Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> రంగులకల

rangula kala

ఈ ఉదయం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనస్సు ఆనందంగా ఉంది.  బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ నా బెడ్ రూము కిటికిలోంచి చూసాను.  ఏ చిత్రకారుడో ప్రతీ ఆకును విచిత్రమైన రంగులలో ముంచి తరులకు కొత్త అందాలను అద్దినట్లుగా ప్రకృతి వర్ణశోభితంగా కనిపిస్తోంది.. అందాలను తురముకున్న తరులు గాలికి ఊగుతూ  ఆకాశానికి శృంగార సంకేతాలు పంపుతున్నట్లుగా ఆకులు గలగల లాడుతున్నాయి.

యాష్ బర్న్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్ వర్జీనియా.  సెప్టెంబర్ చివరిలో వచ్చే ఫాల్ సీజన్ నాకెంతో  ఇష్టం.  అమెరికాలో శరత్కాల ఆగమనం వర్ణరంజితం. రంగురంగులతో  ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఏ తరువుచూసినా తనువంతా రంగులను పులుముకున్నట్లు కనువిందు చేస్తాయి. ఐదేళ్ళుగా ఆ వర్ణశోభితం నాకు నిత్యనూతనమే.

నిన్న ఆవిష్కృతమైన ఓ రంగులకల ఘనీభవించిన నా జీవితంలో  ఓ శృంగారకావ్యానికి పీఠిక రాసింది. “మరియా అలజంద్ర....అలజంద్ర....”త్యాగరాజు కీర్తన ఆలపించినట్లు పదే పదే స్మరిస్తోంది మనసు. 

నిన్నటి సంఘటనతో నా జీవితం మారిపోయినట్లనిపిస్తోంది.......  

సాయంత్రం ఆరున్నరయ్యింది, ఆఫీసు నుండి వస్తూ బ్రాంబుల్డన్ ప్లాజాలోకి కారు పోనిచ్చి హారీస్ టీటర్ సూపర్ మార్కెట్ ఎదురుగా పార్క్ చేసి షాపింగ్ చెయ్యడానికి లోపల కెళ్లాను. నాక్కావాల్సినవి కొనుక్కుని బయటకొచ్చేసరికి ఓ అరగంట పట్టింది. అప్పటికే బాగా చీకటి పడింది. కొంచెం చలిగా, మబ్బుగా కూడా ఉంది. సన్నగా వాన మొదలైంది.

వాటే రొమాంటిక్ ఈవెనింగ్. కూల్ బ్రీజ్....ఆ డ్రిజిల్లో తడుస్తూంటే.... ఆ వెట్ ఫీలింగ్...ప్చ్..లోపలలోపల ఎదో....ఎదో.... అదేంటో తెలియడంలేదు.

ఆకలిగా అనిపిస్తోంది. ఇప్పుడు ఇంటికెళ్ళి వంట చేసుకోవాలా ?.....ప్చ్... బోర్.... ఓకే...నో మూడ్ టు కుక్.  గుండెల్లో ఎదో గుబులు ఇది అని చెప్పలేని స్థితి.

గాలి బాగా వీస్తోంది. వాన పెద్దదయ్యేలా ఉంది. కారు దగ్గరే నుంచున్నాను. ఏం చెయ్యాలి....? అటూఇటూ చూస్తున్నాను. ఎదురుగా  మెక్సికన్ గ్రిల్.  లెట్ మి పేక్ సం మెక్సికన్ ఫుడ్. రెస్టారెంట్ వైపుకి కదిలాను.

రెస్టారెంట్ ఖాళీగా ఉంది. వర్కింగ్ డే అవడం మూలానేమో ఇద్దరో ముగ్గురో ఉన్నారు.  

“హాయ్!” ఓ మెక్సికన్ అందం నవ్వింది పలకరింపుగా. గుబులుగా నున్న గుండెల్ని ఒక్కసారి కుదిపినట్లయ్యింది. నిగనిగలాడుతున్న శరీర సోయగానికి అలలు అలుగా కదులుతున్న రాగి రంగు జుట్టు, చక్కని కనుబొమ్మలకు జతగా మెరుస్తున్న ఆకుపచ్చని కళ్ళు, సూటైన ముక్కు, దానికి కొంచెం దిగువన పొందికగా కూర్చున్న ఎర్రని పెదవులు, నాజూకైన మెడ, క్రిందగా యవ్వనాల పొంగులు. వాటి మధ్య ఏర్పడిన అగాధాల్లోంచి జారిపోయిన సౌందర్య రేఖలు. దేవుడు అందాన్ని మరేదో లోహంతో కరిగించి పోత పోసినట్లున్న విగ్రహం. వలలో చిక్కుకున్న చేప పిల్లలా నేను....ఆ అందమైన వలలో చిక్కుకున్నాను.

