Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kitchen

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

(గతసంచిక తరువాయి)

గోదాదేవి పడుతున్న అవస్థను వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.

సురుచిరవితానదంభ కౌసుంభ ధారి 
తుహినధారాగృహాంగి బిందువులు సెదర 
పొంత ఘటయంత్రసరము ద్రిప్పుచు జపించు 
మగువధృతి దూల మధ్యాహ్న మంత్రవాది 

మధ్యాహ్నము అనే మంత్రగాడుమెరిసిపోతున్న కాషాయవర్ణములో నున్న వస్త్రాన్ని ధరించి,  ఘటయంత్రము అనే జపమాలికను త్రిపుతూ మంత్రజపము చేస్తున్నాడు, ఆమెను విహ్వలను  చేయడానికి, వివశురాలిని చేయడానికి. మంచుతుంపరల వంటి  వెలువరిస్తున్న నీరు తోడే యంత్రాలను త్రిప్పుతూ నీటి జల్లులు పడుతుండగా ఘటయంత్రము అనే  జపమాలికను త్రిపుతూ మంత్రజపము చేస్తున్నాడు, ఆమెను విహ్వలను చేయడానికి, వివశురాలిని  చేయడానికి. చాలా విచిత్రమైన, క్లిష్టమైన పద్యం యిది. పగలూ రేయీ ఒక్కతీరుగా విరహ తాపం  పొందుతున్నది గోదాదేవి. మధ్యాహ్న సమయాలలో లోని తాపము, బయటి తాపము రెండూ కలిసి మరింతగా తపింపజేస్తుంటే మోటబావి వద్ద ఉన్న కుటీరంలోకి చేరుకుంటుంది. అక్కడ ఘటయంత్రం ఉంటుంది. అంటే యంత్రం ద్వారా నడిచే, నీళ్ళు తోడిపోసే కుండలు బావిలోకి  పైకీ క్రిందకూ తిరుగుతూ నీళ్ళు చేదిపోస్తుంటాయి. క్రిందికి వెళ్ళినపుడు కుండలు వంగి మునిగి  నీళ్ళను నింపుకుంటాయి. పైకి చ్చినప్పుడు వంగి నీళ్ళను గుమ్మరిస్తాయి. అలా గుమ్మరించినప్పుడు ఆ తాకిడికి నీటి తుంపరలు ఎగిసి పడుతుంటాయి. న్యాయానికి ఆ చల్లని జల్లులు హాయిని కలిగించాలి. కానీ శ్రీకృష్ణవిరహాకులచిత్త ఐన గోదాదేవికి ఆ నీటి తుంపరలు ఇంకా వేడిమిని కలుగజేస్తాయి. భూమి వేడెక్కి ఉన్నప్పుడు పడే చిరుజల్లులవలన లోని తాపం బయటకు వచ్చి ఇంకా ఉక్కగా వేడిగా వుంటుంది కదా, అలా అన్నమాట. యిలా యిబ్బంది పెడుతున్న ఆ ఎర్రని మధ్యాహ్నం కాషాయ వస్త్రాన్ని ధరించిన ఒక మంత్రగాడిలాగా ఉన్నది. నిరంతరమూ పైకీ క్రిందికీ తిరుగుతున్న ఆ నీటి కుండలు ఆ మంత్రగాడి చేతిలో తిరుగుతున్న మంత్రజపమాలలాగా ఉన్నాయి. ఆమె ధైర్యం సడలిపోవడం కోసం చేస్తున్న మంత్రకట్టులాగా ఉన్న మంత్ర ఉచ్చారణ వలన ఆ మంత్రగాడి నోటి తుంపరలు పడుతున్నట్లుగా కుండలు గుమ్మరిస్తున్న నీళ్ళ తుంపరలు ఉన్నాయి. యిక్కడ రాయలవారు మాత్రమే వ్రాయగలిగిన క్లిష్టమైన పద్యంలో కూడా  ఒక చమత్కారాన్ని పొదిగాడు రాయలవారు.బిగ్గరగా ఉచ్చరిస్తూ చేసే ఆ మంత్రోచ్చారణ వలన చిందుతున్న నోటి తుంపరలు, ఆ ఎర్రని వస్త్రాలు 'మాయల పకీరు' లాంటి క్షుద్ర మంత్రోచ్చారణ చేస్తున్న ఒక క్షుద్ర మాంత్రికుడిని చూపిస్తున్నాయి, ఆ మంత్ర శబ్దాలను విని,ఇంకా ధైర్యము చెడి వివశురాలు అవుతున్నది కనుక మధ్యాహ్నము అనే 'మంత్రవాది' అన్నాడు. క్షుద్ర శక్తులు ఉన్నాయని నమ్మినవారు, అవి సోకినాయేమో అనుకునేవారు ఏం చేస్తారు? చేతబడి జరిగిందేమో అనుకునే వారు ఏం చేస్తారు? దైవ శక్తిని ఆశ్రయిస్తారు, విరుగుడుగా ప్రతిక్రియ చేసుకుంటారు, ముందు ముందు దాదేవి అదే  చేయబోతున్నది, విష్ణుదాస్యం, అర్చనం, జపము చేయబోతున్నది.  

