Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review
చిత్రం: కుమారి 21 ఎఫ్‌ 
తారాగణం: రాజ్‌ తరుణ్‌, హీబా పటేల్‌, నోయెల్‌, నవీన్‌, సుదర్శన్‌, హేమ తదితరులు 
ఛాయాగ్రహణం: రత్నవేలు 
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 
దర్శకత్వం: సూర్య ప్రతాప్‌ 
బ్యానర్‌: సుకుమార్‌ రైటింగ్స్‌ 
నిర్మాత: సుకుమార్‌ 
విడుదల తేదీ: 20 నవంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉంటాడు సిద్దూ (రాజ్‌తరుణ్‌). తానుండే కాలనీలో ముగ్గురు కురాళ్ళతో సిద్దూ స్నేహం చేస్తాడు. అదే కాలనీలోకి మోడల్‌ కుమారి(హీబా పటేల్‌) వస్తుంది. కుమారితో, సిద్దూకి పరిచయం ఏర్పడుతుంది. అయితే మోడల్‌తో స్నేహం మంచిది కాదనీ, వాడుకుని వదిలేస్తారంటూ కుమారి క్యారెక్టర్‌ గురించి సిద్దూకి అతని ఫ్రెండ్స్‌ చెడుగా చెప్తారు. ఓ సందర్భంలో కుమారికీ, సిద్దూకీ మధ్య గొడవ జరుగుతుంది. అంతలోనే సిద్దూ ఫ్రెండ్స్‌, కుమారి కోసం ట్రై చేస్తుంటారు. అప్పుడే సిద్దూకి కుమారి పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత సిద్దూ, కుమారిని దక్కించుకోవడానికి ఏం చేస్తాడు? అసలు కుమారి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అనేది మిగతా కథ. అది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే 
'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ' చిత్రాల్లో సరదా సరదాగా కనిపించిన రాజ్‌తరుణ్‌, ఈ సినిమాలో ఇంకాస్త డిఫరెంట్‌గా కనిపిస్తాడు. కొంచెం బరువైన పాత్రలో నటించినా మెప్పించాడు. తెరపై ఎనర్జీ లెవల్స్‌ చూపించడంలో రాజ్‌ తరుణ్‌ మళ్ళీ మంచి మార్కులు కొట్టేస్తాడు. ఎమషనల్‌ సీన్స్‌లోనూ రాణించాడు. సరదాగా సాగే సన్నివేశాల్లో అయితే తన ట్రేడ్‌ మార్క్‌ ఎనర్జీతో దూసుకుపోయాడు. హీబా పటేల్‌ నటనతో ఆకట్టుకుంది. గ్లామరస్‌గానూ కనిపించింది. నవీన్‌, సుదర్శన్‌ కామెడీతో అలరించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. 

సుకుమార్‌ కథలు డిఫరెంట్‌గా వుంటాయి. కథ, కథనాల విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధ అభినందనీయం. డైలాగ్స్‌ బాగున్నాయి. కథనం ఆకట్టుకుంటుంది. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి వెన్నెముకగా నిలిచాయి. ఎడిటింగ్‌ బాగుంది. అక్కడక్కడా ఇంకాస్త బెటర్‌గా ఎడిటింగ్‌ చేసి వుంటే బాగుణ్ణనిపించడం సహజం. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ వర్క్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రదాన ఆకర్షణ. డిఫరెంట్‌ లైటింగ్‌తో సినిమా మూడ్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్ళగలిగాడు సినిమాటోగ్రాఫర్‌. నిర్మాణ విలువలు బాగున్నాయి. భారీ బడ్జెట్‌ సినిమా తరహాలో సినిమా రిచ్‌గా తెరకెక్కింది. చిన్న సినిమా అన్న భావనే ఎక్కడా కలగలేదు. 

విభిన్న చిత్రాలు తెరకెక్కించే సుకుమార్‌ లవ్‌ స్టోరీస్‌ని బాగా డీల్‌ చేస్తాడు. యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తాయి అతని సినిమాలు. ఈ సినిమా కూడా యూత్‌ని టార్గెట్‌ చేసి తీసిందే, సహజత్వానికి దగ్గరగా చూపించే ప్రయత్నంలో గ్లామర్‌ కాస్త హద్దులు దాటిందేమో అనిపిస్తుంది. యూత్‌ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసేది కూడా అదే. ఫస్టాఫ్‌లో కాస్త స్లోగా, కాస్త స్పీడ్‌గా వున్నట్లు అనిపిస్తుంది. సెకెండాఫ్‌ కూడా అంతే. క్లయిమాక్స్‌లో ఎమోషనల్‌ సీన్స్‌ బావున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాకి ఎంతవరకు కనెక్ట్‌ అవుతారనేది ప్రశ్నార్థకమే. యూత్‌ మాత్రం బాగా కనెక్ట్‌ అయ్యే అవకాశాలెక్కువ. భారీ బడ్జెట్‌ సినిమా కాకపోవడం ఈ సినిమాకి పెద్ద ప్లస్‌. ఓపెనింగ్స్‌ వరకూ అదుర్స్‌ అనిపించేలా వున్నాయంటే, అది పబ్లిసిటీ పుణ్యమే. సుకుమార్‌ డైరెక్షన్‌, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌, రాజ్‌ తరుణ్‌ హీరో.. ఇవన్నీ థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పిస్తాయి. ఓవరాల్‌గా సినిమా నిరాశపరచదు. టార్గెట్‌ ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేసే అంశాలున్నాయి కాబట్టి, బాక్సాఫీస్‌ వద్ద ప్రాఫిట్‌ వెంచర్‌గానే నిలబడే అవకాశాలున్నాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఈ 'కుమారి' హాట్‌ గురూ 

అంకెల్లో చెప్పాలంటే 
3.5/5
మరిన్ని సినిమా కబుర్లు
interview