Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Third Part

ఈ సంచికలో >> సీరియల్స్

తొమ్మిదవ భాగం

ninth part

ఆమె నవ్వుతో తనూ శృతి కలిపాడు గోపాల్. 

భార్య మాటలు అసత్యం కాదని గోపాల్ కి తెలుసు. 

ఇక్కడ తమ పిల్లలు డబ్బులో పుట్టి పెరిగారు. 

డబ్బు విలువ, ఆకలి బాధ వీళ్ళకి తెలీదు. 

ఎప్పుడూ ఫ్రెండ్స్ అనీ, పార్టీలు అనీ, డ్యాన్సులనీ అర్ధం పర్ధంలేని ఖర్చులకు అలవాటుపడినవాళ్ళు. వీళ్ళని తట్టుకోవడం తన బావగారు రఘునాథ్ కి కష్టమే. ఏది ఏమైనా ఇప్పటికప్పుడు తమ పిల్లలిద్దరిలో మార్పు కోరుకోవడం కూడా దురాశే అవుతుంది... ప్రయత్నించి చూడాలి."

"ఓ.కె. సత్యా! నాకు టైమవుతోంది. స్నానానికి వెళ్తున్నాను. ఈ లోపల వాళ్ళని లేపు" అంటూ లేచి స్నానానికి వెళ్ళిపోయాడు గోపాల్. 

ఉదయం టిఫిన్ కి డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సమావేశమయ్యారు. సత్యవతి వెళ్లి లేపడంతో తండ్రికి కోపం రాకూడదని చకచకా స్నానాలు ముగించి బయటకొచ్చారు అనంతసాయి, సాయి శివానీలు. 

"మీరేమిటి? అర్ధరాత్రికా ఇంటికొచ్చేది? ఏమైంది మీకు?" టిఫిన్ తింటూ కొడుకుని, కూతుర్ని అడిగాడు గోపాల్. 

అన్నాచెల్లెల్లిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. 

"సారీ డాడ్... బర్త్ డే పార్టీలో... లేటయిపోయింది" చిన్నగా చెప్పాడు అనంత్. 

"మీ సంజాయిషీలు కాదు నాక్కావలసింది. రాత్రి తొమ్మిది దాటకుండా ఇంట్లో ఉండాలి" ఆర్డర్ వేస్తున్నట్టు చెప్పాడు. 

బుద్ధిగల పిల్లల్లా తలలూపారు ఇద్దరూ. 

"డాడ్... మమ్మీనడిగి..." శివాని ఏదో చెప్పబోతుంటే "వన్ మినిట్" అంటూ కూతుర్ని ఆపాడు గోపాల్. 

"చూడమ్మా! మనం తెలుగువాళ్ళం. మనకంటూ ఒక సంస్కృతి, సంప్రదాయాలు వున్నాయి. ఇకనుంచైనా అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. బయట ఎంతగా ఇంగ్లీషులో మాట్లాడినా, ఇంట్లో తెలుగులో మాట్లాడాలి. మీకు చాలా సార్లు చెప్పాను. తండ్రిని నాన్నా అని, తల్లిని అమ్మా అని పిలవడం మన ఆచారం. మమ్మీ డాడీల్ని వదిలేసి ఇంట్లో అమ్మా నాన్నా అని పిలవడం అలవాటు చేసుకోండి. అంతేకాదు. మన పద్ధతుల్లో డ్రస్ చేసుకోవడం కూడా ఇప్పట్నుంచే మొదలుపెట్టండి. ఎందుకంటే త్వరలో మీ నాయనమ్మ  ఇక్కడికి వస్తోంది. ఆవిడ మీ పద్ధతులు చూసిందంటే మిమ్మల్ని కాదు. నా చెంప పగలగొడుతుంది. చెప్పవే వాళ్ళకూ" అంటూ భార్యకు సూచించి లేచాడాయన. 

నాయనమ్మ రాబోతుందన్న వార్తకి అనంతసాయి, శివానీలు షాకయ్యారు. కాని తమను బెదిరించడానికే డాడీ అలా చెప్తున్నారు అది నిజం కాదు అనుకున్నారు. ఈ లోపల డాక్టర్ గోపాల్ తన కార్లో ఆస్పత్రికి వెళ్ళిపోయాడు. ఆయన్ను సాగనంపి లోపలకొస్తున్న తల్లిని చూస్తూ "మమ్మీ! నిజంగానే గ్రానీ ఇండియా నుంచి వస్తోందా?" నమ్మలేనట్టు అడిగింది శివాని. 

