Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

జరిగిన కథ : నాగానందుడు అల్పమానవులంటూ చేసిన చేసిన పరిహాసం, ధనుంజయునిలో ఆగ్రహావేశాలను తెప్పిస్తుంది...ఇద్దరిమధ్య వాగ్యుద్ధం జరుగుతుంది...దారికడ్డంగా తమ కంచర గాడిదలను మోహరింపజేస్తారు నాగాలు...

 ‘‘సరిసరి ఆలస్యమెందుకు? ఇక పోరు ఆరంభించుటే మంచిది. వదరి పోకుండా మీ నాగాలను ముందుకొచ్చి పోరాడమని ఆదేశించు. కాని యుద్ధం మొదయ్యాక మీలో ఒక్కడూ ప్రాణాలతో మిగలరని గుర్తుంచుకో.’’ అంటూ హెచ్చరించాడు ధనుంజయుడు.

అప్పటికింకా మండుటెండలో గిరిశిఖరం మీద బాటమీదే నిలబడున్నారంతా. ఉష్ణతాపం అధికరించి అతడి అశ్వం గరుడ కదం తొక్కుతోంది. వడగాల్పు తాకిడికి అడవంతా భయానక నిశ్శబ్ధం ఆవరించి వుంది. గగనతలంలో పక్షి కూడ తిరుగుతున్న జాడ లేదు. కంచర గాడిదను మళ్ళించి వెను తిరిగిన నాగా వృద్ధుడు వెనక్కి చూసి విచిత్రంగా నవ్వాడు.

ఆ నవ్వుకి అర్థం ఏమిటి?’’

అదేమిటో ఆ వృద్ధుడికే తెలియాలి. కాని`

ధనుంజయుడికి ఆ నవ్వు వెక్కిరింపుగా తోచి తీక్షణంగా చూస్తూ` ‘‘యుద్ధం ఆరంభమైతే నీ ముఖంలో ఆ నవ్వు వుండదు వృద్ధ నాయకా. కదం తొక్కే నీ మనుషుల్ని ముందుకు రమ్మని ఆనతివ్వు’’ అంటూ తీక్షణంగా హెచ్చరించాడు.

అప్పుడు కూడ ఆ వృద్ధుని ముఖంలో నవ్వు చెరగలేదు. ‘‘క్షమించాలి యువరాజా! మీకు తెలియని విషయం ఏమంటే` మాలో ఏ ఒక్కర్ని మీరు చంప లేరు. చచ్చినా తిరిగి తిరిగి లేస్తూనే వుంటాం. పోరాడి పోరాడి మీరు అలసిపోవాలి గాని మాకు చావటం, ఓటమి రెండూ వుండవు’’ అన్నాడు.

వృద్ధుడి చిరునవ్వుకి అర్థం ఏమిటో ఇప్పుడు తెలిసింది ధనుంజయకి.

విభ్రాంతుడై కొద్ది క్షణాలు`

అలాగే ఆ నాగా వృద్ధున్ని చూస్తుండి పోయాడు.

ఏమంటున్నాడీ వృద్ధ నాగా? చచ్చినా తిరిగి తిరిగి బ్రతుకుతూంటారా. వీళ్ళకి చావు లేదా? ఇదెలా సంభవం? వీళ్ళేమీ పిశాచ జన్మలు కాదుగా? సాధారణ ఆటవిక నాగ తెగ నరులే గదా. వీళ్ళకి చావు ఎందుకుండదు? అదే నిజమైతే పోరాడి పోరాడి తను అలసి పోవాలి గాని వీళ్ళు స్థిరం గానే వుంటారు. ఇక వీళ్ళ ఓటమి చూడకుండా తను ముందుకు పోవుట ఎలా? లేదు లేదు. తనను బెదిరించటానికే ఇతను అబద్ధం చెప్తున్నాడు. హతుడైన మనిషి తిరిగి బ్రతుకుట సాధ్యం కానే కాదు.

‘‘ఓయీ... నీవేం చెపుతున్నావో నీకైనా అర్థమవుతోందా? నాకయితే ఏమీ అర్థం గావటం లేదు. అబద్ధాలతో నన్ను మోసగించ లేవు. యుద్ధం చేస్తారా దారి తొలగుతారా వెంటనే చెప్పుము’’ అనరిచాడు.

వృద్ధుడు ముఖంలో చిరునవ్వు చెరగ లేదు, అలాగే వుంది. చుట్టూ అతడి మనుషులు ఆవేశంతో ఆయుధాలు ఝుళిపించి కదం తొక్కుతూ పాములు బుస కొడుతున్నట్టు హుంకరిస్తూనే వున్నారు. వారి కాళ్ళ తోడాల శబ్ధం లయబద్ధంగా మోగుతూనే వుంది. ఒకింత ఆగి పెదవి విప్పాడు వృద్ధ నాగానందుడు.

