Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : కోయంబేడు స్లమ్ ఏరియాలో కాకా హోటల్లో మురడన్ ముత్తూ బేచ్ సహస్రను కిడ్నాప్ చేసైనా విరాట్ నుంచి డబ్బు రాబట్టాలని ప్లాన్ చేస్తూంటారు...సహస్ర వెనకే ఆమె ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు విరాట్. ఇక్కడ చందూ, దీక్షలు తీరిగ్గా ప్రేమించుకోవడంలో మునిగిపోతారు...............ఆ తర్వాత.....


‘‘నిన్ను నాలుగుతన్నమనేమీ అనట్లేదా? పాడు బుద్దులు, పాడు వేషాలు. పెళ్ళి కాకుండానే పిచ్చి వేషాలేయాలనుందా? చంపేస్తాను’’ అంటూ బెడ్ దిగిపోయింది.

‘‘ఏయ్ ఆగు తమాషాకన్నాను. సీరియసై పోతావేమిటి? కూచో ’’ అన్నాడు చందూ. కాని దీక్ష కూచోలేదు. వెళ్ళిన వాళ్ళలోఒక్కరూ యింకా తిరిగి రాలేదు. ఆమె కంగారు పడుతూ తలుపు తీసి హాల్లోకొచ్చింది. వెనకే చందూ కూడ వచ్చాడు.పగిలి పోయి హాల్లో చెల్లా చెదరుగా వున్న సామాన్లు చూస్తుంటే బాదేసింది. సుమారు పది నుండి పదిహేను లక్షల రూపాయలకు నష్టం జరగుంటుంది. కొత్త వాటికి మరో ఇరవై లక్షలు పెట్టాలి.

‘‘దీక్షా’’ పిలిచాడు చందూ

‘‘ఏమిటి?’’ అడిగింది

‘‘నీ ఫ్రెండు లాగే నువ్వు కూడా కోపం వస్తే ఇంట్లో సామానంతా యిలాగే పగల గొట్టేస్తావా?’’

‘‘పిచ్చి పిచ్చిగా వుందా? నేనెందుకు పగుల గొడతాను?’’

‘‘మరి నీ ఫ్రెండేమిటి యిలా నాశనం చేసింది? తనకి కరాటే వచ్చని ముందే నీకు తెలుసా?’’

‘‘తెలుసు. నీ ఫ్రెండు మాత్రం తక్కువా. తనకీ కరాటే వచ్చుగా. ఎంతయితే మాత్రం యిలాగా నాశనం చేయటం! అసలు విరాట్ ని మెచ్చుకోవాలి. ఇంత చేసినా సహస్రని పల్లెత్తు మాటనకుండా తన కోసం పరుగెత్తాడు.’’ ‘‘ప్రేమలో ఉండే గొప్పదనం అదే. మావాడంటే పడిచచ్చే అమ్మాయిలు ఎంత మందున్నారో తెలుసా?’

‘‘ఎంత మందున్నారు?’’

‘‘ఏయ్, ఏదో మాట వరసకన్నానోయ్. కోప్పడిపోతావేమిటి? మా వాడంటే పడిఛస్తారన్నాను గాని వాడు ఎవరికీ పడలేదు. ఇంతకీ విరాట్ ని ప్రేమించటానికి సహస్రకున్న అభ్యంతరాలేమిటి?’’

‘‘బాగుంది, అదేగా అర్ధమై చావటం లేదు. అక్కడ వాళ్ళేం గొడవ పడుతున్నారో ఏమిటో.........ఓసారి చూసొద్దాం పద’’

‘‘పడనీ, మధ్యలో మనకేమిటి?’’

‘‘ఏమిటా........ఇక్కడంతా సహస్ర ధ్వంసం చేసిందన్న కోపంతో విరాట్ మా యింట్లో సామాను పగల గొడితే నా పరిస్థితేమిటి?’’

