Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - ..

 

సాధారణంగా, ఇళ్ళల్లో అత్తగార్లూ, కోడళ్ళ సమస్యలు ఎలా ఉన్నా, ఒకరి అవసరం ఇంకోరికి కలుగుతూనే ఉంటుంది. అందుకనే మరీ తెగేదాకా లాక్కోరు. పైగా అమ్మమ్మలకీ, నానమ్మలకీ తమ పేగు తెంపుకుని వచ్చిన బిడ్డల, బిడ్డలంటే ఎక్కడలేని ప్రేమానూ.. అందుకే దెబ్బలాటల దారి దెబ్బలాటలదే, మిగిలిన విషయాల దారి మిగిలినవిషయాలదే. అందరి పనులూ సజావుగా కానిచ్చేసికుంటారు. బయటివారితో, “ మా కోడలుకేమిటీ.. బంగారం..” అని అత్తగారూ, “ “అసలు మా ఇన్ లాస్ (  in laws )  సహకారమూ, సపోర్టూ లేకపోతే మాకు నిశ్చింతగా ఉద్యోగాలు చేసే అవకాశమే ఉండేఏది కాదూ..”  అని కోడలూ, ఒకరినికరు పొగిడెసికుంటూంటారు.. ఇద్దరికీ, అంతరాంతరాల్లో ఎంత ద్వేషమున్నా. అప్పుడప్పుడు ఓసారి ఏ హొటల్ కో, రిసార్టుకో తీసికెళ్తే, ఉబ్బిపోయే అల్ప సంతోషులు ఈ ఆమ్మమ్మా, నానమ్మలు. వీళ్ళకేమైనా మణులు కావాలా, మాణిక్యాలు కావాలా, జీవితంలో ముప్పావుపైన గడిచేపోయింది. మహా అయితే ఉంటే గింటే ఇంకో పావు.. హాయిగా మనశ్శాంతితో బతికేయాలనే ఉంటుంది ఎవరికైనా. ఈ కారణాల వలన వీధిన పడకుండా లాగించేస్తూంటారు ఎక్కడో ఒకటీ అరా తప్ప. ఆ ఉన్న ఒకటీ అరా కేసుల్లో కూడా, భార్యాభర్తలు సాధారణంగా విడాకులదాకా వచ్చేస్తాయి.. చాలామంది ఒప్పుకోరు కానీ, విడాకులకి ముఖ్యకారణం,  అత్తమామల ప్రవర్తన మీదే ఆధారపడుంటుంది. “అత్త లేని కోడలుత్తమురాలూ “ అన్నట్టు అసలు అత్తే లేకపోతే, …

 చిత్రం ఏమిటంటే, ఇన్నిటిమధ్యా, అస్సలు ఎటువంటి గుర్తింపూ లేనివాడు, ఆ తాతయ్యొక్కడే.  ఇంట్లో ఎన్ని రకాల పనులు చేసినా, ఒక్కరూ గుర్తించరు. . అలాగని ఏవో బిరుదులూ, సత్కారాలూ చేయాలని కాదు, ఏదో మాటల్లోనైనా, వీళ్ళు ప్రతీరోజూ ఆ ఇంటికీ, సంసారానికీ చేస్తూన్న పనులు, ఈయనెదురుగా, ఇంటికొచ్చినవారితో ప్రస్తావిస్తే, ఓసారి సంతోషిస్తాడు కదా. అబ్బే అసలు అలాటి ఆలోచనే ఉన్నట్టు కనిపించదు. అదృష్టం  బాగుండి, ఆ వచ్చినవారు ఆ విషయం అంటే ఇంట్లో “తాతగారి పాత్ర” గురించి ఏదో ప్రస్తావించినప్పుడైనా,  చెప్తే బావుంటుందేమో. పాపం లెక్కలోకి రావు కానీ, ఎన్నెన్ని పనులు చేస్తారో?

 ఈ రోజుల్లో లాగ ప్రతీ పనికీ అంటే, అంట్లుతోమడానికో మనిషీ, ఇల్లుతుడవడానికో మనిషీ, డస్టింగు చేయడానికో మనిషీ, బాలింతరాలికీ, పసిబిడ్డకీ మసాజ్ చేసి స్నానం చేయించడానికో మనిషీ, బట్టలుతకడానికో మనిషీ, ఆరిన బట్టలు మడత పెట్టడానికి మళ్ళీ ఇంకో మనిషీ… వామ్మోయ్.. ఉన్నది లిటుకంత సంసారం—భార్యా భర్తా, ఆ పుట్టిన పసిబిడ్డా, అత్తామామలు—వెరసి నాలుగున్నర టిక్కెట్లు. అసలు మనిషి – వంట మనిషిని లెక్కలోకే వేయలేదూ—మొత్తం అక్షరాలా  ఏడుగురు.. ఏదో ఐటీల్లో ఉండేవారికి ఇవన్నీ సాధ్యం కానీ,  సగటు మానవుడికి కుదరదుగా.. ఏదో ఉన్నదాంట్లోనే సద్దుకుపోతూంటారు.. అదిగో, అలాటప్పుడే  గుర్తింపులేని తాతయ్యల పాత్ర రంగంలోకి వస్తుంది. లోకంలో ఓ ముద్ర పడిపోయింది  “ ఒకటి కొంటే మరోటి ఉచితం”  (  Buy one get one Free )  స్కీములో వచ్చిన బాపతూ  అని. అలాగని మరీ తీసిపారేయాలా చిత్రం కాపోతే.. ఇంట్లో ఓ పసిబిడ్డతో పాటు, ఇంకోపెద్దాడో, పెద్దదో కూడా ఉండేఉంటారు కదా, మరి వాళ్ళని చూస్తున్నదెవరమ్మా, ఈ తాతలే కదా. సాయంత్రాలు అయేసరికి, దగ్గరలో ఉండే ఏ పార్కుకో తీసికెళ్ళాల్సిన బాధ్యత ఈయనదే కదా. ప్రొద్దుటే, స్కూలు బస్సెక్కించడం, తిరిగొచ్చిన తరువాత ఇంటికి తీసుకునిరావడం దాకా ఈయనగారి డ్యూటీయే కదా. . 

వీటికిసాయం, పెద్దాయన బయటకి ఏదో పనిమీద వెళ్దామనుకుంటే, వీడూ తయారవుతాడు. పైగా  తాతగారి ధర్మపత్ని , “ అదేవిటండీ.. పాపం వాడుకూడా వస్తానంటూంటే, పోనీ తీసికెళ్ళరాదూ..”. ఆవిడకేం తెలుసు, వీడితో బయట పడే పాట్లు? చెయ్యి పట్టుకోకూడదు, తూనీగలా పారిపోతాడు. ఏ కొట్టుకేనా వెళ్తే, వాడి కోరికలు పెరిగిపోతాయి. పోనీ వాడడిగినవేమైనా కొంటే, ఇంట్లో చివాట్లూ. ఏదో మొత్తానికి ఆ కార్యక్రమం పూర్తిచేసికుని వచ్చేక, ఆటలాడుదామంటాడు. వాడితో ఆడే ఓపికుండదు పెద్దాయనకి. అలాగని చెప్పుకోడం నామోషీ. . భోజనం అయిన తరువాత ఓ గంట సేపు నడుం వాలుద్దామనుకున్నా, వీడు వదలడు. ఏదో కాళ్ళావేళ్ళా పడి, బతిమాలి, బామాలి, ఒక్క పావుగంటరా.. సరీగ్గా నాలిగింటికి నన్ను లేపు, అనడం తరవాయి, ప్రతీ నిముషానికీ  తట్టి మరీ లేపుతాడు… తాతయ్యా టైమెంతయిందీ అంటూ. ఇంక  నిద్రెక్కడ పడుతుందీ? కానీ, అమ్మమ్మలూ, నానమ్మలూ మాత్రం పసిబిడ్డ నిద్రపోగానే, ఓ కునుకు తీసేస్తారు.. వాళ్ళేదో సుఖ పడిపోతున్నారని వీళ్ళూ, వీళ్ళేదో సుఖపడిపోతున్నారని వాళ్ళూ అనుకుంటారు.


 ఇంత జరిగినా ఏమీ అనుకోకుండా  మనవళ్ళనీ, మనవరాళ్ళనీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది వీళ్ళే కదా…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
pounch - patas