Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : పీడకలలనుంచి మేల్కొన్న డా. హరి, తల్లి పలకరింపుతో కొంత సాంత్వన పొందుతాడు. తల్లి దగ్గర చదువుకునే విద్యార్థులు కొంతమంది వచ్చి కొన్ని ఎముకలు ఇచ్చేసరికి భయకంపితుడైన అతన్ని సర్దిచెప్పుతారు. డా. హిమాన్షు అనే ప్రొఫెసర్  డా. హరికి మార్చురీ ఆర్కియాలజీ గురించి వివరించడం ప్రారంభిస్తాడు.             ఆ తర్వాత.....



ఒకాయన తన పూర్తి మృతదేహాన్ని బ్రతికుండగా రాసి ఇచ్చేయగా, ఆ దేహాన్ని ఉల్లిపొరల్లాగా సన్నగా తరిగి, భద్రపరిచి, మెడికల్‌ స్టూడెంట్స్‌కి హృదయానికి హత్తుకునేలా పాఠాలు నేర్పిస్తున్నారు. ఆ మనిషి జన్మ ధన్యమైపోయింది.

అలాగే కళ్లు మొదలుకుని వివిధ అవయవాలను దానం చేసిన వాళ్లు చనిపోయినా గానీ అమరులై జీవిస్తున్నారు.’’

‘‘ఇదంతా తెలిసిందేనండీ... డాక్టర్లకందరికీ అనుభవమే. మీ సబ్జెక్టు నాకు తెలిసిందానికంటే ఎలా భిన్నమైనది? నాకు తెలియంది చెప్పండి.’’

‘‘ఓకే హరి గారు... ముందు చెప్పిందంతా ఉపోద్ఘాతమే.

మీ దృష్టిలో మార్చురీ అంటే?’’

‘‘చనిపోయిన శవాలను ఉంచే గది.’’

‘‘కానీ ఆర్కియాలజిస్టులకు (పురావస్తు శాస్త్రజ్ఞులకు) ప్రత్యేకంగా శవాల గది అంటూ ఏమీ లేదు. బీసీ నాటివి కానివ్వండి, ఆ తర్వాతవి కానివ్వండి. ఎంత పాతవైనా సరే సమాధులు తవ్వుతారు మార్చురీ ఆర్కియాలజిస్టులు.’’

‘‘ఎవరో ఎప్పుడో కప్పిపెట్టుకున్న శవాల్ని తవ్వడం తప్పు కదా?’’

‘‘ఖచ్చితంగా. లోచిస్తే మీరు చెప్పింది కరెక్టే. కానీ అలా చేయడం వలన అరుదైన జ్ఞానం ఇప్పటి తరం ప్రజలకు అందుతుందంటే ప్రభుత్వం కూడా తవ్వకాలకు పర్మిషన్‌ ఇస్తుంది.’’

‘‘ఏమేం విషయాలు తెలుస్తాయి.. అలా తవ్వితే?’’

‘‘మంగోలియన్లు మనిషి శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్లిందని, తిరిగి వస్తుందని నమ్ముతారు. కానీ ఈలోపు ఆత్మలేని శరీరాన్ని దుష్టశక్తులు ఆవహించకుండా శవాన్ని పూడ్చి పెట్టేముందు నేలమీద నీలం రంగు రాళ్లని పరుస్తారు. అలాగే దుష్టశక్తులు శరీరాన్ని ఏమీ చేయకుండా వాటికి సంతృప్తి కలగడానికి ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తారు. తరవాతెప్పుడో శవాన్ని బయటకు తీసేటప్పుడు ఒక చిన్న కిటికీ ద్వారా నెమ్మదిగా తీస్తారు. మొత్తమంతా ఓపెన్‌ చేసి శవాన్ని తీసేలోపు దుష్టశక్తులెక్కడ దూరిపోతాయో అని వాళ్ల భయం.

టిబెటన్లయితే శరీరాన్ని ఊరికి దూరంగా ఎవరూ నివసించని ఇంట్లో వదిలేస్తారు. ఆ శవాన్ని నక్కలు గానీ, కుక్కలు గానీ, పక్షులు గానీ ఏవైనా పీక్కు తినవచ్చు. ఇది చాలా దారుణమైన హేయమైన చర్యగా అనిపించవచ్చును కానీ బౌద్దత్వాన్ని నమ్మే వాళ్లకది ‘రaాతోర్‌’. అనగా ఇక ఎందుకూ పనికి రాని శరీరం. అది కనీసం కొన్ని జీవుల ఆకలి తీర్చడానికైనా ఉపయోగపడుతుంది కదా... ఆత్మ విడిచిన శరీరం ఎందుకూ పనికిరాని డొల్ల. ఆ డొల్ల వల్ల కొద్దిగానైనా మంచి ఫలితం దొరకడం గొప్పదే కదా? అంటారు టిబెటన్లు.

