Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mabbulapallaki

ఈ సంచికలో >> కథలు >> పోతరాజూ--పోస్టాఫీసూ.

potaraju-postoffice

మా పోతరాజు చాలా జాలి గుండె కలవాడు. మా స్నేహితుడని కాదు కానీ చిన్న తనం నుంచీ వాడిది జాలి గుండె. ఎవరైనా కష్టంలో ఉన్నా, బాధ పడుతున్నా ఓర్చుకోలేడు. తన బాధ లాంటిదే కదా వారిదీనీ అని సాయం చేయను ముందుకొచ్చేవాడు. ఒక్కో మారు అది ’తనను మాలిన ధర్మం‘  గానూ ఉంటుండేది. వాడూ నేనూ ప్రాధమిక స్థాయి నుండీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకూ క్లాస్ మేట్లమూ, బెంచ్ మేట్సుం కూడా . వాడి జాలి గుండె మొదటి సారిగా మేము మూడో క్లాస్ లో ఉన్నపుడు బయట పడింది నాకు తెల్సి. నాకు బాగా గుర్తు ఆ రోజు. చలి కాలం . అందరికీ ముక్కులు కారుతున్నాయి, వాళ్ళమ్మ వాడికి ముక్కు తుడుచు కోను చేతి రుమాలు ఇచ్చింది.

ముక్కు కారి ఎండి పోతే అది చాలా బాధగా ఉంటుంది. ఆ రోజు వాడూ నేనూ బడి కెళ్ళి సంచులు మా స్థలంలో ఉంచుకుని , ప్రార్ధనకు బయటికొచ్చాం. మా బడి చిమ్మే బాలమ్మ కొడుకు కుమారు మా వయసు వాడే వాడికీ ముక్కు కారుతుంటే వాళ్ళమ్మ వెనకాలే తిరుగుతూ ఆమె చీర చెంగుతో ముక్కు తుడుచుకోసాగాడు. ఆమె వాడ్ని కోప్పడుతూ,  "వెనకెనకాలే తిరగమోకురా వెధవా! , నా పనికి ఆలీస్సెమవుతుంది, పెద్ద పంతులొస్తే కోప్పడతారు  "అంటూ అరుస్తున్నది. మా పోత రాజు చూశాడు, వాడి ముక్కు ఎర్రగా ఐపోయి రక్తం కూడా వస్తున్నది, బాలమ్మ చీరె చాలా మందంగా ఉంది, వెంటనే వాడు మా తరగతి గదిలోకి పరుగెట్టి తన సంచీలో ఉన్న వాడి చేతి రుమాలు తెచ్చి కుమారుకిచ్చి, "ఇది తీసుకో మెత్తగా ఉంటుంది, రక్తం రాదు , నొప్పేయదు" అని చెప్పాడు.అది వాడి మొదటి జాలి గుండె రెస్పాన్స్. ఇంటికెళ్ళాక వాళ్ళమ్మకు చెప్పగా ఆమె "పోనీలేరా ! పోతు రాజూ! అవసరంలో ఉన్న వారికి అలా సాయం చేయడం మంచిదే, మనం ఇతరులకు సాయం చేస్తే దేవుడు మనకు సాయం చేస్తాడు." అంది. అలా వాళ్ళమ్మ ఉగ్గు పాలతో జాలి నూరి పోయడం వల్ల వాడి జాలి గుండె ప్రవాహం మొదలైంది. ఆ తర్వాత వాడు చేసే సాయాలు చాలానే ఉండేవి, పెన్సిళ్ళు ఎక్కువగా తెచ్చే వాడు , అవసరమైన వాళ్ళకు అచ్చంగా ఇచ్చేవాడు.

ఇహ ఎరేజర్స్ కూ, బలపాలకు లెక్కేలేదు, ఎవరికి కావల్సినా పరుగు పరుగున వచ్చి పట్టుకెళ్ళే వారు, ఒక్కో మారు ఉపాధ్యాయులు కూడా బలపం కావాల్సిన వాళ్ళను “వెళ్ళి పోత రాజు దగ్గర తెచ్చుకో పో " అని పంపే వారు. అలా సాయానికి మారు పేరుగా మా పోతరాజు చిన్నతనం నుంచే పేరు పొందాడు. ఐదో క్లాస్ లో ఉండగా పోతరాజు పుట్టిన రోజుకు వాళ్ళమ్మ కొనిచ్చిన కొత్త చెప్పులు, ఆ సాయం కాలం బడ య్యాక ఇంటి కెళుతుండగా కాళ్ళకు చెప్పుల్లేకుండా గాయమైన కాళ్ళతో వెళుతున్న ఒక వీధి కుర్రాడ్ని చూసి అవి ఇచ్చేశాడు."చూడరా రఘూ! పాపం కాలికి గాయమైందిరా!ఎలా నడుస్తాడూ!" అని జాలి మాటలు కూడా జోడించాడు. ఇంటికెళ్ళాక వాళ్ళమ్మ కోప్పడుతుందని అనుకున్నాను. ఆమె వాడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. "పోన్లే నాయనా! మరో జత కొంటాగా!"అంది.”ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా!' అని ఆశ్చర్య పోయాను. వాడి జాలి గుండెకు మూలం ఆమే అని నిదానంగా తెల్సింది

