Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక



జరిగిన కథ:   ఎంతటి గొప్ప కళాకారిణి అయినా,  ఆడపిల్లకి మంచి జీవితం ముఖ్యం.   చంద్రకి మన జగదీష్ సంబంధం చాలా మంచిదనిపిస్తుంది. వాడు ఎంత ప్రేమ కలవాడో, ఎంత బాధ్యత కలవాడో మనకి తెలుసు. రేపు సర్జన్ అవబోతున్నాడు.  ఆస్తిపాస్తులు విషయం అటు పెట్టు. మనిషే  బంగారం.  అందగాడు.  పైగా వాడికి చంద్రకళ పై ఎనలేని అభిమానం. ఇంకేం కావాలి? అని తన మనసులోని మాటను చెప్పేస్తుంది చంద్రకళతో, శారదమంగారితో. ఆ  తరువాత....    

 

మా కన్నా ఓ రోజు ముందే చెన్నై చేరిన కోటమ్మత్త, ఇల్లంతా సర్ది, మా కోసం టిఫిన్లు చేసుంచింది. బ్రేక్ ఫాస్ట్  చేసి,అలసటగా ఉందంటూ, నాన్న వెళ్లి పడుకుండి పోయారు. 

నేనూ పనులు ముగించి,  కాలేజీ క్లాస్ షెడ్యూల్ చూసుకొన్నాను. 

మేము చెన్నై చేరిన సంగతి,భూషణ్ అంకుల్ కి తెలియజేసే లోగా ఆయనే ఫోన్ చేసారు....

‘న్యూ ఇయర్స్ ఈవ్’ కి, సిటీ అవుట్-స్కర్ట్స్ లోని తమ గెస్ట్-హౌజ్ కి డిన్నర్ కి ఆహ్వానించారు.  కోటమ్మత్తతో సహా తప్పక రమ్మని చెబుతూ, మాతో సంప్రదించవలసిన కొత్త విషయాలు కూడా ఉన్నాయన్నారు.

**

లంచ్ కి మా ఇరువురి కుటుంబాలు కాక,  మానేజర్ మూర్తిగారు మాత్రమే ఉన్నారు... రాణి ని చాలా రోజుల తర్వాత కలిసాను.  ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాము. 

వినోద్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ గురించి అడిగి తెలుసుకున్నారు అంకుల్.... ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్’ వారు జరపబోయే స్పోర్ట్స్ ఫెస్టివల్లో, పాల్గొనమని వాడికి సూచించారు.

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మంచి భోజనం చేసాము.  డెజర్ట్ కూడా అయ్యాక, అందరం లివింగ్ రూములో చేరాము. 

“సత్యం, మీకు చాలా విషయాలు చెప్పాలి, ఫైనలైజ్ చేయాలి,” అంటూ మూర్తి గారి వద్దనుండి  ఓ ఫైల్ అందుకున్నారు అంకుల్... ఆయన చెప్పేది, శ్రద్దగా వినసాగాము.  

‘న్యూ-జెన్ టి.వి’ వారు - క్లాసికల్ ఆర్ట్స్ విభాగంలో – నన్ను, అలాగే లైట్-మ్యూజిక్ విభాగంలో- రాణిని, అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేశారట.

రెండవ సంగతిగా - తమిళ ఫిలిం డైరక్టర్ – ముత్తురామన్ సార్ నిర్మించబోయే, ‘డాక్టర్ శ్రీలత అయ్యర్’ అనే ఫిలింలో  హీరోయిన్ పాత్రకి నన్ను ఎంపిక చేయాలని, అంకుల్ ని కలిసారట. 