‘‘నేను అబద్ధం చెప్పుట లేదు యువరాజా. సత్యమే చెప్పినాను. మాకు చావు లేదు. ఎందుకంటే, ఇక్కడ మీకు కన్పిస్తున్న మేమంతా నిజం కాదు, ఇవన్నీ మా ప్రతిరూపాలు’’ అన్నాడు.

ఆ మాటలో ధనుంజయుడు మరింత ఆశ్చర్యానికి గురవుతూ` ‘‘ప్రతి రూపాలా.....’’ అనరిచాడు.

‘‘అవును. ప్రతి రూపాలమే. మా నిజ శరీరాలు ఇదే విధంగా మా నాగా గూడెంలో మోహరించి వున్నాయి. నీ ప్రతి రూపం మా నిజ శరీరాల మధ్యన వుండగా నీవు ఇక్కడ నిజ శరీరంతో మా మధ్యన వున్నావు. అందుకే నీవు మమ్మల్ని, మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాము. నీవు మాతో యుద్ధం చేస్తే మా మాయ శరీరాలు అంతం కావు. మా నిజ శరీరాలు అక్కడ క్షేమం గానే వుంటాయి.’’ చెప్పాడు నాగా వృద్ధుడు.

అప్పటికీ ధనుంజయుడికి ఆ మాటల  మీద నమ్మకం కుదరలేదు.

‘‘నేను నమ్మజాల . నీవు చెప్పునది అభూతకల్పన. ధ్వనికి ప్రతిధ్వని వుండొచ్చుగాని దృశ్యానికి ప్రతి దృశ్యం వుండదు’’ అన్నాడు.

‘‘ఉంటుంది యువరాజా. అది సాధ్యమే. మా నాగాలకు మాత్రమే సొంతమైన ఓజో తాంత్రిక విద్య అనే క్షుద్ర విద్య మా సొంతం.’’

‘‘ఓజో తాంత్రిక విద్యా. అలాంటి ఒక క్షుద్ర విద్య ఉన్నట్టు వినలేదు.’’

‘‘ఇప్పుడు వింటున్నారు గదా. వుంది. అక్కడ సుదూర ప్రాంతాల్లోని మా గూడెం మద్యలో మా నాయకుడు నాగకేసరి ఆధ్వర్యంలో ఈ క్షుద్రపూజ చేసి ఈ ఓజో విద్యను ప్రయోగించటం ద్వారా మా కులపెద్దలు మా ప్రతిరూపాన్ని మీ వద్దకు పంపించారు.’’

‘‘ఇది నిక్కమని నమ్మవచ్చునా?’’

‘‘ముమ్మాటికీ నమ్మవచ్చును యువరాజా’’

‘‘నీ గార్థభ వాహనం కూడ ప్రతిరూపమేనా?’’

‘‘అవును.’’

‘‘అయినచో నీ గార్ధభాన్ని సంహరించి సంశయనివృత్తి చేసుకొందును.’’ అంటూ గార్ధభ మీదకు బాణాన్ని ప్రయోగించాడు. బాణం సూటిగా గుండెల్లో దిగబడింది. పెద్దగా అరుస్తూ నేలకూలిందా గాడిద. అది చనిపోయింది. నాగా మాటలు అసత్యమని వూహించాడు ధనుంజయుడు. కాని మరుక్షణమే అతడి వూహల్ని చెరిపేస్తూ నేలకూలిన గార్ధభం చెంగున లేచి నిబడింది. నాటుకున్న బాణం నేల మీదపడుంది. ధనుంజయుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు.

‘‘ఇప్పటికీ మీ సంశయం తీరకున్న మీ ఖడ్గంతో నన్ను సంహరించి చూడండి యువరాజా. నేను చావను. మా ఓజో తాంత్రిక క్షుద్ర విద్య మహత్తు అది. మీరు మాతో యుద్ధం చేసి మమ్ములను దాటి ముందుకు పోలేరు. నా మాట విని కోటకు మరలిపోవుట మంచిది. పోరాటమే మీ నిర్ణయమైతే మేం సిద్ధంగానే వున్నాం’’ అంటూ తన కంచరగాడిద కళ్ళాలు పుచ్చుకుని హుందాగా తన మనుషుల వైపు వెళ్ళిపోయాడు నాగా వృద్ధ నాయకుడు నాగానందుడు.

ధనుంజయునికి ఏం చేయాలో కొద్దిసేపు అర్థం కాలేదు.

సరిగ్గా అదే సమయానికి`

అక్కడికి కొద్ది దూరంలో`

ఒక శాలివృక్షం ఛాయలో నిలబడుంది అపర్ణుడి మచ్చల గుర్రం ఢాకిని. అంతకు కొద్దిక్షణాల క్రితమే ఆ గిరిశిఖరం పైకి చేరుకున్నాడు అపర్ణుడు.

