Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: ప్రతిమ ఫోనులో సిద్ధార్ధతో  వెబ్ సైట్ రివ్యూలు, వాటి రేటింగుల గురించి మాట్లాడుతుంది.ఆ తరువాత..  

 

మూడు ముక్కల్లో విషయం వివరించింది.  ఆమె చెప్పిన సంగతులు విని అవాక్కయ్యాడు తేజ.

‘‘పదిహేను రోజులుగా ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ చేసుంది. ఎన్ని సార్లు ఎంత ప్రయత్నించినా నో రెస్పాన్స్‌.  అనుమానం వచ్చింది. కామన్‌ ఫ్రెండ్స్‌ని కాంట్రాక్ట్‌ చేస్తే విషయం తెలిసొచ్చింది.  అయిదు లక్షల కట్నంతో పేరెంట్స్‌ చూసిన పిల్ల మెళ్లో తాళికట్టబోతున్నాడు ’’ బలవంతాన కన్నీళ్లూ,  వెకిళ్లూ ఆపుకుంటూ చెప్తోంది. ఆ సమయంలో అతడికి వరలక్ష్మి మాత్రమే కనిపించలేదు. పరికిణీ వోణీల్లోంచి పంజాబీ డ్రస్స్‌లు, జీన్స్‌ దాకా సాగిస్తూ  మోడ్రన్‌ మహాలక్ష్ముల్లా కనిపించే ఈ వరాలలక్ష్ములు ఇంత అమాయకులా? అనిపించిందతడికి.  ఆధునికత వేషభాషల్లో కనిపించినా... నచ్చిన మగాడికి మనసివ్వడంలో ముందూ వెనుకా ఏ మాత్రం ఆలోచించరని మరోసారి తేలిపోయింది. రెండక్షరాల ప్రేమైతేనేం?  అత్యాధునికంగా కనిపించే  ‘ లివిన్‌రిలేషన్‌షిప్‌ ’అయితే నేం... మొదట మోసపోయేది ఆడదే అని నిరూపించింది వరలక్ష్మి. పైకి నవ్వుతూ అమాయకంగా కనిపించే వరలక్ష్మి సహజీవనం సాగించిందా?  ఆశ్చర్యపోవడం తేజా వంతైంది.

‘‘ప్లీజ్‌! ఇవాళ రాత్రికే పెళ్లి. ఎలాగైనా ఆపు చేయించాలి’’

‘‘ఆపు చేయించి...’’

‘‘ఆపు చేయించాలంతే’’ కసిగా అంది వరలక్ష్మి.

ఒకప్పటి కాలేజ్‌ ఫ్రెండ్‌ని కన్వీనియంట్‌గా వాడుకున్నాడా త్రాష్టుడు.  ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి సహజీవనం సాగించాడు.  ఇప్పుడో? లక్షల కట్నం తీసుకుంటూ పేరెంట్స్‌ చూపించిన పిల్ల మెడలో తాళికట్టి మొగుడు పోస్ట్‌ కొట్టేయబోతున్నాడు.  అరే.. . తను పని చేస్తోంది మీడియాలో నన్న స్పృహ కూడా లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆడదాన్ని మోసం చేయడమే తప్పు... అందులో మీడియాలో ఉన్న ఆడదాన్ని ముట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లేనని... ఈ సో కాల్డ్‌ మగరాయుళ్లకు తెలిసిరావాలి... ప్రతిన పూనాడు తేజ.

వరలక్ష్మి అంటే తేజాకి ప్రత్యేకాభిమానం.  తన బులెటెన్‌ చేస్తోందని... తన స్క్రిప్ట్‌కి వాగ్దాటితో వన్నె తెస్తుందని మరింత అభిమానం. అలాంటి అమ్మాయికి మోసం జరిగితే తను ఊరుకోగలడా? ఊహూ!

