Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విశాల, విరాట్ లను క్లోజ్ గా చూసిన సహస్ర, దీక్షలు అలిగి వెళ్ళిపోతారు...వాళ్ళ వెనక వెళ్ళి సర్ది చెప్పబోయిన చందుని కనీసం లోపలికి రానీయకుండానే కోపంగా మాట్లాడి పంపేస్తారు సహస్ర-దీక్షలు......ఆ తర్వాత..

కనీసం ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడ యివ్వనప్పుడు వదిలేయటమే. అంతే. నేను దీక్షను మర్చిపోతాను. నువ్వు సహస్రను మర్చిపో. ఇంత కన్నా మార్గం లేదు’’ అన్నాడు ఆవేశంగా చందూ.

అతడి భుజం తట్టాడు విరాట్‌.

‘‘ఒకె నీ కోపాన్ని అర్దం చేసుకోగలను. దీక్ష మాటల్ని పట్టించుకోకు. సహస్ర ఏమీ అనలేదు గదా నేనోసారి వెళ్ళి సహస్రతో మాట్లాడి వస్తాను’’ అన్నాడు.

‘‘వద్దంటున్నా గదా’’ కోప్పడ్డాడు చందూ.

‘‘ఆవేశాన్ని తగ్గించరా. వాళ్ళు శత్రువులు కాదు. పంతాలు పట్టింపులు కాదు కావలసింది వాళ్ళ క్షేమం ముఖ్యం. ఇప్పుడే వచ్చేస్తాను’’ అంటూ చందూ హెచ్చరికని పక్కన పెట్టి బయట కొచ్చాడు విరాట్‌. బైక్‌ని అక్కడే వదిలి కాలి నడకన దీక్ష ఇంటికి బయలుదేరాడు. అతడు అటు మూడో వీధిలోకి మలుపు తిరిగిన మూడో నిముషంలో మునిసామి బృందం వేన్‌  ఇటు కాలనీలోకి వచ్చింది.

నడుచుకొంటూనే విరాట్‌  దీక్ష ఇంటికి చేరుకునే సరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వీధి గుమ్మం మూసి వుంది. బయట ఎవరూ తిరుగుతున్న జాడ లేదు.

‘‘సహస్రా...’’ పిలిచాడు.

సమాధానం లేదు.

తలుపు గట్టిగా తట్టి మూడు సార్లు పిలిచాక.

అప్పుడు దీక్ష గొంతు విన్పించింది.

‘‘తను ఎవరినీ కలవనంటోంది. విరాట్‌ ప్లీజ్‌ వెళ్ళిపోండి’’ అంది తలుపు వెనక నుంచి.

‘‘దీక్షా. తనంటే పొరబాటు పడింది. నీకేమైంది? ఎందుకిలా మాట్లాడతావ్‌? ఓ సారి తలుపు తియ్యి. తనతో మాట్లాడాలి’’ అభ్యర్ధించాడు. ఈసారి సహస్ర గొంతు ‘‘ఏం మాట్లాడతావ్‌?’’ అంటూ వినవచ్చింది. బాగా ఏడ్చినట్టుంది గొంతు మారింది.

‘‘నీ మాయ మాటలు నమ్మి ఇంకా నేను మోసపోడానికి సిద్దంగా లేను. విశాల అంతటి విశాల హృదయం కాదు నాది. నువ్వు నా వాడివి. నాకే సొంతం అనుకున్నాను. కాదని తెలిసి పోయింది. మాట్లాడ్డానికింకేమీ లేదు. వెళ్ళిపో. ఇంకెప్పుడూ నా కోసం రావద్దు’’ అంది కటువుగా.‘‘ఇదేనా చివరి మాటా?’’ అడిగాడు.

‘‘అవును’’

‘‘తలుపు తియ్యి. నా ముఖం చూసి చెప్పు’’

‘‘నీ ముఖం చూస్తే చెప్పలేను. మాయ జేస్తావ్‌? అందుకే తలుపు తియ్యను. ప్లీజ్‌ వెళ్ళి పో.విరాట్‌. గెట్‌ లాస్ట్‌!’’ అంటూ ఇక ఆపుకోలేక ఏడ్చేసింది సహస్ర.

తలుపు వెనక నుంచి...

సహస్ర ఏడుపు స్పష్టంగా విన్పిపిస్తోంది.

