Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
natyabharateeyam

ఈ సంచికలో >> శీర్షికలు >>

' సుధామ 'ధురం - సుధామ

సచిన్ ను అక్కడ కలిసి ఫోటోలు తీసుకోవచ్చు మరి ! సీనియర్ సిటిజన్స్ కు మ్యూజియం టిక్కెట్టు మరీ తక్కువ కూడాను ! ముందుగా ఒక నావ ప్రయాణం లాంటిది వుందికానీ, ఎక్కువ టైం లేదని నేరుగా మేం మ్యూజియంను సందర్శించాం. అక్కడినుండి మరో అద్భుత పర్యటన - ' అండర్ వాటర్ వరల్డ్ ' వెళ్ళాం. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండర్ వాటర్ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటుంది. ఒక కన్వేయర్ బెల్ట్ లాంటి దారి మీద నిలుచుంటే రకరకాల చేపలు, సముద్ర జీవులను చూస్తూ మనం కదలి వెడతాం. అక్కడే డాల్ఫిన్ షో చూశాం. డాల్ఫిన్స్ చేత రకరకాల విన్యాసాలు చేయించారు. వాటికి శిక్షణ ఇచ్చే మాస్టర్లు పెట్టే తిండి కోసం - పాపం ! ఆ ప్రాణులు చేసే ఆ విన్యాసాలు చూస్తుంటే వేడుకతో పాటు, కొంచెం జాలి కూడా వేసిందిలెండి.!

అక్కడ నుండి అద్భుతమైన లేజర్ షో 'వింగ్స్ ఆఫ్ టైం' వీక్షించడానికి వెళ్ళాం. సముద్ర తీర ప్రాంతంలో చీకటి పడుతూండగా రంగురంగుల ఆ ఫౌంటెన్ లేజర్ షో కథా-కథనంతో, సంగీతంతో బాటు, ఎంతగానో ఆకట్టుకునేలా సాగింది.! ఆ తరువాత ఆ రోజుకి పర్యటన ముగిసి, హోటల్ చేరుకుని రెస్ట్ తీసుకున్నాం.

మరునాడు 25వ తేదీ నవంబర్ మంగళవారం - నా పుట్టినరోజు. ఉదయమే లేచి 'మార్నింగ్ వాక్' అన్నట్టుగా, ఆరున్నరకి లిటిల్ ఇండియాలోని ' ముస్తఫా మాల్ ' కు ఉష, నేను నడుచుకుంటూ వెళ్ళాం. ! అది రాత్రింబగళ్ళూ 24 గంటలూ తెరచి ఉండే చాలా పెద్ద షాపింగ్ మాల్. రోడ్డుకిరువైపులా కూడా విస్తరించిన చాలా పెద్ద వ్యాపార కూడలి అది. మొత్తం చూడడానికే గంటలు గంటలు పట్టేస్తుంది. సరదాగా చిన్నచిన్న షాపింగ్ లు చేసి హోటల్ కు వచ్చి స్నానం అదీ ముగించి, బ్రేక్ ఫాస్ట్ కు వెళ్ళాం.! అన్నయ్యా, వదినా, ప్రమోద్, అషిత, సుమిర అందరూ నాకు కన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఓ సింగపూర్ డాలర్ తో. హోటల్ రూం లో వుండగా, వై-ఫై యాక్టివేట్ చేసుకునే సౌకర్యం వాడుకోవడంతో, ఫోన్లో " శుభాకాంక్షల సందేశాలు" అందుకున్నాను. ! తొమ్మిదిన్నరకల్లా మా మినీ బస్ రావడంతో - ఆరోజు పర్యటనలో భాగంగా ' యూనివర్సల్ స్టూడియోస్ ' కుతరలివెళ్ళాం. నిజంగా అదొక అద్భుత ప్రపంచం. ! ఎంత సమయమైనా ఇట్టే గడచిపోతుంది. !! షోలు, రడర్లు, వినోద ప్రదర్శనలు, షాపింగ్ సముదాయాలు, ఓహ్...చూసి తీరాల్సిన ప్రదేశం. ఉషా, మా వదినా రాలేదుగానీ మేం ఓ గంటన్నర పైగా క్యూలో నిల్చుని త్రీడీ కళ్ళద్దాలు పెట్టుకుని చూసిన ' ట్రాన్స్ ఫార్మర్ ' అనే షో గొప్ప అనుభూతి. మా(అన్నయ్య)మనుమరాలు సుమిర(అయిదేళ్ళ పాప)-ఈ స్టూడియోస్ ను కూడా, నిన్న ' అండర్ వరల్డ్ ' ఎంత ఉద్వేగంతో చూసిందో, అంత ఉత్సాహానందాలతో చూసింది. గ్రీకు నిర్మాణ భవనంలోకి అన్నయ్య, నేను మాత్రమే వెళ్ళి, అదేదో మామూలు షో అనుకుని , తీరా ' రోలర్ కోస్టర్ ' ప్రయాణంతో భయోద్వేగాలకు లోను పరచిన ది రివెంజ్ ఆఫ్ మమ్మీ చూడడం జీవితంలో మరచిపోలేని అనుభూతి. అగాధాల్లో పడిపోతున్నట్టూ, ఎత్తయిన చోటుకి ఎగబ్రాకుతున్నట్లూ క్షణక్షణం ఉద్విగ్నంగా సాగిన ఓ అయిదు నిముషాల సమయం అంతే అది. యూనివర్శల్ స్టూదియోలో మనం పాల్గొనే వాటి ఫోటోలు అన్నీ వారు తీస్తారు. మనక్కావలిస్తే చివర్లో తగిన రుసుం చెల్లించి , ఆ ఫోటోలు తీసుకోవచ్చు. సింగపూర్ లో చాలా పర్యాటక ప్రాంతాల దగ్గర ఇదే తంతు. ఒక్క ఫోటో కనీసం ఇరవయ్యో, పాతికో డాలర్లు ఉంటుంది.

మా సాహసానికి గుర్తుగా అన్నయ్యా, నేను ఆ ఫోటో తీసుకున్నాం. యూనివర్సల్ స్టూడియోలో ఉచిత వెజిటేరియన్ ' లంచ్ ' కానిచ్చేశాం. అలాగే ఆ అతరవాత ' కాజిల్ ' దగ్గర థియేటర్లో ' ఫోర్ డీ ఫిలిం ' కూడా ఓ చక్కటి అనుభూతి. గుర్రం మీద వెడుతున్నట్టు స్క్రీన్ మీద దృశ్యం ఉంటే మనం ప్రేక్షకులం కూర్చున్న సీట్లు కూడా అలానే కదులుతాయి. అక్కడ తెరమీద గాడిద తుమ్మితే ఆ తుంపర్లు మనమీద పడతాయి. ఫోర్ డి ఎఫెక్టులతో ఆ కార్టూన్ ఫిలిం సుమిరకే కాదు మాకూ ఎంతో నచ్చేసింది. ఆ కార్టూన్ ఫిలింలోని క్యారెక్టర్ తోటిదే ఓ బొమ్మ సుమిరకు కొని నా బర్త్ డే ప్రెజెంట్ గా ఈచ్చాను.

ఆ తరువాత చూసిన ' లైవ్ షో ' ఓ ఇంగ్లిష్ సినిమాను కళ్ళముందు ప్రదర్శింపజేసినట్టుంది. నీటిలో పడవలమీద, హార్బర్ దగ్గరా జరిగినట్టుండే ఆ షోలో తుపాకీ కాల్పులు, నీటిలో మంటలు , విమానం రాక వంటి దృశ్యాలు హాలివుడ్ సినిమాను కళ్ళముందు ప్రదర్శింపజేసినట్లుంది. ఆ నటీనటుల నటన, సంభాషణ, విన్యాసాలు, సజీవంగా అబ్బురపరిచాయి. అలాంటి అద్భుత షో చూడడం నిజంగా మరపురానిదే. ఆ తరువాత యూనివర్సల్స్టూడియోలోనే సుమిర వాళ్ళ అమ్మనాన్నతో ' వెన్ అగ్రో అప్ ' అనే ప్రదర్శనకు వెళ్ళగా , పెద్దవాళ్ళం కాఫీ తాగి, ఆ తరవాత జరిగిన ' కార్టూన్ క్యారక్టర్ల ' ప్రదర్శన చూసాం. కొన్ని ఫోటోలు తీసుకున్నాం. మొత్తం స్టూడియోస్ అంతా సూసేసాం అనలేను కానీ, ఆరుదాకా వుండి, ఆ అతరువాత హోటల్ కొచ్చాం. రాత్రి నడచి వెళ్ళి ' ముస్తఫా మాల్ ' లో కాసేపు గడిపి, అక్కడికి దగ్గర్లోని ' శరవణ భవన్ ' లో భోంచేశాం. ఐస్ క్రీం రూం కే తెచ్చుకునిపార్టీ చేసుకున్నాం. బాగా అలసిపోయామేమో ఆరాత్రి వెంటనే నిద్ర పట్టేసింది.