‘‘భయపడకు మా వాడంత బుద్ది లేనోడేమీ కాదులే’’

‘‘అంటే........మా సహస్రకే బుద్ది లేదంటావా.......’’

‘‘ఆ మాట నేనన్లేదు. ఓరి దేవుడా అవునంటే కాదని కాదంటే అవునని. ఏంటీ అమ్మాయిలు? ఆడాళ్ళకి తెలివి తేటలెక్కువ. మాకు భలే అన్యాయం చేసావయ్యా’’

‘‘నీ అన్యాయం గురించి తర్వాత తీరిగ్గా ఆలోచించుగాని, ఈ చెత్త సంగతేమిటి?’’ అంది దీక్ష.

‘‘దాందేముంది క్లీన్ అండ్ స్వీప్ హోమ్ వాళ్ళకి ఫోన్ చేసాను. కాస్సేపట్లో వచ్చి మొత్తం తీసి లారీలో వేసుకొని హాలు క్లీన్ చేసి వెళ్ళిపోతారు. ఈ లోపల స్ట్రాంగ్ కాఫీ తాగుదాం పద’’ అంటూ అతడ్నిఅనుసరించింది దీక్ష. ఇంతలో క్లీన్ అండ్ స్వీప్ హోమ్ వాళ్ళ లారీ వచ్చి గేటు ముందు ఆగింది. బిలబిలా నలుగురు పనివాళ్ళు కిందకు దిగారు.

************************************

సెల్ ఫోన్ నంబరు చూసిషాకయ్యారు విరాట్.

‘‘ఓమైగాడ్!’’ అన్నాడు అప్రయత్నంగా

ఇది అతడు అస్సలు వూహించని ఫోన్ కాల్. ఎందుకంటే కోయంబత్తూరులో తమ యింటి లాండ్ లైన్ నంబర్ అది. ఇంటి నుండి ఫోనంటే...ఎవరు చేసుంటారు? డాడీ లైన్ లోవున్నారా? ఈ నంబరు తనదని అక్కడెవరికీ తెలీదే... లిఫ్ట్ చేయాలా వద్దా...’’

‘‘ఏమైంది? ఎవరు ఫోన్ చేసారు?’’ అతడ్ని గమనిస్తున్న సహస్ర కుతూహలంగా అడిగింది.

‘‘అదే అర్ధం కావటం లేదు. ఇది కోయంబత్తూరు. మా ఇంటి లాండ్ లైన్ నంబరు, డాడీ అనుకుంటాను.’’

‘‘మాట్లాడు ఈ లోపల కాఫీ చేసి తెస్తాను.’’

‘‘ఈ నంబరు నాదని మావాళ్ళకు తెలీదు. అదే ఆశ్చర్యంగా వుంది’’

‘‘తర్వాత ఆశ్చర్య పోవచ్చు. లైన్ కట్టవుతుంది. ముందు మాట్లాడు’’ అంటూ కిచెన్ వైపు వెళ్ళింది సహస్ర.

తప్పదనుకుంటూ ఆన్ చేసాడు.

‘‘హాలో’’ అన్నాడు గాభరాను అణుచుకుంటూ. ఫోన్ చేసింది వెంకట రత్నం నాయుడు గారయితే తనయిపోయాడే కాని అతడి అదృష్టం ఏం కానుందో గాని ఫోన్  చేసింది ఆయన కాదు తల్లి మంగ తాయారు.

‘‘బాబూ విరాట్ ఒరే చిన్నోడా... ఈ నంబరు నీదేనా..?’’ అటు నుంచి తల్లి గొంతు వింటూనే కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు విరాట్.

‘‘మమ్మీ పక్కన డాడీ ఉన్నాడా?’’ వెంటనే అడిగాడు.

