Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vignaanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 సంస్కారమనేది జన్మతహా రావాలి కానీ, దానికి  కులానికీ, మతానికీ, చదువుకీ ఏమీ సంబంధం లేదు. ఏ చదువూలేనివారైనా, చాలా సంస్కారవంతులుగా ఉండేవారిని చూస్తూంటాము. మళ్ళీ ఇందులో సంస్కారమంటే ఏమిటీ అనే ప్రశ్న వస్తుంది. సంస్కారమంటే, మామూలుగా చెప్పాలంటే, మనం చేసేపని, పక్కనున్నవారికి , ఎటువంటి కష్టమూ కలిగించకపోవడం. “కాదూ, నా ఇష్టంవచ్చింది చేసికుంటానూ, జరిగితే నష్టం నాకే గదా, మధ్యలో మీకెందుకూ, “అన్నది సంస్కారహీనంగానే కనిపిస్తుంది. మనం ఓ సభ్యసమాజంలో ఉంటున్నందుకు, అన్నీ కాకపోయినా, కొన్నిటిని అవతలివారికోసంకూడా చేస్తూండాలి.

మళ్ళీ ఈ సంస్కారాలలో,  వివిధరకాలు. తెచ్చిపెట్టుకున్నవి కొన్ని. కొంతమందికి, ఏ హొటల్ కో వెళ్ళినప్పుడు, బేరర్ కి  టిప్ ఇవ్వడం, సంస్కారమనిపించొచ్చు. అవతలివారికి, అది శుధ్ధ వేస్టనిపించొచ్చు. అసలు ఈ టిప్పులూ, గట్రా కొన్ని సంవత్సరాల క్రితం ఉండేవి కావు. తినడానికే కష్టమైన రోజుల్లో, ఇంక  అదనంగా దక్షిణలు ఇచ్చే ఓపికెవడికుంటుందీ? చేతిలో పుష్కలంగా డబ్బులు వచ్చేటప్పటికి, ఈ వేలం వెర్రులు ప్రారంభం అయాయి.. హొటల్ వాడు, బిల్లులో సర్వీసు ఛార్జ్ అని ఒకటి వసూలు చేస్తాడు. మళ్ళీ టిప్పులు ఎందుకుట అంటే  అదో స్టేటస్ సింబల్. హొటల్లో, సామాన్లు రూమ్ములో పెట్టినవాడికి టిప్పులు, ఆసుపత్రులలో ఓ వారం ఉండి బయటకొచ్చేటప్పుడు టిప్పులు, ఏ కారో పార్కింగులోంచి తెచ్చుకున్నప్పుడు టిప్పులు, చివరకి  కొన్ని దేవాలయాలలో, టిక్కెట్టు కొనుక్కుని, పూజలూ, వ్రతాలూ చేయించుకున్నప్పుడు కూడా,  ఆఖరున పురోహితుడు కూడా, కనిపించీ కనిపించకుండా చెయ్యి చాపుతాడు. ఏ ప్ర్రభుత్వరంగ ఆఫీసుకైనా వెళ్ళినప్పుడు, ఆఫీసరు సంతకం చేసినా, దానిమీద ఆ కార్యాలయ ముద్ర వేయాలంటే టిప్పు లేందే పనవదు. ఈ టిప్పుల సంస్కృతి నరనరాలా పాకిపోయింది. ఇవికాకుండా, దసరాకీ, దీపావళికీ మామూళ్ళు సరే సరి.

పైచెప్పినవన్నీ చిన్న చేపలు. ఇంక పెద్దచాపలైతే, స్వయంగా వారు తీసికోకుండా, మధ్యవర్తిద్వారా తీసికుంటారు, ఉదాహరణకి మన రాజకీయ నాయకులు. ఒక ఎలె‍క్షన్ లో నెగ్గాడూ అంటే, పెట్టిన ఖర్చంతా, వచ్చే అయిదేళ్ళలోనూ సంపాదించాల్సిందే. మళ్ళీ బహిరంగసభల్లో మాత్రం నీతీ, నిజాయితీ అంటూ ప్రసంగాలు చేసేస్తూంటారు. చిత్రం ఏమిటంటే, మధ్యమధ్యలో ఏ అన్నా హజారే లాటివారో, ఆందోళనలు చేసినప్పుడు, ఈ నాయకులు కూడా, వారితో చేరి హడావిడి చేయడమూ, పేపర్లలో ఫొటోలు వేయించుకోడమూనూ. ఇది ఓ రకమైన సంస్కారం.

రైలు ప్రయాణాల్లో చూస్తూంటాము, కాలక్షేపానికి, ఏ వేరుశనక్కాయలో, బఠాణీలో తింటూ, ఆ తొక్కలన్నీ అక్కడే కింద పడేయడం. కొన్ని స్టేషన్లలో, తుడవడానికి ఓ కుర్రాడో కుర్రదో వచ్చి ఓ బ్రష్ పెట్టి తుడిచి, ఆ చెత్తంతా ఓ సంచీలోకి వేసికుంటారు. పని అవగానే, పాపం చెయ్యి చాస్తారు, ఓరూపాయో రెండో ఇస్తారేమో అని, అలాటప్పుడు, అసలు తమకేమీ పట్టనట్టుగా, అటూ ఇటూ చూస్తారే  అదో “ సంస్కారం “. మన ఇంటిలో ఉండే చెత్తాచెదారమూ, ఓ చీపురెట్టి తుడిచేసి, పక్కవాడింటిముందుకి  తుడిచేయడం ఓ “సంస్కారం “. అధవా ఏ పెంకుటింట్లో అయినా ఉండే అదృష్టం ఉంటే, మన మురికినీరు వెళ్ళే గట్టరు ని పక్కవాడింటి గుమ్మం వైపు పెట్టేయడం… ఇదో “ సంస్కారం “

రోడ్లమీద వెళ్ళేటప్పుడు, ఏ కారో, స్కూటరో, బస్సో గుద్దేస్తుందని భయపడి, ఉంటే గింటే పక్కనే ఉండే ఫుట్ పాత్ మీద నడవాల్సొచ్చినప్పుడు చూడండి అవస్థ. నగరాల్లో అయితే, వాహన చోదకులు , మరీ ట్రాఫిక్కు ఎక్కువగా ఉంటే, ఫుట్ పాత్ లని కూడా వదలడం లేదు. కర్మకాలి అదే సమయంలో, అదే ఫుట్ పాత్ మీద మనం నడవాల్సొచ్చిందా, అంతే సంగతులు. పోనీ అలాటివేవీ లేకుండా, హాయిగా నడుద్దామా అంటే, ఏ భేల్ పూరీ వాడో, చాయ్ వాడో రోడ్డుపక్కన పెట్టే బళ్ళలో తినే భోక్తలందరూ, అదే ఫుట్ పాత్ మీదుంటారు. మనమైనా తప్పుకుని, కిందకు దిగాలి కానీ, ఆ భోక్తలు మాత్రం ఛస్తే తప్పుకోరు, పానీ పూరీలో పానీ జుర్రుకుంటూ అక్కడే తిష్ఠవేసికుంటారు. ఇవన్నీ కూడా చదువుకున్నవారి   “సంస్కారాలే “ కదామరి.

అలాగే కొందరు తిన్నతిండరక్క బైక్కులమీద జుయ్యిమంటూ వెళ్ళే  spoiled brats  ని చూస్తూంటాము. ఉన్ననలుగురూ ఒకరిపక్కన ఒకరు నడిపిస్తూ రోడ్డంతా ఆక్రమిస్తారే కానీ, పక్క వారికి దారి మాత్రం ఈయరు. ఏదైనా అంటే, వాడి నాన్న, ఏ మునిసిపాలిటీ కౌన్సిలరో, లేదా ఏ కార్పొరేటరో అయుంటాడు. వీళ్ళేమో అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లు కొలుస్తూంటారు. ఇదో అధికారమదంతో వచ్చిన “ సంస్కారం “.

ప్రొద్దుటే కుక్కల్ని  వాటి దినచర్యలకోసం బయటకు తీసికెళ్ళే కొందరు “ సంస్కారవంతుల్ని” చూస్తూంటాము. ఆ కుక్కకి ఏ కారుటైరో చూస్తేనేకానీ, దాని కాలకృత్యాలు తీరవూ, పోనీ అదేదో తన కారుటైరు మీదే పోయించుకోచ్చుగా, అబ్బే, అసహ్యంగా అలా చేస్తామేమిటీ, అనుకోవడం ఓ “ సంస్కారం “

మనం బాగుంటే చాలు, పక్కవాడు ఏ గంగలో దిగినా సరే అన్నదే ఈ రోజుల్లో సంస్కారానికి నిర్వచనంగా మారిపోయింది.. ఎంతైనా పాతరోజులూ, అప్పుడు నేర్చుకున్న నీతిపాఠాలూ అటకెక్కేశాయిగా, పైగా మన శాసనసభల్లోనూ, పార్లమెంట్లలోనూ జరిగే గొడవలు చూడ్డంలేదూ?  యథారాజా తథా ప్రజా…   సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని శీర్షికలు
yuva