మోసం చేసిన ప్రియుడికి సంబంధించిన పక్కా ఆధారాలు తెచ్చింది వరలక్ష్మి.  పెళ్లి శుభలేఖ కూడా చూపించింది. ఇక, అప్పట్నుంచీ ఆపరేషన్‌ స్టార్ట్‌ అయింది. పోలీస్‌ కమిషనర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాడు. హుటాహుటిన వరలక్ష్మిని తీసుకుని సీపీ దగ్గరికి వెళ్లాడు తేజ. విషయం వివరించాడు. సీపీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెళ్లి తంతు జరిగే ఊళ్లోని సీఐనిని ఫోన్‌లైన్ లోకి తీసుకుని ఆదేశాలు జారీచేసాడు.

‘‘ఇక్కడికి దగ్గరే కదా! మీరిద్దరూ వెళ్లండి..’’అంటూ పోలీస్‌ ఎస్కార్ట్‌తో ప్రత్యేక వాహనం ఇచ్చి మరీ పంపించాడు సీపీ.

ఆ రాత్రి ఏడుగంటలకు పెళ్లి మండపానికి చేరుకున్నారు తేజ,  వరలక్ష్మి.  మరో మూడుగంటల్లో పెళ్లి. ఆహుతులతో సందడిగా ఉంది కల్యాణమండపం. ‘‘పెళ్లికొడుకెక్కడ?’’ వెంట వచ్చిన ఖాకీలు ఆరా తీసారు. పెళ్లికొడుకున్న గదిని చూపించారెవరో. దోస్త్‌ల తో పేకాట ఆడుతూ ఖుషీ చేస్తున్న పెళ్లికొడుకు పోలీసుల్ని వెంటబెట్టుకుని వచ్చిన వరలక్ష్మిని చూసి  అవాక్కయ్యాడు.ఓ పోలీస్‌ పెళ్లి కొడుకు భుజంపై చెయ్యి వేసి వరలక్ష్మి ముందు నిలిపాడు. పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న వరలక్ష్మి తన కాలికున్న హై హీల్స్‌ని తీసి ఎడాపెడా రెండు చెంపలూ వాయించింది.

ఎవరో ఆగంతకురాలు పెళ్లికొడుకును చావచితక బాదుతున్నారన్న సమాచారం క్షణాల్లో పెళ్లి మండపమంతా వ్యాపించింది. ఒక్కొక్కరుగా గుమికూడారక్కడికి. పెళ్లికూతురు పేరెంట్స్‌ వచ్చారక్కడికి`‘ ‘ఏం జరిగిందం’టూ.

అసలు విషయాన్ని తేజా వివరించాడు వారికి.  ఆవేశం సద్దుమణిగాక... వరలక్ష్మి పెళ్లికూతురి దగ్గరికి వచ్చింది.  ఆమెని చేతుల్లోకి తీసుకుని వలవలా ఏడ్చింది. ‘‘ఈ చేతుల్తోనే అతడ్ని కౌగిలించుకున్నాను.  ఇదే నోటితో ప్రేమగా పిలిచాను. కానీ... ఇప్పుడు ఈ చేతుల్తోనే అతడ్ని చితకబాదాను. ఎందుకో తెలుసా? నన్నువాడుకున్న వాడు శీలవంతుడుకాడు. నువ్వు లక్షలిచ్చి కొనుక్కుంటున్న సెకండ్‌ హ్యాండ్‌ మొగుడు. ఉద్యోగం చేస్తున్న ఊళ్లో... బ్రహ్మచారిగా గడపలేక పెళ్లిచేసుకుంటానని నమ్మించి నన్ను నట్టేటముంచాడు. ఇప్పుడో...భారీకట్నంతో నిన్ను పెళ్లాడబోతున్నాడు. వద్దుచెల్లీ... వద్దు. ఇలాంటి వాడు నీకూ, నాకూ వద్దు ’’ఏడుస్తూ అంటోంది వరలక్ష్మి.‘‘ఇన్‌స్పెక్టర్‌...వాడ్నిఅరెస్ట్‌ చేసి వీలైనన్ని కేసులు పెట్టి బొక్కలో తోయండి. సంతకాలెక్కడ పెట్టాలో చెప్పండి’’ అంది వరలక్ష్మి.

