Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
devuditoprayanam

ఈ సంచికలో >> కథలు >> ఇన్వర్టర్ -

inverter

 బారెడు ప్రొద్దు అవుతుంటే ఇంకా లేవరేమిటండీ?” అంటూ మా ఆవిడ లేపుతుంటే నాకు తెలివి వచ్చింది.  “పిల్లలు కూడా తండ్రిలాగే ఎంత లేపుతున్నా లేవరే..” అంటూ అందర్నీ లేపడం మొదలు పెట్టింది. తను అప్పుడే తలంటు పోసుకున్నట్లు గా ఉంది,  జుట్టు తడి ఇంకా ఆరినట్లు లేదు, అటు ఇటు గబాగబా తిరుగుతున్నట్లు ఉంది,  మొహం మీద చిరు చెమట్లు పట్టి, చెప్పొదూ నాకు ముచ్చటగా అనిపించి, చిలిపిగా  “అలివేణి,  ఇలా రావోయి” అన్నాను..  “ బాగుంది సంబడం అసలే నేను హైరానా పడుతుతుంటే మీకు చీమ కుట్టినట్లు అయినా లేదు.సరసాలకి ఇది సమయం కాదు” అంటూ వంటగదిలోకి వెళ్లింది,కాఫి తీసుకురావడానికి

“సెలవుకదా అని తీరిగ్గా లేవచ్చనుకుంటే ఏమిటి నాన్నగారు మీ అవిడ గోల” అంటూ పిల్లలు విస్సుక్కోసాగారు. అప్పుడే పనిమనిషి రావడం, అమ్మగారు ఆలస్యంగా వచ్చినందుకు విస్సుక్కుంటూ చేయవలసిన పనులు పురమాయించడం జరిగిపోయాయి.  అమ్మగారి ఆజ్ఞతో పనిమనిషి ఎవరు చెప్పినా వినకుండా పక్క బట్టలు సర్దేయసాగింది.  ఇంకా లాభం  లేదనుకుని అందరూ లేచారు.  

మర్చిపోయాను ఇంతకు మా ఆవిడ పడుతున్న హైరానికి కారణం-మా ఇంట్లో ఆ రోజు మా కాలనీ అసోసియేషన్ సమావేశం.  ఎవరికి నొప్పి కాకుండా పోట్ లక్  ఏర్పాటు చేసుకున్నారు, కావలసిన గ్లాస్లు,  కూల్ డ్రింక్స్ తెమ్మని నాకు పురమాయించి,  అందరికీ ఏవో పనులు చెప్పి,  కాలనీ లో పెద్దవాళ్లు వస్తున్నారంటూ మా ఆవిడ తెగ సంతోష పడిపోవడం మొదలు పెట్టింది. క్రిందటిమాటు మిస్సేస్స్ వనజ గారింట్లో ప్లేట్స్ శుభ్రంగా లేవంటూ బేగం బజార్లో కొత్తగా వచ్చిన ఎండు  అరటి ఆకులతో చేసిన ప్లేట్స్ తెమ్మంటే,  రెండు రోజులు కష్ట పడి వెతికి మొత్తం మీద తెచ్చాను.  

ఇది కాకుండా మొన్న లేడీస్ అసోసియేషన్ వాళ్ళు ఆకాశవాణి హైదరాబాద్  ‘వనితావని’  అనే కదంబ కార్యక్రమం ఇచ్చారు, అది ఈ రోజు ప్రసారం అవుతుంది. ఎప్పడినుంచో  మా ఇంట్లో కలవడానికి నిశ్చయించుకున్నారు, అందరూ సరదాగా కార్యక్రమం వినచ్చు అనుకొని ఈ రోజు సమావేశం మా ఇంట్లో అన్నమాట.   కార్యక్రమంలో రెండు పాటలు, చిన్న కథ, మోడరన్ అత్తగారు అనే నాటిక ప్రసారమవుతాయి.  మా ఇంటిలోనే పెట్టుకోవడానికి  ఇంకొక కారణం-ఇన్వెర్టర్; వేసవి కరెంటు కోతలతో విసిగి పోయి నేను ఇన్వెర్టర్ పెట్టించాను.   ఒక వేళ కరెంటు పోయినా అందరూ కలసి ఆ కార్యక్రమాలు  వినడానికి వీలుగా ఉంటుందని నిర్ణయించారు.