దిగువ మిట్ట మీద బిడారు గుంపు నాయకుడు భల్లాతకుని వద్ద శలవు తీసుకుని బయలుదేరిన అపర్ణుడు మార్గంలో ఎక్కడా ఆగలేదు. రత్నగిరి సైన్య ఆగమన వార్తను యువరాజుకు తెలియపర్చి హెచ్చరించే ఉద్దేశంతో వాయువేగంతో మచ్చలగుర్రాన్ని దౌడు తీయించాడు. అయినప్పటికీ తను కొండపైకి చేరేలోపలే యువరాజు బాటవెంట ఆవలికి దిగిపోయి వుండొచ్చనుకున్నాడు. కాని పైకి చేరుతూనే అక్కడే వున్న ధనుంజయుని, కదం తొక్కుతున్న అతడి అశ్వాన్ని గమనించి విస్మయం చెందాడు. అక్కడ ఏదో జరుగుతోందని అర్థమై కాస్త ఎడంలోనే ఆగిపోయాడు.

చాలా విచిత్రమైన దృశ్యాన్ని చూస్తున్నాడతను.

యువరాజు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కాని అతని సమీపంలో కంటికెవరూ కన్పించటం లేదు. మాటలు అస్పష్టంగా విన్పిస్తున్నాయి. చుట్టూ ఎవరో వున్నట్టు చూస్తున్నాడు. చేతుల్లో ధనుర్భాణాలున్నాయి. విల్లు ఎక్కుపెట్టి సమీపంలోకి బాణం వేసాడు. అది భూమిలో దిగబడింది. ఎవరో వెళ్తున్నట్టు చూస్తున్నాడు. అంతా విచిత్రంగా వుంది.

నిజానికి సాధారణ పరిస్థితుల్లో అయితే చాలా దూరం వినబడే తన అశ్వం గిట్టల శబ్ధాన్ని గమనించి అతడు తన వైపు చూడాలి. కాని తన అశ్వాన్నే అతడు గమనించటం లేదు. అంటే! ఖచ్చితంగా అక్కడేదో విచిత్రం జరుగుతోంది. అది ఏమై వుంటుంది? ఒకింత తీవ్రంగా ఆలోచించిన అపర్ణుడు తన కుడిచేతి బొటనవేలిని భ్రూమధ్యంలో వుంచుకొని జ్ఞానదృష్టిని కేంద్రీకరించి కొద్దిక్షణాలు అంతర్ముఖుడయ్యాడు. అంతే`

అక్కడ ఏం జరుగుతోందీ వెంటనే`

అపర్ణుడికి అర్థమైపోయి, కనులు తెరిచాడు.

అశ్వాన్ని ముందుకు పోనిచ్చాడు.

ధనుంజయుని సమీపించగానే ఏదో మంత్రాన్ని పఠించి, రెండు చేతులు చేర్చి బిగ్గరగా మూడుసార్లు చప్పట్లు చరిచాడు.

*************************************

అది ఉత్తర భరతవర్షంలో సుదూరంగా`

ఈశాన్య ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.

కీకారణ్యాలకూ, కృారమృగాలకూ నిలయం.

చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అనే నానుడికి అర్థం ఏమిటో ఆ అరణ్యాలను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా అక్కడ ఖడ్గమృగాలు, అనేక సర్పజాతులు, విషకీటకాల సంచారం ఎక్కువ. వర్షపాతం కూడా ఎక్కువే. నదులు, వాగులు, వంకులు ఎప్పుడు పొంగుతాయో ఎప్పుడు శాంతిస్తాయో అర్థంకాదు. అక్కడ నాగాజాతి ప్రజలు నివశించటం చేత ఆ ప్రాంతాన్ని నాగభూమి అని, నాగారణ్యాలని పిలుస్తూంటారు. నాగాలు తప్ప ఇతర ఆటవిక జాతులేవీ అక్కడ కన్పించవు. నాగాజాతి తప్ప ఇతరులెవరూ అక్కడ బ్రతికి బట్టకట్టడం అసాధ్యం. ఆపైన అవి ఏ రాజ్యానికీ అధిపత్యం లేని భూభాగాలు గావటం వలన అక్కడ నాగాలదే ఆధిపత్యం.

సహజంగానే నాగాల జనసంఖ్య స్వల్పం. వారంతా అయిదారు గూడారాలలో తలోచోట నివశిస్తున్నారు. ప్రతి గూడానికి గూడెం నాయకుడు, కులపెద్ద, కుల గురువు లాంటి ముఖ్యులు పెద్దలుగా వుంటారు. ఈ గూడాలన్నిటికి ముఖ్యమైన పెద్ద గూడెం ఒకటుంది. అది నాగుల దిబ్బ అనబడే పెద్ద కొండ మీద వుంది. ప్రతి నాగ గూడానికి నాయకత్వం ఉన్నప్పటికీ ఆ గూడాలన్నిటికి నాయకత్వం వహించేది మాత్రం నాగులదిబ్బ మీది నాగ గూడెం మాత్రమే. ఆ గూడెం నాయకుని మాటకి మిగిలిన నాగాలంతా కట్టుబడి వుంటారు. అటువంటి నాగ గూడెం దొర అయిన నాయకుడి పేరు నాగ కేసరి.