యిలా సర్వకాల సర్వావస్థలలో ఊరట లేనిదై, యిక యిలా కాదు అనుకుని, ఆ విల్లిపుత్తూరు లోనున్న విష్ణుమూర్తిని ఆరాధించి, ఆయనను ప్రసన్నుడిని చేసుకుని శ్రీహరిని భర్తగా  పొందడానికి నిశ్చయించుకున్నది. అంతకుముందు చెలికత్తెలు చెప్పినట్లుగా చేయడానికి  నిర్ణయించుకున్నది. 

పద్మాస్య ప్రతిదిన ప్రత్యూషమును మౌన 
నియతి మేల్కొని సఖీచయము మ్రోల 
హేమపాత్రిక హరిద్రామలక్యాదిక 
స్నానీయవస్తువ్రజంబు గొనుచు 

ధౌతాంశుకంబులు తడి యొత్తులును దేర 
నంతః పథంబున నరిగి నిజగృ
హారామ దీర్ఘిక ననుసంహిత ద్రావి
డామ్నాయయై స్నాన మాచరించి 

పర్జనీ లేశ పూర్ణ సౌభాగ్యదాంగ 
ధూతి చకచక లీ రెండ తోడ మారు 
మలయ నిడువెండ్రుకలగుంపు మలచివైచి 
వేగ వెడవెడ దడియొత్తి విధియుతముగ 

ఆ పద్మముఖి ప్రతిరోజూ మౌనవ్రతంతో లేచి, చెలికత్తెలు ముందు నడుస్తుండగా, పసుపు, ఉసిరికలు మొదలైన స్నానానికి తగిన వస్తువులను బంగారు పళ్ళెంలో ఉంచుకుని, ఉతికిన వస్త్రాలు, తడి ఒత్తుకోడానికి వస్త్రాలను చెలికత్తెలు తెస్తుండగా పెరటిత్రోవలో వెళ్లి, యింటి  వెనుకనున్న వనంలో ఉన్న దిగుడుబావికి వెళ్లి, ద్రావిడవేదమును అనుసంధానము చేస్తూ  స్నానంచేసి, పసుపు పొడికి కూడా అందాన్ని తెచ్చే పచ్చని, అందమైన శరీరము వణుకుతుండగా నీ రెండకు కాచుకుంటూ, దీర్ఘ కేశములను మలచి వెనుకకు వేసుకుని త్వర త్వరగా పైపైన  తడి తుడుచుకుని విధివిధానంగా ఊర్ధ్వపుండ్రాలను ధరిస్తుంది. అంటే ద్రావిడ వేదం చెప్పినట్లు కేశవాయనమః అనే మంత్రంతో మొదలుబెట్టి, ఓం దామోదరాయ నమః అనే మంత్రము వరకూ ఉన్న పన్నెండు నామములను స్మరిస్తూ 'పుండ్ర ధారణ' అంటే బొట్టు పెట్టుకొనడం చేయాలని   వైష్ణవ సంప్రదాయం. అలా పన్నెండు నామ మంత్రములను మననం చేస్తూ పన్నెండు చోట్ల పుండ్రములను ధరించి, '.. .. నామ ద్వాదశ పంజరం ప్రవిష్టోహం న మే కించిత్ భయమస్తి  కదాచన' అని పన్నెండు నామముల పంజరంలో భద్రంగా రక్షణ  పొందుతాడు వైష్ణవమార్గానువర్తి.   'లలాటే కేశవం ధ్యాయేత్..' అని విధి, అంటే ' పురస్తాత్ కేశవః పాతు చక్రీ జాంబూనద ప్రభః' అని కేశవుడిని మననం చేస్తూ లలాటం మీద, నుదుటిమీద ఊర్ధ్వపుండ్రమును ధరించాలి కనుక, అలా స్మరిస్తూ, మననం చేస్తూ నుదుట తిరుమణి తీర్చి దిద్దుకుంటుంది గోదమ్మ అని తెలియజేస్తున్నాడు తర్వాతి పద్యానికి అనుసంధానంగా. కుందరదాగ్ర నెన్నొసల గుమ్మడిగింజ తెరంగు పాండు మృ ద్బిందువుఁ దీర్చి చెందిరము పేచక శీర్షముపైఁ  బలె న్గటిం జందుర కావిజీ బమరఁ  జల్లని రేయిటి తట్టుపున్గళు ల్విందులఁ దేల నూనెముడి వెండ్రుకలం దడి తావు లీనగన్   మొల్ల మొగ్గల్లాంటి దంతములున్న ఆ సుందరి నుదుటిమీద గుమ్మదిగినాజ ఆకారంలో తిరుమణి తిలకాన్ని పెట్టుకుంటుంది. ఎత్తైన విశాలమైన పిరుదులమీద సిందూరవర్ణ వల్కలాన్ని ధరిస్తుంది. అది చూడడానికి ఏనుగు కుంభస్థలం మీద సిందూరం పూత పూసినట్లు కనిపిస్తుంది. గతరాత్రి  అలదుకున్న పరిమళ ద్రవ్యములసువాసనలకు తుమ్మెదలు శరీరానికి మూగుతుండగా, అంతకుముందు ఎప్పుడో రాసుకున్న నూనెవెంట్రుకలకు తడి అంటుకుని, అంటుకొనక వింత  శోభలను చేకూరుస్తుంటాయి. అలా దురితలతా లవిత్రయై, విచిత్ర పవిత్ర పరిమళసముచ్చయంగా కోవెలకు బయలుదేరుతుంది.  

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని శీర్షికలు