Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఎన్ కౌంటర్

encounter

‘విశాఖ ఏజెన్సీలోని కొండరాయపల్లి గిరిజన తండాకి సమీపంలో పోలీసులకు, నక్జలైట్లకూ నడుమ ఎదురు కాల్పులు జరిగాయి. రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు సాగిన ఆ పోరులో సుమారు ఇరవై మంది నక్జలైట్లు పాల్గొన్నట్టు సమాచారం. ఆ ఎదురు కాల్పులలో ఓ మహిళతో సహా ఇద్దరు నక్జలైట్లు మృతిచెందితే, మిగతావారు తప్పించుకోవడం విశేషం. మృతుడు స్థానిక దళ నాయకుడు లక్ష్మా నాయక్ గా గుర్తింపబడింది. మహిళ వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతుల వద్ద రెండు కిట్ బ్యాగ్ లు, రెండు ఎ.కె-47 తుపాకులు, మ్యాగజీన్సు, ఒక క్లేమోర్ బాంబు, నక్జల్ లిటరేచరు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న నక్జలైట్ల కోసం ’కోబ్రా’ టీమ్ అడవిలో తీవ్రంగా గాలిస్తోంది...’

ఆ వార్త ఆ మన్య ప్రాంతాన్ని గట్టిగా కుదిపేసింది. ముఖ్యంగా, కొండరాయపల్లి తండాని. ఎదురు కాల్పులు జరిగిన స్థలం ఆ గిరిజన తండాకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడమే అందుక్కారణం.

ఆ సంఘటనను గూర్చి ఆలకించినప్పట్నుంచీ ఆ తండావాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, గుమ్మం దాటి బైట అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. ఆ పరిసరాలలో ఎవరు కనిపించినా పోలీసులు అనుమానంతో కొట్టి, వ్యాన్ లో పడేస్తారు. నక్జలైట్లతో వారికి సంబంధం అంటగట్టడానికి ప్రయత్నిస్తారు.

ఇక ’అన్నల’ మాట సరేసరి. తమ ఉనికిని గూర్చి పోలీసులకు సమాచారం ఇచ్చారంటూ హింసిస్తారు. తాము ఏ పాపమూ ఎరుగమంటూ ఎంత మొత్తుకున్నా వారి చెవికి ఎక్కదు.

అనంతరం పోలీసులు వస్తారు. ‘అన్నల’తో చేతులు కలుపుతున్నారంటూ నోటికి వచ్చిన బూతులు తిడతారు. బూటు కాళ్ళతో తంతారు. ఇళ్ళలో చొరబడి అందర్నీ చితగ్గొడతారు. స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. పిల్లల్ని, వృద్ధుల్నీ సైతం విడిచిపెట్టరు...పోతూ పోతూ చేతికందిన కోడి, పాడి, విప్ప సారా  వగైరాలను దొరకబుచ్చుకుని పోతారు. దాచుకున్న డబ్బు, దస్కమూ కైవసం చేసుకుంటారు... ఆ గిరిజనుల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల చందం. అటు నక్జలైట్లు, ఇటు పోలీసుల మధ్య వారు నలిగిపోతూంటారు.

ఆ ఎదురు కాల్పుల సంఘటన జరిగిన మూడో రోజు అర్థరాత్రి...కొండరాయపల్లి గిరిజన తండాలో ప్రవేశించారు సాయుధ వ్యక్తులు ముగ్గురు. వస్తూనే తుపాకులతో గాల్లోకి ప్రేల్చారు, తమ రాకకు చిహ్నంగా. వచ్చింది ’అన్న’ లని గ్రహించడంతో భయాందోళనలతో ఒణికిపోయారంతా.    గాఢనిద్రలో ఉన్నవారిని బలవంతంగా ఇళ్ళలోంచి బైటకు లాక్కుని వచ్చి రచ్చబండ దగ్గర నిలబెట్టారు ’అన్నలు’. "ఆ రోజు మా దళం ఇక్కడ సమావేశ మవుతుందన్న సమాచారం మీలో పోలీసులకు అందించిం దెవరు?" కర్కశంగా ప్రశ్నించారు.

"సత్తె పెమానంగా మాకేం తెల్వదు, అన్నా! మీ గురించి పోలీసులకు తెలిపే దమ్ము, దయిర్యము ఈ తండాలో ఎవరి కుంటది సెప్పు" అన్నాడు తండాకి నాయకుడైన ముఖియా. అరవయ్యేళ్ళుంటాయి అతనికి.

"నోర్ముయ్ రా, ముసలోడా! పోలీసోళ్ళిచ్చే కాసులకు కక్కుర్తిపడి మమ్మల్నే పట్టిస్తారట్రా మీరు?" గర్జించారు. "నిజం చెప్పకపోతే, తండాకి నిప్పు పెడతాం, జాగ్రత్త!"

"నిజమే సెబుతున్నా, అన్నా! మీ కూటమి సంగతి మాకెలా ఎరికవుద్ది? జరా ఆలోచించన్నా!" నమ్మించడానికి ప్రయత్నించాడు ముఖియా.

"మీ బతుకులు బాగుచేయడం కోసమని మేం ప్రాణాలొడ్డి పోరాడుతూంటే...మాకే ద్రోహం చేస్తారట్రా మీరు?" ఉరిమారు వాళ్ళు.

ఆ మాటలతో ఓ గిరిజన యువకుడిలో ఆవేశం పొంగింది. "ఏందన్నా, మీరు మా బాగు కోసం పాటుపడేది? తోచినప్పుడల్లా తండాలపైన పడి దోచుకోవడమేనా? మమ్మల్ని బెదిరించి మీ పనులు చేయించుకునేదేనా?" అన్నాడు విసురుగా.

ఆ యువకుణ్ణి వారించబోయాడు ముఖియా. కాని, ఉడుకు రక్తం ఊరుకోలేదు. "నువ్వుండు పెద్దయ్యా! మనం అడవి బిడ్డలం. ఈ అడవి మనది. ఈ నేల మనది, ఈ గాలి మనది. మన చోటుకు వచ్చి మన చాటున తల దాచుకునే ఈళ్ళందరి బెదిరింపులకూ లొంగిపోయి భయపడుతూ బతకవలసిన అవసరం మనకు లేదు" అన్నాడు తీవ్రంగా.  ముఖియా కంగారుగా ఏదో అనబోయాడు. అంతలోనే ఓ ’అన్న’ చేతిలోని తుపాకీ ఆగకుండా గర్జించింది. ఆ యువకుడు నేల కూలాడు.

"మమ్మల్ని ఎదిరించాలని చూసినా, మాకు వ్యతిరేకంగా పనిచేసినా...ఇదే గతి పడుతుంది. ఖబడ్దార్!" అంటూ ఆ గిరిజనుల్ని తీవ్రంగా హెచ్చరించి, క్షణాలలో అక్కణ్ణుంచి అదృశ్యమైపోయారు ’అన్నలు’.

సరసు గట్టున కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది చండిక. వదనంలో నీలి నీడలు క్రమ్ముకున్నాయి...పదహారేళ్ళ జవ్వని ఆమె. తగిన ఒడ్డూ పొడవూతో...చక్రాలవంటి కాటుక కనులతో...గులాబి రంగుతో... నాజూకుగా ఉంటుంది.

ఆ రోజు ఆమె మనసు కారుమబ్బులు క్రమ్మిన ఆకాశంలా ఉంది. ’అన్నల’ చేతిలో అన్యాయంగా హతమైన చంద్రం రూపం ఆమె కనుల ముందు కనిపిస్తోంది. ’ఏం పాపం చేసాడని చంద్రానికి అంత పెద్దశిక్ష!?’

ఆమె మది మూగగా రోదిస్తోంది. ఏడ్చి ఏడ్చి కళ్ళలోని నీళ్ళన్నీ ఇంకిపోవడం వల్ల కాబోలు, కన్నులు తడారిపోయి ఉన్నాయి...   అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు, ఎవరిదో చల్లటి హస్తం ఒంటి మీద పడడంతో, తేరుకుని తలెత్తి చూసింది.

"ఎన్నాళ్ళిలా బాధపడుతూ కూర్చుంటావు, బిడ్డా! చంద్రం అల్పాయుష్కుడు. అంతే!" అన్నాడు భీముడు - చండిక తండ్రి. అతని పలుకులతో దుఃఖం ఉప్పెనలా పొంగుకువచ్చింది ఆ పిల్లకు. "బాబా!" అంటూ తండ్రిని కావలించుకుని రోదించింది.

