Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ : అమ్మమ్మ, తాతయ్యల సమక్షంలో చంద్రకళ చేసిన డాన్స్ చూసి వాళ్ళెంతో సంతోషిస్తారు. ఊర్లో అమ్మవారి గుడికి వెళ్తారు అందరూ సంతోషంగా.....ఆ తర్వాత....

చెన్నై చేరి,  ఇంట్లో అడుగు పెట్టగానే, మొదటి ఫోన్ భూషణ్ అంకుల్ నుండే.  నాన్న మాట్లాడారు.

“మనతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలంట. సాయంత్రం వాళ్ళింటికి  డిన్నర్ కి రమ్మంటున్నాడు  భూషణ్,”  అన్నారు  నాన్న మాతో.

**

ఇంటి  పనులయ్యాక, మరునాటి మ్యూజిక్ క్లాసుల షెడ్యూల్ సెట్ చేసుకుంది అమ్మ.

వినోద్ ఇంట్లోనే ఉంటానండంతో, కన్నన్ ని తోడుంచి, సాయంత్రం ఏడింటికి భూషణ్ అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాము.

సగం సమయం మా గుంటూరు – అమరావతి  కబుర్లుతో  గడిచిపోయింది.  

రాణి నాతో పెద్ద ఫ్రెండ్లీగా ఎప్పుడూ ఉండదు...డిన్నర్  చేసినంతసేపు, నేనే తనకి అవీ-ఇవీ కబుర్లు చెప్పాను...

భోజనమయ్యాక,  అందరం సిటింగ్ రూములో కూర్చున్నాము.  నాకు ఇష్టమని, ఆంటీ  ‘మాంగో కసాట’ ఐస్ క్రీం సర్వ్ చేసింది.  

ఈ లోగా భూషణ్ అంకుల్ ఒక ఫైల్ తీసుకొచ్చి , మా ఎదురుగా కూర్చున్నారు.

“చూడమ్మా శారదా, మాకు, మీకు కూడా మన బిడ్డలని వృద్ధిలోకి తేవాలని  గట్టి ఆకాంక్ష ఉంది.  ఇప్పటికే  మంచి టాలెంట్ ఉన్న యంగ్స్టర్స్ అని గుర్తింపు పొందారు.  వాళ్ళకి తగ్గ అవకాశాలు, పేరు వచ్చేలా  మనం  తోడ్పడాలి.  

అయితే,  మన మేజర్ ఉద్యోగంతో బిజీగా ఉంటాడు.  

కాని నాకు బోలెడంత టైం ఉందిగా!  పైగా ఈ కళారంగం నాకు బాగా తెలిసిందే.  ఎన్నో సాంస్కృతిక సంస్థలు నా ఆధ్వర్యంలోనో, నా సహకారంతోనో ముందుకు వెళుతున్నాయి. ....అందుకే పిల్లల కెరియర్ పై,  నా దృష్టిని పూర్తిగా కేంద్రీకరించాలని  నా ఆలోచన.  

ప్రతియేడు, హేమాహేమీలని ఆహ్వానించి, మన స్టూడియో కల్చరల్ ప్రోగ్రాం తప్పనిసరిగా ఉంటుంది,”   ఒక్క నిముషం ఆగారు అంకుల్....

“ఇటు శారద గారు, అటు  నా భార్య నీరూ కూడా  పూర్తిగా  సహాయ  సహకారాలు అందిస్తే,  పిల్లల భవిష్యత్తులు  తారాజువ్వల్లా దూసుకుపోతాయి,”  అంటూ నాన్న వంక  చూసారు..  

“ఏమంటావ్ సత్యం?  రెండు నెలలకో ప్రోగ్రాం, ఓ టి.వి షో ఉండేలా ఏర్పాటు చేస్తాను.  మనీ మాటర్స్, పేమెంట్స్ గురించి - నీరూ, శారద చూసుకుంటారు.  వచ్చింది పిల్లల వృద్దికే ఖర్చు పెడతారు.  ఏమంటారు?”  అడిగారు అంకుల్.

నీరూఆంటీ కల్పించుకుంది. “ఇందులో మా స్వార్ధం కూడా ఉంది  సత్య గారు.  పిల్లలిద్దరూ  కలిసి  ప్రదర్శనలిస్తే, డాన్స్ అండ్ మ్యూజిక్ ఆడియన్స్ వుంటారు.  మంచి కాంబినేషన్ కదా,” అంది నవ్వుతూ.  

