Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ ; బాల్కనీలో నుంచున్న డా.హరికి ఎవరో తన చెవిలో గుసగుసగా పిలిచినట్టు వినిపిస్తుంది. ఆ స్వరం ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా టెర్రస్ పైకి చేరుకుంటాడు...అక్కడ.... మేఘనతో సహా గతంలో తనకెదురుపడిన పాత్రలన్నీ కనిస్తాయి....                                                     ఆ తర్వాత......

 

ప్రక్కనే ఒక రైస్‌ మిల్లున్నట్లుగా గుర్తుకొచ్చింది...

‘‘కానీ... కానీ...’’

మళ్లీ మొదలెట్టాడు బాబాయి...

‘‘ఆ రైస్‌మిల్లు వాళ్లు ఒక లోతైన పెద్ద గొయ్యి తవ్వి, ఆ గోతిలో పనికిరాని ఊక, తవుడు నింపారు. మళ్లీ వాటిని దూరంగా తరలించాలంటే ఖర్చవుతుందనీ, ఆ డబ్బు మిగల్చాలనే ఉద్దేశ్యంతో. అది కాస్తా వర్షానికి తడిసి పెద్ద ఊబిలా తయారయ్యింది. కనీసం కంచె కూడా వెయ్యలేదు వాళ్లు.

ఎన్నో మూగ జీవాలు ఆ ఊబిలో కూరుకుపోయి ప్రాణాఉ కోల్పోయాయి. చీకట్లో దారి తెన్ను తెలియని నీవు ఆ ఊబిలో కూరుకుపోతే, కూరుకుపోయిన నిన్ను బయటకు లాగి, నా ప్రాణాల్ని రక్షించింది ఎవరు? ఎవరనుకున్నావు? మేము. లేకపోతే ఈ రోజు ఈ భూమి మీద ఊపిరి పీలుస్తూ ఉండే వాడివా నీవు? అధములు మీరు... మనుషులా మీరు?’’

‘‘ఎవరో బేస్‌బాల్‌ బ్యాట్‌తో తలమీద కొడితే గతమంతా గుర్తుకొచ్చినట్లుగా అన్నీ గుర్తుకొచ్చాయి హరికి.

‘‘నిజమే...’’

‘‘ఎక్కడో అథఃపాతాళానికి కూరుకుపోతున్న తనను బలమైన హస్తాలు బయటకు లాగాయి. ఇంతకీ జరిగింది ఇదా? అప్పుడు వీళ్లే నన్ను రక్షించి, నా ప్రాణాలు నిలబెట్టారా?’’ గొంతు పూడుకుపోయింది హరికి.

కళ్ల వెంబడి అశ్రువులు, శరీరం చిగురుటాకులా కంపిస్తుండగా, చమటలు ధారగా కారుతుండగా అతి కష్టం మీద నోరు తెరచి అడిగాడు...‘‘నేను.... నేను.... నేనే విధంగా మీకు సాయం చేయగలను?’’

‘‘తెలీదా..? నీకు తెలియదా..? మేము చెబితే గానీ తెలుసుకోలేని మూర్ఖుడివా..?’’ అంటూ మీద మీద కొస్తున్న షిండే బాబాయిని చూస్తూ, చూస్తూనే స్పృహ తప్పి పడిపోయాడు హరి.

X                 X                X

ఒక పెద్ద పర్వతాకార రాక్షసాకారం...

కోతిని పోలి ఉంది దాని శరీరం. ఉక్కుతో చేసిన విగ్రహం లాంటి శరీరం. నిలువునా మనిషిలాగా నిలబడగలుగుతున్నది... ఆగ్రహంతో, ఉగ్రనరసింహావతారంలాగా ఊగిపోతున్నది. నిప్పులు కక్కుతున్న అగ్ని గోళాల్లాంటి కళ్లు, ముందుకు పొడుచుకు వచ్చి, భయంకరంగా కన్పిస్తున్నాయి.