ఇకపోతే, మా మొదటి విదేశీ కల్చరల్ టూర్ కూడా డేట్స్ తో సహా కంఫర్మ్ అయ్యిందన్నారాయన.  మలేషియాలోని ‘రామసుబ్బయ స్కాలర్షిప్ ఫౌండేషన్’ వారి సహకారంతో, చెన్నై కల్చరల్ సంఘం వారు, టూర్ కి  ఏర్పాట్లు చేస్తున్నారని... ఈ  ప్రదర్శనల మొదటి విడత, మలేషియా – సింగపూర్ లోనూ, రెండవది లండన్ లోనూ జరుగుతాయట. చెప్పడం ముగించి, గట్టిగా ఊపిరి తీసుకున్నారు అంకుల్.  చాలా సంతోషంగా ఉందన్నారు.

ఫైల్ నాన్న చేతికిచ్చారు. ఊహించనంత ఉత్సాహం కలిగించే ఆ సంగతులకి, అంకుల్ కి కృతజ్ఞతలు తెలియజేశాము... తన సోఫానుండి,లేచి వచ్చి, రాణి నాకు ‘కంగ్రాట్స్’ చెప్పింది. వాళ్ళ డాడీని హగ్ చేసి, “మీ ప్లాన్ బాగుంది డాడీ,” అంటూ అభినందించింది. 

“ఇక్కడ రెస్టారెంట్ లో ‘బాదం కీర్’ చాలా బాగుంటుంది.  అందరికీ ఇందాకనే ఆర్డర్ చేసాను. డాడీ ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ సక్సస్ కోసం ‘బాదం కీర్’ తో టోస్ట్ చేద్దాం,” అంటూ అక్కడినుండి కదిలింది రాణి...

‘నేనంటే ఇష్టం లేకున్నా, హుందాగానే ప్రవర్తిస్తుంది’ అనిపించింది.                                               

**

అంకుల్ ఇచ్చిన ఫైల్లోని పేపర్స్ ని ఓసారి తిరగేసారు నాన్న.

“ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యేప్పటికి, యేడాది పైనే టైం పడుతుందని నాఅంచనా.   కాబట్టి అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేయాలి,” అన్నారు.

“అంతే కదా! మరి,  ఇన్షియల్ గా  నాకు ఓ ప్లాన్ అయితే ఉంది.డిస్కస్ చేసి నీకు ఒకే అయ్యాకే ముందుకు వెళదాం,” అన్నారు అంకుల్.  ముత్తురామన్ ఫిలిం గురించయితే,తనకి నమ్మకముందని,సైన్ చేసిన వెంటనే, కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ ఒకటి నా పేరున తీసుకుందామని కూడా ప్రస్తావించారాయన....

“చాలా సంతోషం భూషణ్ గారు... సొంత బిడ్డలా చంద్రకళని వృద్దిలోకి తెస్తున్నారు. మీరు వేసిన బాటలోనే చంద్రకళ ఎప్పటికీ నడుస్తుంది.  మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు,” అంది అమ్మ...

“అలా అనకండి శారద గారు....నేను నిమిత్తమాత్రుణ్ణి... ఇలా జరగాలని ఉంది. అంతే,” అన్నారాయన. 

“ఈ టూర్ విషయంలో రాణి కూడా ఉత్సాహంగా ఉంది,” అంది నీరు ఆంటీ... లేచి వెళ్లి వాళ్ళిద్దరికీ నమస్కరించి, ధన్యవాదాలు తెలిపాను. 

“విష్ యు మోర్ సక్సస్ కళా.  ముత్తురామన్ సార్ మూవీ నీకు ఓ మంచి అవకాశమే అవుతుంది,” అంటూ దీవించారు అంకుల్.

“నిజానికి రెండేళ్ళగా  నీకు ఓ అరడజను పక్కా మూవీ ఆఫర్స్ వచ్చాయి.  అవి మన సిద్దాంతాలకి సరిపోని పాత్రలవడంతో,  నేను ముందుకు సాగనివ్వలేదు.  

ఇప్పుడు ఈ ఆఫర్ నాకు సరయినదని తోచింది. వివరాలు త్వరలో  మీరూ వింటారుగా....అంతా కుదిరితే, బేషుగ్గా ఉంటుంది కళా,” మళ్ళీ అంకుల్. నాన్న కలగజేసుకున్నారు.