విరాట్‌ మనసు బాధ పడింది.

అలాగని ఎంత సేపు బయట నిలబడతాడు?

‘‘ఒకె నీ అనుమానమే నిన్ను ఏడిపిస్తోంది. నేను గాని విశాల గాని కాదు. నిజం తెలుసుకుని నీవుగా నా వద్ద కొచ్చే వరకు నేన్నీ ముఖం చూడను. ఈ ఇంటి తలుపుల్లా నా యింటి తలుపులెన్నడూ ముసుకోవు. అని ఎప్పుడూ నీ కోసం తెరిచే వుంటాయి. వెళ్ళి పోతున్నాను’’ అని చెప్పి అక్కడ్నుంచి వెను తిరిగాడు విరాట్‌.

తను అంత చెప్పినా వినకుండా విరాట్‌  సహస్ర కోసం దీక్ష ఇంటికెళ్ళటం చందూకి నచ్చలేదు. చాలా కోపంగా వుంది. అవమానం తప్ప వెళ్ళినందు వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసు. విరాట్‌ మీద కోపంతో కాలు కాలిన పిల్లిలా హాల్లో అటు యిటు పచార్లు చేయసాగాడు. ఎవరి మీద కోపం చూపించాలో తెలీటం లేదు. అంతలో బయట ఏదో...

ఒక వేన్‌ ఆగిన ఇంజన్‌  శబ్దం విన్పించింది.

ఎవరా అనుకుంటూ వీధిలోకి తొంగి చూసాడు. బిలా బిలా వేన్‌ దిగుతూ పది మంది కన్పించే సరికి కంగారు పడుతూ గబగబా వీధి గుమ్మంలోకొచ్చాడు.

‘‘పట్టేసాం. చినబాబుని పట్టేసాం. వచ్చేసాం. చినబాబు ఇంటికొచ్చేసాం’’ అంటూ వాళ్ళంతా ఆనందంతో చిందులేస్తుంటే అర్ధం గాక ముఖం చిట్లించాడు చందూ. పరుగులెత్తుకుంటూ పోర్టికోలోకి వచ్చేసారు వాళ్ళంతా.

‘‘ఆపండ్రా మీ గోల. ఎవర్రా మీరంతా? చిన బాబెవరు? ఇక్కడా పేరు గలవాళ్ళెవరూ లేరు. వెళ్ళండి వెళ్ళండి’’ అనరిచాడు.

‘‘ఏంటీ చిన బాబు లేడా... అక్కడున్న బైక్‌ ఎవరిది?’’ అరిచాడు బండ శివ.

‘‘నీ తాతది. బండ వెధవా ఎవడ్రా నువ్వు? ఆ బైక్‌ మా విరాట్‌ది. ఎవరనుకొని ఎక్కడి కొచ్చారో కాస్త అడ్రస్‌ చూసుకు ఏడవండి. వెళ్ళండి వెళ్ళండి’’ అసలే కోపంలో వున్న చందూ చిర్రెత్తుకొచ్చి పెద్దగా అరిచేసాడు.

ఇంతలో చివరిగా తాగిన మత్తులో కాస్త లేటుగా వేన్‌ దిగిన మునుసామి ఒళ్ళు విరుచుకొని గేటు దాటి లోనకొస్తూ ‘‘ఇదిగో అల్లుడూ తొందర పడి నోరు జారక. వీళ్ళంతా మనోళ్ళే. చినబాబు ఎవరో కాదు. మీ విరాట్‌ మా చినబాబు’’ అనరిచాడు.

ఆ మాట విని చందూ తెల్లబోయాడు.

‘‘అంటే..... మీరంతా వెంకట రత్నం నాయుడు గారి మనుషులా?’’

‘‘డౌటా అల్లుడూ?’’ అన్నాడు ఇంట్లోకొచ్చి సోఫాలో కూచుంటూ మునుసామి’.