పెద్ద పెద్ద పళ్లు, ఖడ్గ మృగం లాంటి పెద్ద తల, ఆ పళ్ల నుంచి ధారగా, జిగటగా ఒకలాంటి ద్రవం కారుతున్నది. ఎదురుగా వచ్చిన ఒక జింకని అవలీలగా చేత చిక్కించుకొని, ఒక్క ఉదుటున లేపి, గడ్డిపోచను విరగొట్టినట్లుగా విరగొట్టి, దాని పీక కొరికి, రక్తం పీల్చి పిప్పి చేసి, విసరగొట్టి రెచ్చిపోయిన ఆవేశంతో పిచ్చిగా అరుస్తూ, గుండెలు చరుచుకుంటూ ముందుకు సాగుతున్నది.

అడవిలోని జంతు సమూహాలన్నీ కకావికలై పారిపోతున్నాయి. పక్షులన్నీ చెట్ల మీద ఉండటానికి భీతిల్లి రెక్కలు టప టప కొట్టుకుంటూ మూకుమ్మడిగా పారిపోతున్నాయి. ప్రతీ జంతువూ... సింహం, పులి, ఏనుగు, నక్క, దున్నపోతు, జింక, ఖడ్గ మృగం, కోతి ఒకటేమిటి? ఉడుతలు కూడా గజ గజలాడుతూ చెల్లా చెదురుగా గందరగోళంగా పరుగులు తీస్తున్నాయి.

ప్రాణాలు చేతపట్టుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు హరి. లేవలేకపోతున్నాడు, లేచి పరిగెత్తాలనుకుంటున్నాడు కానీ బలం సరిపోవడం లేదు, కాళ్ల సత్తువ సరిపోవడం లేదు. నిలబడటానికి ప్రయత్నించి నిస్సహాయంగా కూలబడి పోతున్నాడు. ఆ పర్వతాకారం అరుపులు సమీపంలోనే వినబడుతున్నాయి.

ఇంతలో....

సరిగ్గా... ఎదురుగా... హరి ముందే ప్రత్యక్షమయ్యింది ఆ రాక్షసాకారం...

మండుతున్న గోళాల్లాంటి కళ్లతో హరిని చూసింది. నిలబడింది నిలబడ్డట్లుగానే పెద్దగా నోరు తెరచింది తెరచిన నోరును అలాగే ఉంచి హరి మీదకి వంగింది.

సరిగ్గా ఆ నోటిలో చిన్న బుడబుచ్చకాయ లాగా హరి తల ఇమిడిపోయింది. అది పళ్లతో కటుక్కుమంటే చాలు, హరి తల చిదిమేసిన పిల్ల టమాటాలాగా చిందవందరగా చిందుతుంది...

‘‘అమ్మా..... అమ్మా.... అమ్మో....’’ అంటూ అరుస్తూ దిగ్గున లేచి కూర్చున్నాడు హరి.

లీలగా... కనిపించీ కనిపించకుండా తల్లి విచార వదనం కనిపిస్తున్నది. అమ్మ.... మమ్మీ... ఇక్కడికెలా వచ్చింది? ఈలోగా అమ్మ చల్లని హస్తం తన చేతిని స్పృశిస్తూ తలను సవరదీస్తూ... ‘‘నాన్నా హరీ... నాన్నా హరీ’’ అంటూ మృదువుగా పిలుస్తున్నది.

చాలాసేపటికి తేరుకుని మత్తులోంచి, ఆందోళనలో నుండి బయటపడి, చుట్టూ గమనించాడు హరి. తనున్నది అమ్మ క్వార్టర్స్‌లో... మంచం మీద పడుకుని ఉన్నాడు. ఏమైంది? తనకేమైంది? ఎందుకిక్కడున్నాను? ఎప్పుడొచ్చాను? అసలేం జరిగింది? రకరకాల ఆలోచనలతో తల్లివైపే చూస్తున్న హరిని గమనించి, చలా మృదువుగా మంద్ర స్వరంతో తల్లి అన్నది ‘‘హరీ ఎక్కువగా ఆలోచించకు... నీకేం కాలేదు. నువ్వు నా దగ్గరే ఉన్నావు. ఆందోళనపడవద్దు, విశ్రాంతి తీసుకో’’ అంటూనే ఒక టాబ్లెట్‌హరి గొంతులోకి నెట్టి నీళ్లు పట్టించింది.