అసలు ఆడపిల్లల్ని ఎప్పుడూ చూడనట్లు నా దృష్టంతా ఆమె పైనే. ఎంత అందంగా ఉన్నాయ్ ఆ కళ్ళు... హరితవనాల్లా.....ఆకళ్ళతో ఆడుకోవాలనే కోరిక....ఎదో మైకం..... తన్మయత్వం..... ఆ అందాన్ని ఆరాధిస్తూ ఉండిపోయాను.

విచ్చుకున్న ఎర్ర గులాబీల్లా ఆ పెదాలు విడివడి మళ్ళీ హాయ్ మనేసరికి తత్తరపడి వాస్తవంలోకి వచ్చాను.  “హాయ్....ఎక్స్ క్యూజ్ మి....యు ఆర్ ....?” ప్రశ్నార్ధకంగా చూసాను.

నా తాపత్రయాన్ని అర్ధం చేసుకుని “ మరియా...మరియా అలజంద్ర...” ఆ స్వరంలో తీయదనం తేనె చిలకరించినట్లు.

“ఓహ్! థాంక్స్ ..” ఆనందంతో తబ్బిబ్బవుతూ, “మిస్ మరియా! యూ ఆర్ సో లవ్లీ....” అప్రయత్నంగా అనేసిన నన్ను  వింతగా చూసింది, మరింత అందంగానూ నవ్వింది. అంత ధైర్యం నాకెలా వచ్చిందో తెలియలేదు. మరియాతో నా  సంభాషణ ఇక్కడితో ఆగిపోకుండావుంటే బావుంటుందనిపించింది. కానీ నాకివన్నీ మామూలే అన్నట్లుగా చూసి “థాంక్ యూ...! వాట్ డు యు లైక్ టు ఆర్డర్”. అంది.

“ఒన్ బరిటో...నాట్ విత్ టార్టిల్లా బట్ ఎ బౌల్ విత్ బ్రోకొల్లి, కార్న్, బ్లాక్ బీన్స్ అండ్ జలపెనో సలాడ్, అఫ్కోర్సు విత్ లాట్ అఫ్ చీజ్  ప్లీజ్...” పేక్ చేసుకుని వెళ్దామన్న నా ఆలోచనను విరమించుకుని అక్కడే తినడానికి ఆర్డర్ ఇచ్చాను.

“ఓకే..” అని నా ఆర్డర్ తీసుకుని అయిదు నిమిషాలలో బరిటో బౌల్ నాకందించింది. మరియా కనిపించేలా ఓ టేబుల్ దగ్గర కూర్చుని మెక్సికన్ బరిటోతో పాటు మెక్సికన్ అందాన్ని అరగంటసేపు  ఆస్వాదించాను. కోక్ తో బాటు మరియా ముగ్ధమోహన సౌందర్యాన్ని జుర్రుకుంటున్నాను. ఆమె స్నేహం కోసం మనసు ఆరాటపడ్తోంది. విచిత్రమైన మానసిక స్థితి. ఓ సారి చుట్టుపక్కల చూసాను. రెస్టారెంట్లో ఇప్పుడెవరు లేరు నేను తప్ప. నవ్వుతూ టేబుల్ దగ్గరకొచ్చింది.

టైట్ బ్లాక్ ఫెడేడ్ జీన్స్ లో ఆమె వంపుసొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యెల్లో టీ షర్ట్ ఉరుకుతున్న ఆమె యవ్వనాలని అదిమి పెట్టలేక ఎప్పుడు చిరిగిపోతుందా అన్నట్లుంది.  ఆమె నడుం సన్నగా ఆ బరువులు మోయలేనట్లుగా ఉంది.  నా గుండె  లయ తప్పుతోంది. బయటకు రమ్మన్నట్లుగా సంజ్ఞ చేస్తే మంత్రముగ్దుడనై వెనకాలే వస్తున్న నన్ను చూసి కొంటెగా నవ్వింది. చల్లని తెమ్మెర తాకినట్లై శరీరం కంపించింది. బయట గాలి ఎక్కువగా ఉంది.  వర్షం కురుస్తోంది.

కారిడార్ లోకి రాగానే  సిగరెట్ కాల్చాలని పించింది. లైటర్తో వెలిగించబోయాను. చేతుల్లో సన్నని వణుకు. గుండె వేగంగా కొట్టుకోవడం చెవుల్లో వినిపిస్తోంది. గాలికి మంట అరిపోతోంటే తన చేతులు నా చేతులుపై వేసి అడ్డుపెట్టింది. ఆ స్పర్శకి శరీరం చల్లబడి, మంచుపూల సెగ గుండెలను సూటిగా తాకినట్లైంది. ఏంటో తెలియని పరిస్థితి.  నన్నూ, నా అవస్థను గమనిస్తూ మెల్లిగా సంభాషణ మొదలెట్టింది.

“మీరు చాలా ఎక్సైటెడ్ గా కనిపిస్తున్నారు, కారణం తెలుసుకోవచ్చా?  మీ పేరు....??”

“ఓహ్! సారీ.... ఐ యాం శిరీష్, ఇండియన్....స్టెర్లింగ్ లో ఉద్యోగం, బ్రాంబుల్డన్ యాష్ బర్న్ లో నివాసం, ఒక్కడ్నే ఉంటున్నాను.....” తడబాటుతోనే చెయ్యి ముందుకు చాపాను. సంభాషణ ఇంగ్లిష్ లో జరుగుతోంది.

ఆమె అందించిన చేతిని అపురూపంగా, సున్నితంగా స్పర్శించాను. రోలర్ కోష్టర్ రైడ్.... గాలిలో తేలిపోతున్నాను.

ఎంతమంది అమ్మాయిలతో చేతులు కలిపినా నేనెప్పుడూ ఇలా ఫీలవ్వలేదు. ఈ అనుభవం ఎంతో అందంగానూ, మధురంగానూ వుంది. 

“ఎక్సైటెడ్...యెస్ ....వెరీ మచ్....బికాజ్ ఆఫ్ యూ!! నిజం... నీ అందం నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ముఖ్యంగా నవ్వుతోంటే. నీ ఆకుపచ్చ కళ్ళు నన్ను కలవర పెట్టాయి. అయిదేళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నాను, ఇంతవరకు నన్నే అమ్మాయి ఇలా కదిలించలేదు. ఐ యాం మ్యాడ్ ఆఫ్ యు...”

స్వతహాగా ముభావిని నేను, ఎవరితో ఎక్కువగా మాట్లాడను. అందుకేనేమో నాకు స్నేహితులు తక్కువ. కానీ ఈ రోజెందుకో నా ప్రవర్తన నాకే వింతగా ఉంది. కంట్రోల్ చేసుకోలేక పోతున్నా, మాటలు ప్రవాహంలా వచ్చేసాయి.

“ఐ యాం సారి. ఆర్ యూ ఓకే...?....నన్నిదివరకు ఎప్పుడైనా చూసావా?....నాకు మాత్రం నిన్నెపుడూ కలసినట్లు గుర్తు లేదు. నువ్వెప్పుడూ ఆడపిల్లల్ని చూడలేదా? మాట్లాడలేదా? అంత ఎక్సైట్ అవ్వాల్సిన మేటర్ ఏముంది నా దగ్గర?...అసలు నా గురించి నీకేం తెల్సు? నిన్నెలా అర్ధం చేసుకోవాలో తెలీడంలేదు. మీ మగవాళ్ళు ఆడపిల్లలతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఆడపిల్లల విషయంలో ప్రపంచంలో మగవాళ్ళంతా ఒక్కలాగే ఉంటారా?....

ఆమె మాటలకి ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఆమె నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. నాలో కల్గిన భావావేశాల్ని బయట పెట్టానే తప్ప, అంతకన్నా నేనేం చేశాను? ఈ దేశంలో, ఈ కాలంలో ఇలాంటి ఆడపిల్లలున్నారా? ఓహ్...నన్ను నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాను?