‘‘మీరంతా విరాట్‌ కోసం మధురై నుంచి బయలు దేరినట్టు మాకు ముందే తెలుసు’’

‘‘ఏమీ అనుకోకు నాయుడు గారిని పెద్దయ్యా గారని, పెద్దబ్బాయి విక్రాంత్‌ని పెదబాబు అని, ఈ విరాట్‌ని చినబాబు అనీ పిలుచుకోవటం మా అలవాటు. మేమంతా నూలు మిల్లు కార్మికులం. అంతే కాదు కర్ర సాము కత్తి సాము నా దగ్గరే నేర్చుకున్నాడు చినబాబు. నాకు శిష్యుడు కూడా. కాబట్టి మొత్తం స్టోరీ నీకు తెలుసు. పెద్దయ్య గారి మాట కాదనలేక వచ్చాం. కాని చినబాబుని బలవంతంగా లాక్కెళ్ళి పోవాలని రాలేదు. ఆ మాటకొస్తే చినబాబుని కట్టి లాక్కెళ్ళే మొనగాడెవున్నాడని. అంచేత మేం వచ్చామని నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఇంతకీ చినబాబు ఎక్కడ? బైక్‌ బయట వదిలేసి ఎక్కడికెళ్ళాడు?’’

మునుసామి మాటలు, అడక్కుండానే చందూ డౌట్స్‌ ని క్షణాల్లో క్లియర్‌ చేసాయి.

‘‘వచ్చేస్తాడు. ఏం తాగుతారు. వీళ్ళందర్నీ కూచోమనండి’’ అన్నాడు.

‘‘నువ్వు నాకు నచ్చావ్‌. మనలో మనకి మర్యాదేమిటి.’’ అన్నాడు హుషారుగా మునుసామి.

‘‘ఇంతకీ ఎక్కడుంటున్నారు మీరంతా?’’

‘‘హోటళ్ళలో ఉంటున్నాంలే గాని, నాకో విషయం అర్ధం గావటం లేదు’’

‘‘ఏ విషయం?’’

‘‘అక్కడ రెస్టారెంటు పార్కింగ్‌లో సంగతి. మేం చినబాబుని గుర్తు పట్టి చూస్తుండగా అతని కౌగిట ఓ అమ్మాయుంది. ఆ పిల్ల పేపరు ప్రకటన ఫోటోలో పిల్ల కాదు. కాస్సేపటికి బురఖాలు ధరించిన యిద్దరు ముస్లిం అమ్మాయిల వెంట అక్కడికి నువ్వొచ్చావ్‌. ఆ ఇద్దరిలో ఒకమ్మాయి ముఖం మీది ముసుగు తీసినప్పుడు చూస్తే ప్రకటనలోని అమ్మాయి సహస్ర.

అసలేంటి గొల? నాకు అర్ధమై చావట్లేదు. అసలు చిన బాబు లవ్‌ చేసింది ఒకర్నా ఇద్దర్నా? సహస్ర ముస్లిం అమ్మాయెలా అవుతుంది? చిన బాబు మీద ఏదో గొడవ పడి కోపంగా ఎందుకెళ్ళి పోయింది?’’

‘‘ఆగు ఆగు. నాకు కాస్త క్లారిటీ కావాలి. తర్వాత అంతా చెప్తాను. పార్కింగ్‌ లో విరాట్‌ కౌగిల్లో ఆ అమ్మాయుందా? లేదు, నువ్వు పొరబాటున చూసుంటావ్‌. ఆ అమ్మాయి పేరు విశాల. తను విరాట్‌ ని ప్రేమిస్తుంది. గాని విరాట్‌  ప్రేమించటం లేదు’’

‘‘మరదే... ఎంత తాగితే మాత్రం నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా? ముందు ఆ పిల్ల కౌగిలించుకొని ఏడ్చింది. తర్వాత తనూ కౌగిలి బిగించి ఓదార్చాడు. మా వాళ్ళంతా చూసారుగా. చెప్పండ్రా ’’ అన్నాడు, మునుసామి.

‘‘అవును అన్న చెప్పింది కరక్టే. కౌగిలించుకున్నాడు’’ అన్నాడు బండ శివ.

వాళ్ళంతా అవునంటుంటే..

చందూ ఆలోచనలో పడి పోయాడు...

అనుకోకుండా విశాల అటు వచ్చి విరాట్‌ను చూసి ఆగి ఉంటుందనుకున్నాడు. కాని వీళ్ళ మాటలు వింటూంటే ఆమె విరాట్‌ని వెతుక్కుంటూనే వచ్చుంటుందని, ఆమె వైపు క్రమంగా విరాట్‌ మనసూ మొగ్గుతోందనీ తనకే సందేహం వస్తోంది. ఇక సహస్ర సందేహించటంలో ఆశ్చర్యంఏముంది?