“కానైతే,  ఎన్నాళ్ళగానో  ఎదురుచూస్తున్న వరల్డ్కల్చరల్  టూర్ కి - ఈ సినిమా గాని, లోకల్  ప్రోగ్రామ్స్ కాని అడ్డు రాకుండా చూడాలి భూషణ్,” అన్నారు.

“అదంతా నేను ఆలోచించానులే సత్యం.  పోతే,నీవు కల్చరల్ డెలిగేషన్ కి లీడర్, నేను మన గ్రూప్ కోఆర్డినేటర్.  ఆర్కెస్ట్రాతో కలిపి పదిమందికి పర్మిషన్ ఉంది మనకి.,” అన్నఅంకుల్ మాటలకి నాన్న హ్యాపి.

ఇంతలో, సర్వెంట్ చేత అందరికీ ‘కీర్’ సర్వ్ చేయించి, వాళ్ళ డాడీ పక్కనే కూర్చుంది రాణి.

**

నాన్న తిరిగి అందించిన ప్రాజెక్ట్ ఫైల్ ని, తీసున్నారు అంకుల్...

“ఇకపోతే, నీ విషయంగా, ఎల్లుండి పొద్దున్నే మా న్యురాలజిస్ట్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నాను... ఏడింటికి రెడీగా ఉండు.  నేనే వచ్చి, నిన్ను పికప్ చేసుకుంటాను,” నాన్నకి గుర్తు చేసారాయన.

అన్నీ వింటూ, గమనిస్తున్న కోటమ్మత్త కలగజేసుకుంది.

“మీ లాంటి  స్నేహితుడు, ఉండడం మా తమ్ముడి అదృష్టం భూషణ్ గారు.  అయితే ఈ శుభసమయంలో నాదో మనవి,” అంది ఉన్నట్టుండామె...

అందరం ఆశ్చర్య పోయాము.  బయట వాళ్ళతో పెద్దగా మాట్లాడని అత్త, ఏమంటుందో అని, నేను, అమ్మ ముఖాలు చూసుకున్నాము.

“చూడండమ్మా ... మీకు సత్యం ఎంతో, నేనూ అంతే అనుకోండి.  మీ మనస్సులో మాట చెప్పండి,” అన్నారు అంకుల్ ఆమెతో.. కొద్ది మౌనం తరువాత,  “మీరు అంటున్న ఈ ప్రోగ్రాములన్నీ అయ్యేప్పటికి,  మా చంద్రకళకి పెళ్ళి చేయడానికి, సరయిన సమయమవుతుంది.   ఇలా  కళావేదికలే  కాదు,  కళ్యాణ వేదిక  పైన కూడా ముందుండి బాధ్యతగా మా అమ్మాయి పెళ్ళి జరిపించాలి మీ దంపతులు మరి.  అదే నా కోరిక,... ” అంది కోటమత్త. 

“ఎంత మాట, అసలది మీరు అడగాలా?” చంద్రకళ వివాహ సమయంలో, అన్నీ మేమే అయ్యి చేస్తాము...ఇప్పట్నించే వరుణ్ణి వెతకండి మరి,” అంది నీరూ ఆంటీ. 

“సంబంధాలకి కొరతేముందమ్మా? చంద్రకళకి.  అదీకాక, వరసైన వాడు మా జగదీష్ ఉండనే ఉన్నాడు. .... ఏమైనా, మంచి యోగ్యుడైన వాడితోనే అమ్మాయి జీవితం,ముడి పడుతుంది లెండి,” అంది కోటమ్మత్త సంతోషంగా...

నేను, నా పక్కనే ఉన్న అమ్మ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డాము.

ఆమె మాటలకి, అందరం నిర్ఘాంతపోయాము.

