Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotipatham

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఈ రోజుల్లో, ఏ వార్తా పత్రిక చూసినా, కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు చూస్తూంటాము. ఎక్కడో  ఫలానా హౌసింగ్ సొసైటీలో  పట్టపగలే ఏదో దోపిడీ జరిగిందనిన్నీ, ఎవరూ వీరి సహాయానికి రాలేదనీ. ఇదివరకటి రోజుల్లో ఊళ్ళో ఏదైనా జరిగిందంటే, మంచైనా, చెడైనా జరిగిందంటే ఊరు ఊరంతా అండగా నిలిచేవారు. కానీ, ఈరోజుల్లోనో, ఆ అవతలివాడు, మనకులం వాడా, మన జిల్లావాడేనా అనే ప్రాతిపదికల మీదే , సహాయానికి వస్తున్నారు. అది మనం  చేతులారా చేసికున్నదే అనడంలో సందేహం లేదు.

ఊళ్ళో వాళ్ళ సంగతెలా ఉన్నా, మనం ఉంటున్న కాలనీ/ సొసైటీల్లో అందరూ కాకపోయినా, చివరకి మన బిల్డింగులో ఉన్నవారితోనైనా పరిచయం పెట్టుకుంటే నష్టం ఏమీ లేదు. వాళ్ళేమీ, రోజంతా మన నెత్తిమీద కూర్చుని, మనల్ని ఏమీ దోచేసుకోరు. ఒక్కో బిల్డింగుకీ ఈ రోజుల్లో  పదికంటె తక్కువ అంతస్థులు ఉండడం లేదు.ఒక్కో అంతస్థుకీ నాలుగేసి ఫ్లాట్టులు. మరీ మనం ఏదైనా high society మనుష్యుల మైతే ఫ్లోర్ కీ ఒక్కో ఫ్లాట్. అయినా వాళ్ళ గొడవ మనకెందుకూ? మన సంగతి మనం చూసుకుంటే, ఊళ్ళోవాళ్ళందరి సంగతీ చూసుకున్నంత పుణ్యం. అందువలన ఈ వ్యవహారం, ఆం ఆద్మీ వరకే సీమిత్ చేద్దాం సరేనా?

 

ఏం చెప్తున్నానూ, సో, బిల్డింగుకీ ఓ నలభై ఫ్లాట్లుంటాయి. మన ఫ్లోర్ లో ఉండే నలుగురితోనైనా పరిచయం చేసికుంటే అసలు నష్టం ఏమిటో తెలియదు. ఇదివరకటి రోజుల్లో, అంటే ఈ ఎపార్ట్ మెంట్లూ గోలా లేనప్పుడు, ఏ ఊరైనా వెళ్ళి, ఫలానా వారిల్లెక్కడా అంటే ఠక్కున చెప్పేవారు. కర్మకాలి మనం ఎక్కడికైతే వెళ్ళేమో, వాళ్ళు ఇంట్లో లేకపోతే, పక్కవాళ్ళు, పిలిచి ఇంటికి తీసికెళ్ళి మర్యాదలు చేసేవారు. ఈరోజుల్లో మర్యాదలూ  వగైరా, asking too much అనుకోండి, కనీసం పక్కవాడు తలుపుతీస్తే చాలు, మహద్భాగ్యం లా ఉంది.. ఇలాటి మర్యాదలన్నీ, ఏ బ్రూక్ బాండ్ వాడి వ్యాపారప్రకటనల్లోనే చూస్తాము. నిజజీవితంలో అలాటివన్నీ ఉండవు. ఇలాటి రోజుల్లో, వాళ్ళెవరికో ఎవ్వరూ తలుపులు తీయలేదంటే ఆశ్చర్యం ఏముందీ?

 

ఇప్పటికీ పిల్లలు నగరాల్లో ఉద్యోగరీత్యా ఉంటూ, తాము ఏ పల్లెలోనో, పట్టణం లోనో ఉంటూన్న తల్లితండ్రులున్నారు. పిల్లల్నో, మనవలూ, మనవరాళ్ళనో చూడ్డానికి, నగరానికి వస్తారనుకుందాము. అక్కడ రోజంతా ఎవరో ఒకరి పలకరింపులతో కాలక్షేపం జరిగే, ఈ పేరెంట్స్ కి, ఈ నగర వాతావరణం చూసేటప్పటికి ఠారెత్తిపోతారు. ప్రొద్దుటే కొడుకూ, కోడలూ ఆఫీసులకీ, చిన్న పిల్లలు స్కూళ్ళకీ వెళ్ళిపోతే, ఈ పెద్దాళ్ళు రోజంతా ఏం చేస్తారు? ఆ దిక్కుమాలిన టి.వీ.క్కూడా ఓ హద్దుంటుంది. పోనీ ఎదురుగుండా ఉండేవాళ్ళైనా పలకరిస్తారా అంటే అదీ లేదు. వాళ్ళింట్లోనూ ఓ వయసొచ్చిన దంపతులుంటారు. కానీ వాళ్ళూ "sailing in the same boat". ప్రొద్దుటే వెళ్ళేటప్పుడు పిల్లలు చెప్పివెళ్తారు, ఊరికే ఎవరు పడితే వాళ్ళకి, బెల్లు కొట్టగానే తలుపు తీసేయొద్దు, ఈమధ్యన దిన్ దహాడే ( పట్ట పగలే) దోపిడీలు జరుగుతున్నాయిట. అసలే మీరు పెద్దాళ్ళూ, ఎవడో వచ్చి పీక పిసికేసినా దిక్కు లేదు!