కాసేపు ఎవ్వరు ఏమీ అనలేదు.  

ఫైల్ నుండి ఓ కవర్ తీసి, అమ్మ చేతికిచ్చింది నీరుఆంటీ..  “మదురైలో ‘కళామంజరి’ ఆర్ట్స్ ఫెస్టివల్ ఉంటుందని భూషణ్ చెప్పారుగా! చంద్రకళ, రాణిల  పార్టిసిపేషన్ కంఫర్మ్ అయిన వివరాలు కూడా అందాయి.... ఆ ఫెస్టివల్ లో పాల్గొని గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు...అందుకే మనం తప్పక వెళ్ళాలి...ఈ కవరులో రిజిస్ట్రేషన్ తో పాటు ఆ సంస్థ గురించి బుక్ లెట్ ఉంది,” అంది ఆంటీ.

మదురై  ప్రోగ్రాం  ఉంటుందని’  నాన్న చెప్పిన గుర్తే  నాకు......

“నాకైతే,  బ్రహ్మాండంగా ఉంది మీ ప్రపోజల్,” , “గాడ్ ఇజ్ గ్రేట్. ఇట్ ఇజ్ ఆల్ డెస్టినీ ’  వీళ్ళిద్దరినీ  ప్రొమోట్ చేయాలన్న ఆలోచనకి,  మీకు  కృతజ్ఞతలు”  అన్నారు నాన్న, అంకుల్ వాళ్ళతో.  

అమ్మ కూడా ఔనన్నట్టు తల ఆడించింది.

“చంద్రునికో  నూలు పోగులా  నీవు  నాకు  చేసిన  మేలు  ముందు  ఇదెంతోయ్ సత్యం....  

నా ఈ పేరు, హంగామా, ఈ లైఫ్ స్టైల్  నీ వల్లే కదా!.  నా చేయి పట్టి సినిమా ఫీల్డ్ కి

నడిపించావుగా....” క్షణమాగారు అంకుల్...

“అదటుంచితే,  నీ బిడ్డ  టాలెంట్ ఏమీ తక్కువ కాదని నీకూ తెలుసుగా!”  అన్నారు మళ్ళీ నాన్నతో..

“అందరం హ్యాపీ కాబట్టి మరో రౌండ్ ఐస్ క్రీం,” అంటూ లోపలి వెళ్ళింది ఆంటీ.  

“ఓకే! డాడీ, ఇప్పుడు  నా  సప్రైజ్  చెప్పొచ్చా?  అసహనంగా  అంది  రాణి.

“కానీయ్,  చెప్పు తల్లీ,” అంకుల్ రాణితో.

“గెస్ వాట్,  ఈ సారి కూడా మన కల్చరల్ ప్రోగ్రాంకి,  ఢిల్లీ  నుంచి  జగదీష్  వాళ్ళు వస్తామని కంఫర్మ్  చేసారు.  రెండు వారాలు ఉంటారట.  మదురైకి కూడా మనతో ట్రావెల్ చేస్తామన్నారు.  మా  ఇంట్లో కూడా ఓ వారం ఉంటామన్నారు,” అంటూ సంతోషంగా చప్పట్లు కొట్టింది రాణి.

అందరికీ మరోసారి ఐస్-క్రీం తెచ్చి, సర్వ్ చేసింది నీరూఆంటి..

“అల్లరికి తోడు ఒట్టి మొండిపిల్ల మా రాణి.  తరచుగా ఢిల్లీకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. జగదీష్  ఇప్పుడు  తన  బెస్ట్  ఫ్రెండ్ అంటుంది.  వాళ్ళిక  ‘సరే  చెన్నైకి వస్తాము’ అనే వరకు ఊరుకోలేదు.  మీకూ బంధువులు కదా!  వీళ్ళు  కూడా మళ్ళీ  కలుస్తారులే  అనుకున్నాము.  మాకు  అభ్యంతరం  ఏముంటుంది?” అంది ఆంటీ.

నేను, అమ్మనాన్నల వంక చూస్తే, ఐస్ క్రీం తింటున్నారు.