ఇప్పుడు నా చేస్టిటీని ప్రూవ్ చేసుకోవాలా?.... ఎ థింగ్ అఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫరెవర్....నా భావన తప్పా?....  అవమానభారం నన్ను దోళనకు గురిచేసింది.

“ప్లీజ్ మరియా..ప్లీజ్. యు ఆర్ టోటల్లీ మిస్టేకన్ మి. నిన్ను చూసిన వెంటనే ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయో చెప్పాను. అది తప్పని, అలా చెప్పకూడదని నాకు తెలీదు. నీమీద నాకెలాంటి దురాలోచన లేదని ఎలా చెప్తే నీకర్ధం అవుతుంది? ఐ యాం సారీ. నేనిక్కడికి రావడం, నిన్నిలా కలుసుకోవడం యాదృచ్చికం. నా ప్రవర్తన నీకు బాధ కలిగిస్తుందని ఉహించని నేను ఇలా జరగకుండా ఉంటే బావుండేది అనుకుంటున్నాను. నిన్ను  బాధ పెడ్తే క్షమించు.

ఐ యాం సెంటిమెంటల్ ...లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈజ్ ట్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో... కానీ... ఒక్కటి మాత్రం నిజం.. యు అర్ ఆల్రెడీ హియర్....ఇన్ మై హార్ట్... నిన్నెప్పుడూ మర్చిపోలేను .....” వెళ్ళిపోడానికి ఉద్యిక్తుడైన నన్ను చెయ్యి పట్టుకుని ఆపింది.

“షిరిస్....బ్రతుకు తెరువు కోసం ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నఇరవై ఏళ్ల ఆడపిల్లని. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో ఇంకోలా మాట్లాడడం నాకెవ్వరూ నేర్పలేదు. ఇందులో నేను బాధ పడడానికి, నువ్వు

సంజాయిషీ ఇవ్వడానికి ఏమీలేదు. రోజూ ఎంతోమంది ఈ రెస్టారెంట్ కి వస్తుంటారు. వాళ్ళకి రకరకాల రుచులు, అభిరుచులు.... నేను కేవలం వాళ్ళకి సహాయపడతాను, సర్వ్ చేస్తాను తప్ప వేరే ఆలోచనలుండవు. నాకున్నది ఒకటే ఆలోచన, ఒకటే గమ్యం, తండ్రి విడిచి వెళ్ళిపోయిన నా కుటుంబానికి ఆసరాగా ఉండడమే.  బట్....” మాట్లాడడం ఆపి చీకట్లో కురుస్తున్న వర్షంకేసి, ఆకాశంకేసి చూస్తూ కళ్ళు మూసుకుంది.

ఇంకా నా చేయి ఆమె చేతిలోనే ఉంది. గట్టిగా పట్టి ఉన్న పిడికిల్లోంచి వెచ్చటి ఆవిర్లు. కళ్ళు తెరిచి నాకేసి చూసింది, ఆమె కళ్ళలో పల్చటి నీటిపొర.

“బట్....తల దించి క్రిందికి చూస్తూ మెత్తటి స్వరంతో, “మనసులో భావాలూ నిర్భయంగా చెప్పిన నీ వ్యక్తిత్వం, నీ మాట, ప్రవర్తన నన్ను ఆకట్టుకున్నాయి. నిన్ను ఎప్పుడూ మర్చిపోలేనన్నావు కదా!.... ఆ మాట ఒక్కటి చాలు ఒక ఆడపిల్ల హృదయాన్ని కదిలించడానికి. నీ స్నేహం నాకు కావాలి షిరిస్. నన్ను ఓ స్నేహితురాలిగా అంగీకరిస్తావా?.....”ఉద్వేగంగా అనిపించాయి ఆ మాటలు.

అప్పటివరకూ కురుస్తున్న వాన ఆగిపోయింది. హృదయాలు తేలికపడి చిరునవ్వుల జల్లులుకురిసాయి. రెండు మనసులు స్నేహంకోసం ఆరాటపడుతున్న క్షణాలు.... స్నేహంగా ఆమె చేతులను స్పృశించాను.