Thats the bottom line... దిక్కు అనేది... ఎవరు చేసుకోవద్దారమ్మా? అదంతా స్వయంకృతమే కదా! వాడెవడో రాడూ, వీడెవడో రాడూ అని ఏడ్చేకన్నా, ఆ "దిక్కు" ఏర్పరుచుకోడానికి, నీ ప్రయత్నం నువ్వు చేశావా అబ్బే. ఎదురింటి పిన్ని గారితోనో, మామ్మ గారితోనో పరిచయం చేసికుంటే, తనమీద చాడీలెక్కడ చెప్పేస్తోందో అని కోడలికి భయం! పోనీ ఆ పెద్దాయనతో పరిచయం చేసికుందామంటే, ఆయన కొడుక్కీ, ఈయన కొడుక్కీ ఆఫీసులో ఏదో ఒకళ్ళకొకళ్ళు competitors., దానితో ఆ కొడుకూ ఫామిలీ, ఈ ఇంట్లో persona non grata !

పోనీ స్కూలుకెళ్ళే చిన్న పిల్లలతో పరిచయం చేసికుందామా అంటే, వాళ్ళు ఓ స్కూలూ, వీళ్ళ పిల్లలు ఇంకో స్కూలూ, అక్కడ మళ్ళీ స్కూళ్ళలో తేడాపాడాలు- వీళ్ళు చదివేదానికి లక్షల్లో ఫీజులూ, వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో afterall వేలల్లో ఫీజులూ. మరి తేడా ఉంటుందంటే ఉండదూ? మనం ఎక్కడా, వాళ్ళెక్కడా దానితో ఆ పిల్లలూ externed జాతిలోకొచ్చేస్తారు. మనమేమో పిల్లల్ని holidays కి ఏ స్విట్జర్లాండో, యూరోప్పో తీసికెళ్తాము, వాళ్ళేమో పిల్లల్ని ఏ అమలాపురమో, అంబాజీపేటో తీసికెళ్తారు. వాళ్ళకీ మనకీ అసలు పోలికేమిటీ? మనమేమో పిజ్జాలూ, హాంబర్గర్లూ తెప్పించుకుంటాము. మరి వాళ్ళో ఇంట్లో వాసిని పోళ్ళతో సరిపెట్టేసికుంటారు.అంతదాకా ఎందుకూ, వాళ్ళింట్లో  ఫోను కూడా లేదు. ఎప్పుడూ  ఎస్.టి.డి బూత్ దగ్గరో కనిపిస్తూంటారు! ఇంక నెట్ అంటావా, సైబర్ కెఫేలే దిక్కు. ఎవరి స్థాయిలో వాళ్ళుండాలి కానీ, మనూళ్ళో జరిగినట్టు ఇక్కడా జరగాలంటే కుదిరే పనేనా. ఏమిటో మీవన్నీ పాతచింతకాయ ఆలోచనలూ. మీకు తట్టదూ, ఇంకోళ్ళు చెప్తే వినరూ. ఇప్పటి ground rules మారిపోయాయి డాడీ అంటూ జ్ఞానబోధ చేస్తారు!

పోనీ గేటుదగ్గర ఉండే సెక్యూరిటీవాడితో మాట్టాడదామా అంటే, అదీ నిషిధ్ధమే... నూటికి తొంభైమందికి ఆ వాచ్ మన్ పేరుకూడా తెలియదు. ఏదైనా అవసరం వస్తే , “ వాచ్ మాన్ “ అని అరుస్తారే కానీ, ఛస్తే పేరుపెట్టిమాత్రం పిలవరు. నామోషీ కదా, ఎక్కడ నెత్తికెక్కేస్తాడో? అతను మాత్రం మనిషికాదూ, పేరుతెలిసికుని, పిలిస్తే సొమ్మేంపోయిందిట? రేపెప్పుడైనా అవసరం వస్తే, అతనే దిక్కు అని మర్చిపోతారు.

మరి ఇలాటి వాతావరణం లో ఏదైనా కష్టం వచ్చిందంటే, మన మొహం చూసే వాడు లేడంటే అంత పేద్దగా ఫీలైపోవడం ఎందుకో మరి? ఎవరికి వారే యమునాతీరే అని కూర్చుని ఏడిస్తే పన్లు ఎలా అవుతాయీ? అలాగని బిల్డింగులో ఉన్న అందరితోనూ పరిచయం చేసికోమని కాదు, అదో తంటా మళ్ళీ.  ఉన్న వారిలో ఓ నలుగురైదుగురు తెలిసినా చాలు. ఎవరో ఒకరు సహాయానికి వస్తారు.

సర్వే జనా సుఖినోభవంతూ...

మరిన్ని శీర్షికలు
ee turupu - a pacchimam