బయటి వారికి ఆఖరికి ఆటవిక సంచార తండాలయిన బోయ, కోయ, చెంచు, యానాది, ఉప్పర, ఎరుకల మొదలయిన ఇతర ఆటవిక జాతులు  కూడా నాగ భూముల్లో అడుగు పెట్టే సాహసం చేయరు. అంతటి ప్రమాద కరమైన ప్రాంతాలవి. అందుకే నాగాటవిని మర్మ భూమి అని కూడ వ్యవహరిస్తారు.

ఆ అడవి దారులన్నీ కొట్టిన పిండి గాబట్టి స్థానికులయిన నాగాలు మాత్రం యధేచ్ఛగా బయటి కొచ్చి జన పదాలు, నగర ప్రాంతాలు చుట్టి తమ స్థానాలకు వెళ్ళి పోతూంటారు.

అంటే నాగాల గురించి బయటి ప్రపంచానికంతా తెలీదు గాని నాగాలకు బయటి ప్రపంచం తెలుసు. వీళ్ళ ప్రధాన వృత్తి వేట. వీళ్ళు తమ కుల దైవంగా నాగ రాజును పూజిస్తారు. ఇంకా కొండ దేవరకు, కాళికమ్మను, వన దేవతను పూజిస్తారు. వీరి ప్రధాన వృత్తి వేట. ప్రకృతి ఒడిలో పరిమళించిన నిండైన జీవితం వారిది.

తర్వాత కాలంలో వీరిలో కొందరు బయటి కొచ్చి వీర విద్యలు నేర్చుకుని సైన్యాల్లో చేరి గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించారు. క్రమంగా నాగ జాతి అభివృద్ధి చెందింది. వీరు దక్షిణ ప్రాంతానికి వలస పోయి రాజ్యాల్ని స్థాపించారు. నాగుల పరిపాలనా కాలానికి చెందిన చారిత్రకాధారాలు వున్నాయి. అలాగే గరుడ జాతి వారూ కొన్ని భూ భాగాల్ని పరిపాలించారు.

మానవ జాతి యావత్తూ ఒకే సారి ఏర్పడింది కాదని ఆయా కాలాల్లో ఆయా జాతులు ఏర్పడ్డాయని చరిత్రను గాని పురాణాలను గాని పరిశీలిస్తే అర్థమవుతుంది.

సాధారణంగా ఎవరో ఒక ప్రసిద్ధ పురుషుడు ఆ వంశానికి మూల పురుషుడై వుంటాడు. శ్రీరామునిది సూర్య వంశం, శ్రీకృష్ణునిది యదు వంశం, దుర్యోధనుడిది కురు వంశం ఇలా ప్రతి వంశానికి మూల పురుషుడున్నాడు. అర్జునుడు తీర్థ యాత్రా సమయంలో తనను వలచిన నాగ కన్య ఉలూచిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె నాగ రాజు కుమార్తె. నాగ లోక వాసులు కోరిన రూపం ధరించగల శక్తిమంతులు.

అదే భూమిపై సంచరించే నాగ సర్పాలయితే నూరు సంవత్సరాలు ఎవరినీ కాటు వేయకుండా బ్రతికుంటే ఆ పాము విషమంతా శిరస్సున చేరి నాగమణి ఏర్పడుతుంది. అలా మణి ఏర్పడిన నాగానికి జ్ఞాన సిద్ధి కలిగి కోరిన రూపం ధరించగల శక్తి వస్తుంది.

ఇక ఉలూచి, అర్జునుల ప్రణయంలో కొడుకు బబ్రు వాహనుడు జన్మించాడు. పుట్టగానే అతడ్ని మామ గారైన నాగ రాజుకు దత్తత ఇచ్చి భార్యను నాగ లోకానే వదిలి తను తీర్థయాత్రలు కొనసాగించాడు అర్జునుడు. తర్వాత పరిణామాల్లో అర్జునుడు ఉలూచి, బబ్రు వాహనుల్ని కలుసుకోలేదు. నాగ రాజుకు దత్త పుత్రునిగా ఉన్నందున బబ్రు వాహనుడూ నాగజాతికి చెందిన వాడవుతాడు. ఆ కారణంగా అతడి సంతతి నాగ జాతిగా భూలోకంలో ప్రసిద్ధి చెందింది.

హనుమంతుడు సీతాన్వేషణకు సముద్రాన్ని లంఘిస్తుండగా ఆయన చెమట బిందువు ఒకటి సముద్రంలో పడింది. ఒక మత్స్య గంధి ఆ చెమట బిందువును మ్రింగి గర్భం దాలచగా మచ్చీంద్రుడనే కొడుకు పుట్టాడు.

