Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కంసుని వారసులారా కళ్ళు తెరవండి...

kamsuni varasularaa kallu teravandi

ట్రాఫిక్ జాం అవడం వల్ల ఆఫీసుకు ఆలస్యమవుతోంది, ఆలోచనలన్నీ పరుగెడుతున్న టైం చుట్టే తిరుగుతున్నాయి...
ఇంతలో ఎవరో నడివయసు  వ్యక్తి నా మోటార్ సైకిల్ కిందికి రావడం జరిగిపోయింది... వీలైనంత తొందరగానె
బ్రేకు వేయగలిగానుగాని అప్పటికే ఆలస్యమయింది... అతను మూర్చపోయినట్లున్నాడు. కొద్దిగా టెన్షన్ ఫీలయ్యాను... కదిలించి చూశాను... కొద్దిసేపు మైండ్ బ్లాకయింది... వెంటనే తేరుకొని.. మా సుపీరియరుకు
విషయం చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. ఆ అపరిచితుణ్ణి దగ్గరలో వున్న హాస్పిటల్ కు తీసుకెళ్ళాను. మూర్చపోయేంత గాయాలేమి
లేవు. డాక్టర్ గారు చెక్ చేసి ఇంజెక్షనేదో ఇచ్చారు...కొద్దిసేపటికి  మెలుకువొచ్చింది. అప్పుడర్థమయింది,  
అతని మూర్చకు కారణం గాయాలు కాదు, తిండిలేకపోవడమని.

చిరిగిపోయిన  దుస్తులు, మాసిన గడ్డము, చూస్తూంటె బిక్షగాడిలా వున్నాడు. పళ్ళు తినిపించి పాలు తాగించాను...
దాదాపు సాయంత్రం కావచ్చింది.. ఆఫీసుకు సెలవు పెట్టక తప్పలేదు. అప్పటికి మామూలు స్థితికి వచ్చాడు.
డాక్టరుగారు ఇక భయం లేదు తీసుకెళ్ళొచ్చన్నారు.  హాస్పిటల్ నుండి బయటపడ్డాము.

"నీ పేరేంటన్నావు...?"
"రాములండి... మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్లున్నాను..."
"అదిసరే ఏంజేస్తుంటావు"
మౌనం...
"నిన్నెక్కడ వదలమంటావు..."
వున్నట్లుండి అతని మొహంలో రంగులు మారిపోయాయి... కలవరం  కనిపిస్తోంది...
"నేను పడిపోయిన చోటికి తీసుకెళ్ళండి"
అక్కడికెళ్ళాక...
"అయ్యా దారి సరిగ్గా గుర్తులేదు.. ఇలా నేరుగా రెండు ఫర్లాంగులు వచ్చాను.. దానికిముందు  కుడివైపు తిరిగాను..
ఆ దారిలో ఇంకో రెండు మూడు ఫర్లాంగులనుకుంటాను... పరవాలేదు మీరికెల్లండి... నేనెల్లిపోగలను"  
"అలాకాదు నే తీసుకెళ్తానుండు..." అంటూ అతను చెప్పిన గుర్తుల ప్రకారం ఒక బస్స్టాప్  దగ్గరికి తీసుకెళ్ళాను....
ఆయన చాలా ఆందోళన పడుతున్నాడు..బస్స్టాప్ చుట్టూ దేనికోసమో వెతుకుతున్నాడు..అడిగినా సమాధానం చెప్పడం లేదు...
ఇదెక్కడి బాధరా దేవుడా అనుకున్నాను...మనకెందుకు, ఇక వెళ్ళిపోదామనుకునంటున్నంతలో అతను చిన్న పిల్లాడిలా
ఏడ్వడం మొదలు పెట్టాడు... నాకేమి అర్థం కావడం లేదు... కొద్దిసేపటికి  నోరువిప్పాడు...
"నా భార్య, ముగ్గురు పిల్లలను ఇక్కడే వదలి పెట్టి వెళ్ళాన్సార్...  ఎక్కడికెళ్ళారో ఏమొ..."
గొంతులో ఆందోళన..అక్కడే వున్న బంకు దగ్గర నిలుచున్న వాళ్ళను ఆచూకి అడుగుతున్నాడు..అలాంటి స్థిలో అతన్ని
వదిలేసి వెళ్ళిపోలేకపోయాను..ఓదార్చే ప్రయత్నం ఫలించడంలేదు.. ఓ అరగంటకు దూరంగా ఇటు వైపే వస్తూ కనిపించిన
ఒకావిడను, పక్కనున్న పిల్లల్ని చూసి అతని మొహం వెలిగిపోయింది

"అదిగో అక్కడున్నార్సార్.. " అంటూ పరిగెత్తుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు...
ఎక్కడికి వెళ్ళారని ఈయన, ఎందుకాలస్యమైందని ఆమె... ఒకరినొకరు తిట్టుకుంటున్నారు...
 
"పిల్లలు ఆకలికి అల్లాడి పోతూంటె నీళ్ళైనా తాగిద్దామని తీసుకుపోయానంతె...."
ఏడుస్తోంది...అంతవరకు ఆ హడవిడిలో ఆమె అతని గాయాలను గమనించలేదు..అటువైపు దృష్టి పడగానే ఒక్కసారిగా
ఏడుపు వోల్యుం పెంచింది...
 
"ఏమైందయ్య నీకు... ఏమిటీ గాయాలు... పాపిష్ట్టి దాన్ని చూసుకోకుండానే తిట్టేశాను..." గాయాలను తడిమి చూస్తోంది...
కోపం ప్రేమగా మారిపోయింది...అతను జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు...ఆమె నా వైపు చంపేసేలా చూస్తోంది..న్యాయమే కదా..

వాళ్ళ అన్యోన్యత ముచ్చటగా వుంది... వాతావరణం కొంత శాంతించాక వాళ్ళ వివరాలు అడిగాను...

"మాది నాగలాపురమండి... ఇక్కడికి అయిదారు గంటల దూరం..."
"ఇక్కడెవరైనా వున్నారా... పలకరించడానికి వచ్చి దారి తప్పారా..." ఆసక్తిగా అడిగాను...
రాములు మొహం వాడిపోయింది...
"లేదండి... పనికోసం వచ్చాము..." చెప్పుకుంటూపోతున్నాడు...
"నా చిన్నప్పుడు మాకు సుమారు పదెకరాల వరకు పొలముండేదండి... మా అయ్యేమొ దాన్ని రెండెకరాలకు తగ్గించేశాడండి...
మొదట్లో మా అయ్య మీద చాలా కోపమొచ్చేదండి...భాద్యత నా చేతికొచ్చాక గాని అర్థంకాలేదండి. వ్యవసాయంలో నష్టాలేగాని
ఏమాత్రం జరుగుబాటుండదని... ఒక సంవత్సరం వానలెక్కువై మునిగిపోతె మరో మూడునాలుగేళ్ళు వానల్లేక మాడిపోయెదండి...
ఆశతో అప్పులుజేసి నాట్లేయడం అప్పులుతీర్చుకోవడానికి పొలమమ్ముకోవడం...ఆ మిగిలిన రెండెకరాలు నా చేతుల్లో ఖాళి
అయిపోయిందండి... చేసేదేమి లేక ..కూలి పనికూడా దొరక్క ఈ ఊరొచ్చాం సార్..."

మనసంతా బాధగా అనిపించింది...

"బ్యాంకు లోను తీసుకోవచ్చుగా...."
"వెళ్ళాను బాబు... నాపేరు మీద ఎవడో తీసేసుకున్నాడు... బినామి లోను... గట్టిగా అడిగితే బతకలేము... మమ్మల్ని  కట్టమని
అడగకుంటేచాలయ్యా ...లోన్లూ మాఫీలూ అన్నీ పెద్దవాళ్ళకే సార్... ఎక్కడో నూటికొకడికి మాలాంటి    వాళ్ళకొస్తుంది...ఒళ్ళొంచి  
పనిచేయకపోయినా వందెకరాల భూస్వామే రైతు...రెక్కలిరిచుకొని పండించే మాలాంటి చిన్న రైతులంతా కూలీల లెక్కనే బాబు.." 

నిజమేననిపించింది....

"ఏం పని చేద్దామని వచ్చారు...?"
"నేను ఏడు వరకు చదువుకున్నానండి..  ఇది కూడ ఐదో క్లాసు వరకు చదువుకుందండి..."

అతని అమాయకత్వానికి నవ్వొచ్చింది...

"అంటే పెద్ద ఉద్యొగాలుచేయాలని కాదండి... " నా అభిప్రాయం అర్థమైనట్లుంది...
"మా ఊరినుండి చాలామంది ఇళ్ళుకట్టె కూలిపని కోసం ఈ ఊరు వస్తూంటారండి... మేముకూడా  అందుకోసమే వచ్చామండి..."
"ఎవరూ తెలియదంటున్నావె... ఎలామరి...?"
"అదేనండి... రెండురోజులుగా వెతుకుతున్నానండి... ఏదైనా కడుతున్న బిల్డింగులదగ్గర మా వాళ్ళేమైనా కనిపిస్తారేమొనని...
పనిప్పిస్తారేమోనని...తెచ్చుకున్న ఏభైఆరు రూపాయలు నిన్ననే అయిపోయాయండి...పిల్లలకు కొనిపెట్టామే గాని మేము తినలేదండి...
అదికూడా నిన్నటివరకే..."
అతని కళ్ళల్లో నీళ్ళు చూస్తూంటే నాకళ్ళు కూడా చెమర్చాయి...
"మీ ఊళ్ళో మీ వాళ్ళెవరు లేరా...."
"లేకేమండి... ముసలి అమ్మా, అయ్యా వున్నారండి...అర్దాకలితో మాకోసం ఎదురుచూస్తూ...." వాళ్ళిద్దరి కళ్ళల్లొ జలధార  ఆగడం లేదు... 
"వాళ్ళను వదిలేసి ఆత్మహత్య చేసుకోలేము... చూస్తూచూస్తు వాళ్ళను కూడా మాతో పాటు చంపుకోలెమయ్యా...."
నాకు నోట మాట రావడంలేదు.... నా జేబులో రెండొందల చిల్లర మిగిలున్నట్లు గుర్తు...   రెండొందలు తీసివ్వబోయాను...
తీసుకోడానికి ఏమాత్రము అంగీకరించలేదు... నిజాయితీతో వచ్చిన అభిమానం... పిల్లల పస్తులను గుర్తుచేస్తే, బలవంతం మీద
అప్పుగా తీసుకోవడానికి ఒప్పుకున్నారు...

"ఓ పనిజేద్దాం... రేపు సాయంత్రం సుమారు ఇదే సమయానికి ఇక్కడికొస్తాను... ఒకచోట ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది.. అంటె పేద్ద    
బ్రిడ్జి కట్టడం జరుగుతోంది, అందులో పనిచేసెవాళ్ళు కొంతమంది నాకు తెలుసు...వాళ్ళ సహాయంతొ మీకు పనిప్పించడానికి ప్రయత్నిస్తాను..."

వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తూంటే ఎవరెస్టునధిరోహించినంత సంతోషం అనిపించింది... ఈ చిన్న సహాయమే నాకింత సంతోషాన్నిస్తూంటే
మదర్ తెరీసాలంటి వారి సేవలు వాళ్ళకెంత తృప్తినిచ్చివుండాలి అనిపించింది... ఈ ఆలోచనలతో ఇంటికి బయలుదేరాను...

మరుసటి రోజు సాయంత్రం ఆఫీసు పని ముగించుకొని అనుకున్నట్లుగానే వాళ్ళను  ఫ్లైఓవర్ దగ్గర కూలి పనికి కుదిరించి,
నా భాద్యత తీరడంతో తృప్తిగా ఇల్లుచేరుకున్నాను...  

రెండునెలలు గడిచాయి... ఒకరోజు ఉదయమే ఓ భయానకమైన వార్త పేపర్లో కనిపించింది... రాములు ఫామిలీని పనిలో చేర్చిన
ఫ్లైఓవర్, నాసిరం క్వాలిటి కారణంగా కూలిపోవడంతో అక్కడే నివాసముంటున్న 52 మంది కూలీల దుర్మరణం... కొన్ని ఫొటోలు కూడా
వేశారు.... వాటిని చూడ్డానికిగాని అక్కడికి వెళ్ళి ఎంక్వైరి చేయడానికిగాని ధైర్యం చాలలేదు... వాళ్ళకేమి అయివుండదు అన్న
ఫీలింగ్ తోనే వుండిపోవాలని నిశ్చయించుకున్నాను... ఆ ఆలోచనలనుండి పారిపోవడానికి ఎంతో ప్రయత్నించాను... అయినా, ఆకలితో
దీనంగా చూస్తున్న ఆ పసిపిల్లల మొహాలు... పల్లెటూళ్ళో కొడుకుకోసం ఎదురుచూస్తున్న ముసలి తల్లిదండ్రుల ఎదురుచూపులు...ఇవన్నీ
గుర్తుకొస్తూనేవున్నాయి... నిద్రలోను అవే ఆలోచనలు...

రైతు ప్రాణానికి విలువే లేదా...? బానిస బ్రతుకొద్దనుకుంటే ఆత్మహత్య ... మొండిగా బ్రతుకు లాగించాలనుకున్నా పరోక్ష హత్య...
మానవత్వం నశించిపోతోంది... స్వార్థపరులైన నాయకుల పడగ నీడలో పల్లెటూళ్ళు శ్మశానాలైపోతున్నాయి..

వయసుడిగిన రాజకీయనాయకులకు కూడా ఇంత స్వార్థమెందుకో...  ఎవరికోసమో... తన రాబోయే వంశంకురాలకు దోచిపెట్టాలన్న
అమాయకత్వమెందుకో...

కట్టె నేలరాలిన నాడు తోడురాదు కనకపు సింహాసనం...
మట్టి బిడ్డల శ్రమే నీపొట్ట నింపుతోందన్న నిజం గుర్తుచేసుకో...
తెల్ల దొరల తోబుట్టువులా తలబిరుసుతో ప్రవర్తించకు...
తల్లి తెరీసా అనుభవించిన అనందపు విలువెంతో తెలుసుకో...

మళ్ళీ మనిషి జన్మ వస్తుందన్న నమ్మకం లేదు.... కాటికి చేరే లోపే.... కాలి బూడిద కాకమునుపే...  కంసుని వారసులారా కళ్ళు తెరవండి .. మీ పుట్టుక విలువ తెలుసుకోండి...
 

మరిన్ని కథలు
emi .. telivi..emi telivi..