ఆ రోజు ’అన్నల్ని’ ఎదిరించి మాట్లాడిన నేరానికి వారి బులెట్లకు బలైపోయిన యువకుడి పేరు చంద్రం. చండికను మనువాడనున్నవాడు. రానున్న పున్నమికే వారి పెళ్ళికి లగ్నం నిశ్చయింపబడింది.

అంతలోనే ఆ దారుణం జరిగిపోయింది...

బాబా!" హఠాత్తుగా తలెత్తి తండ్రి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది చండిక - "మనం ఈ ప్రకృతికి పుట్టినవాళ్ళం. అడవి తల్లికి ముద్దు బిడ్డలం. ఒరుల జోలికి పోకుండా, పరుల కష్టాన్ని కైవసం చేసుకోకుండా మన బతుకులు మనం బతుకుతున్నాం. అడవిలో దొరికిందేదో తింటూ, లేని నాడు పస్తులుంటూ హాయిగా జీవిస్తున్నాం. మన తిండి మనం కష్టపడి సంపాదించుకుంటూ సామాన్య జీవితం గడపుతున్నాం. మనం  

ఎవర్నీ అడుక్కోవడం లేదు, ఎవర్నీ మోసగించడం లేదు. బడా బాబుల్లా ఈ వన్య సంపదను దోచుకోవడం లేదు. ఈ చెట్లు, ఈ పక్షులు, ఈ నేల, ఈ నీరు, ఈ గాలి నేస్తాలుగా సహజీవనం చేస్తున్నాం... అటువంటి మనం ఎవరి తూటాలకో బలి కావలసిన అగత్యం ఏమిటి? ఆదుకుంటామంటూ అన్నలూ, కాపాడతామంటూ పోలీసులూ మన జీవితాలతో ఆడుకుంటూంటే...చూస్తూ ఊరుకోవలసిందేనా? మనం ఏమీ చేయలేమా? మన బ్రతుకులు మనవి కావా??..."

కూతురి మదిలో పరవళ్ళు త్రొక్కుతూన్న ఆవేదన, పొంగి పొరలుతూన్న ఆవేశం భీముడికి అర్థమయ్యాయి. ఆమె వంక జాలిగా చూసాడు. అనునయంగా తల నిమురుతూ, "జీవితమే ఓ సమరం, బిడ్డా! ఇదీ అందులో ఓ భాగమే ననుకోవాలి. సిద్ధాంతాల పేరుతో రెండు శక్తులు రాద్ధాంతానికి తలపడితే, మధ్యలో సామాన్యుడు నలిగిపోక తప్పదమ్మా”.

"అంటే? అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం మన జాతికి లేదంటావా, బాబా? మౌనంగా బలిపశువులం కావలసిందేనా?" ఉద్వేగంతో ప్రశ్నించింది.

కూతురి ప్రశ్నకు సమాధానం భీముడి దగ్గర లేదు. విషయాన్ని దాటవేయడానికి యత్నిస్తూ, "బిడ్డా! చంద్రం చావుకి తండా అంతా కన్నీరు మున్నీరయింది. పోయినవాడితో మనమూ పోలేం కదా!  జరిగింది మరచిపోయి జీవితంలో ముందుకు జరగక తప్పదు” అంటూ ప్రేమగా ఆమె తల నిమిరాడు.

విశాఖ ఏజెన్సీలోని దళాలలో బ్రహ్మన్న దళం ముఖ్యమైనది. అందులో కేడర్లుగా పనిచేస్తూన్న వెంకటేశం, రాజయ్యలు ఇద్దరే తెలుగువారు...  పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరానికి చెందిన వెంకటేశం ఆ ఉద్యమంలోకి వచ్చి ఏడాది పైనే ఐంది.... వరంగల్ కి చెందిన రాజయ్య డిగ్రీ పాసయ్యాడు. చదివిన చదువు ఉద్యోగం కాని, ఉపాధి కాని కల్పించకపోవడంతో ప్రభుత్వం పైన, సమాజం పైన అలిగి ఆర్నెల్ల క్రితం ’అన్నలలో’ కలిసిపోయాడు...

మొదట్లో వీరోచితంగా అనిపించిన ఆ జీవితం రాను రాను దుర్భరంగా తోచింది రాజయ్యకు. దళంలోని సీనియర్లు కేడర్లను తమ స్వంత నౌకర్లుగా చూడడం కద్దు. దుస్తులు ఉతికించుకోవడం, షూస్ కి పాలిష్ చేయించుకోవడం, కాళ్ళు పిసికించుకోవడం, ఒళ్ళంతా మసాజ్ చేయించుకోవడం, వగైరాలు చేసేవారు. డిగ్రీ చదివిన రాజయ్యకు అది మ్రింగుడు పడేది కాదు. పైగా దళాలలో ప్రాంతీయ, కుల తత్వాలకు కొదవ లేదు. నాయకులంతా అగ్రకులాలకు చెందినవారేనని మిగతావారికి గుర్రుగా ఉంటే, తక్కిన కులాలవారిని వారు అణచియుంచుతున్నారన్న వాస్తవం రాజయ్య దృష్టిని దాటిపోలేదు.

ఆ ఉద్యమంలోంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న రాజయ్య, "అణచివేతకు గురౌతున్న బడుగు వర్గాల కేదో మంచి చేయాలన్న ఆశయంతో ఇందులో చేరానుకాని, అడ్డమైన వాడికీ కాళ్ళు పిసకడానికి కాదు. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను" అన్నాడు వెంకటేశంతో.

"మంచో చెడో, మనం ఎంచుకున్న మార్గం ముళ్ళ దారి. అందులో అడుగిడడమనేది పులి నోట్లో తల పెట్టడం వంటిదే. ఒకసారి లోపలికి వచ్చాక బైటకు పోవడమంటూ ఉండదు" అన్నాడు వెంకటేశం.

"ఏమైనా కానీ, పోలీసులకు లొంగిపోతాను నేను" అన్నాడు రాజయ్య దృఢ నిశ్చయానికి వచ్చినవాడిలా. "తొందరపాటుతో ఆపద కొనితెచ్చుకోకు," అంటూ హెచ్చరించాడు వెంకటేశం.

ఆ సంభాషణ జరిగిన వారం రోజులకే సీనియర్ ఒకడు రాజయ్యను పిలచి తన కాళ్ళు పిసకమని ఆదేశించాడు. రాజయ్య నిరాకరించాడు. అది ఇరువురి మధ్యా ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా ఆ వ్యక్తి రాజయ్యను తుపాకితో కాల్చి చంపేసాడు.

ఆనక ఆ సంగతి తెలిసి నిర్ఘాంతపోయిన వెంకటేశం, దళనాయకుడికి ఫిర్యాదు చేస్తే, "మీ తెలుగోడు చచ్చాడని బాధగా ఉన్నట్టుంది నీకు. మరో తెలుగోణ్ణి కొత్తగా రిక్రూట్ చేద్దాంలే" అన్నాడు అతను నిర్లక్ష్యంగా.

అతని తీరు వెంకటేశం గుండెల్ని మండించింది.

ఆంధ్రా పోలీసుల ధాటికి తట్టుకోలేక నిర్వీర్యమౌతూన్న విశాఖ ఏజెన్సీ దళాలను సమాయత్తపరచి ప్రభావితం చేసేందుకు ఏరియా కమాండర్ బెనర్జీ అక్కడకు వస్తున్నాడు. బస్తర్ అడవులలో ఉంటాడు అతను.

బెనర్జీ పశ్చిమ బెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లాకి చెందినవాడు. ముప్పయ్యేళ్ళుగా ఆ ఉద్యమంలో ఉంటూ సాధారణ కేడర్ నుండి ఆ స్థాయికి ఎదిగాడు. అతి క్రూరుడు. ఎన్నో హత్యలు.. బాంబు దాడులు...

కిడ్నాపులు...ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు ప్రేల్చేయడం వగైరా తీవ్రమైన నేరాల కేసులెన్నో అతని పైన ఉన్నాయి. ప్రభుత్వం అతని తలపైన పాతిక లక్షల బహుమతిని కూడా ప్రకటించింది.

బెనర్జీ రాక సందర్భంగా రహస్య సమావేశం ఏర్పాటుచేయబడింది....ఆ విషయం తెలుసుకున్న వెంకటేశంకి, తన మిత్రుడు రాజయ్య హత్యకు ప్రతీకారం తీర్చుకునే అదను అదే ననిపించింది. ఆ సమావేశం గురించి పోలీసులకు రహస్యంగా సమాచారం అందజేసాడు.

సుమారు ముప్పైమంది నక్జలైట్ ప్రముఖులు సమావేశమై ఉండగా కోబ్రా స్క్వాడ్ హఠాత్తుగా ముట్టడించింది. నక్జలైట్స్ ఎదురుకాల్పులు జరిపారు. ఐదారుగురు నక్జలైట్సు, ఓ సబిన్స్పెక్టరూ ప్రాణాలు కోల్పోయారు. ఇరువైపులా కొందరు గాయపడ్డారు. బెనర్జీ, బ్రహ్మన్నలు తప్పించుకుని సమీపంలోని కొండరాయపల్లి తండాలో చొరబడ్డారు. వారిని తరుముతూ వచ్చిన పోలీసులు తండాని చుట్టుముట్టారు. పోలీసుల ఫ్లడ్ లైట్స్ తో ఆ ప్రాంతమంతా పట్టపగలు ఐంది. బెనర్జీ, బ్రహ్మన్నలను లొంగిపోవలసిందిగా మైక్స్ లో హెచ్చరించారు పోలీసులు. జవాబుగా తాము దాక్కున్న ఇళ్ళలోంచి ఎ.కె. 47 లతో కాల్పులు జరిపారు వాళ్ళు. దాంతో ఇరువైపుల నుండీ తుపాకులు ఎడతెరిపి లేకుండా గర్జించాయి.

తండా ప్రజలు భయాందోళనలతో వణికిపోతూ తలుపులు మూసుక్కూర్చున్నారు. బెదిరిపోయిన పిల్లలు ఏడ్పు లంకించుకున్నారు.

"బెనర్జీ! బ్రహ్మన్నా! బలగాలు తండాని దిగ్బంధం చేసాయి. మీరు తప్పించుకుని పారిపోలేరు. ప్రాణాలు దక్కాలంటే మర్యాదగా లొంగిపోండి," మరోసారి హెచ్చరించాడు కోబ్రా కమాండర్. ఇళ్ళలో చొరబడి వారిని లొంగదీసుకోవడం కష్టం కాదు. కాని ఆ క్రాస్ ఫైర్ లో ఆయా కుటుంబీకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.

బ్రహ్మన్న మెల్లగా బైటకు వచ్చాడు, ఓ ఆరేళ్ళ పాపను అడ్డు పెట్టుకుని. "ఆఫీసర్! మర్యాదగా నన్ను ఇక్కణ్ణుంచి సేఫ్ గా బైటపడనివ్వండి. అడ్డు వస్తే ఈ పిల్లను షూట్ చేస్తాను" పోలీసుల్ని హెచ్చరించాడు.

భయంతో అ పసిపాప ఏడుస్తోంది. పిల్ల తల్లిదండ్రులు హాహాకారాలు చేస్తూ వెనకే వచ్చారు.

కోబ్రా కమాండర్ బ్రహ్మన్నకు నచ్చచెబుతూనే హఠాత్తుగా అతని తలకు గురిపెట్టి రివాల్వర్ తో షూట్ చేసాడు. ఐతే అప్రమత్తంగా ఉన్న బ్రహ్మన్న చటుక్కున పాపను పైకెత్తాడు. బులెట్ తగలడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులు ఘొళ్ళుమన్నారు. కమాండర్ ఓ క్షణం నిర్ఘాంతపోయినా వెంటనే తేరుకుని, పారిపోబోతూన్న బ్రహ్మన్న పైన కాల్పులు జరిపాడు. బ్రహ్మన్న కుప్పకూలిపోయాడు.

బెనర్జీ తలదాచుకున్న ఇల్లు భీముడిది. ఆ కుటుంబాన్ని గన్ పాయింట్ లో కదలకుండా చేసాడు. భీముడు, అతని పెళ్ళాం ఆందోళనకు గురైతే, చండిక తమ్ముడు, చెల్లెలు భయంతో ఒణికిపోతూ ఓ మూలను నక్కారు. చండికలో ఆవేశం, ఆగ్రహం రగిలిపోతోంది. బెనర్జీ కిటికీలోంచి ఎ.కె. 47 తో పోలీసుల పైన కాల్పులు జరుపుతున్నాడు. పోలీసుల తూటాలకు ఆ మట్టి ఇల్లు తూట్లు పడుతోంది.

"దయచేసి ఇక్కణ్ణుంచి వెళ్ళిపో, అన్నా! పోలీసులకు, మీకు వైరముంటే అది బైట చూసుకోండి. మమ్మల్నీ, మా తండానీ నాశనం చేయకండి" చేతులు జోడించి బెనర్జీని అర్థించింది చండిక.

తానెవరో చెప్పుకుని, తనకు సహకరించినంతవరకు వారికేమీ భయం లేదనీ, పోలీసులకు వత్తాసు పలికితే మాత్రం ఆ తండా మొత్తం తగలబెట్టేస్తాననీ తీవ్రంగా హెచ్చరించాడు బెనర్జీ.

అదే సమయంలో బైటనుండి ఘొళ్ళుమన్న ఏడ్పు వినరావడంతో, కిటికీ దగ్గరకు పరుగెత్తి బైటకు చూసిన భీముడికి జరిగిన దారుణం ఎరుకైంది. ఆగ్రహం ముంచుకువచ్చింది. తలుపు తెరచి పోలీసులకు బెనర్జీని పట్టించాలని గుమ్మం వైపు పరుగెత్తాడు. అది చూసిన బెనర్జీ, "ఆగు!" అంటూ అరచాడు. భీముడు ఆగలేదు. తలుపు గొళ్ళెం తీయబోయాడు.

బెనర్జీ చేతిలోని తుపాకి భయంకరంగా గర్జించింది. భీముడు నిర్జీవంగా నేలకూలాడు.

కొయ్యబారిపోయారంతా. చండిక, అపర చండికే ఐంది. ఆగ్రహం, ఆవేశం ఆమెను పెనవేసుకున్నాయి. చేతి కందిన కత్తిపీట తీసుకుని ఆడపులిలా బెనర్జీ పైకి లంఘించింది. ఏం జరుగుతోందో గ్రహించే లోపునే అతని చేతిలోని తుపాకీని ఎగురగొట్టింది. కత్తిపీటకున్న పదునైన కత్తితో అతని కడుపులో పొడిచింది. ఊహించని ఆ దాడిని తట్టుకోవడం కష్టమైంది బెనర్జీకి. అతను తేరుకునే లోపునే కత్తిని అతని గుండెల్లో బలంగా దించింది ఆమె. శక్తి ఏదో ఆవహించినట్టు ఊగిపోతూన్న ఆ పిల్ల బలం ముందు అతని పెనగులాట పనిచేయలేదు.

"ఒరేయ్! ఇంకా ఎందరు అమాయకుల్ని బలి తీసుకుంటార్రా మీరు? మీకు మేము ఏం అన్యాయం చేసామనిరా?" మిగతావాళ్ళు  దిగ్బ్రాంతితో అవాక్కై చూస్తూంటే, అరుస్తూ కత్తిపీటతో బెనర్జీ శరీరాన్ని చీల్చి చెండాడింది చండిక. బెనర్జీ రక్తపు ముద్దలా కుప్పకూలిపోయాడు.

చండిక తల్లి తలుపు తెరవడంతో పోలీసులు బిలబిలమంటూ లోపలికి పరుగెత్తుకొచ్చారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన బెనర్జీని, చేతిలో కత్తిపీటతో ఒళ్ళంతా రక్తంతో భద్రకాళిలా నిల్చున్న చండికనూ చూసి విభ్రాంతికి గురయ్యారు.

"ఎన్నో ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతూన్న ఈ మృగాన్ని చంపి సమాజానికి మేలు చేసావు నువ్వు. నీ ధైర్యసాహసాలకు జోహార్లు!" అన్నాడు కోబ్రా కమాండర్.

"వీడి తలమీద పాతిక లక్షల బహుమతి ఉంది. ఆ సొమ్ము నీకే దక్కేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తాను".  

జవాబుగా కత్తిపీట క్రింద పడేసి చేతులు జోడించింది చండిక. "మాకు లక్షలూ వద్దు, కక్షలూ వద్దు దొరా! అటు అన్నలతోను, ఇటు పోలీసోళ్ళతోను విసిగి వేసారిపోయాం మేమంతా. దయచేసి మా జోలికి రాకండి మీరెవరూ. అడవి బిడ్డలం మేం. అమాయక జీవులం. ఈ అడవిలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి" అంది మానసిక, శారీరక అలసటతో నేలపైన చతికిలబడుతూ.

ఎంతో ఎత్తులో కనిపిస్తూన్న ఆ టీనేజ్ పిల్ల వంక అయోమయంగా నోరు తెరచుకుని చూసాడు కమాండర్.

మరిన్ని కథలు
parugupamdem