‘‘ఇప్పుడన్నా నమ్ముతావా? చిన బాబు రెండు పడవల మీద కాలేస్తున్నాడు. సహస్ర, విశాలను సందేహించి అలిగి కోపంగా వెళ్ళి పోయింది. అంతేనా?’’ అనడిగాడు మునుసామి.

అవునన్నట్టు తలూపాడు చందూ..

‘‘చిన బాబు నెత్తి మీద రెండు సుడులున్నాయి. అవి చూసినప్పుడే సందేహించాను.  మేన కోడలు సాగరికను పెళ్ళిచేసుకున్నా రెండో పెళ్ళాం కూడ తప్పదని. కాని సాగరిక తప్పిపోయి సహస్ర, విశాల యిద్దరూ వచ్చారు. బాగుంది. మరి బురఖాలో వచ్చిన ఆ రెండో అమ్మాయి ఎవరు?’’

‘‘తను నా లవర్‌. పేరు దీక్ష. సహస్రకి ఫ్రెండు’’

‘‘ఆహా..... అయితే నువ్వు లైన్లోనే వున్నావన్న మాట. బాగుంది. చాలా బాగుంది. మరి ఆ బికారి వెధవ ఎవడు?’’

‘‘బికారా? ......... వాడెవడు’’ ఉలిక్కి పడి అడిగాడు చందూ. అలా ఉలికి పాటు చెందటానిక్కారణం వుంది. విరాట్‌ ఒకటికి పది సార్లు సహస్రను హెచ్చరించాడు. ముఖం మీద క్లాత్‌ తీయొద్దని. కాని విశాలను చూసిన కోపంలో సహస్ర కొద్ది సేపు తీసింది. అది చాలు శత్రువు ఎవడన్నా ఆమెను గుర్తించడానికి.

‘‘అక్కడ జరిగిందంతా చూసాను. మీ గొడవలో మీరుండగా అక్కడికి రావటం బాగుండదనీ ఆగాము. అలాగే అటుగా పోతూ ఓ బికారి ఆగి మిమ్మల్ని చూస్తూ నిలబడ్డాడు. ఓ చేతిలో చిప్ప ఇంకో చేతిలో కర్ర. మాసిన బట్టలు బిచ్చగాడి లాగే వున్నాడు.

సహస్ర ఆటో ఎక్కగానే కంగారుగా వెళ్ళి తనూ మరో ఆటో ఎక్కి ఫాలో అయ్యాడు. వాడేంటి ఆ అమ్మాయిని ఫాలో చేయటం ఏంటి నాకేమీ అర్దం గాలేదు. అయితే వాడ్ని మీరు గమనించ లేదన్న మాట. వాడు ఎవడై ఉంటాడు?’’

‘‘ఇప్పుడు నువ్వు చెప్పే వరకు వాడి గురించే మాకు తెలీదు. వాడు నిజంగా సహస్ర వెనకే ఫాలో అయితే ఆ వెనకే వెళ్ళిన నాకు గాని దీక్షకు గాని వాడు కన్పించాలిగా.’’

‘‘ఏ సగ్నల్స్‌ దగ్గరో వాడు మిస్సయి ఉండొచ్చు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది. కాస్త వివరంగా చెప్పు. బుర్రకెక్కించుకుంటాను. అరే బండ శివా కాసిని మంచి నీళ్ళు పట్రా’’ అంటూ సోఫాలో రిలాక్స్‌ గా జేర బడ్డాడు మునుసామి. బండ శివా కిచెన్‌ లో కెళ్ళాడు. చందూ సంక్షిప్తంగా చెప్పటం ఆరంభించాడు.

ఇంటికి తిరిగివస్తున్న విరాట్‌ కి...మనసు చాలా బాధ గానే వుంది....