ఆ మరునాడు ప్రకృతితో, పక్షులతో గడిపే ' జురాంగ్ బర్డ్ పార్క్ సందర్శనం ' సింగపూర్ పర్యటన సింగారంలో ఓ అనుభూతి బంగారం. ఉదయమే మా చెర్రీలాఫ్ట్ హోటల్లో ఉచిత బ్రేక్ ఫాస్ట్ లాగించేసాం. టూర్స్ వాడు మాకోసం పంపిన ఏ.సీ. మినీవ్యాన్ లో ఎక్కి, 2,జురాంగ్ హిల్ ' వైపు పయనించాం.! ' జురాంగ్ బర్డ్ పార్క్ ' ప్రపంచంలోనే అత్యధిక పక్షులను కలిగి వున్నవాటిల్లో ప్రముఖమైంది. 20.2 హెక్టార్ల విస్తీర్ణంలో వున్న పక్షుల స్వర్గం. నాలుగు వందల రకాల పక్షులున్నాయిట ఈ పార్కులో. అలాగే పక్షులను రావించి చేసే ప్రదర్శనలు ఓ గొప్ప ఆకర్షణ. 'వరల్డ్ డార్క్ నెస్ ' అన్నచోట, చీకట్లో పక్షులను గుడ్లగూబలు, గబ్బిలాల్తో సహా వాటి సహజ వాతావరణంలో చూశాం. 'తెల్లగుడ్లగూబ ' ఒకటి భలేగా వుంది. ఆ తరువాత రాబందులను, పక్షులను రావించి చూపే ప్రదర్శన చూశాం. దాన్ని చూడడానికి చిన్న చిన్న స్కూలు పిల్లలను 'ఎక్స్ కర్షన్ 'లా తీసుకు వచ్చారేమో. పిట్టలూ, పిల్లలతో వాతవకణం కళకళలాడింది. అలాగే 'పెంగ్విన్శ్ ఎన్నింటినో చూశాం. ఆ తరువాత 'హై ఫ్లయర్స్ షో' అనే పక్షులచేత రకరకాల విన్యాసాలు చేయించే ప్రదర్శన చూశాం. ఆ విన్యాసాల్లో భాగంగా నిర్వాహకులు మా ప్రమోద్ పిలిచి వాడి భూమిపై పెద్దపక్షి వాలి, చేతపట్టుకున్న 'ఆహారాన్ని ' తినడమనే విన్యాసం చేయించారు. సరదాగా వీడియో తీశా! అలాగే పార్కు మొత్తం చుట్టి రావడానికి వున్న రైలు ఎక్కి కొంత కవర్ చేశాం! అత్యంత అపురూపమైన లేత కాషాయరంగు కొంగలు ఓ ప్రత్యేక ఆకర్షణ! మధ్యాహ్నం ఒంటిగంటదాకా పార్కులో గడిపి, భోజనానికి 'కోమల్ విలాస్ ' దగ్గర దిగిపోయాం. 26వ తేదీ మధ్యాహ్నంతో మాకు సౌకర్యాలన్నీ అమర్చిపెట్టిన 'ఆర్బిస్ ఇండియా టూర్స్ ' వాడి బాధ్యత పూర్తయిపోయిందన్నమాట! ఆ రాత్రి 'జ్యుయల్ ఆఫ్ ఇండియా'లో ఉచిత డిన్నర్ అమర్చడంతోనూ, 27న హోటల్ నుంచి తిరుగు ప్రయాణానికి సింగపూర్ ఎయిర్పోర్ట్ చేర్చడం మాత్రమే ఇక తన పని! మర్నాడు రాత్రి కేపు 10.30కు మా ఇండియా తిరుగు ప్రయాణపు విమానం! 27 సాయంత్రం 7.30కు హోటల్ నుంచి వాడి పికప్... అంచేత ఇంక మా దగ్గరున్న సమయాన్ని మేమే సద్వినియోగం చేయాలని సంకల్పించాం. 26 బుధవారం 'జురాసిక్ బర్డ్ పార్క్ ' నుంచి వచ్చేశాక, కమల్ విలాస్ లో భోంచేశాక,మేమే ఒక టాక్సీ బుక్ చేసుకుని - 'బూగీ స్ట్రీట్ 'కు వెళ్లాం. అక్కడి అంగడి వీధులు హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోలాగా కిక్కిరిసి వున్నాయి. అక్కడ దొరకని వస్తువు లేదంటే నమ్మాలి. అక్కడ చిన్న చిన్న షాపింగ్ చేశాం. ఇంతలో చెప్పాపెట్టకుండా మళ్లీ పెద్దవాన మొదలైంది.'బూగీ స్టోర్ 'కు వెళ్లి కాసేపు గడిపాం. విచిత్రం ఏమిటంటే - బురద కాళ్ళుగానీ లేవు. స్టోర్ ముందు వానలోంచి వచ్చిన జనం వున్నా, నేలమాత్రం ఎక్కడా- మట్టిమరకలూ, చెప్పుల మరకలూ కూడా లేవంటే నిజంగా ఆశ్చర్యమే కలిగింది.!!