“ధాంక్స్ షిరిస్...ధాంక్స్ మై ఫ్రెండ్....ఈ రాత్రి విరిసిన స్నేహ పుష్పాలు మరింత విచ్చుకుని పరిమళాలను వెదజల్లుతూ గాఢమైన మైత్రీ బంధనంగా నిలిచిపోవాలని ఆశిస్తాను. ధాంక్యూ ఎగైన్ షిరిస్... మనం కల్సుకుంటూ ఉందాం. ప్రస్తుతానికి...బై...టేక్ కేర్....” మరొక్కసారి నా చేయి గట్టిగా నొక్కి వెళ్ళిపోయింది. ఓ రంగులకల ఆవిష్కృతమైంది.

నన్నునేనే నమ్మలేకపోతున్నా. ఆ దృశ్యం వాస్తవమే అయినా ఓ అందమైన ఊహలా గోచరించింది. కొద్ది క్షణాల పరిచయం స్నేహానికి దారి తీసిందన్నది వాస్తవమైతే ఆ అందమైన అనుభవం ఊహాతీతం. సంతోష తరంగాలు హృదయాన్ని తాకుతోంటే సంభాళించుకుని తేలికైన మనసుతో ఇంటి ముఖం పట్టాను.

ఆ తర్వాత మేం చాలా మాట్లాడుకునేవాళ్ళం. పగలు, రాత్రి అనేది లేకుండా ఫోన్లలోనే కాలం గడ్చిపోయేది. కలుసుకున్న ప్రతి క్షణం, మాట్లాడుకున్న ప్రతి మాట కొన్ని ఆనందపు అధ్యాయాలకు ప్రాణం పోశాయి.

ఇంచుమించు ప్రతి సాయంత్రం మరియాని కల్సుకోడం దినచర్యగా మారింది. ఆమె సన్నిధిలో సాయంత్రాలన్ని అందంగా వుండి, ఏంటో చాలా తొందరగా గడిచిపోయేవి. శనాదివారాలు ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళం. ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేనన్ని మాటలు మాట్లాడి ఎరుగను. మరియా ప్రతి చర్య, ప్రతి మాట నాకెంతో ఆనందాన్ని కలిగించేవి. కారులో అనంతంగా సాగే ప్రయాణాలు మా మధ్య దూరాన్ని కరిగిస్తే, మెత్తని పచ్చికలతో వర్జీనియా మైదానాలు మాకేప్పుడూ స్వాగతం పలుకుతుండేవి.

ఒకసారి షనండోవా నేషనల్ పార్క్ ప్రయాణం పెట్టుకున్నాం.   ఒకరితర్వాత ఒకరు డ్రైవ్ చేసుకుంటూ ప్రకృతి అందాలకు మైమరచిపోతో కాలం వేగానికి కళ్ళెం వేయలేక కారు వేగాన్ని తగ్గించుకుంటూ పోతున్నాం.

పచ్చటి సూర్యకాంతి రంగురంగుల ఆకులపై పడి వింతగా మెరుస్తున్న వృక్షాలు. దూరంగా నల్లటి కొండలు. కారు ఆపి ఆ మైదానంలోకి నడిచాము.  

అప్పటివరకు చెప్పుకున్న కబుర్లు ఆగిపోయాయి. కాసేపు  మౌనం. మనసులు కలిసిన మేము మౌనరాగాలు పంచుకున్నాం, భావాలు పంచుకున్నాం, అనురాగాలు పంచుకున్నాం. ఒకళ్లగురించి ఒకళ్ళు పూర్తిగా తెల్సుకున్నాం. కానీ భౌతికంగా ఇంకా మేమిద్దరం ఒకటికాదన్న నిజం అబద్దంగా మారడానికి కారణాలు వెతుక్కుంటోంది.