నాకు. హై స్కూల్ కెళ్ళాక వాడి జాలి ప్రవాహం ఎక్కువ కాసాగింది వర్షా కాలపు కృష్ణా గోదావరుల్లా. నోట్ బుక్కులూ, అచ్చు పుస్తకాలూ , పెన్ లూ అరువుగా కాక అచ్చంగా ఇచ్చేవాడు, అచ్చు బొక్కులు మళ్ళా వాళ్ళమ్మ కొనిచ్చేది. ఏడో క్లాస్ లో ఉండగా పరీక్ష ఫీజ్ కట్ట లేని ఇద్దరికి వాళ్ళమ్మనడిగి కట్టి సాయం చేశాడు. అలా వాడి పేరు స్కూలంతా తెల్సిపోయింది. బడికి రాని వాళ్ళకు నోట్సు వ్రాసివ్వడం, రికార్డులో డ్రాయింగ్ లు వేసివ్వడం చేసేవాడు. వాడు లెక్కల్లో దిట్ట. చేతి వ్రాత ముత్యాల వరుసలే. చాలా మంది వాడి చేత నోట్లు వ్రాయించుకోను కావాల్ని బడి మానేవారు."పోత రాజూ! నిజంగా అవసరమైన వాళ్ళకే చేయరా! నీ జాలిని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు" అని నేనంటే," పోనీరా రఘూ! నాకూ చదవకుండానే బాగా వచ్చేస్తుంది కదా! ఒక మారు వ్రాస్తే పదిమార్లు చదివినట్లుట కదా!"అని ఓపిగ్గా వ్రాసిచ్చేవాడు.

ఒక మారు వాళ్ళ నాన్న గారు ఊర్లో లేనపుడు, వాళ్ళమ్మ పోస్టాఫీస్ కెళ్ళి వాళ్ళ అక్క గారికి అతి జరూరుగా సొమ్ము పంపాల్సి వచ్చి , మనియార్డర్ చేయను చేత కాక ఇబ్బంది పడిందిట, అప్పుడు మా పోతరాజు ఎనిమిదేళ్ల వాడు. వాళ్ళమ్మ పడిన బాధ చూసి వాడికి బాధేసిందిట, వాళ్ళమ్మ "నాయనా ! నీవు పెద్దయ్యాక వీలుంటే పోస్టాఫీసు వద్ద చదువు రాక చిరునామాలూ, మనియార్డర్ లూ వ్రాసుకోను రాని వారికి సాయం చేయరా బాబూ!" అందిట. అది బాగా గుర్తు పెట్టుకున్నాడు మా పోత రాజు. అమ్మ మాటంటే వానికంత గురి. ఎనిమిదో క్లాసులో ఉండగా , మనియార్డర్ లు చేయడం, చిరునామాలు వ్రాయడం వంటివి మా సార్లు పోస్టాఫీసుకు తీసుకెళ్ళి నేర్పినప్పట్లుంచీ , మా పోతరాజు తీరికున్నప్పుడల్లా పోస్టాఫీసు కెళ్ళి సాయం చేసే వాడు. పదో క్లాస్ లో ఉండగా ట్యూషన్ పెట్టించుకునే స్థోమత లేని వారికి బడయ్యాక లెక్కలు నేర్పేవాడు, అలా వాడికి చెప్పి చెప్పీ , పాఠ్యాంశాలు అలవోకగా నోటికొచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చాడు. వాడికి చదువు చెప్పడం ఒక హ్యాబీ గా మారింది. అందుకే ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తీసుకుని, బిఎస్సీ చేశాడు, ఆ తర్వాత ఎమ్మెస్సీ కూడానూ. నేను వాడి స్నేహం వదులు కోలేక వాడితో పాటే చదివాను. ఇద్దరికీ లెక్చరర్ పోస్టులు వచ్చాయి,

కానీ వేరే వేరే ఊళ్ళలో. అలా మా స్నేహానికి తాత్కాలిక దూరం ఏర్పడింది. క్రమేపీ వివాహం, సంసారం, సంతానం ఏర్పడ్డాక, ఫోన్ సౌకర్యాలూ గట్రా వచ్చాక అప్పుడప్పుడూ వ్రాసుకునే ఉత్తరాల స్థానంలో ఫోన్ సంభాషణలు పెరిగాయి. వాడికి ఇద్దరు కొడుకులు, నాకు ఒక కూతురు, ఒక కొడుకూనూ. ఐతే మా పోత రాజు జాలి గుణం మాత్రం తగ్గక పోగా వయస్సుతో పాటుగా పెరగ సాగింది. ఎందరో తన విద్యార్ధులకు ఉచిత టూషన్ తరగతులు, పేద విద్యార్ధులకు ఫీజులూ కట్టేవాడు, వాడి జీతంలో పదో వంతు సేవలకు అట్టే పేట్టే వాడు. చలి కాలంలో ఆది వారాలు ఒక బ్యాగ్ లో చీరలూ, దుప్పట్లూ పెట్టుకుని పేవ్ మెంట్ మీది వారికి ఇచ్చేవాడు, వేసవిలో పాదరక్షలు ఇచ్చే వాడు. వీలున్నప్పుడల్లా భోజనం పొట్లాలు పేవ్ మెంట్ మీది ముసలీ ముతకాలకూ, అంగ వైకల్యం ఉన్న వారికీ ఇచ్చి వచ్చే వాడు. అలా ఎంతో మందికి వాడి ఆశీర్వాదాలు అందుతూనే ఉండేవి. అప్పుడప్పుడూ ఫోన్ లు చేసుకున్నపుడు వాడు తాను చేసే ఈ చిన్ని చిన్ని సాయాల గురించీ నేను అడగ్గా అడగ్గా చెప్పేవాడు. ఏ పని మీద వెళ్ళినా సమయానికి తిరిగి వస్తాడనే నమ్మకం ఇంట్లో వాళ్ళకు ఏనాడో పోయిందని మా చెల్లెమ్మ అప్పుడప్పుడూ మాట్లాడినపుడు చెప్పేది. ఎవరు ఏ సాయం కోరినా మా పోతరాజు కాదనడు, అది వాడి నిఘంటువులో లేనే లేదు.


మా ఇద్దరికీ ఓ శుభ ముహూర్తాన ఓ ఆలోచన వచ్చింది. మాలాగే మా సంతానాన్నీ స్నేహితులను చేయాలని. అందుకే వాళ్ళను పరాయి ఊరైనా ఒకే కాలేజీలో వేద్దామని నిర్ణయించాం. వాడికి అప్లికేషన్ పంపి , పోస్టాఫీస్ కు వెళ్ళి మని యార్డర్ చేసి, అప్లికేషన్ పూర్తి చేసి మనియార్డర్ రసీదూ కలిపి పోస్ట్ చేయమని చెప్పాను. చివరి తేదీ దగ్గర పడింది. "ఏరా !పోత రాజూ ! మూడు రోజులే ఉందిరా! ఇంకా పంప లేదా!"అని ఫోన్ చేయగా ,"ఒరే రాఘవా! వారం నుంచీ వెళ్తూనే ఉన్నారా! అక్కడ అడ్రస్ వ్రాసుకోను చేతకాని వాళ్ళూ, ఫారం ఫిలప్ చేయను రాని వాళ్ళూ, ఏవో అర్జంట్ పార్సిల్స్ పంపను చిరునామా ఆంగ్లంలో వ్రాయను చేత కాని వారూ పాపం ఇబ్బంది పడుతుంటే సాయం చేసే సరికి నాలైన్ పోతున్నది, కాలేజ్ టైమై పోతున్నది , ఈ రోజు తప్పక కడతానుగా!" అన్నాడు. అలా కాదని వాడి కొడుకుని పిల్చి వాళ్ళ నాన్నతో ఈరోజుకు వెళ్ళమని చెప్పాను. పోస్టాఫీసుకు వెళ్ళగానే పోతరాజును చూసి, చాలా మంది చుట్టూ మూగారుట. వాళ్ళను తప్పించుకు పోను వాడి వల్ల కాలేదుట.  పైగా చెల్లాయి చెప్పిన మాటలు వింటే నాకు నవ్వు ఆగింది కాదు. "పోత రాజూ! పోస్టాఫీసుకా?నాక్కాస్త ఒక ఐదు రూపాయలకు కార్డులు తెచ్చిద్దూ !” ,

”పోత రాజూ! పోస్టాఫీసుకా! ఈ లెటర్స్ పోస్ట్ చేద్దూ  , స్టాంపులు అంటించాలయ్యా!” ,  ” పోతరాజూ పోస్టాఫీసుకా! తపాలా బిళ్ళలు తెచ్చిద్దూ !” అంటూ కనీసం పదిమంది ఏదేదో పనులు చెప్పేవారుట. వాళ్ళ పనులన్నీ చేసే సరికి తన పని హుళక్కిట. చివరకు వాని కొడుకునేమని ఆర్డర్ చేయించి, రసీదు, పూర్తి చేసిన అప్లికేషనూ పోస్ట్ చేయమంటే చేసాడు.. తీరా కాలేజ్ కెళ్ళాక " ఏంటీ నీవు పోత రాజు గారి కొడుకువా! మీ నాన్న గారెక్కడ!"అన్నాడా కాలేజ్ కరస్పాండెంట్ . పోత రాజు కొడుకును నాతో పంపమని చెప్పి నేనే తీసుకెళ్ళాను కాలేజ్ అడ్మిషన్ కు. అతగాడికి పోతరాజు పరీక్ష ఫీజ్ కట్టాట్ట ఎప్పుడో, ఇంకేం మా పిల్లలిద్దరికీ సీట్లు ఫ్రీ గానే దొరికాయి.

అలా మా వాళ్ళ కాలేజ్ చదువు పూర్తయ్యాక ఇద్దరూ ఇంజనీర్లయ్యాక , ఒక మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగంలో చేరిన రోజున ఇంటికొచ్చి మా వాడూ, పోతరాజు కొడుకూ చెప్పిన మాటలు వింటుంటే ఆశ్చర్యమేసింది. ఆ కంపెనీ యజమాని మా వాడి స్టూడెంటుట. బయోడేటా చూసి కనుక్కుని పోత రాజు కొడుకని తెల్సి మహా సంతోష పడ్దాట్ట అతగాడు. రోజులలా పోత రాజుకు సంఘ సేవ తోనూ, నాకు స్వంత సేవ తోనూ గడచి పోయి, నేనూ పోత రాజూ రిటైరయ్యాం. పక్క పక్కనే ఇళ్ళు కొనుక్కుని బాల్య స్నేహానికి మళ్ళా ప్రోదు చేసుకోసాగాం. ఓ రోజున పోతరాజు ఇంటి ముందు ఒక పెద్ద బెంజ్ కారు ఆగింది. దాన్లోంచీ ఓ సూటూ వాలా దిగాడు. ఎవరాని నేనూ వరండాలోకి వెళ్ళాను, చెల్లెమ్మ ఒక్కర్తే ఇంట్లో ఉందని."ఏమండీ! పోతరాజు గారిల్లు ఇదేనాండీ! వారున్నారా ఇంట్లో !" అని అడిగాడతను. "లేరండీ! వారు పోస్టాఫీసు కెళ్ళారు, ఎప్పుడోస్తారో కూడా తెలీదు." అంది చెల్లెమ్మ. అతగాడు "వారింకా ఈ సేవలు మానలేదన్న మాట. సరే నేనక్కడికే వెళ్ళి మాట్లాడుతాను. ట్రంక్ రోడ్ లోని మైన్ పోస్టాఫిసే కదండీ!" అంటూ కారు వేపు కదిలాడాయన. 

ఆ తర్వాత ఐనదేంటంటే ఆయన కొడుక్కు మా వాడి కూతుర్ని పైసా ఖర్చు లేకుండా చేసుకున్నాడాయన, మా వాడు చేసిన సేవలకు ప్రతి ఫలంగా. మావాడు సంపాదించే అవకాశం ఉన్నా, డబ్బు సంపాదించక పోయినా మంచి పేరు సంపాదించాడు, వాడి కొడుక్కు ఉద్యోగం, కూతురి వివాహం వాడి సేవా ఫలితంగానే ఐనాయి. వాడు ఇంకా పోస్టాఫీసు సేవలు మాత్రం మానలేదు. పోతురాజు కేరాఫ్ అడ్రెస్ పోస్టాఫీసైంది.

మరిన్ని కథలు