Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ భల్లలేశ్వర గణపతి -- పాలి - కర్రా నాగలక్ష్మి

గత సంచికలలో మనం అష్ఠ గణపతులలో మయూర గణపతి , సిద్ధ గణపతి , చింతామణి గణపతి , మహా గణపతి , శ్రీ విఘ్నహర గణపతి , వరద గణపతి , గిరిజాత్మజ గణపతుల గురించి తెలుసుకున్నాం . యీ సంచికలో మనం శ్రీ భల్లలేశ్వర గణపతిని గురించి తెలుసుకుందాం .

   " వేదో సంతువైభవో గజముఖో భాక్తాభిమానియో 
         భల్లలేరశ్య సుభక్త పాల నారద "

 అని భక్తులచే పిలువ బడుతూ , బాల భక్తుడిని అనుగ్రహించేందుకు స్వయంభూ గా వెలసిన శ్రీ భల్లలేశ్వర గణపతి ఆలయం మహారాష్ట్రా లోని రాయఘఢ్ జిల్లలో ,సుధగఢ్ తాలుకాలో వున్న పాలీ  గ్రామం లో వుంది . కర్జాత్ రైల్వే స్టేషన్ కి సుమారు 33 కిమీ దూరంలో వుంది . పుణె నగరానికి సుమారు 110 కిమీ .. దూరం , లోనవాలా మీదుగా వెళ్లి ఖపోలి పట్నం చేరుకొని అక్కడనుంచి పాలీ చేరుకోవచ్చు లేదా బొంబాయి మీదుగా అయితే పాన్వేల్ మీదుగా ఖపోలి చేరుకొని అక్కడనుంచి పాలి చేరుకోవచ్చు . బొంబాయి మీదుగా వెళితే సుమారు 120 కిమీ .. దూరం వుంటుంది .
సాధారణంగా ఏ కోవెల స్థల పురాణం విన్నా భగవంతుడు మానుభావులనో , యితర దేవీదేవతలనో అనుగ్రహించేందుకు అవతరించడం వింటూ వుంటాము . కాని యిక్కడ వినాయకుడు చిన్న బాల భక్తుని కొరకై యీ ప్రదేశంలో స్వయంభుగా అవతరించేడుట ఆ కధ  ఏమిటో తెలుసుకునే ముందర కోవేలని వొకసారి కనులారా దర్శించుకొని , ఆ పవిత్ర భావంతో స్థల పురాణం తెలుసుకుందాం .

ఈ పాలీ గ్రామం పుణ్య నదులైన సారసగఢ్ , అంబా నదుల మధ్యన వుంది . భక్తుని పేరుమీదు గా స్వామి పూజలందుకొనే ఏకైక ఖేత్రం గా యీ క్షేత్రాన్ని లెఖ్కిస్తారు . యిక్కడ గల మరో విశేషం యేమిటంటే వినాయకుని బ్రాహ్మణ వేషధారణ చేసి పుజిస్తారు . యిది మరే కోవేలలోను కనిపించదు . 

వెదురుతో నిర్మింప బడ్డ పురాతన   కట్టడాన్ని 1760 సం .. లో శ్రీ పడ్నీస్ ద్వారా రాతి కట్టడంగా మార్చ బడింది . కోవెల ప్రాంగణమంతా రాతి పలుకలు పరచ బడ్డాయి . యీ కోవెల చుట్టూ సరస్సులు వుండడం మరో విశేషం . కుడివైపున వున్న సరస్సులోని నీరు అభిషేకాలు మొదలయిన పూజాది కార్యక్రమాలకు వినియోగిస్తూ వుంటారు .

యీ ఆలయం తూర్పు ముఖంగా వుండి , దక్షిణాయనం లో సూర్యోదయం సమయం లో సూర్యుని కిరణాలు మూలవిరాట్టు పై పడేటట్టుగా నిర్మించేరు . గర్భ గుడికి వెలుపల పన్నెండు అడుగుల ఎత్తైన మూషికం మొదకాలను రెండు చేతులలో ధరించిన విగ్రహం వుంటుంది . దానిని దాటుకొని పదిహేను అడుగుల ఎత్తు కలిగిన విశాలమైన గర్భ గుడిలోకి ప్రవేశిస్తాము . 1910 సం .. క్రిష్ణాజీ రింజే ద్వారా సిమెంటు లో సీసం కలిపి కట్టిన నలభై అడుగుల పొడవు యిరవై అడుగుల వెడల్పు కలిగి 8 చూడ ముచ్చటైన స్తంభాలు కలిగిన అతి పఠిష్ఠమైన మండపం లోకి ప్రవేశిస్తాము . ఎడమ వైపుకి తిరిగిన తొండం తో తూర్పు ముఖంగా కూర్చోని వున్న వినాయకుడు మనస్సులకు ప్రశాంతతని కలుగ జేస్తాడు . వినాయకుని  రెండు కళ్ల స్థానాలలో రెండు వజ్రాలు పొదగబడి , రిద్ధి  సిద్ధి లచే చామర సేవ లందుకుంటున్న  వినాయకుడు దర్శనమిస్తాడు .


పేష్వాల కాలంలో పొర్చుగీసు వారి తో పోరులో వాషి , సశ్తి లను గెలుచుకున్న విజయానికి చిహ్నంగా " చిమాజీ అప్ప " ద్వారా బహుకరింప బడ్డ పెద్ద యురోపియన్ గంటను యీ కోవెలలో కూడా చూడొచ్చు .

యిక్కడి స్థల పురాణమ్ యీవిధం గా చెప్తారు .

గణేశ పురాణం ప్రకారం కృతయుగం యీ పాలీ గ్రామం సింధు ప్రాంతానికి చెందినదిగా వుండేది . యీ గ్రామం లో కల్వాణుడు అనే వైశ్యుడు వుండేవాడు అతను ఇందుమతి అనే కన్యను వివాహం చేసుకొని పూర్ణ చంద్రునివంటి పుత్రుని పొందేడు . ఆ పుత్రునకు భల్లాలుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగేరు . ఆ బాలుడు అందరు పిల్లల వలె ఆటపాటలతో సమయము వెచ్చించక తన వద్దనున్న బొమ్మలను ఎదురుగా నున్న రాళ్లను పెట్టి వాటిని దేవతా మూర్తులుగా భావించి భక్తి  పారవశ్యం తో పూజ చేసుకొనేవాడు . భల్లాలుని చూచి అతని తోటి బాలురు కుడా అతని వలెనే రాళ్లనె దేవతా మూర్తులుగా భావించి పూజలు చేసుకొనే వారు .

అదే విధముగా ఓ రోజు పిల్లలందరూ వూరి బయట అడవి లోకి వెళ్లి అక్కడ వారికి కనిపించిన ఓ రాయిని వినాయకునిగా భావించి కొందరు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా ' మరి కొందరు ఆ రాయి పైన వెదుళ్ళు కట్టెలతో పందిరి నిర్మించిగా , మరికొందరు నాట్యగానములతో గణేశు నకు వినోదము కలిగించుటకు ప్రయత్నిచాగా మరికొందరు గణేశుని కధలు గానం చేయ్యసాగేరు . భక్తి పారవవ్యం లో మనిగి వున్న పిల్లలకు ఆకలి దప్పులు , రాత్రి పగలు తెలియ రాలేదు . రోజులు గడచినను పిల్లలు యిళ్ళకు చెరక పోయేసరికి వారి వారి తల్లితండ్రులు యిది భల్లాలుని వల్లనే జరిగినదని భావించి కల్వాణుని యింటికి వెళ్లి భల్లాలుని వల్లనే తమ పిల్లలు తమ మాట వినుట లేదని ఆరోపించి పిల్లలను వెదుకుటకు వెళ్తారు . ఊరిబయట అడవిలో తమ పిల్లలను వున్నట్లు గుర్తించి యిళ్ళకు తీసుకొని వెళ్తారు . ఊరివారి మాటల ప్రభావానికి లోనైనా కల్వాణుడు యింటికి మరలి రమ్మని భల్లాలుని కోరగా గణేశుని  ధ్యానం లో మునిగి వున్న అతను వినిపించుకొడు . కల్వాణుడు క్రోధించి అతనిని రక్తము వచ్చునట్లు కొట్టి తాళ్ళతో చెట్టునకు కట్టి " నీ దేవుడే నిన్ను కట్లు విప్పి రక్షించునని " పలికి ఊరిలోకి వెళ్ళిపోతాడు . సరియైన ఆహారము లేక నెత్తురు కారుతున్న దెబ్బలవలన భల్లాలుడు స్పృహ కోల్పోతాడు . కొంత సమయానంతరము తెలివి వచ్చిన భల్లాలుడు తనకు సపర్యలు చేయుచున్నది స్వయంగా గణేశుడేనని తెలుసుకొని మిక్కిలి ఆనందము పొంది భగవంతునకు సష్ఠాంగ నమస్కారములు చేసి అనేక స్తోత్రములు చదివి తన్ను కాపాడి రక్షించి నట్లుగానే కలియుగానంతరము వరకు భక్తులను బ్రోవమని కోరెను . సంతోషించిన గణేశుడు అక్కడే స్వయంభూగా అవతరించి ఆ బాలభాక్తుని పేరుమీదనే శ్రీ భల్లలేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు . 

యిక్కడ నిత్యం మహానైవేద్యం , దహికాల , అన్న సంతర్పణ విధులు ఏంతో  భక్తీ శ్రద్ధలతో జరుపుతారు . పీష్వాల కాలం లో ముఖ్య మైన పనులను చేపట్టేటప్పుడు , క్లిష్ఠమైన న్యాయవిచారణ జరిపేటప్పుడు శ్రీ భల్లలేశ్వరుని అనుమతిని తీసుకొనేవారు . 

యిక్కడ గణేశ జయంతి , వినాయక చవితి , సంకష్ఠ చవితి విశేషం గా జరుపు కుంటారు . వినాయక చవితినాటి రాత్రి మహానైవేద్యం స్వయంగా వినాయకుడు వచ్చి స్వీకరిస్తాడని ప్రతీతి . ఆ నాడు ప్రసాదానికై లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి బారులు తీరడం  ఒక నిజం .

 బొంబాయి గాని పూణే గాని వచ్చేవారు శ్రీ భాల్లలేస్వరుని దర్శించుకొని తరించండి .
మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu