Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - డా.ఎ.రవీంద్ర

విజయం వైపు పయనం

మనిషి జీవితమే ఓ ప్రయాణం. పుట్టుక నుంచి మరణం వరకు సాగే ప్రయాణం. ఇదా ప్రపంచం సినిమాలో బండెళ్లిపోతుంది రన్నయ్య.. బతుకు బండెళ్లిపోతుంది రన్నయ్యా అని పాడతాడు రైల్లో ఓ యాచకుడు. పుట్టుకకు, చావుకు మధ్య ఉన్న చిన్న జీవితంలో ఆశలు, ఊహలు, ఆనందాలు, అనుభూతులు, ఆర్భాటాలు... లాంటివి ఎన్నో. కానీ పుట్టుకకు ముందు, మరణానికి తర్వాత మనిషి గురించి ఎవరికీ ఏమి తెలియదు. కానీ ఈ మధ్యలోనే ఈ తతంగ మంతా... బాల్యం తల్లిదండ్రులు, చదువు, ఆటపాటలతో సాగిపోతుంది. యవ్వనం మాత్రం చదువు పూర్తి అవ్వడం, మానసిక పరిణత, ఉపాధికోసం ప్రయత్నించడం, పెళ్లి, పిల్లలు... ఇలా ఇక తర్వాతి దశ పిల్లలకు పెళ్లిళ్లు. వృద్ధాప్యం. ఇతరుపై ఆధారపడడం, ఆపై మరణం. ఈ జీవనబాటలో యవ్వనమే కీలకదశ. మనిషిని తీర్చిదిద్దేది, వ్యక్తిత్వాన్ని ఏర్పరచేది. గౌరవం తెచ్చేది. లేదా కిందపడేసేది. కష్టాల పాలు చేసేది. అందుక యవ అంటే... జీవితంలో అంత ప్రాధాన్యం.

లక్ష్యం ఎంచుకోవాలి ఇలా

మీరు సెవన్త్ క్లాసు చదువుకున్నప్పుడో, పదో తరగతిలో ఉన్నప్పుడో మీకున్న ప్రతిభను గుర్తించాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. యవ్వనంలోకి అడుగు పడేటప్పుడే అది బయటపడుతుంది. మీరు రచయిత కావచ్చు, సింగర్ కావచ్చు, ఏరోనాటిక్ ఇంజినీర్ కావచ్చు లేదా పెద్ద ఫిలాసఫర్ కావచ్చు. దీనికి సంబంధించిన మొగ్గలు యవ్వనపు తొలి రోజుల్లోనే మీ మదిలో విచ్చుకుంటాయి. వాటికి అనుగుణంగానే మీరు మీ మీ లక్ష్యాలను ఎన్నుకోవాలి. అదే సమయంలో ప్రజెంట్ సొసైటీని మర్చిపోకూడదు. దాని డిమాండ్ ఎలా ఉఁంది, చదివిన తర్వాత భవిష్యత్ ఎలా ఉంటుంది... అన్న దానిని గమనించాలి. అంటే... మీ లక్ష్యం ప్రెంజట్ సొసైటీకి అనుగుణంగా నిర్ణయించుకోవాలి. మీ తల్లిదండ్రులు చెప్పారని, మీ ఫ్రెండ్ చదువుతున్న కోర్సనీ, బాగా సంపాదించొచ్చని లక్ష్యాన్ని నిర్ణయించుకోకూడదు. మనసును, లక్ష్యాన్ని సమన్వయించుకోవాలి. ఎవరో బలవంతంగా పలానా కోర్స్ చెయ్యి అంటే చెయ్యడం కాదు. మీ మనసుకు నచ్చి, దాని పూర్వాపరాలు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఐఎఎస్ కావాలనుకుంటే... బి ఎఫ్ ఎ (బ్యాచరల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్) చదివితే కష్టం కదా...

లక్ష్యం వైపు అడుగులు

లక్ష్యం నిర్ణయించుకున్నాక ప్రణాళికలు రచించుకోవాలి. మీరు చదివే కోర్సు ఎక్కడ బాగా ఉంది. ఎంత ఖర్చు అవుతుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎంతకాలం ఆ కోర్సు ఉంటుంది. చదివిన వెంటనే్ ఉపాధి దొరుకుతుందా.. ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి అన్నీ ఆలోచించి తొలి అడుగులు వేయాలి. మీ కిష్టమైన కోర్సులో, వృత్తిలో చేరిన తర్వాత వెను తిరిగి చూసే అవకాశం మీ మనసు మీకు ఇవ్వదు. ఇష్టం కాబట్టి ఆ పనిని మనసుతో చేస్తారు. నిబద్ధతతో, ప్రేమతో చేస్తారు. దాంతో తొలి వరుసలో మీరే ఉంటారు. అలాగని కష్టపడే తత్త్వాన్ని వదిలి వేయకూడదు. లక్ష్యాన్ని చేరాలంటే మెట్లు ఎక్కాలిసిందే... ప్రతి మెట్టులో తొలి అడుగు మీదే అయితే ఆ మజానే వేరు. చదువైనా, కళైనా.. మీరే ముందు ఉండేలా కష్టపడాలి. ప్రతి పనిని విభజించుకోవాలి. సంవత్సరానికి, నెలకు, వారానికి, రోజుకు... ఇలా పనిని విభజించుకోవడం వల్ల ఎప్పటికప్పుడు నిర్దేశిత లక్ష్యం చిన్నదై, సులభంగా ఉంటుంది. అనేక చిన్న విజయాలు కలిస్తేనే కదా పెద్ద విజయం వరించేది. చిన్నచిన్న విజయాలు సాధించినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఉత్సాహం వస్తుంది. తర్వాతి లక్ష్యానికి అదే మిమ్మల్ని చేరుస్తుంది.

ఒడిదుడుకులు, ఒత్తిడులు సహజమే...

చీమైనా ఆహారాన్ని సంపాదించుకోవాలంటే అనేక కష్టాలను బరిస్తుంది. ఎంతో శ్రమించి, ఆహారాన్ని నిల్వచేసుకుంటుంది. మరి మనుషులమైన మనం, లక్ష్యాన్ని నిర్ణయించుకొని... సాగిపోతున్నప్పుడు ప్రయాణం సాఫీగా సాగాలని ఏమీ ఉండదు. విజయం వైపు సాగే ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉంటాయి, సముద్రాలు, పర్వతాలు అడ్డువస్తాయి. ఒక్కోసారి సాయం అందించే చేయి కూడా కరువవుతుంది. ఒంటరిగా సముద్రపు మధ్యలో నిలబడి పోతారు. అప్పుడు మీకు మీరే చుక్కాని, మీ ఆలోచనలే మీకు మార్గం కావచ్చు. కానీ నిరాశ పడకూడదు. ఎంచుకున్న లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేయకూడదు. సమయానికి డబ్బు అందలేదని కోర్సును ఆపేయకూడదు. మద్యంతర మార్గాన్ని అన్వేషించాలి. రెండు సబ్జెక్టులు ఫెయిలయ్యామని ఇంటికి వచ్చేయకూడదు. ఎంతో కష్టపడి రాసిన రచనకు గుర్తింపు రాలేదని రచనలు చేయడం వదిలేయకూడదు. మీకంటే ఆ రంగంలో ముందున్న వాళ్లు మీ కన్నా కష్టపడి ఆ స్థాయికి వచ్చి ఉంటారు. అడుగు వెనక్కు పడితే అక్కడే మీ పతనం మొదలైనట్లే... లక్ష్యం ఎన్నుకున్నాక, ఒత్తిడులు, ఒడిదుడుకులను ఎదుర్కొవాలిసిందే... అందుకే మీ మనసును అందుకు ముందే సిద్ధం చేయండి.

విజయానికి చేరువలో...

ఒక్కొక్కరి జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి. తెల్లవారితే ఓ అద్బుతమైన ప్రపంచం వారి ముందు ఆవిష్కారమవ్వాలి. కానీ ఆ రాత్రే జరగరాని సంఘటన జరిగి అంతా కిందు మీదు అవుతుంది. తెల్లావారి విచ్చుకొని పరిమళాన్ని పంచాలనుకున్న మల్లె పువ్వు, గాలివాన వచ్చి ఆ రాత్రే రాలిపోవచ్చు. పరీక్షకు వెళ్తూ... మధ్యలో ఏదో అవాంతరం జరిగి మీరు సమయానికి వెళ్లకపోవచ్చు. సంవత్సరం అంతా కష్టపడిన చదువు వృధా అవ్వొచ్చు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు ఎన్ని సార్లు ఫెయిలయ్యి ఉంటోరో మీరు ఊహించగలరా.. మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రకాల ఉద్యమాలు చేయాల్సి వచ్చిందో కదా... అంతే... లక్ష్యం ఏదైనా మీ వెంటపడి, మీ ఒడిలో వాలదు. మీరు ప్రేమించే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, కావాలనుకునే ఉద్యోగం అయినా, ఎవరెస్ట్ శిఖరం అయినా... తుది చేరే వరకు నమ్మకం చెప్పలేం. అందుకే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అని కృష్ణశాస్త్రి రాసినట్లు... ఊహల్లోకి వెళ్లకూడదు. ఎందుకంటే... విజయానికి చేరువలోనే కష్టాలు, ఓటములు పొంచి ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి. ముందు సాగాలి.

విజయం ఒక్కసారి సొంతమైతే...

లక్ష్యాన్ని సాధించాక, ఒక్కసారి విజయం సొంతమయ్యాక ఆ ఆనందమే వేరు. కష్టాన్ని మొత్తం మర్చిపోయాం అని  లక్ష్యాన్ని సాధించిన వాళ్లు చెప్తుంటారు. కాని విశ్లేషకులు మాత్రం వేరే విధంగా చెప్తారు. ఒక్కసారి విజయం సాధించిన తర్వాత, ఆ రుచిని అనుభూతి చెందిన తర్వాత మరో విజయంకోసం ప్రయత్నిస్తారు మనుషులు. అది మానవ నైజం. ఉద్యోగం వచ్చాక, అంతకంటే బెటర్. అదీ వచ్చాక దానికంటే బెటర్. కోర్కెలకు, విజయాలకు పరిమితి అంటూ ఉండదు. ఒక సినిమా రిలీజై సక్స్ స్ అయితే మరో సినిమా తీయడానికి సిద్ధం అవుతాడు డైరెక్టర్. ఒక రచన గుర్తింపు పొందాక, అంతకంటే మంచి రచన చేయడానికి పూనుకుంటాడు రైటర్. అంటే విజయానికి పరిమితి, పరిధులు ఉండవు కదా... అదో జలపాతం... తేనేటి విందు... మునిగే కొద్దీ, తాగే కొద్దీ కావాలి కావాలి అంటుంది మనసు. అందుకే ఎప్పుడూ విజేత ఒక్కరున్నా, విజయాలు ఒక్కటే ఉండవు అనేది నిజం. మనిషి మరణించే వరకు విజయాలు కావాలనే కోరుకుంటాడు. పరుగెడుతుంటాడు. సాధించాలని తపిస్తుంటాడు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని విజాయాలు ఉంటాయి. 

మరిన్ని శీర్షికలు
jyotishyam vignaanam