అక్కడనుంచి మాహోటల్ రూంకు వచ్చేశాం. ఉష, మా వసంత వదినా, ప్రమోద్ మిసెస్ అషిత మాత్రం ప్రత్యేకంగా ' ఐక్యాస్టోర్స్ ' కు వెళ్ళి వచ్చారు. ఇక రాత్రి ఫ్రీ డిన్నర్ ఫ్యూర్ వెజిటేరియన్ దే ' జ్యూయల్ ఆఫ్ ఇండియా ' లో బఫేగా తిన్నాం. ! సింగపూర్ లో- ఆర్చిడ్ స్ట్రీట్ క్రిస్మస్ కు నెల్లాళ్ళు ముందుగానే రంగురంగుల దీపాలతో శోభాయమానంగా అలంకృతమౌతుంది. ఇరవై ఐదు డాలర్లతో ఓ మినీ వ్యాన్ కుదుర్చుకుని, ఆర్చిడ్ స్ట్రీట్ 'డెకరేషన్స్ ను ఆ వీధులగుండా ప్రయాణించి కనువిందుగా చూశాం. ఆ తరువాత రాత్రికి హోటల్ చేరుకున్నాం. హాయిగా నిద్రపోయాం.

మర్నాడు 27గురువారం- మా తిరుగు ప్రయాణం తేదీ రానే వచ్చింది. పన్నెండిటికి మధ్యాన్నానికి రూంస్ చెక్ ఔట్ చేయాలి. అది రూలు. మాకేమో సాయంత్రం 7;30 కు గానీ పికప్ వ్యాను రాదు. ఎయిర్ పోర్ట్ వెళ్ళడానికి. అంచేత మూడు రూంస్ లో రెండు ఖాళీ చేసి, అదనపు రుసుము చెల్లించి, సాయంత్రం దాకా ఒక రూం అట్టిపెట్టుకుని, సామాన్లు అందులో సర్దుకున్నాం. బ్రేక్ ఫాస్ట్ ఆరోజూ ఫ్రీయే లెండి. పదింటికి ఓ మినీవ్యాన్ ప్రత్యేకంగా బుక్ చేసుకుని, సింగపూర్ బొటానికల్ గార్ద్డెన్స్ చూడటానికి వెళ్ళాం. ప్రమోద్, అషిత, సుమిర చిల్డ్రన్స్ పార్క్ కు వెళ్ళగా, నేనూ, అన్నయ్య, వదిన ఉష, జింజర్ గార్డెన్, ఆర్చిడ్ పార్క్ చూశాం. నిన్న పక్షుల ప్రపంచం అయితే, ఇవాళ చెట్లు, పువ్వుల అందమైన ప్రకృతి ప్రపంచం. జలపాతాలు, చిన్నచిన్న కొండలు, రకరకాల మొక్కలు, చెట్లు, రంగురంగుల పువ్వులు, ఎంతసేపు తిరిగినా అంతా శోభాయమానమే. ఫోటోలు అవీ తీసుకున్నాం. మధ్యాన్నం దాకా తిరిగి వచ్చి ' శరవణ భవన్ ' లో భోంచేశాం. ఆ తరువాత మళ్ళీ ' ముస్తఫా మాల్ ' లో కాసేపు గడిపి, నాలుగౌతుండగా హోటల్ చేరుకున్నాం. బాగా నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయని వదిన, ఉష, ఒక చైనీస్ సెంటర్లో ' షీట్ మసాజ్ ' చేయించుకు వచ్చి, అద్భుతమైన రిలీఫ్ ఇచ్చిందని సంతోషించారు.