‘‘లేరులే, ఇంత క్రితమే బయటికెళ్ళారు. ఏమిట్రా యిదంతా నాకంతా గందరగోళంగా ఉంది. వారానికి, పది రోజులకి ఫోన్ చేసే వాడివి. ఈ మధ్య అస్సలు చేయటం మానేసావ్. ఇవాళ చూస్తే పేపర్ లో ప్రకటన. ఎవరీ అమ్మాయి...? ఏమిటీ గోల?’’ అటు నుంచి తల్లి మంగ తాయారు సీరియస్ గా అడుగుతుంటే చిన్నగా నవ్వుతూ.

‘‘ఆ విషయాలు చెప్తా గాని మమ్మీ నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది నా పర్సనల్ నెంబర్. అక్కడ ఎవరికీ తెలీదు. ఇది నా ఫోన్ నంబరని నీకెలా తెలిసింది? డాడీకి తెలిసి పోయిందా?’’ అడిగాడు.‘‘మీ డాడీ మూలంగానే నాకు తెలిసింది. అనవసరంగా ఆయనతో తిట్లు తిన్నాను. చిన్నకొడుకుకని నెత్తినెత్తుకున్నావ్ చూడు ఏం చేసాడో అంటూ మండిపడ్డారు.’’

‘‘డాడీకి ఎలా తెలిసింది?’’

‘‘మొదట ఆయనకీ తెలీదు, ఎవడో ప్రేమ పిచ్చోడు ఏకంగా ప్రకటనే యిచ్చాడు చూడు అంటూ చూపించి నవ్వుకున్నారు. అంతలో సాగరిక ఫోన్ చేసి చెప్పింది.’’

‘‘సాగరిక....?’’

‘‘అవున్రా, నీ మేన కోడలు సాగరికే. గతంలో నువ్వు దానికి ఈనంబర్ తో ఫోన్లు చేసినట్టున్నావు. అసలే దానికి గుర్తెక్కువ. ఏదీ మర్చిపోదు. నువ్వు చెన్నైలో ఉన్నావని ఈ నంబరు నీదని. ఫోటోలో పిల్లని ప్రేమించి ఉంటావని........మీ ఇద్దరికీ పెళ్ళి జరిపిస్తానంటే నేచెప్తానని మాట తీసుకొని మరీ చెప్పింది.’’

‘‘కొంప ముంచింది. డాడీ ఏమన్నాడు.’’

‘‘ఇక చెప్పాలా ఆయన కోపం గురించి. నీ మీద నా మీద కూడ మండిపడ్డారు. తను ఫోన్ చేస్తే చెన్నై నుంచి మళ్ళీ ఎటన్నా వెళ్ళి పోతావని ఫోన్ చేయలేదు. పెద్దోడు విక్రాంత్ కూడ అదే సలహా యిచ్చాట్ట. ఇంతకీ ఎవర్రా పిల్ల ? ఎందుకు నిన్ను ప్రేమించింది? ఎందుకెళ్ళి పోయింది?’’కిచెన్ లోకి చూసాడు విరాట్.

లోన కాఫీ కలుపుతోంది సహస్ర.

కమ్మటి కాఫీ వాసన ముక్కు పుటాల్ని తాకుతోంది. మమ్మీ మాటలు తనూ వినాలని స్పీకర్  ఫోన్ ఆన్ చేసాడు.‘‘తనో సత్యభామ అనుకుంటుంది. అలిగి వెళ్ళి పోయింది. ప్రకటన చూడగానే ఇంత క్రితమే వెనక్కి వచ్చేసింది’’ అన్నాడు.

ట్రే తో వస్తున్న సహస్ర అతడి మాటలకి...

చురచురా చూసింది.

‘‘పేపర్లో ఫోటో చూసాను. పిల్ల చాలా బాగుంది. మహాలక్ష్మిలా వుంది. నాకు నచ్చింది’’ అవతలి నుంచి తల్లి గొంతు.

‘‘థ్యాంక్యూ మమ్మీ’’ అన్నాడు

సహస్ర వచ్చి ట్రే టీ పాయి మీద వుంచింది. ఒక కప్పు అతడి ముందుంచి ఒకటి తన ముందుంచుకుంది. తల్లీ కొడుకుల సంభాషణను ఆసక్తిగా వింటోంది. తనను సత్యభామతో పోల్చటం కించిత్తు గర్వంగానూ కించిత్తు కోపంగానూ ఉందామెకు.