అంకుల్ అందుకున్నారు... ”అరె, అంత మార్పు ఎలా సాధ్యం? నమ్మ లేకుండా ఉందే? కాలేజీలో ఉండగా, మేనరికాలు చేసుకోవద్దని, చాటేవాడు మన సత్యం. బల్లగుద్ది మరీవాదించేవాడు.  అసలందుకేగా నేను నా మరదల్ని కాదని నీరూని చేసుకుంది,” నవ్వుతూనే అంకుల్.....

నాన్న ఉలిక్కిపడి ఒక్కసారిగా కుర్చీలో అటు నుండి ఇటు కదిలారు.

“భలేవాడివే భూషణ్, ఎప్పటివో విషయాలు ఇప్పుడిలా,”ఆగారు నాన్న.

ఈ సంభాషణ ఎలాతెల్తుందో అని ఆదుర్దాగా ఉంది...నాన్నవంక చూసాను.

“అదీ గాక, కాలేజీ రోజుల్లో, మేనరికాల విషయంగా వాదించే వాడిని.  నిజమే.  అయినా, మా అక్కకి అన్ని విషయాలు తెలియదులే,”  అంటూ ఏదోలా మాట మార్చారు....

**

జగదీష్ గురించిన విషయాలు, అమ్మే, కోటమ్మత్తకి చెప్పిందని తెలుసు. గుంటూరు వెళ్ళినప్పుడు,అమ్మమ్మ  మాతో అన్న మాటలు, జగదీష్ గురించి ఆమె అభిప్రాయాలు, అమ్మ, అత్తకి చెప్పడం  నేనూ విన్నాను. ఏమైనా,  ఇకిప్పుడు రాణి వంక చూడాలంటే కూడా భయంగా ఉంది...కోటమ్మత్త మాటలు విన్న ఆమె ఏమి చేస్తుందో? ఎలా రియాక్ట్ అవుతుందోనని కంగారుగా ఉంది... 

అందరి మౌనాన్ని  ఛేదిస్తూ నీరూ ఆంటీ,  “ఇప్పుడీ పెళ్లి ప్రస్తావన బాగుంది. మా రాణి పెళ్ళి సంగతి గురించి కూడా ఆలోచన చేయాలని,సమయానికి గుర్తు చేసినట్టయింది..” అంది నవ్వుతూ....

“మీకేం తక్కువండీ.  మీ అల్లుడుగా అవ్వాలంటే పెట్టిపుట్టాలి.... రాణి నిజంగా యువరాణీయే.  అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్న గారాల బిడ్డ కదా... మీకు అంతా శుభం జరుగుతుంది,” అంది కోటమ్మత్త.

**

“అందరం కాసేపు అలా బయట గార్డెన్స్ లో తిరిగి వద్దాము,  ఇక్కడ మంచి గ్రీనరి వేయికి పైగా రకరకాల చెట్లు,  డక్ పాండ్, అన్నీ చూడవలసినవే,” అంటూ భూషణ్ అంకుల్ అందర్నీ అక్కడి నుండి బయటికి నడిపించారు.

“అక్కడి నుండి వచ్చాక, ఓ మూవీ చూసి, భోజనం చేసేప్పటికి మిడ్ నైట్ అవుతుంది కూడా,”అంది ఆంటీ ముందు నడుస్తూ...

**

అర్దరాత్రి పన్నెండుకి కేక్ కట్ చేసి, ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాము.   అంకుల్, ఆంటీ అందరికీ ‘ఓం’  చెక్కున్న గోల్డ్ పెండెంట్లు గిఫ్ట్ గా ఇచ్చారు.

మరికాసేపు కబుర్లయ్యాక,  అలిసిపోయి గెస్ట్-హౌజ్ లోని బెడ్ రూమ్స్ లోకి  నిష్క్రమించాము.