మరో ఐదు నిముషాలకి, అంకుల్ వాళ్లకి థాంక్స్ చెప్పి, ఇల్లు చేరేప్పటికి లేట్ అయింది.  అలిసి పోయున్న మేము ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం.

అంకుల్ వాళ్ళింట్లో విన్న సంగతులు, జరిగిన విషయాల గురించే ఆలోచిస్తూ, పక్క మీద చేరాను.

నన్ను కళారంగంలో ముందుకు తీసుకు వెళ్ళడానికి భూషణ్ అంకుల్ చూపిస్తున్న శ్రద్దకి నాన్న అమ్మ కూడా సంతోషించడం  తలుచుకున్నాను...

ఆయన ప్రోత్సాహంతో,  గొప్ప డాన్సర్ అవ్వాలన్న నా కల నిజమవుతుందని అనిపిస్తుంది...


నృత్యమంటే నాకున్న ఇష్టం వల్లనే కదా! ఇక్కడ, భూషణ్ అంకుల్ ప్రోత్సాహం, అక్కడ, అమ్మమ్మ - జగదీషుల అభిమానం పొందగలిగాను అని సంతోషంగా అనిపించింది....

జగదీష్ గురించి మొన్న గుంటూరులో అమ్మమ్మ వాళ్ళు అన్న మాటలు గుర్తొచ్చాయి.  అంతలోనే, ఇవాళ  నీరుఆంటీ వాళ్ళు అన్నది కూడా గుర్తొచ్చింది.  

 జగదీష్ తో మాకంటే, రాణి ఎక్కువగా మాట్లాడ్డం కొంత కష్టంగా అనిపించింది....

ఏమైనా, అత్తయ్యా వాళ్ళు  చెన్నై వస్తున్నట్టు మాకు ఇంకా చెప్పలేదే? అనుకుంటూ నిదురపోయాను.

**

మరునాడు - శనివారం పొద్దున్నే డాన్స్ క్లాస్ కి తయారయి, అందరి కంటే ముందు నేనే బ్రేక్ ఫాస్ట్  టేబిల్ వద్దకి వెళ్ళాను.  అమ్మ హార్లిక్స్ కలిపిచ్చింది.  చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన పెట్టి,  హాల్లో నుండి నాన్న వచ్చారు.  వినోద్ ని కూడా పిలిచి, అమ్మ అందరి ప్లేట్లల్లో ఉప్మా వడ్డించి, తనూ కూర్చుంది.   

“మీ అన్నయ్య నీకు ఫోన్ చెయ్యలేదా, వాళ్ళ  చెన్నై ట్రిప్ప్పు గురించి? అడిగారు నాన్న.

అమ్మ పలకలేదు.

“నువ్వు, మీ అమ్మ, ఏవో కలలు  కంటున్నారు  గానీ,  మీ  అన్నయ్య  వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి.  పెద్ద పెద్ద వాళ్ళతో  స్నేహాలు చేస్తున్నారు.  మనని  మర్చిపోయారని తెలుస్తూనే  ఉంది,” అన్నారు నాన్న.

“ఏమోలెండి,  ఫోన్  చేస్తారేమో.  చూద్దాం లెండి.  అయినా మనం  ఊళ్ళో  లేముగా!”

అమ్మ కాస్త  కోపంగానే ఉందనిపిస్తుంది.

“జగదీష్,  ‘బంగారం’  అని  నువ్వు  మురిసిపోతే  చాలదు శారదా.  నాకైతే, మీ అన్నయ్యవాళ్ళ వ్యవహారమంతా గమ్మత్తుగా ఉంది,” మళ్ళీ నాన్న.“అమ్మా, నిజంగా మామయ్యా వాళ్ళు భూషణ్ అంకుల్ వాళ్ళింట్లో ఉంటారా?” నమ్మలేక అడిగాను.

“ఏమోలేవే,  నీ క్లాసుకి టైం అయింది,  తినేసి రెడీ అవ్వు.  మాస్టారి గారితో  మాట్లాడాలి, కాస్త ముందుగా వెళదాము,” అంది అమ్మ.

**

అమ్మ నాతో పాటు డాన్స్ క్లాస్ కి వచ్చింది.  

రాత్రి భూషణ్ అంకుల్ చెప్పిందంతా మాస్టారికి  వివరించింది.  మైలాపూర్ ఫైన్-ఆర్ట్స్ వారి దసరా ప్రోగ్రాం గురించి కూడా ఆయనకి చెప్పింది...