విశాల వచ్చినప్పుడే ఇలాంటి పరిస్థితి ముందే వూహించి కంగారు పడ్డాడు. అదే నిజమైంది. తను వెళ్ళినా తలుపు తీయక పోవటం, లోన సహస్ర ఏడుస్తూ ఉండి పోవటం, మనుసుకు వేదన కలిగించినా ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు. అయినా విధి రాత గాకపోతే అందురూ సంతోషంగా వున్న ఆ సమయంలోనే విశాల రావాలా!... ఇందులో ఎవర్ని తప్పు పట్టాలో కూడ తెలీటం లేదు. పరి పరి  విధాలా ఆలోచిస్తూ తమ వీధి మలుపు తిరిగాడు విరాట్‌ అంతే

ఎదురుగా దృశ్యం చూసి తృళ్ళి పడుతూ...

ఎక్కడి వాడక్కడే ఆగి పోయాడు.

ఆశ్చర్యంతో అతడి కళ్ళు విశాలమయ్యాయి.

తమ గేటు ముందు తన బైక్‌ మాత్రమే ఉండాలి కాని ఇప్పుడా బైక్‌  పక్కన ఒక పెద్ద వేన్‌ కూడ నిలబడుంది. చూస్తుంటే అది తమ వేన్‌ లాగే వుంది. అవును. అదే నంబరు. తమ నూలు ఫ్యాక్టరీ ఆఫీసు వ్యాన్‌ అది. ఎవరు వచ్చుంటారు?

బయట ఎవరూ తిరుగుతున్న జాడ లేదు

మునిసామి బృందం చెన్నైలో వున్నా ఇంత త్వరగా అడ్రసు తెలుసుకోలేరు. మరి కోయంబత్తూర్‌ నుంచి వేన్‌లో వచ్చింది ఎవరు? అన్న విక్రాంత్‌ గాని డాడీ వెంకట రత్నం నాయుడు గారు గాని వచ్చుండాలి. వాళ్ళయితే తను చాలా చిక్కుల్లో పడతాడు. ఎలాగైనా వాళ్ళు తనను కోయంబత్తూరు తీసుకు పోవాలని చూస్తారు. ఎందుకైనా మంచిది. వచ్చింది ఎవరో తెలీకుండా లోనకు పోకూడదు.కంగారు అణచుకొంటూ...వేగంగా మలుపు లోని చెట్ల వెనక్కి వెళ్ళి పోయాడు విరాట్‌. తన సెల్‌ ఫోన్‌ అందుకుని చందూ నంబర్‌కి ఫోన్‌ చేసాడు.‘‘ఏరా, ఎక్కడున్నావ్‌? సహస్రతో మాట్లాడుతూ అక్కడే వున్నావా?’’ వెంటనే అడిగాడు చందూ.

‘‘అంత సీన్‌ లేదు గాని ఎవర్రా వచ్చింది? మనింటి ముందు మా వేన్‌ ఆగుంది?’’ అడిగాడు విరాట్‌.

‘‘అయితే వెనక్కి వచ్చేసావా? కంగారు పడాల్సిందేం లేదు. వచ్చేయ్‌. వేన్‌లో వచ్చింది మునుసామి మిగిలిన వాళ్ళును. వచ్చెయ్‌’’ బదులిచ్చాడు చందూ.

‘‘థాంక్‌ గాడ్‌ డాడీ వచ్చారేమోనని కంగారు పడ్డాను. వస్తున్నా’’ అంటూ లైన్‌ కట్‌ చేసి చకచకా గేటు వైపు అడుగులేసాడు విరాట్‌.అతను వెళ్ళే సరికి లోన అందరూ విశ్రాంతిగా కూచునున్నారు. మునుసామి చిరునవ్వుతో లేచి ఎదురు వచ్చాడు.

‘‘నన్నాశీర్వదించండి గురువు గారూ’’ అంటూ వినయంగా విరాట్‌ మునుసామి పాదాలకు నమస్కరించాడు.

‘‘అభిష్ట సిద్ధిరస్తూ. లే చిన బాబు’’ అంటూ భుజాలు పట్టి లేపి శిష్యుడి ముఖంలోకి చూస్తూ గుబురు మీసం దువ్వుతూ గర్వంగా చూసాడు మునుసామి.

‘‘ఈ రోజుకీ గురువు గానే భావిస్తూ సాము గారడీలు నేర్చుకున్నప్పటి ఆచారాల్ని ఇంకా పాటిస్తున్నావంటే నిన్నెలా అభినందించాలో తెలీటం లేదు. ఓ పక్క నాకు యజమాని తర్వాత యజమాని అంతటి వాడివి. మరో పక్క నా శిష్యుడివి. నిన్ను పేరు పెట్టి పిలిచే అదృష్టం నాది. ఇంతకన్నాఏం కావాలి?’’ అన్నాడు మురిసి పోతూ.