**  

పొద్దున్నే, స్వయంగా తానే వచ్చి, తలుపులు తట్టి, అందరినీ బ్రేక్ ఫాస్ట్ కి పిలిచింది, ఆంటీ. అందరం డైనింగ్ హాల్లో చేరాక, ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ సర్వ్ చేయించింది.  అక్కడి రిజార్ట్ లోని బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ చాలా బావుంటాయంటూ, అందరికీ దగ్గరుండి వడ్డన చేయసాగిందామె.

“ఇంతకీ, రాణి ఏదమ్మా?”....కోటమ్మత్త అడిగిన దానికి, ఇంకా నిద్ర లేవలేదన్నారు ఆంటీ. పైనాపిల్ కేక్ తో సహా, రెండో సారి కాఫీలు కూడా అయ్యాక, వారి వద్ద శలవు తీసుకొని ఇంటికి బయలుదేరి పోయాము.

**

కారులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు నాన్న. 

మరునాడు న్యురాలజిస్ట్ వద్దకు వెళ్ళడం దేనికని అడిగానాయన్ని..

“చాలా అలసటగా ఉంటుందమ్మా. కుడి కాలు నొప్పి, టింగ్లింగ్ సెన్సేషన్ ...కళ్ళు కూడా పూర్తిగామూతలు పడకుండా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఒక్కోసారి  మాట్లాడ్డానికి  గొంతు  పెగలనట్టవుతుంది.  అందుకే,చెకప్ కి వెళుతున్నాను,” అన్నారు  నాన్న. 

ఆయనకున్న వ్యాధి - ‘మయస్తీన గ్రేవిస్’ లక్షణాలే ఇవన్నీ. రేపు చెకప్ అయ్యాక, మందు డోసేజ్ సరిచేసి, విశ్రాంతి తీసుకోమంటాడేమో డాక్టర్’ ...అనుకున్నాను...

ఎంతటి సంతోషాలు ఉన్నా, జీవితంలో ఎంతటి విశేషాలు జరుగుతున్నా, నాన్న ఆరోగ్య విషయం నా ఉత్సాహాన్ని నీరు గారుస్తుంది....గుండెల్లో ఓ మూల నాన్న గురించి బాధ, భయం...ఉంటున్నాయి.

“డాక్టర్ దగ్గరికి నేను కూడా వస్తాను నాన్న,” అన్నాను.

**

ఇల్లు చేరేప్పటికి, లంచ్ టైం దాటిపోయింది.  వినోద్ ఒక్కడే లంచ్ చేస్తానన్నాడు.  అమ్మ వాడికి ఫ్రెంచ్-టోస్ట్ చేసిచ్చి, మాకు టీ చేసి అందించింది.

“జగదీష్ విషయం, రాణివాళ్ళ వద్ద ప్రస్తావించకుండానే ఉండవలసింది,” అన్నారు నాన్న, పక్కనే కూర్చుని‘టీ తాగుతున్న  అత్తతో.  

“పైగా ‘మేనరికాన్ని ఎలా ప్రోత్సహిస్తానని’ ప్రశ్నించాడు భూషణ్... నా సిద్దాంతాన్ని మార్చుకున్నానా? అని అడిగినట్టేగా...,” ఆగారు నాన్న. మౌనంగా ఆయన మాటలు వింటున్నాము, నేను, అమ్మ. 

“జగదీష్ తండ్రి రాంబాబు, మన శారదకి సొంత అన్న కాదని, రక్తసంబందీకుడు కాదని భూషణ్ కి  తెలియదుగా.  అసలీ సంగతులు వాళ్ళ వద్ద రాకుండానే ఉండవలసింది,” మళ్ళీ నాన్న.. 

జవాబుగా  కోటమ్మత్త నవ్వేసింది. 

“తమ్ముడూ,  నేను కావాలనే అన్నానయ్యా,  మన అబ్బాయి మీద ఆశలు పెట్టుకోవద్దని వాళ్లకి చెప్పకపోతే, మనమే ఇబ్బంది పడతాము,”  అన్నదామె తాపీగా...