ఈ కార్యక్రమం బాగా చెయ్యాలి అని మహిళా మణులు అందరూ తెగ కష్ట పడిపోయారు. ఒక ప్రముఖ రచయిత్రితో చిన్న నాటకం రాయించారు.  ఇచ్చిన టైంని ఎలా వాడుకోవాలని రెండు మూడు రోజుల సుదీర్ఘ సమావేశాల తరవాత మొత్తం కార్యక్రమం నిర్ణయమైపోయింది.

అన్నీ సెలవు రోజులలో ఉదయం జరిగినట్టే,  టిఫిన్ లేదని హోటల్ నుంచి టిఫిన్ కూడా తెమ్మని మా ఆవిడా పురమాయించింది.   మా పనిమనిషికి  “అన్నీ గూళ్ళు దులుపు! ఎక్కడా దుమ్ము కనిపించకూడదు, అన్నీ గదులు సుబ్బరంగా నీట్ గా ఉంచాలని”  ఫర్మానాలు జారీ చేసింది.  అందరూ ఎవరికి  అప్పచెప్పిన పనులు వారు చెయ్యడానికి తయారయ్యారు. బజారు నుండి కావలసినవన్ని తెచ్చి స్నానం చేసి నేను రెడీ అయ్యాను.  చెప్పడం మర్చిపోయా  ఆ రోజు మేమందరం ఏమి డ్రెస్ వేసుకోవాలో కూదా మా ఆవిడ నిర్ణయించేసింది. ఆఖరికి పనిమనిషితో సహా అందరూ వచ్చేలోగా తయారు కావాలని తాఖీదు.

పదకొండు గంటలయ్యేసరికి ఒక్కరొక్కరే రావడం మొదలయ్యింది.  మొట్టమొదట చక్రపాణి దంపతులు వచ్చారు.  చక్రపాణిగారికి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే మహా సరదా. అవతలవాళ్ళు పడే పాటలో ఒక్క ముక్క అర్ధం కాకపోయినా రెచ్చిపోయి కర్ణాటక రాగాల తాళం వేసేస్తూ ఉంటారు. హలో అంటూ అందరిని పలకరించి అయన ప్రపంచంలోకి వెళ్ళిపోయారు.  ఒక్కరు తర్వాత ఒక్కరు  రావడంతో,   చూస్తూ ఉండగానే ఇల్లు అంతా నిండి పోయారు.  ప్రతి వాళ్ళు ఎదో ఒకటి తీసుకురావడంతో మా డైనింగ్ టేబుల్ నిండి  పోయింది.  వాళ్ళు తెచ్చినవన్నీ చిన్న గిన్నేలలోకి సర్దడం మా పిల్లల డ్యూటీ .

మా ఆవిడా హడావిడి ఇంతా అంతా కాదు, ఇల్లంతా కలియ తిరుగుతు హడావుడి పడిపోతోంది. వచ్చిన వారందరితో పలకరింపులు, కుర్చీలు చూపిస్తూ, మంచి నీళ్ళు కావాలా అంటూ అందరికి మర్యాద బాగా చేసింది.   కొత్తగా  కాలనీ లోకి వచ్చిన వాళ్ళకి,  మా వారు,  పిల్లలు అంటూ పరిచయం చేసింది.   ఇంకా మా అతిధులు అంటారా,   మా ప్రపంచమే వేరు అంటూ రావడం ఆలస్యం,  పాలిటిక్స్, స్పోర్ట్స్ మీద డిస్కషన్స్. భారత్ క్రికెట్ వరల్డ్ కప్లో ఎందుకు ఓడిపోయింది ఇలాంటివి.  ఒక అయన వాళ్ళ అమ్మాయి క్రితం వారం పంపిన సెల్ ఫోన్ లో పాటలు వినడం మొదలు పెట్టాడు. నాకు తరవాత తెలిసింది అయన పాటలు వినడం కాదు, కొత్తగాచెముడు వచ్చింది, ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని  ఇయ్యర్ ఫోన్ వాడుతున్నరుట.   ఇంకొక అయన ఫ్లిప్ కార్ట్ లో పుస్తకం ప్రింటింగ్ కి ముందరే ప్రీ ఆర్డర్ చేసి తెచ్చుకున్న నవల వేరే వారి ప్రమేయం లేకుండా చదువు కొనడం మొదలు పెట్టాడు.  మరి ఇక్కడ చెప్పడం భావ్యం అవునోకాదో నాకు తెలియదు; మా వీధిలో సుబ్బారావు గారు మాత్రం ఎవరినీ నొప్పించకుండా, కాఫీ తగిన తరవాత టైం వేస్ట్ చేయడం ఎందుకు అని అనుకున్నారేమో రామకోటి రాయడం మొదలు పెట్టారు.