‘‘గురువు గారు కొడుకు ఎంత గొప్ప వాడైనా తల్లిదండ్రులకు కొడుకే. అలాగే శిష్యుడెంత గొప్పవాడైనా గురువుకి ఎప్పుడూ శిష్యుడే. మన అనుబంధం ఎప్పుడూ యిలాగే ఉంటుంది. ఇంతకీ వూళ్ళో అంతా కులాసాగా వున్నారా? ఏరా బండ శివా...’’ అంటూ డ్రయివరుతో సహా అందర్ని పేరు పేరున విరాట్‌ పరామర్శిస్తుంటే అంతా సంతోషంతో తల మునకలయ్యారు.

‘‘మేం వచ్చామని మా గురించి నువ్వేమీ కంగారు పడకు చిన బాబు. ఓ వారం రోజులు చెన్నై అంతా తిరిగి చూసి వెళ్ళి పోతాం. నువ్వు కనబడలేదని పెద్దయ్య గారికి పెద బాబు గారికి చెప్పేస్తాం. కేవలం నిన్ను చూడాలనే వచ్చాం’’ అంటూ తన అభిప్రాయం చెప్పేసాడు మునుసామి.

‘‘లేదు లేదు గురువు గారూ’’ అన్నాడు వెంటనే విరాట్‌.

‘‘మీరు సరైన సమయానికొచ్చారు. మీరు కూడ మాతో ఇక్కడుంటే మాకు కొండంత బలంగా వుంటుంది. కూచొండి చెప్తాను’’ అంటూ కూచోబెట్టి పరిస్థితి అంతా వివరించాడు విరాట్‌.

‘‘ఇదీ జరిగిన విషయం. కాకతాళీయంగా ఏర్పడ్డ పరిచయం. సహస్ర కన్నా ముందే విశాల పరిచయం. నన్ను ప్రేమిస్తున్నానంది. పెళ్ళి చేసుకో లేదా రెండో పెళ్ళాంగా చేసుకో. అదీ కాదంటే నా పిల్లలకి నువ్వే తండ్రి కావాలి అంటూ మనసు విప్పి ఎప్పుడో చెప్పింది. నేను పట్టించుకో లేదు. నన్నెంత గాడంగా ప్రేమిస్తుందో ఇప్పుడు చూసాక గాని అర్ధం కాలేదు. కౌగిలించుకుని ఏడ్చిండి. నేనూ ఓదార్చాను. చనువు కొద్ది భుజం మీద చెయ్యేసి మాట్లాడిందే అనుకుందాం. ఆ మాత్రానికే మమ్మల్ని అనుమానించి ఏడుస్తూ వచ్చి ఇంట్లో కూచుంది సహస్ర.పాపం ఇప్పుడు చందూ కూడ దొషి అయ్యాడు. తన ముఖం చూడనంటోంది దీక్ష. ఇదిలా వుంటే అసలు ప్రమాదం ఏమిటో వాళ్ళకింకా తెలిసినట్టు లేదు. సహస్ర కన్పిస్తే పట్టి మధురై ఇంటికి తీసుకు పోడానికి మహ దేవ నాయకర్‌ మనుషులు కదిరేషన్‌ అనే వాడి ఆధ్వర్యంలో సిటీ కొచ్చి గాలిస్తున్నారు. మరో పక్క త్యాగరాజన్‌ మనుషులు సిటీలోకి దిగి సహస్ర కన్పిస్తే కాల్చి చంపాలని చూస్తున్నారు.

అందుకే సహస్ర దీక్షలు గుర్తు తెలీకుండా ఉండాలని బురఖాలు ధరించేలా చేసాను. ఇప్పుడు సమస్య వాళ్ళ రక్షణకు తగిన ఏర్పాటు చేయటం. వాళ్ళకి తెలీకుండా మన వాళ్ళు ఫాలో అవుతూ ఏదన్నా గడబిడ జరిగితే వెంటనే మనకి ఫోన్‌ చేసేలా ఏదన్నా ఏర్పాటు చేయాలి...’’