చలిగాలి రోద పెడ్తోంది. ఇద్దరి మనన్సుల్లో ఎదో తెలియని ఆందోళన. ఒక మధురమైన అవకాశం  ఆశగా ఎదురుచూస్తోందని పించింది నాకు.అసంకల్పితంగా పక్కనున్న మరియాను ఒక్కసారిగా పొదివి పట్టుకున్నాను. లతలా నన్ను పెనవేసుకుపోయింది. ఆర్తిగా ఆమె కన్నులు మూసుకున్నాయి. ఎర్రని పెదవులు విచ్చుకున్నాయి. విచ్చుకున్న ఆ గులాబీలను మృదువుగా చుంబించాను. మొదటి చుంబనం నన్ను గగనం అంచులదాకా తీసుకెళ్ళింది. ఓ విద్యుల్లత అణువణువునా ప్రాకింది. కౌగిలి మరింత బిగిసింది. ఒక మేఘం మెరుపుతో సంగమించినట్లు, ఓ కెరటం ఆర్తిగా తీరాన్ని తాకినట్లు, దూరంగా ఆకాశం అవనితో పరిష్వంగించినట్లు. పచ్చటి ఆ మైదానంలో గాలి పూర్తిగా స్తంభించింది.  అలసిపోయి దీర్ఘంగా వస్తున్న ఉచ్వాశ,నిశ్వాసలు అదుపుచేసుకోలేక వెల్లకిల్లా పడుకుని ఆకాశంకేసి చూస్తూ అలౌకికానందాన్ని అనుభవించాము. కాలం ఘనీభవించి అలా ఉండిపోతే బావుంటుందని అనుకున్నా ఆ క్షణంలో.

ఇక మా మధ్య దాపరికంలేదు. జీవితంలో కొన్ని మధుర సంఘటనలకు వాస్తవాన్ని జతచేయాలి. నేను అమ్మానాన్నలతో, తను తన కుటుంబ సభ్యులతో చర్చించి పెళ్ళనే బంధంతో ఒకటిగా అవ్వాలని ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం.

ఎండలో మంచుముక్కలా కాలం కరిగిపోతోంది. ఆకులతో ఆడుకుంటున్న గాలికెరటాల వేగంతో పోటీ పడుతూ రోజులు గడిచిపోతున్నాయి.  కొన్ని అనుభవంలోకి వస్తేగాని  తెలీదంటారు. నెలరోజుల పరిచయంలో ఎంత దగ్గరయ్యమో ఇప్పుడు తెలుస్తోంది.

ప్రాజెక్ట్ పనిమీద నాలుగు రోజులు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను. వెళ్లేముందు ఆ విషయం మరియాకు చెప్పడం కుదర్లేదు. మొదటి రెండు రోజులు పని వత్తిడి వల్ల ఫోన్ చెయ్యలేక పోయాను. తర్వాత రెండురోజులు ఎంత ప్రయత్నించినా మరియా ఫోన్ అన్సర్ చెయ్యలేదు. ఏమైందో ఏమిటో? ఎప్పుడెప్పుడు మరియాను కలుద్దామా అన్న ఆత్రంతో యాష్ బర్న్ బయల్దేరాను.

ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికొచ్చేసరికి ఆలస్యం అయ్యింది. గబగబా ఫ్రేషయ్యి కారులో బయల్దేరాను. అప్పుడు చూసాను. మా కమ్యూనిటీలో  డెకరేటెడ్ హౌసెస్. రంగురంగుల దీపాలతో మెరిసిపోతున్నాయి.,

ఇంటిముందు దొలచిన గుమ్మడికాయలు, విచిత్ర వేషాలతో పిల్లలు ఇంటింటికి ట్రిక్ ఆర్ ట్రీట్ అంటూ తిరుగుతున్నారు.

ఓహ్! ఈరోజు హాలోవీన్ డే.

మరియా రెస్టారెంట్ ఉంటుందో ఉండదో?.... ఎలాగైనా మరియాని కలవాలి. నాకు తెల్సు తను నాకోసం ఎదురుచుస్తో ఉంటుంది. హాలోవీన్ ట్రీట్ ఇవ్వాలి....