శ్రీహరి స్వేద బిందువు జారి పుడమిపై పడగా భూదేవి స్వీకరించింది. ఆ విధంగా జన్మించిన వాడు కుజుడు. ఈయనకే అంగారకుడు, మంగళుడు అని పేర్లు. ఆయన పుడమి పుత్రుడు.

పరమ శివుని తపో వేడిమికి ఆయన త్రిశూలం నుండి జారి పడిన స్వేదం ఒక కన్యగా అవతరించింది. ఆమె శివ పుత్రిక. శివానుగ్రహంతో నదిగా మారి ఆమె నర్మద అయినది. ఇలాగే మరో సందర్భంలో శివుని స్వేదం నుండి చర్చిక అనే కన్య పుడుతుంది. ఇదలా వుంచితే`

మన పురాణాలు, ఇతిహాసాల గాధల్లో మరో విధమైన పునరుత్పత్తి పద్ధతి కన్పిస్తుంది.

కుంభ సంభవులు అనగా కుండ నుండి పుట్టిన వారని అర్థం. కుండ నుండి మనిషి పుట్టడం ఏమిటి? ఇది మనకు విడ్డూరంగా వుండొచ్చు. కానీ`

విచ్ఛిన్నమైన గాంధారి గర్భస్థ పిండాన్ని వ్యాసుల వారు తన తపోశక్తితో నూరు కుండల్లో భద్రం చేయగా వాటి నుండి దుర్యోధనితో సహా నూరుగురు సోదరులు జన్మించారు. వీరంతా కుంభ సంభవులే.

కురు పాండవులకు విద్య నేర్పిన ద్రోణా చార్యుడున్నాడు. ద్రోణము అంటే కుండ. ఈయనా కుంభ సంభవుడే. ఇలాంటివి మరి కొన్ని వున్నా ముఖ్యంగా చెప్పుకోవలసిన కుంభ సంభవు ఇద్దరున్నారు. సప్తర్షుల్లోని వశిష్టుడు, అగస్థ్యుడు వీరిద్దరూ కవల సోదరులు కుంభ సంభవులు. అదో ఆసక్తి కరమైన గాధ.

ఒకప్పుడు నారాయణాంశతో జన్మించిన నర నారాయణులనే సోదరులు మహాభక్తులు. తపస్సంపన్నులు. ఇరువురు బదరికా వనంలో ఘోర తపస్సు చేస్తున్నారు. ఆ తపో వేడిమికి ముల్లోకాలు తల్లడిల్లాయి. తన ఇంద్ర పదవి కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారని భ్రమ పడ్డాడు మహేంద్రుడు. వెంటనే ఆ సోదరులకు తపో భంగం కలిగించమని అప్సర భామలను పంపిస్తూ తోడుగా మన్మథుడ్ని, వసంతుడ్ని కూడా పంపించాడు.

బదరికా వనంలో అకాలాన వసంతం వెల్లి విరిసింది. అప్సర భామలు ఆడి పాడారు. మరుడు సుమశరాలు కురిపించాడు. కాని చెరకు విలుకాని సుమ శరాలు గాని బదరికా వనంలోని వసంతశోభ గాని, అప్సరసల సరస శృంగార నాట్య గీతాలు గాని నర నారాయణులను తపో భంగం కలిగించలేక పోయాయి. అప్పుడు కనులు తెరిచిన నర నారాయణులు అప్పటి కప్పుడు తమ ఊరువుల నుండి (తొడలు) అప్సర కామినులకు మించిన ఒక అద్భుత సౌందర్య రాశిని సృష్టించారు. ‘‘ఓ అప్సరలారా! మా తపోశక్తి మీకు తెలియదు. తలచుకుంటే మిమ్ము మించిన మదవతులైన మోహనాంగిలను సృష్టించ గలము. ఇదో... మా ఊరువుల నుంచి ఆవిర్భవించిన ఈ సౌందర్య వతి పేరు ఊర్వశి. ఈమెను మా కానుకగా మహేంద్రునికి వప్పగించండి. మా తపస్సు మహేంద్ర పదవి కోసం కాదని మా మాటగా చెప్పండి’’ అన్నారు.

అలా అప్సరల వెంట స్వర్గం వైపు వెళ్తున్న ఊర్వశిని సూర్య దేవుడు చూసి, మోహించి తన సూర్యా లోకానికి ఆహ్వానించాడు. సరేనని సూర్య లోకం వైపు వెళ్ళింది ఊర్వశి. దారిలో అగ్ని దేవుడు ఆమెను చూసి మోహించి తన కోరిక తీర్చమన్నాడు. ముందు సూర్యునికి మాటిచ్చినట్టు చెప్పింది ఊర్వశి. అయితే నన్ను తులుచుకుంటూ వెళ్ళు చాలు అన్నాడు అగ్ని. ఊర్వశి అలాగే చేసింది. అంతలో వాయు దేవుడు ఆమెను గాంచి మోహితుడై తన కోరిక చెప్పగా అదే సమాధానం చెప్పింది ఊర్వశి. వాయు దేవుడు కూడ తనను తలచుకొంటూ వెళ్ళమని కోరాడు. ఆ విధంగా మనసులో అగ్నిని, వాయు దేవుని తలచుకొంటూ సూర్య లోకం చేరింది ఊర్వశి. సూర్యుడు విషయం తెలుసుకొని ఆగ్రహించి` ‘‘నీవు ఇరువుర్ని తలచుకొంటూ నా వద్దకొచ్చావు. నీకు సూర్య లోక ప్రవేశం లేదు. మహేంద్రుడి వద్దకే వెళ్ళమన్నాడు.