‘‘అవునూ మీరిద్దరూ నిజంగానే ఒకర్నొకరు ఇష్టపడుతున్నారా? అంతగా ప్రేమిస్తే ఎందుకెళ్ళిపోయింది?  ఏదన్నా సమస్యా?’’ ఆరా తీస్తోంది మంగ తాయారు.

‘‘అదేం లేదు మమ్మీ. సమస్యేం లేదు. ఇంతకీ మన వాళ్ళంతా ఎలా వున్నారు? మమ్మీ, అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు?’’‘‘అంతా బాగున్నారు గాని నువ్వు మాట మార్చకు. అడిగిందానికి సూటిగా సమాధానం చెప్పు. పెళ్ళి చేసుకొని కాపురం పెట్టేసినట్టున్నావ్. నిజం చెప్పు నీ పెళ్ళయిపోయిందా?’’ నిలదీసింది.

‘‘అయ్యో అదేం లేదు. మా ప్రేమ పెళ్ళి వరకు ఇంకా రాలేదు మమ్మీ. నన్ను నమ్ము. మీతో చెప్పకుండా మీరెవరూ లేకుండానే నా పెళ్ళి జరగదు. సరేనా’’

‘‘ఏమో, మీ డాడీకి భయపడి చెప్పకుండా పెళ్ళి చేసేసుకున్నావనుకుంటున్నాను.’’

‘‘లేదంటున్నాగా’’

‘‘అయితే పెళ్ళిగా కుండా ఆ పిల్ల నీతో ఎందుకుంటోంది? ఎందుకెళ్ళింది? ఎందుకొచ్చింది?’’

తల్లి అలా నిలదీస్తుంటే...

విరాట్ కి గుక్క తిప్పుకోవటం కష్టంగా వుంది.

ఏం చెప్పాలి? ఎలా మేనేజ్  చేయాలి?

కాఫీ సిప్ చేస్తూ సహస్ర అతడి అవస్థ చూసి ముసిముసిగా నవ్వుతోంది.

‘‘ఏంటి మమ్మీ నువ్వు కూడ అనుమానిస్తున్నావ్. అలాంటిదేమీ లేదంటున్నాగా. నాలాగే తనూ తన వాళ్ళకు దూరంగా ఇక్కడ తన
స్నేహితురాలితో కలిసి ఉంటూ జాబ్ చేస్తోంది. పక్క పక్క వీధుల్లోనే ఉంటున్నాం. నాతో గొడవ పడి తన ఫ్రెండ్ కీ చెప్పకుండా వెళ్ళి పోయి హాస్టల్లో ఉందట. ఆ సంగతి తెలీక నేను పేపర్లో ప్రకటించాను. అది చూసి వెనక్కి వచ్చేసింది అంతే...’’ ఎలాగో మేనేజ్  చేసాడు.

‘‘వూ... బాగుందిరా వరస. ఇంతకీ అమ్మాయి పేరేమిటన్నావ్? సహస్రానా...’’ అడుగుతోంది తల్లి. ‘‘పూర్తి పేరు లక్ష్మీ సహస్ర...’’ చెప్పాడు.‘‘అలాగా... పేరు చాలా బాగుందిరా. ఇప్పుడు నువ్వెక్కడున్నావ్...?

‘‘ఇక్కడే.....సహస్రవాళ్ళింట్లో.........ఇంత క్రితమే వచ్చాను.’’

‘‘అమ్మాయి గుణవంతురాలేనా? ఏం చదువుకుంది’’

‘‘మమ్మీ, గుణం గురించి చెప్పాలంటే అబ్బో, మహా శంకిణి. లోకంలో తిక్కంతా తనకే ఉంది. ఇక చదువంటావా? ఎదుటి వాళ్ళని చితగ్గొట్టేంత చదువుకుంది.’’