అక్టోబర్ 31 హాలోవీన్ డే. హాలో అంటే స్కాటిష్ లో పవిత్రమైన అని అర్ధం. ఇర్లాండ్,స్కాట్లాండ్ గ్రామాల్లో పంటల కాలం ముగిసిన తర్వాత, శీతాకాలం ప్రారంభంలో చనిపోయిన వారి ఆత్మలు తిరిగి ఒకరోజున తమ నివాసాలకు వస్తాయని ప్రజల నమ్మకం.  ఆ రోజున హాలోవీన్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ ఆత్మలకోసం డిన్నర్ టేబుల్ ఏర్పాటుచేసి వారిని తలుచుకుని వారికోసం  పాన్ కేకులు, క్యారెట్లు, కొన్ని ధాన్యాలు సమర్పిస్తారు. ఒకప్పుడు యూరప్ లో మాత్రమే జరుపుకునే హాలోవీన్ రోజు, తర్వాత అమెరికాకు కూడా ప్రాకింది. ఈరోజు గుమ్మడికాయలను విచిత్రమైన ఆకృతులతో దొలిచి లైట్లు పెట్టి ప్రతి ఇంటిముందు అలంకారంగా పెడ్తారు.ఎవ్వరికి హాని చెయ్యకుండా ఆత్మలు వాటి దారిని వెళ్ళేలా ఇలా దీపాలను పెట్టడం ఒక ఆచారంగా వస్తోంది. పెద్దలు,పిల్లలనే తేడ లేకుండా సైతాను, డెవిల్, ఇంకా మరెన్నో భయంగొలిపే  విచిత్రమైన వేషాలు వేసుకుని పార్టీ చేసుకుంటారు. పిల్లలు ఇంటింటికి  వికృత వేషాలతో తిరుగుతూ ట్రిక్ ఆర్ ట్రీట్ అంటో  చాకోలేట్స్, లేదా డబ్బులు తీసుకుంటారు. ఆరోజంతా పండగ వాతావరణం నెలకుంటుంది.

ప్లాజాలో షాప్స్ అన్ని మూసేసారు. కారు పార్క్ చేసి పరుగులాంటి నడకతో రెస్టారెంట్ చేరాను.

కారిడారులో చీకట్లో అస్పష్టంగా ఓ రూపం. మరియా..... మరియాయే.....కాకపోతే ఈ సమయంలో అక్కడ వేరేవాళ్ళు ఎందుకుంటారు?

నా ఊహ నిజమే! తెల్లని దుస్తుల్లో మరియా వెన్నెల్లో మల్లెపువ్వులా ఉంది. ఆత్రంగా ఆమెను చేరుకున్నాను. మరియా అంటో ఆమెను చేరబోయాను. నన్ను చూసి బెదురుగా వెనక్కి అడుగేసింది.

“మరియా! నిన్ను చూడాలని నా మనస్సెంత తహతహలాడుతోందో తెల్సా? ప్రాజెక్ట్ పని వత్తిడిలో ఫోన్ చెయ్యడం కుదర్లేదు. తర్వాత రెండు రోజులు నీ ఫోన్ కోసం నిమిషనిమిషానికి ప్రయత్నించాను. కానీ నువ్వు ఫోన్ ఎత్త లేదు? నా మీద కోపమా? నీకు చెప్పకుండా వెళ్ళాననేగా? ఐ యాం సారీ డియర్.” నా మాటలు విందో లేదో తెలీడంలేదు. హరితవనల్లాంటి ఆ కళ్ళల్లో బెదురు. అందీఅందనంత దూరంలో నిల్చుంది. చలాకీగా, ముద్దుగా ఉండే ఆ రూపం దైన్యంగా నిస్తేజంగా ఉంది.

“ట్రిక్ ఆర్ ట్రీట్ ?... హాలోవీన్ డే స్పెషల్ ట్రీట్ ఇవ్వవా? ఈరోజు నువ్వు నాకు ట్రీట్ ఇస్తున్నావు.... లేదంటే నేనే నీకు ఇస్తాను. స్వీట్ ట్రీట్....ఓకే....మరియా డార్లింగ్ ....ప్లీజ్  మాట్లాడు.... ఒక్కసారి దగ్గరగా రా.... ఈ నాల్గు రోజులు నేనెంత నరకం అనుభవించానో నీకు చెప్దామని వస్తే నువ్వు మాట్లాడకుండా, దూరంగా నిలబడి నన్నింకా వేధిస్తున్నావు. సారీ చెప్పానుగా. అయినా ఇంకా కోపం తగ్గకపోతే ఎలాగమ్మా? ప్లీజ్.... మరియా.....ఈ నాల్గురోజులు నాలుగు యుగాలుగా గడిచింది. ఎప్పుడెప్పుడు నిన్ను చేరి, నీ సాంగత్యంలో

ఈ నాల్గు రోజుల విరహాన్ని మరిచిపోవాలని వచ్చాను.... నన్నింక పరిక్షించకు. ఒకసారి దగ్గరగా రా.... మరియా ....ప్లీజ్.” ఒకడుగు ముందుకేశా.