సామానంతా హోటల్ లాబీకి రూం నుండి చేర్చాం. రాత్రి సరిగా ఏడున్నరకు ట్రావెలర్స్ వ్యాన్ వచ్చింది. ఓ గంటన్నరలో ఎయిర్ పోర్ట్ చేరాం. అప్పటికే 9 అయ్యింది. 10.30. కి మా విమానం. సింగపూర్ లో చేసిన షాపింగ్ కంతా జి.ఎస్.టీ ఫారంస్ ఎప్పటికప్పుడు శ్రద్ధగా తీసుకోవడం వల్ల, ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకించిన కౌంటర్ లో వివరాలు చూపి రిటర్ను వచ్చే సర్వీస్ టాక్సు ఎమౌంట్ తీసుకున్నారు అషిత, ఉష. ఆ ముప్పై ఎనిమిది డాలర్లు ఎయిర్ పోర్ట్ లో రాత్రి మా డిన్నర్ కు కలిసి ఖర్చు పెట్టేసుకున్నాం. డిన్నర్ అవగానే ఇక వేగంగా ఆ విశాలమైన ఎయిర్ పోర్ట్ లో మేం బోర్డింగ్ చేయాల్సిన ఎఫ్. గేట్ కు నడిచి, సెక్యూరిటీ చెక్ లూ అవీ ముగించుకుని, 10.30 కల్లా టైగర్ ఎయిర్ వేస్ విమానం ఎక్కాం. విమానం టేకాఫ్ అయి గగనతలంలో ఎగిరి, మన భారత భూభాగంలోకి వచ్చి హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో అర్ధరాత్రి ఒంటిగంట దాటగా చేర్చింది. క్యాబ్ లో క్షేమంగా ఇల్లు చేరుకున్నాం. నిజానికి సింగపూర్లో చూడవలసినవి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. కానీ మాకున్న సమయం, వీలు మేరకు చూసినంత మేరకు సంతృప్తిని పొందాం.

అలా 2014 లో చిన్నప్పుడు విన్న ' జీవన్ మే ఏక్ బార ఆనా సింగపూర్ ' అని పాటలోని మాటను నిజంగానే వెళ్ళి సార్ధకం చేసుకున్న అనుభూతి, జీవితంలో ' జ్ఞాపకాల తోట ' లో ఎప్పటికీ విరబూసి పరిమళించేదే. వీలుంటే మీరూ ఇప్పటికింకా వెళ్ళకపోతే, తప్పకుండా వెళ్ళి చూడదగ్గ దేశం సింగపూర్ అని మరచిపోకండి. సరేనా మరి.....

మరిన్ని శీర్షికలు
Kidney Stones | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D.