"ఆ మాట నిజమే. ఆవిడసలే ముక్కోపి. మీ పిచ్చివేషాలు చూస్తే చెంపపగలగొడుతుంది. ఇప్పట్నుంచే మీరు పధ్ధతి మార్చుకోవడం మంచిది" అంటూ సలహా ఇచ్చి లోనకెల్లిపోయింది సత్యవతి. తల్లి మాటల్ని తేలిగ్గా తీసుకొని నవ్వుకుంటూ కాలేజీకి బయలుదేరారు అన్నాచెల్లెలిద్దరూ. 

అన్నపూర్ణేశ్వరి అమెరికా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది గాబట్టి ఆ విషయంలో ఇక ఆలస్యం చేయలేదు రామలింగేశ్వర్రావు. వయసయిన తల్లి అమెరికా వంటి దూరదేశంలో కొద్దిరోజులు చిన్న కొడుకు ఇంట్లో వాళ్ళతో కొంతకాలం గడిపి వస్తే వాళ్ళను గురించిన బెంగలేకుండా సంతోషంగా వుంటుందని అతడి వుద్దేశం. అందుకే వెంటనే తల్లిచేత పాస్ పోర్ట్ కి అప్లయ్ చేయించాడు. 

నిజానికి డాక్టర్ గోపాల్ అందరితో ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజు రాత్రే మరోసారి ఇండియాకు ఫోన్ చేసి అన్న రామలింగేశ్వర్రావుతో మాట్లాడాడు. అమ్మకి వయసయింది గాబట్టి ఒంటరిగా రావడానికి ఇబ్బంది పడుతుంది. పైగా ఎప్పుడూ విమానం కూడా ఎక్కలేదావిడ. అంచేత అమ్మతోబాటు వదిన, నువ్వు, పిల్లలు కలిసి రండి. మరోసారి చెల్లాయి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అంటూ మనసులో మాట చెప్పాడు. కాని రామలింగేశ్వర్రావు ఒప్పుకోలేదు. 

"అమ్మ గురించి నాకు తెలుసు. తను వచ్చేస్తుంది. భయం లేదు. ఇప్పటికిప్పుడు అందరికీ పాస్ పోర్ట్ లు, వీసాలు అంటే జరిగే పనికాదు ఆలశ్యమౌతుంది. పైగా ఇక్కడి పనులన్నీ బావగారిమీద వదిలేసి మేం అంతా అక్కడికి రావడం కూడా బాగుండదు. ప్రస్తుతానికి అమ్మను పంపిస్తున్నాను. మరోసారి మేం వస్తాంలే" అంటూ తమ్ముడికి నచ్చజెప్పాడు. 

"అమ్మమ్మా! నేనో మాట అడగనా?" ఆరోజు సాయంకాలం పెరట్లో ఉన్న అన్నపూర్ణేశ్వరి పక్కకొచ్చి కూర్చుంటూ అడిగింది మహేశ్వరి. 

"ఒకటేమిటే, వంద అడుగు, అమెరికా వెళ్తున్నాగా, నీ బావకి ఏదన్నా లవ్ లెటర్ పంపించాలనా?" అంటూ మనవరాలిని వేళాకోళం చేసింది. 

"సర్లే, అమెరికా బావకి ఈ పల్లెటూరమ్మాయి ఎక్కడ గుర్తుంటుంది గాని ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వయసులో నీకీ అమెరికా ప్రయాణం అవసరమా?" అంటూ అడిగింది. 

"అదేమిటే... వాళ్ళు మాత్రం నా పిల్లలు కారా? వాళ్ళని చూడాలని నాకు మాత్రం ఉండదా?" ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణేశ్వరి. 

"ఉంటే వాళ్ళనే రమ్మంటే వచ్చి వెళతారు గదా. నువ్వెందుకు వెళ్ళడం?"

"అదేదో చాలా గొప్ప దేశమంటగదా అమెరికా. ఎంత గొప్పగా వుందో చూద్దామని."

"అంతేనా? ఇంకేం లేదా?"

"ఉంది. వాళ్ళు అమెరికాలో ఉంటూ అమెరికా పద్ధతుల్లోకి మారిపోయారా, లేక మనలాగే ఉంటూ వాళ్ళ మధ్య పద్దతిగా ఉంటున్నారా తెలుసుకుందామని?"

"తెలుసుకుని ఏం చేస్తావ్?"

ఓసారి మనవరాల్ని నిశితంగా చూసి, పెద్దగా నిట్టూర్చింది అన్నపూర్ణేశ్వరి. 

"నువ్వు మరీ గుచ్చిగుచ్చి అడక్కు. నాకు తిక్కరేగుతుంది. మీరు పుట్టినప్పుడే అనంతసాయికి నువ్వు పెళ్ళానివని. నవీన్ కి సాయిశివాని పెళ్ళామని నిర్ణయించుకున్నాను. నేను చచ్చేలోగా మీ రెండు జంటల్నీ ఆశీర్వదించి చావాలని నా కోరిక. మీరు పెద్దవాళ్ళయ్యారు. మా పెంపకంలో పెరిగిన మీ అన్నాచెల్లెళ్ళ గురించి నాకు దిగుల్లేదు. కానీ అమెరికాలో ఉంటున్న ఆ అన్నాచెల్లెల్లిద్దరూ ఏ పద్ధతిలో వున్నారో కూడా చూడాలని ఆశపడుతున్నాను" అంటూ మనసులోని మాట చెప్పేసిందావిడ. 

"ఒకవేళ వాళ్ళ పద్ధతులు నచ్చకపోతే ఏం చేస్తావు?" వెంటనే మరో ప్రశ్న బాణంలా సంధించింది శివాని. 

"వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాను"

"మారకపోతే?"

"వాళ్ళ ఖర్మ అని ఊరుకుంటాను. ఇక్కడ నా కూతురు బిడ్డలు రత్నాలని నాకు తెలుసు. వాళ్ళని గులకరాళ్ళకిచ్చి బలవంతంగా పెళ్ళి చేసేంత బుద్ధిలేనిదాన్ని కాదు."

"లేదు బామ్మా! నీ సంతతిలో ఎవరూ గులకరాళ్ళు కాదు. వాళ్ళు కూడా మాలాగే మంచి పద్ధతుల్లో పెరిగారనే ఆశిస్తున్నాను. చిన్నప్పట్నుంచీ నాకు బావంటే ఇష్టం. ఆ ఇష్టం ఎప్పుడూ అల్లాగే వుంటుంది. భవిష్యత్తులో కూడా మారదు" అంటూ ఉన్నట్టుండి లేచి వెళ్ళిపోయింది మహేశ్వరి, వెళుతున్న మనవరాల్ని చూస్తూ బుగ్గన వేలేసుకుని అలా చూస్తుండిపోయింది అన్నపూర్ణేశ్వరి. 

"ఏమిటీ పిల్ల... ఎందుకొచ్చింది? ఏం మాట్లాడింది, ఎందుకు వెళ్ళిపోతోంది? దీన్ని అర్ధం చేసుకోవడం కష్టమే. గడుసుపిండం" అనుకుంది మనసులో. 

నిజానికి మనవరాలి మనసులో ఏముందో ఆవిడకు తెలీని విషయం కాదు. అనంతసాయి అంటే మహేశ్వరికి చాలా ఇష్టం. ఇష్టం అనే కన్నా ప్రేమ అంటేనే బాగుంటుంది. చిన్నప్పట్నుంచి బావే నీ మొగుడు అంటూ నలుగురూ ఆటపట్టించిన మాటలు ఆమె మనసులో బాగా నాటుకుపోయాయి. అందుకే ఆ స్థానంలో మరో మగాడ్ని ఎప్పుడూ ఊహించుకోలేదామే. వయసుకొచ్చాక సహజంగానే బావమీది తీపి ఊహలు, ఆశలు మనసునిండా అల్లుకుపోతాయి. తనలాగే బావ కూడా తనను ఊహించుకుంటాడని, ఏదోరోజు ఫోన్ చేసి పలకరిస్తాడని, ప్రేమగా మాట్లాడతాడనీ ఆశ పడింది. కానీ ఇంతవరకూ అనంతసాయి నుంచి ఎప్పుడూ ఫోన్ రాలేదు. కనీసం అమెరికా వెళ్తున్న అమ్మమ్మయినా తన మనసులో మాట బావతో చెప్తుందనే ఉద్దేశంతో అలా మాట్లాడి వెళ్ళిపోయింది మహేశ్వరి. 

మనవరాలు వెళ్ళిపోయిన కాసేపటికే మనవడు నవీన్ ఎందుకో పెరట్లోకి వచ్చాడు. మనవడ్ని చూడగానే వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంది అన్నపూర్ణేశ్వరి. 
"ఒరే నవీన్! ఇలా రారా!" అంటూ పిలిచింది. 

ఆమె పిలిచేదాకా ఆమెను చూడలేదు నవీన్. 

"అయ్యబాబోయ్! ఏమిటే అమ్మమ్మా! ఒక్కదానివే ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? 

కొంపదీసి తాతయ్య గుర్తుకొచ్చాడా? అంటూ ఉడికిస్తూ దగ్గరకొచ్చాడు.  "తాతయ్య పేరెత్తితే పళ్ళు రాలగొడతాను. భడవా! రా! ఇలా కూర్చో" అంటూ మనవడిని కసురుకుంది. 