ఆశ్చర్యంగా నా నుండి దూరంగా జరిగింది. అందమైన ఆమె ముఖంలో బెరుకు...కాదు....దైన్యం.....కళ్ళు ఎర్రగాఉన్నాయి. మరియా ఏడుస్తోంది. దగ్గరకు రావద్దన్నట్లుగా చేయూపుతూ, నాకందకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏమిటది? ఎందుకలా ప్రవర్తిస్తోంది నాకేం అర్ధం కావడంలేదు. నిశ్చేష్టుడునై అలా ఎంతసేపున్నానో తెలీదు.

“హే గాయ్! హు ఆర్ యూ?వాట్ ఆర్ యు డుయింగ్ హియర్?..”సెక్యురిటి ప్రశ్నతో ఈ లోకంలో కొచ్చాను.

“సారీ! లుకింగ్ ఫర్ ఎ ఫ్రెండ్....” కారు దగ్గర కొచ్చి చుట్టూ చుసాను మరియా కనబడుతుందేమోనని....దూరంగా కార్లు వెళ్తున్న శబ్దం తప్ప  ఎక్కడా మనిషి జాడ లేదు.

ట్రాన్స్ లో ఉన్నట్లుంది. తల పగిలిపోతోంది. ఎలా ఇంటికి చేరానో నాకు తెలీదు. మరియా ఫోన్ ప్రయత్నించా, జవాబులేదు. రాత్రి కాళ రాత్రయ్యంది..

మర్నాడు అన్యమనస్కంగానే ఆఫీస్ కెళ్లాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేయడంలో కొన్ని రోజులు బిజీగా  గడిచిపోయాయి. ఖాళీ దొరికితే చాలు  మరియా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ నా దురదృష్టమో ఏమో ఎన్నిసార్లు ప్రయత్నించినా జవాబులేదు.

సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ రెస్టారెంట్ కెళ్ళాను. మరియా కోసం నా కళ్ళు నాలుగు వైపులా చూస్తున్నాయి. మనస్సు ఆత్రంగా ఎదురు చూస్తోంది. నా ఆశలు అడియాశలయ్యాయి. ఎక్కడా మరియా కనిపించలేదు.

“హాయ్! ఐ యాం శిరీష్.....” మేనేజరుకి నన్ను పరిచయం చేసుకుని నే నొచ్చిన విషయం చెప్పాను.

నాకేసి వింతగా చూసాడు సాల్ గోమేజ్ రెస్టారెంట్ మేనేజర్. కాసేపు మౌనంగా వుండి, “నాకు తెల్సు.మరియా మీతో డేటింగ్ చేస్తోందన్న విషయం. కానీ ఐ యాం సారీ..... మీకంతా తెల్సనుకున్నా.....”

“ప్లీజ్ నాకేం తెలీదు. త్వరగా చెప్పండి. ఏమైంది. మరియా ఎక్కడుంది....”ఆలశ్యాన్ని భరించలేకపోతున్నా.

“మీ గురించి చెప్పింది. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా అంది. ఈ రోజు మీ దగ్గర్నుంచి తప్పకుండా వస్తుంది అనుకుంటూ ఎంతో ఉత్సాహంగా వెళ్ళింది. హాలోవీన్ డే మీతో కల్సి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. బట్.....గాడ్ వాజ్ నాట్ కైండ్ ఆన్ హర్. 29 అక్టోబర్ రాత్రి.... కార్ ఏక్సిడెంట్.... షి వజ్ నో మోర్......” నెత్తిమీద పిడుగు. భరించలేని ధ్వని. తల బ్రద్దలవతోంది.

ఓ  గాడ్!!!... అవుతే హాలోవీన్ డే  రాత్రి మరియా ఆత్మ నాకోసం ....హే భగవాన్.... నా మరియా....లేదా...?

కళ్ళు తిరుగుతున్నాయి, సృహ తప్పింది.

                    ***    

బెడ్ మించి లేవాలనిపించడం లేదు. శూన్యంగా వుంది జీవితం. కిటికీ లోంచి చూసాను. మోడులైన చెట్లు ఒంటరిగా, నిర్జీవంగా... ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికేమో శరత్కాల రంగుల హరివిల్లులకు శిశిరం సోకింది  రంగులు వెలసిపోయి మోడులై పోయాయి.

నా రంగులకల...... చెదిరిపోయింది......                  

మరిన్ని కథలు
shirimanu