Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vichikitsa

ఈ సంచికలో >> కథలు >> బడుగు జీవి బతుకు భయం

badujeevi batuku bhayam

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పది రోజులు అంతర్జాలానికి శలవుల తరవాత ఐ పాడ్ తెరవగానే " అర్జెంటుగా మాట్లాడాలి అత్తా మీకెప్పుడు వీలవుతుందో తెలియ జేస్తే వివరంగా మాట్లాడుకుందాం " అనే మేనల్లుడు విజయ్ మెస్సేజ్ తో మతి పోయింది దేవికి , అదీ నాలుగు రోజుల కిందటి మెస్సేజ్  . పట్టు మని పెళ్లి అయి నెల తిరగకుండా సంసారంలో గొడవలా? , గొడవలు రావడానికి యిద్దరూ కలిసున్నది యెన్నాళ్ళు గనక . పెళ్ళయిన మూడోరోజు శలవు లేదంటూ అమెరికా వేళ్లిపోయేడు విజయ్ . మరేమై వుంటుంది ? ఎందుకు లేనిపోని టెన్షన్ వాడితో మాట్లాడితే అన్ని తెలుస్తాయిగా ?       


అసలే పది రోజులుగా తాళం వేసిన యిల్లు . ధూళిదుమ్ము పేరుకు పోయి వుంది . ఇల్లంతా దులుపుకొని వంటా వార్పూ అయేసరికి మధ్యాహ్నం రెండయింది . "మీ టైంలో ప్రొద్దున్న తొమ్మిదికి స్కైప్ లోకి రా మాట్లాడదాం " అనే మెస్సేజ్ పెట్టి మధ్యాహ్నం నిద్రకి పడక చేరింది దేవి.

     ------            ---------            --------          ---------         -------

ముందుగా అనుకున్న సమయానికి విజయ్ తో మాట్లాడింది దేవి . మొత్తం సమస్యని వివరంగా చెప్పి తనకి  కావలసింది కుడా స్పష్టంగా చెప్పేడు విజయ్ .అందుకే దేవికి ఈతరం పిల్లలంటే ఇష్టం . వారికి కావలసిందేమిటో వారికి తెలుసు ,దాన్ని సాధించు కోవడం కుడా తెలుసు   విజయ్ తో మాట్లాడిన తరువాత దేవి మనస్సు తేలిక పడింది . కారణం  సమస్య కొత్త దంపతులది కాదు వియ్యపురాళ్ళది . వెంటనే టిక్కెట్ బుక్ చేసుకొని అన్న యింటికి బయలుదేరింది . వియ్యపురాళ్ళు యిద్దరుండేది ఒకే వూరు కావడంతో సగం శ్రమ తప్పింది దేవికి . 

ఒదిన మనసులో ఏముందో బాగా తెలుసు దేవికి . పెళ్లవగానే కొడుకు కొత్త పెళ్ళాం మోజులో తమని మరచిపోతాడేమో అనేభయం వదినది అన్న ఉద్యోగంలో సంపాదించిన సంపాదనకి కొంత అప్పులు జోడించి ఆడపిల్ల పెళ్లి ,మగపిల్లడి చదువులు చేయించి , రిటైర్ మెంటుతో  ఋణవిముక్తులై , రేపటికోసం కొడుకుపై ఆధార పడ్డ సగటు తల్లి తండ్రులు . మగపిల్లల్ని కన్న తల్లితండ్రులకి వుండే భయం యిదే .

ఇక వదిన వియ్యపురాలు కమల సంగతి , ఇద్దరు ఆడ పిల్లలకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసిన బడుగు గుమస్తా భార్య . పెద్దపిల్లకి అమెరికాలో వున్న సాఫ్ట్ వేర్ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి , అమ్మాయికి అక్కడ వుద్యోగం దొరికితే అమ్మాయితో పాటు అమెరికాలో వుండి పోదామనేది కమల దూరాలోచన . అనుకున్నదంతా తలకిందులైయింది పెద్దమ్మాయి విషయంలో . ఉద్యోగం మాట పక్కనపెట్టి అమ్మగా ప్రమోషన్ సాధించింది . పురుడు పొయ్యడానికి అమెరికా వెళ్దామన్న కమల కోరికని ఒక్కళ్ళ జీతంతో యిల్లుగడవడమే కష్టంగా వుంది మా పురుళ్ళు మేమే పోసుకుంటాం ఇక్కడ అంతా యింతే అనే మాటలతో కమల కొరికలమీద నీళ్ళు పోసింది . ఎలాగైనా రెండో కూతురి ద్వారా అమెరికా కలని నిజం చేసుకోవాలనే దురాలోచనలో వుంది . కూతురుని తన చేతిలోంచి వదలకూడదనేది , పెద్దకూతురు ద్వారా నేర్చున్న పాఠం అమలు చెయ్యాలనేది ఆమె పట్టుదల . ఆ పట్టుదలవల్ల నలిగి పోయేది తన కూతురే అని తెలిసినా మొండితనం వదలుకోలేని మూర్ఖురాలు కమల .

వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముందుగా విజయ్ భార్య రోజా తో మాట్లాడి ఆమె వొక చదువుకున్న , పెద్దలని నొప్పించకుండా సరైన నిర్ణయం తీసుకోగలిగే ఆత్మవిశ్వాసం కల నేటి యువతరం వనితని తెలుసుకుని తృప్తిగా నిట్టూర్చింది దేవి .

 -------            --------             ---------           --------            ------

ఆడపిల్లని కన్నపాపానికి పిల్లకి చదువు చెప్పించి , అప్పుచేసి కట్నకానుకలిచ్చి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపెయ్యాలా? పెళ్లి చేసినంత మాత్రాన నా పిల్ల నాకు కాకుండా పోతుందా? 

మీ అబ్బాయితో సమానంగా చదువుకుంది , ఉద్యోగం చేస్తోంది అలాంటప్పుడు నేనెందులో ఆవిడ కన్నా తక్కువ ? కొడుకు తల్లైతే నెత్తిన ఏవైనా కొమ్ములు మొలిచాయా ? ఆడపిల్ల వాళ్ళం కాబట్టి అన్ని వాళ్లకి కట్టబెట్టి నెత్తిన కొంగేసుకు పోవాలా ? పెళ్ళైన మర్నాటినుంచి పిల్ల వాళ్ళింట్లోనే వుండాలిట జీతం  డబ్బులు కొట్టెయ్యడానికి  ప్లాను కాకపొతే మరేవిటి ? హమ్మ నేనేం తక్కువదాన్ని కాదు , డౌరి  హెరాస్ మెంట్ కేస్ వేస్తాను పీ--- లా--- చస్తారు. " అంటూ కొన్ని అభ్యంతరకరమైన పద ప్రయోగం చేస్తూ అవిరామమంగా మాటల తూటాలు వదులుతూ వచ్చిన దగ్గరనుంచి నేలకి రెండడుగుల యెత్తులో యెగురుతూ చేతులతో రకరకాల విన్యాసాలు చేస్తూ పూనకం వచ్చినట్లుగా ఆవేశపడసాగింది . ఆమెకి అడ్డకట్ట వెయ్యకపోతే ఆమె యింకా విజ్రుంభిస్తుందనే విషయం తెలుస్తోంది దేవికి . ఎప్పుడైతే డౌరిహెరేస్ మెంట్ కేస్ అనే బెదిరింపు మాట చెవిన పడిందో వదిన కళ్ళల్లో దెబ్బతిన్న సివంగి కనిపించింది దేవికి . దేవి కళ్ళలోని వారింపు అర్ధం చేసుకొని తగ్గింది కాని లేకపోతే మహాభారత యుద్ధం జరిగేదే .

 తన కోపమే తన శత్రువు అనే విషయం జ్ఞాపకం చేసే సమయం వచ్చిందని గ్రహించిన  దేవి " చెల్లాయ్ నీ చీర బాగుంది , నీ సెలెక్షన్ సూపర్ అనుక్కో , ముందు కూర్చో .... కూర్చో .... అమ్మాయ్ రోజా అమ్మకి నీళ్లియ్యి... నీ చెవి దుద్దులు యెక్కడకొన్నావ్ చెల్లాయ్ చాలాబావున్నాయి ? .... యింద ఈ నీళ్ళు తాగు " నెమ్మదిగా యెంతో  ఆత్మీయంగా అంది . 

కమల వొక్కసారి బిత్తర పోయింది . పరిస్థితిని ఎలా అంచనా వెయ్యాలో అర్ధం కాక అయోమయంలో పడింది . అందులోంచి బయట పడ్డానికా అన్నట్లుగా కూతురు చేతుల్లోంచి నీళ్ళందుకొని గ్లాసెత్తి గటగటా తాగింది . ప్రాణం కుదుట పడ్డట్టయింది , అందరినీ వోరకంట చూసింది. అందరు యెంతో శాంతంగా కనిపించేరు . 

"  రోజా రేపు ప్రయాణం కదా ? నిద్దరవుంటుందో వుండదో లోపలికి వెళ్లి రెష్ట్ తీసుకోమ్మా " అంది దేవి .

" అలాగే దొడ్డమ్మగారు " అంటూ బెడ్ రూం వైపు నడిచింది రోజా .

" ఏయ్ ఏంజరుగుతోందిక్కడ , నువ్వెంటే అడ్డగాడిదలా వూపుకుంటూ లోపలికి వెళ్తున్నావు కూచో యిక్కడ , ప్రయాణం ఏవిటి ? నా అనుమతి లేకుండానే ? " రంకె వేసింది కమల .

 "నువ్వు వెళ్ళమ్మా అమ్మ అలాగే అంటుంది . చెల్లాయ్ పెద్దవాళ్ళ మాటల్లో చిన్నపిల్ల అదెందుకు చెప్పు , లోనికి వెళ్ళనీ " చాలా నెమ్మదిగా అంది దేవి . రోజా గబగబా లోపలకి వెళ్ళిపోయింది .

దేవి మాటలతో సన్నగా మండుతున్న వొంటికి కూతురు చర్యతో కారం రాసుకున్నట్లయింది కమలకి . మొహానికి ఎప్పటిదో పేపరు అడ్డం పెట్టుకొని జరుగుతున్న దాంతో తనకేమీ సంబంధం లేనట్లు కూర్చున్న భర్త శంకరాన్ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది కమలలో " వీళ్ళంతా కలసి యేదో గూడుపుఠాణి చేస్తూ వుంటే బెల్లం కొట్టిన రాయాలా కుర్చుంటారా ? దాన్ని చూడండి యెలా తిప్పుకుంటూ లోపలి పోయిందో ? మీకు లేకపోయినా నాకు తప్పదుకదా ? అంటూ దేవి వైపు తిరిగి " ఏంటమ్మా చెల్లాయ్ చెల్లాయ్ అంటూ గొంతుకోస్తున్నావ్ ? నా సంగతి నీకు తెలీదు , అసలే మంచిదాన్నికాను " ఇంకా ఏదో అనబోతున్న కమలని చేత్తో ఆగు అని సౌంజ్ఞ  చేసి " వూరుకుంటుంటే యేంటి రెచ్చిపోతున్నావ్ , ఇప్పుడు నేను చెప్పేది విను " దేవి కళ్ళల్లో కరుకుతనం , మాటల్లో  ఖచ్చితం చూసి మరి నోరు పెగలలేదు కమలకి .

" ఏంటి నీ అల్లుడు నీకు అమెరికా టిక్కెట్ కొనకపోతే నీ కూతుర్ని కాపరానికి పంపవా ? మీ దంపతులు మీ పిల్లతోపాటు అమెరికాలో వుండే ఏర్పాటు  చెయ్యాలా ? అలా చెయ్యకపోతే డౌరి హెరాస్ మెంట్ కేస్ పెడతావా ? కట్నకానుకలు యేమియివ్వకుండానే కట్నకానుకలు యిచ్చేనంటున్నావ్ , పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న తరువాత సమానవత్వం అంటూ భోజనాల ఖర్చుతో సహా చెరిసగం పెట్టించేవు . పీటలమీదకి  వచ్చిన పెళ్లి ఆగిపోతే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు అని నీ షరతులన్నింటికి వప్పుకున్న మా అన్న వదినలని తోలు బొమ్మల్లా ఆడించేస్తున్నావ్ అడిగేవాళ్ళు లేరనా? " దేవిని సగం లోనే ఆపి అందుకుంది కమల .

" మహిళా సంఘాలకి , పోలిస్ ల దగ్గరకి వెళ్లి నాలుగు ఏడుపులు యేడ్చేనంటే నీ అన్న వదిన , నీ ముద్దుల మేనల్లుడు అంతా ఏడేళ్ళకి లోపలికి వెళ్తారు , యెక్కువగా మాట్లాడావంటే నిన్ను కూడా లోపలికి పంపుతా అందరు లోపల కూర్చోని పేకాడుకుందురు గాని ". 