**

రాత్రి పడుకోబోయే ముందు అమ్మ నా గదిలోకి వచ్చి, బెడ్ మీద కూర్చుంది. 

ఏదో విషయం ఆమెని బాధిస్తుందని తెలుస్తూనే ఉంది....

“ఏమైందమ్మా?  నాన్న డాక్టర్ అపాయింట్ మెన్ట్ విషయమా?” అడిగాను...

“కాదమ్మా.  నిజానికి, అంకుల్ వాళ్ళ వద్ద,  జగదీష్ ప్రస్తావన తప్పేమీ కాదు చంద్రా.  కానైతే, ఆ మాటలు విన్న రాణి ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం చేస్తుందోనని నాకు బెంగగా ఉంది,” అంది ఆలోచిస్తూ.

“ఏమీ బెంగపెట్టుకోకమ్మా.   అసలెందుకు ఈ విషయాలిప్పుడు... చూద్దాంలే.   నువ్వు పడుకో.  మళ్ళీ పొద్దున్నే లేవాలిగా,”  అని అమ్మని తన బెడ్రూం వరకు తీసుకెళ్ళాను.

**

రాత్రి, ఒంటిగంట దాటాక , అంకుల్ వాళ్ళ హాస్పిటల్ నుండి నాన్నకి ఫోన్ కాల్ రావడం, అమ్మా నాన్నా గాబరా పడుతూ వెళ్ళడం క్షణాల మీద జరిగిపోయింది. వెళ్లి ఎన్ని గంటలైనా,  వాళ్ళ నుండి ఎటువంటి కబురు లేకపోగా,  ఫోన్ కూడా కలవడం లేదు.

అక్కడ  ఏమి  జరుగుతుందో తెలియక, ఆదుర్దాగా  ఎదురు చూడడం మినహా ఏం చేయలేక పోతున్నాము, నేను, అత్త...

**

మళ్ళీ అర్దరాత్రవుతుండగా ఇంటికి తిరిగొచ్చిన అమ్మా వాళ్ళు, అలసటగా సోఫాల్లో కూర్చుండి పోయారు. 

పొద్దుటి నుండీ ఏమీ తినలేదని తెలుసుకొని, హార్లిక్స్ కలిపి, ఇద్దరికీ అందించింది అత్త..

కాస్త తేరుకున్నాక, అంకుల్ వాళ్ళ విషయాలు చెప్పసాగింది అమ్మ.

“న్యూ ఇయర్స్ నాడు, బ్రేక్ ఫాస్ట్ కి కూడా రాకుండా నిద్రపోతుందనుకున్న రాణి, నిజానికి, ఫ్రూట్ నైఫ్ తో తనచేతి మణికట్టు కోసుకుని,  బ్లీడింగయ్యి, అపస్మారక స్థితిలో, తన గదిలో  పడి ఉందట,” అని అమ్మ చెప్పగా విని, నిర్ఘాంత పోయాము. 

 “అదేంటమ్మా,.. అసలు రాణి అలా...” మాట దొరక్క ఆగిపోయాను...

“అయ్యో, అదేం పని? మరి ఎలా ఉందామ్మాయి?” ఆత్రుతగా అత్త...

“నిన్న పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ అయ్యాక, మనం గెస్ట్-హౌజ్ నుండి బయలుదేరిపోయాం కదా! తరువాత కాసేపటికి గాని, రాణి గది లోనికి వెళ్లి జరిగిన ఉప ద్రవం తెలుసుకోలేదట వాళ్ళు. 

క్షణాల మీద కూతుర్ని హాస్పిటల్ ఎమెర్జెన్సీ కి చేర్చిన భూషణ్ గారు,  రాణి పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే, కుప్పకూలారట. ఆయనప్పుడు ‘మైల్డ్  స్ట్రోక్’ కి గురయ్యారని తేల్చి, ట్రీట్ మెన్ట్ మొదలుపెట్టారట డాక్టర్లు.  ఇక రాణికి మాత్రం బ్లడ్ ఎక్కించి, చికిత్స చేయడంతో, ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్త మెరుగయింది.  కోలుకుంటుందనే చెపుతున్నారు డాక్టర్లు,” వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ.

అంతా విన్నాక, నాతో పాటు వినోద్, కోటమ్మత్త కూడా చాలా సేపటి వరకు కోలుకోలేకపోయాము....

నీరూ ఆంటీ వాళ్ళ అమ్మ, అన్న ఊరి నుండి రావడంతో, తాము బయలుదేరి ఇంటికి వచ్చామన్నారు నాన్న.

ఆదుర్దాతో, ఏమనాలో తోచక, మౌనంగా ఉండిపోయాము.

తన డాక్టర్ అపాయింట్ మెన్ట్ ని నాలుగు రోజుల తరువాతకి మార్చమని, నాకు  గుర్తు చేసారు నాన్న.  

**

మూడు రోజులు గడిచాయి...  నేను టి.వి షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల హాస్పిటల్ కి వెళ్ళలేక పోయాను.  అంకుల్ వాళ్ళ విషయాలు, అమ్మ నుండే తెలుస్తున్నాయి.

“రాణి కోలుకుని.. లేచి తిరుగుతుంది. బాగానే ఉంది..

రేపు పొద్దున్నే రాణిని హాస్పిటల్ నుండి డిశ్ చార్జ్ చేస్తారట,” అంది అమ్మ రాత్రి  భోజనాలప్పుడు..

అంకుల్ గురించి వాకబు చేసాను....

అంకుల్ కి వచ్చిన స్ట్రోక్  స్వల్పమైనదే అయినా, కొంత మాట స్పష్టత కోల్పోవడంతో , స్పీచ్ తెరపీ మొదలుపెట్టారట. నడక కూడావేగం తగ్గడంతో, చేతికర్ర ఆసరాతో నడుస్తున్నారు.  అందుకుని, ఇంకొన్ని రోజులు కేర్ యూనిట్ లో ఉండాలన్నారట డాక్టర్లు.

“రేపు నాకు టైం ఉంటుంది. అంకుల్ ని విజిట్ చేస్తాను,” అన్నాను..

**

న్యురాలజిస్ట్ తో అపాయింట్ మెన్ట్ కి,  నాన్న వెంట నేను, అమ్మా కూడా వెళ్లాము.   బేసిక్ టెస్ట్స్ జరిపారు. 

మందులు మార్చి, నాన్నని విశ్రాంతిగా ఉండమన్నారు. కాళ్ళల్లోని రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండవచ్చన్నారు. కొలెస్ట్రాల్, డయబిటీస్ వల్ల ఏర్పడే మరో ఆరోగ్య సమస్య -‘పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్’లక్షణాలని వివరించారు మాకు..

అయినా, ముందైతే మందులతో మానేజ్ చేయవచ్చేమో చూద్దామన్నారు డాక్టర్లు.

ఇంటికి తిరిగి వచ్చాక, కోటమ్మత్తకి విషయం వివరించింది అమ్మ.

“సత్యంకి  ఇంకా పదిరోజుల లీవ్ఉందిగా! కాస్త ఇంటి పట్టున విశ్రాంతిగా ఉంటాడు.  ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు.  ఈ మధ్య ఈ సమస్యలేమిటో,” వాపోయింది అత్త.

**

“భూషణ్ గారిని కేర్ యూనిట్ నుండి, హాస్పిటల్లోని ఆయన ప్రైవేట్ రూము లోకి మూవ్ చేసారంట.  ఈ రెండు వారాల్లో బాగానే కోలుకున్నారన్నమాట,” అంది అమ్మ పొద్దుట బ్రేక్ ఫాస్స్ట్  దగ్గర..

క్లాసెస్ అయ్యాక,దారిలో,అంకుల్ని విజిట్ చేస్తాను కాబట్టి, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని  చెప్పానామెకి.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్