Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

పద్యం - భావం - - సుప్రీత

వేమన పద్యం

 

గంగి గోవు పాలు గరిటడైనను జాలు

కడివెడైన నేమి ఖరము పాలు

భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ వినుర వేమ.

 

తాత్పర్యం

గాడిద పాలు ఒక కుండ కంటె చిక్కని ఆవు పాలు గరిటెడు మేలైనట్లుగా భక్తి తో చేసిన కూడు పట్టెడు చాలును కదా !

 

విశ్లేషణ

గాడిద పాలు తాగటానికి ఉపయోగ పడవు, అలాంటి పాలు కుండడి కంటే , తాగటానికి ఉపయోగ పడే చిక్కటి ఆవు పాలు గరిటెడు చాలు. భక్తి లేకుండా, ఇష్టం లేకుండా పెట్టే అన్నం కంటే , ప్రేమ తో భక్తి తో పెట్టే పట్టెడు అన్నం ఎంతో విలువైంది.

 

దాశరధీ పద్యం

 

నోచిన తల్లి తండ్రికి దనూభవుడొక్కడె చాలు , మేటి చే

చాచని వాడు , వేఱొకడు చాచిన లేదన కిచ్చు వాడు నో

రాచి నిజంబకాని పలుకాడనివాడు రణంబులోన మేన్

దాచని వాడు భద్రగిరి దాశరథి  కరుణాపయోనిధీ.

 

తాత్పర్యం

తల్లితండ్రుల పూర్వ జన్మ పుణ్య ఫలము వలన , ఎవరిని యాచించకుండ , అడిగిన వారికి లేదనకుండ అసత్యం పలకక , యుద్ధ రంగమున జంకక నుండు గుణవంతుడయిన ఒక పుత్రుడు పుట్టినా తల్లితండ్రులకే గాక  వంశములకే నీ వలనే ఖ్యాతిదేగలడు.

 

విశ్లేషణ

తల్లితండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల ఒకరి దగ్గిర చేయి చాచని వాడు , ఎప్పుడూ నిజమే చెప్పేవాడు,  అడిగినవాళ్ళకి లేదనకుండా సహాయ పడేవాడు, దేనికీ భయపడనివాడు అలాంటి పిల్లల వల్ల తల్లి తండ్రులకే కాదు వంశానికే పేరు వస్తుంది.

సుమతీ శతకం

తన కోపమె తన శత్రువు

తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గం

తన దుఖఃమె నరకమండ్రు తధ్యము సుమతీ 

 

తాత్పర్యం

 

ఎవరి కోపం వాళ్ళని శత్రువు వలే బాధించును , తన శాంతమే తనని రక్షించును దయయే చుట్టాల వలే సహాయపడును. సంతోషమే స్వర్గం దుఖఃమే నరకము.

 

విశ్లేషణ

కొంతమందికి ఊరికే కోపం వస్తుంది చిటికీ మాటికి విసుగు చెందుతారు , కొందరు ఎంతో సహనంతో ఉంటారు . ఊరికే కోపం తెచ్చుకోవటం వల్ల మనుషులు దూరం అవుతారు. అందరితో దయ తో మెలగటం వల్ల స్నేహాలు బల పడతాయి . ఎప్పుడూ సంతోషం గా ఉండేవాళ్ళు ఎప్పుడూ ఆనందంగానె ఉంటారు. ఎప్పుడూ చిరాకు కోపం తో ఉండెవాళ్ళు ఎప్పుడూ సుఖపడరు అని అర్ధం.

మరిన్ని శీర్షికలు
Urticaria | Hives| దద్దుర్లు | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)