"సరే కూర్చున్నాను. ఏమిటి సంగతి? నాలుగు మాసాలు మా దగ్గర ఉండవు. నీచేత తిట్లుతినే ఛాన్సు మిస్సవుతాం. కాబట్టి అమెరికా వెళ్ళేలోపు ఓ సంవత్సరం సరిపడా తిట్లు తిట్టేసి వెళ్ళు" అన్నాడు నవ్వుతూ. 

"వద్దులేరా. నేను తిట్టి మిమ్మల్నెందుకు బాధపెట్టడం?"

"ఇదెప్పట్నుంచి? ఇంత వయసొచ్చినా నువ్వు తిడితే మావయ్య నోరెత్తడు. మా అమ్మ కిక్కురుమనదు, ఇక మేం సరే... మేం బాధపడాల్సిన పనేంటి అమ్మమ్మా! నువ్వేం చేసినా మా మంచి కోసమే చేస్తావ్. నువ్వు తిట్టినా మా మంచి కోరి తిడతావ్. మా తప్పుల్ని సరిదిద్దడం కోసం తిడతావ్. నీ తిట్లేగదా మాకు దీవెనలు. నీ నోరు గయ్యాళి అయినా మనసు అమృతం అమ్మమ్మా! మాకు తెలీదా?" అన్నాడు నవ్వుతూ. 

మనవడి మాటలకు మురిసిపోతూ "మా నాయనే" అంటూ ప్రేమగా నవీన్ నుదుట ముద్దాడింది అన్నపూర్ణేశ్వరి. పక్కన కూర్చొని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకొని ముఖంలోకి చూశాడు నవీన్. 

"నువ్వు ఉత్తినే పిలవ్వని తెలుసు అమ్మమ్మా! విషయం ఏమిటి?" అడిగాడు. 

"ఏం లేదురా. మిమ్మల్నందరినీ వదిలి అమెరికా వెళ్లి కొద్దిరోజులు వుండాలంటే బాధగానే వుంది. కానీ తప్పదు. వెళ్లిరావాలి. వెళ్లేముందు నాకో విషయం తెలియాలి. చిన్నప్పట్నుంచీ మేం అనుకుంటున్నదేగా మావయ్య కూతురు శివాని నీ పెళ్ళాం అని. నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని పిలిచాను" అంది. 

చేయి వదిలి ఎడంగా జరిగి కూర్చున్నాడు నవీన్. 

ఇరవై సెకన్ల వరకూ ఏమీ మాట్లాడలేదు. 

"ఏరా? శివానిని చేసుకోవడం నీకిష్టంలేదా?" ఆందోళన పడుతూ అడిగిందావిడ. 

"అమ్మమ్మా! మా చిన్నప్పుడు మీరేవో అనుకున్నారు. కాదనడం లేదు. కానీ మా చిన్నప్పటి రోజులు, పరిస్థితులు వేరు. ఈ రోజు పరిస్థితులు వేరు. నేను మీ పెంపకంలో పెరిగాను. ప్రాక్టికల్ మనిషిని. ఊహలో జీవించే అలవాటు లేదు. మావయ్య కుటుంబానికి, మనకు తూర్పు, పడమరకు ఉన్నంత వ్యత్యాసం వుంది. ఈ రోజు ప్రపంచాన్ని శాసించగల స్థితిలో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో వుంది మావయ్య కుటుంబం ఇంకా చెప్పాలంటే కోట్లకు పడగలెత్తిన కుటుంబం ఆయనది. ఆయన పిల్లల జీవన విధానం కూడా ఆరేంజ్ లోనే వుంటుంది. అంచేత మన సంబంధం చేసుకోవడానికి మావయ్యకు ఇష్టమైనా, ఆయన కూతురుకి గానీ, కొడుకుకు గానీ మన సంబంధం చేసుకోవడానికి ఇష్టపడతారని నేననుకోను. అంచేత వాళ్లమీద నాకెలాంటి ఆశలూ లేవు. నువ్వు ప్రయత్నించి చూస్తానంటే నాకు అభ్యంతరం లేదు" అంటూ కుండబద్దలు కొట్టినట్లు మనసులో మాట బయటపెట్టేశాడు నవీన్.

ఇందులో మహేశ్వరి తన అభిప్రాయం వ్యక్తం చేసిన పద్ధతికి, నవీన్ చెప్పిన విధానానికి వ్యత్యాసం వుంది. ఆ తేడాను స్పష్టంగా గమనించింది అన్నపూర్ణేశ్వరి. మనసులో ఎన్ని సందేహాలున్నా, మహేశ్వరి బావను ఇష్టపడుతోంది. ఆమె మనసులో బావ చేసుకుంటాడనే ఆశ తొంగి చూస్తోంది. కాని నవీన్ లో ఆ ఆశ లేదు సరికదా కనీసం మరదలు శివాని అంటే ఇష్టమన్న అభిప్రాయాన్ని కూడా ఎక్కడా ఛాయామాత్రంగా కూడా కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. అందుకే ఉండబట్టలేక అడిగేసింది ఆవిడ. 

"ఏరా, శివాని అంటే నీకిష్టం లేదా?" అంటూ. 

"ఏమిటే అమ్మమ్మా పిచ్చి ప్రశ్నా నువ్వూను" అంటూ విసుక్కున్నాడు నవీన్." అది నా మరదలు. నా మేనమామ కూతురు. ఇష్టపడకుండా ఎలా వుంటాను? కాని ఇష్టమనేది రెండు వైపులా ఉండాలి. నేను ఇష్టపడితే సరిపోతుందా? ఇప్పుడు అది ఎలా వుందో? దాని అభిప్రాయాలు ఏమిటో? ఎలాంటి భర్తను కోరుకుంటుందో, నేనంటే ఇష్టం వుందో లేదో?  ఇవేమీ అక్కర్లేదా? ఒకటి మాత్రం గుర్తించుకో. నీ మాట జవదాటేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. కట్టరా తాళి అంటే కట్టేస్తాను. నీ మీద, నీ పంపకం మీద మాకున్న అభిమానం, గౌరవం అలాంటివి. కానీ తాళి కట్టిన తరువాత అది బాధపడకూడదు. 

పెద్దవాళ్ళు మీ మనసుల్లో ఎన్నో ఉంటాయి. కానీ ఈతరం పిల్లలు స్వతంత్రభావాలు గలవాళ్ళు. ఆ మార్పు ఇప్పుడు మన దేశంలోనే స్పష్టంగా కనబడుతోంది. ఇక ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలో పిల్లల సంగతి వేరే చెప్పక్కర్లేదు. అంచేత ఏ కారణం చేతనైనా నువ్వనుకున్నట్టు మా పెళ్ళిళ్ళు జరక్కపోయినా నువ్వేం దిగులు పడాల్సిన పనిలేదు. నాకో మంచి పెళ్ళాం, చెల్లాయికో మంచి మొగుడు దొరక్కపోరు. అర్ధమైందా? నువ్వు వెళ్తోంది మామయ్య కుటుంబాన్ని చూడ్డానికి, వాళ్ళ పిల్లల పద్ధతులు గమనించి మనకి వాళ్ళు సూటవుతారా లేదా నిర్ణయం తీసుకోవడానికే గానీ నచ్చజెప్పడానికి మాత్రం కాదని నువ్వు గుర్తుంచుకో. ఇంతకు మించి నేను చెప్పక్కర్లేదనుకుంటా." అన్నాడు. 

అతని మాటలు విన్న అన్నపూర్ణేశ్వరికి అతడు మాట్లాడుతున్నాడా, తనకు జ్ఞానోదయం చేస్తున్నాడా అర్ధం కాలేదు. చచ్చి ఏ లోకాన వున్నాడోగానీ తన భర్త కాశీ విశ్వేశ్వరయ్యగారు గుర్తొచ్చారు. ఆయన అంతే! ఏ విషయాన్నీ అతిగా ఆలోచించేవాడు కాదు. మాటలు నిర్మాణాత్మకంగా ఉండేవి. పరిస్థితుల్ని బట్టి అప్పటికప్పుడు అంచనాలు వేయడమే గానీ, ముందే పెద్దగా అంచనాలు వేసుకొని అవి జరక్కపోతే దిగాలుపడే అలవాటు ఆయనకు లేదు. ఏదన్నా సమస్య వస్తే ఇలానే తనను దగ్గర కూర్చోబెట్టుకుని ఉపదేశిస్తున్నట్టుగా వివరంగా చెప్పేవారు. అందుకే... ఆ క్షణంలో భర్త గుర్తుకురాగానే ఆవిడ కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. అది గమనించి కంగారుపడ్డాడు నవీన్. 

"అమ్మమ్మా! ఏమైందని? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా?" అడిగాడు. 

"లేదురా. నువ్వు సరిగానే మాట్లాడావు" అంటూ చెమర్చి కళ్ళను పైటచెంగుతో తుడుచుకుని చిన్నగా నవ్వింది. 

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
duppati story by kaashibotla kameshwara rao