ఆ విధంగా తన వద్ద కొచ్చిన ఊర్వశికి సముచిత స్థానమిచ్చి తన అప్సరగా చేసుకున్నాడు ఇంద్రుడు. అయితే ఇది ఇంతటితో అయి పోలేదు. ఊర్వశి సౌందర్యాన్ని చూసిన మోహంలో తాపం భరింప లేని అగ్ని, వాయువు ఇరువురూ తమ తేజస్సును ఒక కుండలో భద్రపర్చి వెళ్ళి పోయారు. ఆ కుంభంలో నుండి ఇరువురు కవలు బయటి కొచ్చారు. ఆ శిశువులే వశిష్టుడు, ఆగస్త్య మహర్షులు.

పార్వతి నందునుడు గణేశునికి ఏనుగుతల చేర్చబడింది. త నరక బడిన దక్షునికి మేకతల అతికించబడింది.  అలాగే మృగ శీర్షంతో సహజంగా అవతరించిన దేవతలున్నారు. వారిలో నరశింహుని ముందుగా చెప్పుకోవాలి. తురగ ముఖులు మనకు ఇద్దరు కన్పిస్తారు. ఒకరు గాన గంధర్వుడు తుంబురుడు, రెండవది సాక్షాత్తూ నారాయణావతారమైన హయగ్రీవుడు. ఇంకా భైరవుడు కుక్క మొఖం కలిగిన వాడు.

********************************************

అది ఎర్రరాతి మన్నుతో ఏర్పడిన అతి పెద్ద కొండ గుట్ట. ఎత్తు తక్కువే. మూడు వందల ధనువుల ఎత్తుకు మించదు. కాని గుట్ట చుట్టూ కైవారం సువిశాలమైనది. బోర్లించిన దిబ్బ రొట్టెలా కన్పించే ఆ కొండ గుట్ట పేరే నాగుల దిబ్బ. కొండకు శిఖరం వుంటుంది. గుట్టకు శిఖరం వుండదు. ఉపరితలం సమతలంగా వుంటుంది. అలాంటి వాటిని కొండ గుట్టలంటారు. ఈ నాగులదిబ్బ ఎంత విశాలం అంటే దాని మీద ఒక విశాల నగరమే నిర్మించ వచ్చు. అంత సువిశాలమైనది. ఆ గుట్ట మీదే వుంది నాగాల నివాసస్థలమైన నాగా గూడెం.

అది కీకారణ్య ప్రాంతమైనా ఆ గుట్ట పైకి చేరటానికి అనేక దారులున్నాయి. నాగులదిబ్బ గుట్ట పైనా పరిసరాణ్యాలంతటా అనేక వృక్షజాతులు, ఫలవృక్షాలతో ఆ ప్రాంతం కను విందు చేస్తోంది. ఏటవాలు కాలిబాటల వెంట కొండ పైకి నడవాలి. నాగుల కంచర గాడిదలు, పశువులు కూడా ఆ దారుల్లోనే తిరగాలి గాబట్టి దారులన్నీ విశాలంగానే వున్నాయి.

గుట్ట పైకి చేరి మరి కొంత దూరం చెట్టు పుట్లట వెంట నడిచాక గుట్ట మధ్య ప్రాంతంలో పచ్చని చెట్ల క్రింద కను విందు చేస్తూ కన్పిస్తుంది నాగుల గూడెం.

సుమారు అయిదారు వందల ఇళ్ళుంటాయక్కడ. అవన్నీ పూరిళ్ళు. పెద్ద పెద్ద చుట్టు గుడిసెలుగా వున్నాయి. విశాలమైన ప్రాంగణాలతో విసిరేసినట్టు తలో ప్రక్క కన్పిస్తున్నాయి. మూడువేల మందికి పైగా నాగా జాతి ప్రజలు ఆడ, మగ పిల్లా పీచుతో సుఖశాంతులతో జీవిస్తున్నారక్కడ. సహజంగానే నాగాలు శ్రమజీవులు. బలిష్టులు, ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. ప్రతి ఒక్కరు విలువిద్య అభ్యసిస్తారు. వేట కత్తి, గండ్ర గొడ్డలి వీరి ప్రధాన ఆయుధాలు. బళ్ళెం, ఖడ్గ చాలనం, కర్ర సాము యువకులు ఎక్కువ సాధన చేస్తుంటారు. ఆయుధం లేకుండా ఎవరూ అడవి లోకి వెళ్ళరు.

గూడెంలో చూడ్డానికి ఒక పద్ధతి లేకుండా కట్టుకున్నట్టు కన్పిస్తాయి అక్కడి యిళ్ళు. కాని గమనిస్తే అర్థమవుతుంది వారి పద్ధతి.

గూడెం మధ్యలో వృత్తాకారాంలో ఒక మైదాన ప్రాంతం వుంది. అక్కడ ఫలాలనిచ్చే కొన్ని వృక్షాలు మాత్రమే పెంచ బడ్డాయి. ఆ వృత్తాకార మైదానం నుండి నాలుగు దిక్కులకు నాలుగు ప్రధాన మార్గాలున్నాయి. ఆ నాలుగు దారులను అనుసరించి అటు యిటు యిళ్ళ నిర్మాణం మధ్యలో చిన్న వీధులు, సందులు ఏర్పడ్డాయి. ఎటు నుండి కొండ గుట్ట ఎక్కినా ఏదో ఒక మార్గం గుండా మైదానం వద్దకు చేరుకోవచ్చును.

గూడెం మొత్తానికి ఆ వృత్తాకార మైదానం గుండె లాంటిది. నాగాల వేడుకలు, పెళ్ళిళ్ళు, విందు వినోదాలు, పండుగలు ఏదయినా సామూహికంగా ఆ మైదానంలో జరుపుకుంటారు. వీరికి ఇష్టమైన వృక్షం వెదురు. వీరి యిళ్ళ నిర్మాణమంతా వెదురు తోనే సాగుతుంది. అలాగే వెదురుతో చేసిన ఒక విధమైన తీగ వాద్యం, వేణువు వీరికి ఇష్టమైన వాద్య పరికరాలు. ఇక సంబరాలు, ఉత్సవాల్లో కొమ్ము బూరలు భేరీలు డోళ్ళు మొదయిన అన్ని వాద్య పరికరాలు ఉత్సాహంగా వినియోగిస్తారు. ఆ పరికరాలు సొంతంగా తయారు చేసుకోటంలో వీరు నిష్ణాతులు.

మైదానం పశ్చిమ భాగంలో తూర్పు ముఖంగా రాళ్ళతో పేర్చిన పెద్ద ఆలయం వుంది. అనేక శిరస్సులతో కూడిన నాగరాజు విగ్రహాన్ని ఆ గుడిలో పూజిస్తారు. అక్కడే కాస్త ఎడం ఎడంగా కొండ దేవర, కాళికమ్మ, వన దేవతల గుడులు దర్శనమిస్తాయి. ఒక్క నాగ రాజు ఆలయాన తప్ప మిగిలిన గుడుల వద్ద కొలువులు, వేడుకల్లో జంతు బలి జరుగుతుంది.

సరిగ్గా ఈ గుడులకు ఎదురుగా`

మైదానం రెండో పక్క పశ్చిమాభి ముఖంగా కన్పించే ఇల్లు గూడెం నాయకుడైన దొర నాగ కేసరిది. పెద్ద అరుగుల మీద నిర్మించిన పెద్ద చుట్టు గుడిసె అది. అక్కడ ఏ ఇంటిని చుట్టి సరిహద్దులు గాని ప్రహరీలు గాని కన్పించవు.

ప్రస్తుతం అది మధ్యాహ్న వేళ.

సూర్యుడు నడిమింట నిప్పులు చెరుగుతున్న వేళ.

ఉష్ణ తాపానికి నాగాలు ఎవరి యిళ్ళలో వాళ్ళు విశ్రాంతిగా గడుపుతున్నారు. అట్టి వేళ నాయకుడు నాగ కేసరి ఇంటి ముందు ఒక కార్యక్రమం నిర్వహించ బడుతోంది. అదే అతి ప్రమాద కరమైన ఓజో తాంత్రిక క్షుద్ర విద్యా ప్రయోగం. నాయకుడు నాగ కేసరి అధ్వర్యంలోనే జరుగుతున్నది.

ఎరుపు, తెలుపు కలగలిసిన గోధుమ వర్ణంలో సుమారు ఎనిమిదడుగుల భారీ మనిషి నాయకుడు నాగ కేసరి. అతడి వయసు కూడ ఎనభై సంవత్సరాలుండొచ్చు. ఇప్పటికీ చాలా బలంగా దృఢంగా భీమబలుడి లాంటి ఆకారం. గుబురు మీసాలు, భూజాల మీద పడుతున్న వంకీల జుత్తు, తలమీద పడగ విప్పిన నాగాభరణం, నుదుట విభూది పూసి కుంకుమ ధరించి వింత శోభతో మెరిసే ముఖ వర్ఛస్సు.

నడుంకి నార బట్ట ఆచ్ఛాదనగా కట్టుకున్నాడు. నడుంకి, మెడ, చేతులకి పూసలదండలు, వెండి కడియాలు ఆభరణాలుగా వున్నాయి. కుడి కాలికి పెద్ద వెండి తోడా వుంది. అసలా గూడెంలో వయసు కొచ్చిన యువకుల నుంచి వృద్ధుల వరకు పురుషులంతా ఖచ్చితంగా కుడి కాలికి వెండి తోడా ధరించే వుంటారు. అది వారి ఆచారంలో భాగం.

ఇంటి ముంగిట ఎత్తయిన వెదురు ఆసనం మీద గంభీరంగా ఆసీనుడై వున్నాడు నాయకుడు నాగ కేసరి. ఎదురుగా వాకిట హోమం ప్రజ్వరిల్లుతోంది. అక్కడ నాగాల కుల గురువు, అక్కడి ఆలయాల పూజారి, గణచారి ముగ్గురూ హోమం చుట్టూ కూచుని దీక్షగా ఓజో తాంత్రిక ప్రయోగంలో వున్నారు. ముగ్గురూ శతాధిక వృద్ధులే. వారి రూపాలు బీభత్సంగా వున్నాయి. ఎర్రటి రక్త వర్ణపు దుస్తులు ధరించి వున్నారు. ఎర్రటిపూలు, ఎర్రటి హోమద్రవ్యాలను సమర్పిస్తూ ఏవేవో హోమ దినుసుల్ని వేస్తూ, కళ్ళు మూసుకుని నిష్టతో మౌనంగా మంత్రాలు పఠిస్తున్నారు. పొగ మంచు లాంటి తెల్లటి ధూమం హోమ గుండంనుంచి గాల్లోకి వ్యాపిస్తోంది.

వారికి ఎదురుగా అవతల మైదానం మీద త్లెటి సున్నం పొడితో వేసిన విశాలమైన రెండు వృత్తాలు కన్పిస్తున్నాయి. ఒక దానిలో ఒకటిగా ఒకటి అంతర్‌ వృత్తం, రెండోది బాహ్య వృత్తం. అంతర్‌ వృత్తం ముప్పై ధనువుల వైశాల్యం కలిగివుంటుంది. హోమ గుండం నుంచి లేచిన శ్వేత ధూమం అంతర్‌ వృత్తంలోకి చేరి ఆ వృత్తం పైన ఒక ధూమ నాళికలా ప్రకాశిస్తోంది.

ఇక బాహ్య వృత్తంలో`

ఇద్దరు నాగాలు కొమ్ము బూరా, భేరీలు వాయిస్తూండగా నూరు మంది నాగాలు సాయుధులై వృత్తాకారంలో నిలబడి కదం తొక్కుతూ తోడా శబ్ధం చేస్తూ పాములా బుసలు కొడుతున్నారు. అద్దంలో ప్రతిబింబించినట్టు ఆ నాగా వీరుల  ప్రతిరూపాలు అంతర్‌ వృత్తం మీద ధూమ నాళికలో ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తే ప్రతి రూపాలు అదే చేస్తున్నాయి. ఆ ప్రతిబింబాల మధ్యన కదం తొక్కుతున్న శ్వేతాశ్వం ఆ అశ్వం మీది రాకుమారుడు ధనుంజయుడు స్పష్టంగా కన్పిస్తున్నాడు. అంటే` ఎక్కడో కొండ శిఖరం మీద ధనుంజయుడు, అతడి పరిసర ప్రాంతాలతో బాటు అక్కడ చుట్టుముట్టిన నాగాల ప్రతిరూపాలు కూడా ఆ ధూమనాళికలో ప్రతిబింబించటమే కాదు, వారి మాటలు, శబ్ధాలు కూడ విన్పిస్తున్నాయి. నాయకుడు నాగ కేసరితో బాటు మరి కొందరు అక్కడ కూచున్న నాగాపెదలుదు ఏం జరుగుతుందాని ఆసక్తిగా ధూమనాళిక లోని ప్రతిబింబ దృశ్యాలనే వీక్షిస్తున్నారు.

సాధారణ కనులతో చూస్తే ఓజో దృశ్యం కనబడదు. అలా చూడాలంటే మంత్ర యుక్తమైన ఒక నల్లటి లేపనాన్ని కళ్ళకు కాటుకగా ధరించాలి. ఆ లేపనం వున్న డబ్బీ నాగాకుల గురువు చెంత వుంటుంది. ఆరుదైన పికిలిపిట్ట గుండె, నల్ల పిల్లి కళ్ళు, ఊసర వెల్లి కాలేయం ఈ మూడింటిని సేకరించి ఒక విశేష అమావాస్య నాడు వాటికి కొన్ని దినుసులు చేర్చి పుటం పెట్టి దాంతో తయారు చేసిన కాటుక అది. విధిగా ఆ కాటుక ధరిస్తేనే ధూమ నాళిక లోని దృశ్యాలు కన్పిస్తాయి.

ఈ ఉంత్కంఠ  వచ్చేవారం దాకా.........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్