‘‘అంటే... ఆ పెళ్లి ఆపుచేయడం వాడ్ని పెళ్లిచేసుకోడానికి కాదా?’’ వరలక్ష్మి అంతరంగం తెలిసిన తర్వాత ఆ ప్రశ్న వేయడానికి అక్కడున్న వారెవరికీ ధైర్యం చాలలేదు. అంతేకాదు.. అంతకన్నా తెలివి తక్కువ ప్రశ్న ఈ లోకంలో మరోటి ఉండదని వారనుకుంటున్నారు.

‘‘ఏదో సర్‌ప్రయిజ్‌ నా కోసం ఎదురుచూస్తోందన్నారు?  ఏంటది?’’ థియేటర్‌ దగ్గరికి రాగానే సిద్దార్థ అడిగిన మొదటి ప్రశ్న‘‘ఇప్పుడే వచ్చారు. అప్పుడేనా? కాస్త వెయిట్‌ చేయండి’’అంది ప్రతిమ కళ్లతోనే నవ్వుతూ.

మరో అయిదు నిముషాల్లో సినిమా మొదలవుతుందనగా...‘‘మీట్‌మిస్‌కృతి.  మా హీరోయిన్‌.  నే చెప్పిన సర్‌ప్రయిజ్‌ ఇదే’’ అంది ప్రతిమ.‘‘అనివార్యకారణాల వల్ల మా హీరో రాలేదు.  వస్తే అతడ్నీ ఇంట్రడ్యూస్‌ చేసేదాన్ని...’’  చెప్పింది.‘‘హలో...’’ అన్నాడు కృతితో సిద్దార్థ.‘‘హలో ...’’ అంటూనే ఆమె సిద్దార్ధకు షేక్‌ హ్యాండిచ్చింది. సిన్మా మొదలైంది.ఎదురుగా సెవన్టీఎంఎంస్క్రీనంతా కనిపిస్తున్న హీరోయిన్‌ థియేటర్లో తమ వరుసలోనే కూచుందన్న ఆనందం అక్కడి జనాల్లో సందడి చేస్తోంది...ఒక్క సిద్దార్థకి తప్ప. ఇంటర్వెల్‌లో ఇద్దరి మధ్య కాస్త దొరికిన ఏకాంతంలో ప్రతిమని అడిగాడు సిద్దార్థ`‘‘ నిజంగానా గురించి మీరేమనుకుంటున్నారు?’’‘‘అదేం ప్రశ్న?’’‘‘ఏమో... తక్కువ అంచనా వేసారనిపించింది’’

‘‘ఎందుకలా?’’

‘‘ఎందుకా?... ఓ హీరోయిన్‌ పరిచయం,  ఆమె కరచాలనం నాకు సర్‌ప్రయిజా చెప్పండి?’’

‘‘ఏం... ఎందుకాక్కూడదూ?’’

‘‘ఎవరికైనా కావొచ్చేమో కానీ...నాక్కాదు’’

‘‘కారణం...’’

‘‘టీనేజ్‌లోనే చూసిన సినిమాలోని ప్రతి హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాను. అది ఒకప్పుడు. ఇప్పుడా స్టేజ్‌దాటింది...’’‘‘అంత తొందరగా కాలు జారిపడరన్నమాట’’నవ్వుతూ అంది ప్రతిమ.