కొద్దిగా కోలుకుని నిబ్బరం తెచ్చుకున్నాక తల్లిని అడిగాడు ‘‘అమ్మా... అసలేమైంది?’’

‘‘గత నాలుగు రోజులుగా ‘కోమా’ లాంటి స్థితిలో ఉండి రకరకాల పలవరింతలు పలికావు. ఏమైనా గుర్తుందా నాన్నా నీకు?’’

‘‘లేదు మమ్మీ... నాలుగు రోజులుగానా? నేనా? కోమా స్థితిలో ఉన్నానా..?

‘‘ఊరికే ఎక్సైట్‌కావద్దు హరీ... నెమ్మదించు. నాన్నగారు పోయిన తర్వాత నాకు మిగిలినది నువ్వే. నీకేమైనా ఐతే నేను తట్టుకోలేను హరీ. చాదస్తం అనుకోను, పిచ్చి తల్లి ప్రేమనుకో. నీ అపార్ట్‌మెంట్‌వాచ్‌మన్‌కీ, ఇరుగింటి పొరుగింటి వారికీ ఫోన్‌చేసి నీ క్షేమ సమాచారాలు టైమ్‌టుటైమ్‌కనుక్కుంటుంటాను. అదే ఈ రోజు నిన్ను నా దగ్గరకు చేర్చింది.’’

‘‘నాకు బాగాలేదని ఎవరు... ఎవరు చెప్పారు మమ్మీ.’’

‘‘చెప్పడం కాదు... వాచ్‌మన్‌జైరాజ్‌కి నువ్వంటే అభిమానం. అంతేకాక నా కోరిక మీద నీ యోగక్షేమాలు నేను ఫోన్‌చేసినంతలోనే చెప్తూ ఉండేవాడు.’’

‘‘ఏం చెప్పాడు..?’’ అనుమానం అన్నాడు హరి.

‘‘హరీ... నీవు ఎంతెదిగినా.. నా దృష్టిలో చిన్నపిల్లవాడివే... నీ యోగక్షేమాలు విచారించడం నా దినచర్యలో భాగం.’’

తనను తాను ప్రశ్నించుకున్నాడు హరి. ఎప్పుడైనా నేనింత తల్లడిల్లానా నా తల్లి కోసం? ఎంతగా నన్ను కనిపెట్టుకుంటున్నది నా తల్లి? ఇదేనా అమ్మ ప్రేమంటే? నేనెప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. దుఖఃంతో గొంతు పూడుకుపోయి ఆశ్రునయనాలయ్యాయి హరికి.‘

హరీ... నీ మనసులో ఏదో ఉంది? ఏదో నిన్ను బాధిస్తుంది... ఏమిటది?

కష్టనష్టాలు తట్టుకునే ధీరుడిలాగే పెంచాను నిన్ను. నాన్న గారు లేని లోటు నీకు తెలియనివ్వలేదు. సమాజంలో ఆటుపోట్లు తట్టుకుని, ఒక ప్రొఫెసర్‌గా నిలదొక్కుకుని, నిన్ను చదివించి ప్రయోజకుడిని చేసాను. నీవు కూడా ఈ సొసైటీలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నావు, ఒడిదుడుకులు తట్టుకున్నావు.

ఏదో బలమైన కారణం లేనిదే నీవు బలహీనుడిగా మారవు. నాకా నమ్మకం ఉంది.

సౌమ్య విషయంలో నాకే సందేహం లేదు. ఆమె నీకు తగినటువంటి, అనువైనటువంటి చక్కని భార్య. ఏదో కొద్దిగా డిస్టర్బ్‌అయ్యింది. మళ్లీ మీరిద్దరూ హ్యాపీగా సాగిపోయే సమయం వచ్చింది. మీ మధ్య తుపాను రేపిన దుష్టశక్తుల్ని వదిలించుకున్నావు. అన్నీ బాగానే ఉన్న సమయంలో...

ఏమిటిది? నీకేమీ అంతుబట్టడం లేదు... నీవు చెపితేగానీ నాకేమీ అర్థమయ్యేలా లేదు.’’ అన్నది సుధారాణి.

‘‘ఏం లేదు మమ్మీ...’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra