కొద్దిగా గాలి పీల్చుకో గలుగుతున్నాను..మెదడు స్థబ్దత నుండి కొద్దిగా చైతన్యాన్నందింది.

కింద కాలినేదో కొరుకుతోంది. భగవంతుడా ఎంతసేపీ ప్రత్యక్ష నరకం?

మనసు కుదుట పరచుకుని..ఏకాగ్రతతో..మళ్ళీ పరకాయ ప్రవేశ మంత్రాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాను. వచ్చేశాయి. నా ఆనందం అంతా ఇంతాకాదు. ప్రాణం మీద తీపితో..నరకం నుండీ తప్పించుకోవాలన్న తపనతో మంత్రంలోని ప్రతి అక్షరం స్పష్టంగా ఉచ్ఛరించాను. శరీరంనుండి ఆత్మ విడివడింది.

ఆఘమేఘాలమీద నా శరీరంలోకి ప్రవేశించాను.

కళ్లల్లోంచి బాధా ఆనందంలతో కూడిన కన్నీళ్ళ ప్రవాహం. చచ్చిబ్రతికాను మరి. టైం చుసుకున్నాను. బోరుబావిలో అయిదుగంటలున్నాను. కానీ ఒక జీవితకాల నరకమనుభవించి వచ్చిన బావన.

వేగంగా బోరుబావి దగ్గరకి వెళ్లాను. ఊరివాళ్ళతో..విషయం తెలుసుకుని వచ్చిన వాళ్ళతో..టీ వీ, పేపర్ వాళ్ళతో క్రిక్కిరిసిపోయి..హడావుడిగా వుందా ప్రదేశం. నేనే ఇందాకటిదాకా ఆ బోరుబావిలో వున్నానని తెలిస్తే వీళ్ళెలా రియాక్ట్ అవుతారో? అసలు నమ్ముతారో లేదో?

యాదమ్మకి వాళ్ళ మనవడు అందులో పడ్డాడని ఎవరు చెప్పారో గానీ కన్నీరు మున్నీరవుతోంది. ఆవిడ్ని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. పోన్లే ఇదీ ఒకందుకు నయమే..వాడు బోరుబావిలోనే పడి మరణించాడనుకుంటుంది. వాడి చావు వార్త వినడానికి క్షణ క్షణానికీ మానసికంగా సన్నద్ధురాలవుతుంది.

నా దగ్గరగా వచ్చిన ఒక విలేఖరి "సార్! ఈ బోరుబావి మరణాలు ఎంతోమంది పిల్లల ఉసురు తీసుకుంటున్నాయి. వీటినరికట్టడానికి ప్రభుత్వమూ..మనమూ ఏం చేయాలి?"అన్నాడు మైకు ముందుకు తీసుకొస్తూ!

"బోరుబావిలో పడడమన్నది భయంకర నరక అనుభవం. అది మాటల్లో చెప్పలేం. బోరుబావి ఎవరు తవ్వించినా, అది నిరుపయోగమని తెలిసినప్పుడు..అందులో వాళ్ళ పిల్లలు..మనవలూ పడినట్టు ఊహించుకుంటే..అది కప్పేస్తే గాని ఇంటికెళ్ళలేరు. మనలాంటి వాళ్ళు ఎప్పుడో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించడం కాకుండా..ప్రమాదకర బావుల్ని గమనించి పూడిపించాలి. అంతేకాదు మనిషి మనుగడకి ప్రమాదహేతువైన దేనిపట్లా నిర్లక్ష్యం పనికిరాదు. అకాలమరణాలని అరికట్టడమనేది ఒక ఉద్యమంగా రూపొందించాలి. కడుపు శోకం ఎవరిదైనా ఒక్కటే! ఏమీ తెలియని పసితనం కంటిముందు బావిలో దిగబడిపోయివుంటే..కన్నవాళ్ల బాధ వర్ణణాతీతం. దయచేసి బోరుబావి లేని ప్రదేశంగా మన రాష్ట్రాన్ని..దేశాన్ని తీర్చిదిద్దాలి..గొట్టపుబావి మరణాలని అరికట్టాలి"అన్నాను బాధతో గొంతు పూడుకుపోతుంటే!

అక్కడే వున్న వెంకన్న నా మాటలు విని కళ్లనీళ్లపర్యంతమయ్యాడు. అవునుమరి అతడు పూడ్చకుండా వదిలేసిన బోరుబావి అంతమందిని బోరున విలపించేలా చేస్తుందనుకుని వుండడు. అక్కడున్న వాళ్ళందరూ ఆ పిల్లాడు బ్రతికుండాలని ప్రార్ధనలు చేస్తూ..యాదమ్మను ఓదారుస్తూ కూలబడ్డారు.

...................................................................................................................................................

"మృత్యు కుహరం" కథకి నేపధ్యం!
‘ఎవరి ప్రాణం వారికే తీపి. మరొకరు అలా భావించక పోబట్టే కదా ఇవి పునరావృతమవుతున్నాయి’ అన్న బాధ మనసులో సుళ్ళుతిరిగి అక్షరాలై మృత్యు కుహరం కథగా రూపొందింది.  బాధ్యతతో రాసిన ఈ కథ గోతెలుగులో ప్రచురణకి ఎంపికయ్యిందని తెలియగానే, ఇటువంటి సామాజిక చైతన్య కథలకి గోతెలుగులోని పేజీలెప్పుడూ సిద్ధంగా వుంటాయని, సమాజంపట్ల నిబద్ధతతో కూడిన గోతెలుగు బాధ్యత అవగతమైంది. ఈ కథ ఎంపిక చేసి ప్రోత్సహించిన గోతెలుగు సంపాదకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదో ఉద్యమంలా భావించి, అందరినీ చైతన్యపరచి, బోరుబావుల నోళ్ళు మూయించగలిగితే, కన్నతల్లుల గర్భశోకాన్ని ఆపగలిగితే, మనం మనుషుల రూపంలో వున్న దేవుళ్ళమవుతాం. మారవలసింది, మార్పుతేవలసిందీ మనమే!

 -రచయిత

మరిన్ని కథలు
ninnati palle