             చాలామందికి తాము అరచినట్లు మాట్లాడితే ఎదుటి వారు భయపడతారని , యెదుటి వారు మెల్లగా మాట్లాడుతున్నారు అంటే చేతకాని వాళ్ళని , తమ యేడుపుతో అబద్దాలని నిజాలుగా చెయ్యొచ్చని , కొన్ని అపోహలుంటాయి . అలాంటి వాళ్ళలో మొదటి వరుసలో వుంటుంది కమల .

            " ముందు ఎక్కడకి వెళ్దాం పోలిసులదగ్గరకా ? , మహిళా సంఘాల దగ్గరకా ? నీ యిష్ఠమ్ నువ్వు ఎక్కడకంటే అక్కడకే వెళ్దాం పద " దేవి మాటలతో బిత్తర పోయింది కమల .

           " నువ్వు చేసిన అభియోగాలకి సాక్షం వుండాలని తెలుసుగా ? మా తరఫు సాక్షిగా రోజా వుంది మరి నీతరఫు సాక్షి యెవరు ? దొంగ కేసులు పెడితే నువ్వు వూచలు లెక్కపెట్ట వలసి వస్తుంది . ఏదో కాలక్షేపం కోసం చూసే బుల్లితెర సీరియల్స్ ని నిజజీవితంకి అన్వయించుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం సాధించాలని కుస్తీ పట్లు పడితే చివరికి అయిన వాళ్ళని పోగొట్టుకొని మోడులా మిగిలి పోతావు . యింతవరకు గడచిన జీవితం వొకయెత్తు  , యికపై గడపవలసిన జీవితం మరో యెత్తు . వయసు వేడిలో నాకెవరి  అవుసరంలేదు అని అందరితోను గొడవలు పడుతూ పొతే వయసుడిగిన తరువాత "నీకు " అంటూ యెవ్వరూ మిగలరు . డబ్బుతో నాలుగు కాళ్ళ పశువును కొనగలవు కాని రెండు కాళ్ళ మనిషిని కొనగలవా ? అభిమానంతో మాత్రమే మనిషిని కొనగలవు . ఆఖరికి నీ కడున పుట్టిన వాళ్ళు కుడా నీకు కాకుండా పోతారు , అనవసరంగా వీధిలోపడిపోకు . యెలాగూ నీ పెద్ద కూతురు నీకుకాకుండా పోయింది . యిప్పుడు యీపిల్లని పోగుట్టుకోకు . రోజా తెలివైనది నీ బుద్ది చాలా బాగా తెలిసినా నిన్ను వదులుకో దల్చుకోలేదు , నిన్ను మార్చి , అత్తింటి వారిని , నిన్ను కలుపుకోవాలనే ఆలోచన ఆ అమ్మాయిది . డౌరి హెరాస్ మెంట్ కేస్ వేస్తాను అని తెగ యెగురుతున్నావ్ , దొంగ కేసులు వేస్తే యేమౌతుందో తెలుసా ? వొక్కమారు పోలీసులని పిలిచేదా ? . గోటితో పోయేదానికి గొడ్డలి యెందుకు అని చూస్తున్నాను గాని లేకపోతే యెప్పుడో పిలిచేదాన్ని  .

              పోలిస్ పేరువినగానే కొంచెం తడబడింది కమల . దేవి మాటలోని కఛ్చితం కమలలో భయాన్ని పెంచింది . సామాన్యులకి పోలిస్ అంటే ఆపాటి భయం వుండాలి లేదంటే ప్రతీవాడు పోలిస్ తో ఆడుకుంటాడు . 

               "అయితే నేను నెత్తిన కొంగేసుకొని పోవడమేనా ? ఇన్నాళ్ళు పెంచి , మొగపిల్లలకి పెట్టినంత ఖర్చు పెట్టి చదువులు చెప్పించినందుకు మాకేంటి లాభం ? ".

               "భేష్ .... భేష్ ....అయితే నువ్వు నీ పిల్లలతో వ్యాపారం చేద్దామనుకున్నావా? , నీ మొహం చూడడానికి నాకే అసహ్యంగా వుంది అలాంటిది నీ మాటలు నీ కూతురు వింటే మొహం మీద వుమ్మేయ్యదూ  ? , వ్యాపారం అన్నానని కోపం వచ్చిందా? యెప్పుడైతే నువ్వు పిల్లల పెంపకాన్ని లాభ నష్టాలలో తూచేవో అప్పుడే అది వ్యాపారంగా మారి పోయింది . మంచి మాటతో, మంచి చేతతో పిల్లల మనసుల్ని గెలుచుకోవాలి . పిల్లల్ని కన్నందుకు వారిని చదివించి మంచి పౌరులుగా తీర్చిదిద్దటం అనేది తల్లితండ్రుల కనీస బాధ్యత . వరకట్నం  తీసుకుంటే ఫలానా చట్టం  కింద శిక్ష అని వుంది   గాని  మరి  నీలా ఆలోచించే వాళ్లకి యే చట్టం కింద శిక్ష వెయ్యాలి ? . నీలాంటి వాళ్ళు మగపిల్లల్ని కంటే వరకట్నం , ఆడపిల్లల్ని కంటే కన్యాశుల్కం న్యాయబద్దమవాలి అంటారు అంతేనా ? ఇంతమంది సంఘసంస్కర్తలు కాలానికి యెదురీది ఆడా మగా సమానమని , పెళ్లిళ్ళలో కట్నాలు కానుకలు యివ్వడం పుచ్చుకోవడం తప్పని చెప్పగా చెప్పగా యిప్పుడిప్పుడే ప్రజలలో వస్తున్న మార్పుని నీలాంటివాళ్ళు మళ్ళా మొదటికి తెస్తున్నారు ". 

            ఎప్పుడైతే పరిస్థితి యెదురు తిరిగిందో కమలకి దిమ్మతిరిగిపోయింది . పెళ్ళికి చేసిన అప్పు కొండంతై కనిపిస్తోంది . యెప్పుడూ చేతిలో సొమ్మున్నది ఖర్చు చెయ్యడానికే అన్నట్లు ఖర్చు చెయ్యడమే కాని దాచుకోవాలని ఎప్పుడు అనుక్కోలేదు. భర్త రిటైర్ అయ్యేక వచ్చిన డబ్బులు కుడా మూడు చీరెలు ఆరు సినిమాలుగా గడిపింది . ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నెల గడిచే పరిస్థితి లేదు . అందుకే ఆర్జిస్తున్న కూతురు చేస్తున్న వుద్యోగం వదులుకొని భర్త వెనక వెళ్లిపోతుందంటే తమ గతేంటి ? అనే భయమే ఆమె చేత అలా ప్రవర్తించేలా చేసింది . అంతే కాని పిల్లంటే ప్రేమ లేకకాదు , రేపటిని సురక్షితం చేసుకోవాలనే తపన కమలది . ఇప్పుడు కమల ముందున్న సమస్య రేపు యెలా? .

               చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు యెదుర్కుంటున్న సమస్యే యిది . చేతిలో వున్న ధనానికి , వారి కున్న అవుసరాలకి పొంతన కదుర్చుకోలేక , కళ్ళముందు కనిపిస్తున్న రంగుల ప్రపంచం రేపటి గురించి రేపు చూసుకోవచ్చని ప్రలోభిస్తూ వుంటే ఆ ప్రవాహానికి యెదురీదే ఆత్మ స్థైర్యం లేక కొట్టుకుపోయే వాళ్లెందరో ? . పక్క వాళ్ళ కన్నా మనం పచ్చగా వున్నట్లు కనబడాలనే తాపత్రయంలో పెట్టే ఖర్చు లెక్కకుమించి భవిష్యత్తుని దెబ్బతీస్తుంది . పచ్చని పందిట్లో వేదమంత్రాల మధ్య రెండు కుటుంబాలు తమసమ్మతితొ రెండు యువహృదయాలను కలిపేటప్పుడు మధ్య తరగతి కుటుంబాలకి ఇంతలేసి ఖర్చులు అవుసరమా ? . వొకరోజు పూల అలంకరణకి యాభైవేలు ఖర్చా ? , పెళ్ళికూతురు ముస్తాబుకి గంటకి ముప్పై వేలా ? , కళ్యాణ మండపానికి రోజుకి కనీసం యాభై వేలా ? . యాభైయారు రకాలతో మధ్యాహ్న భోజనం , బ్రేక్ ఫాస్ట్ లో పదిరకాలు యివన్నీ లెఖ్ఖపెట్టుకోడానికా ? తినడానికా ? . ఈ ఆర్భాటాలు లేకుండా చేసినా దాన్నీ పెళ్ళే అంటారు . ఆ దంపతులూ అన్యోన్యంగానే కాపురం చేసుకుంటారు . ఇవన్నీ కమలలాంటి వారికి యెవరు చెప్పి వొప్పించగలరు ?. పొదుపు చెయ్యలేకపోయినా ఖర్చులను నియంత్రించుకుంటే అదే పెద్ద పొదుపుతో సమానం . సరదాగా ఏడాది పిల్లలకి "చిల్లు పంది" బొమ్మ యిచ్చి " మంచి రేపటి కోసం యివాళ పొదుపు చెయ్యి " అని చెప్తాం , మనదగ్గరకి వచ్చేసరికి ఇవాళకి యిలా కానిచ్చి పొదుపు సంగతి రేపుచూసుకుందాం అనుకుంటాం . ఆరేపు యెప్పుడూ రాదు యెందుకంటే దాన్ని మనం " గోడ " మీద రాసుకుంటాం కాబట్టి . ఉద్యోగవిరమణ అంటే జీవితంలో ఫుల్ స్టాప్ కాదు కామా మాత్రమే ,నిజమే అరవైదాటితే మునుపటి సామర్ధ్యం లోపిస్తుందని వుద్యోగవిరమణ ప్రకటిస్తారు అంత మాత్రాన వారు ధనార్జన చెయ్యలేరని గాని చెయ్యకోడదు అనిగాని అర్ధం కాదు. ఎక్కువ కష్ఠ పడకుండా నీడపట్టునే కూర్చొని సులువుగా యిద్దరు మనుషుల అవుసరాలకి సరిపడా ధనార్జన చేసుకోవచ్చు. అది తప్పూ కాదు పాపం అంతకన్నాకాదు . మన శరీరం సహకరించినంత వరకు యేదోవొక వ్యాపకంతో బీజీగా వుంటే ఆర్ధికంగానే కాకుండా మానసికంగాను , శారీరకంగాను కుడా ఆరోగ్యంగా వుండొచ్చనేది త్రిశంకుస్వర్గంలో వేలాడుతున్న మన కమలలాంటి వాళ్ళు యెప్పటికైనా అర్ధం చేసుకోగలుగుతారా ? ఈ మధ్య కాలంలో మనప్రజలలో సకారాత్మకమైన మార్పులు యెన్నో చోటు చేసుకున్నాయి . కాబట్టి మనం ఆశించేది కుడా జరుగుతుందనే భావిద్దాం .

        సరే యింక కధలోకి వస్తే ,

                దేవి మాటలతో ఆలోచనలో పడ్డ కమల , మళ్ళా దేవి మాటలతో యీలోకంలోకి వచ్చింది .

              " నీ కూతురి నిర్ణయం ఏంటో నీకు యిపాటికి తెలిసేవుంటుంది . ఇంక యింటికి వెళ్ళు , బాగా ఆలోచించుకో , ఆలోచించుకోడానికి నీదగ్గర మరో యిరవై నాలుగు గంటల టైముంది . రేపు యిదే సమయానికి హైదరాబాద్ వెళ్తున్నాం నేను రోజా , అక్కడినుంచి మరో వారంలో అమెరికా వెళ్తుంది పిల్ల నీకు నీ పిల్లమీద ఏపాటి మమకారం వున్నా పిల్లని సీ ఆఫ్ చేయ్యడానికి రా , లేదన్నావూ నీ యిష్ఠమ్ ". ఇంక బయలుదేరు అనే అర్ధం వచ్చేటట్టు గా అంది దేవి . 

          కమలకి వెళ్లిపోవాలో వుండాలో అర్ధం కాలేదు  అయోమయం గా అందరివైపు చూసింది . అందరి లోను తిరస్కారం తప్ప ఆహ్వానం కనిపించలేదు . భర్త వైపు " కిం కర్తవ్యం " అన్నట్లు చూసింది . 

       " ఇన్నాళ్ళు చేసిన నిర్వాకం చాలుగాని నడు యింటికి , ఆవిడ మాటలతో యికపై జీవితం యెలా గడపాలో తెలుసుకున్నాను , నీకు కూడా అంతో యింతో తలలోకి యెక్కే వుంటుంది పద పద " కమలతో అన్న శంకరం వియ్యంకుడి వైపు తిరిగి " రేపు ఎయిర్ పోర్టు లో కలుస్తామండి మరి శలవు " అంటూ బయటకి నడిచేడు .

       తన మాటల వల్ల ఒక జంట రేపు ని భయంగా కాక కొత్త రోజు గా ఆహ్వానించడానికి ముందడుగు వెయ్యడం చూసి తృప్తి గా నిట్టూర్చింది దేవి .

        

           

 

 

            

                                  

మరిన్ని కథలు
ayikyata