ఆ మాటలు వింటున్న సహస్ర ఉడికి పోతూ ‘‘ఆపు..... ఆపుతావా? అదే నిజమనుకుంటారావిడ’’ అంటూ ఫోన్ లాక్కుంది.

‘‘ఆన్టీ.....  నమ్మకండి. మీ అబ్బాయి మాటలు అస్సలు నమ్మకండి. కావాలని నన్నేడిపిస్తున్నాడు. మహామొండి. ఇలా ఉడికిస్తుంటేనే నేను కోపమొచ్చి వెళ్ళిపోయాను. అతని మాటలు నమ్మి నన్ను అపార్ధం చేసుకోవద్దు. ప్లీజ్’’ అంది. విరాట్  కట్టుకథని తనూ బలపర్చింది సహస్ర.అటు నుంచి మంగ తాయారు నవ్వటం విన్పించింది.

‘‘నా మాటలు నమ్మండి. ఆన్టీ నేను చాలా మంచి దాన్ని. విరాట్ కావాలని.......’’

‘‘అర్ధమైందిలేమ్మా. నా కొడుకు సెలక్షన్ ఎన్నడూ రాంగ్ కాదని నాకు తెలుసు. ఫోటోలో చూస్తుంటే నా దిష్టే తగిలేంత అందంగా ఉన్నావ్. బంగారు బొమ్మలా ఉండుంటావ్. నీ మనసు కూడ బంగారం లాంటిదే అయి వుంటుంది. చెప్పమ్మా ఇంతకీ నీది ఏ వూరు? ఎవరి తాలూకు?’’మంగ తాయారు గారి చివరి ప్రశ్నలు వినగానే సహస్రకు గొంతులో ఏదో అడ్డం పడినట్టయింది. ఏం చెప్పాలి? గతం తన తల్లికి తెలిసినట్టే ఈవిడకు తెలీయకుండా ఉంటుందా? తన తండ్రి మహాదేవ నాయకర్  పేరు చెప్పగానే ఈవిడ పెళ్ళి జరగదంటుంది. తన కన్నా విరాటయితేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడనుకుంటూ

‘‘ఆ విషయాలు తను చెప్తాడులే ఆన్టీ ఫోన్ విరాట్ కిస్తున్నాను. మాటాడండి’’ అంటూ మరో మాటకి అవకాశం యివ్వకుండా ఫోన్ విరాట్ చేతిలో పెట్టింది.

‘‘నా గురించేమీ చెప్పకు’’ అంటూ లోగొంతులో హెచ్చరించింది.

కాని ఆ హెచ్చరిక విరాట్ కి అర్ధంగాక ‘‘మమ్మీ తనేమీ ఆషామాషీ అమ్మాయేమీ కాదు, తనది మధురై. ఆమె తండ్రి మహాదేవ నాయకర్. నాలాగే తనూ తండ్రి చూసిన సంబంధం యిష్టం లేక చెన్నై వచ్చేసుంటోంది.......’’

విరాట్ మాటలువింటూ

‘‘అయ్యో అయ్యో........’’ అనుకుంటూ నుదురు కొట్టుకుంది సహస్ర. తను వద్దన్నా అర్ధం చేసుకోకుండా చెప్పేసాడే అని కళవర పడింది. ఆమె అనుకున్నట్టే అయింది.

‘‘ఏరా నువ్వు నిజమే చెప్తున్నావా?’’ అవతల నుంచి అడుగుతోంది తల్లి.

‘‘నిజం మమ్మీ డౌటెందుకు?’’

‘‘మధురై లిక్కర్  సిండికేట్ మహాదేవ నాయకరేనా?’’

‘‘అవును’’

‘‘అలాగా’’

‘‘అయితే నువ్వు మా గురించి చూడక్కర్లేదు. పెళ్ళి చేసుకొని చెన్నైలోనే ఉండిపో’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్