‘‘చాలు చిన బాబు. నాకంతా అర్ధమైంది. ఇక చెప్పనక్కర్లేదు’’ అంటూ నిట్టూర్చాడు మునుసామి.

‘‘నువ్వు చెప్పిన వాళ్ళే గాక, ఇంకెవరో సహస్ర కోసం ప్రయత్నిస్తున్నారనీ నా అనుమానం’’ అంటూ బిచ్చగాడు సహస్ర ఆటోను వెంబడించిన విషయం చెప్పాడు మునుసామి.

ఆశ్చర్య పోయాడు విరాట్‌.

‘‘ఇక ఆవిషయం వదిలేయండి. ఆ ఏర్పాటు నేను చేస్తాను.’’ అంటూ మాటిచ్చాడు మునుసామి.

‘‘కాని అన్నా, పెద్దయ్య గారితో మాటొస్తుందేమో ఓ సారి ఆలోచించు’’ అన్నాడు వెంటవున్న వాళ్ళలో ఒకడు.

‘‘రానీరా. వస్తే అప్పుడు చూద్దాం. చినబాబు ఇంత రిస్కులో వుండగా వదిలేసి వెళ్తామా? వాళ్ళ లవ్‌ ని సక్సెస్‌ చేసే వెళ్దాం. ఏమంటారు?’’ అనడిగాడు అందర్నీ చూస్తూ.

‘‘ఇక మేం అనేదేముంది నీ మాటే మా మాట. ఉంటున్నాం’’ అన్నాడు బండశివ.

‘‘అవును ఉందాం’’ అన్నారు మిగిలిన వాళ్ళంతా.

‘‘అయితే ఆలస్యం ఎందుకు? హోటల్‌ గదులు కాళీ చేసి వచ్చేయండి. మీ కోసం గెస్ట్‌ రూమ్‌ ఉంది. మీరంతా ఇక్కడ హాల్లోనే పడుకోవచ్చు. ఇది మనిల్లు ఏ సమస్యా ఉండదు’’ అన్నాడు వెంటనే విరాట్‌.

‘‘చినబాబు తొందరొద్దు. నిన్ను తీసుకెళ్ళాలనొచ్చి నీకు సాయంగా ఉండి పోతున్నాం. అలాగని అంతా ఇక్కడికొచ్చేస్తే మాకు రెండు విధాలా నష్టం ఉంది. డబ్బు పంపించమని అప్పుడప్పుడూ అడక్కపోతే పెద్దయ్యగారు అనుమానించే ప్రమాదం వుంది. హోటల్‌ బిల్లులు ఖర్చంతా రేపు మేం లెక్క చెప్పాలంటే ఖర్చులు మామూలుగా జరగాల్సిందే. అంచేత ఓ పని చేద్దాం. నేను నాకు తోడుగా బండ శివ ఇక్కడుంటాం. మిగిలిన వాళ్ళంతా ఎప్పటిలాగే హోటల్‌ గదుల్లోఉంటారు. చేతిలో వేన్‌ వుంది గాబట్టి ట్రాన్స్‌పోర్టేషన్‌ సమస్య లేదు. ఉదయం వచ్చి రాత్రికి వెళ్ళి పోతుంటారు. వంతుల వారిగా సహస్ర దీక్షలను ఇద్దరు చొప్పున ఫాలో అవుతూ ఏ సమస్య వచ్చినా వెంటనే మనకి ఫోన్‌ చేస్తారు.’’ఆ రోజు మొదలు...

సహస్ర, దీక్ష లు డ్యూటీకి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు. మునుసామి మనుషులిద్దరు ఆటోలో అనుసరిస్తూ ఎప్పుడూ గమనిస్తు వస్తున్నారు.మునుసామి విరాట్‌  ఇంట్లో ఉంటూ అవసరమైతే వేన్‌లో బయట కెళ్ళొస్తున్నాడు. పగలు హోటల్‌ నుంచి అతని మనుషులంతా విరాట్‌ ఇంటికొచ్చేసి రాత్రికి వెళ్తున్నారు. ఇంటిని మునుసామి అజమాయిషీకి వదిలేసి విరాట్‌ చందూలు ఎప్పటిలా బైక్‌ మీద ఆఫీస్‌కు వెళ్ళొస్తున్నారు.

I              I                     I

నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచి పోయింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra