Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sudhamadhuram

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ- eవీ - భమిడిపాటి ఫణిబాబు

   ఇదివరకటి రోజుల్లో వంటవరకూ ఏదో ఇంటియజమానురాలే చేసేవారు. మిగిలిన పనులకి అంటే ఆరోజుల్లో పెరడూ, వాకిలీ లాటివి ఉండేవి కనుక, అక్కడంతా తుడిచి, కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టడమూ, పెరడంతా తుడవడమూ, ఇల్లు ఊడచడమూ, వంటగిన్నెలు కడగడమూ, ఈ మధ్యలో బట్టలు ఉతికి ఆరేయడమూ.. వగైరా..వగైరా.. లకి ఓ పనిమనిషుండేది.కాలక్రమేణా ఇళ్ళూ, వాకిళ్ళూ, పెరళ్ళూ చరిత్ర లోకి వెళ్ళిపోయాయి.ఎపార్టుమెంట్లొచ్చాయి.వాటికి వాకిలిమాట దేముడెరుగు, 'గడప' లాటిదే ఉండదు, గొడవే లేదు.వారికి ప్రత్యేకంగా జీతభత్యాలని ఉండేవి కావు. పైగా ఒక మనిషొచ్చిందంటే ఆమెతో ఒక personal bonding ఏర్పడిపోయేది.ఇంట్లో మనిషిలా ఉండేది.

కాలక్రమేణా అదేదో inflation ధర్మమా అని కుటుంబ ఖర్చులు అందరికీ పెరిగేయి. దానితో ప్రతీదానికీ ఒక రేటనేది ఏర్పడింది.నగరాల్లో పనిమనుష్యులు దొరకాలంటే ఓ పెద్ద యజ్ఞం లా తయారయింది.మన అవసరాలని బట్టి వారి demandసూ పెరిగాయి. భార్యా భర్తా ఉద్యోగాలు చేస్తున్న ఈరోజుల్లో డబ్బుకేమీ కొదవలేదుగా, దానితో, పనిమనుష్యులు ఎంత demand చేస్తే అంతా ఇచ్చే స్థాయిలోనే ఉన్నారు. ఇంట్లో పెద్దవారెవరైనా ఉంటే ఫరవాలేదు కానీ, అలా లేకుండా ఈ జంట ఒక్కరే ఉండేమాటైతే,వీరి convenience ప్రకారమే ఆ పనిమనిషి రావాలిగా. అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళెవరైనా ఉంటూంటే సంగతి వేరూ, కనీసం పనిమనిషి వచ్చేవేళల్లో ఏవో కొద్ది మార్పులు చేసికోవచ్చు. కానీ ఈరోజుల్లో ఇళ్ళల్లో పెద్దవారుండే పరిస్థితులు తక్కువే. ప్రతీవారూ విడిగానే ఉండడం prefer చేస్తున్నారు. ఎవరి కారణం వారిదీ. కానీ ఇందులో బాగుపడ్డవాళ్ళు మాత్రం definete గా పనిమనుష్యులే అని నా అభిప్రాయం..

పనిమనిషి ఉందీ అంటే, ఇంట్లోవాళ్ళకి కూడా “బధ్ధకం” ఎక్కువైపోతూంటుంది.  ఉదాహరణకి, భోజనం చేసేసి, ఆ కంచమో, ప్లేటో కడిగేసి పెట్టేసికుంటే ఓ పనైపోతుందిగా, అబ్బే, మర్నాడు పనిమనిషి రావాలీ, తనొచ్చేదాకా  ఆ అంట గిన్నెలూ, పళ్ళేలూ అలాగే ఉండాలి. అయినా కాఫీగ్లాసు కడగడమే అలవాటు లేనివాళ్ళు, కంచాలూ, ప్లేట్లూ కడగమనడం కొంచం అత్యాశే కదూ.. ఈరోజుల్లో ఎక్కడ చూసినా విదేశాలకి వెళ్ళొచ్చిన వాళ్ళే కదా, అక్కడ ఇలాటి సదుపాయాలు లేక, ఎవరి పని వారే చేసుకునేవాళ్ళు కదా, మరి ఇక్కడేమొచ్చిందిట? ఒఠ్ఠి “జరుగుబాటు రోగం “. మనదేశంలో ఎవరి పని వారు చేసికోడానికి ఎక్కడలేని నామోషీ అడ్డొచ్చేస్తుందిగా మరి?

ఈమధ్యన పెద్ద నగరాల్లో ఒక్కో కంపెనీ ఏర్పడడమూ, పెద్ద పెద్ద హౌసింగు సొసైటీలకి వెళ్ళి, కాంట్రాక్టులు తీసికోవడమూనూ. ఒక్కో ఇంటికీ, ఓ ఇద్దరు ముగ్గురు పనిమనుషులని పంపిస్తారు, ఒక్కోరు ఒక్కొక్క పని చక చకా చేసికుంటూ పోతారు. వారానికో, పదిహేను రోజులకో, ఇంట్లో ఫ్యాన్లు తుడవడమూ, విండో గ్లాసులు తుడవడమూలాటి భారీ పనులు కూడా చేస్తారు. కొద్దిగా ఖర్చు ఎక్కువే అయినా, ఇద్దరు పనిమనుషులకి ఇవ్వాల్సిన డబ్బు, ఒకే ఏజన్సీ కి ఇవ్వడమూ, కొద్దిగా  economical  గా ఉండడంతో, పోనీ ఇదీ చూద్దామని, మొదలెడతారు. ఈ కొత్త పధ్ధతే బాగుందని, అప్పటిదాకా చేస్తూన్న పనిమనుషులకి ఉద్వాసన చెప్పేస్తారు. కానీ, ఈ కొత్త సంస్థ మాత్రం ఎన్నాళ్ళూ? అప్పటిదాకా ఆ సొసైటీల్లో పనిచేస్తూన్న పనిమనుషుల “ఒత్తిడి” ప్రభావంతో, ఆ సంస్థవారు కాంట్రాక్టు ని  discontinue చేసేస్తారు. వాళ్ళదేం పోయిందీ, ఇంకో సొసైటీ చూసుకుంటారు. తిప్పలల్లా ఆ సొసైటీలో ఉండేవారిది. ఎక్కడున్నావే గొంగళీ అన్నట్టు, మళ్ళీ మొదలూ..పాత పనివాళ్ళు. ఈసారి వాళ్ళు నెత్తికెక్కేస్తారు, కొత్త కొత్త కండిషన్లు పెడతారు. అయినా ఇంకో గతిలేక, వాళ్ళు చెప్పినవాటికే ఒప్పుకుంటారు. పోనీ ఒప్పుకున్నారుకదా అని సవ్యంగా చేస్తారా అంటే అదీ లేదూ.. వారాంతంలో, ఏదో ఔటింగు పేరుచెప్పి, వీళ్ళు వంట మనిషికీ, పనిమనిషికీ రావఖ్ఖర్లేదని చెప్పేస్తారు, నెలలో ఓ రెండుమూడు రోజులు, వాళ్ళిష్టమొచ్చిన రోజు, వాళ్ళు శలవు పెడతారు, వెరసి నెలలో  ఓ పదిరోజులు శలవు. అలాగని జీతం కట్ చేస్తామంటే, మొదటికే మోసం వస్తుందేమో అని, భయం.ఇలా పనివారికి “ఆడింది ఆటా, పాడింది పాట “ గా తయారయింది పరిస్థితి.

పైగా వీటికి సాయం, ప్రభుత్వం వారుకూడా,welfare measures పేరుతో వారికీ కనీస వేతనం ఇవ్వాల్సిందే అని ఒక చట్టం తేబోతున్నారుట.

చట్టాలు తయారుచేసేముందు, అసలు ఎవరూ వివరంగా ఆలోచించరా, ఆలోచించినా పోనిద్దూ, మనం ఓ చట్టం చేసేద్దాము, వాళ్ళ గొడవేదో వాళ్ళే పడతారు అనా?. ఉదాహరణకి పనిమనుష్యుల కనీస వేతనం గురించే చూద్దాం- కనీస జీతం ఫలానా అంత ఉండాలీ అన్నారు, చేయవలసిన పనులేమిటీ, ఎంతసేపు ఉండాలీ, ఒక్కో పనీ ఎంతసేపు చేయాలీ ఇలాటివాటి మాటేమిటీ? పోనీ ఏదో నాలుగ్గంటలుండాలీ అన్నారనుకుందాం, ఉన్న మూడుగదులూ సావకాశంగా ఆడుతూ పాడుతూ తుడుస్తూ, నాలుగ్గంటలూ గడిపేసి, అంట్ల గిన్నెలు కడగడానికి టైమయిపోయిందంటే, ఆ "ప్రభుత్వం" వారొచ్చి గిన్నెలు కడుగుతారా? ఇలాటి సమస్యలొస్తాయి.

ఇంకో సంగతేమంటే వీళ్ళకీ యూనియన్లూ వగైరాలుంచుకోవచ్చుట.మళ్ళీ అదో గొడవా.సైనిక దళాలకీ, పోలీసు వ్యవస్థకీ ట్రేడ్ యూనియన్ అనుమతించరే ప్రభుత్వం వారు, మరి వీళ్ళకి మాత్రం ఎందుకుట? వాళ్ళని కూడా essential services లోకి వేసేయొచ్చుగా... అలాగని నేను ఏదో ఫ్యూడల్ వ్యవస్థకి చెందినవాణ్ణీ అనిమాత్రం అనుకోకండి.అలాగని మరీ లెఫ్టిస్ట్ సిధ్ధాంతాలూ కావూ..

అతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఈ పనిమనుషులు అనబడే “ప్రాణులు “ మాత్రం, సాధారణ మానవమాత్రులతో ఆటాడేసికుంటున్నారు.

మరిన్ని శీర్షికలు
sahiteevanam