అందరూ వచ్చిన తరవాత నేను చెయ్యవలసిన పని ఐపాడ్ లో ఫోటోలు తియ్యడం.  మా పెద్దమ్మాయి కెమెరా లో ఫోటోలు తియ్యడం.   రెండు రోజుల ముందరే బాటరీలు బాగా ఉన్నాయా లేవా అని చూసుకున్నాము.  పలకరింపులు అయిన తర్వాత కూల్ డ్రింక్స్, కాఫీ తాగుతూ ఆ వారం రాజకీయ, సమాజిక, సినిమా కబుర్లు వగైరాలలో అందరూ మునిగిపోయారు .  సరే ఎవరి అభిప్రాయాలూ వారివి విశ్లేషణ వేడి గాను వాడి గాను జరిగి పోతున్నాయి. 

ఇంతలో జానకిరామయ్య గారు అని అయన కాలనీలో  కాస్త సుశాస్త్రియంగా పాడుతూ ఉంటారు. సామూహికంగా కాలనీ లో జరుపుకునే  పండగలకి  పబ్బాలకి అయనే మాకు దిక్కు. ఒక విధంగా చెప్పాలంటే మా కాలనీ నిలయవిద్వాంసుడు.  వచ్చిన చిక్కు ఎక్కడంటే ఒక మారు పాట అందుకుంటే వాటికీ తోడూ రెండు మూడు పాటలు పాడనిదే అయన అస్త్రసన్యాసం చెయ్యరు.  ఆ రోజు గట్టిగా  టిఫిన్  లాగించారేమో మొదలు పెట్టడమే అన్నమయ్య కీర్తన అందుకున్నారు.  పైకి అందరూ నవ్వుతూ ఉన్నా లోలోపల “ఈయనికి ఒక సమయం పాడు  ఉండదు ఎప్పుడు పడితే అప్పుడే రాగాలు అందుకుంటాడని” విసుక్కున్నారు.

సోఫాలో కూర్చొన్న హైమావతిగారు వాళ్ళ మనవరాలి పెళ్ళికి వియ్యాలవారి తో కలసి చెన్నైకి వెళ్లి  పోతీస్ లో కొన్న చీరల గురించి, రంగుల గురించి, ధరల గురించి, అక్కడికి ఇక్కడకి ధరలలో ఎంత వత్యాసాలు ఉన్నాయో  చెబుతూ ఉంటే, ప్రక్కనే కూర్చొన్న సుబ్బలక్ష్మి గారికి మండి పోతోంది ఏమి చెయ్యాలో తోచలేదు. ఆవిడా కూడా వాళ్లింట్లో మనమరాలి పెళ్ళికి ఇలాంటి ప్రపోసల్ పెడితే కొడుకు, కోడలు ససేమిరా వద్దు అంటూ  వినుపించుకోలేదు. అది ఆవిడ కోపం.“నాన్న నాన్న అటు చూడు” అంటూ మా అమ్మాయి విశాలాక్షి గారిని చూపిస్తుంటే నేను అటు చూసాను. ఆవిడ భర్త ఒక చిన్న పాటి లీడర్.  నగరం చుట్టూ పక్కల ఉన్న పరిశ్రమల వర్కర్ల యూనియన్లకి లీడర్.  ఆవిడ కొత్తగా గాజులు చేయించుకున్నరానుకుంటాను, మాటిమాటికి చెంపల మీద జుట్టుని సవరిస్తున్నారు.  ఎవరైనా చూడక పోతారా..అనుకుంటూ  కాని ఎవరి  మట్టుకు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, ఆవిడా కాస్త చిన్నబుచ్చుకున్నారు.

మధ్యాహ్నం 12.౦౦  గంటలకి అందరూ తెచ్చుకున్నవి  తినడానికి ఉద్యుక్తులయ్యారు.  మర్చిపోయాను షుగర్ పేషెంట్లకి ప్రత్యేకంగా ఏర్పాట్లు జరిగాయి.  తెచ్చుకున్న వంటకాలలో బాగున్న వాటిని మెచ్చుకుంటూ, బావులేనివి ఎందుకు బాగోలేవో అనుకుంటూ మొత్తం మీద తిండి కార్యక్రమం సజావుగా జరిపించేసేరు . జానకిరామయ్య గారు “ కార్యక్రమం ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది.  బాలమురళీకృష్ణ గారి తత్వాలు వింటారా?” అనడమేమిటి, అందరూ మొగవాళ్ళు దమ్ము లాగడానికి, పాన్ వేస్తుకోవడానికి పారిపోయారు.  కొంతమంది ఆడవాళ్లు పని ఉన్నట్లు వంటింటిలోకి, గదుల్లోకి వెళ్ళిపోయారు. చేసేదేమీ లేక అయన కూని రాగాలు తీయడం మొదలు పెట్టారు.          మధ్యాహ్నం 1.30 కి వచ్చే కార్యక్రమం వినడానికి అందరూ తయారయ్యారు.  సరే రావలసిన సమయం రానే వచ్చింది.  కార్యక్రమంలో ఒక పాట అయిన తరవాత ‘మోడరన్ అత్తగారు ‘ నాటకం పాత్రధారులు వగైరా అనౌన్స్ చేశారు .  ‘ఫట్’ మని కరెంటు పోయింది . గ్రౌండ్ ఫ్లోర్ ఏమో , ఇల్లంతా చీకటి.  నాకు అర్ధం కాలేదు ఇన్వర్టర్ ఉండగా కరెంటు పోవడం జరగదు కదా.

అయ్యో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నా బాగుండు కదా కార్యక్రమం వినేవాళ్ళం, ఇప్పుడు ఏమిటి చేయడం అంటూ అసహనం అందరూ వినేలాగే వ్యక్తం చేశారు.  నాకు మా ఆవిడా వైపు చూడడానికి ధైర్యం చాలలేదు. తనకి కూడా ఏమి జరిగిందో అని అర్ధం కాలేదు.  నిన్నటివరకు బాగా పని చేసిన ఇన్వర్టర్ ఈ రోజే పని చెయ్యకుండా ఉండలా అంటూ తిట్టుకుంది. తన కోసం ప్రత్యేకంగా  తెచుకున్న తెప్పించుకున్న ట్రాన్సిస్టర్లో బ్యాటరీలు   ఉన్నాయో లేదో చూసుకొని ఉండవలసినదని  తెగ బాధ పడిపోయింది.  ఊ....వచ్చిన పని అయ్యింది కదా..... ఇంకా బయలుదేరుదామా” అంటూ అందరూ వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు.  వెళ్లి వస్తాము అంటూ అందరూ నిస్పృహగా వెళ్లారు.  అందర్నీ పంపించి మా ఆవిడా సోఫా లో అలసిపోయి కూలపడి  ..ఎంతో  ప్లాన్ చేసి ప్రోగ్రామం పెడితే ఇలా జరిగిందేమిటి అని చాలా బాధ పడి పోయింది. పోయిన కరెంటు మళ్ళీ వచ్చింది..అసలు ఇన్వర్టర్ ఎందుకు ఆగిపోయిందని చూతును కదా......నాకు నోట్లోనుండి మాట రాలేదు. జరిగింది ఏమిటంటే ప్రొద్దునే దుమ్ము దులపమన్న మా పనిమనిషి ఆ పని చేస్తూ ఇన్వర్టర్ స్విచ్ పొరపాటున అర్పేసింది.  దాంతో  మధ్యాహ్నం వరకు బ్యాటరీ అయిపోవడం ...కావలసిన టైంకి కరెంటు లేకపోవడం ..దీని కారణం ఇది అని మా భార్యామణికి చెప్పడానికి నాకు ధైర్యం చాలక .....మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాను..... ఇన్వర్టర్ మొత్తం మీద కార్యక్రమం అంతా ఇన్వర్ట్ చేసిందే అనుకుంటూ!

మరిన్ని కథలు
krushito nasti dhurbhikshyam