వాయవ్య అమెరికా తీరంలోని హైదా జాతికి చెందిన వారు ఊరి చివర ఉన్న ఒక పెద్ద గోతిలో చనిపోయిన వారిని తోసేసి చేతులు దులుపుకుంటారు. అదే రాజు గారో, రాజ గురువో అయితే వారి శరీరాలను చెక్కపెట్టెలో పెట్టి ఒక స్తంభంపై ప్రతిష్టిస్తారు. అక్కడున్న అనేక స్తంభాలపై వున్న పూర్వీకులు ఈ శరీరంలోని ఆత్మ సాఫీగా సాగిపోయేలా కాపాడతాయని నమ్ముతారు.

స్కాండినేవియాలో చనిపోయిన మనిషిని నౌక లాంటి ఆకారంలో ఉన్న గోతిలో పెడతారు. మరో లోకంలో ఉపయోగపడటానికి అతని కత్తి మొదలైనవి కూడా పెడతారు. ఆడవాళ్లకైతే వారి ఆభరణాలు, వస్తువులు కూడా పెడతారు. ఒక గొప్ప వ్యక్తి మరణిస్తే ఆ గ్రామస్తులంతా ఆ వ్యక్తి భార్యని ప్రేమించి, ఆ తర్వాత ఆమెని విగత జీవురాల్ని చేసి భర్తతోపాటు పాతిపెడతారు.

బాలి దీవిలో ఒక్కటొక్కటిగా అనేక శవాలను ఊరి చివర పాతిపెడతారు. ఇలా పాతిపెట్టబడిన వారు ఒకరికొకరు తోడుగా ఉండేలా పది, పదిహేను మంది పోగు పడగానే, వాళ్లందర్ని తీసి, స్నానం చేయించి అందంగా అలంకరించిన ఒక పెద్ద ప్లాట్‌ఫారం మీద వాళ్లని పువ్వులతో ఆసీనులను చేసి బాజాభంత్రీలతో ఊరంతా ఊరేగించి చివరగా ఊరి మధ్యలో తగలబెడతారు. ఆ శుభసందర్భంలో ఊరుఊరంతా విందు వినోదాలతో మునిగిపోతుంది.

‘‘ఆగ్నేయ ఆసియాలో ఎవరెక్కడ పనిచేస్తుండేవారో ఆ పొలంలోనే చనిపోయాక వారిని అక్కడే భూస్థాపితం చేసి, దానిపై పెద్ద పెద్ద రాళ్లను పాతుతారు. ఆ రాళ్లకింద డబ్బుని కూడా దాస్తారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మరో లోకంలో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి. కాంబోడియాలోనూ, థాయిలాండ్‌లోనూ ప్రతీ ఇంటి ముందు చనిపోయిన వారి కోసం కట్టిన చిన్న ఇళ్లలో టైమ్‌ టూ టైమ్‌ ఆహార, పానీయాలు ఉంచుతూ ఉంటారు. చనిపోయిన ఆత్మలు వాటిని ఆరగిస్తూ ఆరోగ్యంగా ఉండి, బతికి ఉన్న తమవారిని వారి ఆస్తులను సంరక్షిస్తాయని నమ్ముతారు.

క్రిబాను అనే తెగవారు చనిపోయిన వారి శరీరాన్ని తమతోపాటే పదిపన్నెండు రోజులుంచుకుని దానికి విందులు చేస్తారు. చివరగా శరీరాన్ని పాతిపెట్టి తర్వాత కొంతకాలానికి తవ్వి పుర్రెను బయటకు తీసి దానికి తైల మర్ధనం చేసి పాలిష్‌ చేసి, పుగాకు, పిండి వంటలర్పిస్తారు. ఆ పుర్రెను పదిలంగా ఇంటిలో ప్రతిష్టిస్తారు.హవాయి దీవుల్లో చనిపోయిన వారిని పిండ స్థితిలో మనిషెలా ఉంటాడో అలా కట్టివేసి, ధవళవస్త్రంలో చుడతారు. ఒక్కోసారి శరీరం లోపలి అవయవాలన్నీ పీకేసి శరీరం పాడయిపోకుండా ఉప్పుతో కూరతారు. ఆ తర్వాత ఒక గుహలో పెట్టి మూతమూసేస్తారు.

అలాగే చాలాచోట్ల సముద్ర ప్రయాణంలో చనిపోయిన వారిని గోనె సంచుల్లో కుక్కి కుట్టువేసి ఆ మనిషి బరువు తగ్గ రాళ్ల సంచికి జతచేసి సముద్రంలో నిమజ్జనం చేస్తారు.

ఇక ఈజిప్షియన్ల విషయానికొస్తే వాళ్లు మృతదేహాలకు రాసిన వేపనాలు, ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతుపట్టని పరిశోధనాంశాలే. ఆ మృతదేహాలతో పాటు నిధినిక్షేపాలు నిక్షిప్తం చేసే పిరమిడ్లు అత్యద్భుతమైన కట్టడాలు.’’

‘‘ఈ స్టడీస్‌ వలన ఉపయోగాలేమిటి?’’ ప్రశ్నించాడు హరి.

‘‘సతీ సహగమన దురాచారం మీకు కనబడిందా?’’

‘‘స్కాండినేవియాలో కనిపించింది.’’

‘‘బౌద్ద, జైన మతాల ప్రభావం కనిపించిందా?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra