Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: ఎయిర్ పోర్టులో ఏడ్చుకుంటూ కాకుండా, సంతోషంగా నవ్వుతూ ‘బై’ చెప్పాలి  నాన్నకు  అని వాళ్ళిద్దరికీ  చెపుతుంది చంద్రకళ వాళ్ళ అమ్మగారు.  భూషణ్ అంకుల్ వాళ్ళింట్లో జరిగిన విషయాన్ని అంబుజ చంద్రకళ అమ్మగారికి చెపుతుంది. ఆ విషయాన్ని విన్న చంద్రకళ అమ్మగారు, చాటుగా వింటున్న చంద్రకళ,ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ తరువాత..

ప్రోగ్రాం మొదలైంది... అమ్మవారంటే ఉన్న ఓ పవిత్ర భావం నుండి – ఓ కొత్త ఉత్సాహం తోచింది.  “దేవిస్తోత్రమాలిక’ లోనివిఆణిముత్యాల్లాంటి డాన్సులు ఇవన్నీ,” అంటుంది అమ్మ..

క్రౌర్యం చూపిస్తూదేవిస్తోత్రం,  సౌకుమార్యం - సోయగం జాలువారుతున్న వధువుగా ‘ఆండాళ్  స్వప్నం’,  శ్రీనివాసుని మురిపిస్తున్న అలిమేలుగా ‘చక్కనితల్లికి చాంగుభళా’.. – ఇలా నర్తించడం ఓ అద్భుతమైన అనుభూతిగా అనిపిస్తుంది..

ప్రతి  పదాన్ని అనుసరిస్తూ,  భావాలతో మమేకమై ఉత్సాహంగా నాట్యం చేస్తున్నాను........

 
రెండు గంటల సేపు సాగిన ప్రదర్శనలో, “అయిగిరినందిని  శ్లోకం,  తారంగం, హిమగిరి తనయే కీర్తన,చక్కని తల్లికిచాంగుభళా హైలైట్స్,” అన్నది అమ్మ, ప్రోగ్రాం అయ్యాక.  

“ప్రేక్షకులు  కరతాళధ్వనులతో  హోరెత్తించారు.  తమ అభిమానాన్ని తెలిపారు,” అని కూడా అన్నది.

**

ప్రోగ్రాం అయ్యాక,స్టేజీ మీద నన్నుకలిసి, అభినందించి ఫోటోలు, ఆటోగ్రాఫులు తీసుకున్నవాళ్లు కాక,  నాకోసంగ్రీన్ రూం ఎదుట వెయిట్ చేస్తున్న మరికొందరిని కలవగలిగాను.దుర్గాదేవిగా నేను చేసిన ‘మహిషాసురమర్ధిని’  ఘట్టం తమకి చాలా నచ్చిందని, చూస్తున్నంతసేపు  భక్తితోగగ్గుర్పాటు  కలిగిందన్నారు. 

వారిలో ఓ పెద్దామె నా వద్దకు వచ్చి,ఎర్రని దుస్తుల్లో దుర్గాదేవిలా ఉన్నాననంటూ, నాకు నమస్కరించింది.

“అయ్యో, అది చిన్నపిల్ల.  మీరు పెద్దవారు. ఆశీర్వదించడమ్మా,”  అంది ఆవిడ చేతులు పట్టుకొని అమ్మ.

అంతలో నీరూఆంటి, అంకుల్ వచ్చారు. “చిన్నారి దేవతే!  దుర్గాదేవిగానిజంగానే బాగా చేశావురా కళా, నిన్ను అలా చూస్తుంటే, నాకళ్ళల్లో నీళ్ళు తిరిగాయమ్మా,”  అన్నారు భూషణ్ అంకుల్. 

“అవును, కాస్ట్యూమ్ కూడా చాలా అందంగాఉంది. ఇంటికి వెళుతూనే దిష్టి తీయండి శారద,” అంది నీరూఆంటి.

**

చూసి, మాట్లాడాలని వస్తున్న జనం ఎక్కువుగా ఉన్నారని,  ప్రస్తుతానికి మేము ఆడిటోరియం నుండి నిష్క్రమిస్తే మంచిదన్నారు,  రావుగారు.భూషణ్ అంకుల్ నన్ను ఇంచుమించు పరిగెత్తించినట్టే జనంలో నుంచి కారు వద్దకు తీసుకెళ్ళారు.

**

ఆ మరునాడు సిటీ న్యూస్ పేపర్స్ లో, మంచి రీవ్యూలతో పాటు కాస్ట్యూమ్స్ ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ డాన్స్ ఫోటోలు పబ్లిష్ అయ్యాయి....  న్యూస్ క్లిప్స్ కలెక్ట్ చేసి, అంకుల్ పంపారు.  ఈ వారమంతా కేబిల్ టి.వి చానల్స్ వాళ్ళు నా ప్రోగ్రాం రిలే చేస్తారని, ‘సిటీ రౌండప్’ లో టెలికాస్ట్ చూడమని కూడా చెప్పారు.

‘కూచిపూడి నృత్యానికి వన్నెలద్దిన యువనర్తకి  చంద్రకళ’

అని, ఓ తెలుగు పేపర్ లో హెడ్లైన్స్ వేస్తే,

‘ఇంతటి పిన్నవయస్సులో అతిక్లిష్టమైన హావభావాలకి అద్దంపట్టిన అభినయం...

అందమైన శరీర సౌష్టవంతో,  చంద్రకళ మేటి నర్తకిగా ముందుకు దూసుకుపోగలదు’...   

అంటూమరో పేపర్లో రాసారు.  బ్రహ్మాండమైన రీవ్యూస్ రాసారని మురిసిపోయింది అమ్మ..

**

ఎప్పటిలా ఏడింటికి నాన్న ఫోన్ చేసారు.  ప్రోగ్రాం గురించి అడిగారు.

“అందరూ దాన్ని దేవత అని పొగిడేస్తున్నారు.  బాగానే చేసింది.  కాస్ట్యూమ్ లో పొందికగా, నిజంగానే నా దిష్టే తగిలేలా ఉందనుకోండి,”  అంది అమ్మ.

అమ్మ మాటలు,  ప్రేక్షకుల నుండి అంతటి స్పందనకి కారణం - ప్రత్యేకంగా ‘అమ్మవారి’ పాటలకి  కూర్చిన నృత్యాలు చేయడమేననిపించింది. ‘ఇకనుండి అమ్మవారి నృత్యాలే ఎక్కువ నేర్చుకోవాలి’..అనుకున్నాను.

“ఇదిగో నాన్నతో మాట్లాడు,” ఫోన్ అందించింది అమ్మ.

“ఏమ్మా కళా,  అలిసిపోయావా?  ప్రోగ్రాం బాగా జరిగిందటగా.  అమ్మవారిలా కళకళ లాడిపోయావని చెబుతున్నారంట  అందరూ.  టి.వి వాళ్ళ నుండి డి.వి.డి తెప్పించమని అంకుల్ కి చెప్పు,” అన్నారు నాన్న.

“అలాగే చెబుతాను.... నువ్వెప్పుడు వస్తున్నావు నాన్నా?  అడిగాను.

“ఇంకా త్రీ మంత్స్ ఓన్లీ... త్వరగా అయిపోతాయి.  ఓకేనా? ఐ మిస్ యు తల్లీ.... ఒకసారి వినోద్బాబుని పిలువు,” అన్నారు నాన్న.

**

శనివారండాన్స్ క్లాస్ అయ్యాక, నా ఫేవరెట్ కర్రీస్ తో లంచ్ చేసేసి, టి.వి చూస్తున్న అమ్మ పక్కన చేరాను.వినోద్, మీనాక్షితో కేరంబోర్డ్ ఆడుతున్నాడు.

“క్లాస్ నుండి వచ్చినప్పుడు, మాస్టారుగారు ఏదో కవర్ ఇచ్చారన్నావు! కవర్ ఏది చంద్రా?” అడిగింది అమ్మ.

పరుగున వెళ్ళి, నా రూంలో ఉంచిన కవర్ తెచ్చిచ్చాను.

కవర్ వోపెన్ చేసి, లోనుండి పేపర్స్, ఓ బ్రోష్యూర్ తీసింది.

కొన్ని తెలుగులో  కొన్ని ఇంగ్లీషులో ఉన్నాయి.

చదివి,తనే విషయం చెబుతుంది కదానిటి.వి చూస్తూ వెయిట్ చేసాను.

ఎంతసేపైనా, అలా చూస్తూ చదువుతూ ఉండిపోయిన అమ్మని, చేయి పట్టి లాగాను. 

“పెద్దగా చదువు.  ఏమిటది?” అడిగాను.

“ఇదిగో ఒక్క నిముషం.ఈవిడ ఫొటోని చూస్తుండిపోయాను. ఎంత అందంగా ఉంది - తేజశ్విని మేడమ్! ఆవిడ తన అకాడెమి తరఫున డాన్స్ ఫిలిం తీస్తుందట,” అంది అమ్మ తన చేతిలోని పేపర్స్ వంకే చూస్తూ..

“ఏదీ చూపించు,” అమ్మ చేతినుండి తీసుకొని చూసాను.

నిజమే! రెడ్మీద గోల్డ్ చుక్కలున్న సారీ కట్టుకునుంది..  కర్లీ హెయిర్.  చాలా చక్కగా ఉంది.

“ఆమె నవ్వు, ముఖము – కళ్ళు తిప్పుకోలేని ఆకర్షణ,” అంది అమ్మ. 

బ్రోచర్ పైన ఉన్న ఫొటో వంక మళ్ళీ చూసాను... 

‘నన్నుతేజశ్వినిలా  ఉంటానంటారే? నేను అమెలాగా ఉన్నానా?’ అనుకుని నమ్మలేకపోయాను. 

“షి ఇజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఇంతకీ వాట్ ఇజ్ ఇట్ అమ్మా? తెలుగు బ్రోష్యూర్ నువ్వు చదువు వింటాను,” అన్నాను.

చదవడం మొదలు పెట్టింది అమ్మ.....

కూచిపూడి నర్తకి, నటి, తేజశ్విని చేపట్టనున్న ‘రాగం-తానం-పల్లవి’ టెలిఫిలిం చిత్ర నిర్మాణం......వివరాలు......

అమెరికాలో స్థిరపడిన ప్రఖ్యాతకూచిపూడినృత్యకళాకారిణి -తేజశ్విని, గత రెండు దశాబ్దాలగా కళారంగంలో తన కృషికి, ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.

ఆవిడ చేపట్టబోయే టెలిఫిలిం ‘రాగం-తానం-పల్లవి’ నిర్మాణం, వచ్చే యేడాది జనవరిలో

అమెరికాలోకొంతషూటింగ్ జరుపుకుని, మార్చ్ నెలలో భారతదేశంలో అడుగిడుతుంది.

ఈ  టెలి-ఫిలింలో ఓ ముఖ్య పాత్రకి – బాగా నృత్యం చేయగల, పదహారేళ్ళ వయస్సు లోపు అమ్మాయిలకి డిసెంబర్ నెలలో,  చెన్నైలోఆడిషన్స్ జరపబోతున్నారు.  ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోలు, బయోడేటా ఈ క్రింది ఇ-మెయిల్ కి పంపవచ్చు [email protected]

చదవడం ముగించి, వెంటనే లేచి నాన్నకి పోన్ చేసింది.  నాన్న ఆర్మీ హెడ్క్వార్టర్సులో ఉండే సమయం అది.  

“అమ్మయ్యా, దొరికారు.  మీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి,” అంటూ మొదలుపెట్టి, తన చేతిలోని సమాచారమంతా చదివింది అమ్మ.  “మాస్టారు ఈ సమాచారం మనకి పంపారంటే, ఈ ఆడిషన్స్ చెయ్యమనే కదా!సరీగ్గా మన చంద్ర కోసమే అన్నట్టుగా ఉందీ అవకాశం.  ఏం చేయమంటారు? టైంకి మీరు ఇక్కడ లేరు,” అంది అమ్మ.

నాన్నతో కాసేపు డిస్కస్ చేసింది.

“చంద్ర ఇక్కడే ఉంది, మాట్లాడండి,”  అమ్మ ఫోన్ నాకిచ్చింది.

“హలో, నాన్న,” అన్నాను.

“ఏమ్మా కళా, ఎలా ఉన్నావు? అడిగారు.

“బాగున్నా.  నేను తేజశ్విని మేడమ్ ప్రాజెక్ట్ కి ఆడిషన్స్ చేస్తాను నాన్నా.  ఓకే నా? అడిగాను.

“నీకు ఆసక్తి ఉంటే తప్పక చేయమ్మా.  నీ మేనేజర్, భూషణ్ అంకుల్ ఉన్నారుగా! ఆయనకి ఈ పేపర్స్ ఇచ్చి, ఏర్పాటు చేయమను.  కాకపోతే నీ స్కూల్ కి అడ్డం రాకుండా ఉండాలి మరి,” అన్నారు.

**

ఫోన్ పెట్టేసి, “అమ్మా, భూషణ్ అంకుల్ నా మేనేజరా? నాన్న అలా అంటున్నారే,” అడిగాను.

నవ్వింది అమ్మ.

“అంతే కదా!...అంకుల్ చాలా హైక్లాస్ మేనజర్ నీకు. అయినా గమ్మత్తుకి అన్నారులే నాన్న,”  మళ్ళీ నవ్వింది.

**

మరునాడు ఆదివారం డాన్స్ క్లాసుకి పేపర్లు తీసుకుని నాతో పాటుగా వచ్చింది అమ్మ.

“చంద్ర ఆడిషన్స్ కి వెళతానంటుంది మాస్టారు,  మీరేమంటారు?” అడిగింది మాస్టార్ని.

“నా పూర్తి ఆశీర్వాదం, సహకారం ఉంటుందనే అంటాను.  ఈ ఫిలిం చేయడం, మన చంద్రకళ కళా జీవితంలో ఓ మైలురాయే అవుతుంది.  అదికాక  తేజశ్విని వంటి కళాకారిణితో, చంద్రకళ కలయిక మంచి భవిష్యత్తుకి నాంది అని అనుకుంటాను,”  అన్నారు ఆయన నా తల మీద చేయుంచి ఆశీర్వదిస్తూ...

“తేజశ్వినితో  మాట్లాడి, ఆడిషన్స్ కి వీళ్ళని తయారు చేస్తానులేమ్మా,” అని కూడా అన్నారు.

**

క్లాస్ అయ్యాక,  లంచ్ చేసి, అమ్మతో కలిసి భూషణ్ అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాము. 

పేపర్స్ అన్నీ పరిశీలించి,  “బాగుందమ్మా,  మంచి ప్రాజెక్ట్ లా ఉంది.   నృత్యకళకి ప్రాధాన్యత కాబట్టి,  మనకి కరెక్ట్... ఇవాళ నవంబర్ పదో తేది.  మరి నీ మేనేజర్ గా, నేను వెంటనే నీ బయోడాట, పిక్చర్స్ వారికి అందేలా చూస్తానమ్మా, కళా,” అన్నారు భూషణ్ అంకుల్.  

నేను అమ్మ వంక చూసాను.  అమ్మ నవ్వింది.

“నీరూ, మాకు కాఫీ, కళకి జ్యూస్ ఉంటుందా? అలాగే రాణీని కూడా ఆ ఫోన్ పెట్టేసి రమ్మను,” అన్నారు అంకుల్ ఆంటీతో.

“అయ్యో, ఎందుకుండదు?  మీ ఇద్దరికీ - కాఫీ, చంద్రకళకి ఏదైనా స్వీట్ ఇప్పుడే తెస్తా,”  అని, రాణీ కోసం పిలుస్తూ ఆంటీ లోనికెళ్ళింది.

“కూచిపుడి  నర్తకి  తేజశ్విని అంటే ఈవిడన్నమాట,  పేరు వినడమే కానీ చూడలేదు.  అమెరికాలో ఉంటూ నృత్యకళకి ఆమె చేస్తున్న కృషి  మెచ్చుకోతగ్గది.  ఈ ప్రాజెక్ట్ లో చంద్రకళకి అవకాశం వస్తే మాత్రం, స్టూడియో నుండి వాళ్ళకి, ఎటువంటి సహాయం కావాలన్నా చేద్దాము,”  ప్రాజెక్ట్ గురించిన పేపర్లు చూస్తూ అంకుల్....

ఆయన మాటలు వింటూ, కాఫీ టేబిల్ మీదున్న మాగజీన్ అందుకున్నాను...

**

నీరూఆంటీ అందరికీ ఫ్రెష్ ఫ్రూట్ సర్వ్ చేసింది.  “రాణిని రమ్మన్నావా? ఈ టెలిఫిలిం గురించి చెబుదాము.  కొంచెం ఇన్స్పైర్అవుతుంది,” అన్నారు అంకుల్ ఆమెతో....

“వస్తుందిలెండి.  ఇందాకేచెప్పాను.  మన జగదీష్ తోనే ఫోన్మాట్లాడుతుంది.  విసిగిస్తే, మళ్ళీ గొడవ చేస్తుంది,” అంది ఆంటీ.

మా వంక చూసి నవ్వారు అంకుల్...”పిల్లల పెంపకం కష్టం శారదగారు... పాట వల్ల, ప్రోగ్రామ్స్ వల్ల కాస్త కుదురు వచ్చింది రాణికి.  క్లబ్బులు, డిస్కోలు తగ్గాయి.  మీ నుండి, కళ నుండి సాంప్రదాయం, పద్ధతి  కూడా అంటుతాయని  అనుకుంటున్నాను.  ఈ మధ్య శనాదివారాలు ఇలా గంటల తరబడి ఫోన్లో మాట్లాడ్డానికి ఇంటిపట్టునేఉండిపొతుంది.  జగదీష్ స్నేహంతో, మరికాస్త కుదురు వస్తుందని ఆశిస్తున్నాము,” అన్నారాయన. 

రాణి గురించి మాతో, అంకుల్ అలా చెప్పడం ఏమిటని ఆశ్చర్యపోయాను.  ఆయన రాణి విషయంలో ఏదో బాధపడుతూనే ఉన్నారని అర్ధమయింది.....

“మీరు మరీ చెప్తారండీ.  గంటల తరబడి మాట్లాడ్డం ఏమిటి...స్పోర్ట్స్ ప్రాక్టీసులతో, జగదీష్ చాలా బిజీగా ఉంటాడట. ఆదివారాలు ఈ టైంకి, ఫ్రీ అవుతాడులా ఉంది.  రోజంతా వెయిట్ చేసి, ఇక ఆ టైంకి మన రాణీయే ఆ అబ్బాయితో  బాతాఖానీ వేస్తుంది... అయినా, జగదీష్ కూడా సరదాగానే చాలాసేపు కబుర్లు చేబుతాడట తనకి,”... అంది ఆంటీ.

సగం తిన్న ఫ్రూట్, చేదుగా అనిపించి, ఆ ఫ్రూట్ కప్పుని బల్ల మీదుంచాను...

‘అయితే, అదన్నమాట సంగతి...... మేము ఎక్కువుగా ఆదివారాలే అంకుల్ వాళ్ళని విజిట్ చేస్తుంటాము... అందుకే రాణి – జగదీషుల ఫోన్ కాల్స్ గురించి తెలుస్తుంది...’

చికాకుగా అనిపించింది. ఎప్పుడెప్పుడు ఇక్కడినుండి బయటపడదామా అనుకుంటుండగానే, చేతిలో ఫోనుతో, రాణి హడావిడిగా కిందకి వచ్చింది. 

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
deathmistery