‘‘ఔను... ముఖానికీ, చెక్కిళ్లకు, పెదాలకు..ఎప్పుడూ రంగులు రాసుకునే రీల్‌హీరోయిన్‌ కోసం కాదు... రియల్‌ హీరోయిన్‌ కోసం నా అన్వేషణ. నే కనబడగానే సహజాతి సహజంగా చెక్కిళ్లు ఎరుపెక్కే సౌందర్యం కోసం ఎదురుచూస్తున్నాను...’’ చెప్తూ ఆమె వంక చూస్తూ కన్రెప్పలు వేయలేకపోయాడు సిద్దార్థ.

ఆమె చెక్కిళ్లు అరుణ రాగ రంజిత మయ్యాయా...లేక, భ్రమా? అంచనాకు రాలేకపోతున్నాడు సిద్దార్థ. సినిమా చాలా బాగుంది.  థర్ టీన్‌ నుంచి నైన్ టీన్‌ మధ్యలోని ఎడాల్‌సెన్స్‌ని కవితాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఎక్కడా ఏమాత్రంఅతిలేకుండాచక్కనిసన్ని వేశాల కూర్పుతో కథ నడిచింది. ఆ వయసును అందంగా కమ్మేసే భావోద్వేగాల్నిఅద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడతడు. కన్రెప్పల్లోనిఈస్ట్‌మన్‌కలల్నికళాత్మకంగాఆవిష్కరించాడు.

అదే మాట చెప్పాడుసిద్దార్థ ప్రతిమతో.

‘‘మంచి సినిమా చూపించారు. థాంక్స్‌. నిజంగా మీరు పిలవకపోతే ఈ ఫీల్‌గుడ్‌ మూవీని మిస్‌ అయ్యే వాడినేమో?’’ అన్నాడు.నవ్వింది ప్రతిమ.‘‘సినిమా ఎలా ఉంది?’’ మర్నాడు ఉదయం పదకొండు గంటలకే సిద్దార్ధ ఆఫీసు ముందు వాలిపోయాడు తేజ.‘‘ఆ విషయం అడగడానికి లీటర్‌ పెట్రోల్‌ ఖర్చుచేసుకుని ఇంత దూరం నా దగ్గరికి వచ్చావా?’’  ఆశ్చర్యపోయాడు సిద్దార్థ.‘‘ఔను... నమ్మలేవా?’’‘‘ఊహూ!’’  కావాలనే పెదవి విరిచాడు.

‘‘కొత్తగా రిలీజైన ఏసినిమా గురించైనా తెలుసుకోవాలంటే శతకోటి మార్గాలున్నాయి.  ‘నేడే విడుదల’, ‘ఫ్రైడే’ పేర్లతో ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రోమోస్‌లో ని విజువల్స్‌ వాడుతూ దృశ్య సహితంగా రివ్యూలిచ్చేస్తున్నారు.  లేదా,  అందుబాటులో ఉన్న ఏకంప్యూటర్‌ విండోస్‌లో  తలదూర్చి నా ప్రత్యక్షమయ్యే వెబ్‌సైట్లలో కూడా మూవీ రేటింగ్‌ ఉంటుంది. అందులోనూ సమాచారం క్షణాల్లో తెలిసే మీడియాలో పనిచేస్తున్నావు.  పాపులర్‌ స్టార్స్‌ లేని ఓ సినిమా గురించి ఆరాతీసేందుకు నా దగ్గరికి వచ్చావా?’’‘‘సరే...సినిమా ఎలా చూసావ్‌?’’‘‘ఎవరైనా సినిమా ఎలా చూస్తారు?’’  అడిగాడు సిద్దార్థ తేజాని ఆటపట్టిస్తూ.

‘‘ప్లీజ్‌!  జరగాల్సిన ఆ క్రయిమేదో అప్పుడే జరగాలా? రెండు గంటలాగి జరిగితే... ఏకంగా థియటర్ లో ఉండేవాడిని. ప్చ్‌!  సినిమాకు రాలేకపోవడం బాధగా ఉంది’’ అన్నాడు తేజ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్