“ఇక పైన, మీరు ఈ  ప్రోగ్రాములకి  ఐటమ్స్ కూర్చి,  మీ  ఆధ్వర్యంలో  జరిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.  ఎలా చేయవచ్చో, మీరే నిర్ణయించండి.  ఇదంతా మాకు కొత్త.  ఏ తప్పులు జరగకుండా సంప్రదాయంగా జరగాలని  నా కోరిక,” అంది అమ్మ.

“సంతోషం శారద గారు. ఎగిసే కెరటాన్ని ఆపేది ఎవరు.  సరే,  నేను  కొంచెం  అలోచించి రెండు రోజుల్లో మీతో మాట్లాడుతాను,”  అన్నారు మాస్టారు.

**

మళ్ళీ  వారానికి,  ప్రోగ్రాంల ప్రాక్టీసు మొదలు  పెట్టించారు.  ఎంతో ఉత్సాహంగా ఉంది.  

ఆయన కూర్చిన ప్రోగ్రాముల్లో అమ్మవారి స్తోత్రాలు, అష్టపదులు,  తమిళ పాటలు కూడా ఉన్నాయి......’నగు మోము కలవాని’ అనే త్యాగరాయ కీర్తన నాకు బాగా నచ్చింది.

అది అమ్మ పాడగా విన్నాను... జతులు స్వరాలు చేర్చి చాలా అందమైన డాన్సుగా మలిచారు మాస్టారు.

**

క్లాస్ అయ్యాక  పైకి వచ్చేప్పటికి అమ్మ ఫోన్ లో మాట్లాడుతుంది.  నాన్న, వినోద్ కేరమ్స్  ఆడుతున్నారు.  నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక కూడా, అమ్మ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది.

“నాకు ఆకలి వేస్తుంది.  అమ్మ ఎవరితో మాట్లాడుతుంది నాన్న?”  తగ్గు స్వరంలో అడిగాను.

“మీ అత్తయ్యతో,” అన్నారు నాన్న.  ఆశ్చర్య పోయాను.

“మీ అత్తయ్యే చేసింది,” మళ్ళీ నాన్న.|

ఇంతలో, “ఇదిగో,  చంద్రా ఫోన్,” అంది అమ్మ.

“అమ్మా, నేనేమి మాట్లాడాలి? అన్నట్టుగా చూసాను...

ఫోన్ నాచేతిలో పెట్టి, “ముందు అత్తకి హలో చెప్పు,” అంది.

“హలో,”  అన్నాను.

“ఏమ్మా చంద్రకళా, ఎలా ఉన్నావు?  కుదిరితే,  నీ రెండు  ప్రోగ్రాములకి  మీ వెంటే ఉంటాము.

జగదీష్ అయితే  నీతో పాటు కూచిపూడి డాన్స్ నేర్చుకునేలా ఉన్నాడు.  ఇదిగో మాట్లాడు,” నవ్వుతూ అత్తయ్య.

“హలో,”  అన్నాడు జగదీష్.

“హలో,” తిరిగి అన్నాను.

“చంద్రా, వి ఆర్ కమింగ్ టు చెన్నైఇన్ ఎ ఫ్యూ డేస్.  వి విల్ సీ యు పర్ఫాం,” అన్నాడు.

“ఆహా,” అన్నాను.

“బాగా ప్రాక్టీస్ చేస్తున్నారంటగా నువ్వు, రాణి?”, “రోజు  చెబుతుంటుంది  తను,”  అన్నాడు జగదీష్.

“ఔను,” నవ్వాను.  

“సరే ఫోన్ మమ్మీకి ఇస్తున్నా,” అన్నాడు.

**

లంచ్ వడ్డించింది అమ్మ.  నాకిష్టమైన కర్రీస్.  తింటూ  ఆలోచించాను.

అత్తయ్యే అమ్మకి  ఫోన్ చేసిందన్నారు.  

‘ఏమి కబుర్లు చెప్పిందో! ఆమె’ అనుకున్నాను...

“ఇప్పటి వరకు నీతో తమ ట్రిప్పు సంగతి చెప్పకపోవడానికి ఏమిటంట మీ వదిన గారి సాకులు,” తింటూ అడిగారు నాన్న.

..మళ్ళీ వచ్చేవారం...................

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery